పురుషులలోని పైకి కనబడని లైంగిక రాక్షసత్వాన్ని ప్రదర్శించిన కథలు – స్టోమా

1
2

[dropcap]A[/dropcap] stoma is an opening in a person’s belly wall that a surgeon makes in order for waste to leave body when bowel movements are affected.

ఏదైనా కారణం చేత ఒక వ్యక్తి పెద్ద ప్రేగులలో ఏదో భాగాన్ని తొలగించినా, అందువల్ల మల విసర్జన జరగటం కష్టమయినా, పొట్ట గోడపై రంధ్రం చేసి, మల మూత్ర విసర్జన క్రియలను ఆ రంధ్రం ద్వారా జరిగేటట్టు చేస్తారు. మనిషి శరీరానికి ఓ ప్యాకెట్ తగిలిస్తారు. మల, మూత్రాలు శరీరంలో ఏర్పడగానే అవి ఈ ప్యాకెట్‌లోకి వచ్చి చేరుతాయి. వ్యక్తే ఆ పాకెట్లు నిండగానే వాటిని శుభ్రం చేసుకోవాలి. అయితే శరీరం నుండి వ్రేలాడే మల మూత్రాలతో మనిషి ‘కదిలే లెట్రిన్’లా ఉంటాడు. అత్యంత దారుణము, దయనీయము, పగవాడికి కూడా ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి రాకూడదని కోరుకునేంత అసహ్యకరమైన స్థితి ఇది. రచయిత్రి గీతాంజలి రాసిన ‘స్టోమా’ లోని 14 కథలు చదువుతుంటే, రెండు వైపులా మల, మూత్రాలు నిండిన స్టోమా బ్యాగులతో ఉన్న వేలాది, కోట్లాది మనుషుల నడుమ సంచరిస్తున్న భయంకరమైన, జుగుప్సాకరమైన భావన కలుగుతుంది.

‘మనుషులంతా మలమూత్రాల మూటలు’ అన్న వేదాంత వాక్యం ఎంతగా అర్థమయినా, పైన కప్పిన శరీరం ఆ భావనను మరుగు పరిచి పై పై అందానికి భ్రమపడేట్టు చేస్తుంది. అందుకు భిన్నంగా ప్రతి మనిషీ వ్రేలాడే మల, మూత్రాల మూటలలో ‘నడిచే లెట్రిన్’లా దుర్గంధ భూయిష్టంగా ఉంటే? మానవ మనస్తత్వంలో, ముఖ్యంగా, పురుష మనస్తత్వంలో పైకి కనబడని లైంగిక రాక్షసత్వాన్ని, శరీరానికి ఇరువైపులా వ్రేలాడే స్టోమా మూటల్లా బహిరంగంగా, నిక్కచ్చిగా, నిర్దయగా చూపిన కథలివి. ఇవి చదివి భయపడకుండా, ఇందులో ప్రదర్శించిన వికృత మనస్తత్వాల పట్ల జుగుప్స కలగకుండా ఉండగలగటం మనసున్న వారెవరికీ సాధ్యం కాదు. మనస్సాక్షి ఉన్నవారెవరికీ వీలు పడదు. పైగా, ఎలాంటి సందేహం లేకుండా, ఇవన్నీ నిజంగా జరిగిన సంఘటనలు అన్నది తలచుకుంటే బాధ తీవ్రమవుతుంది. ఇందులోని పధ్నాలుగు కథలను ఒకేసారి చదవటం కష్టం. ఒకో కథ చదివి, బాధ, వేదన తగ్గకముందే రెండో కథ ఆరంభిస్తే ‘రేడియోషన్ థెరపీ’ తీసుకుని నిర్ణీత సమయం కాకముందే  మరో డోసు తీసుకున్నట్టుంటుంది. అలా పధ్నాలుగు కథలూ ఒకేసారి చదవటం అంటే….

అయితే ఈ కథలు చదువుతుంటే రచయిత్రి ప్రదర్శించిన life in its rawness అత్యంత తీవ్రమైన ఆలోచనలను కలుగజేసి సెక్స్ అంటేనే విరక్తి కలిగించేట్టున్నా, రచయిత్రి స్త్రీల వేదన పట్ల, వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్న మనుషుల పట్లనే దృష్టి కేంద్రీకరించి ఉంటే కథలు మరింత శక్తివంతంగా ఉండేవి అనిపిస్తుంది. రచయిత్రి కథలలో రాజకీయాలు, సిద్ధాంతాలు, ధర్మదూషణలు తీసుకురావటం వల్ల పాఠకుల దృష్టి అసలు విషయాల నుంచి అనవసరమైన విషయాల వైపు మళ్ళే వీలుంది. దీనికి తోడు కథలలో ప్రత్యక్షంగా కనబడే ద్వేషం, క్రోధం కూడా పాఠకుడిని చకితుడిని చేస్తాయి. రచయిత్రి మానసికవేత్త కాబట్టి, లైంగిక వికృతులు ప్రదర్శిస్తూ, తన స్త్రీని హింసించే అమానుష ప్రవర్తనకు మానసిక కారణాలు, అలాంటి రాక్షస ఆధిక్య ధోరణి వెనుక ఉన్న సామాజిక, మానసిక కారణాలనూ వివరిస్తే కథలకు నిండుతనం రావడమే కాకుండా పాఠకుడికి మానవ మనస్తత్వంపై అవగాహన కలిగే వీలు కూడా ఉండేది. అల్ల కాకుండా కథలన్నీ ఏకపక్ష ధోరణిలో, ఎలాంటి అవగాహన, ఆలోచనలేకుండా పురుషుడన్నవాడు రాక్షసుడే అన్నట్టు రాయటంతో కథలు చదువుతూ తీవ్ర్రమైన వేదనకు గురవుతూ కూడా పాఠకుడు కథలను మనస్ఫూర్తిగా మెచ్చలేకపోతాడు. తాము చెప్పలనుకున్న దాన్ని కొరడాతో ఛెళ్ళుఛెళ్ళు మనిపిస్తూ చెప్పినా, ఒక రచనగా చూస్తే కథారచన శైలి పరంగా చూస్తే కథలు ఏకపక్షంగా వుండి విసుగు కలిగిస్తాయి. అది కథగా ఈ సంపుటిలోని కథలలో లోపం.

ఎందుకంటే, ఈ కథలు చదువుతుంటే స్త్రీ పురుష లైంగిక సంబంధం అంటేనే అసహ్యం, భయం, విరక్తి కలిగే వీలుంది. కానీ ప్రస్తుతం మన చుట్టూ ఉన్న మనుషులను, సమాజంలో జరుగుతున్న విషయాలను, మనుషుల ప్రవర్తనను చూస్తుంటే రచయిత్రి ఇంత నిక్కచ్చిగా రాయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఏనుగును అంకుశంతోటే పొడవాలి. లజ్జ విడిచిన సమాజానికి నీతి వాక్యాలు పనిచేయవు. కడుపు మండే వాడి మంటను గాలి చల్లార్చలేదు. కాబట్టి, రోజూ ఇలాంటి బాధితులను చూస్తు, మానవ దౌష్ట్యానికి బలయిన అబలలను చూస్తూ – నిస్సహాయ ఆక్రోశం, ఆవేదన, క్రోధం అనుభవిస్తున్న వారికి ఇలా రాయాలి, అలా రాయాలి అని చెప్పడం కూడా అనౌచిత్యమే అవుతుంది. ఎడారి వేడి తెలియని వాడు ఎన్నయినా మాట్లాడుతాడు. అనుభవించేవాడికి తెలుస్తుంది.

ఇలాంటి శక్తివంతమైన కథలు రాసిన రచయిత్రిని అభినందిస్తూ నిజాలు భరించలేని వారు, కథలు చదివేముందు ఆలోచించుకోవాల్సి ఉంటుందని చెప్పక తప్పదు. ఈ కథలు చదివిన తర్వాత దృష్టి మారిపోతుంది. మళ్ళీ ప్రపంచాన్ని మామూలుగా చూసేందుకు కాస్త సమయం పడుతుంది. అప్పటివరకూ అనుభవించలేని బాధ, వేదనలను అనుభవించే ధైర్యంవున్న వారు ఈ కథలను చదివేధైర్యం చేయవచ్చు.

***

హస్బండ్ స్టిచ్ -2 స్టోమా

(స్త్రీల విషాద లైంగిక గాథలు)

రచన: గీతాంజలి

ప్రచురణ: వెన్నెల ప్రచురణలు

పేజీలు: 160

వెల: ₹ 150/-

ప్రతులకు: అన్ని పుస్తక విక్రయ కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here