[dropcap]“శ్రీ [/dropcap]తులసి జయ తులసి జయము నీయవే” అని మహిళామణులు ప్రార్థిస్తారు.
“కరుణించవే! తులసిమాతా!
దీవించవే నన్నూ! మనసారా!”
అని ‘శ్రీ కృష్ణ తులాభారం’ లో రుక్మిణిదేవి తులసి మాతను వేడుకుంటే, సత్యభామ నగలకు సరితూగని శ్రీకృష్ణుడు-రుక్మిణీదేవి తులసీ దళానికి సరితూగాడు.
‘తు’ అంటే మృత్యువును ‘లసి’ అంటే ధిక్కరించేది- వెరసి ‘తులసి’ అంటే మృత్యువును ధిక్కరించేది అనగా మృత్యువును దరికి రానీయనిది అని అర్థం.
వృక్షశాస్త్రం ప్రకారం తులసి ‘లాబియేటి’ కుటుంబానికి చెందిన మొక్క. దీని శాస్త్రీయనామం ‘అసియమ్ బాసిల్లికమ్’. కృష్ణ తులసి, లక్ష్మితులసి, అడవి తులసి, విష్ణు తులసి, రుద్ర తులసి, మరువక తులసి, నేల తులసి మొదలయిన ఏడు రకాల తులసి మొక్కలున్నట్లు వృక్షశాస్త్రం చెబుతుంది. అయితే మనకి రెండు మూడు రకాల తులసి మొక్కలు మాత్రమే ఎక్కువగా దర్శనమిస్తాయి. మిగిలిన వాటిని కొండ కోనల్లో లోయల్లో అడవుల్లో మాత్రమే చూడగలుగుతాం.
తులసి అద్భుతమయిన, అమృతతుల్యమయిన, అనన్య సామాన్యమయిన ఔషధ మొక్క. దీని పూలు, ఆకులు, కాండము, వేర్లు అన్నీ ఔషధ విలువలు కలిగినవే!
తులసి రసం సేవిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శరీరం కాంతివంతంగా తయారవుతుంది. మానసిక ఒత్తిడి, అలసట తగ్గుతాయి. డిప్రెషన్‌నీ తగ్గిస్తుంది. రోజులో నాలుగుయిదు సార్లు తులసి ఆకులు బాగా నమిలి మింగితే జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది.
తులసి ఆకులను బాగానలిపి పళ్ళు తోముకుంటే పంటి నొప్పులు దరికి చేరవు. తులసి ఆకులను నూరి వేడినీటితో కలపి పుక్కిలిస్తే నోటి పూత తగ్గుతాయి.
తులసి రసంతో పంచదారను కలపి తీసుకుంటే దురద వంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి. ఆకలి పెరిగి జీర్ణశక్తి పెరుగుతుంది.
తులసి రసంతో మిరియాల పొడిని కలపి సేవిస్తే పొట్ట లోని క్రిములు నాశనమవుతాయి. మలేరియా జ్వరానికి మందుగా ఉపయోగపడుతుంది.
నీడలో ఎండిన తులసి ఆకుల పొడిన ఆవుపాలతో కలిపి తీసుకుంటే క్షయవ్యాధికి నివారణగా పనిచేస్తుంది. ఎండిన తులసి ఆకుల పొడిని ముఖానికి రాసుకుంటే ముఖ వర్చస్సు కాంతివంతంగా మారుతుంది. మొటిమలు, మచ్చలు నివారించబడతాయి.
తులసి ఆకులతో పాటు విత్తనాలు కూడా ఆరోగ్యానికి మంచిదే! మూలవ్యాధిని నివారిస్తాయి.
తులసి రసంతో కర్పూరం కలిపి దూదితో ముంచి పిప్పిపళ్ళపై పెడితే నొప్పి తగ్గుతుంది. పంటిపైన, చిగుళ్ళ పైన నెలవు ఏర్పరుచుకున్న క్రిములు బయటకు వస్తాయి.
తులసి కొమ్మను వార్డ్ రోబ్‌లో వుంచినట్టయితే పురుగులు, ఈగలు, దోమలు, వంటివి దరిచేరవు. వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది.
తులసిలో యాంటి-ఆక్సిడెంట్ గుణాలున్నాయి. ఇవి రేడియేషన్ ప్రభావం వలన కలిగే అస్వస్థతను నిరోధిస్తాయి. రేడియేషన్ చికిత్స వలన కలిగే దుష్ప్రభావాలకు దీనితో సమర్థవంతంగా చికత్స చేయొచ్చని పరిశోధనలు ఋజువు చేస్తున్నాయి.
ఈ తులసి మొక్కకు గల ప్రాముఖ్యత ఎనలేనిది-ఎనలేనిది. 1997 అక్టోబరు 28 వ తేదీన INDIAN MEDICINAL PLANTS సీరీస్‌లో వెలువడిన నాలుగు స్టాంపుల SE-TENANT BLOCK లో మొదటి స్టాంపుగా తులసి మొక్క చిత్రంతో తులసి స్టాంపును రూ 2-00 ల విలువతో ముద్రించారు.
భారతావనిలో ప్రాచీన భారతం నుండి ఆధునిక భారతం వరకు ‘తులసి’ది అగ్రస్థానం. ఔషధ మొక్కగా, సనాతన సాంప్రదాయాలకు, ఆధునిక రేడియో థెరపీ విరుగుడుకు మూలమయిన ఆరోగ్యప్రదాయినిగా / సర్వరోగ నివారిణిగా పేరుపొందిన ‘తులసి’ని ఔషధ మొక్కలలో గల ప్రాముఖ్యతని గుర్తించి ‘స్టాంపుల ఆకుపచ్చని వని’లో స్థానం కల్పించిన తపాలా శాఖకు అభినందనలు.
***
Image Courtesy: Internet