అందమైన కుట్టు పని : సుఈ-ధాగా

0
2

[box type=’note’ fontsize=’16’] “హాస్యంతో కూడిన సంభాషణలు, వో సాధారణ గృహస్థు జీవితం, ఆ ఇల్లూవాకిలి, నీళ్ళ ఇబ్బందులు, ఆ భాష, వొకటేమిటి అన్నీ. వీటికి తోడు నటనలు. వో సారి చూడమనే రెకమెండ్ చేస్తాను” అంటున్నారు పరేష్ ఎన్. దోషి “సుఈ-ధాగా” సినిమాని సమీక్షిస్తూ. [/box]

“దం లగా కే హైసా” చిత్రంతో గుర్తుండిపోయాడు శరత్ కటారియా. అందమైన కథను తీసుకోవడం, వొక ప్రాంతం అనుకోవడం ఇక అక్కడి భాష, వేషభూషాలు, అక్కడి ప్రత్యేకతలు అన్నీ దృష్టిలో పెట్టుకుంటూ కథను అల్లుకుంటూ పోవడం. నాటకీయ స్వేచ్చ అందులోనూ ఇందులోనూ తీసుకున్నా మొత్తం మీద గుర్తుపెట్టుకోతగ్గ దర్శకుడనిపించుకున్నాడు. అంతకు ముందే రజత్ కపూర్ లాంటి వాళ్ళకి అసిస్టెంటు దర్శకుడుగా చేయడం, కొన్ని సినెమాలకు సంభాషణలు అందించడం ఇవన్నీ వున్న అనుభవంతో సినెమాలు కూడా చక్కగా అందిస్తున్నాడు.

సుఈ ధాగా అంటే సూదీ దారం. వొకటి కథ కుట్టుపనికి సంబంధించింది కాబట్టీ, మరొకటి ఆ జంట కలిసి జీవితపు చిరుగులు కుట్టుకుంటూ విజయం వైపు పయనిచడం కారణాలుగా ఈ టైటిల్ నప్పింది.

మౌజీ (వరుణ్ ధవన్) చదువబ్బక వో షాపులో గుమస్తాగా చేస్తుంటాడు. అక్కడి యజమానీ అతని కొడుకూ ఇతన్ని జంతువు కంటే హీనంగా చూస్తుంటారు. వో ప్రభుత్వ కార్యాలయంలో అటెండరు అయిన తండ్రి (రఘుబీర్ యాదవ్) కి పెద్ద కొడుకంటే ప్రేమ, మౌజీ అంటే చిన్న చూపు. వాస్తవానికి ఆ పెద్ద కొడుకు కూడా తన భార్యతో పాటు విడిగా వుంటూ, తమ బాబును చూసుకొమ్మని రోజు వీళ్ళ ఇంట్లో విడిచి పనులకు వెళ్తుంటారు భార్యాభర్తలు. పెళ్ళై యేళ్ళైనా ఇంట్లో తగినంత ప్రైవసీ లేక మౌజి-మమతలకు కూడా కలిపి గడిపే యేకాంతం కూడా లేకుండా పోతుంది. ఇన్ని వున్నా మౌజి మొహాన చిరునవ్వు మాత్రం చెదరదు. పక్కింటి వాళ్ళ కుట్టు మెషిను పడుంటే మౌజి చిన్నా పెద్దా కుట్టు పనులు చేస్తుంటాడు. అతని తండ్రికి కూడా తెలిసిన విద్యే, కాని అయిష్టత. కారణం యేమిటంటే రెడీమేడ్ వస్త్రాల వ్యాపారం వూపందుకున్నాక టైలర్లకు పని లేకుండా పోతుంది. ఈ సందర్భంలో మనం ఖదీర్ బాబు కథను తలచుకోవచ్చు. చాలా వివరంగా వ్రాశాడు. మౌజి యజమాని కొడుకు పెళ్ళికి అందరూ వెళ్తారు. అక్కడ ఆ పెళ్ళికొడుకు తన భార్య వినోదం కోసం మౌజి చేత కుక్కలా నటింప చేస్తాడు. అది చూసిన మమత తట్టుకోలేకపోతుంది. మర్నాడే అంటుంది, యేదో వొక సొంత పని చేయండి, ఇది మాత్రం వద్దు; నేను మీ కూడా వుంటాను అని. తండ్రి ఉద్యోగ విరమణ, కొడుకు ఉద్యోగాన్ని కాలదన్నడం వొకేసారి జరుగుతాయి. ఇంట్లో రభస. తల్లికి అటాక్ వస్తుంది. ఆసుపత్రి చుట్టూ పరుగులు. ఆసుపత్రిలో ఆమెకు అనుకూలంగా వుండేలా వో మేక్సీ డిజైన్ చేసి కుడతారు భార్యాభర్తలిద్దరూ కలిసి. అది అక్కడి మిగతా పేషంట్లకు యెంతగా నచ్చుతుందంటే ప్రతి వొక్కరూ తమకోసం కుట్టి పెట్టమని ఆర్డరు ఇస్తారు. అనుకోని విధంగా కొత్త వ్యాపారానికి బాట పడుతుంది. ఉత్సాహం, ఉరుకులు, పరుగులు. కానీ స్నేహం పేరుతో జరిగే కుట్రలు, కార్పొరేట్ రంగం తెలివిగా చేసే దోపిడీ ఇలాంటి అవాంతరాలన్నీ దాటుకుని ముందుకు యెలా వెళ్ళారు అన్నది మిగతా కథ. ఇక్కడ కాస్త నాటకీయ స్వేచ్చ తీసుకున్నా అది మూల భావనకు విధేయంగా వుంటూ పంటి కింద రాయిలా తగలదు.

గత నాలుగు దశాబ్దాలుగా దేశంలో వస్తున్న ఆర్థిక రంగంలో మార్పులు, కార్పొరైటేషన్, చిన్న పనివారు చతికిలపడటం, ఉమ్మడి కుటుంబాలు పోయినా అందులో వుండే రాజకీయాలు గాని, ఎక్స్‌ప్లాయిటేషన్ గాని రూపు మార్చుకుని కొనసాగడం, తండ్రికి చదువుకున్న, చదువుకోని కొడుకుల మధ్య వివక్ష, కూర్చుని విశదంగా, విరామంగా మాట్లాడుకోలేని ఆ జంట మధ్య కూడా చెప్పకుండానే అర్థం చేసుకోగల సాన్నిహిత్యం, ఇలాంటి చిన్న చిన్న డీటైల్స్ ఆకర్షిస్తాయి. తోడుగా చివర్న వాళ్ళు కుట్టే ఆ బట్టలు, ఆ రేంప్ వాక్ అవీ అసహజంగా, యెబ్బెట్టుగా వుంటాయి. మొత్తం మీద చెప్పాలంటే చిత్రం బాగానే వుంది.

అనుష్క నటన బాగుంది. వరుణ్ ధవన్ అక్టోబర్ లో, ఇందులో కాస్త బాగానే చేశాడు. రఘువీర్ యాదవ్ గురించి చెప్పేదేముంది. కాని ఇందులో విస్మయపరిచేది మౌజి తల్లిగా చేసిన యామిని దాస్ నటన. నమిత్ దాస్ (ఇతను ఈ మధ్యే పటాఖా లో కూడా చేశాడు) బాగా చేశాడు. వీళ్ళ నటన గురించి, ఆ కుటుంబ వాతావరణ సృష్టిలోని డీటైల్‌కి , వరుణ్ గ్రోవర్ వ్రాసిన పాటలకి, అను మల్లిక్ సంగీతానికి (దం లగా కే హైసా అంత గొప్పగా లేకపోయినా), శరత్ కటారియా కథ, మాటలు, దర్శకత్వానికీ చూడొచ్చు. ఇక చాయాచిత్రణ అనిల్ మెహతాది అంటే ప్రత్యేకంగా చెప్పాలా?! “ఖామోషి” రోజులనుంచీ చేస్తున్న ఇతను “ఆజా నచలే” చిత్రానికి దర్శకత్వం కూడా చేశాడు.

కొన్ని చోట్ల కథ నమ్మగల పధ్ధతిలో లేకున్నా, ఊహించగల పధ్ధతిలో వున్నా ఈ చిత్రంలో ఆకర్షించే అంశాలు చాలానే వున్నాయి. హాస్యంతో కూడిన సంభాషణలు, వో సాధారణ గృహస్థు జీవితం, ఆ ఇల్లూవాకిలి, నీళ్ళ ఇబ్బందులు, ఆ భాష, వొకటేమిటి అన్నీ. వీటికి తోడు నటనలు. వో సారి చూడమనే రెకమెండ్ చేస్తాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here