Site icon Sanchika

స్త్రీ పర్వం – ఉపాఖ్యానం-2

[dropcap]అ[/dropcap]యితే ఆ ఉపదేశంలోని ‘పుత్రులకు ఉత్తర క్రియలు’ అను పలుకులు కర్ణకఠోరంగా అనిపించి మనసున ములుకులై గ్రుచ్చుకొనగా ధృతరాష్ట్రుడు తిరిగి మూర్ఛిల్లాడు. అదే సమయానికి వ్యాసమహర్షి అక్కడికి రావడం సంభవించింది. అప్పటికి పరిచర్యల వలన సేదదీరిన ధృతరాష్ట్రుని చూసి వ్యాస మహర్షి ఇలా అన్నాడు..

పద్యం:

నీవు ధర్మభంగి నెరుగ నేర్తు నీతి కౌశలం I బావహిల్లు నీదు మనమునందు గాన నేను శో

కావిలత్వ ముడుపబూని యరుగుదెంచితిన్ సుతా I భావజనిత దుఃఖవార్థిపార మెయ్దు పుత్రకా! (స్త్రీ. 1- 66)

భూతము లనిత్యములు నీ I వీ తెరువెప్పుడును విం దహీన ధృతిన్ నీ

చేతోగతి నలవఱుపుము I భూతా నిత్యత్వ మదియుపుచ్చున్ వగలన్! (స్త్రీ. 1- 67)

తాత్పర్యము:

కుమారా నీవు ధర్మ విధి నెరిగిన వాడవు! నీవు నీతిశాస్త్ర కుశలుడవు. అందుచేత నీకు శోకాన్ని పోగొట్టి శాంతిని ప్రసాదించాలని నేను వచ్చాను. పుత్రుల మరణంచేత పుట్టిన దుఃఖ సముద్రాన్ని దాటి శాంతిని పొందుము.(66)

ప్రాణులు అన్నీ అశాశ్వతాలే. ఈ ధర్మాన్ని గురించి నీవు ఎప్పుడూ వింటూనే ఉన్నావు. గొప్ప ధైర్యంతో నీ మనసులో ప్రాణులు అశాశ్వతమనే ఈ ధర్మాన్ని అభ్యసించటం మొదలు పెట్టుము. ఆ జ్ఞానమే నీ దుఃఖాన్ని పోగొట్టుతుంది. (67)

అంతియేకాక ‘నీ కుమారులు తాము చేసిన తప్పులతో తాము కాలిపోయి నశించారు. అట్లాంటి వారికోసం నీవు నీ మనస్సును ఇట్లా శోకాగ్నిలో దహించివేయడం తగిన పనికాదు. దైవసంకల్పాన్నీ విధివ్రాతనూ ఎవ్వరూ తప్పించలేరు కనుక కన్నబిడ్డలకు ఉత్తరక్రియలు సలిపి పాండవులను పుత్రులుగా స్వీకరించి అశీర్వదించుము’ అని వ్యాసమహర్షి చేసిన బోధలు కొంత ఉపశమనం కలిగించి మనస్సుకు ప్రశాంతత చేకూర్చగా యుధ్ధభూమికి బయలుదేరాడు ధృతరాష్ట్రుడు.

శోకాతిరేకంతో అడుగులు తడబడుతుండగా గాంధారి కూడా పరిచారికలు వెంటరాగా భర్తను అనుసరించింది. ఆమెను వెన్నంటి ఆమె నూర్గురు కోడళ్ళు మాత్రమే కాక కౌరవుల తరఫున యుధ్ధం చేసి ప్రాణాలు కోల్పోయిన సైనికుల భార్యలూ భరింపరాని దుఃఖంతో అతిదీనంగా విలపిస్తూ, గాంధారి నాయకత్వంలో, వారికై ఏర్పాటుచేయబడిన వాహనాలలోనూ; ఆ వెనుక విదురుడు, మనుమలనూ, మునిమనుమలనూ కోల్పోయిన కుంతీదేవినీ, కుమారులందరినీ కోల్పోయిన ద్రౌపదినీ పిలుచుకుని సంజయుడు వెంటరాగా, యుధ్ధంలో వీరగతిని పొందిన తమ కుటుంబీకుల విగత శరీరాలను కడసారి కాంచి అశ్రు తర్పణం చేయడానికి, యుధ్ధభూమికి బయలుదేరారు. స్త్రీల ఏడుపులు పెడబొబ్బలతో పరిసరాలు మారు మ్రోగిపోయాయి. చిన్నాపెద్దా అందరూ శోకసముద్రంలో మునిగిపోయారు. ప్రళయకాలంలో మంటలలో చిక్కుకున్న జంతువులవలే ఆ స్త్రీలందరూ రోదిస్తున్నారు.

వీరంతా ప్రయాణించి కొంత దూరం వెళ్ళగానే, వీరికి అశ్వత్థామ, కృపాచార్యుడూ, కృతవర్మా ఎదురయ్యారు. పుత్రులను కోల్పోయి శోక దేవతలా ఉన్న గాంధారిని చూసి, దుఃఖం అతిశయించగా కృపాచార్యుడు

పద్యం:

భవదీయ సూను లరి సైన్య పంజ్ఞ్తి గొని కాల్చిరెల్ల బొగడన్

వివిధాస్త్ర శస్త్రమయ సాంద్రవృష్టి దెగటాఱి పెంపు మిగులన్

దివికేగి యందు మహనీయ తేజ మెసగంగ హృద్యబలభి

ద్ధ్రువ సౌఖ్యసంపదలు గాంచి సంతోషమున దేలి రేల వగవన్? (స్త్రీ. 1- 108)

తాత్పర్యము:

గాంధారీ! నీ పుత్రులందరూ శత్రు సైన్యమును అందరూ ప్రశంసించే రీతిలో ధ్వంసం చేసారు. వివిధ శస్త్రాస్త్రమయమైన ఆయుధ వర్షంలో అందరూ చనిపోయి అతిశయించిన గౌరవంతో స్వర్గానికి వెళ్ళి అక్కడ గొప్పకాంతితో మనోహరమైన నిరంతర స్వర్గ సుఖాలను పొంది సంతోష సాగరంలో తేలుతున్నారు. అట్లాంటి వారి గురించి చింతించటం తగదుఅనియునూ ఇంకా ఎవరూ యుద్ధభూమి నుండి మరలిపోలేదు. కనుకనే వారికి స్వర్గ ప్రాప్తి కలిగింది. కావున నీవు చింతించవలదు

..అని ఓదార్చి, తామునూ అందుకు ప్రతీకారంగా ద్రౌపది కుమారులందరినీ హతమార్చామనీ, కనుక పాండవులు తమను వెదుకుతూ రాగలరనీ, వారి బారిన పడకుండా తమను తాము కాపాడుకోవాలి కనుక తమకు అనుమతి ఇమ్మనీ కోరి అశ్వథ్థామ, కృతవర్మతో కలిసి వెళ్ళిపోయాడు.

పుత్ర పౌత్రుల మరణం గాంధారికి శోకమెంత కలిగించిందో అంతకుమించి క్రోధాన్ని కూడా కలిగించింది. పాండవులు తన కుమారులలో ఒక్కడిని కూడ మిగల్చకుండా అందరినీ నిర్దాక్షిణ్యంగా హతమార్చారని, గర్భశోకాన్ని మించి క్రోధం ఆమె మనసును దహించింది.

కుమారులందరినీ కోల్పోయి శోకసముద్రంలో మునిగి ఉన్న ద్రౌపదికి అశ్వథ్థామ శిరము పైనున్న శిరోమణిని తెచ్చి ఇచ్చి ఉపశమింపజేసే ప్రయత్నంలో ఉన్న ధర్మరాజుకి, ధృతరాష్ట్రుడు యుధ్ధభూమికి వస్తున్నాడని తెలిసింది.

తాను దుఃఖంతో విలవిలలాడుతున్నా, నూర్గురు కుమారులను పోగొట్టుకున్న పెదతండ్రిని తలచుకుని కనికరంతో హృదయం ఆర్ద్రమైపోగా ధృతరాష్ట్రుని ఓదార్చడం తన అవశ్య కర్తవ్యం అని శ్రీకృష్ణునికి తెలిపి బయలుదేరాడు ధర్మరాజు. తక్కిన పాండవాదులు ఆయనను అనుసరించారు. ద్రౌపది కూడా మిక్కిలి దుఃఖంతో బంధు స్త్రీలు వెంటరాగా ధర్మరాజుని అనుసరించింది.

‘బంధుమిత్ర పరివారాన్నంతా సంహరించి నీ వాళ్ళను కూడా పోగొట్టుకుని యుధ్ధం గెలిచి ఏమి సాధించావని?’ భర్తలను కోల్పోయిన కౌరవ స్త్రీలు బాధ తప్త హృదయాలతో హాహాకారాలు చేస్తూ పలికిన నిందా వాక్కులు మౌనంగా భరించి, ధృతరాష్ట్రుని పాదాలకు నమస్కరించాడు ధర్మరాజు.

దుఃఖాలన్నింటిలోనూ సంతానాన్ని పోగొట్టుకున్న దుఃఖంనుంచి ఉపశమనం కలగడానికి చాలా సమయం పడుతుందన్నది గాంధారీ ధృతరాష్ట్రులను కాంచితే స్పష్టమవుతుంది. ఇంత అనర్థం జరిగిన పిదప కూడా అతి భయంకరమైన కోపాగ్నితో, భీముని చంపడానికి ప్రయత్నించిన ధృతరాష్ట్రునితో..

పద్యం:

జగతీశ వేదముల్ సదివితి శాస్త్రముల్ I వింటి వర్తిల్లితి వృధ్ధగోష్ఠి

నఖిలపురాణ పర్యాలోచనము సేసి I తెల్ల ధర్మంబులు నెఱుగు దిట్లు

నీ తప్పు దలపక నెవ్వగు బొందెదు I కనలేద వేను శంతనసుతుండు

గురుడును విదురుండు గూర్కొని కూర్కొని I చెవుల బోయమె సవిశేషకార్య

వచనములు? సంజయుడు పెక్కువరుస లుభయ I బల విధంబులు దెలియగ బలుక డెట్లు?

నీకు నా బుధ్ధులన్నియు నెమ్మమున I జేర్ప బోలవ యింకేమి సేయవచ్చు? (స్త్రీ. 1- 142)

తాత్పర్యం:

ఓ రాజా! నీవు వేదాలు చదివిన వాడివి. శాస్త్రాలు విన్నావు. పెద్దల చర్చలలో పాల్గొన్నవాడివి. అన్ని పురాణాలనూ అవలోకనం చేసి వాటి సారాన్ని గ్రహించినవాడివి. అన్ని ధర్మాలను ఎరిగినవాడివి. ఈ రీతిగా నీ తప్పును నీవు గుర్తించకుండా ఊరికే దుఃఖాన్ని పొందుతున్నావు. కోపపడుతున్నావు. నేను, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు ఎన్ని మార్లు ఏం చేయాలో ఎట్లా చేయాలో నీ చెవుల్లో కూరి కూరి నూరిపోసాము కదా! సంజయుడు కురుపాండవ బలాలలోని తేడాలను ఎన్ని సార్లు నీకు వివరంగా చెప్పలేదు? ఆ బుద్ధులన్నీ నీమనసులో ఏమాత్రం దూరలేకపోయాయి. ఇక మనం ఏమి చేయగలం? నీ కుమారుల దురాగతాలన్నీ తెలిసి ఉండి కూడా భీముని చంపజూడడం, పాండవులను దూషించడం భావ్యం కాదని హితవు పలికాడు శ్రీకృష్ణుడు.

అంతట శ్రీకృష్ణునికి నమస్కరించి ధృతరాష్ట్రుడు

పద్యం:

తెలిసితి నీ మాటల బు I త్రుల దెస నెవ్వగ నెల్ల దొఱగి యనుజ పు

త్రుల నాకు బ్రియ మొనర్పం I గలవారుగ నడచువాడ గంసారాతీ! (స్త్రీ. 1- 149)

తాత్పర్యం:

ఓ కంస వైరీ! నీ మాటల చేత తెలివిని పొందాను. నా కొడుకుల విషయంలో పడుతున్న బాధను ఇక వదిలి వేస్తాను. నా తమ్ముని కుమారులే ఇక నాకు సంతోషం కలిగించేవారుగా ఇక నేను నడుచుకొంటాను.

..అని తెలిపి పాండుకుమారులందరినీ కౌగలించుకుని దీవించాడు. యుధ్ధానంతరం ప్రాణాలతో మిగిలిన తన మరియొక కుమారుడు యుయుత్సుడిని(ధృతరాష్ట్రునికి వైశ్య కన్య ద్వారా కలిగిన కుమారుడు) కౌగలించుకుని ఆనందం పొందాడు.

ధృతరాష్ట్రుని సూచన మేరకు పెదతల్లి గాంధారిని దర్శించ వెళ్ళారు ధర్మరాజాదులు. ఆతడి వల్లనే తాను కుమారులను కోల్పోయానని ఆగ్రహించిన గాంధారి, ధర్మరాజుని శపించబోగా వ్యాస మహర్షి అడ్డుపడి

పద్యం:

పాండవేయాగ్రజుపై నల్క మానుము I రాజసంబేల? యీ రాజు ధర్మ

పరుడు నీ వించుక పాటించి వినవమ్మ I చెప్పెద గౌరవశ్రేష్ఠు డనికి

జనుచుండి తల్లి! దీనవ యిమ్ము జయముగా I నాకని పలికిన నా కుమారు

తోడ నీ పేర్మికి నీడుగా గొడుక! యె I క్కడనుండు ధర్మమ క్కడకు జయము

 

సేరు ననవె? భూరి ఘోర యుద్ధంబున I గెలుపు గొనిరి గాన తలప ధర్మ

పరుల కాగవలయు బాండు తనూజు ల I సూయ లేని బుధ్ధి జూడు మెట్లు” (స్త్రీ.1- 151)

తాత్పర్యం:

తల్లీ! ధర్మరాజు మీద కోపం విడిచిపెట్టుము. ఈ రజో గుణం ఇంకా నీకెందుకు? ఈ ధర్మరాజు ధర్మదీక్ష కలవాడు. అందుచేత నీవు, నేను చెప్పబోయే మాటలను శ్రధ్ధతో వినుము. నీ కుమారుడు దుర్యోధనుడు యుధ్ధభూమికి వెళ్ళబోతూ నాకు విజయం సిధ్ధించేటట్లు అశీర్వదించుముఅని అడిగినప్పుడు నీ పుత్రాభిమానాన్ని అటుంచి నాయనా ధర్మమెక్కడో జయమక్కడికే చేరుతుందని చెప్పావు కదా! మహాఘోరమైన యుధ్ధంలో పాండవులు గెలిచి బైటపడ్డారు. అందుచేత బాగా ఆలోచించి ధర్మదీక్షతో గెలిచిన వీరిని సహించుము. ఆశ్రయమిమ్ము. ఏ విధంగానైనా అన్యాయం లేని బుధ్ధితో ఆలోచించుము. నీకే అర్థమవుతుంది” ..అని తెలిపి నీవు ఇప్పుడైనా మాతృధర్మాన్ని అవలంబించి నీ కుమారులైన పాండవులపై ఉన్న రోషాన్నిపోగొట్టుకొనుముఅని హితం చెప్పాడు.

దుర్యోధనుడికిచ్చిన ఆశీర్వచనంలోనే తన కుమారులు ధర్మ పక్షాన లేరన్న నిజం గాంధారికి తెలుసన్నది విదితమవుతుంది.

అంతట గాంధారి – యుధ్ధంలో భీముడు అధర్మ మార్గంలో తన కుమారుడు దుర్యోధనుడిని చంపడం, దుశ్శాసనుని చంపి రక్తం త్రాగడం అన్యాయం కాదా, పరాక్రమవంతులైన వాళ్లు యుద్ధ నియమాలను ఉల్లంఘించిఏ కోపం రావదం సహజమే కదా? – అని మహర్షిని ప్రశ్నించింది.

అప్పుడు భీముడు స్పందించి, భయంతో పెద తల్లికి నమస్కరించి “తల్లీ! నీ కుమారుడు నిండు సభలో ద్రౌపదిని అవమానించినందుకు ప్రతీకారం చేస్తానని ప్రతిజ్ఞ పూనాననీ అది నెరవేర్చేందుకే దుర్యోధనునీ, దుశ్శాశనునీ ఆ విధంగా చంపవలసి వచ్చిందని, మంచి చెడులు తెలిసిన దానివిగా, విచక్షణా జ్ఞానం కలిగిన దానివిగా ఆలోచించుము” అని మనవి చేసాడు.

“నూర్గురిలో ఒక్కడిని కూడా మిగల్చకుండ చంపావెందుకని? ఆ ఒక్కడు మీ అన్నను రాజ్యమేలనీయకుండా అడ్డుపడగలడా? ఏడీ నీ అన్న? పిలువుమని” భీముని పైనుంచి తన క్రోధాన్ని ధర్మరాజుపైకి మళ్ళించింది గాంధారి.

అందుకు ధర్మరాజు పెదతల్లికి వినయంగా ప్రణమిల్లి తనవలన ఆమె ఎంతో దుఃఖం సహించవలసి వచ్చినదని తెలిపి మన్నించమని కోరి ఆమెనుండి ఎటువంటి శిక్షనైనా, శాపాన్నైనా స్వీకరించడానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆ సమయంలోనే కళ్ళకు కట్టిన వస్త్రం అంచు సందులోనుండి గాంధారి చూపు ధర్మరాజు పాదాల పైన పడి ఆతడి కాలి గోళ్ళు కాలడం గమనించి అర్జునాదులు గబుక్కున వెనక్కి తప్పుకున్నారు.

గాంధారి పాతివ్రత్య మహిమవలన ఆమె కంటి చూపుకి కలిగిన శక్తికి, ఆమెలో రగులుతున్న ద్వేషాగ్నికి భయపడి నకుల సహదేవులు తొట్రుపాటుతో అటూ ఇటూ పోయారు. అది చూసి గాంధారి నిట్టూర్చి, కోపం ఉపశమించుకుని పాండవులపట్ల మాతృభావాన్ని పొంది ఓదార్పు స్వరంతో కుంతీ దేవిని దర్శించమని పంపించింది.

తనను పరామర్శించ వచ్చిన కుమారులను చాలా కాలం తరువాత చూచినదైన కుంతి వారిని దగ్గరకు తీసుకుని రోదించింది. ఉపపాండవులతో సహా పలువురు ప్రియ జనాన్ని కోల్పోయిన కొడుకుల దురవస్థకు దురపిల్లింది. తల్లి దుఃఖం చూసి చలించిపోయారు ధర్మరాజాదులు. తన పాదాలపై పడి విలపిస్తున్న కుమారులను చూసి రోదిస్తూ..

పద్యం:

ఏడ్వ నందఱపై జేతు లిడుచు బెలుచ I నేడ్చి యద్దేవి వారల నెత్తి వేఱు

వేఱ మేనులు నివురుచు వివిధ దారు I ణాస్త్ర శశ్త్రవ్రణ ప్రచయములు గాంచి (స్త్రీ.1-179)

 

అచ్చోటు లంటి చూచుచు I వెచ్చని యూర్పులు నిగుడ్చు వేగుచు బొగులుం

గ్రుచ్చి కవుంగిట జేర్చును I ‘వచ్చితిరే! నృపకుమారవరులార!యనున్ (స్త్రీ. 1-180)

తాత్పర్యం:

అందరూ ఏడుస్తుండగా అందరి మీదా చేతులుంచి, కుంతి కూడా కుమిలి ఏడ్చింది. వారిని ఒక్కొక్కరినీ పైకి లేపి వారి శరీరాలను నిమిరింది. వారి దేహాలలో నానావిధ శస్త్రాల చేత, అస్త్రాల చేత ఏర్పడిన గాయాలను చూసి, ఆ గాయాలు అయిన చోట తాకి చూస్తూ వేడి నిట్టుర్పులు విడుస్తూ పరితాపంతో కుమిలి పోతూ ఏడ్చింది. వారిని పట్టుకుని కౌగలించుకుని నాయనలారా! వచ్చారా!(ఇంతకాలానికి)అన్నది.

పద్యం:

ఆ సమయంబున నప్పాండుభూపాల I పత్నికి శోకాగ్ని ప్రజ్వరిల్ల

దత్సమీపమునకు ద్రౌపది విన్నని I మోముపై గన్నీరు ముసుగువడగ

బదముల నట దొట్రుపాటు వాటిల్లంగ I దైన్య మాకారంబు దాల్చినట్టి

తెఱగున జనుదెంచి దేవి! సౌభద్రాదు I లైన నీ మనుమ లెం దరిగి? రెంత

 

యేని గాలంబు నిను జూడ రిప్పు డిచటి I కేలరా?’ రంచు నడుగుల మ్రోల నేల

వ్రాలె వికలాంగియై తెంచివైవ నెండ I దాకి వందిత తీగ చందంబు దోప (స్త్రీ.1-181)

తాత్పర్యము:

అప్పుడు ఆమె దగ్గరకు పాలిపోయిన ముఖంమీద కన్నీరు తెరలు కట్టగా తడబడుతున్న నడకతో జీవచ్ఛవంవలే దైన్యం ఆకారం దాల్చిన విధంగా వచ్చి అమ్మా! అభిమన్యుడూ మొదలైన నీ మనవళ్ళు ఎక్కడా కనిపించరే? ఎక్కడికి వెళ్ళారు? ఇన్నిరోజులైనా నిన్ని చూడటానికి రా రెందుకు?’ అని పిచ్చిదానివలే మాట్లాడుతూ కుంతి పాదాల సమీపంలో కుప్పకూలిపోయింది. కొమ్మనుండి తెంచివేయగా పైగా ఎండ తాకి నిర్జీవమైన తీగలా ఆ ద్రౌపది కనిపించగా, అలా నేలమీదకి ఒరిగిపోయి ఏడుస్తున్న ద్రౌపదిపై తానూ ఒరిగిపోయి పెద్దగా ఏడ్చింది కుంతి. ద్రౌపదిని పట్టుకుని ఎత్తి కౌగలించుకుని ఓదార్చి, కొడుకులూ ద్రౌపదీ వెంటరాగా గాంధారి వద్దకు వెళ్ళింది. ద్రౌపది, గాంధారికి నమస్కరించింది. వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న ద్రౌపదిని చూసి గాంధారి..

పద్యం:

పుత్రి ఇట్లగు నమ్మ? శోకము పొంది కుందుచు నున్న నీ

గాత్ర మొండొక కీడు పాటిలి కందు బాండుతనూభవుల్

పుత్రవర్గము గన్నచో నెద భూరితాపము బొందుడుం

బౌత్ర హీనత బడ్డ గొంతికి బాయనేర్చునె నెవ్వగల్ ? (స్త్రీ. 1183)

 

నిను నే నిట్టూరార్చెద I నను నీ వూరార్పవలదె? నా నీ తెఱగుల్

విను మొక్కరూప మన కే I మనగలదు విధాత క్రూరుడై పఱుపంగన్? (స్త్రీ. 1184)

 

ఇది ఇటులగు ట ట్లెఱగి పలికె నా I విదురుండు సభ గోవిదులు వొగడగా

నది వినియును నే నడపన దురితం I బొదవె గలక సే టొలయ కుడుగునే? (స్త్రీ. 1185)

తాత్పర్యము:

అమ్మాయీ! ఇట్లా బాధపడితే అవుతుందా? నీవిట్లా క్రుంగిపోతే తప్పకుండా ఏదో ఒక అపాయం జరుగుతుంది. మరి పాండవులకు మాత్రం వారి కుమారులను తలుచుకుంటే శోకం కలగటం లేదా? మరి మనవళ్ళు పోతే కుంతికి మాత్రం దుఃఖం లేదా?

నేను నిన్నెట్లా ఓదారుస్తున్నానో నన్నూ నీ వట్లాగే ఓదార్చుము. మరొక విషయం వినుము. నీ జీవితమూ నా జీవితమూ ఒకే విధంగా ఉన్నాయి! (నేనూ కొడుకులను బోగొట్టుకున్నాను. నీవూ కొడుకులను కోల్పోయావు). మన విషయంలో విధి చాలా క్రూరంగా వ్యవహరించింది. దీన్ని ఏమనగలము చెప్పుము?

ఇది ఇట్లా అవుతుందని తెలిసి, ఆనాడే సభలో విదురుడు, పెద్దవారంతా ప్రశంసిస్తుండగా, ఎంతగానో చెప్పాడు. అదంతా విని కూడా నా కుమారుల దుర్మార్గాన్ని నేను ఆపలేకపోయాను. అందుకే ఈ సంక్షోభం ఏర్పడింది. ఏనాటికైనా కీడు తగలకుండా ఉంటుందా?

అని తానెన్ని చెప్పినా యుధ్ధాన్ని వినాశనాన్ని ఆపలేకపోయేదానిననీ, కాలధర్మానికి లోబడి జరగవలసింది జరిగిపోయిందనీ కనుక ప్రశాంతముగా ఉండమనీ ద్రౌపదితో సాంత్వన వచనాలు పలికింది. ఇదే విధంగా పాండవులు ధృతరాష్ట్రుడిని, గాంధారినీ ఓదార్చారు.

స్త్రీపర్వం ప్రథమాశ్వాసంలో శోకమెంత ఉన్నదో దానిని ఉపశమింపజేసే ఉపదేశమూ అంత ఉన్నది. బంధు వినాశ దుఃఖతాపంతో వగకు గురియైన మనుష్యులకు ఉపదేశ వాక్యాలు అమృత ధారలు.

***

ద్వితీయాశ్వాసం : విశ్లేషణాత్మక వివరణ:

యుధ్ధంలో చనిపోయిన కుమారులనూ, మనుమళ్ళనూ, బంధువులనూ, ఇతర ఆత్మీయులనూ కన్నులారా చూసుకుని కన్నీరు కార్చాలని కోరుకుంటున్నానని గాంధారి తెలిపినప్పుడు వ్యాస మహర్షి ఆమెకు దివ్యదృష్టిని ప్రసాదించాడు. దీనివలన కళ్ళకు గంతలు తీయకుండగనే యుధ్ధభూమిలో, సుదూరంలో ఉన్నప్పటికీ, వస్తు సముదాయము ప్రత్యక్షంగా కనిపించసాగింది గాంధారికి.

దివ్యదృష్టితో యుధ్ధభూమిని పరికిస్తూ ముక్కలు ముక్కలై చెల్లా చెదురుగ పడి ఉన్న రథాలూ, ధ్వజాలూ, అరిగెలూ.. మొదలుగునవీ, చనిపోయిన సైనికుల దేహాలూ, దేహ భాగాలూ, గుర్రాల, ఏనుగుల మృత దేహాలూ చూసి హృదయం తరుక్కుపోయి, మనసు కకావికలై పరితాపం అధికమవగా భరించలేని శోకానికి గురైంది గాంధారి.

అదే సమయంలో పాండవులు ధృతరాష్ట్రుని నడిపించుకుంటూ శ్రీకృష్ణుడు ముందు నడుస్తుండగా బంధువులకు దహన సంస్కారాలు చేయడానికి వెళుతూ కౌరవ స్త్రీలను కూడా ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళారు.

ఆ స్త్రీలందరూ తమ తమ కుంటుంబీకులనూ, ఆత్మీయులనూ శవాలుగా కాంచి, చేష్టలుడిగి నేల మీదకు ఒరిగిపోయి హాహాకారాలు చేస్తూ, నేలమీద పొర్లుతూ పరితపించారు. వీరుల పేర్లు పెట్టి పిలుస్తూ వారి గుణ గణాల గురించి చెప్తూ శోకించారు. వారందరినీ చూస్తూ తనకు కలుగుతున్న దుఃఖాన్ని ఎవరితో పంచుకోవాలో తెలియక, భర్తయైన ధృతరాష్ట్రునితో చెప్పుకోవడానికి ఇష్టపడక, శ్రీకృష్ణుని పిలిచి దగ్గరకు రమ్మని గాంధారి.. ఇలా అంది

పద్యం:

చూడుము ధృతరాష్ట్ర కోడండ్ర గన్నార I వీరె కన్నీరుపై వెల్లి గొనగ

దీనత బొందెడు నాననంబుల విప్ర I లాపంబులైన సల్లాపములను

నడలు చొండొరులకు నన్నల దమ్ముల I రూపించి వేర్వేఱ జూపుటయును

బొరిమొగంబుల సూచి పుర పుర బొక్కుచు I దలలల్లం దూలంగ నిలుచుటలును

 

గలిగి యలిగెడి వారి కన్నులకు బండు I వగుచునున్నారు కాకులు మగల తనువు

లెక్కియున్నను చేష్టలు దక్కి కొంద I ఱడువ జేయాడకున్నవా రంబుజాక్ష! (స్త్రీ. 2- 11)

తాత్పర్యము:

కృష్ణా! ధృతరాష్ట్ర మహారాజు కోడళ్ళను చూడుము. ఇదిగో! వీరే వారు. కంటినీరు ముఖాలపైన వెల్లువలుగట్టగా, అతిదీనమైన ముఖాలతో పొంతనలేని పలుకులతో, పుట్టెడు దుఃఖంతో, ఒకరికొకరు చనిపోయిన తమ అన్నదమ్ముల ముఖాలు చూచి ఇదిఫలానా వారిదే అని నిర్ణయిస్తూ చూపిస్తున్నారు. చూపించి తాము చూచి మళ్ళీ తహ తహ లాడుతూ ఏడుస్తూ తలలు వాలిపోతుండగా ఎట్లాగో నిలదొక్కుకుని నిలబడి ఉన్నారు. వీళ్ళ మీద కసి ఉన్నవారికి ఈనాటికి కన్నుల పండుగఅయినది. తమ భర్తల దేహాలపై కాకులు కూర్చుని ఉన్నా వాటిని తోలటానికి చేయి ఎత్తలేని స్థితిలో ఉన్న ఈ ఆడవారిని చూస్తే ఎంత బాధ అవుతుందో చూడుము.

పద్యం:

కూలియు గాంతి ఇగుర్పగ దేజము గుందక వహ్నులు గ్రూర శిఖా

జాల మడంగియు జాయ వెలింగెడు చందము నొందిరి శల్యుడు బాం

చాలుడు గర్ణుడు జాపగురుండును శాంతనవుండు నిజంబున కీ

బాలుండు వీరి ప్రభం గడచెం గుణభద్రుని గంటె సుభద్రసుతున్ (స్త్రీ. 2- 12)

తాత్పర్యం:

కృష్ణా! శల్యుడు, ద్రుపదుడు, కర్ణుడు, ద్రోణుడు, భీష్ముడు వీరంతా యుద్ధంలో చనిపోయినా,మంటలు తగ్గాక కూడా అగ్ని కాంతి ఎట్లా కొత్త కొత్తగా పుట్టుతూ ఉంటుందో అట్లా ప్రకాశం తగ్గకుండా ఉన్నారు. నిజానికి వీరందరి కన్నా అభిమన్యుడు ఎక్కువ కాంతితో మెరిసిపోతున్నాడు. సుగుణాల ఖని ఈ సుభద్ర కొడుకు ఈ బాలుడుని చూచావా? (శవాలలో కూడా జీవకాంతులు తగ్గలేదని అర్థం)

..అంటూ అక్కడక్కడా రాజులూ, యుధ్ధవీరులూ (మరణానంతరమూ కూడా) కాంతులీనుతూ ప్రకాశిస్తుండగా ఈ యుధ్ధభూమి గ్రహరాశులతోనూ, నక్షత్ర సముదాయంతోనూ వెలిగే ఆకాశం వలె కనిపిస్తున్నది అని అంత దుఃఖంలోనూ వర్ణించింది.

దీనికంతటికీ కారణం నీవేననీ, ఈ ఘన కార్యమంతా నీవు సాధించినదేననీ కృష్ణుడిని ఎత్తిపొడిచింది.

ఇలా అంటున్న సమయంలోనే దుర్యోధనుడి విగత శరీరం గాంధారి కంటబడింది. అది చూసి మూర్ఛవలన వివశురాలై రెక్కలు తెగిన పక్షివలె నేలమీద పడిపోయింది. తిరిగి పరిచారికల సేవలతో తేరుకుని కుమారుని మృతదేహం వద్దకు వెళ్ళి గాంధారి రోదించిన తీరు కరుణరసా భరితం..

పద్యము:

విపుల వక్షము మీద నశ్రులు వెల్లిగొల్పుచు వ్రాలి యో

నృపతికుంజర! కౌరవేశ్వర! నేలనిమ్మెయి నీ యుదా

త్తపు శరీరము బొంద బాడియె?తల్లి వచ్చిన భక్తితో

నుపచరింపక లాతివై యిటులూరకుండుట యుక్తమే? (స్త్రీ. 227)

తాత్పర్యం:

విశాలమైన కుమారుడి రొమ్ముమీద ఎడతెగకుండా కన్నీరు కారుస్తూ గాంధారి వాలిపోయింది. రాజులలో పేరు పొందావు. కౌరవులలో అందరికన్నా మిన్న అనిపించుకున్నావు. నాయనా! నీ గొప్పదేహం ఇట్లా నికృష్టంగా నేల మీద పడి ఉండటం ఎంత అన్యాయమయ్యా! తల్లి దగ్గరికి వస్తే లేచి నమస్కరించి ఉపచారాలు చేయకుండా వేరే వ్యక్తివలె కదలకుండా మౌనంగా ఉన్నావే? నీకిది న్యాయంగా ఉన్నదా?’

అని హాహాకారాలు చేస్తూ బాధపడుతున్న గాంధారి వద్దకు వచ్చాడు కృష్ణుడు.

తన వద్దకు వచ్చిన కృష్ణుడిని చూసి ‘సుయోధనుడు యుధ్ధానికి వెళుతూ నా వద్దకు వచ్చి ఆశీర్వదించమని అడిగినప్పుడు ధర్మం ఎక్కడ ఉంటుందో జయమక్కడ ఉంటుందని దీవించాను. అలా ఎందుకన్నానంటే ఆనాడు ద్రౌపదీ మానభంగమప్పుడు భీముడి ప్రతిజ్ఞలు చూసి ఇది కౌరవుల నాశనానికే, ధర్మం అంత త్వరగా నశించదు అని అందరూ అన్నారు కదా.. నాకూ అదే అనిపించింది. అందరన్నది జరగకుండా ఉంటుందా? కుమారుడని మెప్పుకోలు మాటలు పలకడం సరి అనిపించుకోదు. అంతేకాదు యుధ్ధంలో వెనుదిరిగి వస్తే అపకీర్తి వస్తుంది అంతకన్నా చావే నయం, యుధ్ధంలో మరణించి స్వర్గంలో మరణంలేని సౌఖ్యాన్ని పొందమని దీవించాను దుర్యోధనుడిని. నేను చెప్పినట్లే చేసి దుర్యోధనుడు కీర్తిప్రతిష్ఠలు పొందాడు. ఇంతకన్నా ఏం కావాలి? నాది గర్భశోకం మాత్రమే’ అని అన్నది గాంధారి.

కుమారులు చేస్తున్నది అధర్మమని తెలిసి, ఎప్పటికైనా మారకపోతారా అన్న ఆశ, మారాలన్న ఆశ గాంధారి చేత అలా పలికించి ఉండవచ్చు. ఆశీర్వదించినా విజయం పొందడు. కనుకనే ధర్మమున్న చోటే విజయముంటుందని చెప్పి నిర్ణయం కొడుకుకే వదిలివేసింది. భారతంలోని స్త్రీ పాత్రలలోని విజ్ఞత, వివేకం గాంధారి పలుకుల ద్వారా విదితమవుతుంది.

(సశేషం)

Exit mobile version