శ్రీరాముడి మీద నిందారోపణలు – వాస్తవాలు

10
2

[2024 ఏప్రిల్ 17 శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా శ్రీ గోనుగుంట మురళీకృష్ణ రాసిన ‘శ్రీరాముడి మీద నిందారోపణలు – వాస్తవాలు’ అనే వ్యాసాన్నిఅందిస్తున్నాము.]

[dropcap]సా[/dropcap]ధారణ జనం సినిమాల్లో చూసిగానీ, పుక్కిటి పురాణాలు వినిగానీ, ఇంకొక గ్రంథంలో చదివిగానీ శ్రీరాముడి మీద అనేక అపోహలతో నిందారోపణలు చేస్తూ ఉంటారు. వాల్మీకి రామాయణం తెలుగు అనువాదాల్లో కూడా అనువాదకులు ఉద్దేశపూర్వకంగానే కొన్నికొన్ని విషయాలు విస్మరిస్తూ ఉంటారు. అందుకు కారణం గ్రంథ విస్తృతి భయంవలన, లేదా కథారూపంలో చెప్పాలి అని గానీ లోతైన విషయాల జోలికి వెళ్ళరు. సందేహనివృత్తి చేసుకోవాలంటే వాల్మీకి రచించిన సంస్కృత రామాయణం ఆమూలాగ్రం చదవాలి. సామాన్యులలో శ్రీరాముడి పట్ల ఉన్న అపోహలు ఏమిటి, వాస్తవాలు ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.

1. తాటకను, స్త్రీని చంపటం పెద్ద వీరకృత్యమా:-

తాటక నివసించే ప్రదేశం ఒకప్పుడు మలద, కరూశ అనే దేశాలు. ఆ ప్రదేశాలు ధనధాన్య సమృద్దితో తులదూగుతూ ప్రజలందరూ సంతోషంగా జీవించేవారు. తాటక ఒక యక్షిణి. ఆమె భర్త సుందుడు అనేవాడు అగస్త్యమహర్షి వలన మరణించాడు. అందుకు క్రుద్థురాలైన తాటక, మహర్షిని మింగబోగా రాక్షసివై నరమాంస భక్షకురాలివి కమ్మని శపించాడు. మలద కరూశ దేశాలలోని ప్రజలందరినీ నిర్దాక్షిణ్యంగా చంపివేసి భక్షించింది తాటక. ఆ ప్రదేశాలను నిర్మానుష్యం చేసింది.

విశ్వామిత్రుడు ఆమెని వధించమని రాముడితో చెప్పి “స్త్రీ అని సందేహించ వద్దు. ధర్మ పరిరక్షకుడైన రాజు ప్రజలహితం కోసం చేసే కార్యం క్రూరమైనదా, అందుకు భిన్నమైనదా అని ఆలోచించకూడదు. అధర్మానికి పాల్పడినప్పుడు స్త్రీలను కూడా చంపటం దోషంకాదు” అని చెప్పాడు.

“గురువర్యా! ‘విశ్వామిత్రుల వారి మాటను పాటించు’ అని మా తండ్రి నన్ను ఆదేశించారు. మా తండ్రి ఆజ్ఞ ప్రకారం, మీ శాసనం తలదాల్చి ఇప్పుడు నిస్సందేహంగా తాటకను వధిస్తాను” అని అన్నాడు రాముడు. కాబట్టి రాముడు తన ప్రతాపం చూపించుకోవటానికి కాదు, ధర్మ పరిరక్షణ కోసం తాటకను వధించాడు.

2. తండ్రి మాటే పాటించాలా, తల్లి మాట పాటించకూడదా, కౌసల్య రాముడిని అడవులకు వెళ్ళవద్దు అని చెబితే ఎందుకు ఒప్పుకోలేదు?:-

రాముడు వనవాసానికి వెళ్ళేటప్పుడు కౌసల్యాదేవి దుఃఖిస్తూ “నీకు తండ్రి ఎలా పూజ్యుడో తల్లి కూడా అలాగే పూజ్యురాలు. నువ్వు అడవులకు వెళ్ళటానికి నేను అంగీకరించను. లేదా లేగవెంట గోవులాగా నీతోపాటు నేనుకూడా వస్తాను” అంటుంది. అప్పుడు రాముడు ఏం చేయాలి? తండ్రి ఆజ్ఞ పాటించాలా, తల్లి ఆజ్ఞ పాటించాలా?

“అమ్మా! పతివ్రతలకు భర్తే దైవము. భర్తను త్యజించటం క్రూరమైన కార్యము కాదా! నా తండ్రి జీవించి యున్నంతకాలం నువ్వు ఆయన్ని సేవిస్తూనే ఉండాలి. అదే సనాతనధర్మం” అని సున్నితంగా తిరస్కరిస్తాడు రాముడు. పై అధికారి ఆజ్ఞలకు విరుద్దంగా కింద అధికారి ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞ చెల్లదు. కాబట్టి తల్లి వనవాసానికి వెళ్ళ వద్దు అని చెప్పినా, ఆమె మాటను కాకుండా, రాముడు తండ్రి ఆజ్ఞను పాటించాడు.

3. వాలి మీద చెట్టుచాటు నుంచీ బాణం వేయటం ధర్మం కాదు:-

ఇందుకు కూడా వాల్మీకి రామాయణంలో సమాధానం ఉన్నది. రామబాణంతో నేలకూలిన తర్వాత వాలి రాముడితో “సుగ్రీవుడు నాకు జ్ఞాతి. కనుక నేను అతడితో పోరాడవచ్చు. కానీ నీతో నాకు ఎలాంటి విరోధం లేదే! నా మీద బాణం ఎందుకు వేశావు? చెట్టు మాటు నుంచీ బాణం వేయటం అధర్మం కాదా! నువ్వు సుగ్రీవుడికి సంతోషం కలిగించటానికి ఇలా చేసి ఉంటావు. ముందుగా నన్నే అడిగినట్లైతే రావణుడు సీతను ముల్లోకాల్లో ఎక్కడ దాచి ఉంచినా చిటికెలో తెచ్చి నీకు అప్పగించేవాడిని కదా! నువ్వింత అధర్మంగా ప్రవర్తించినందుకు సత్పురుషులు అడిగితే ఏం సమాధానం చెబుతావు?” అని అన్నాడు. అందుకు రాముడు ఇలా సమాధానం చెప్పాడు.

“వాలీ! ధర్మార్ధములను తెలుసుకోలేక అజ్ఞానంతో మాట్లాడుతున్నావు. నువ్వు సుగ్రీవుడి రాజ్యభాగమైన సంపదను హరించావు. అతడిని రాజ్యంనుంచీ వెళ్ళ గొట్టావు. అతడి భార్యను లోబరచుకున్నావు. ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని అతిక్రమించావు. తమ్ముడి భార్య కోడలితో సమానం. కూతురిని గానీ, కోడలిని గానీ, సోదరిని గానీ అనుభవించిన వాడికి మరణదండనే తగిన శిక్షని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.

క్షత్రియులు క్రూరమృగాలను చాటునుంచో, వలలు పన్నో, పారిపోతున్న వాటిని వెంబడించో ఎలాగైనా వేటాడతారు. నువ్వు వానరుడవైనా క్రూరమృగం లాగా ప్రవర్తించావు. కనుక నిన్ను వేటాడవలసి వచ్చింది. నీతో యుద్ధం చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను ముందుగా నిన్నే అడిగితే ఏమేమో చేస్తానని అన్నావు. తమ్ముడి భార్యను చెరపట్టిన వాడివి నువ్వా నా జానకిని తెచ్చిపెట్టేది? అవన్నీ ఉత్త మాటలు. సుగ్రీవుడికీ నాకు ఉన్న స్నేహం, నాకూ లక్ష్మణుడికీ ఉన్న స్నేహం లాంటిది. నాకు సాయం చేసేది సుగ్రీవుడు గానీ నువ్వు కాదు. సత్పురుషులు ధర్మం ఎందుకు అర్థం చేసుకోలేరు? నువ్వు అజ్ఞానంతో మాట్లాడుతున్నావు” అని అన్నాడు.

చివరికి వాలి అర్ధం చేసుకుని “రామా! సర్వజ్ఞుడవైన నీతో అల్పుడనైన నేను వాదించకూడదు. నాకు దక్కని నీ వాత్సల్యం నా కుమారుడికి ప్రసాదించు” అని ప్రార్ధించాడు. ఇదీ అసలు విషయం!

4.తప్పంతా శూర్పణఖ దేనా? కోరిక వెల్లడిస్తే, ఎగతాళి చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవటం అన్యాయమా!:-

శూర్పణఖను వెనకేసుకుని వచ్చి ఈనాడు ఇలా విమర్శిస్తున్నారు. అసలు జరిగినదేమిటంటే –

శూర్పణఖ రాముడిని చూసి మోహించి “అందగాడా! ఎవరు నువ్వు?” అని అడిగింది. స్త్రీల ఎదుట అసత్యం ఆడకూడదు. అందునా రాముడు పవిత్రమైన మునివృత్తిలో ఉన్నాడు. అందువల్ల “నేను దశరథ మహారాజు కుమారుడిని. నా పేరు రాముడు. ఈమె నా భార్య సీత. నేను ఏకపత్నీవ్రతుడను. తండ్రి ఆజ్ఞ మీద వనవాసం చేయటానికి వచ్చాను” అని యదార్ధం చెప్పాడు.

ఒకపక్క ఏకపత్నీవ్రతుడను అని చెబుతున్నా “మనం భార్యాభర్తల లాగా ఉందాం” అంటుంది. ఆ మాటతో శూర్పణఖ స్వభావం అర్థమైంది రాముడికి. తమ్ముడు ఒంటరిగా ఉన్నాడు, అతడి దగ్గరకు వెళ్ళమన్నాడు పరిహాసంగా. అన్నగారి భావం గ్రహించి రాముడి దగ్గరకే తిప్పి పంపేశాడు లక్ష్మణుడు. మళ్ళీ రాముడి దగ్గరకు వచ్చింది. “ఈ వికృతాకారం కలది, వృద్ధురాలు, నడుము వంగినది అయిన సీతను చూసి నన్ను తిరస్కరిస్తున్నావు. దీనిని నేను ఇప్పుడే చంపివేస్తాను. మనిద్దరం రమిద్దాము” అంటూ మీదకు వచ్చింది శూర్ఫణఖ. ఒక్క హుంకారంతో ఆమెను నిలువరించాడు రాముడు. పరిస్థితి శ్రుతిమించి రాగాన పడుతుందని లక్ష్మణుడు వచ్చి ఆమె ముక్కుచెవులు కోసి పంపేశాడు.

ఆనాటి రాజధర్మం ప్రకారం అత్యాచార యత్నం చేసిన వారికి పురుషులకైతే వృషణాలు ఖండించటం, స్త్రీలకైతే ముక్కుచెవులు కోసి విరూపిని చేయటం శిక్షలు. ఇక్కడ శూర్పణఖకు అటువంటి శిక్షే విధించాడు లక్ష్మణుడు అన్నగారి ఆజ్ఞపై (అహల్యను కూడిన ఇంద్రుడి వృషణాలు తెగి పడిపోవాలని శపిస్తాడు గౌతమమహర్షి. తర్వాత ఇంద్రుడికి మేక అండాలను అతికిస్తారు).

సీతను వృద్ధురాలు, నడుము వంగినది అని చెప్పిన శూర్పణఖ రావణుడి దగ్గరకు వెళ్లి “సీతాదేవి లోకోత్తర సౌందర్యవతి. నిండు జవ్వని. గంధర్వ తరుణీ మణులు గానీ, అప్సరసలు గానీ ఆమె కొనగోటికి సాటిరారు. ఆమెను నీకు భార్యగా తీసుకువద్దామని నేను ప్రయత్నిస్తే నన్ను ఈ విధంగా పరాభవించారు” అని చెబుతుంది. ఆమె వెళ్ళిన ఉద్దేశం ఏమిటి? ఇక్కడ చెప్పినదేమిటి? శూర్పణఖ అసత్యవాది, కామాంధురాలు. కనుకనే శిక్షించవలసి వచ్చింది.

5. సీత అగ్నిప్రవేశం చేసి పవిత్రురాలని నిరూపించుకున్నా శంకించి అడవులకు పంపటం అన్యాయం కాదా!:-

అడవులకు పంపినందుకు సీత ఏమీ బాధ పడలేదు, ఆవిడ తరపున వకల్తా పుచ్చుకుని సానుభూతి చూపిస్తూ ఈనాటి వారు ఇలా వాదిస్తూ ఉంటారు.

శ్రీరాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడు అయిన సంవత్సరం తర్వాత, ఒకరోజు గూఢచారులతో “నా గురించి, నా పరిపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు?’ అని అడిగాడు. వారిలో భద్రుడు అనే గూఢచారి “సీతను రావణుడు ఒడిలో కూర్చోబెట్టుకుని తీసుకువెళ్ళాడు. అతడి ఇంట్లో సీత సంవత్సరం పాటు ఉన్నది. అటువంటి భార్యను రాముడు ఏ శంకా లేకుండా ఏలుకుంటున్నాడు. ప్రజలను కూడా అలాగే చేయమనా అయన ఉద్దేశం? అని నాలుగువీధుల కూడలిలో చెప్పుకుంటున్నారు” అన్నాడు.

రాముడు దుఃఖపడుతూనే సీతను గంగానదీ సమీపారణ్యంలో విడిచి రమ్మని లక్ష్మణుడితో చెప్పాడు. విషయం తెలిసిన సీత భర్తతో ఎడబాటు కలిగినందుకు బాధపడింది గానీ, తనను శంకించినందుకు గాదు. ఈ అపవాదు బాపుకోవటం తన బాధ్యతగా భావించింది.

వాల్మీకి మహర్షి కూడా “అమ్మా! నువ్వు పవిత్రురాలివి, నీలో ఎటువంటి కళంకం లేదని నేను తపోమహిమతో ఎరుగుదును. కాలం కలిసి వచ్చేదాకా నా ఆశ్రమంలో నిశ్చింతగా ఉండు” అని చెప్పాడు. రాముడు అశ్వమేధ యాగం చేసేటప్పుడు యాగం చూడటానికి వెళుతూ తనతో పాటు సీతను కూడా వెంటబెట్టుకుని వెళ్ళాడు వాల్మీకి. సభామధ్యంలో నిలబడి జానకి “నా పతిదేవుడైన శ్రీరాముని తప్ప నా మనసులో ఇతరుని తలంపకున్నచో నా తల్లియగు భూదేవి నన్ను తన ఒడిలో చేర్చుకొనుగాక!” అని శపధము చేసింది. వెంటనే భూమిలోపల నుంచీ ఒక దివ్యమైన సింహాసనం బయటకు వచ్చింది. ఆ సింహాసనాన్ని బలిష్టమైన పన్నగాలు తమ శిరసులపై మోస్తున్నాయి. ఆ సింహాసనం మీద దివ్య తేజస్సుతో విరాజిల్లుతున్న భూదేవి రెండుచేతులలో సీతను తన ఒడిలోకి తీసుకున్నది. సింహాసనం రసాతలం లోకి వెళ్ళిపోయింది. ఆ విధంగా సీత మళ్ళీ తన పాతివ్రత్యం నిరూపించుకుంది.

ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత శ్రీరాముడి ధర్మ పరిపాలన ఎలా ఉండేదో చెప్పకపోతే ఈ రచనకు పరిపుష్టి రాదు. ఈ ఒక్క చిన్న సంఘటన చెప్పి ముగిస్తాను. శ్రీరాముడు పరిపాలన చేసేటప్పుడు ఒక కుక్క న్యాయం కోసం వాకిట నిలబడింది. రాముడి అనుమతితో దాన్ని సభాభవనం లోకి తీసుకువచ్చాడు లక్ష్మణుడు. అప్పుడు ఆ శునకం మానవభాషలో “రామా! నాలో ఏ దోషం లేకపోయినా సర్వార్థ సిద్ధుడు అనే భిక్షువు అకారణంగా నా తలపై కొట్టాడు. అపరాధులని శిక్షించటం రాజు విధి. రాజు శిక్షించకపోతే నేరాలు చేసేవారి సంఖ్య ఎక్కువయి, ప్రజలలో నేరప్రవృత్తి పెరిగిపోతుంది. కాబట్టి ఆ భిక్షువుని విచారించి తగిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను” అన్నది.

రాముడు భిక్షువుని పిలిపించి “ఈ శునకాన్ని కొట్టటానికి కారణం ఏమిటి?” అని అడిగాడు. “ప్రభూ! ఆరోజు నాకు భిక్ష దొరకలేదు. నేను భిక్షాటన చేస్తూ ఉండగా ఈ శునకం నా దారికి అడ్డం వచ్చింది. ఆకలిబాధతో ఒళ్ళు మరిచిపోయి దీని తలమీద కొట్టాను” అని చెప్పాడు.

“ఈ భిక్షువుని కౌలంచర మఠానికి అధిపతిని చేస్తున్నాను” అని అతడిని మఠాధిపతిగా అభిషిక్తుడిని చేశాడు. భిక్షకుడు వెళ్ళిపోయాడు. అయన తీర్పు విని సభికులు అందరూ ఆశ్చర్యపోయారు. “ప్రభూ! ఇది అతడికి వరమే అవుతుంది గానీ, శిక్ష ఎలా అవుతుంది?” అని అడిగారు. “నీకు న్యాయం జరిగిందని భావిస్తే నా ఆంతర్యం ఏమిటో వీరికి చెప్పు” అన్నాడు రాముడు శునకం వంక చూస్తూ.

“ఆ భిక్షువు కఠినాత్ముడు, క్రూరుడు, ధర్మ విరుద్ధంగా ప్రవర్తించే స్వభావం కలవాడు. అటువంటి వాడు మఠాధిపతి అయితే నరకం తప్పదు. ఎందుకంటే బ్రాహ్మణుడి సొత్తు గానీ, దేవాలయ ద్రవ్యంగానీ, గోశాలల ద్రవ్యం గానీ ఆపహరించిన వాడు అవీచి అనే ఘోరమైన నరకంలో పడిపోతాడు. అందువలన మఠాధిపత్యమును ఎట్టి పరిస్థితులలోను నెరపరాదు. ఒక వ్యక్తిని శిక్షించాలంటే దేవాలయాలపై, మఠాలపై, గోశాలలపై గానీ అధిపతిని చేయాలి. భిక్షువుకి తగిన శిక్ష విధించినట్లుగానే నేను భావిస్తున్నాను” అని వివరించింది.

చూశారా! మనం హీన జంతువుగా పరిగణించే శునకానికి కూడా న్యాయం చేశాడు రాముడు. ఇక ప్రజల సంగతి చెప్పేదేముంది? సకలప్రాణుల యందు సమదృష్టి కలవాడు రాముడు. అందుకే “రామో విగ్రహవాన్ ధర్మః (ధర్మం మనిషి రూపం పొందితే ఎలా ఉంటుందో, రాముడు అలా ఉంటాడు)” అని పరమశత్రువైన మారీచుడు కూడా ప్రశంసించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here