(శ్రీ వేదాల గీతాచర్య రచించిన ‘స్థిమిత భయానకం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము)
స్థిమిత భయానకం (Aitihaasic Horror)
1.
[dropcap]స్థి[/dropcap]మితా మహీజా!
వయసు 26.
ఎక్కడ పుట్టిందో అనవసరం.
ఇవేమీ ఏఎస్ఎల్ పీఎల్ఎస్ రోజులు కావు కదా.
సినిమా హీరోయిన్ అని ఎటూ రివీల్ చేస్తున్నా కాబట్టి జండర్ ఏమిటి అన్నది తెలిసిపోతుంది. ఈమధ్య జండర్ న్యూట్రల్ ఫ్యాడ్ ఎక్కువౌతోంది కనుక ఏ పేరు ఏ.. వద్దులే. అసలే ఈ అమ్మాయి వివాదాల పుట్ట. దానికి తోడు ఈ వివాదం కూడానా? అవసరం లేదు బాబూ. మొన్నటికి మొన్న.. “అప్పుడే పుట్టిన పసికందుకు ఎంత కామ వాంఛ లేకపోతే మొదట తల్లి రొమ్ములు వెతుక్కుంటాడు?” అని ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటకు బాగా ట్రోల్‌కు గురయ్యింది కూడా. నిన్నటికి నిన్న పిస్టల్ వెబ్సైట్‌లో మహా ‘కలాత్మకంగా’ తన అంగాంగ వర్ణన చేసిన రసిక న్యూస్‌కు (వెబ్సైట్ లో ఏమొచ్చినా అది న్యూసే. వేరేలా చూస్తే కళ్ళు పోతాయ్. మేము దేవుణ్ణి నమ్మవఁండోయ్.. బై ద వే) తావిచ్చిన డ్రస్‌నే ఇప్పుడు వేసుకుని ఒక పాష్ మాల్ లోకి వెళ్తోంది.
మోకాలి నుంచి ఒక జాన, ఆపైన ఒకటిన్నర బెత్తెడు పైకి ఉన్న బ్లూ జీన్స్ షార్ట్ పైన, శరీరానికి హత్తుకున్నట్లున్న బ్లాక్ టిషర్ట్ వేసుకుంది స్థిమిత. ఆమె ప్రస్తుతం చేస్తున్న సినిమా డైరక్టర్ అయితే ఇంచక్కా టాప్ యాంగిల్లో చూపించేవాడు. అప్పుడు ఎద సౌందర్యం మొత్తం కనిపించి మేలాడియన్స్‌కు ఒక్క క్షణం, ఈ స్క్రీన్ షాట్ తీసుకోవాలి అనే ఆలోచన కలిగిస్తుంది. ట్విట్టర్ ఎరోటిక్ కమ్యూనిటీలో యాక్టివ్‌గా ఉండే బ్యాచ్ వివిధ యాంగిల్స్ లో ఈ ఒకటిన్నర సెకండ్ షాట్‌ను ఎన్ని ఫ్రేముల్లో పట్టుకోవాలా అనే ఆలోచనలో పడేవాళ్ళు.
కానీ, స్థిమితా మొహంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఎవరూ పట్టించుకోని విధంగా రెడీ అయ్యి తన స్నేహితురాలైన మిలిందా మహాజన్‌ను కలవటానికి వెళ్తోంది. తను వెళ్ళే సరికే మిలిందా అక్కడ ఒక ఫుడ్ జాయింట్ కార్నర్‌లో వెలుతురు తక్కువగా ఉన్న చోట కూర్చుంది. మిలిందా టారో ఎక్స్పర్ట్. అత్యంత పురాతనమైన ఎంజైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్ పేపర్‌లో దానిమీద ఒక కాలమ్ నిర్వహిస్తోంది. పైకి ఉత్తుత్తిలా కనిపించినా ఆమె పర్సనల్‌గా చేసిన ప్రిడిక్షన్స్ చాలా వరకూ నిజాలయ్యాయన్నది చాలామందికి తెలియదు. అలాంటి ప్రిడిక్షన్ ఒకటి తన విషయంలో నిజమయ్యే సరికి స్థిమితా మిలిందాను కలవాలని అడిగింది.
మిలిందాను చూడగానే సాధారణంగా చాలా కాన్ఫిడెంట్‌గా వేగంగా నడిచి వెళ్ళే స్థిమితా ఇప్పుడు నిర్లిప్తంగా తనవైపు చూస్తూ నిలబడిపోయింది. వేగంగా గుండెలు కొట్టుకుంటుండగా నిన్నటి రాత్రి జరిగిన సంఘటన తల్చుకుని బిగుసుకుని పోయినట్లు నిలబడిపోయింది.
“హే! బడ్డీ!” అని మిలిందా పిలవటంతో స్థిమితా చెమటలు పట్టిన శరీరంతో ఒక్కసారిగా తనకు రిజర్వ్ చేసిన సీట్‌లో కూర్చుండి పోయింది. బొటన వేలు బుగ్గల మీద, చూపుడు వేలు, మధ్యవేలు నుదురు మీద ఉండేలా పెట్టుకుని మోచేతులు టేబుల్ మీద ఆనించింది. టేబుల్ మీద పెట్టిన పర్స్‌లో వైబ్రేషన్ చూసి, ఫోన్ బైటకు తీసింది. వావేయ్ మేట్ 20 ప్రో. లేటెస్ట్ మోడల్. వావేయ్ (Huawei) బ్రాండ్ అంబాసడర్ అయిన సౌతిండియన్ స్టార్ హీరో తమ సినిమా హిట్టైనందుకు ఇచ్చిన బహుమతి. కాల్ అసుందరం నుంచీ. తన సెక్రటరీ. కట్ చేసి మళ్ళా తన పర్స్‌లో పెట్టింది. దాంట్లోంచే Insignia ప్యాక్ నుంచీ రెండు సిగరెట్లు తీసి మిలిందాకు ఒకటి ఆఫర్ చేసింది. మిలిందా తన లైటర్‌తో స్థిమితా సిగరెట్ వెలిగించబోయినా, వద్దంది. సిగరెట్ వేళ్ళమధ్య అలాగే పెట్టుకుని విషయం చెప్పటం మొదలు పెట్టింది.
మిలిందాకు ఎలా రియాక్ట్ కావాలో తెలియలేదు. నిజంగా అలా జరిగి ఉంటుందా? లేకపోతే ఆ సంఘటన స్థిమితా భ్రమా? గత వారం రోజుల్లో నాలుగుసార్లు జరిగిందంటే సీరియస్ వ్యవహారమే. That Sthimita is still able to maintain her poise to an extent is a miracle.. అనుకుంది. సెకన్ల ముల్లు తిరుగుతూనే ఉంది. పాలు పొంగేటప్పుడు వచ్చే శబ్దాన్ని యాప్లిఫై చేస్తే వచ్చే సౌండ్ లాంటి గొంతుకతో స్థిమితా జరిగిందంతా చెప్తోంది. పాయింట్ల వారీగా తను నోట్ చేసుకుంటోంది మిలిందా. నిముషాల ముల్లు సరిగ్గా ఒక రౌండ్ వేసేసరికి ఇది తన పరిధిలో పని కాదనిపించింది.
రేపు నీకు సమాధానం చెప్తా అన్న ప్రామిస్‌తో ఇద్దరూ లేచారు. మాల్ బైట తన కార్ లోకి వెళ్తుండగా దొరికిన సందులో ఫొటోగ్రాఫర్లు కెమేరాలకు పని చెప్పారు. వారిని, వీళ్ళ హడావుడి చూసి ఎప్రోచ్ కాబోతున్న ప్యాన్స్‌ను తప్పించుకోబోయి కింద పడబోయి కార్ లోకి ఎక్కింది స్థిమితా. ఈ కొంచెం సమయంలోనే ఎక్స్పోజ్ అయిన క్లీవేజ్‌ను క్లిక్ మనిపించాడు ఎంజైమ్స్ ఆఫ్ ఇండియా ఫిల్మ్ క్రిటిక్ భేలూ చంద్. స్థిమితా లేటెస్ట్ రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమాలో హీరో ఆమె వెంటపడి ప్రేమించమనటాన్ని స్టాకింగ్ ఆనీ, ఇలాంటి మేల్ చావ్నిస్టిక్ ఐడియాలజీలతో సినిమాలు ఇంకెన్నాళ్ళు తీస్తారని గట్టిగా ప్రశ్నించింది కూడా ఇతనే.
2.
స్థిమితాకు నెల రోజులు షెడ్యూల్ బ్రేక్. అనుకోకుండా 15 రోజులు ఖాళీ కూడా రావటంతో పుణేలో తన ఇంటికి వచ్చేసింది. అది తనకు తాను డిజైన్ చేసుకున్న ఇల్లు. తన లైఫ్ స్టైల్‌కు, తన అభిరుచులకే కాదు తన సబ్ కాన్షస్ హ్యాబిచువేషన్లకు తగిన విధంగా డిజైన్ చేసి కట్టించుకున్న ఇల్లు.
రేపు నీకు సమాధానం చెప్తా అన్న మిలిందాకు రేపు రాలేదింకా. స్థిమితా స్నానం చేద్దామా వద్దా అన్న డైలమాలో ఉంది. ఆ సమయంలోనే తనకు సమస్య. ఖచ్చితంగా అలా హీరోయిన్ లేదా సినిమాలో విక్టిమ్ పాత్ర స్నానం చేస్తున్నప్పుడే వాళ్ళను వెంటాడే స్పిరిట్స్ వచ్చేస్తాయి. దానికి నాన్ సినిమాటిక్ కారణాలు చాలా ఉన్నా, ఇక్కడ తన పరిస్థితి మాత్రం దారుణం. తనకు పొద్దున నిద్ర లేచాక గంట లోపల స్నానం చేయకపోతే పరమ చిరాకు. సెట్స్‌లో ఉన్నా సరే! కానీ, తనను పీడిస్తున్న మిస్టీరియస్ ఎంటిటీ సరిగ్గా తాను స్నానం చేస్తున్న సమయంలోనే తన మీద ఎటాక్ చేస్తుంది. అది నిజమా లేక తనకు కొద్ది రోజుల ముందు వరకూ సరైన నిద్ర దొరకనంత బిజీగా ఉండటం వలన కలిగిన ఎఫెక్టా అన్న అనుమానం వరుసగా నాలుగు రోజులు ఒకే అనుభవం ఎదురవటంతో మారిపోయి కాస్తంత నమ్మక తప్పలేదు. మొదట ఎవరో తన మీద ట్రిక్ ప్లే చేస్తున్నారని కూడా అనుకున్నది. కానీ అది నిజం కాదు.
అప్పటిదాకా కాఫీ సిప్ చేస్తూ సూర్యోదయాన్ని ఆస్వాదిస్తున్న స్థిమితా మహీజా మగ్‌ను కిచెన్ సింక్‌లో వదిలి బెడ్ రూమ్ లోకి వెళ్ళింది. భుజాల మీదుగా తను వేసుకున్న కాఫ్ లెంత్ లైట్ బ్లూ కవర్ కోట్‌ను సుతారంగా జార విడిచింది. అది అలా తన శరీరం మీద నుంచి జారుతూ చక్కిలిగిలి పెట్టటం ఏదోలా చేసేది. మామూలు సమయాలలో. కానీ, తన మెదడు ఏదీ ప్రాసెస్ చేసే మూడ్‌లో లేదు ఇప్పుడు.
స్థిమితా అడుగులో అడుగేస్తున్నట్లు ముందుకు నడిచింది. ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్లు. బాత్ టబ్ దగ్గరకు వెళ్ళింది. అక్కడ ఒక టచ్ సెన్సిటివ్ ఏరియాలో ప్రెస్ చేసింది. మంద్రంగా మ్యూజిక్ మొదలైంది. పిల్ల కాల్వలో నీరు పారుతున్నలాంటి శబ్దం. ఎందుకో చిన్నతనంలో చదువుకున్న The Brook అనే Alfred Tennyson కవిత ఙ్ఞాపకం వచ్చింది.
By thirty hills I hurry down,
Or slip between the ridges,
By twenty thorps, a little town,
And half a hundred bridges.
ఇంతలో ఎక్కడి నుండో ఆలాపనలా..
For men may come and men may go,
But I go on forever.
No! I couldn’t! I couldn’t! I couldn’t!
బైట నుంచీ వస్తున్న శబ్దమా? లేక తన మైండ్‌లో తెలియకుండా ప్లే అవుతున్న తన స్వరమా?
ఒక నిముషం గడిచింది. స్థిమితా నించునే ఉంది.
For man may come and men may go
No! I couldn’t! I couldn’t! I couldn’t!
చిన్నగా బాత్ టబ్ లోకి దిగింది. అక్కడ కూడా తన చేతికి అందేలా మరో టచ్ సెన్సిటివ్ ఏరియా ఉంది. బాత్ టబ్ లో దిగకముందే మ్యూజిక్ ప్లే చేసుకోవాలంటే సరిగ్గా తన కుడి చేతికందేలా ఒక టచ్ సెన్సిటివ్ బటన్. లేదా అప్పుడు మర్చిపోతే, బాత్ టబ్‌లో దిగాక తడి చేత్తో అయినా పనిచేసేలా ఫోర్స్ టచ్ బటన్ ఎడమ చేతికి అందే ఎత్తులో.
ఆ ఇంట్లో అన్నీ తనకు కలిసి వచ్చేలా, కన్వీనియంట్‌గా ఉండేలా కస్టమ్ డిజైన్ చేసుకుంది స్థిమితా. అరగంట గడిచింది. మ్యూజిక్ దానంతట అదే ఆగిపోయింది. స్థిమితా లేచి లాంగ్ టవల్, బేంబూ ఫైబర్ వాడి చేసింది, చేత్తో అందుకుంది. ఆమధ్యే ప్రారంభమైన ఒక స్టార్టప్ యజమాని తన అభిమాని. తన కంపెనీ తొలి ప్రాడక్ట్ అని పంపాడు.
ఈ విషయం Instagram లో తడి టవల్ వంటికి చుట్టుకుని దిగిన ఫొటో పోస్ట్ చేస్తే ఆ కంపెనీకి బ్రహ్మాండమైన లాంచ్ రావటం స్థిమితా స్టార్డమ్ మహిమే.
ఇలా స్థిమితా తన కుడి కాలు టబ్ బైట పెడుతోంది నీళ్ళోడుతున్న తడి టవల్‌తో.. అలా తన వెనుక ఏదో కదిలింది.
స్థిమితా ఇంటికి సరిగ్గా గంట దూరంలో ఉన్న ఒక కఫే లోకి అడుగు పెట్టాడతను. ఆరడుగులు దాటాడు అని మనకు చెప్పేందుకా అన్నట్లు కఫే కు ఒకవైపు ఉన్న గ్లాస్ పేనెల్ మీద అతికించి ఉన్న ఒక హైట్ కొలిచే స్ట్రిప్ కు దగ్గరగా వెళ్ళాడు. తలుపు తీసుకుని లేజీ ఎలిగెన్స్‌తో లోపల అడుగుపెట్టాడు. క్రీమ్ కలర్ షార్ట్ మీద మినిమలిస్ట్ కార్టూన్ ఫిగర్లున్నాయి. వాటి కలర్లు కూడా టేమ్డ్ వర్షన్సే. Subdued Elegance ఆ బ్రాండ్ పేరు. పైన స్కై బ్లూ హాఫ్ స్లీవ్ టి షర్ట్. మనిషిని చూస్తే బ్రహ్మ అతన్ని సృష్టించే సమయంలో సరస్వతీ దేవి యద్దనపూడి నవల చదివి వినిపిస్తోందా అన్న అనుమానం కలుగుతుంది. కొంతమందికి మిల్స్ & బూన్స్ అనిపించవచ్చు.
ఒక ఖాళీగా ఉన్న టేబుల్ ముందు కూచోబోతుండగా తన ఫోన్ మోగింది. షార్ట్ ఎడమ వైపున్న పాకెట్ లో నుంచి మొబైల్ తీసి కాలర్ ఎవరో చూసి కాస్త విసుగ్గా లిఫ్ట్ చేశాడు. ఐఫోన్ X.
“నీకు కాఫీ పూర్తి కావస్తున్నప్పుడు గురువు గారి నుంచీ కాల్ వస్తుంది. ఆయన నిన్ను …… …… …… …… …… అడ్రస్ కు వెళ్ళమని చెప్తారు.”
“అయితే?”
“వెళ్ళే బదులు షీ పోలీస్ టీమ్ కు కాల్ చేసి ఊరుకో. నువ్వు మీ గురువు గారు చెప్పారని ఎగేసుకుంటూ వెళ్తే, నీకు సరే! నాకు వాతలు పడతాయి. Male Saviour Syndrome ఉన్న రచయితగా.”
“అంటే ఇప్పుడేమన్నా కేస్ రాబోతోందా?”
“నిన్నర్జంటుగా ఒకచోటుకి వెళ్ళి situation handle చేయమని చెప్తారు. నువ్వెళ్ళావంటే అక్కడో అమ్మాయిని కాపాడాల్సి వస్తుంది. అది నేను రాస్తే నన్ను మేల్ సేవియర్ ప్లాట్ వాడినందుకు ఫెమినిస్ట్‌లు వాయిస్తారు. అందుకే షీ టీమ్‌కు ఫోన్ చేసి చేతులు దులుపుకో.”
సరిగ్గా మన యువకుడు (28 ఏళ్ళ వారిని యువకుడు అనే అనాలి అనుకుంటా) ఈ చిత్రమైన ఫోన్ సంభాషణలో ఉండగా, అక్కడ స్థిమితా అప్పటికింకా కాఫీ తాగుతోంది. క్రమంగా వస్తున్న సూర్యకిరణాలు ఇక్కడ కఫేలో నిండి, ఆ వెలుతురులో మన యువకుడు విచిత్రమైన silhouette form చేశాడు. అద్దాల బైట నుంచి చూసే వాళ్ళకు. ఇప్పుడతను చేర్‌లో కూచున్నాడు.
ఏమైందో ఏమో ఫోన్ కాల్ కట్ చేశాడు. ఇంతలో ఇతనికి క్రీమ్ కాఫీ మగ్ అందించాడు సర్వర్. టేబుల్ మీద పెట్టమన్నట్లు గడ్డంతో చూపించాడు. బై ద వే ఇతనప్పుడు క్లీన్ షేవ్‌లో ఉన్నాడు. కాఫీ అందుకోబోతుండగా ఫోన్ మోగింది. చూశాడు. సరిగ్గా ఇందాకటి ఫోన్ లో వ్యక్తి చెప్పినట్లు ఆ కాల్ గురువు గారి నుంచే. వెంటనే ఎత్తాడు.
“అడియేన్!”
“పవిత్రంగా ఉన్నావా?”
“ఇప్పుడే స్నానం చేసి కాఫీ కోసం హోటల్ ఎదురున్న కఫేలోకి వచ్చాను.”
“అయితే …… …… …… …… …… అడ్రస్ కు ఈ క్షణమే బయలుదేరు.”
అది ఇందాకన ఫోన్ కాల్‌లో వ్యక్తి చెప్పిన అడ్రస్‌యే అది. సరిగ్గా ఈ కఫే నుంచీ గంట ప్రయాణం.
“సరిగ్గా డ్రస్ చేసుకో నాథ్. షాఫర్‌ను అడుగు. కార్‌లో నువ్వు నేను పెట్టే డిజప్పియరింగ్ మెసేజ్‌లో వచ్చిన మంత్రాన్ని మననం చేసుకుంటుండు. Don’t look out of the car. నిన్ను టెమ్ట్ చేసేవి కొన్ని కచ్చితంగా కనిపిస్తాయి. ఆ ఇల్లు ఉన్న సందులోకి తిప్పి ఆపేయమని డ్రైవర్‌కు చెప్పు. అప్పటిదాకా కళ్ళు తెరవకు. మననం లోనే ఉండు. అక్కడ దిగి ఫర్లాంగ్ దూరం కాలి నడకనే వెళ్ళు. Handle the situation.”
“సరే గురువు గారూ!” నాథ్ పలికాడు.
“బై ద వే నాథ్! గీతాచార్య నుంచి ఫోన్ వచ్చిందా?”
“యెస్. మేల్ సేవియర్ ప్లాట్ అని ఏదో వాగుతున్నాడు.”
“వాడికి నా మాటగా చెప్పు. హీరో ఉండగా అక్కడ మెయిన్ కేరక్టర్ మరణిస్తే కథనం దెబ్బతింటుందని సికందర్ గారు ఆయన బ్లాగ్‌లో రాశారని చెప్పు. Don’t waste time any more. Move out right now.”
“అడియేన్!”
కాల్ ఆగిపోయింది.
సరిగ్గా అదే సమయానికి స్థిమితా స్నానం చేయాలా వద్దా అని ఆలోచనలో ఉంది. తన సమస్యకు మిలిందా పరిష్కారం కూడా చెప్పని విషయం కూడా ఆమె ఆలోచనల్లోనే ఉంది.
నాథ్ తన హోటల్ చేరటానికి పరుగులాంటి నడకతో రోడ్ క్రాస్ చేశాడు.
నాథ్ రెడీ అయ్యి షాఫర్ రిక్వెస్ట్ పెట్టి కింద కార్ దగ్గరకు వచ్చే సరికి స్థిమితా స్నానం చేయటానికి తనను సిద్ధపరుచుకుంది. కార్ వచ్చి అతని ముందు ఆగి అతను లోపల కూర్చోగానే ఫోన్ సిగ్నల్ ఇచ్చింది. మెసేజ్ వచ్చినట్లుగా. ఆ డిజప్పియరింగ్ మెసేజ్ ఒక్క నిముషమే ఉంటుంది. ఓపెన్ చేశాక. చదివి మెమరైజ్ చేసుకున్నాడు నాథ్ ఆ మంత్రాన్ని.
ఇంతలో మరో మెసేజ్?
“వెళ్టానికే డిసైడ్ అయ్యావా?”
“వేరే ఆప్షన్ లేదు.” రిటన్ మొసేజ్ పెట్టాడు. వెనుకే ఇంకో మెసేజ్ కూడా పంపాడు.
“హీరో ఉండగా అక్కడ మెయిన్ కేరక్టర్ మరణిస్తే కథనం దెబ్బతింటుందని సికందర్ గారు ఆయన బ్లాగ్‌లో రాశారు.”
ఇక సమాధానం రాలేదు.
నాథ్ తనను ఎప్పుడు లేపాలో డ్రైవర్‌కు చెప్పి, కళ్ళు మూసుకుని గురువు గారిని ధ్యానించాడు. ఆయన రూపమే ఒక క్షణం కళ్ళముందు మెదిలింది. అక్కడ స్థిమితా కిచెన్‌లో సింక్ లో కాఫీ మగ్ పెట్టింది. ఇంతలో ఆమె ఇంటి హాల్‌లో ల్యాండ్ ఫోన్ మోగింది.
అటు అడుగులు వేసి లిఫ్ట్ చేసింది. అవతల పక్క తన మేనేజర్ అసుందరం. ఆ రోజు మిలిందాను కలిసినప్పుడు కాల్ కట్ చేసినప్పటి నుంచీ అసుందర్ కాల్స్ ఏవీ లిఫ్ట్ చేయలేదు తను. అందుకే కాబోలు కాలర్ ఐడీ లేని ల్యాండ్ ఫోన్‌కు చేసాడు.
ఇక్కడ నాథ్ ఉన్న కారు కదిలింది స్థిమితా ఇంటి వైపు. వచ్చిన డిజప్పియరింగ్ మెసేజ్‌లో ఉన్న మంత్రాన్ని మననం చేసుకుంటున్నాడు నాథ్. ఆ రోజు సాయంత్రం తాను ఫినిష్ చేయాల్సిన డీల్ ఒకటి ఉంది. నిజానికి పూణే వచ్చింది ఆ పని మీదే.
అక్కడ స్థిమితాతో అసుందరం చెప్తున్నాడు. ప్రఖ్యాతి గాంచిన సింధూ న్యూస్ పేపర్ సండే మేగజీన్ కోసం ప్రముఖ జర్నలిస్ట్ కమ్ సోషల్ యాక్టివిస్ట్ ఖతీజా భేల్పురీ తన ఇంటర్వ్యూ అడుగుతోందని.
నెల తరువాత ఫిక్స్ చేయమని చెప్పి స్థిమితా మళ్ళా కిచెన్ వైపు నడిచింది. ఇందాకన కాఫీ మగ్ ను సింక్ గట్టు మీద పెట్టింది కానీ, సింక్ లోపల కాదు. అందుకే దాన్ని లోపల పెడదామని వెళ్ళింది. అప్పటికి నాథ్‌కు స్థిమితా ఇల్లు చేరాలంటే 45 నిముషాలు పడుతుంది.
ఇటు నాథ్ ఉన్న కార్ ఒక క్షణం ఆగాల్సి వచ్చింది మెయిన్ రోడ్డు మీద. ఇంతలో ఒకందమైన అమ్మాయి కార్‌లో నాథ్ ఉన్నవైపు అద్దాలను కొడుతూ లిఫ్ట్ అడిగింది. అదృష్టం కొద్దీ, మననంలో లీనమైన నాథ్ సమాధానం చెప్పలేదు. కళ్ళు తెరవలేదు. కార్ కదిలేసింది. కళ్ళు తెరచి ఉంటే అతని పరిస్థితి ఘోరంగా మారేది.
3.
స్థిమితాకు స్నానం చేశాక విన్న మ్యూజిక్‌ను రివైండ్ చేసుకుంటూ తడి టవల్‌తో డాన్స్ చేయటం అలవాటు. ఇప్పుడు కూడా అలాగే చేస్తోంది. ఇదంతా ఒక రెగ్యులర్ రొటీన్. ఆటోమేటిగ్గా జరిగిపోతుంటుంది. వర్కింగ్ అవర్స్ ముగియగానే ఇంటికి వెళ్ళే మూడ్ లోకి జారిపోయే ఎంప్లాయీస్ మాదిరి.
ఆరోజు సన్నటి జలపాతపు శబ్దాలు వింటూ ద బ్రూక్ పోయెమ్ గుర్తుతెచ్చుకున్నది స్థిమితా. అదే రిథమ్‌ను మెయింటెయిన్ చేస్తూ ఆమె తన డాన్స్ మొదలెట్టింది. మూడున్నర నిముషాలు శరీరాన్ని, పరిసరాలను మరచి తన్మయత్వంలో ఉంది. తెలియకుండానే శరీరం వివిధ భంగిమల్లోకి మారుతూ ఒకరకమైన అవ్యాజానుభూతి అందించింది.
ఇంతలో తన వంటి మీద ఏదో అలికిడి. కుడి పాదం మీదనుంచీ ఏదో పాకుతున్న అనుభూతి. వెనకాల I couldn’t I couldn’t I couldn’t అంటూ ఆలాపన. ఇప్పుడు వికృత స్వరంలో. కాఫ్ మజుల్ మీదుగా మోకాలి మీదకు, కనీ కనిపించని విధంగా ఉన్న నగ్నంగా ఉన్న కుడి ఊరువు మీదగా తన టవల్ ను గట్టిగా పట్టుకున్నదేదో శక్తి.
టవల్ లాగుతున్నట్లు సెన్సేషన్ కలుగటంతో ఒక్కసారిగా స్థిమితా ఈ లోకంలోకి వచ్చింది. భయంతో పెద్దగా అరువబోయి తమాయించుకుంది. ఎడమ చేత్తో టవల్ ఊడిపోకుండా పట్టుకుంటూ, కుడి చేత్తో ఆ ఎన్టిటీని నెట్టేయాలని చూసింది.
కానీ ఆ ఎన్టిటీది వికృతమైన బలం. బలవంతాన ఎద పైకి పాకి అక్కడ తిష్టవేసింది. అక్కడ ఎడమ చేతి మధ్య నుంచీ బైటకు వచ్చిన అంచు మీదకు జారింది.
34B!
ఉన్నట్లుండి ఎవరో తనను ఆక్రమించుకున్న ఫీలింగ్. స్థిమితా నోట్లో నుంచీ ఆర్తనాదం. పలికే దిక్కు లేదు. ఎందుకు స్నానం చేశానా అనే ఆలోచన తళుక్కున మెరిసేలోగా గొంతు నొక్కేస్తున్నదా ఎంటిటీ. నోట్లోంచీ శబ్దం రాకుండా. ఎవరి ప్రమేయం లేకుండానే షవర్ లో నుంచీ నీళ్ళు రావటం మొదలైంది.
ఈడ్చి గోడ మీదకు విసిరికొట్టిందా ఎన్టిటీ. అదృష్టం కొద్దీనో మరేదో శక్తి వల్లో తల గోడకు తగిలి పగిలి రక్తం splash కావలసినది తప్పేలా అక్కడ ఒక స్పాంజ్ ప్రత్యక్షమైంది. కానీ ఆ వేగం వల్ల కలిగిన షాక్ కు స్పృహ తప్పినంత పనైంది. అలా తప్పినా బాగుండేది. ఎక్కడలేని ఓపిక తెచ్చుకుని కనపడని శత్రువును ఎదుర్కోవటానికి లేచింది. అదే ఆమె చేసిన తప్పు.
మరోసారి ఆ ఎన్టిటీ విపరీతమైన వేగంతో స్థిమితా టవల్ మీదకు పాకేసింది. అదృష్టం కొద్దీ కప్పి ఉండవల్సిన భాగాల మీద అస్తవ్యస్తమైన టవల్ కప్పబడే ఉంది. మరోసారి గొంతు నొక్కేస్తున్నారెవరో. ఏం జరుగుతోందో తెలిసే లోపల నాథ్ అక్కడుకు పరిగెత్తుకు వచ్చాడు. అతని చేతిలో మిలిందా కాల్చే In-signia cigarette ఉంది. మరో చేతిలో లైటర్. సిగరెట్ వెలిగించి ఒక ఫ్లిక్‍తో సరిగ్గా స్థిమితా ఎద మీదకు విసిరాడు.
అంతే! అటు స్థిమితా స్పృహ కోల్పోవటం, ఇటు ఆ ఎన్టిటీ ఏదో భాషలో వికృతమైన స్వరంతో ఇరిటేషన్‍తో కూడిన శబ్దం చేస్తూ, గొణుక్కుంటూ వెళ్ళిపోవటం జరిగింది.
స్థిమితా మహీజా ఇంట్లో హాల్.
“అ.. అ.. అ..సలేం జరిగింది?” స్థిమితా లోగొంతుకతో అడిగింది. ఆమె సోఫాలో మిలిందా ఒడిలో తల పెట్టుకుని పడుకుని ఉంది. మిలిందా ఏదో ఆలోచనలో ఉన్నట్లుగా దృష్టిని కుడి వైపు ఉన్న గోడ మీద ఉన్న పెయింటింగ్ మీద ఉంచింది. వీరి ఎదురుగా ఉన్న Couchly కంపెనీ కస్టమ్ డిజైన్ చేసిన సోఫా సెట్‌కు ఆనుకుని నిలబడ్డాడు నాథ్. అతను కూడా దీర్ఘాలోచనలో ఉన్నాడు.
“వాడ్డూయూ సే బడ్డీ?” మిలిందా అడిగింది.
“నాకు ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు కానీ, ఆ సిగరెట్ విసరటం వల్ల ఆ ఎన్టిటీ వెళ్ళిపోవటం ఆశ్చర్యకరంగా ఉంది. ఏదో క్లూ దొరుకుతోంది,” నాథ్ అన్నాడు.
“బై ద వే స్థిమితా, హీజ్ నాథ్. మై గుడ్ ఫ్రెండ్. నాథ్, యూ నో దిసీజ్ స్థిమితా.”
స్థిమితా స్టార్డమ్ తెలిసిన నాథ్ పరిచయం అవసరం లేదన్నట్లు నవ్వాడు.
అప్పటికి ఆ దాడి జరిగి గంట కావటంతో స్థిమితా కాస్త కోలుకుంది. మిలిందా సహాయంతో లేచి కూర్చుంది. కళ్ళలో నీరసం, భయం కనిపించాయి నాథ్‌కు.
“యూ హావ్ సేవ్డ్ మై లైఫ్,” స్థిమితా స్వరంలోకి కృతఙ్ఞత తెచ్చికుంటూ అంది. కానీ అందులో భయమే వినిపించింది మిలిందాకు.
“మై జాబ్ ఈజ్ నాట్ డన్ యెట్ మిస్ మహీజా!” నాథ్ అన్నాడు.
ఇంతలో ఒక మనిషి గేట్ దగ్గర ఉన్న ఎలర్ట్ వచ్చింది.
తెల్లగా సుమారైన ఎత్తుతో కాఫీ బ్లాక్ పేంట్, బ్లూ స్ట్రైప్డ్ వైట్ షర్ట్ వేసుకున్న వ్యక్తి.
“ఫకాఫ్! వై డిడ్ హీ కమ్ నవ్?” స్థిమితా లేని ఓపిక తెచ్చుకుని అరిచింది.
అసుందరం!
“నేనే రమ్మన్నాను,” మిలిందా అన్నది.
“పంపించేయ్!”
“మనకు అవసర పడవచ్చు. రమ్మనండి,” నాథ్ అన్నాడు. స్థిమితా వైపు నవ్వుతూ చూస్తూ.
చెయ్యమన్నట్లుగా తల కదిలించాడు. మిలిందా రమ్మని సిగ్నల్ పంపింది.
అసుందరం లోపలకు వచ్చాడు.
స్థిమితా వైపు ఆతుర్దాగా చూశాడు. ఫర్వాలేదన్నట్లు చెయ్యి చూపించింది.
ఆమె చేతిలో ఉన్న రేఖలలో ఒక త్రికోణాన్ని గమనించాడు నాథ్. దాదాపు పది అడుగుల దూరం నుంచీ కూడా స్పష్టంగా కనిపించింది.
నాథ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ నిలుచున్నాడు అసుందరం.
“మిలిందా ఫ్రెండ్ నాథ్,” స్థిమితా అతని కన్ఫ్యూజన్ చూసి చెప్పింది.
“హలో” అంటూ అతని వైపు చూసి నవ్వాడు నాథ్. ముందుకు నడిచి చేయి అందిస్తూ చెప్పాడు… “నా పేరు…”
“ఏ. సుందర రామన్.”
“ఎలా తెలుసు?”
“షీజే బిగ్ స్టార్. ఎక్కడో న్యూస్‍లో చూశాను మీ పేరు.”
“థాంక్యూ. చాలా రోజుల తరువాత నా పేరు ఒకళ్ళు సరిగ్గా చెప్పారు.” షీపిష్ గా నవ్వాడు.
ఇంతలో నాథ్ ఫోన్‌కు మొసేజ్ వచ్చింది. చూశాడు. “కథలో ల్యాగ్ వస్తోంది. త్వరగా అసలు విషయానికి రా.”
నోటిఫికేషన్ స్వైప్ చేసి, ఫోన్ జేబులోకి తోశాడు.
“మీరు వెళ్ళి నేను మీకు వాట్సప్ చేయబోయే లిస్ట్ తీసుకుని రండి. కమిషనర్‌కు చెప్పి, రేపు అంతా ఈ ఇంటికి 200 గజాల సర్కిల్‌కు ఎవరూ రాకుండా ఏర్పాటు చేయమని చెప్పండి. నవ్వేడేస్, దేర్స్ నాట్ మచ్ క్రైమ్.” నాథ్ నవ్వుతూ అన్నాడు అసుందరంతో. మిలిందా వైపు చూశాడు అసుందరం. ఫర్వాలేదు, స్థిమితాతో మేము ఉంటాం. వెళ్ళి రా. అన్నట్లు సైగ చేసింది.
“యూ మే కమ్ టుమారో మిస్టర్ సుందర్” నాథ్ చెప్పాడు.
“ఓకే!” వెళ్ళిపోయాడు.
“నేను రెండు విషయాలు తేల్చుకోవాలి. దాని కోసం ఒక ప్రయోగం చేయాలి. ఇవాళ కుదరదు. సాయంత్రం మీటింగ్ ఉంది. ఒక ప్రధానమైన డీల్ పూర్తి చేయాలి.”
“ఇవాళ కుదరదా?” స్థిమితా భయంగా అడిగింది.
“నేను పూణే వచ్చింది ఈ పనుల కోసమే. మీ విషయం తెలిసి టేకప్ చేశాను. ఇవాళ ఈ ప్రయోగం చేస్తే నేను రేపటికి ఉండవచ్చు. ఉండకపోవచ్చు. అప్పగించిన పని పూర్తి చేయాలి.” మొహం సీరియస్‍గా మారింది.
“It’s not an easy task buddy! He’ll have to take a huge risk from what I have seen an hour and a half ago.” మిలిందా చెప్పింది.
“అప్పటిదాకా మీరు మిలిందాతో హోటల్‍లో ఉండండి. నా గెస్ కరక్ట్ అయితే ఈ ఎన్టిటీ మీకు హాని చేయాలనైతే అనుకోవటం లేదు. నేను మీకు తరువాత వివరంగా చెప్తాను. లెట్స్ మూవౌట్.”
4.
ఆ సాయంత్రం తన పని ముగిశాక పొద్దున ఆరున్నర లోపు స్థిమితాను ఆమె ఇంట్లోనే దింపమని మిలిందాకు చెప్పాడు నాథ్. ఆమెను మాత్రం ఇంటికి రెండు వందల గజాల దూరంలో ఉండమని చెప్పాడు. అసుందరానికి తనను తను ఉండే హోటల్‍లో ఉదయం ఆరు గంటలకు కలవమని చెప్పమని మిలిందాకు చెప్పాడు.
అసలు విషయం ఏంటి? ఏంటా ప్రయోగం అని మిలిందా అడుగుదామనుకుంది. కానీ, నాథ్ చెప్పడేమో అనే అనుమానంతో అడగలేదు.
“విల్ షి బీ సేఫ్?” ఇది మాత్రం అడిగింది.
అందరూ విషయం మాట్లాడుకున్నారు కదా. మరి ఆ ఎన్టిటీ స్థిమితా ఒంటరిగా దొరికితే వదులుతుందా అని మిలిందా అనుమానం. ఇబ్బంది ఉండదని నా నమ్మకమని నాథ్ అన్నాడు. అతని మనసులో ఒక ప్లాన్ ఉంది. అది కనుక నిజమైతే పెద్ద ప్రమాదం లేకుండానే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
కానీ.. స్థిమితా చేతిలోని ఆ త్రికోణం!!!
నాథ్ పట్టు ధోవతీ కట్టుకుని, నడుముకు పట్టు ఉత్తరీయం కట్టుకున్నాడు. నిన్న స్థిమితా చూసిన ఫేషనబుల్ మేగజీన్‍లో మోడల్‍కు, ఈ నాథ్‍కు తేడా చాలా ఉంది. కళ్ళలో చిలిపితనం, క్యూరియాసిటీ స్థానంలో చాలా సీరియస్నెస్ చేరింది. ఒక ఆచార్యుని లాగా ఉన్నాడు. మొహంలో గాంభీర్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ద్వాదశోర్థ్వపుండ్రాలు ధరించాడు. మెడలో తులసి మాల. కళ్ళలోకి చూస్తే అతను తన మనస్సును పెనట్రేట్ చేసి మరీ తన ఆలోచనలను చదువుతున్నాడా అన్న ఆలోచన కూడా కలిగింది. అతనితో వచ్చిన అసుందరంను ఎరేంజ్మెంట్లు అన్నీ అయ్యాక బైట ఔట్ హౌజులోకి వెళ్ళి కూర్చోమన్నాడు. తను సిగ్నల్ ఇస్తే మాత్రమే రమ్మన్నాడు.
మిలిందా తన కారులో స్థిమితా ఇంటి చుట్టూ రౌండ్లు వేస్తోంది. కమిషనర్ చేసిన ఎరేంజ్మెంట్ల వల్ల అక్కడ ఇతరులు ఎక్కువ మంది లేరు. మిలిందా హనుమాన్ చాలీసా మననం చేసుకుంటోంది. ఇలాంటి అనుభవం తనకు ఇదే మొదటిసారి. నాథ్ ఇలాంటి ప్రక్రియలు చాలా చేశాడని తెలుసు. కానీ తన పార్టిసిపేషన్ ఉండటం, తన స్నేహితురాలి కోసం ఈ పని చేయాల్సి రావటం ఆశ్చర్యంగా ఉంది.
అసుందరం ఫోన్ కాల్ వచ్చేదాకా, మిలిందా చేయాల్సిన పని ఇదే. ఆ మాటే చెప్పాడు నాథ్.
హాల్‍లో అన్ని ఏర్పాట్లూ చేసుకున్నాక నాలుగు దిక్కులు, నాలుగు మూలలు, ఊర్ధ్వ దిశ, అధో దిశ మొత్తాన్నీ మౌనంగా మానసికంగా కొలిచి చూసుకున్నాడు. ఆ హాల్‍లో ఉన్న వస్తువులన్నీ వేరే చోట పెట్టించాడు. అసుందరం సహాయంతో. గది మొత్తం కలియదిరుగుతూ నేలను పరిశీలనగా చూశాడు. అందులో ఒక స్థలాన్ని నిర్ణయించుకుని దాన్ని ఒక శక్తి క్షేత్రంగా మార్చే ప్రక్రియ మొదలు పెట్టాడు. దానికి దాదాపు గంట సమయం పట్టింది. టైమప్పుడు 9:11.
పక్క గదిలో ఇవన్నీ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డ స్థిమితాను పిలిచి అన్నాడు, “ఇప్పుడు మీరు ఎప్పటిలానే స్నానానికి వెళ్ళాలి. In a way, you have to recreate what you did yesterday.”
ఆమె ఆశ్చర్యపోయింది.
చేయాల్సిందే అని సైగ చేసి, తను ఏర్పరచిన శక్తి క్షేత్రం వైపు మాత్రం రావద్దన్నాడు.
జరుగుతోంది తన కోసమే కనుక స్థిమితా మహీజా అతను చెప్పినట్లే చేసింది. ఆమె ఆ గదిలో నుంచీ నిష్క్రమించే వరకూ ఆగి తన ఫోన్ తీసి తను ఎక్కువగా వాడే ఒక నంబర్‍కు డయల్ చేశాడు. తనకు గుర్తుండే వాటిలో అది రెండవ చాలా ముఖ్యమైన నంబర్. మొదటిది గురువు గారిది. మూడవది ఇంకొంచం పొడిగిస్తే మెసేజో, ఫోన్ కాలో చేసి కథలో ఇంటర్ఫియర్ అయ్యేవాడు.
“శ్రీమాతా శ్రీమహారాజ్ఞీ శ్రీమత్సింహాసనేశ్వరీ।
చిదగ్నికుండసంభూతా..”
దగ్గరకు రాగానే అవతల వ్యక్తి కాల్ లిఫ్ట్ చేశారు. శుభ సంకేతం ఈ కార్యక్రమానికి అనుకున్నాడు.
“స్వామీ! నదికి పోలేదా?” కలకూజిత రవం.
“మదిలో నీవుండగా నదికి నేనెట్లు పోవును దేవీ!”
చిరుజల్లు లాంటి నవ్వు వినవచ్చింది. తను కూడా నవ్వాడు.
“This may turn out to be the last time I’ll call you. Please turn on the video option,” అన్నాడు.
“Don’t say that. Never. In. My. Life.”
“సరే! అంతా సిద్ధమేనా మీనాక్షీ?”
“సకలం సిద్ధం.”
“మూడు గంటలు. బాగా కాన్సంట్రేట్ చేయి.”
ఆమెకు తెలుసు. అతను ఎలాంటి పని నెత్తికెత్తుకున్నాడో. తనను కూడా ఎలాంటి కష్టం నుంచీ కాపాడాడో. పెళ్ళికి మునుపు. బ్యోంకేశ్ బక్షీ రిఫరెన్స్ వాడతాడు ఆ విషయం మాటల్లో వస్తే.
“సిద్ధం.” మీనాక్షి ఫోన్ కట్ చేసింది. తనను చివరిసారి చూశాడు నాథ్.
కన్నుల్లో ముద్రించుకున్న ఆ రూపాన్ని పక్కకు నెట్టాడు.
శక్తి క్షేత్రంలో కూర్చున్నాడు. గురు పరంపర చెప్పుకున్నాడు. మానసికంగా తన గురువు గారిని అక్కడకు ఆహ్వానించి, అర్ఘ్య పాద్యాదులిచ్చి, రత్నసింహాసనం మీద వేంచేప చేసుకుని, అనుమతి తీసుకుని, సుదర్శన మాలా మంత్రం జపించటం ప్రారంభించాడు. ఫోన్ ఆఫ్‍లో ఉంది.
పదిమార్లు ఆ మంత్రం పఠించగానే, ఈ క్షణానికి చేయవలసినది రక్షణ కవచమని అర్థమయ్యింది.
శరణాగతి పద్ధతిలో సుదర్శన నారసింహ మంత్రం. ఆచమనం చేసి, ప్రాణాయామం కానిచ్చాడు. అదే సమయానికి భయం భయంగా స్థిమితా తన స్నానానికి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఆ ఎన్టిటీ ఉనికి పసిగట్టగానే మైక్ సెన్సార్ ఆన్ చేయాలి. అది హాల్‍కు కనక్ట్ అయి ఉంది. అక్కడ వచ్చే శబ్దాలు నాథ్ వినాలి. అదీ అతను తనకు చెప్పిన విషయం.
అంగన్యాస కరన్యాసాలు ముగించుకుని నాథ్ జపం మొదలుపెట్టాడు. He has 25 minutes time. ఆలోగా కనీసం రెండువేల సార్లు చేయాలి.
స్థిమితా మహీజాకు ఇది ప్రాణాంతకమైన విషయం. తన మీద దాడి చేస్తున్న ఎన్టిటీ అసలు వివరాలు తెలుసుకోవటానికి, తన గెస్ నిజమా కాదా అన్నది తేల్చుకోవటానికి నాథ్ ఈ ప్రయోగం చేస్తున్నాడు.
నాథ్ రక్షణ కవచం చేసుకుని జపం చేస్తాడు. తను నిన్నటి రోజు జరిగిన సీన్ reconstruct చేయాలి. అప్పుడు తన మీద ఆ ఎన్టిటీ దాడి చేస్తే మూడు ప్రశ్నలు అడగాలి. అవి సంస్కృతంలో ఉన్నాయి. దాని ముందు మైక్ సెన్సార్ ఆన్ చేయాలి. భయంతో విహ్వల అయి ఉన్న సమయంలో నోరు పెగలదు. చేతులు ఆడవు. ఆ ఇబ్బంది తగ్గించేందుకు నాథ్ తన శ్రీమతి మీనాక్షితో అక్కడ వారు ఉండే ఇంట్లో ఒక పారాయణం చేయిస్తున్నాడు. అది నాథ్‍కు రక్షణను ఇవ్వటంతో పాటూ, ఇక్కడ స్థిమితా చేయవలసిన పని చేసేందుకు సహకరిస్తుందని నాథ్ ఆలోచన.
స్థిమితా మంత్రం వేసినట్లు నిన్నటి పనినే రిపీట్ చేస్తోంది.
తను The Brook గురించి ఆలోచిస్తోంది.
By thirty hills I hurry down,
Or slip between the ridges,
By twenty thorps, a little town,
And half a hundred bridges.
ఇంతలో ఎక్కడి నుండో ఆలాపనలా..
For men may come and men may go,
But I go on forever.
No! I couldn’t! I couldn’t! I couldn’t!
నాథ్ స్పష్టంగా ఆ స్వరాన్ని విన్నాడు. అప్పటికి ముప్పై క్షణాల క్రితం అతని జపం పూర్తి అయింది.
ఆ వినవచ్చింది ఒక స్త్రీ స్వరం. కానీ అది స్థిమితాది కాదు. ఆలోచనను నిక్షిప్తం చేసుకుని చెవులు రిక్కించాడు.
స్థిమితా వంటి మీద ఏదో అలికిడి. వెంటనే తెలివి తెచ్చుకుని సెన్సార్ కోసం చేయిజాపబోయింది. చేయి కదలలేదు. ఇంతలో నీలపు రంగు పట్టుచీరె. బంగారు అంచు. చెప్పనలవి కాని సౌందర్యం.
సెన్సార్ ఆన్ చేయండి. నేను ఉంటాను. అని పలికిన అనుభూతి. అక్కడ తన ఇంట్లో మీనాక్షి నుదుటన స్వేదం. ఇక్కడ ఆ మాటలకు స్థిమితా సెన్సార్ ఆన్ చేసింది. ఇటువైపు నాథ్‍కు సెన్సార్ ఆన్ అయిన సిగ్నల్. మరోవైపు మిలిందా కారుకు కోడి అడ్డం వచ్చింది. ఎక్కడి నుండో. దాన్ని తప్పించబోయి రోడ్డుకు మరోవైపు ఉన్న రాయికి కారును గుద్దింది. ఆ అదురుకు తల స్టీరింగ్ కు కొట్టుకుని తల మీద రక్తపు చార వచ్చింది.
కుడి పాదం మీదనుంచీ ఏదో పాకుతున్న అనుభూతి స్థిమితాకు. వెనకాల I couldn’t I couldn’t I couldn’t అంటూ ఆలాపన. ఇప్పుడు వికృత స్వరంలో. కాఫ్ మజుల్ మీదుగా మోకాలి మీదకు, కనీ కనిపించని విధంగా ఉన్న నగ్నంగా ఉన్న కుడి ఊరువు మీదగా తన టవల్‍ను గట్టిగా పట్టుకున్నదేదో శక్తి.
మిలిందా త్వరగా తేరుకుని టింక్చర్ తీసి కాటన్ మీద వేసుకుని తల మీద పెట్టుకుంది. ఇంత హడావుడిలోనూ హనుమాన్ చాలీసా ఆపలేదు. రక్తం తన కళ్ళబడకూడదు. ఎలాగోలా తల మీద దెబ్బ తగిలిన చోట ఆ కాటన్‍ను పెట్టుకుని కార్‍ను సరైన మార్గంలో పెట్టటానికి ప్రయత్నం చేసింది.
మీనాక్షికి శరీరమంతా చల్లబడిపోయి చెమటలు పట్టేశాయి. స్పృహ తప్పుతుందేమో అన్న పరిస్థితి. వెంటనే తను చేస్తున్న పారాయణాన్ని ఆపింది. అదృష్టం కొద్దీ ఆ పారాయణం చివరి శ్లోకం చదివేసిందప్పటికే. భర్తను తలచుకున్నది.
నాథ్‍కు, మీనాక్షికి కనక్షన్ ఫామ్ అయింది. క్షణాలలో తన పరిస్థితి చెప్పింది. శబ్దం రాకుండానే. నాథ్ శరణాగతి చేయమని చెప్పాడు. కనక్షన్ బ్రేక్ కాకుండా చూసుకోమని చెప్పాడు. మీనాక్షి మానసికంగా నాథ్‍ను ఇంటికి ఆహ్వానించింది. భర్త రూపాన్ని మనసు ఫలకం మీద చూస్తోంది. ఓపిక నశిస్తున్నా పట్టు వదలలేదు. శరణాగతి పద్ధతిలో చేయవలసిన పని చేస్తోంది. ఇక భారమంతా తను నమ్మిన దైవానిదే. తాను చేయవలసినదంతా భర్త రూపాన్ని మనోఫలకంపై మీద చెదరకుండా చూసుకుంటూ దైవ ధ్యానంలో ఉండటమే.
ఇటు నాథ్‍కు అవతల నుంచీ మాటలు వినిపిస్తున్నాయి. స్థిమితా ప్రశ్న వేసింది మొదట. సమాధానం రాలేదు. స్థిమితా నాథ్ చెప్పినట్లుగానే రెట్టించింది. చేతులు జోడించి వినయంగా అడిగింది మూడవసారి.
బైటకు వస్తున్న శబ్దాలను డీకోడ్ చేసి రాసుకుంటున్నాడు. కానీ స్థిమితా మీద ఇంకేదో దాడి జరుగుతోంది.
ఇంకొకవైపు మిలిందా మొత్తానికీ కారును లైన్‍లో పెట్టి, తను చేయాల్సిన పనిని కొనసాగించింది.
ఉన్నట్లుండి నాథ్ అన్నాడు సంస్కృతంలో. బ్రాహ్మణోత్తమా, ఒక సహాయం.
నాథ్ గమనించాడు. ఆ దాడి ఏదో ఆగింది.
స్థిమితా ప్రశ్నలు ముగించింది.
ఇక నాథ్ అందుకున్నాడు.
“కృతఙ్ఞతలు బ్రాహ్మణోత్తమా! స్థిమితాను రక్షించినందుకు. కానీ, మీరు కూడా స్థిమితాను వీడండి.”
అవతలి స్వరం.. “మరి నా గతి?”
“నా ప్రయత్నం చేస్తాను.”
“నేను భరించలేకున్నాను.”
“కానీ, మీకే ఆపదా తలపెట్టని యువతి. మీ వంటి విద్వద్వరేణ్యులే..” ఆపేశాడు నాథ్.
“మరి ఈ స్త్రీ చేస్తున్న తప్పుడు పనిని ఆపగలవా? దీనివల్ల నాకు కలుగుతున్న లాభాన్ని త్యజిస్తాను. కానీ, ఆరు నెలల కాలంలో నీవు నా సమస్యకు పరిష్కారమందించాలి.”
“ఆ యువతిని మీరు వీడినచో, నేను తప్పక మీ సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తాను.”
“ఆరు నెలలు దాటితే నా బాధ్యత కాదు మరి.”
“అదృష్టం. తప్పక ప్రయత్నిస్తాను.”
“చేయలేనిచో?”
“గలను.”
“సరే! నీ మాట మీద ఈమెను విడిచి పెడుతున్నాను.”
“కృతఙ్ఞడిని.”
ఈ సంభాషణ ముగిసే సరికి నాథ్ ఒంట్లో ఓపిక కొడగట్టిపోయింది. కూర్చున్న చోటే స్పృహకోల్పోయి పడిపోయే ముందు అతి కష్టం మీద అసుందరానికి సిగ్నల్ ఇచ్చాడు.
అక్కడ మీనాక్షికి నాథ్‍తో కనక్షన్ కట్ అయింది. పని ముగిసిందనే అన్న విషయం మాత్రం అగతమైంది. ఎదురుగా ఉన్న తీర్థాన్ని స్వీకరించి సొమ్మసిల్లింది. అత్తగారు ఆమెను నడిపించుకుంటూ ఇంటి లివింగ్ రూమ్ లోకి తీసుకుని వెళ్ళి fan కింద కూర్చోబెట్టి నిమ్మరసం నీళ్ళలో ఉప్పు, పంచదార కలిపి ఇచ్చింది.
5.
అసుందరం కూడా ఇక్కడ నాథ్‍కు అదే పని చేశాడు. పది నిముషాలకు నాథ్ కోలుకున్నాడు. పక్క గదిలో ఉన్న బాత్రూమ్ లో స్నానం కానిచ్చి మామూలు బట్టలలోకి మారాడు. అదే సమయంలో స్థిమితా కూడా హాల్ లోకి వచ్చింది. మిలిందా తన రౌండ్లు ముగించి ఇక్కడకు వచ్చేసింది.
నాథ్‍కు బాగా నీరసంగా ఉంది. అయినా ఇంటికి ఫోన్ చేసి మీనాక్షి వివరాలు కనుక్కున్నాడు. అప్పటికి గంటన్నర పూర్తయింది మీనాక్షి మరో గంట నామ స్మరణ చేయాలి. తల్లి ఆ విషయాన్ని కన్ఫమ్ చేసింది.
“అసలేంటిదంతా? నేను ఏదో సంస్కృతంలో మీరు చెప్పిన ప్రశ్నలు అడిగాను. నాకు ఏవో whisperings వినిపించాయి. అవి ఆగినప్పుడల్లా నేను మరో ప్రశ్న వేసాను. ఇక్కడ మీరు faint అయ్యారు. మధ్యలో ఎవరో బ్లూ శారీలో ఒక యంగ్ లేడీ కనిపించి ఏదో చెప్పింది. అది గుర్తులేదు.” స్థిమితా మాట్లాడుతూ పోయింది.
ఆగమన్నట్లు నాథ్ సైగ చేశాడు. ఇంతలో అసుందరం ముగ్గురికీ కాఫీ అందించి తను కూడా ఒక కప్ తీసుకుని భయంగా ఆసక్తిగా వాళ్ళ వైపు చూస్తూ ఒక కుర్చీలో కూర్చున్నాడు.
“పింగళి కృష్ణ కుమార శర్మ. 19వ శతాబ్దం మొదటిలో వారి తండ్రి పూణే వచ్చి స్థిర పడ్డారు. ఇప్పుడు ఈ ఇల్లు ఉన్న స్థలంలో వారు నివాసం ఉండేది. ఆయన మహోపాసకులు. కానీ చివరి రోజులలో ఆ ఉపాసన ఆపేశారు. కారణం ఆయన కొడుకు మతం పుచ్చుకుని, విదేశీ మహిళను వివాహం చేసుకుని విదేశాలకు వెళ్ళి అక్కడే స్థిరపడ్డాడు. అప్పుడు తండ్రీ కొడుకుల మధ్య జరిగిన ఘర్షణల వల్ల ఆయన కొడుకు తండ్రికి కర్మకాండలు చేయలేదు. తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు కూడా జరుగలేదు. అందుకే ఆయనా, ఆయన భార్యా ప్రేతాలుగా మిగిలారు.
“స్నానం చేశాక తడిబట్టలతో తిరిగేవారు వీరికి ప్రీతికరం. ఆ తడి బట్టల అంచుల లోంచీ వచ్చే నీటిని తాగుతారు. వాటిని ఆశించి ఈ పనులు చేసేవారి మీదకు వస్తారు. అందుకే మీ మీద ఇద్దరు దాడి చేసినట్లు అనిపించేది.”
“నువ్వెలా ఇది తెలుసుకున్నావు నాథ్?” మిలిందా అడిగింది.
“నిప్పు కోసం సిగరెట్ వాడాను కదా. అప్పుడు ఆ వాసన తట్టుకోలేనట్లు శబ్దాలు వినిపించాయి. ఆ పైన తడి శరీరం. తడి బట్టలు. డాన్స్..”
స్థిమితా ప్రశ్నార్థకంగా చూసింది.
“మీరు ఇక ఆ సెమీ న్యూడ్ డాన్స్ ఆపాలి. తడిబట్టతో అలా తిరుగ కూడదు. ఈ రెండూ చేస్తే ఆయన కానీ, ఆయన ధర్మపత్ని కానీ మీ మీదకు రారు.”
తన అలవాటు మానుకోలేనిది అయినా ఇదేమన్నా పని చేస్తుందని ఆశతో సరే! అంది స్థిమితా.
“ఆరు నెలలు టైమ్ ఇచ్చారు. ఈలోగా ఆయన వారసులను పట్టుకుని తర్పణాలు విడిపించాలి. లేదా వారు ఇక్కడే ఉంటారు. ఆ ప్రభావం మీ మీద ఉంటుంది. తీవ్ర అశాంతి రూపంలో. లేదా ఈ ప్రదేశం వీడి వెళ్ళాలి.”
“తర్వాత ఎవరు వచ్చినా ఇదే సమస్య కదా,” మిలిందా మహాజన్ అంది.
“పరిష్కారం ప్రయత్నం చేద్దాం,” స్థిమితా అంటుండగానే నాథ్ కుడి పాదం లోనుంచీ ఒక నల్లటి వేలు పైకి దూసుకువచ్చింది.
రక్తం ఎగజిమ్మింది. నాథ్ కళ్ళు మూసుకుని గట్టిగా అన్నాడు.
మీనాక్షీ!
ఇంతలో మిలిందా తన బందానా తీసి కత్తిరించి నాథ్ పాదానికి కట్టుకట్టింది.
ఇటు నీలపు చీరెలో స్థిమితాకు కనిపించిన మీనాక్షి రూపం ఇక్కడకు వచ్చింది. గది ఎందుకో వెలుతురుతో నిండింది. అక్కడ ఇంట్లో మీనాక్షి శరీరం మళ్ళా చల్లబడింది. చెమటలు ధారలుగా కారుతున్నాయి.
ఇక్కడ నాథ్ చేతులు జోడించి నారసింహ ప్రార్థన చేస్తూ తన శక్తినంతా ఉపయోగించి ఒక ఎన్టిటీని ఒక సీసాలోకి పంపాడు. తన మీద దాడి చేసినది అదే. తనకు మీనాక్షి రూపం సహకరించింది. మిలిందా, అసుందరం, స్థిమితా నోరు తెరుచుకుని చూస్తున్నారు.
“ఈ ఎన్టిటీ ఒక పాతతరపు నటిది. 1970ల కాలం. చాలా పెద్ద కథ. అదొక నవల అవుతుంది. కథలు రాసేందుకే గీతాచార్యకు టైమ్ లేదని గోల పెడుతున్నాడు. నవలైతే నావల్ల కాదంటాడు. So, no questions please,” నాథ్ అన్నాడు. “I’ll take care of this.”
విషయం అర్థమైన మిలిందా నవ్వింది నీరసంగా. అసుందరం సహాయంతో నాథ్ ఆ సీసాను ఇంటి చుట్టూ ఉన్న స్థలంలో దూరంగా పాతి పెట్టాడు. ఆ బ్రాహ్మణుడి మాట వల్ల ఆ స్పిరిట్ ద్వారా తనకు ఆపద కలుగదు అని మాత్రం స్థిమితాకు అర్థమయ్యింది. మిగిలిన విషయాలు పొడిగించలేదు.
Closure
తదనంతరం మాటల మధ్యలో మీనాక్షి ప్రస్తావన వచ్చింది. తనకు Cheongsam అంటే చాలా ఇష్టమని చెప్పాడు నాథ్. మీనాక్షి అందాన్ని చూసి అబ్బురపడిన స్థిమితా నెల తరువాత తన స్నేహితురాలు, ప్రపంచంలో గొప్ప డిజైనర్లలో (couture) ఒకరైన సిమీల్యా మొనాసినీ చేత ఒక కస్టమ్ Cheongsam చేయించి మీనాక్షికి గిఫ్ట్‌గా పంపింది. అది అందే సమయానికి కాలికైన గాయం నుంచీ నాథ్ కోలుకున్నాడు.
మీనాక్షి ఫోన్ చేసి స్థిమితాకు థాంక్స్ చెప్పింది. సంతోషంగా ఫోన్ మాట్లాడి తన సినిమా సెట్‍లో వెనక్కి తిరిగి కేరవాన్ చేరిన స్థిమితాకు..
ఇక ఐదు నెలలు మాత్రమే..!
అన్న మెసేజ్ కనిపించింది.
P.S.: Cheongsam అనేది ఒక విధమైన చైనీస్ డ్రస్. మంచూరియన్ మహిళలు ధరించే clothing. అందమైన పూలతో, డిజైన్లతో శరీరాన్ని పూర్తిగా కప్పుతూ ధరించిన వారి elegance ను పెంచుతుంది. Wong Karwai తీసిన In the Mood for Love సినిమాలో కథానాయిక ఈ Cheongsam లో ప్రత్యేకంగా కనిపిస్తుంది.