[శ్రీమాన్ కోవెల సుప్రసన్నాచార్య రచించిన ‘శ్రీ సీతారామ కథాసుధ’, ‘శ్రీకృష్ణ శ్శరణం మమ’ అనే లఘుకృతి ద్వయాన్ని సమీక్షిస్తున్నారు డా. ఆచార్య ఫణీంద్ర.]
[dropcap]సు[/dropcap]ప్రసిద్ధ కవి, విమర్శకులు, కాకతీయ విశ్వవిద్యాలయ పూర్వాచార్యులు శ్రీమాన్ కోవెల సుప్రసన్నాచార్యుల వారి కలం నుండి జాలువారిన నూతన లఘుకృతి ద్వయం – ‘శ్రీ సీతారామ కథాసుధ’ మరియు ‘శ్రీకృష్ణ శ్శరణం మమ’.
ఒకే గ్రంథ రూపంలో వెలువడిన ఈ రెండు కృతులలోని శ్రీ సీతారామ కథను కృతికర్త – 114 పద్య, వచనాల సముదాయంగా రూపుదిద్దారు. మరొక కృతి శ్రీకృష్ణ కథను ‘సుప్రసన్న’ గారు 67 పద్యాల సమాహారంగా తీర్చిదిద్దారు.
తొలి కృతి ‘శ్రీ సీతారామ కథాసుధ’ను ముందుగా పరిశీలిద్దాం.
ఈ కృతి ఒక పాండిత్య ధారగా ప్రవహిస్తున్న శ్రీరామకథా తీర్థంగా పాఠకులకు అలౌకికానుభూతిని కలిగిస్తుంది. ఇది బాలకాండలోని కొన్ని ముఖ్య ఘట్టాలను.. అంటే – శ్రీరామ జననం నుండి వివాహం వరకు చేకొని, కమనీయంగా అల్లిన పద్య కావ్యం. ఈ “సుప్రసన్న” రామాయణ ప్రారంభంలో కవి –
“ఆ పరముండు రాముడు దివాకర దీప్తుడు సాగివచ్చినన్
దీపము వెంట దీపముల తేకువ వచ్చిరి తమ్ములందరున్..”
అంటూ నలుగురు రాఘవుల సంభూత వివరాలను నాలుగయిదు పద్యాలలో తెలియజేసారు. ఆ సోదరులకు బాల్యంలోనే రూపుదిద్దుకొన్న వ్యక్తిత్వ వికాస వైభవాన్ని వర్ణిస్తూ –
“దశరథు బిడ్డలందరును ధర్మము తప్పరు – మాట తప్పరున్ –
విశద పరాక్రముల్, గురు వివేకులు, సద్గురు వాక్య కింకరుల్,
ప్రశమిత చిత్తవృత్తులును, బ్రధ్న సమానులు, కార్య శూరులున్,
నిశిత మనస్కులున్, గుణ వినిర్మిత జీవను, లప్రమేయులున్!”
అని కీర్తిస్తారు. వారి అన్యోన్య ప్రేమానురాగాలను చిత్రిస్తారు. ఆ పైన వాల్మీకి కృత బాలకాండలోని సంక్షేప రామాయణంలోవలె సుప్రసన్న గారు కూడ నారద మునిని వాల్మీకి కడకు రప్పిస్తారు. వాల్మీకితో ఈ ప్రశ్నలు వేయిస్తారు –
“రాముడనంగ నెవ్వడు? పరాత్పరుడా? హృదయాల వెల్గు సం
ధ్యా మృదు దీపమా? సకల తామసముల్ తొలగించు ఖడ్గమా?
ఏ మెయి సృష్టి కావల వెలింగెడునట్టి చిదగ్ని కుండమా?
ఆ మహితాత్ము నెట్లనుభవావధి నిల్పుట?” అంటూ .. “తెల్పవే దయన్”
అని వాల్మీకి ప్రాధేయ పడగా, అప్పుడు నారద మునీంద్రులు ఆతని సందేహాలు తీర్చగా ముందుగా – నాయికా, నాయకులైన సీతారాముల ప్రశస్తి, అయోధ్యాపురి ఔన్నత్యం వర్ణించి చెప్పి, ఆ పైన రామకథను వివరించడానికి ఉద్యుక్తుడైనట్లుగా చిత్రించారు కృతికర్త.
వరుసగా – అయోధ్యకు విశ్వామిత్రుడు ఆగమించి, యాగ రక్షణకై రామలక్ష్మణులను గొనిపోవడం; మార్గ మధ్యమంలో భృశాశ్వ విద్యలను బోధించడంతో బాటు, వారికి తన తపస్సాధన విశేషాలను, గతానుభవాల విజ్ఞాన సారాన్ని అందించడం; మిథిలానగరం వైపు ప్రయాణిస్తూ ఉండగా నడుమ అహల్యా చరిత్రను తెలుపడం, ఆ పైన శ్రీరామునిచే శాప విమోచనం .. ఈ ఘట్టాలన్నింటిని కవి కమనీయమైన పద్యాలలో రమణీయంగా వర్ణించారు. ఆ పైన శివ ధనుర్భంగ ఘట్టంలో శివరామ అభేద తత్త్వాన్ని ప్రబోధిస్తూ –
“శివుడే రాముడు; రాముడే శివుడు సృష్టింపంగ నీ లోకముల్ –
శివుడే రాముడు; రాముడే శివుడు రక్షింపంగ నీ లోకముల్ –
శివుడే రాముడు; రాముడే శివుడు సంలీనంబు గావింపగా –
భవభేదంబులు లేవు జీవులకు సర్వావస్థలందుండినన్!”
అన్న పద్యంతో ఈ కావ్య లక్ష్యాన్ని మన అంతరంగాలలో ప్రతిధ్వనింపజేసారు సుప్రసన్నాచార్యులు గారు. ఆ పైన సీతారామ కల్యాణంతో ఈ కావ్యాన్ని మంగళాంతంగా ముగించారు కావ్యకర్త. ఈ లఘుకృతిని కోవెల వారు దాదాపుగా బాలకాండ ఘట్టాల మేరకు తమదైన భక్తితాత్త్విక శైలిలో సృజించి లోకార్పణం చేసారనవచ్చు.
~
ఇక ద్వితీయ కృతి ‘శ్రీకృష్ణ శ్శరణం మమ’ లోనారసి చూద్దాం.
కావ్యంలోని తొలి రెండు పద్యాలలో అష్ట భార్యా సమేతుడైన శ్రీకృష్ణ పరమాత్మను స్తుతించిన సుప్రసన్న గారు, తరువాతి పద్యంలో శ్రీకృష్ణుడు జన్మించే ముందు కాలమాన పరిస్థితులను వివరిస్తూ –
“కానగ నీవు జన్మగొను కాలము పూర్వము మృత్యుభీతి స
ద్యో నవజాతులౌ శిశుల దున్మెడు కాలము..”
అంటూ కంసుని దురాగత పాలనను దుయ్యబట్టారు. ఆ పైన క్లుప్తంగా దేవకీ వసుదేవులకు శ్రీకృష్ణుని పుట్టుకను, యశోదా మాత వద్దకు చేరికను చెప్పిన విధానం ఆకట్టుకొంటుంది.
“ఎపుడు గోలోకమ్ము నుండి నీవయి దిగివచ్చినావొ –
ఎపుడు దేవకి వసుదేవు లీవయి వరియించినావొ –
ఎపుడు రేపల్లె రాత్రమ్ము ఇరులలో నీవు చేరితివొ –
అపుడె యశోద బిడ్డవుగ నయితివి నందబాలకుడ!”
పిమ్మట కవి – అతి సంగ్రహంగా పూతన, బకుడు, దేనుకాసురుడు, శకటాసురుడు వంటి రక్కసుల సంహారాన్ని, మృత్యువు వేటాడుచు తరిమి వచ్చినా “తరిమి వేయగ ప్రభువు యత్నించె దెప్పరమౌచు ఈ లీల తీర్చెను దివ్యత గూర్ప!” అంటూ వ్యాఖ్యానిస్తారు. అంతే కాదు – “జీవితమెల్ల యుద్ధములె, చెరలాటలే వరములును ..” అంటూ సానుభూతిని వ్యక్తం చేస్తారు.
“అతని వేణునాదము విశ్వ మావరించి
జీవుల యవిద్య తొలగించి చెలువు గూర్చు –
అతడు సర్వలోక శరణ్యు, డాత్మలందు
వెలుగు దీపమై ప్రసరించు విశ్వమందు!” భగవత్తత్త్వాన్ని విశదీకరిస్తారు.
“అకృతకంబైన ఈ సృష్టియందు స్వామి
అపుడె బాలుడు, యోగియు, ఆత్మభవుడు –
అంతలో వెన్నలను దినునట్టివాడు –
అంతలో వెన్నెలను మించునట్టివాడు-” అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తారు.
“సభలోన నగ్ని సంభవ
కభయంబిడి రక్ష సేయు నాత్మభవుండై –
విభుడై చీరల నొసగెను
ప్రభావసుడు ద్వారకాధిపతి శుభమతియై!”
అంటూ ద్రౌపదీ మాన సంరక్షణ ఘట్టాన్ని ఉటంకిస్తారు.
“కదనమున భగవద్గీత విదితరీతి
అర్జునుని వ్యాజమున లోకమందు వెలయ
జేసె ఉపనిషత్తుల సారవాసితముగ –
అంత చిత్రమైనట్టి లోకార్పణంబు!”
అంటూ భగవద్గీతా ప్రాశస్త్యాన్ని వివరిస్తారు. అంతే కాదు.. యావత్ భగవద్గీత సారాన్ని పిండి, 62 పాదాల తేటగీతి మాలికగా మనకందించారు సుప్రసన్న గారు.
ఈ లఘుకృతిలో కథాకథనం కాస్త ముందు వెనుకలైనా, ప్రతి పద్యంలో పరమాత్మ విరాణ్మూర్తిమత్వాన్ని చిత్రించే ప్రయత్నం చేసారు కృతికర్త.
“ఆ యశోదకు విశ్వ మగుపించినప్పుడు
సంకల్ప సంభవ స్థానమగును –
అక్రూరునకు రూప మగుపించినప్పుడు
యోగిజన ధ్యేయ ముత్సహించు –
కురుసభలోపల గ్రుడ్డిరాజుకు రూప
మగుపింప ప్రళయ భావానుభవము –
నరునకు సంగరస్తరమున కనిపింప
అది జీవులకు ముక్తి యనుభవమ్ము –
ఆర్త జిజ్ఞాసు నర్థార్థులంత జ్ఞాను
లెవ్వరైనను ప్రభువు దాటించు సంస
రణము కరుణాబ్ధి ప్రార్థించి జనులు భక్తి
మార్గమున చేరుకొనుటకు మసలవలయు!”
ఇదీ ఈ కావ్యకర్త ఇచ్చే సందేశం.
కావ్యమంతా భగవత్తత్త్వ వివేచనమే!
చివరలో – “అఖిల లోకముల కాధారమై చెలగు నీ చరితకు మంగళాశాసనములు!” అని పలికి,
“ఎవరి కోస మీ సృష్టి రచించినావొ –
అఖిల జీవుల కాశ్రయమగును గాక!”
అన్న శుభాశంసతో ఈ కృతిని ముగించారు సుప్రసన్నాచార్య గారు.
ఈ రెండు కృతులను కవి చంపూకావ్యాలుగా పేర్కొన్నారు. ‘శ్రీ సీతారామ కథాసుధ’ లో కృతికర్త గద్య, పద్యాత్మకంగా నడిపించుట వలన – అది చంపూకావ్య మన్నది సత్యమే! కానీ, ‘శ్రీకృష్ణ శ్శరణం మమ’ కావ్యం నిర్వచనంగా సాగడం వలన – అది చంపూకావ్యం కానేరదు.
కృతికర్త దానిని కూడ చంపూకావ్యంగా పేర్కొనడం కించిత్తు ఆశ్చర్యానికి గురి చేసింది.
రామకావ్యం కాస్త కథనాత్మకంగా సాగినా, కృష్ణ కృతి కథనాత్మకంగా కన్న, అడుగడుగున ఆధ్యాత్మిక తత్త్వజ్ఞాన ప్రబోధంగా సాగింది. అంతటి వైదిక దృష్టితో, తాత్త్విక విజ్ఞానంతో సమీక్షించవలసిన ఈ కావ్యాలను నా శక్తి మేర భక్తిసాహిత్యపరమైన రసదృష్టితో పరామర్శించే ప్రయత్నం చేసానని మనవి చేసుకొంటున్నాను.
ఏమైనా.. ఈ రెండు పురాణ కృతులు నవ్య మార్గంలో ‘సుప్రసన్న’దాయకంగా సాగి, తమ విశిష్టతను చాటుకొన్నాయి అన్నది నిర్వివాదాంశం.
***
రచన: కోవెల సుప్రసన్నాచార్య
ప్రచురణ: సృజన లోకం, వరంగల్
వెల: అమూల్యం
ప్రతులకు:
ప్రొ. రామా చంద్రమౌళి
11-24-498, టెలిపోన్ భవన్ లేన్,
పోచమ్మ మైదాన్, వరంగల్ 506002
ఫోన్: 9390109993
~
ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య,
4-44-11/2, రోడ్ నెం 5, బాబా నగర్,
నారపల్లి, ఘట్‍కేసర్ మండల్,
మేడ్చల్ జిల్లా 500088
ఫోన్: 9052629093