స్టాంపులతో పూజ్యబాపూజీకి నివాళి

2
3

[box type=’note’ fontsize=’16’] శ్రీమతి పుట్టి నాగలక్ష్మి రచించిన ‘స్టాంపుల్లో మహాత్ముడు’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి. [/box]

[dropcap]స్టాం[/dropcap]పుల ప్రదర్శనల్లో పాల్గొని అనేక జాతీయ స్థాయి పతకాల్ని పొంది ఫిలాటలిస్ట్‌గా పేరుపొందిన శ్రీమతి పుట్టి నాగలక్ష్మిగారు తాను సేకరించిన స్టాంపులలో నుండి మహాత్మా గాంధీగారికి సంబంధించిన స్టాంపుల గురించి సమగ్ర వివరణ చేస్తూ తెచ్చారీ ‘స్టాంపుల్లో మహాత్ముడు’ పుస్తకం.

భారతీయ తపాలా శాఖ ఉత్తరాల బట్వాడాకు అయ్యే ఖర్చును ప్రజలనుంచి వసూలు చెయ్యడం కోసం స్టాంపులను అమ్ముతుంది. ఈ స్టాంపుల్లో భారతీయ సంస్కృతీ, సంప్రదాయాల్ని ప్రతిబింబించేవే కాక అనేక చారిత్రక ఘట్టాల్ని కూడా రికార్డు చేసే ఉద్దేశంతో ఆయా సందర్భాలకు గుర్తుగా పలు రకాల స్టాంపుల్ని ముద్రిస్తుంది తపాలా శాఖ.

స్టాంపులు దృశ్య కావ్యాలు, ఎన్నో కథల్ని దాచుకుని ఉంటాయి. తెలుసుకోదలచుకున్నవారికి ఆ స్టాంపులు తమ వెనుక కథను చెబుతాయి. వివిధ జాతుల భాష, లిపి, సాహిత్యం, కళలు, పండుగలు, చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి అందచందాలకు సంబంధించిన స్టాంపులు కూడా ఉంటాయి.

హాబీగా పోస్టల్ స్టాంపుల్ని సేకరించడమే కాకుండా వాటిని స్టడీ చెయ్యడం ఫిలాటెలీ. ప్రతి స్టాంప్ వెనుకా గత చరిత్ర ప్రవాహం ఉంటుంది. ఒక వ్యక్తి ఫొటోతో స్టాంప్ వేయాలంటే ఆ వ్యక్తి అసాధార వక్తిత్వం, త్యాగనిరతి, దేశభక్తీ కలిగి ఉన్నవారై ఉండాలి. దేశానికీ తోటి మానవులకూ సేవచేసిన వారై ఉండాలి. మానవత్వం మూర్తీభవించిన మహామనీషై ఉండాలి.

భారతదేశ సంస్కృతి మహోత్కృష్టమైనది. అటువంటి భరత జాతి తమ యొక్క తండ్రిగా భావించి మహాత్మా గాంధీ గారిని తమ జాతిపితగా పిలుచుకుని గౌరవించుకుంది. తన దేశంలోని అతి సామాన్యుడికి ప్రాతినిధ్యం వహిస్తూ ఎప్పుడూ ఒక పంచె, కండువా మాత్రమే ధరించే నిరాడంబరుడు ఆయన. అటువంటి మహాత్ముడి ఫోటోను స్టాంపుల్లో ముద్రించి బాపూజీని గౌరవించుకుంది తపాలా శాఖ. రచయిత్రి పూజ్య బాపూజీ ఉన్నస్టాంపులన్నీ సేకరించి వాటి వెనుకనున్న చారిత్రక సందర్భాలను గుర్తు చేస్తూ వివిధ ఘట్టాలకు గుర్తుగా వేసిన స్టాంపులను గురించి చెబుతూ ఈ పుస్తకం తీసుకొచ్చారు.

స్టాంపుల ముద్రణ గురించి కూడా ఇందులో వివరించారు. అవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి నిర్ణయాత్మక స్టాంపులు. వీటిని మళ్ళీ మళ్ళీ ముద్రించవచ్చు. మరొకటి జ్ఞాపకార్థ స్టాంపులు. వీటిని ప్రత్యేక సందర్భాలలోనూ, గొప్ప వ్యక్తుల జయంతి, వర్ధంతి సందర్భాలలోనూ విడుదల చేస్తారు. మళ్ళీ మళ్ళీ వెయ్యరు. గాంధీ శతజయంతి, 125వ జన్మదినం, 150వ జన్మదినం, 50వ వర్ధంతి ఇలాంటివి జ్ఞాపకార్థమైనవి.

సౌత్ ఆఫ్రికాలో గాంధీగారిని అవమానపరిచిన సన్నివేశాన్నీ, సత్యాగ్రహానికి నాంది పలికిన రైల్వే స్టేషన్‌నీ, గుర్తు చేసే స్టాంపులు వేశారు. నీలిమందు రైతులకోసం చేసిన ‘చంపారన్ సత్యాగ్రహా’నికి నూరేళ్లు నిండిన సందర్భంగా మూడు నీలి స్టాంపులు, ఇంకా క్విట్ ఇండియా ఉద్యమ నేపథ్యంగా మూడూ ఇలా అనేక ప్రత్యేక సందర్భాల్లో భారత తపాలా శాఖ స్టాంపులు విడుదల చేసింది.

“నా జీవితమే నా సందేశం” అన్న మహాత్మాగాంధీ ఒక్క వాక్యంతో తనను తాను దేశానికి అంకితం చేసుకున్నారు. మొత్తం మానవాళినే తన ఆదర్శ జీవనంతో ప్రభావితం చేసిన పూజ్య బాపూజీ వెలకట్టలేని వజ్రం, ధన్యజీవి. ప్రపంచ మావావతావాదులతో గాంధీజీ వంటి స్టాంపుల వివరాలతో బాటుగా, గాంధీ గారి పేరిట వెలువడిన మొత్తం స్టాంపుల సంపూర్ణ చరిత్ర (మొట్టమొదటి స్టాంపు నుండీ 150వ జయంతి వరకూ), ఇతర విశేషాలూ,ఆయా స్టాంపుల బొమ్మలూ ఈ పుస్తకంలో పొందుపరిచారు రచయిత్రి.

మనపొరుగు దేశాలు ఆఫ్గనిస్తాన్, భూటాన్ గాంధీజీ స్టాంపులు ముద్రించాయి. సుమారు 125 దేశాలు గాంధీ గారి స్టాంపులను ముద్రించాయట. ప్రపంచంలోనే అతి ఎక్కువ స్టాంపులతో గౌరవించబడింది మన బాపూజీయేనట. ఈ భూమిపై మన మహాత్మా గాంధీ స్థాయి మహోన్నత వ్యక్తి మరొకరు జన్మించలేదు కదా మరి!

ఫిలాటెలిక్ ఎగ్జిబిషన్‌కి వెళ్లిన సందర్శకులకు వివిధ రకాల స్టాంపుల చరిత్ర ఎంతో ఆసక్తినీ, ఆనందాన్నీ కలిగిస్తుంది. అలా స్టాంపులు ఎంతో ప్రత్యేకమైనవీ, విలువైనవీనూ. మనదేశ ప్రజలకు సేవచేసిన మహానుభావులనూ, అనేక చారిత్రక సందర్భాలనూ, ముందు తరాల వారి చరిత్రనూ పొందుపరుచుకుని రాబోయే తరానికి అందచేయడంలోనూ,దేశ ప్రజలలో జాతీయతా భావాన్ని పెంపొందింపచేయడంలోనూ, ప్రముఖ పాత్ర వహిస్తాయి ఈ పోస్టల్ స్టాంపులు.

జాతిపిత మహాత్మా గాంధీ గారిని నిత్యం తలుచుకునే విధంగా ఆ కారణజన్ముని జ్ఞాపకార్ధం అనేక స్టాంపుల్ని ప్రచురించిన తపాలా శాఖవారికీ, వాటినన్నిటినీ ఒకచోట చేర్చి మనకు చక్కని వివరణను అందించిన నాగలక్ష్మి గారికీ అభినందనలు చెప్పాలి. ఈమె ‘రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయిని’ పురస్కార గ్రహీత కూడా. అందుకే అభిరుచుల్లో రారాజైన తపాలా బిళ్ళల సేకరణను తన హాబీగా ఎంచుకున్నారు. అభిరుచిగల పాఠకుల కోసం ప్రేమగా ఈ పుస్తకం అందించారు.

స్టాంపులపై ఆసక్తి గలవారందరికీ నచ్చే సంకలనం ఇది. ఆసక్తి లేకపోయినా ఒకసారి దీన్ని చదవడం బాపూజీకి నివాళి కాగలదు. మన దేశ స్వాతంత్రోద్యమ చరిత్రకు సంబంధించిన అనేక వివరాలను గుర్తుచేసుకోవడం మనకొక మంచి అనుభవం కూడా. ఇటువంటి పుస్తకం ఒకటి ఇంట్లో ఉండడం వల్ల, మన ఇంటి చిన్నారుల కూడా తమ జనరల్ నాలెడ్జ్‌ని పెంచుకోగలుగుతారు. అందరూ కొనదగిన పుస్తకం ఇది.

***

స్టాంపుల్లో మహాత్ముడు

శ్రీమతి పుట్టి నాగలక్ష్మి

పేజీలు: 88

వెల: ₹ 60/-

ప్రతులకు:

పుట్టి నాగలక్ష్మి

ఇం.. నెం.. 16 /289, పి. వి. ఏజన్సీస్ ఎదురు సందు

గంటావారి వీథి, సత్యనారాయణపురం

గుడివాడ. కృష్ణా జిల్లా

ఆంధ్రప్రదేశ్ 521301

సెల్. నెం. 9849454660

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here