Site icon Sanchika

సుబ్రహ్మణ్య షష్ఠి

[box type=’note’ fontsize=’16’] ది 09 డిసెంబరు 2021 నాడు సుబ్బారాయుడి షష్ఠి సందర్భంగా ఈ వ్యాసం అందిస్తున్నారు డా. జొన్నలగడ్డ మార్కండేయులు. [/box]

[dropcap]పు[/dropcap]ట్టపర్తి సత్యసాయిబాబా గారు స్వయంగా ‘సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం’ అని పాడేవారు. అందుచేత సుబ్రహ్మణ్యుడంటే షణ్ముఖుడు. కార్తికేయుడు. మురుగన్. స్కందుడు. కుమారస్వామి, గుహుడు. మార్గశిర శుద్ధ షష్ఠిని స్కందషష్ఠి అంటారు. ఆనాడు సుబ్రహ్మణ్య షష్ఠిగా పండగగా చేసుకుంటారు. ఈ స్కందషష్ఠికి తెలుగునాట సుబ్బారాయుడి షష్ఠిగా వాడుక ఉంది.

కదంబ రాజవంశీకులు కులదైవముగా కొలిచారు. గణేశుడి కన్న చిన్నవాడని భావిస్తాము. కాని కుమార స్వామిగా తారకాసుర వధకు గణేశుని కన్నముందుగా జన్మించాడని కారణజన్ముడిగా దేవసేనానిగా శివపార్వతుల పుత్రుడుగా శివపురాణము చెప్పిన ప్రకారము కుమారస్వామిగా పెద్దవాడు. నన్నెచోడుని కుమారసంభవము ప్రకారము దక్షయజ్ఞమును ధ్వంసము చేసిన కథలో గణేశుడు పాల్గొన్నాడు. దక్షయజ్ఞ వినాశనము తరువాతే కుమారసంభవము జరిగింది. ఎవరు పెద్దవారన్నది అభీష్టమును బట్టి ఉంటోంది. కైలాసములోనే ఉండేవాడు. కాని లంబోదరుడితో తండ్రి పెట్టిన భూప్రదక్షిణ ముగించినా పోటీలో విజయము సొంతమవలేదు. తల్లిదండ్రుల చుట్టూ చేసిన ప్రదక్షిణ భూప్రదక్షిణగా విజయము గణేశుడు దక్కించుకున్నాడు. చిన్నబుచ్చుకుని స్కందుడు క్రౌంచపర్వత నివాసిగా మారాడు

‘దుబ్బు దుబ్బు దీపావళి…. మరునాడు వచ్చే నాగులచవితీ, సుబ్బారాయుడి పెళ్ళి… చూచివద్దాము రండి’. నాగులచవితినాడు నాగపూజను, మార్గశిర శుద్ధ షష్ఠి తిథినాడు సర్పఛత్రముతో కూడిన స్కందునికి వల్లి, దేవసేన సహితుడి అర్చామూర్తిగా కల్యాణము జరుపుతారు. కార్తీక నాగులచవితి నాటిసర్పములపట్ల భయభక్తి గౌరవ పూజ సూచన ఆంధ్రప్రజల ఆచారము, సుబ్బారాయుడి షష్ఠి పెళ్ళిగా పాటలో ధ్వనిస్తుంది.

నరకచతుర్ధశి సాయంవేళ పిల్లలచేత దివిటీలు కొట్టించే పాటగా ఆనవాయితీ ఉంది. నాగుల చవితినాడు పుట్టలో పాలుపోయడం నాగపూజ. అయితే సుబ్బారాయుడి షష్ఠి నాడు, సుబ్బారాయుడిని సర్పాకృతిగా భావించడమేమిటి? అని ప్రశ్న ఉదయిస్తుంది. సప్రమాణ మనలేము. కాని కార్తికేయుడిగా సర్పాకృతితో కూడ సుబ్రహ్మణ్యేశ్వరుడు రాక్షసవధ చేసిన కారణంగా సర్పజాతికి సుబ్రహ్మణ్యప్రతి రూపము వచ్చిందన్నది విశ్వాసము. ఆ యుద్ధ సమయంలో నెమలి ఆయనకు చేరువై వాహన మయింది, బ్రహ్మజ్ఞానము గలవాడు సుబ్రహ్మణ్యుడని కూడ అర్థము. వల్లీదేవసేన సహిత సుబ్బారాయుడి కల్యాణముగా బహుపడగల ఛత్రమై సర్పము గొడుగు పడుతుండగా సుబ్రహ్మణ్య షష్ఠిగా స్కందషష్ఠి జరుపుతున్నారు. పూలు, పడగలు వెండివి సమర్పించి సుబ్బారాయుడిని దర్శిస్తాము.

అందుచేత నాగులు సుబ్బారాయుడిగా మనకు ఆరాధ్యదైవాలు అయ్యారు. నాగులచవితి సరే. సర్పములకు నాగ పంచమిగ యావద్భారతము శ్రావణమాసములో పంచమీతిథి నాడు కేవలము సర్పముల కోసమే ప్రత్యేక పూజా విధానముతో పండుగ జరుపుకుంటుంది. భవిష్యపురాణములో……

“వాసుకి స్తక్షకశ్చైవ కాళియో మణిభద్రఖః… ఐరావతో ధృతరాష్ట్రః కర్కోటకాధనుంజయౌ..
ఏతోప్రయచ్ఛం త్యభయంప్రాణిణాం ప్రాణజీవితాం.. పంచమ్యాంస్నపయంతీహ నాగాన్
క్షీరేనయే నరాః… తేషాంకుకులే ప్రయచ్ఛంతితేభయం ప్రాణప్రదక్షిణాం… శప్తానాగ యదా
మాత్రా దహ్యమానా దివానిశం… నిరాపయంతి స్నపనైర్గవాం క్షీరేణిమిశ్రితైః
యేస్నపయంతివై భక్త్త్యాక్త్యా శ్రద్ధా సమన్వితాః…తేషాం కులే సర్పభయంనభవేదితి నిశ్చయం”

చమీతిథి నాడు పాములను ఆవుపాలతో అభిషేకించినవారికి పాముల భయముండదు. కద్రువ నాగమాత. సర్పయాగములో చనిపొండని యిచ్చినశాపము రేయింబవళ్ళు అగ్నియై దహిస్తున్నందున మన పూజ నాగులను శాంతింపజేస్తున్నాయి. అటువంటి నాగపూజకు అవి సంతోషించి హాని కలిగించడమానేస్తాయి……’’.

సుబ్రహ్మణ్యుడు సర్పరూపుడై రాక్షసవధ చేసాడు. సర్పరూపుడై కనిపించి అనుగ్రహిస్తున్నాడు కాబట్టి సుబ్బారాయుడి షష్ఠి నాడు కూడ వాసుకి మొదలైన నాగుల స్మరణతో నాగపూజాభిషేకము నిత్య సర్ప భయ దోషనివారణ కలిగిస్తుంది. అయితే సుబ్రహ్మణ్యేశ్వరుడిగా శివలింగాకృతికే అభిషేకము శివాకృతిగా భావింప జేస్తాయి.

సర్పపడగలు చత్రముగా వల్లీదేవసేనలు కుడి ఎడములుగా సుబ్రహ్మణ్యస్వామి అర్చా మూర్తిగ గర్భగుడి విగ్రహానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు అనిపేరు. విగ్రహప్రతిష్ఠపీఠమున కుసమీపంలో నేలబారుకు నాగపడగలు గొడుగుగా గల శివలింగము ప్రతిష్ఠించారు. సుబ్బారాయుడిగ అభిషేకాదులు జరపడము ఉంది. సుబ్బారాయుడిగా ఖ్యాతి ఈశ్వరస్వరూపముకూడ కనుకనే గుడిబయట వాహనముగా నందినే ప్రతిష్ఠిస్తారు. నెమలివాహనము కొన్నిచోట్ల లేకపోవడానికి కారణము అదేనేమొ.

ఆత్రేయపుర మండలం పేరవరం గ్రామంలో వల్లీదేవసేన సహిత ఈ సుబ్రహ్మణ్యుడికి సుబ్బారాయుడి గుడి అని పేరు. వల్లీదేవసేన సహితసుబ్రహ్మణ్యస్వామి దేవాలయముగ ఖ్యాతి. నంది గుడి బయట సుబ్బారాయుడికి ఎదురుగా ప్రతిష్టింపబడింది. ఇప్పుడు చుట్టూ ప్రహారీతో అందమైన ప్రాంగణముగ  ధ్వజస్తంభముతో  ఈప్రాంగణములోని వాలయము భక్తులకు ఆనందదాయకముగ గోచరిస్తుంది. ఒకప్పుడు ఈ ప్రాంగణములోనే ఖాళీ స్థలములో పాకలు  ఉండేవి. ఆపాకలలో ఎలిమెంటరీ పాఠశాల నడిచింది. నాల్గవతరగతివరకు నేను ఆపాకలలోనే చదువుకున్నానన్నది మధురానుభూతి. ఇప్పుడు పాఠశాలకు ప్రత్యేక భవనమొచ్చింది.

పేరవరం వల్లీదేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వరుడు

పేరవరము తీర్థముగా సంతాన సుబ్రహ్మణ్యేశ్వరుడిగా నా చిన్నప్పుడు చెప్పుకున్నారు. మొదట్లో ఇదొక్కటే దేవాలయము. ఇప్పుడు ఇంచుమించు అన్నిగ్రామాలలోను సుబ్రహ్మణ్యేశ్వరుడి దేవాలయాలు వెలిశాయి. పేరవరము తీర్థము నేటికీ ఆకర్షణగా సుబ్బారాయుడి షష్ఠిగా అనుభూతినిస్తుంది. విశ్వనాథవారి వేయిపడగలలో సుబ్బన్నపేట సుబ్బారాయుడి స్వామివారి దర్శనమే! అందుచేత వేయిపడగల సర్పరూపుడు సుబ్బారాయుడు. శివస్వరూపుడు. ఆంధ్రప్రాంతములో సుబ్బారాయుడిగా నాగేశ్వరుడిగా పూజలందుతున్నాడు. ఒక్క పేరవరములోనే కాదు ఆంధ్రప్రాంతము పేర్లలో స్త్రీ పురుష నామములులో సుబ్బారాయుడి పేరు, నాగ శబ్దము ముడివడుతున్నాయి. భయభక్తి సూచనారాధన నాగారాధన.

ఉత్తరభారతదేశ ప్రాంతములోని నాగపంచమి పూజకు తెలంగాణాలోను, ఆంధ్రప్రాంతములోను కద్రువ సంతానానికి నాగపంచమిగ, లేదా వినతాసుతుడు గరుడునికి గరుడ పంచమిగ ఈ పూజకు ప్రాముఖ్య మంతగా కానరాదు. కాని నాగులుతో మనము సహజీవనము చేసాము. సుబ్బారాయుడి షష్ఠిగా నాగారాధన పాములుకు కాదు. ఒకజాతితో అనుబంధము అని మనకు అభిప్రాయముంది. ఈ నాగజాతి క్రీ.పూ 691లో మగధ రాజ్యమునాక్రమించారు. బుద్ధుడు 923లో జన్మించాడు. మగథరాజు కుమారుడుగ బౌద్ధమతమును స్థాపించిన నాగవంశీయుడని ఫర్గూజన్ పండితుడు అభిప్రాయపడ్డాడు. భారతములో వినతా పుత్రుడు గరుడుడు, కద్రువ నాగమాతగా నాగులు కశ్యప సంతానముగా వైరముతో ఉన్నారు.  ఫలితము అమృతోపహరణము. గరుడ సర్పజాతుల ప్రీతికి నాగపంచమి తిథిగా పూజ జరిపే ఆచారమయింది అంటారు. మనకు నాగులచవితి, సుబ్బారాయుడి షష్ఠి కూడా నాగారధన.

కుంతి తాత నాగులకు బంధువు. భీముడు దుర్యోధనుని అసూయ కారణగా నాగాయుతబల సంపన్నుడయిన కథ ఉంది. కాని తక్షకుడు నాగరాజు. జనమేజయుని తండ్రి పరీక్షిత్తుని నిష్కారణంగా కాటువేసి చంపాడు. జనమేజయుడు సర్పయాగము జరిపించినా ఆస్తీకుడు బంధుత్వము కారణముగ సర్పయాగము ఆగిపోయింది. బంధుత్వ వైరములున్నా నాగుల ప్రసన్నత అవసరమని నిరూపిస్తాయి. నాగబు అంటే నాగుపామును ధ్వనించే తొలి తెలుగుపదము, మనకు నాగులతోటి అనుబంధమును చాటింది. పాము విషముకన్న కరోన భయంకరమైనది. సుబ్రహ్మణ్యేశ్వరుడు కరోన విషహరుడై శాంతికలిగించాలని సుబ్రహ్మణ్య షష్టిని ఆనందంగా జరుపుకుందాం.

Exit mobile version