Site icon Sanchika

సునయన

[dropcap]ఉ[/dropcap]దయాన్నే జిమ్ నుండి ఇంటికి తిరిగొచ్చిన సుధీర్ సోఫాలో సేదదీరుతూ దినపత్రిక చదవడంలో నిమగ్నమయ్యాడు.

ఇంతలో తల్లి శకుంతల అందించిన జూస్ గ్లాస్ అందుకుంటూ,

“అమ్మా! నాకో సందేహం. ఈ పత్రికల్లో వస్తున్న రాశిఫలాలు నిజమవుతాయా?” నొసలు చిట్లించి అడిగాడు సుధీర్.

“ఏమోరా… నాకైతే వాటిపైన నమ్మకం లేదు. నేనెప్పుడూ వాటిని చదవను” సూటిగా చెప్పింది శకుంతల.

దీర్ఘాలోచనల్లో మునిగిన సుధీర్‍ని చూసి,

”అన్నట్లు మీ నాన్న ఎప్పుడూ వాటిని చదువుతుంటారు. వాటిపై  ఆయన అనుభవాలేంటో అడిగి తెలుసుకో” అంటూ ఓ ఉచిత సలహా ఇచ్చి వంటింటి వైపు వడివడిగా నడిచింది శకుంతల.

అప్పుడే మార్నింగ్ వాక్ నుంచి తీరిగ్గా ఇల్లు చేరాడు సుధీర్ తండ్రి భానుమూర్తి.

“ఏంటో! తల్లీకొడుకులు ఏవేవో మంతనాలు చేస్తున్నట్లున్నారే…”

“ఏం లేదు నాన్నా! ఈ పత్రికల్లో వస్తున్న రాశిఫలాలు నిజంగా జరుగుతాయా? లేదా? అని మాట్లాడుకుంటున్నాం… మరి… ఈ విషయంలో మీరేమంటారు నాన్నా?” అడిగాడు సుధీర్.

“ఆఁ! ఏముంది!! కొందరికి కొన్ని జరుగుంటాయి. కొందరికి జరుగకపోవచ్చు. మంచి జరుగుతుందని వుంటే, అది ఎప్పుడు జరుగుతుందా అని, ఆ రోజంతా ఆశగా ఎదురుచూస్తుంటారు. చెడు జరుగుతుందని వుంటే, అది జరుగకుండా ఉంటే బాగుండని ఆ రోజంతా అనుకుంటూ, ఆ చెడునుండి తప్పించుకునేందుకు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటుంటారు” విశదీకరించాడు భానుమూర్తి.

“ఈ రోజుల్లో దినపత్రికల్లో దినఫలాలు, వారపత్రికల్లో వారఫలాలు, మాసపత్రికల్లో మాసఫలాలు వస్తున్నాయి. పైగా ఉగాదికి పంచాంగ శ్రవణాల్లో ప్రతి రాశి వారికి రాబోయే సంవత్సరం ఎలా వుండబోతుందో కూడా చెప్తున్నారు పండితులు, కదా నాన్నా!”

“అవును సుధీర్! ఆ మాటకొస్తే కొన్ని టీ.వీ ఛానళ్ళల్లో కూడా ఉదయాన్నే రాశిఫలాలు చెప్తున్నారు”

“అవున్నానా! మనం కావాలనుకుంటే ప్రతిరోజూ ఉదయానికల్లా మన దినఫలం మన ఈమెయిల్‍కి పంపిస్తాయి కొన్ని వెబ్ సైట్‍లు”

“సరేకాని సుధీర్! ఇంత సీరియస్‍గా రాశిఫలాల గురించి అడుగుతున్నావ్… ఏంటి విశేషం? తెలుసుకోవచ్చా?”

“ఆఁ, ఏం లేదు నాన్నా! ఊరికే!!” అంటూ…

“అమ్మా!” అని పిలుస్తూ టాపిక్ డైవర్ట్ చేశాడు సుధీర్.

“ఏంట్రా?” వంటగదిలోనుంచి అరిచింది శకుంతల.

“కూరగాయల మార్కెట్టుకు వెళ్ళొస్తాను”

సుధీర్ దగ్గరకు వచ్చి “ఈరోజు మార్కెట్‍కి నాన్న వెళ్తారులేరా! అదీ కాక ఈ రోజు సాయంత్రమే నీ ఊరి ప్రయాణం. నీ పన్లు నీకుంటాయ్ కదా!” ఆప్యాయంగా చెప్పింది శకుంతల.

“లేదమ్మా. ఈ రోజు నేనే వెళ్తాను. రేపటి నుండి పాపం… నాన్నకెటూ ఈ మార్కెట్ పని తప్పదు కదా!”

“సరే! నీ ఇష్టం” అంటూ చీటీ, డబ్బులు, సంచులు సుధీర్ చేతికిచ్చింది శకుంతల.

మార్కెట్‍కి బయలుదేరాడు సుధీర్.

***

ఫ్రభుత్వ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్‍గా పనిచేస్తూ భానుమూర్తి, తెలుగు లెక్చరర్‍గా పనిచేస్తూ శకుంతల, ఇద్దరూ ఉద్యోగ విరమణ చేసి హైదరాబాద్‍లో స్థిరపడ్దారు. వారి ఒక్కగానొక్క సుపుత్రుడు సుధీర్. చూడ్డానికి సినిమా హీరోలా ఉంటాడు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ తరువాత ఓ ప్రభుత్వరంగ బ్యాంకులో జూనియర్ ఆఫీసర్‍గా విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు సుధీర్.

సుధీర్‍కి వివాహం చేసే ప్రయత్నాలు ఓ సంవత్సరం నుండి ముమ్మరంగా సాగుతున్నాయి. కాని ఇంకా సరైన సంబంధం కుదరలేదు. అందుకు వేరే కారణాలు ఏమీ లేవు కాని…

సుధీర్ తల్లిదండ్రులకు, రాబోయే కోడలు తమ కొడుకును బాగా చూసుకోవడమే కాకుండా ఉత్తరోత్తరా తమల్ని కూడా ప్రేమగా, అభిమానంగా, చూసుకునే అమ్మాయి కోసం వెతుకుతున్నారు.

అలాగే సుధీర్ కూడా, తనకు కాబోయే శ్రీమతి తన తల్లిదండ్రులను కూడా, ఆమె తల్లిదండ్రులుగా భావించి, ప్రేమానురాగాలను పంచే అమ్మాయి కోసం చూస్తున్నాడు.

ముగ్గురూ ఒకింత ఎక్కువ జాగరూకతతో చూస్తుండటం వల్ల, ఓ పట్టాన సంబంధాలు కుదరడం లేదు, అంతే!!

ఈ నేపథ్యంలో ఆ రోజు ఉదయం దినపత్రికలో వచ్చిన దినఫలాల్లో సుధీర్‍కి కలిసొచ్చే విషయం ఒకటి వుంది.

“మీరు పెండ్లి కానివారైతే ఈ రోజు మొత్తంలో, ఒక వ్యక్తిని మీరు మూడు సందర్బాలలో కలుస్తారు. ఆ వ్యక్తే మీకు కాబోయే జీవిత భాగస్వామి”

అది చదివిన సుధీర్‍కి ఆశలు చిగురించాయి. ఎన్నాళ్ళనుంచో ఎదురుచూస్తున్న రోజు, ఈ రోజే అవబోతుందన్న ఆలోచన, సుధీర్ మదిలో మయూరిలా నాట్యం చేసింది.

అంతా ఆ పరమాత్ముడి లీల…

ఏమౌతుందో… ఏమో! వేచి చూడాలి మరి!

***

మార్కెటుకు చేరుకున్న సుధీర్, ఓ దుకాణంలో కూరగాయలు కొంటూ, మరో దుకాణంలో కొంటున్న సత్యవతి ఆంటీని చూశాడు. శకుంతలతో పాటు సంస్కృత లెక్చరర్‍గా పనిచేస్తూ, ఉద్యోగ విరమణ చేసి హైదరాబాద్‍లోనే వుంటుంది సత్యవతి. పలకరిద్దామని అటుగా వెళ్తున్న సుధీర్‍కి సత్యవతి ఆంటీ పక్కనే సంప్రదాయమైన కట్టుబొట్టుతో, వినయ విధేయతలు ఉట్టిపడుతున్న, ఓ అందమైన అపరంజి బొమ్మలాంటి అమ్మాయి కనిపించింది.

ఆ అమ్మాయి మధ్య మధ్యలో సత్యవతి ఆంటీతో ఏదో మాట్లాడుతుంది. బహుశా ఆంటీ బంధువై ఉండవచ్చునని ఊహించిన సుధీర్ అక్కడకు చేరుకుని,

“నమస్తే ఆంటీ!” అన్నాడు.

“ఓఁ! నమస్తే సుధీర్! ఎలా వున్నావ్? అమ్మా నాన్నా ఎలా వున్నారు?”

“మేమంతా బాగున్నాం ఆంటీ! మీరెలా ఉన్నారు?”

“మేమందరం బాగున్నాం… ఎలా వుంది నీ ఉద్యోగం?”

“బాగుందాంటీ”

సత్యవతి ఆంటీతో మాట్లాడుతున్నాడే కాని, కళ్ళు మాత్రం ప్రక్కనున్న ఆ అమ్మాయివైపు, కొంటెగా ఎగాదిగా చూస్తున్నాయి.

అర్థం చేస్తుకున్న సత్యవతి “అన్నట్లు చెప్పనేలేదు కదూ! ఈ అమ్మాయి పేరు సునయన. మా చెల్లెలి కూతురు” అంటూ మరీ ముక్తసరి పరిచయం చేసింది సుధీర్‍కి.

చూపులు కలుపుకున్న సుధీర్, సునయనలు, చేతులు కూడా కలుపుకుని పరస్పరం పరిచయమయ్యారు.

“వెళ్ళొస్తాం సుధీర్” అంటూ బయలుదేరిన సత్యవతి ఆంటీని, ఓ క్రమశిక్షణ కలిగిన విద్యార్థినిలా అనుసరించింది సునయన.

నోటిమాట రాని సుధీర్, కనిపించినంత దూరం సునయనను చూస్తూనే నిల్చున్నాడు. అలా చూస్తుండటం, ఎవరైనా చూస్తే బాగోదనుకున్నాడేమో, తల తిప్పుకున్నాడు. మిగతా కూరగాయలను కూడా కొనుక్కుని ఇంటిదారి పట్టాడు.

సుధీర్ మనసంతా గజిబిజిగా గందరగోళంగా వుంది. ‘ఏమిటిది? నేను ఇంతగా ఆ అమ్మాయివైపు ఆకర్షితమవడమేంటి? ఇంతకు ముందు చాలామంది అమ్మాయిలను చూశాను. ఎప్పుడూ ఇలాంటి మానసిక స్థితిని పొందలేదే! ఈ రోజేమైంది నాకు? నా విచిత్ర ప్రవర్తనకు సత్యవతి ఆంటీ ఏమనుకుందో? ఏమో! కొంపదీసి అమ్మానాన్నలకు ఈ సంఘటన గురించి చెప్పదు కదా!

ఏది ఏమైనప్పటికీ ఆ అమ్మాయిలో ఏదో ఉంది… కవుల కవిత్వానికే అందనంత అందం ఆ అమ్మాయి సొంతం.

మొదటి చూపులోనే నన్ను కట్టిపడేసింది, అందుకే నేను ఆ అమ్మాయిని అంతగా ఆరాధించకుండా ఉండలేకపోతున్నాను.

బహుశా అమ్మానాన్నలకు ఓ మంచి కోడలి కోసం ఇంతకాలం నుండి మేమంతా అంతగా వెతుకుతున్న అమ్మాయి ఈ అమ్మాయేనేమో! ఈ అమ్మాయే అయితే… ఓ… ఎంత బాగుంటుందో కదా!!’…. అనుకుంటూ ముందుకు సాగుతున్న సుధీర్‍కి ఉన్నట్లుండి, ఉదయాన్నే దినపత్రికలో చూసిన దినఫలం మదిలో మెదిలింది.

‘అవును. ఈ రోజు నా దినఫలాల్లో ఉన్నట్లు ఈ అమ్మాయే… ఈ రోజు మరో రెండు సార్లు నాకు కనిపిస్తుందా? ఆ అవకాశం ఉందా? చాలా కష్టం కదా!!

అయినా సరే కనిపిస్తే ఎంత బాగుంటుంది!! ముచ్చటగా మూడుసార్లు కనిపిస్తే ఆ మూడు ముళ్ళేవో వేసేసి… ఆ అమ్మాయిని నా అర్థాంగిగా చేసుకుంటాను!!

అరెరే! ఏంటిది? ఇలా ఆలోచిస్తున్నానేంటి? ఓ సభ్యతా… సంస్కారం… లేకుండా!!! ఛ.. ఛ!! మరీ అంత స్పీడా? కొంచెం తగ్గాలి! కూల్… కూల్…

నిజానికి అదో అత్యాశలా అనిపిస్తుంది నాకు… కాకపోతే ఏంటి? సరే మూడుసార్లు కనిపించిందనుకుందాం… నాతో వివాహానికి ఆ అమ్మాయి ఒప్పుకోవాలి కదా! అయితే దినఫలంలో ఉంది కాబట్టి ఒప్పుకుంటుందనే అనుకుందాం…

అసలా ఆ అమాయికి ఇంకా పెండ్లి కాలేదనే నమ్మకం ఏంటి? లేదు… లేదు… అయ్యుండదు.. అయినట్లు కనిపించలేదు… ఆలా అయితే… మూడుసార్లు కనిపించదు…

అంతా కన్‍ఫ్యూజన్….

సరే… సరే… దినఫలాల్లో నిజమెంతో… అబద్ధమెంతో నాకనవసరం… ఈ రోజు నా దినఫలం మాత్రం నూటికి నూరుపాళ్ళు నిజం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తను ఈ రోజు నాకు మరో రెండుసార్లు కనిపించాలని, గుడికి వెళ్ళి ఆ దేవుడిని కూడా వేడుకుంటాను’

అలా మనసులో తరుముకొస్తున్న ఆలోచనలకు పుల్‍స్టాప్ పెడ్తూ ఇంటికి చేరాడు సుధీర్.

***

ఇంట్లో పూజ ముగించుకుని గుడికి చేరుకున్న సుధీర్ పూజారి మంత్రాలు వల్లిస్తుంటే ఆ మంత్రాలపైనే మనసుపెట్టి, రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ దేవుడిని కొలుస్తున్నాడు.
ప్రక్కకు తిరిగి చూసే సరికి ఎదురుగా సత్యవతి ఆంటీతో పాటు సునయన… ఇద్దరూ దేవుడి సాన్నిధ్యంలో పూజలో లీనమై ఉన్నారు. ఆశ్చర్యం! ఆ అమ్మాయి మరలా కనిపించింది. అంటే సుధీర్‍ని ఆ దేవుడు కరుణించాడన్నమాట!

దేవుడినే చూస్తున్న సుధీర్‍ మధ్య మధ్యలో సునయన వైపు ఓరగా చూస్తున్నాడు. సునయన మాత్రం సుధీర్‍ని గమనించినట్లు లేదు. పూజ ముగించుకుని అటు చూస్తే సత్యవతి ఆంటీ, సునయనలు అక్కడ లేరు. గుడి చుట్టూ తిరిగి చూశాడు సుధీర్ సునయన కనబడుతుందేమోనని కాని… కనిపించలేదు. మెరుపుతీగలా కనిపించి మాయమైపోయినట్లనిపించింది సుధీర్‍కి.

ఇంటిముఖం పట్టిన సుధీర్‍కి మనసు నిండా ఏవేవో ఆలోచనలు….

‘నేను గుళ్ళో సునయనను చూసింది కలా? నిజమా? నో… నో… అది కల కాదు… నిజమే…

ఒకవేళ అది నా భ్రాంతి అయ్యుండచ్చు కదా! కాదని గ్యారంటీ ఏంటి? ఏంటో… ఏమీ అర్థం కావట్లేదు…

ఇంతకీ నేను సునయనను ఈ రోజు రెండోసారి చూసినట్లా? చూడనట్లా? ఏమిటీ అయోమయ పరిస్థితి? ఎటూ తేల్చుకోలేక పోతున్నాను.

ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయడం శ్రేయస్కరం… లేకపోతే… ఈ పిచ్చి పిచ్చి ఆలోచనలు నన్ను పిచ్చివాణ్ని చేసేట్లున్నాయ్. వదిలేద్దాం… కూల్… కూల్…’ అనుకుంటూ పరధ్యానంగా నడుస్తున్నాడూ సుధీర్.

“బాబూ సుధీర్!” అని ఎవరో పిలిచినట్లయితే, వెనుతిరిగి చూశాడు సుధీర్.

ఆశ్చర్యం!! సత్యవతి ఆంటీ, సునయన….

‘ఓహో! నాకింకా ఆ భ్రమ తొలగినట్లు లేదు…’ అనుకుంటు ముందుకు సాగాడు సుధీర్.

”సుధీర్! నిన్నే! పిలుస్తుంటే చూసి కూడా… అలా వెళ్ళిపోతున్నావేంటి?” అడిగింది సత్యవతి.

వెనక్కి తిరిగి చూసిన సుధీర్‍కి సత్యవతి, సునయన కనిపించారు.

“సారీ ఆంటీ! వినిపించుకోలేదు. ఇంతకుముందే మిమ్మల్ని గుళ్ళో చూశాను. పూజ అయిన తరువాత కలుద్దామనుకున్నాను… తీరా చూస్తే మీరు కనిపించలేదు”

“ఫరవాలేదులే.. ఇప్పుడు కలుసుకున్నాం కదా! దేవుడికి ఈ రోజు అభిషేకం చేయించాము. ఈ ప్రసాదం అమ్మకివ్వు”

“అలాగే ఆంటీ!”

“సరే! మరలా కలుద్దాం” అంటూ కారు పార్కింగ్ వైపుగా వెళ్ళారు వాళ్ళిద్దరూ.

మాటల మధ్యలో సుధీర్, సునయనలు చూపులతోనే ఒకరినొకరు పలకరించుకున్నారు. తలలాడిస్తూ వీడ్కోలు కూడా చెప్పుకున్నారు. మూగమనసు బాసలంటే అవేనేమో!!! మరలా సుధీర్ మనసులో అవే ఆలోచనలు.

‘యస్! ఇది నిజం! సునయన నాకు ఈ రోజు రెండోసారి కనిపించింది. చూడబోతే ఈ రోజు దినఫలం.. నిజమవుతుందనిపిస్తుంది.

మరోసారి అంటే మూడోసారి కనిపిస్తే బావుంటుంది. నో… నో… కనిపించాలి. అదెలా… నేను కనిపించాలి అనుకుంటే కనిపిస్తుందా! నా పిచ్చిగాని… అయినా… ఇంకోసారి కనిపించాలని కోరుకోవడంలో తప్పేముంది? అందుకే…

మనసారా కోరుకుంటాను. సునయన… ప్లీజ్ ఇంకోసారి కనిపించవా? ప్లీజ్ సునయన!

అసలు నా అభ్యర్థన తనకు చేరుతుందా? చేరినా తను నా అభ్యర్థనను స్వీకరిస్తుందా? తిరస్కరిస్తుందా? నేనలా అనుకోవడం, ఓ పిల్ల చేష్టలా అనిపిస్తుంది. ఇక ఇంతకంటే ఎక్కువగా ఈ విషయం ఆలోచించడం సరైన పద్ధతి కాదు. పరిస్థితులకు వదిలేద్దాం. ఏది ఏమైనా సునయన ఇంకోసారి కనిపిస్తే ఎంత బాగుంటుంది. ఆ అదృష్టం నాకు రాసిపెట్టి ఉందా? చూడాలి మరి!!’ ఆశల పల్లకిలో ఊరేగుతూ ఇంటికి చేరాడు సుధీర్.

***

మధ్యాహ్న భోజనానంతరం శకుంతల, భానుమూర్తి, సుధీర్… ముగ్గురూ హాల్లో వున్న సోఫాల్లో కూర్చున్నారు. ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. నిశ్శబ్దాన్ని చేధిస్తూ… “సుధీర్! ఉదయం నుండి గమనిస్తున్నాను… ఏంటో పరధ్యానంగా ఉన్నావ్… ఎడతెరిపి లేకుండా ఆలోచిస్తున్నావ్… భోజనం కూడా అంతంత మాత్రంగా చేశావ్… ఏమయింది సుధీర్?” అడిగింది శకుంతల.

“ఏముంటుందిలే శకుంతల! మనిద్దర్నీ వదిలి… సాయంత్రం ఊరెళ్తున్నాడు కదా! అందుకే కొంచెం దిగులుగా ఉన్నట్లున్నాడు.  ఏం సుధీర్? అంతేగా?” అడిగాడు భానుమూర్తి.

“ఆ…ఆ… అంతే నాన్నా మరేం లేదు” తడబడుతూ చెప్పాడు సుధీర్.

“మీరుండండి. నవమాసాలు మోసి కనీ పెంచినదాన్ని… నాకు తెలియదా… వాడి మనసు!! లేదు.. లేదు… వాడు ఏదో విషయంలో మథనపడుతున్నాడు. చెప్పు సుధీర్! నేనన్నది కరెక్టేగా?” అడిగింది శకుంతల.

“అదేం లేదమ్మా! నేను మామూలుగానే ఉన్నాను” అంటూ తెచ్చిపెట్టుకున్న నవ్వు ముఖంలో కృత్రిమ సంతోషాన్ని వెలిబుచ్చాడు సుధీర్.

“ఇక వాడ్ని వదిలేయ్ శకుంతల! ఏమైనా ఉంటే చెప్తాడుగా. ఏం సుధీర్! అవునా?” అడిగాడు భానుమూర్తి.

“అవున్నాన్నా. మీరు చెప్పిందే నిజం” అంటూ బెడ్‍రూమ్ వైపు నడిచాడు సుధీర్.

“సరే! కొంచెం సేపు హాయిగా నిద్రపో. రాత్రికి సరిగా నిదరుండదు” సలహా ఇచ్చింది శకుంతల.

బెడ్‍పైకి చేరుకున్న సుధీర్‍కి నిద్ర రావడం లేదు. కళ్ళు మూసినా, తెరచినా సునయనే కనిపిస్తుంది. మనసు పరిపరివిధాలా పరుగెడుతుంది.

‘సాయంత్రమే ప్రయాణం. ఆలోపు సునయన కనిపించే అవకాశం లేదు. ఒకసారి నేనే సత్యవతి ఆంటీ ఇంటికెళ్ళి సునయనను చూస్తే ఎలా వుంటుంది? నో… నో… ఏ కారణం లేకుండా నేను సత్యవతి ఆంటీ ఇంటికి ఎలా వెళ్ళాలి? అలా వెళ్తే తను నన్ను అపార్థం చేసుకుంటుందేమో…. అలాంటి అపార్థాలే ముందు ముందు అనర్థాలకు దారి తీయొచ్చు… అవును..

అయినా… నా అంతట నేనే వెళ్ళి సునయనను చూస్తే… అది మూడోసారి కనిపించినట్లు లెక్కకు వస్తుందా? రాదు. ఎందుకంటే ఒక సందర్భంలో మాత్రమే కనిపించాలి. మరి అలాంటి సందర్భం ఈరోజు వస్తుందా? ఏమో మరి…

సునయనకు నాకు రాసి పెట్టి వుంటే ఓ సందర్భంలో తప్పక వస్తుంది. రాలేదంటే నాకా అదృష్టం లేనట్లే… చూస్తుంటే నేనొక దురదృష్టవంతుడిగా మిగిలిపోతానేమోనని నాకనిపిస్తుంది’ అలా అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు సుధీర్.

***

ఆ రోజు సాయంత్రం అమ్మానాన్నల దగ్గర శలవు తీసుకుని రైల్వేస్టేషన్‍కు బయలుదేరాడు సుధీర్.

క్యాబ్‍లో వెళ్తూ అటూ ఇటూ తేరిపార చూస్తున్నాడు. ఎక్కడో చోట సునయన కనపడక పోతుందా అని. ఆ ఆశ కాస్త నిరాశే అయింది.

ఫ్లాట్‍ఫాంపైన అప్పటికే నిల్చునివున్న ట్రైన్‍లో తనెక్కవలసిన కంపార్టుమెంటులోకి ఎక్కాడు సుధీర్. తనకు కేటాయించిన బెర్త్‌లో కూర్చుని కిటికీలోంచి ప్లాట్‍ఫాంపై కనిపించే ప్రయాణికులందర్నీ తీక్షణంగా చూస్తూ, ఎవరి కోసమో వెతుకుతున్నాడు. ఇంకెవరికోసం, సునయన కోసమే.

‘నా పిచ్చిగాని సునయన ఇక్కడెందుకుంటుంది? ఉన్నా, నాకెలా కనబడుతుంది? తను కూడా ఈ రోజు ఈ ట్రైన్‍లో ప్రయాణిస్తేనే కదా ఇక్కడకు వచ్చేది… లేదా… ఓ ఫ్రెండుకో, ఓ బంధువుకో సెండాఫ్ ఇవ్వడానికి రావాలి. అంతేకాని, ఊరికే రాదు కదా! చూద్దాం!

ట్రైన్ బయలుదేరేందుకు ఇంకా పదినిమిషాల టైం ఉంది. పదినిమిషాల్లో ఏమైనా జరగొచ్చు. యస్… జరుగుతుంది. ఎందుకో నా మనసు చెప్తుంది. ఇక్కడే, ఎక్కడో సునయన వుందని, యస్… ఉండే వుంటుంది. నాకు తప్పకుండా కనిపిస్తుంది. కాలం మాత్రం కదిలిపోతుంది. గడుస్తున్న ప్రతినిమిషం నా ఆశను ఆవిరిచేస్తుంది.

ఇక సునయన నాకు కనిపించదేమో… అనే సంశయం కలుగుతుంది. హే! భగవాన్!! నాలోని సంఘర్షణకు అంతం లేదా?’

అనుకుంటూ ప్లాట్‍ఫాం పైనున్న ప్రయాణీకులను చూస్తూనే వున్నాడు సుధీర్. రావాల్సిన టైం రానే వచ్చింది. ట్రైన్ నెమ్మదిగా కదిలింది. వేగం పుంజుకుంది. అంతే వేగంతో ప్లాట్‍ఫాంపై వున్న మనుషులందరూ వెనకబడుతూ కనుమరుగవుతున్నారు. నిమిషానికి డెబ్బై రెండు సార్లు కొట్టుకోవలసిన సుధీర్ గుండె తొంభై సార్లు కొట్టుకుంటుంది. ఇక ఈ రోజుకి సునయన తనకు కనబడదనే నిర్ధారణకు వచ్చిన సుధీర్, కళ్ళుమూసుకుని కూర్చున్నాడు. నిస్సత్తువ, నిస్తేజం, నిర్వేదం… సుధీర్‍ని ఆవహించాయి.

అప్పుడే “ఎక్స్‌క్యూజ్ మీ” అంటూ వీణావాణిని తలపించే ఓ మృధుమధుర స్వరం సుధీర్‍ని పలకరించింది. సుధీర్ చెవుల్లో అమృతవర్షం కురిసింది.

కళ్ళు తెరిచి చూశాడు… ఎదురుగా.. సూట్‍కేస్‍తో సునయన…

Exit mobile version