సుందరమూర్తి, సులోచనల కళాపోషణ

0
1

[box type=’note’ fontsize=’16’] సంచిక నిర్వహించిన హాస్యకథల పోటీకి అందె మహేశ్వరి పంపిన హాస్యకథ “సుందరమూర్తి, సులోచనల కళాపోషణ”. భర్త చేత ఎలాగయినా “శభాష్! సులోచన” అని అనిపించుకోవాలనుకుని భర్తకు తెలియకుండా ఏవేవో చేయాలనుకున్న భార్య గురించి చెప్తున్నారు రచయిత్రి. [/box]

[dropcap]సుం[/dropcap]దరమూర్తికి చిన్నతనం నుండి కలలు, ఊహలు మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే చాలా ఎక్కువే. అలా ఊహల్లో విహరించే సుందరానికి మాట, మంచీ చెప్పే ఒక బామ్మ ఉంది. ఆవిడ మొదటి నుండి “ఒరే! సుందరాయ్.. మరీ గాల్లో కార్లు నడపకురా! అవి నేల మీద నడిస్తేనే కాస్త పద్దతిగా ఉంటుంది. ఒక వేళ బోల్తా కొట్టినా, బతికి బయటపడే మార్గం ఉంటుంది రా. లేదంటే ఏదో ఒక రోజు నువ్వు పై నుండి పల్టీ కొడితే ఏమైపొతావో!!” అని చెవిలో ఇల్లు కట్టుకుని మరీ పోరు పెట్టి, ఆవిడ మాత్రం ఎంచక్కగా పైకెళ్ళిపోయింది.

కానీ, ఆవిడ బోధలు సుందరం చెవుల కర్ణభేరిని కూడా తాకలేదు సుమా!! “మడిసన్నాక కాసింత కలాపొసన ఉండాలయ్యా, ఉత్తినే తిని, తొంగుంటే మడిసికి, గొడ్డుకి తేడా ఏటుంటది” అనే ముక్కని బాగా వంటబట్టించుకున్నాడు సుందరం. కాబట్టి జీవితంలో కలలతో పాటు కాస్తంత కళాపోషణ కూడా చేస్తాడు మన సుందరం. కాబట్టి తనకి కాబోయే భార్యమణి (ఇలాంటి ఈ కథానాయకుడికి, తనకు లభించే ఊహాసుందరి గురించీ మన ఊహకి అందని ఊహలు ఉంటాయి కదా) గురించీ టీవిలో సీరియల్స్ కి వచ్చే పాటల్లా బోలెడు రాసుకున్నాడు తన ‘గుప్తసౌధం’ అనెడి పుస్తకంలో.

తన సుందరి అందరి అమ్మాయిలలా, ఎటువంటి బలహీనతలు (Shopping, Movies, Restaurants. etc etc) ఉండకూడదని, మంచి భావుకత ఉన్న భార్యనే తాను ఎంచుకోవాలని కలల్లో తేలుతుండగా.. ‘వరుడు’ సినిమా విడుదలయింది. దాంతో, ఆ సినిమాలోని కథానాయకుడి పాత్ర చేత ప్రేరేపింపబడిన వాడై, తన తల్లిదండ్రులకు తన పెళ్ళి మీద సర్వహక్కులు ఒప్పజెప్తున్నట్లు, తన పట్టపురాణి ఎలా ఉండాలో, వాళ్ళని ఎండలో నిలబెట్టి మరీ ఉపోద్ఘాతం ఇచ్చేశాడు.

దాంతో సుందరం అమ్మానాన్నలు, తమ పుత్రరత్నానికి పిచ్చి ఎక్కువయ్యేలా ఉందని, ఏదో విధంగా వాడికి నచ్చిన పిల్లని వెతికి, వడకొట్టి తేవాలని సంకల్పించుకున్నారు. ఈ సుందరమూర్తికి తగు సుందరాంగి అయిన భార్యను వెతకనారంభించారు. కానీ, తమ పుత్రుడు చెప్పిన విధంగా ఉండే కోడలిని వెతకాలని.. విశ్వప్రయత్నం చేసి, చివరకు చిరిగిన చెప్పులతో, మాసిన బట్టలతో కాలంగడపవలసి వచ్చింది (అంటే అంతలా అన్వేషించారని నా ఉద్దేశం). ఇలా అయితే సుందరమూర్తి, జీవితాంతం బ్రహ్మచారిలా ఉంటాడేమో అని, వంద అబద్ధాలు ఆడి అయినా వివాహం నిశ్చయించాలని వాళ్ళు నిశ్చయించుకున్నారు.

అలా వేటాడి, ఒక అమ్మాయిని చూసి, మనవాడికి సరిజోడి అనిపించి “అమ్మా! నీవు వంటలలో, కళాపోషణలో ప్రావీణ్యురాలివేనా?” అని అడుగగా, దించిన తల ఎత్తకుండా “ఊ” అని తల ఆడించింది. అంతే ఆ తల్లిదండ్రుల ఆనందం ఆకాశాన్ని దాటేసి తారలను చేరుకుంది. అన్నట్లు చెప్పడం మరిచాను.. సుందరమూర్తి గత నాలుగేళ్ళగా ఎక్కడో భాష తెలియని బెంగాలు రాష్ట్రంలో.. రోజూ ఆ ఎండిపోయిన రొట్టెలని, చేపలని తింటూ, ‘నాకు తినడనికి రెండు చేపముక్కలు ఇచ్చావు’ అని దేవుడిని తలచుకుంటూ కాలం గడిపేస్తున్నాడు. తనకి వివాహయోగం, బదిలీ యోగం తొందరలో కలగాలని ఆ కాళిమాతకు కూడ చేప ప్రసాదమే పెట్టి మొర్ర పెట్టుకున్నాడు. మరి మొక్కుల ప్రభావం ఏమో గానీ… ఒక శుభముహుర్తాన, తాను అనుకున్నట్లుగా, జీలకర్ర బెల్లం పెట్టే ముందు, తెర తీసే సమయంలో ఎదురుగా ఉన్న పుత్తడి బొమ్మలాంటి మోముని చూసి, మంత్రోచ్చారణల మీద ఏకాగ్రత లేనివాడై, ఊహల్లో తేలుతునే తాళికట్టేశాడు (‘అలా తేలిపోకు నాయనా! ముందు ముందు నీకు తెలిసివస్తుంది’ అని పంతులు చెప్పినా, అవేమీ వినబడలేదు). తాళికట్టిన మర్నాడే హైదరాబాదుకి బదిలీ కాగితాలు వచ్చేశాయి. ఇక సుందరమూర్తి ఆనందం అంతా ఇంతా కాదు. ‘గాల్లో తేలినట్లుందే’ అని పాటలు పాడేసుకున్నాడు.

కొత్త కాపురం, కొత్త ఊరు.. అన్ని కొత్తగా ఉన్న తనకి, తన జీవితం ఇంత కొత్తపుంతలు తొక్కుతుందని తాను ఊహించని రోజులు చేస్తున్నాయని గ్రహించలేని స్థితిలో సుందరమూర్తి కాస్తా, ఆనందమూర్తి అయినాడు. ఇంతకీ, భార్యమణి పేరు మనం తెలుసుకోలేదు సుమండీ! ఆవిడ పేరు సులోచన. అందరు ముద్దుగా సుల్లు.. కొందరు సొల్లూ అని కూడా పిలుస్తూ ఉంటారు. అలా ఆవిడ స్నేహితులు ఎవరైనా పిలిస్తే, సుందరమూర్తికి మండుటెండలో నిలబెట్టి, కాలిపోతున్న మొక్కజొన్న పొత్తుకి కారం రాసి తినిపిస్తున్నట్లుండేది. కానీ, కొత్త పెళ్ళాం.. వాళ్ళ స్నేహితులు గనుక, తన భార్యని తన ఇష్టం వచినట్లే అందరూ పిలవాలని ఆశించని వాడై సర్దుకుపోసాగాడు. మెల్లగా భార్యామణి వంట ప్రావీణ్యం తెలిసి వచ్చింది. ఉప్పుతో చక్కెరని, కందిపప్పుతో పచ్చిపప్పుని, కరివేపాకుతో కొత్తిమీరనీ, బియ్యంపిండితో మైదా పిండితో.. తారు మారుగా, మారు తారుగా వండేస్తుంటే, వంటల్లో వచ్చే ఆ కొత్తదనాన్ని కొత్తల్లో కొంత ఆస్వాదించగలిగినా.. పోను పోనూ, అది నరకంలో యముడు విధిస్తున్న శిక్షాస్మృతిలో ఒక భాగం అని అర్థమయ్యింది.

తదుపరి, సుందరమూర్తికి సులోచనలో ఉన్న కళను తట్టిలేపాలని తోచింది. వంట అయితే సర్దుకుపోయానుగాని ఈ కళాపోషణలో మాత్రం నేను కాంప్రమైజ్ అయ్యే సమస్యే లేదు అని భార్యను తనకు నచ్చిన పుస్తకాలు పేర్లు కొన్ని చెప్పమన్నాడు.

“ఓహ్! నాకు పుస్తకాలు అంటే చాల ఇష్టం. ముఖ్యంగా పీపాలో శవం, వేణువుతో వెన్నుపోటు, కత్తితో కాలక్షేపం, భర్తలారా తస్మాత్!!” అంటూ చెప్తూ పోతుంటే సుందరమూర్తికి చెమటలు పట్టి, పై ప్రాణాలు పైనే పోయాయి. అయినా ధీరుడై .. సరే!! Reading skills ఎటూ అంత బాగా లేవు కనీసం writing skills అయినా బాగుంటాయేమో అన్న భ్రాంతిలో.. “నువ్వెపుడైనా కవితలు రాశావా” అని అడగగానే, “ఛీ viagra generico prezzo! పొండి, నా ప్రతిభాపాటవాల గూర్చి మీకు తెలియక అడిగినట్లున్నారు” అని సిగ్గుపడుతూ, “నేను చేస్తాను సాంబారు, మీరు వెళ్లారు బజారు, నా కవితలలో జోరు, మీకు జలజలా కారేను కన్నీరు” అని వినిపించింది.

ఆ క్షణంలో మన సుందరానికి, ‘రక్తకన్నీరు’ అర్థం బోధపడింది. Reading and Writing skills రెండూ తప్పిన తన సులోచనకి కనీసం, listening skills ఉంటాయేమో అని తలచి.. అలా తల దించీ, ‘గుప్తసౌధం’లో ఎన్నో ఏళ్ళు గుప్తంగా దాచిన తన కవితలని వినిపించడం మొదలు పెట్టాడు. తల ఎత్తి చూసేసరికి సులోచన, తన లోచనాలని సుఖపెడుతూ కనిపించింది (అంటే నిద్ర పోతుందన్న మాట). దాంతో పాపం సుందరం తన కళాపోషణకి కాలం చెల్లిందని గుర్తించాడు. కానీ, సులోచన తన భర్త ఎంతో ఖిన్నుడయ్యడని తలచీ ‘ఎటులనైన తన భర్త చేత మెప్పు పొందవల’నని ఆరో ఏట అర సంవత్సరం నేర్చుకున్న తన వాయులీనాన్ని పంపమని పుట్టింటికి కబురు చేసింది. మర్నాటికల్లా వయొలిన్ వచ్చేసింది.

ఆదివారం కావడం వల్ల సుందరం పొద్దున్నే లేవలేదు. భర్తను ఆనందాశ్చర్యాలలో ముంచేత్తాలని సులోచన తన ప్రావీణ్యాన్ని ప్రదర్శించసాగింది. అప్పటిదాక, కలల్లో విహరిస్తున్న సుందరమూర్తికి ఆ కర్ణకఠోరమైన శబ్దాలను విన్న పిమ్మట, ముందు కనులలో నుండి కారిన రక్తం ఇప్పుడు చెవులలోనుండి కారడం మొదలయింది. ముందు నోటీసు ఇవ్వకుండా ఇల్లు కూల్చేసే మున్సిపాలిటి వాళ్ళ వాహనాల రణగొణ ధ్వనుల మధ్య ఒంటరిగా నిలబడినట్లైంది. ఆ దెబ్బకి, తన భార్యని పిలిచి తాను ఇకనుండి కళపోషణ మానేస్తున్నాని, సులోచనని కూడ మానేయమ్మని బ్రతిమాలి, బామాలి తన బామ్మ బొమ్మ ముందు ప్రమాణం చేయించుకున్నాడు.

అటు పిమ్మట వంట, వార్పు నుండి అన్ని పనులూ చేయడనికి ఊరి నుండి ఒక పెద్దావిడను పిలిపించి, భార్యను Shopping, movies, Restaurant అంటూ, ఊళ్ళో ఉన్న కళలపై శ్రద్ధ మొదలుపెట్టి తన కళాపోషణకు స్వస్తి చెప్పాడు సుందరమూర్తి.

కానీ సులోచనకు మాత్రం తన భర్త సుందరం చేత ఎలాగయినా “శభాష్! సులోచన” అని అనిపించుకోవాలనే పట్టుదల మాత్రం ఇంకా తీరలేదు. కనుక భర్తకు తెలియకుండా ఏదో బృహత్కార్యం చేయాలనే సంకల్పం చేసింది. పిచ్చి పలురకాలైతే పర్వాలేదు. కాని పలుపిచ్చిలు ఒకరికే చూపించాలనుకుంటే పాపం, ఆ పురుషుడి పని ఏంగానూ!! మరి ఏమి చేయనుందో, పాపం ఆ సుందరమూర్తిని ఆ కాళికా మాతే రక్షించాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here