[dropcap]వి[/dropcap]శాఖ సాహితి ఆధ్వర్యంలో 16.08.2018, సాయంకాలం 6 గం.లకు డా. కట్టమూరి చంద్రశేఖరం (విశ్రాంత కళాశాలాధ్యక్షులు, విజయనగరం) గారి “శృంగారనైషధ సౌరభము” అనే అంశంపై ప్రసంగ కార్యక్రమం జరిగింది.
సభకు విశాఖ సాహితి ఉపాధ్యక్షులు డా. కందాళ కనకమహాలక్ష్మి గారు అధ్యక్షత వహించారు. విశాఖ సాహితి కార్యదర్శి శ్రీ ఘండికోట విశ్వనాధం గారు విశాఖ సాహితి తరఫున అందరికీ స్వాగతం పలికారు.
డా. చంద్రశేఖరం గారు తనదైన శైలిలో, సహజసుందరమైన గంభీర గళంతో, శ్రీహర్షుని నైషధ చరితలోని శ్లోకాలు, శ్రీనాథుని తెలుగు పద్యాలు రాగయుక్తంగా పాడి ప్రేక్షకుల వీనులకు విందు కావించారు. నల దమయంతులమధ్య రాయంచ రాయభారం, దమయంతీ స్వయంవరం, నలుని ఎన్నిక తదుపరి నల దమయంతుల వివాహం వంటి ఘట్టాలతో శ్రంగార నైషధ సౌరభాన్ని అందరికీ పంచిపెట్టారు డా. చంద్రశేఖరం గారు.
సభకు ప్రముఖ సాహితీవేత్తలు డా. కోలవెన్ను మలయవాసిని గారు, డా. దామెర వేంకట సూర్యారావు గారు, ఎంతో మంది సాహిత్యాభిమానులు విచ్చేసి, కార్యక్రమాన్ని విజయవంతం కావించారు.
శ్రీమతి చిట్టిళ్ళ నిర్మలాదేవి గారు ప్రార్థనా గీతం ఆలపించగా, విశాఖ సాహితి కార్యదర్శి శ్రీ ఘండికోట విశ్వనాధం గారి వందన సమర్పణతో సభ ముగిసింది.