స్త్రీ పర్వం – ఉపాఖ్యానం-1

0
2

శ్రీమదాంధ్ర మహాభారతం – 11 వ పర్వం

స్త్రీ పర్వం – ఉపాఖ్యానం

శ్లో: వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ

నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా

మహాభారతం : ప్రాశస్త్యం

శ్రీమదాంధ్ర మహాభారతం నేటికీ ప్రపంచంలోని గ్రంథాలన్నింటిలోకీ గొప్ప గ్రంథంగా పరిగణించబడుతోంది. మహాభారతం పంచమవేదంగా భారతీయ విజ్ఞాన సర్వస్వంగా ప్రశస్తి పొందిన జాతీయ కావ్యం.

వేద వ్యాసునిచే జయ కావ్యంగా రచించబడి, వైశంపాయనుడు జనమేజయుడికి వివరించినప్పుడు, ఆతడు అడిగిన విశేషములకూ, వెలిబుచ్చిన అనుమానాలకూ వైశంపాయనుడిచ్చిన వివరాలను వ్యాస తాత్పర్యానికి అణుగుణంగా జోడించగా భారతంగా రూపుదిద్దుకుంది. తదుపరి సూత మహర్షి శౌనకాది మునులకు వివరించినప్పుడు, శౌనకాది మునులు వెలిబుచ్చిన అనుమానాల వివరాలను, సూత మహర్షి వ్యాసుని అభిప్రాయాలకి అణుగుణంగా జోడించగా, గ్రంథం పెరిగి మహాభారతంగా ప్రసిధ్ధి పొందింది. జయకావ్యమంటే వ్యాస మునీంద్రుని కవితోద్యానవనంలో పుట్టి పెరిగిన పారిజాతం. మహాభారతమంటే మహేతిహాసం.

పద్యం:

అమితా ఖ్యానక శాఖలం బొలిచి, వేదార్థమల చ్ఛాయమై,

సుమహద్వర్గ చతుష్క పుష్పవితతిన్ శోభిల్లి కృష్ణార్జునో

త్తవం నానాగుణ కీర్తనార్థఫలమై, ద్వైపాయనోద్యాన జా

తమహాభారత పారిజాత మమరున్ ధాత్రీసుర ప్రార్థ్యమై  (ఆది. 1- 66)

తాత్పర్యం:

అనేక ఉపాఖ్యానాలు (కథలు) అనే కొమ్మలతో, ఒప్పి, వేదాలలో అర్థ మనే నిర్మలమైన నీడ కలదై, మంచి గొప్ప నాలుగు పురుషార్థాలు అనే పూవుల సముదాయంతో ప్రకాశించి, కృష్ణార్జునుల యోగ్యాలైన వివిధ సద్గుణాలతో కీర్తించటంవలని మేలు(ఉద్దేశం) అనే పండ్లు కలదై, వ్యాసుడనే ఉద్యానవనంలో పుట్టిన మహాభారతేతిహాసం అనే కల్పవృక్షం బ్రాహ్మణులకు ప్రార్థింప దగినదై అలరారుతుంది.

మహాభారతం భారతీయులకు, అడిగిన కోర్కెలన్నీ అందించే దివ్య వృక్షం పారిజాతంవంటిది. మహాభారత కల్ప వృక్షానికి పూచిన పూలు ధర్మ, అర్థ, కామ మోక్షాలనే పురుషార్థాలు. మానవులు కోరేవి పురుషార్థ ఫలాలు.. వాటికి సంబంధించిన తెలియదగిన విశేషాలన్నింటినీ చెప్పేది మహాభారతం.

వ్యాసమహర్షి విరచిత సంస్కృత మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన వారు కవిత్రయంగా పిలువబడే.. నన్నయ భట్టారకుడు, తిక్కన సోమయాజీ మరియు ఎఱ్రాప్రగ్గడలు. వీరిచే మహాభారతం పదునెనిమిది పర్వాలుగా అనుసృజన చేయబడింది. వీటిలో తిక్కన సోమయాజి అనుసృజన చేసిన పర్వాలలోని ఒక పర్వం, మహాభారతంలో పదకొండవ పర్వం.. స్త్రీ పర్వం.

***

స్త్రీ పర్వం : నాందీ ప్రస్తావన

మహాభారతంలో 18 పర్వాలను 3 భాగాలుగా వ్యవహరించడం జరిగింది.. ఆదిపంచకం, యుద్ధషట్కం & శాంతిసప్తకం. ఈ మూడింటిలోని రెండవ భాగం యుధ్ధషట్కం మరలా రెండు భాగాలు.. భీష్మ ద్రోణ కర్ణ పర్వాలు మొదటి భాగం; శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలు రెండవ భాగం.

నన్నయ తన మాటలలో..

పద్యం:

పర్వుచు స్త్రీ పర్వాదిక I పర్వంబుల నే నిటం గృపాయుతమై స్త్రీ

పర్వంబు పదునొకండగు I పర్వము నా వెలియు సుకవిపండిత సభలన్ (ఆది. 1-56)

తాత్పర్యం:

స్త్రీ పర్వం మొదలైన ఐదు ఉపపర్వాలతో వ్యాపిస్తూ, జాలితో కూడినదై స్త్రీ పర్వమనే ప్రధాన పర్వం 11వ పర్వముగా ఉత్తమ కవిపండితుల సభలలో ప్రసిధ్ధమై ఉంటుందని స్త్రీ పర్వం గురించి తెలుపబడింది.

స్త్రీ పర్వాన్ని సుకవులు, పండితులూ సభలలో మెచ్చుకుంటారనీ అది కృపాయుతమై (దయారసమైనా లేక కరుణ రసమైనా) అయి ఉంటుందనీ పేర్కొన్నాడు.

తిక్కన స్త్రీ పర్వాన్ని కరుణారస సంభరితంగా సంతరించాడు. స్త్రీ పర్వం కరుణరస ప్రధానమని జగద్విదితం.

కరుణానికి స్థాయీ భావం శోకం. ఆత్మీయుల మరణం వలన కలిగిన శోకం రసస్థాయికి చేరుతుంది. స్త్రీ పురుషులలో శోకం సమానమే అయినా స్త్రీలలో సుస్వరంగా రోదించడం, మోహం చెందటం, విలపించటం, ఆయాసపడటం, గుండెలు బాదుకోవటం వంటి చేష్టలు ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. స్త్రీల వాచక అభినయంలో హాహాకారాలూ రోదనలూ, ఆక్రోషాలూ, ప్రలాపాలూ, దీర్ఘ భాషణలూ, దూరాహ్వానాలూ, ఆక్రందనలూ ఉంటాయి.

అలంకార శాస్త్రంలో ఎన్నిరకాల శోకాభినయ విశేషాలు ఉన్నాయో దాదాపు వాటన్నిటికీ తిక్కన విరచిత స్త్రీ పర్వం ససోదాహరణ కావ్యమవడం అపూర్వం.

స్త్రీ పర్వంలో గాంధారి కుమారుల, బంధువుల, శవాలను తానే స్వయంగా దర్శించి దుఃఖించింది. యుధ్ధంలో కోడళ్ళు, సైనికుల భార్యలూ వారి వారి భర్తల శవాలను చూస్తూ విలపిస్తూ పలికిన పలుకులన్నీ తాను విని స్పందించి శ్రీకృష్ణుడికి చెప్పింది.

స్త్రీల రోదనలలో సుస్వర విన్యాసాలు విశేష వృత్తాలలో తిక్కన గాంధారి దృష్టితో చూసి చేసిన వర్ణన సహజంగా సమకూరింది స్త్రీ పర్వంలో.

అంతియే కాక, ఒకానొక సమయంలో ధర్మరాజు శ్రీకృష్ణునితో అనిన..

పద్యం:

పగ యడగించు టెంతయు శుభం ; బది లెస్స ; యడంగునే పగం

బగ? వగ గొన్న మార్కొనక పల్కక యుండగ వచ్చునే? కడుం

దెగ మొదలెత్తిపోవ బగ దీర్పగ వచ్చిన గ్రౌర్య మొందు ; నే

మిగతి దలంచినం బగకు మేలిమి లేమి ధ్రువంబు గేశవా!  (ఉ. 3-21)

తాత్పర్యం:

విరోధాన్ని అణచివేయడం ఎంతో శ్రేయస్కరం. అది మంచి పని. విరోధం వలన విరోధం సమసిపోదు. ఒకరు వైరం వహించి మరొకరికి బాధ కలిగిస్తే , బాధపెట్టిన వాడితో తలపడక ఊరకుండటం శక్యం కాదు. పరమ సాహసంతో తుదముట్ట పగను నిర్మూలించడానికి పూనుకుంటే దారుణ కృత్యాలకు ఒడికట్టవలసి వస్తుంది. కనుక ఎన్ని విధాల ఆలోచించినా పగ వలన కీడే గానీ ప్రయోజనం శూన్యం కృష్ణా! ఇది నిజం.

అనిన పలుకుల సారమున్నూ స్త్రీ పర్వ నిర్మాణానికి ఒక ప్రణాళికలాగా భాసించిందని చెప్పబడింది. ధర్మరాజు పలికిన పలుకే సత్యమైనట్లు తారసిల్లింది.

***

స్త్రీ పర్వం : సార్థక నామధేయం

స్త్రీ పర్వం యుధ్ధపంచకానికి ఒక విధమైన సింహావలోకనం. యుధ్ధ పరిణామ ఫలమైన శోకం ఇందు మూర్తీభవించింది. విజేతల హృదయాలు నిర్భరమైన నిర్వేదానికీ, పశ్చాత్తాపానికీ లోనయ్యాయి. మానవుని శీలపరీక్షకూ, ధర్మనిరతికీ యుక్తాయుక్త విచక్షణకూ క్లిష్టపరిస్థితులు ఒక గీటురాయి. అట్టి పరిస్థితులలోనే వ్యక్తుల నిజస్వరూపం బయటపడుతుంది. భారత పాత్రల బాహ్యాభ్యంతర ప్రవృత్తులు ముఖ్యంగా, యుధ్ధానంతరం, పాండుకుమారులపట్ల ధృతరాష్ట్రుడూ గాంధారీల ద్వేష, క్రోధ పూరిత వర్తనమే ఇందుకు నిదర్శనం. పాండవులు ధృతరాష్ట్రుడిని చూసి జాలిపడ్డారు, గాంధరిని చూసి భయపడ్డారు. స్త్రీ పర్వానికి ధృతరాష్ట్రుడు, గాంధారీ దంపతులు వ్యవహరించిన తీరే ప్రధాన వస్తువు.

స్త్రీ పర్వం యుద్ధభూమి వర్ణనలతోను, పుత్ర పౌత్ర, బంధుజన పరివార మరణానంతరం శోకాల వర్ణనలతోనూ నిండి ఉంది. యుద్ధం తెచ్చే భీభత్సం, తదుపరి వచ్చే శోకం, బాధ, స్త్రీ హృదయం అనుభవించే క్షోభ ఇందులో కళ్ళకు కట్టినట్లుగ వర్ణించబడ్డాయి.

స్త్రీ పర్వంలో వివిధ జాతులకు ప్రాంతాలకూ చెందిన స్త్రీల శోకాన్ని నిశిత దృష్టితో విశ్లేషించడం జరిగింది. అందరూ స్త్రీలే అయినప్పటికీ ఆయా ప్రాంతాలలోని స్త్రీల మానసిక దైహిక వ్యవస్థలోని భేదాలను వారు శోకాన్ని వ్యక్తపరిచే విధానంలోనూ, వ్యక్తీకరణలోని ఆకర్షణనూ కూడా విస్తృతంగా వర్ణించడం జరిగింది.

సమస్త జగత్తును సృజించేవాడూ, భరించేవాడూ, నశింపజేసేవాడూ ఆ సర్వేశ్వరుడే కనుక గాంధారీ ప్రభృతుల శోక రస ప్రవాహంలోనూ భగవంతుడి లీలా స్రవంతి గోచరిస్తుంది. ఇదే స్త్రీ పర్వంలో రమణీయంగా వివిధ రూపాలలో, వివిధ సందర్భాలలో ద్యోతకమవుతుంది.

దుఃఖంలో కూడా ద్వేషం అసూయా పట్టుదలవంటి గుణాలు నశించవు. మనుష్య సహజమైన అజ్ఞానంతో, మమతానుబంధాలు అధికంగా ఉన్న స్త్రీలలో, పగవారిని స్మరించడం, దూషించడం వంటి గుణాలు ప్రస్ఫుటంగా ద్యోతకమవుతాయి కనుకనే ఈ పర్వం స్త్రీ పర్వంగా చెప్పబడింది.

శ్రీకృష్ణుడు, గాంధారివంటి వీరమాతలకు, భానుమతి వంటి వీరపత్నులకు, ఇచ్చిన ఈ శాంతి సందేశం..

పద్యం:

వినుము గాంధారీ! నీ తనయుండు చేయు I దుర్నయములు నెఱుంగవే? నాకు నీకు

శాంతనవునకు నాచార్యునకును బాహ్లి I కునకు దండ్రికి మాన్ప గొలది గాని

దుర్మానమున దొడరి యిట్లయ్యె; మీ I యపరాధమున వచ్చినట్టి కీడు

నకు నింత నొవ్వంగ నను బల్క దగునె? యు I మ్మలికంబు ధృతి బట్టి మాన్పుమింక ;

జేటునకు జావునకు వగ జెందు జనుల I కినుమడింపదె మానసమున నలంత

రాచ కూతుండ్రు సుతుల సంగ్రామ నిరత I హృదయు లగువారి గాంచ గోరుదుర కాదె?’ (స్త్రీ. 2- 167)

తాత్పర్యం:

గాంధారీదేవీ! వినుము! నీ కుమరుడు చేసిన దుర్మార్గమైన పనులు నీకు తెలియనివా? దుర్యోధనుడి దురభిమానాన్ని నేను కాని, నీవు కాని, భీష్మ ద్రోణ, బాహ్లికులు కాని, చివరకు ధృతరాష్ట్ర మహారాజు కాని మాన్పలేకపోయాము. ఆ దురభిమానంతో చేసిన పనుల పర్యవసానంగానే అతడికి ఈనాడు ఈ దశ వచ్చింది. మీ తప్పువలన వచ్చిన చేటుకు బాధ్యుడిని నేనని నన్ను నొప్పించేటట్లు ఇట్లా మాట్లాడటం న్యాయమా? ఇకనైనా ధైర్యం అవలంబించి నీ శోకాన్ని దూరం చేసికొమ్ము. కీడుకు, చావుకు ఏ మానవులు శోకిస్తారో వారి దుఃఖం రెండింతలవుతుంది తప్ప ఉపశమించదు. రాజుల కుమార్తెలు యుద్ధంలో అంకితమైన హృదయం కలవారిని కుమారులుగా పొందాలని కోరుకుంటారు కదా! … స్త్రీ పర్వానికి భరత వాక్యం వంటిది.

***

స్త్రీ పర్వం : అశ్వాసాలు

తిక్కన అనుసృజిత స్త్రీ పర్వం రెండు ఆశ్వాసాలలో లిఖించబడింది – ప్రథమాశ్వాసం & ద్వితీయాశ్వాసం.

ప్రథమాశ్వాసం ప్రధానంగా ధృతరాష్ట్ర విలాపమయం. అతని విలాపంలో అంతర్వాహినిగా పాండవ ద్వేషం గోచరమవుతుంది. పుత్రశోకంతో విలపిస్తున్న ధృతరాష్ట్రుడిని సంజయుడు, విదురుడూ, కృష్ణద్వైపాయనుడు ఓదార్చడం, గాంధారి దుఃఖాన్నీ కోపాన్నీ విదురుడూ, వ్యాసుడూ, శ్రీకృష్ణుడూ ఉపశమింపజేయడం వివరించబడింది.

ద్వితీయాశ్వాసం అంతా గాంధారీ విలాపమయం. ఆమె మనసు శుద్ధ కరుణమయం. గాంధారి, తనకు ప్రసాదించబడిన దివ్యదృష్టితో యుధ్ధభూమి వీక్షించి, శవాలపైబడి రోదిస్తున్న స్త్రీల ఆర్తనాదాలు చూసీ, వినీ ఒకరొకరిగా మృతవీరుల పేర్లను ఉచ్చరిస్తూ తలుచుకుని, స్పందించి శోకించడం కడు విస్తారంగా విపులీకరించబడింది.

స్త్రీ పర్వంలో ధృతరాష్ట్రుడూ గాంధారీల గురించి అధికంగా ప్రస్తావించబడినప్పటికీ గాంధారికే విశిష్ఠ స్థానం కల్పించబడింది. గాంధారి శాపానుగ్రహశక్తియుక్తురాలైన స్త్రీ. ఆమెతో సహా అందరు స్త్రీలూ ఒకే రకమైన దుఃఖంతో కుమిలిపోతున్నవారే! కౌరవసామ్రాజ్య మహారాణి అయినప్పటికీ ‘మాకు జరిగిన ఈ అన్యాయానికి పాండవులా, కౌరవులా, ధృతరాష్ట్రుడా, నీవా లేక జగదోధ్ధారకుడైన శ్రీకృష్ణుడా? ఎవరు కారణ’మని పరిజనం ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని స్థితి ఆమెది. అటువంటి శోకపరితప్త స్త్రీల హృదయ ఘోషకి, వారి మనోభావాలకు దర్పణం స్త్రీ పర్వం.

స్త్రీ పర్వం గురించిన విపులీకరణకు ముందు మహాభారతంలోని కొన్ని అత్యంత ప్రధాన స్త్రీ పాత్రలు గాంధారి, కుంతి, ద్రౌపది, భానుమతి, ఉత్తర, దుస్సల ల లఘు పరిచయం..

గాంధారి: ఈమె గాంధార రాజ్యాన్ని పరిపాలించిన సుబలుడి కుమార్తె. ఈమె అత్యంత సౌందర్యవతీ గుణవతీ కూడా. ఈమె తమ్ముడు శకుని. గాంధారి గురించి విని భీష్ముడు, ధృతరాష్ట్రునికీ గాంధారికీ వివాహం జరిపించాడు. ధృతరాష్ట్రుడు పుట్టు గుడ్డి అని తెలుసుకుని గాంధారి కూడా జీవితాంతమూ కంటికి గంతలు కట్టుకుంది. ధృతరాష్ట్రుడూ గాంధారి దంపతులకు నూర్గురు కుమారులూ, ఒక కుమార్తె.

కుంతి: ఈమె యాదవ కులస్థుడైన కుంతిభోజుని కుమార్తె. ఈమె అసలు పేరు పృథ. కురు వంశస్థుడైన పాండురాజుని వివాహమాడింది. కుంతి, శ్రీకృష్ణుని మేనత్త అనగా వసుదేవుని చెల్లెలు. పాండురాజు రెండవ భార్య మాద్రి. పాండురాజుకు కుంతీ, మాద్రిల ద్వారా కలిగిన సంతానం ఐదుగురు కుమారులు, వీరే పాండవులు.

ద్రౌపది: ఈమె పాండవ పత్ని. అబల రూపంలో అవతరించిన అహంకార శక్తి. ధర్మరాజు యొక్క జ్ఞానశక్తిని, భీమాదుల క్రియాశక్తినీ తన ఇచ్ఛాశక్తితో నడిపించిన నారీమూర్తి. ఈమె పాంచాల రాజు ద్రుపదుడి కుమార్తె. ఈమె ప్రధానంగా కార్యశూరురాలు. జ్వాలవలె తనలో భక్తిజ్ఞానాలను పండించుకున్న పరిణత మూర్తి. భక్తిజ్ఞానాలున్నా అనవరతం అవమానాజ్ఞితో జ్వలిస్తూ శత్రుశేషం లేకుండా సంహార యజ్ఞం సాగించిన సాహసురాలు. కర్మ మార్గావలంబిని.

ఉత్తర: ఉత్తర విరాటరాజు కుమార్తె. ఈమె సోదరుడు ఉత్తర కుమారుడు. ఉత్తర, అర్జునుని పుత్రుడైన అభిమన్యుని భార్య. ఉత్తరాభిమన్యుల కుమారుడే పరీక్షిత్తు. ఈతడు పాండవుల తదనంతరం హస్తినాపురాన్ని సుమారు అరువది యేడు సంవత్సరములు పాలించాడు. అభిమన్యుడు కురుక్షేత్ర యుధ్ధంలో మరణించే నాటికి ఉత్తర గర్భవతి.

దుస్సల: ధృతరాష్ట్రుడు గాంధారి దంపతుల ఒక్కగానొక్క కూతురు, కౌరవుల సోదరి దుస్సల. ఈమె సింధుదేశాన్నిపరిపాలించిన జయధ్రధుని (సైంధవుని) భార్య. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు, సైంధవుడిని సంహరించాడు.

భానుమతి: ఈమె దుర్యోధనుని భార్య. కాంభోజ రాజ కుమారి. ఈమెను కాశీరాజు చిత్రాంగదుని కుమార్తెగా కూడా అక్కడక్కడా ప్రస్తావించడం జరిగింది. ఈమె తండ్రి ద్రోణాచార్యుని మిత్రుడు.

***

ప్రథమాశ్వాసం : విశ్లేషణాత్మక వివరణ

ధార్మిక శక్తులకు అధర్మ శక్తులకు మధ్య జరిగిన కురుక్షేత్ర సంగ్రామములో ధర్మనిరతులైన పాండవులకు విజయం లభించగా అధర్మవర్తనులైన కౌరవులు ఘోర పరాజయం పొందారు. కురుక్షేత్ర మహా సంగ్రామములో గాంధారి నూర్గురు కుమారులే కాక పలువురు కౌరవులు, కౌరవేతరులూ, కొందరు పాండవపక్షం వారితో సహా సుమారు 76 కోట్లమందికి పైగా వీరమరణం పొందారు.

ధృతరాష్ట్రుడు పుట్టుగుడ్డి. అందువలన యుధ్ధారంభంలో రణరంగంలో జరిగే సన్నివేశాలను దర్శించడానికి వ్యాసుడు దివ్యదృష్టిని ఇస్తానన్నా కుమారుల క్రూరత్వాన్ని చూడలేననీ వలదనీ అన్నాడు ధృతరాష్ట్రుడు. అంతట సంజయుడికి దివ్యదృష్టిని ప్రసాదించాడు వ్యాసుడు. అప్పుడు సంజయుడు  హస్తినాపురము నుండే, దివ్యదృష్టితో, యుధ్ధ విశేషాలను కాంచి ధృతరాష్ట్రునికి చెప్పసాగాడు.

అలా సంజయుని ముఖతః యుధ్ధ విశేషాలను వింటున్న ధృతరాష్ట్రుడు, తన పుత్రులు నూర్గురూ, అల్లుడు (కుమార్తె దుస్సల భర్త) మరణించారని తెలుసుకుని కొమ్మలన్నీ త్రుంచివేయగా మిగిలిన మోడు వారిన చెట్టు మాదిరి మాటాపలుకూ లేకుండా అయిపోయి, దుఃఖాతిశయంతో సొమ్మసిల్లి కొంత సమయానికి పరిచారికల సేవలతో తేరుకున్నాడు.

అప్పుడు సంజయుడు ఇలా అన్నాడు..

పద్యం:

నీకు నితరులట్ల శోకింపదగునె? యె I వ్వరి దలంచి యింక వనరువాడ

వీవు? శోకమునకు నెయ్యది తుది? యిది I వలవు దుడుగు వినుము వసుమతీశ!

పదునెనిమిది యక్షౌహిణులు సమసె బితామహ పితృభ్రాతృ పుత్ర పౌత్ర సఖి సుహృత్సహాయులుందెగి

రందు వగపునకుం బనిగాని వారలు గలరే? యేది కొలందిగా వగచె దందఱకు నగ్నికార్యము నిర్వర్తింపను

 దగిన వారలకుం దిలోదక ప్రదానంబులు సేయను వలయు బొలిగలనికి వేంచేయు’ మనుటయు (స్త్రీ.1-6,7)

తాత్పర్యము:

ఓ! రాజా! నీవు జ్ఞానవంతుడివి అయిన పామరుడివలె దుఃఖిస్తున్నావు! ఇది తగిన పనేనా? అందరూ పోయారు. ఇక నీవు ఎవరిని గురించి బాధపడుతావు? నీ బాధకు అంతముంటుందా! ఇట్లా శోకించటం తగనిపని. దుఃఖాన్ని వదిలి పెట్టుము నేను చెప్పేది వినుము.

పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యమంతా నశించింది. తాతలు, తండ్రులు, కొడుకులు, అన్నదమ్ములు, మనుమలు, సన్నిహితులు, స్నేహితులు, సదా తోడుగా పని చేసిన వారు – అందరూ చచ్చిపోయారు. వీరిలో దుఃఖించటానికి తగనివారెవ్వరు? అందరిని గురించీ శోకించవచ్చును. ఇక దేనిగురించి ఏడుస్తావు రాజా! ఇక ఏడుస్తూ కూర్చొనవద్దు. యుధ్ధంలో చనిపోయిన వారందరికీ దహన సంస్కారాలు చేయాలి’ సన్నిహిత బంధువర్గానికి తిలోదక ప్రదానం చేయాలి. కాబట్టి సకుంటుంబంగా యుధ్ధభూమికి బయలుదేరండి..

లౌకిక నీతివాదాన్ని ప్రమాణంగా తీసుకుని హితవు చెప్పాడు. దుర్యోధనాదుల దుర్వర్తనమూ, ధృతరాష్ట్రుడి లోభగుణాన్నీ విమర్శించి, స్వయం కృతాపరాథం వలన కలిగిన విపత్తుకు దుఃఖించడం గతజల సేతు బంధనంవంటిదనీ, హాస్యాస్పదమనీ హెచ్చరించాడు.

శోకము మాని మరణించినవారికి తర్పణాలు వదలడానికి యుధ్ధభూమికి కదలమని అన్నాడు. ఆ మాటలు విని ధృతరాష్ట్రుడు పెద్ద శోకసముద్రంలో మునిగిపోయాడు.

ధైర్యం కోల్పోయి భయంకర తాకిడికి నేలకూలిన చెట్టువలె పడిపోయి, కొంతసేపటికి తేరుకుని సంజయునితో ఇలా అన్నాడు ధృతరాష్ట్రుడు : యుధ్ధాన్ని నివారించడానికి రాయబారం జరిగినప్పుడు..

పద్యం:

సంధికి కృష్ణుండు సనుదెంచి పెక్కుభం I గుల జెప్ప భీష్ముండు గుంభజుండు

నట్లు హితార్థులై యంతలంతలు మాట I లాడిరి జామదగ్న్యాదులైన

మునివరు లవ్విధంబున నొత్తి చెప్పి రా I బుధ్ధులన్నియు దుర్బుధ్ధి నగుట

బాటింపనైతి లోభమున బాండు నృపాలు I పాలు తత్సుతులకు బంచి యీని

 

నా కతంబున బొలిసిరి నందనులును I జెలులు జుట్టంబులును సహాయులును ధైర్య

మెట్లు గలుగు వైదికముల కెట్లు మనసు I గొలుపు బ్రాణంబుతో నెట్లు నిలువ వచ్చు  (స్త్రీ. 1-12)

తాత్పర్యం:

ఆనాడు రాయబారం కోసం శ్రీకృష్ణుడు వచ్చి యుద్ధం ఎన్నో విధాలుగా నాశకరమని చెప్పాడు. భీష్మ ద్రోణులూ ఇట్లాగే చెప్పారు. పరశురాముడూ మునులూ ఎన్నో హితోక్తులు చెప్పారు. కాని, లోభగుణం చేత పుత్రుల మీద మమకరం చేత ఏ మాటలూ విన్నవాడిని కాను. పాండుకుమారులకు రాజ్య భాగం ఇవ్వకపోతిని. నా కారణం వలననే నా కొడుకులూ, చుట్టాలూ, స్నేహితులూ, సహచరులు అందరూ చనిపోయారు. ఇక నాకు ధైర్యం ఎట్లా ఉంటుంది? వైదిక కర్మకాండ వైపు మనసు ఎట్లా పోతుంది? అసలు బ్రతకడం ఎట్లా?..

అంటూ పలు విధాల దుఃఖించాడు ధృతరాష్ట్రుడు. అది చూసి..

పద్యం:

వగచిన బోయిన కార్యము I మగుడునె? వగవంగ లోకమాన్యుండగునే?

వగ పుణ్యగతికి మూలమే I వగ పెల్లవిధముల నుడుగ వలయు నరేంద్రా! (స్త్రీ. 1-20)

తాత్పర్యం:

ఏడిస్తే ఒకసారి జరిగిపోయిన పని మళ్ళీ తిరిగి వస్తుందా? (చనిపోయినవారు మరలి వస్తారా?) ఏడిస్తే లోకం (నిన్ను) గౌరవిస్తుందా? నీవు ఏడవడం వలన చనిపోయినవారికి పుణ్యగతి కలుగుతుందా? అందుచేత బాధపడుతూ కూర్చొనటం ఏ విధంగానూ మంచిది కాదు. కనుక రాజా! దుఃఖించటం మానివేయుము.. అని సంజయుడు ఉపదేశమిచ్చాడు.

తదుపరి విదురుడు ఇలా అన్నాడు..

పద్యం:

చింతాపర్వతంబున జెందు దుఃఖా I క్రాంతత్వ ముర్వీశ్వర! కాన గీడుం

జింతింప డార్యాత్ము డచింతనుండై I యంతః పరీతాపము నార్పజాలున్.  (స్త్రీ. 1- 29)

తాత్పర్యము:

ఓ రాజా! ఊరికే చింతిస్తూ కూర్చుంటే నిన్ను దుఃఖం ఆక్రమిస్తుంది. దాని వలన అనర్థమే తప్ప మంచిది కాదు. అందుకే పుణ్యాత్ముడు ఎప్పుడూ చింత చేస్తూ కూర్చోడు. చింతను వదిలి, క్రియాశీలుడై లోపల ఉన్న బాధ అనేటటువంటి అగ్నిని వివేకమనే శక్తితో ఆర్పివేయగలుగుతాడు.

ఇంకా, ప్రపంచంలో వైకుంఠప్రాప్తి పొందగలవారు ఇరువురే పరివ్రాజకుడు (అష్టాంగ యోగంతో తనువును స్వతంత్రంగా త్యజించగలవాడు) యోధుడు(యుద్ధంలో ఎదురొడ్డి నిలిచి మరణించినవాడు). నీ కొడుకులు యోధులు కనుక వారు పుణ్యాత్ములు. అందువలన నీవు దుఃఖింప తగదని ధృతరాష్ట్రుడిని ఓదార్చి, జీవన్మరణ చక్రాన్ని విశదీకరిస్తూ “మృత్యువు మనిషికి సహజమైన ధర్మం, అది తప్పించటానికి వీలుకాదు. ఈ శరీరాన్ని వదిలి మరో శరీరాన్ని ధరించటమే మరణమంటే. ఎన్నో విధాలైన దుఃఖాలకు నిలయమైన ఈ జీవితం యముడి అధీనములో ఉంటుంది. యమపాశం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. పుణ్యాత్ములు వివేకమనే మందుతో శరీరమనే ఈ తేరును అధీనంలో ఉంచుకుంటారు. తేరు పగ్గాలను, నడవడి అనే ఉపాయంతో నియంత్రించి గుర్రాలను అదుపులో ఉంచుకుంటారు. కనుకనే వారు పుట్టుక మరణం మొదలగు వాటివలన కలిగే భయాలను విడిచిపెట్టి మోక్ష సుఖాన్నిపొందుతారు. కనుక నీవు ఇది గుర్తించి నీ పుత్రులకూ దాయాదులకూ ఉత్తరక్రియలు జరిపించి సుఖముగా ఉండుము” అని ఉపదేశించాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here