Site icon Sanchika

యువభారతి వారి ‘శ్రీశ్రీ కవితా వైభవం’ – పరిచయం

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారాఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]

శ్రీశ్రీ కవితా వైభవం

(వికసించిన విద్యుత్తేజం శ్రీశ్రీ.  ఈ నాడు – శ్రీరంగం శ్రీనివాసరావు (మనందరికీ తెలిసిన శ్రీశ్రీ) గారి 113 వ జయంతి. ఈ సందర్భంగా యువభారతి ప్రచురణ – ‘శ్రీశ్రీ కవితా వైభవం’ గురించి ఒక సంక్షిప్త  పరిచయం.)

శ్రీశ్రీ ప్రతిభా మూర్తి. ప్రాచ్య పాశ్చాత్య సాహిత్య మర్యాదల రహస్యాలను ఆకళించుకున్న వ్యుత్పన్నుడు. అందని ఊహలను అందించగల, మనసులలోకి దించగల పదజాలాన్నీ, పలు పోకడలు పోగల అర్థ శక్తినీ కైవసం చేసుకున్న రసజ్ఞుడు.  అనుకరణం, ప్రతిధ్వననం –  అసలైన కవితా లక్షణాలు కావని ఉద్ఘోషించి, “అనితర సాధ్యం నా మార్గం” అని  ప్రకటించుకోగలిగిన స్వతంత్రుడు. నిత్యప్రయోగశీలిగా, నవ మార్గ ప్రవర్తకునిగా, సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న వాడు. కొత్త తీరులో అభివ్యక్తీకరణం చేసి, కొత్త తరహా కవిత్వానికి శ్రీకారం చుట్టినవాడు.

సాంప్రదాయ తెలుగు కవిత్వంలో మునుపెవ్వరూ ఉపయోగించని శైలితో, తనదైన ముద్రతో, సమకాలీన సమస్యల గురించి వ్రాసి, సామాన్యుడి దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసిన అచ్చమైన ఆధునిక తెలుగు కవి శ్రీశ్రీ. దేవులపల్లి కృష్ణశాస్త్రి తన వేదనను ప్రపంచానికి తెలియజేయడానికి తన కవితా శక్తిని ఉపయోగిస్తే, శ్రీశ్రీ తన స్వరంలో ప్రపంచం యొక్క వేదనలను కవితలుగా అల్లాడు. కృష్ణశాస్త్రి గారి బాధకు లోకం తల్లడిల్లిపోతే,  లోకంలో  జనులు అనుభవిస్తున్న బాధలన్నీ – శ్రీశ్రీని తల్లడిల్ల చేశాయి.

వాస్తవ జగద్దర్శనాన్ని కవిత్వాదర్శంగా విశ్వసించినవాడు. శ్రీశ్రీని చదవనివాడు గడచిన యాభై ఏళ్ళ తెలుగు కవితా స్వరూపాన్ని చూడని వాడే.  వ్యుత్పన్నుని ప్రతిభ – “కదిలేది – కదిలించేది” అని నిరూపించిన నవకవితాభినేత శ్రీశ్రీ.

భావ కవిత్వానికి భరతవాక్యం పలికి, అభ్యుదయ కవిత్వానికి ఆవాహన చేసి, అధివాస్తవిక కవిత్వానికి ఆలాపన పాడి, విదూషక వికట కవిత్వానికి ప్రాణం పోసి, విప్లవ కవిత్వాన్ని వీధి కెక్కించిన ఈ శతాబ్దపు కవి వాక్కుకు – శ్రీశ్రీ పరిచయాత్మక వ్యాఖ్యానం. కాలక్రమణికగా సూచించిన ఖండ కావ్యాలలో శ్రీరంగం శ్రీనివాసరావు ప్రతిభ బీజామాత్రంగా మొదలై ఒక మహాదర్శనాన్ని ఎలా సాధించిందో, ప్రభావాల పరిధులను దాటి, ప్రత్యేక ప్రతిపత్తిని ఎలా పొందిందో, డాక్టర్ మిరియాల రామకృష్ణ గారు సరళ సుందరంగా, శక్తిమంతంగా విశ్లేషించారు.

డా. మిరియాల రామకృష్ణ గారు శ్రీశ్రీ కవితలపై పరిశోధన చేసి ఆంద్ర విశ్వవిద్యాలయం నుండి డాక్టరేటు పట్టా పుచ్చుకున్నారు. సహృదయ విమర్శకులు, అధ్యయన శీలురైన కవులు.  బాల సాహిత్యాన్ని సృష్టించిన నవనీత మనస్కులు. ఆయన వ్రాసిన ఈ పుస్తకం, శ్రీశ్రీ కవితా ప్రస్థానాన్ని పరిశీలింపదలచుకొన్న సహృదయులకు ఒక చేతిదివ్వె.

క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/YuvaBharathi/%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%E0%B0%B6%E0%B1%8D%E0%B0%B0%E0%B1%80%20%E0%B0%95%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A4%E0%B0%BE%20%E0%B0%B5%E0%B1%88%E0%B0%AD%E0%B0%B5%E0%B0%82/

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

Exit mobile version