(‘రామకథాసుధ’ పుస్తకంలోని శ్రీమతి సంధ్య యల్లాప్రగడ గారి ‘శ్రీరాముని చింతన’ అనే కథని విశ్లేషిస్తున్నారు శ్రీ సుసర్ల సర్వేశ్వర శాస్త్రి)
యుక్త వయసు, అవగాహన చేసుకునే పరిణితి వచ్చినపుడు ప్రతి పాత్ర ఔచిత్యం, ప్రతి సన్నివేశపు పరమార్థం వివిధ రచయితలు రాసిన రామాయణ రచనల ద్వారా మరింత విపులంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అప్పుడు కూడా కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు లేదా రచయితలు వివిధ కారణాలతో విస్మరించవచ్చు.
కాని ఈ ‘రామకథాసుధ’ సంకలనం లోని కథలలో రామాయణంలోని పాత్రలు, సన్నివేశాలనూ మరింత లోతుగా పాఠకులు తెలుసుకునేలా రచయిత(త్రి)లు రాసిన తీరు ఎంతో అబ్బురపరచింది.
కాని రాముడు విద్యాభ్యాసం నుండి వచ్చాక ఒక చింతనలో నిర్వికారుడై ఉండడం దశరథుడిని కలవరపరచి కులగురువైన వశిష్ఠ మహాముని ద్వారా రాముడు యాగ రక్షణకు విశ్వామిత్రుని వెంట వెళ్ళవలసి వచ్చినపుడు ‘రాముడు ఆ విధంగా ఎందుకు ఉన్నాడ’న్న విషయం ఎంతో వివరంగా దశరథుడికే కాక రామునికి కూడా తన చింత పోగొట్టే తీరును ఎంతో బాగా చెప్పారు.
ముఖ్యంగా అది రామునికే కాదు ఈనాటి సమాజంలో ప్రతి వ్యక్తి తెలుసుకోవలసిన విషయం. రామునికి వశిష్ఠుల వారు వివరించిన ఆధ్యాత్మిక, యోగిక వివరాలను కలిపి వాల్మీకి మహాముని 32 వేల శ్లోకాలుగా రామాయణం రచించారు. వశిష్ఠుల వారి వివరణలతో రాముడు ఆత్మతత్వం గ్రహించి, జీవన్ముక్తుడై తన జీవితాన్ని ధర్మబద్ధంగా గడిపాడు.
అందుకే రాముని చరిత్ర సూర్యచంద్రులున్నంత కాలం మానవులను నడిపించే కథలా ఈ నేలమీద నిలిచిపోయింది. అందుకే రాముడు మనకు ఆదర్శపురుషుడైనాడు అని ఈ కథ ద్వారా తెలుస్తుంది. రచయిత్రి శ్రీమతి సంధ్య యల్లాప్రగడ రామాయణ గ్రంథాన్ని ఎన్నిసార్లు ఎంత నిబద్ధతతో చదివారో ఈ కథ తెలియచేస్తుంది.
కేవలం ₹175/- లకే అర్థవంతమైన ముఖచిత్రం, నాణ్యత కలిగిన కాగితాలలో అందమైన ముద్రణతో 216 పేజీలలో ఎందరో లబ్ధప్రతిష్ఠులైన రచయిత(త్రి)లు రాసిన 28 కథలు వేటికి అవే ప్రత్యేకతను కలిగిన కథల సంకలనంగా ‘రామకథాసుధ’ అనే ముకుటంతో తీసుకువచ్చిన సర్వశ్రీ కస్తూరి మురళీకృష్ణ, కోడిహళ్ళి మురళీ మోహన్, కొల్లూరి సోమ శంకర్ గార్లు ఎంతైనా అభినందనీయులు.
***
ప్రతులకు – సాహితీ ప్రచురణలు, విజయవాడ ఫోన్: 0866-2436643. 9849992890
ఆన్‍లైన్‍లో ఆర్డర్ చేసేందుకు
https://www.sahithibooks.com/ProductDetails.aspx?ProductId=1284&BrandId=82&Name=ramakathasudha
***
సుసర్ల సర్వేశ్వర శాస్త్రి,
విశాఖపట్నం