[dropcap]క[/dropcap]రోనా సృష్టించిన కల్లోలంలో స్కూళ్లన్నీ మూత పడ్డాయి. ఉద్యోగాల్లేవు. జీతాల్లేవు.
సుబ్బలక్ష్మి బి.ఏ. వరకు తెలుగు మీడియంలో చదివింది. స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. చిన్న స్కూల్ కావటం వల్ల ఇంగ్లీష్ అంత బాగా రావాలని పట్టింపు లేదు. ఒకటో తరగతికి వెళుతుంది.
సుబ్బలక్ష్మికి గడ గడ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్లంటే చాలా ఆరాధన. తను ఇంగ్లీష్‌లో ధారాళంగా మాట్లాడుతున్నట్లు, పాఠాలు పూర్తిగా ఇంగ్లీష్ లోనే చెపుతున్నట్లు ఊహల్లో తేలిపోతూ ఉంటుంది.
సుబ్బలక్ష్మికి రేడియో వినటం అలవాటు. ఇంగ్లీష్ వార్తలు పెట్టుకుని ‘దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో. ద న్యూస్ రెడ్ బై సుబ్బలక్ష్మి’ అని తనే వార్తలు చదువుతున్నట్లు న్యూస్ రీడర్‌తో మమేకమై పోతుంది. తన పిల్లల పుస్తకాలలో ఇంగ్లీష్ పాఠాలను పైకి చదివేస్తూ ఉంటుంది. ఇంగ్లీష్ భాషణ ఎవరిలో వినిపించినా వాళ్లలో పరకాయ ప్రవేశం చేసేస్తుంది. ఇంగ్లీష్ అంటే అంత అభిమానం ఉన్న సుబ్బలక్ష్మికి నేర్చుకుందామంటే పాపం ఇంటి పనంతా చేసుకుని స్కూల్‌కి వెళ్లి సాయంత్రం అయిదింటికి వచ్చాక మళ్ళీ పని, పిల్లల చదువులు, పక్కన కూర్చుంటే గాని చదవరు. రాత్రి నిద్రలో తప్ప సుబ్బలక్ష్మికి విశ్రాంతి, తీరిక దొరకవు.
స్కూళ్లు మూసేయటం, జీతాలు లేకపోవటం కుటుంబ జీవితానికి కొంత ఇబ్బంది అయినా ఇప్పుడు సుబ్బలక్ష్మికి తీరిక దొరికింది. ఆమె భర్త సుబ్బారావు ఇంగ్లీషు టీచరే. ఎం. ఏ.. బి.ఇడి. చదివి హై స్కూల్లో చేస్తున్నాడు.
ఇదివరకోసారి సుబ్బలక్ష్మి వేసవి సెలవల్లో భర్త దగ్గర కొంచెం నేర్చుకుంది. చెప్పించుకోవటానికి మొదలు పెట్టిన పది నిముషాలకు ఫోన్ రావటమో, పక్కింటావిడ పిలవడమో జరిగేది. మధ్యలో వెళితే సుబ్బారావుకు కోపం వచ్చేది. వెళ్లకపోతే ఏమైనా అనుకుంటారని సుబ్బలక్ష్మి అనేది. ఓ పది రోజులకు వేసవి కదా చుట్టాలు దిగారు. ఇంగ్లీష్ చదువు సున్నా అయింది. మళ్ళీ కుదరలేదు.
ఇప్పుడు సుబ్బలక్ష్మికి పంతంగా ఉంది. ఇంగ్లీష్‌లో భర్తను మించి పోవాలని ఆశగా ఉంది. ఇంట్లోకి తొంగి చూసేవారు కూడా లేరు ఇప్పటి పరిస్థితిలో!
సుబ్బారావుతో అంటే కలలు కనటం మాని వాటిని సాకారం చేసే పని చూడు, అన్నాడు.
“ఎప్పుడు చెపుతారు?”
“నువ్వెప్పుడంటే అప్పుడు, ఒక టైం నిర్ణయించుకో. ఫోన్ పక్కన పెట్టు”.
సుబ్బలక్ష్మి క్యాలండర్ చూసింది. “రేపు మంచి రోజు. మొదలు పెట్టండి. రోజూ 10 నుంచి 11 వరకూ చెప్పండి” అంది.
“సరే” అన్నాడు
“ఏమండీ, ఓ కొబ్బరికాయ తెండి” అంది సుబ్బలక్ష్మి.
“ఎందుకు?”
“మంచి పని మొదలుపెడుతునప్పడు అమ్మవారి కటాక్షం ఉండాలి. కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకుని చెప్పించుకోవటానికి వస్తానండి. ఆ వాగ్దేవి నా నాలుక మీద నాట్యం చేయాలి. అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడాలి నేను. తెండీ” అంది సుబ్బలక్ష్మి.
“కొబ్బరికాయ 60 రూపాయలు. తెలుసా నీకు? దేశ పరిస్థితులు చక్కపడేవరకు కొబ్బరికాయ కొనే ప్రసక్తే లేదు. కొబ్బరికాయ కొడితే భాష నాట్యం చేయదు. నీలో శ్రద్ధ ఉంటే నాట్యం చేస్తుంది” సీరియస్‌గా అన్నాడు సుబ్బారావు.
“ఏం టమోటాలు 100 రూపాయలయితే అరకేజి తేలేదా మీరు? ఒక్కొక్కటి జాగ్రత్తగా వాడు అని చెప్పలేదా? ధరలు పెరిగాయని ఏం మానారు? నా కోసమా? అమ్మవారి కోసం అడిగాను కాని. తెండీ” బతిమాలింది. విధిలేక సరే అన్నాడు.
మర్నాడు పూజ చేసుకుని, సరస్వతి దేవితో పరి పరి విధాల మాట్లాడి, ప్రార్థించి, పది గంటలకు, నోట్స్, పెన్నుతో సుబ్బలక్ష్మి వచ్చి కూర్చుంది. ఎదురెదురు కుర్చీల్లో కూర్చున్నారు.
సుబ్బారావు ఇంగ్లీష్ భాష ఎంతగొప్పదో, ఎందుకు నేర్చుకోవాలో వివరిస్తున్నాడు.
“ఇవన్నీ ఎందుకండీ, గ్రామరు చెప్పండి “అంది సుబ్బలక్ష్మి.
“మధ్యలో ఆపకు. ఇదీ అవసరమే. ఇదే అవసరం. పునాది లేని చదువులు” సుబ్బారావు కేకలేసాడు. ఉపన్యాసంలా చెపుతున్నాడు.
చెప్పటమే కాని వినటం అలవాటు లేని సుబ్బలక్ష్మి నిద్రలో తూగుతోంది. సుబ్బారావుకు కోపం వచ్చేసింది. పక్కనున్న గ్లాసుతో టేబుల్ మీద గట్టిగా శబ్దం చేసాడు.
“సారీ అండీ, నిద్ర ఆపుకోలేక పోయాను”
“అందుకే నీకు చెప్పాలంటే విసుగు”
“రేపట్నుంచి ఇలా ఉండను. మాటిస్తున్నాను. ప్లీజ్! చెప్పననకండి”
“సుబ్బూ, నిన్ను చూస్తే జాలేస్తుంది. ఇంగ్లీష్ మాట్లాడాలన్నతపనే కాని అందుకు తగిన శ్రద్ధ, కృషి నీలో లేవు” అన్నాడు సుబ్బారావు.
“లేదండీ, రేపట్నుంచి మీరే చూస్తారుగా, ఇంక వంట చేస్తాను” అంటూ లోపలికి వెళ్ళిపోయింది సుబ్బలక్ష్మి.
మర్నాడు, సుబ్బలక్ష్మి కంటే ముందే సుబ్బారావు సిద్ధంగా కూర్చున్నాడు. సుబ్బలక్ష్మి సరిగ్గా పదింటికి పుస్తకం, పెన్నుతో వచ్చింది. క్రమశిక్షణలో గురు శిష్యులు ఒకరికొకరు తీసిపోవట్లేదు.
సుబ్బారావు నౌన్ గురించి చెప్పటం ప్రారంభించాడు.
సుబ్బలక్ష్మి నోట్స్ తీసి రాసుకుంటోంది. “నువ్వు రాయటం ఆపు. చెప్పేటప్పుడు శ్రద్ధగా విను. తర్వాత అంతా గుర్తు తెచ్చుకుని రాసుకో. అయినా, నేను చెప్పేదంతా నా దగ్గర పేపర్లలో వుంది, ఇస్తానన్నానుగా” సుబ్బారావు అరిచాడు.
“ఇస్తానన్నారు లెండి. చెపుతున్నప్పుడు రాసుకుంటుంటే నాకు చదువుకోవటానికి బాగుంటుందండి” అంది సుబ్బలక్ష్మి.
“సుబ్బూ, ప్రతిదానికి ఏదో ఒక సమాధానం సిద్ధంగా పెట్టుకోకు. నువ్వు నా నోట్లోంచి వచ్చిన ప్రతి అక్షరం రాసేస్తున్నావు. వింటే గాని రాదు” అన్నాడు కోపంగా సుబ్బారావు.
ఒకరోజు క్రియల గురించి చెపుతున్నాడు. “ఏమండీ, ఇవన్నీ తెలిసినవే కదండీ, టెన్సులు చెప్పండి. ఇంటరెస్టింగ్‌గా ఉంటుంది. అవేగా ముఖ్యం” అంది సుబ్బలక్ష్మి.
“ఏం చెప్పాలో నువ్వే నిర్ణయిస్తావా, టీచర్ నువ్వా, నేనా? నువ్వేం చెప్పమంటే అదే చెప్పాలా? సుబ్బూ, నేనో క్రమ పద్ధతిలో చెపుతున్నాను చెప్పేవన్నీ నీకవసరమే. మాట్లాడకుండా విను” కేకలేసాడు సుబ్బారావు.
మధ్యలో ఏదైనా అడిగితే అతనికి కోపం. వింటున్నప్పుడు డౌట్స్ వస్తే అడక్కుండా ఎలా? అని సుబ్బలక్ష్మి వాదిస్తుంది.
“ఏమండీ, నాకు ఇంగ్లీష్‌లో మాట్లాడటం అసలు వస్తుందా” సుబ్బలక్ష్మి అడిగింది.
సుబ్బారావు తల పట్టుకున్నాడు. “సుబ్బూ, వస్తుందా, వస్తుందా అని మాటి మాటికీ అడిగితే వస్తుందా? భాషంటే ఆషామాషీ వ్యవహారమా? నీకు రోజూ హోమ్ వర్క్ ఇస్తున్నాను. చేసి చూపిస్తున్నావా? రోజూ ఇంట్లో మాట్లాడుకునేవే నాతో, పిల్లలతో మాట్లాడమంటే మాట్లాడుతున్నావా? నీ కృషి ఏం లేకుండా ఎలా వస్తుంది? ఇలా నేర్చుకుంటే కొన్నాళ్ళకి గ్రామర్ మాత్రం వస్తుంది. తప్పో, ఒప్పో మాట్లాడకుండా భాష రాదు” అన్నాడు సుబ్బారావు.
”ఏమండీ అయితే నాకు రాదంటారా” కళ్ళనీళ్లతో అడిగింది సుబ్బు. కరిగిపోయాడు సుబ్బారావు.
“సుబ్బూ, ప్రయత్నిస్తే ఏదీ అసాధ్యం కాదు. నువ్వు మాట్లాడటం ప్రాక్టీస్ చెయ్యాలి” అంటూ ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్‌లో ఓ ప్రకటన బొమ్మ చూపించి “దీన్ని వివరించు” అన్నాడు.
“దీన్లో ఏముందండి, ఒక అమ్మాయి వుంది” అంది సుబ్బలక్ష్మి.
“అదే ఆ అమ్మాయి గురించే చెప్పమన్నది”
“నాకు రాదు, నేను చెప్పలేను”
“నేను చెపుతా విను. ఇది ఒక నగల ప్రకటన. ఆ అమ్మాయి మెడలో పొడవైన హారం వేసుకుంది. చెవులకు మాచింగ్ హ్యాంగింగ్స్ పెట్టుకుంది. ఆ అమ్మాయి కళ్ళు నవ్వుతున్నాయి ఆ అమ్మాయి ఆకుపచ్చ పట్టు చీర కట్టుకుంది. నడుముకు వడ్డాణం పెట్టుకుంది” అని ఇంగ్లీష్ వాక్యాల్లో చెప్పాడు సుబ్బారావు.
“అమ్మో, అమ్మో, పేపరులో అమ్మాయి గురించి ఇంత వర్ణనా? అంటే బైట ఎంతమందిని నిశితంగా పరిశీలిస్తున్నారో, నా కింత అన్యాయం చేస్తారా?” సుబ్బలక్ష్మి కళ్ళలో నీళ్లు.
“ఆపు గోల, ఏం వాగుతావో నీకే తెలీదు. ఒక బొమ్మ చూసి అన్ని వాక్యాలు చెప్పగలగాలి అని చెప్పానంతే! పోనీ, ఇంకో ప్రకటన అబ్బాయిది తీసుకుని వర్ణించు. నువ్వెవరి గురించి మాట్లాడినా నాకేం నీలా అనుమానాలుండవు” అన్నాడు సుబ్బారావు.
“అంటే నేను అనుమాన పిశాచినీ, మీరు విశాల హృదయులా!”
“సుబ్బూ నీకు నేను చెప్పలేను” దణ్ణం పెట్టేసాడు సుబ్బారావు.
“లేదు, లేదు, చెప్పాల్సిందే” పట్టుబట్టింది.
అప్పటినుండి సుబ్బలక్ష్మి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రోజూ శ్రద్ధగా చదివింది. సుబ్బారావు చెప్పినట్లు ప్రకటనలు చూస్తూ తనే స్వయంగా వాక్యాలు ఇంగ్లీష్‌లో తయారు చేసి, చూపించేది. ఇంగ్లీష్ సినిమాలు చూసేది. స్క్రీన్ మీద వచ్చే సంభాషణలు చూస్తూ పాత్రల ఉచ్చారణ ప్రాక్టీస్ చేసేది. సుబ్బారావు చెప్పినట్లు నిత్య వ్యవహారంలో ప్రతి వాక్యాన్ని ఇంగ్లీష్ లోనే మాట్లాడేది. ఫోన్‌లో ఎవరితోనైనా తప్ప తెలుగు అన్నది అసలు లేదు. సుబ్బారావు ఎప్పటికప్పుడు సరి చేస్తూ ఉండేవాడు. సుబ్బారావును కూర్చోపెట్టి పాఠం చెప్పేది. దానికోసం ఎంతో ప్రాక్టీస్ చేసేది. సుబ్బారావును కాసేపు స్టూడెంట్‌ను చేసేసి, ఇంకా చాలా మంది ఉన్నట్లు భావించేసుకుని “మై డియర్ స్టూడెంట్స్, టుడే ఐ యామ్ గోయింగ్ టు టీచ్ ఏ పోయెమ్. ఫస్ట్ లెట్ మి గివ్ యు ఇంట్రడక్షన్ అబౌట్ ద పోయెట్, అండ్ హిజ్ స్టైల్” అంటూ మొదలు పెట్టేది. సుబ్బారావు కళ్ళార్పకుండ చూస్తూ ఉండి పోయేవాడు. ఎంత బాగా నేర్చేసుకుంది అని ఆశ్చర్య పోయేవాడు.
రోజువారీ సంభాషణల్లో సుబ్బారావు అమెరికన్ ఇంగ్లీష్‌లో ఇలా ఉంటుంది, బ్రిటీష్ ఇంగ్లీష్‌లో ఇలా ఉంటుంది అని వివరించేవాడు. “ఎక్కువ మంది మాట్లాడే ఏదో ఒక ఇంగ్లీష్ చెప్పండి. కాస్త బాగా వస్తోంది అనే టైంలో కొత్తవేవో చెప్పి కన్ఫ్యూజ్ చేయొద్దు” అంటూ సుబ్బలక్ష్మి విసుక్కునేది.
మొత్తం మీద సరసాలు, విరసాలు, రుస రుసలు, కోపాలు, తాపాలు, సామరస్యాల మధ్య స్కూళ్లు తెరిచేనాటికి సుబ్బలక్ష్మి తడుముకోకుండా, తప్పులు లేకుండా ఇంగ్లీష్ పట్టుదలతో నేర్చేసుకుంది. ఒకటి, రెండేళ్లలో విద్యార్హత పెంచుకుంటుందని సుబ్బారావు స్కూల్ వాళ్లతో చెప్పగా, ఆయన స్కూల్లోనే సుబ్బలక్ష్మి టీచర్‌గా చేరిపోయింది. కల సాకారం చేసేసుకుంది.
స్కూల్లో అందరూ సుబ్బలక్ష్మి టీచర్ ఇంగ్లీష్ ఉచ్చారణ చాలా బాగుంటుందని మెచ్చుకుంటున్నారు. “గురువును మించిన శిష్యురాలివై పోయావు. మరి గురుదక్షిణ ఇవ్వవా” అన్నాడు సుబ్బారావు.
“గురుదక్షిణ కావాలా, ఇదే నేనిచ్చే గురుదక్షిణ” అంటూ సుబ్బలక్ష్మి సుబ్బారావు బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుని కిల కిలా నవ్వింది.