Site icon Sanchika

సుప్రసన్న సాహిత్య విమర్శ – మౌలిక ప్రతిపాదనలు

[శ్రీ సి.హెచ్. లక్ష్మణ చక్రవర్తి రచించిన ‘సుప్రసన్న సాహిత్య విమర్శ – మౌలిక ప్రతిపాదనలు’ అనే వ్యాసం అందిస్తున్నాము.]

[dropcap]సు[/dropcap]ప్రసన్న గారు మార్చి 17, 1936న వరంగల్‌లో లక్ష్మీనరసమ్మ, వెంకటనరసింహాచార్యులు దంపతులకు జన్మించారు. పాఠశాల చదువులు వరంగల్లు లోనూ, ఎం.ఎ., పిహెచ్.డి.లు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేశారు. 1959లో లెక్చరర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించిన వారు కాకతీయ విశ్వవిద్యాలయంలో హెడ్, డీన్, ప్రిన్సిపాల్‌గా పదవులు నిర్వహించారు. ఎన్నో సంస్థలకు అధ్యక్ష, కార్యదర్శులుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం మొదలు తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహిత్య విమర్శ పురస్కారం, జీవీయస్ పురస్కారం, ఠాగోర్ లిటరరీ అవార్డు వంటివి ఎన్నో పొందారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో సుప్రసన్న లబ్ధప్రతిష్ఠుడైన కవిమాత్రమే కాదు విలక్షణమైన విమర్శకుడు కూడా. అధునా మొదలు ప్రీతిపుష్కరిణి దాకా పదిహేడు కావ్యాలు రచించారు. సాహిత్య వివేచన మొదలు రసరాజధాని దాకా 13 విమర్శ గ్రంథాలు వెలువరించారు.

విమర్శ గ్రంథాలు

సాహిత్యవివేచన 1971, సహృదయచక్రము 1983, విశ్వనాథమార్గము 1992, భావుకసీమ 1993, అధ్యయనం, చందనశాఖి 2000, సమర్చన, సమర్పణ, దర్పణం, 2004, అంతరంగం (పీఠికలు) 2006, భావసంధ్య, కావ్యప్రమితి 2008, రసరాజధాని 2015.

సుప్రసన్న సృజనాత్మకత, దార్శనికత, సమన్వయదృష్టి, అంతర్ముఖీనత కావ్యాలకే పరిమితం కావు. అవి ఆయన సృష్టించిన విమర్శలోనూ కనిపిస్తాయి. “నాకు కవిత్వంగాని విమర్శకానీ పారమార్థికంగా భిన్నాంశాలు కావు. ఒకటి అనుభవం. రెండవది దాని అధ్యయనం. ధర్మ, ధర్మి భేదం చేత రెండుగా పేర్కొన్నా అది అద్వయమైందే” అని సుప్రసన్న ఒక చోట స్వయంగా తన కావ్యవిమర్శ భూమికను స్పష్టం చేశారు. తన ‘చందనశాఖి’ విమర్శ గ్రంథానికి ముందు మాట వ్రాస్తూ “నా సాహిత్య విమర్శకు మూలస్థానం రచన చదివి నప్పుడు నాకు కలిగిన అనుభవం. ఈ అనుభవాన్ని విశ్లేషించినప్పుడు నా వ్యుత్పత్తి, లోకజ్ఞత ఉపకరిస్తున్నవి. ఆ సరస్వతీ తేజస్సును వ్యక్తీకరించేందుకు చేసిన ప్రయత్నమే విమర్శ ప్రస్థానం” అన్నారు. మానవ జీవితంలో సమస్తమైన అనుభవాలకు ఆవిష్కార స్థానంగా బావించటం చేతనే ఆయన విమర్శ, కావ్యరచనలు సమన్వయ దర్శనంతో కూడుకున్నవి.

సుప్రసన్న ప్రాచీన అర్వాచీన ఇతిహాసాల, కావ్యాల అధ్యయనంలో క్రొత్త ద్వారాలు తెరవటం, కావ్యాధ్యయనానికి క్రొత్త ప్రమాణాలను నిర్దేశిస్తూవాటి సూత్రాలను విశ్లేషించారు. 1954 నుంచే సుప్రసన్న సాహిత్య విమర్శ ప్రస్థానం ప్రారంభించారు. గోలకొండ పత్రికలో ఉదాహరణ కావ్యాలను గూర్చి మొదటి వ్యాసం ప్రచురితమైంది. వారి సాహిత్య విమర్శ అంతటినీ ఈ వ్యాస పరిధిలో చెప్పటం కష్టమే కానీ మౌలికంగా వారు ప్రతిపాదించిన అంశాలను, అనుసరించిన రీతులను ప్రస్తావించుకోవటం ద్వారా వారి సాహిత్య విమర్శ తత్త్వాన్ని అర్థం చేసుకోవచ్చు.

సుప్రసన్న చేసిన తెలుగు సాహిత్య విమర్శ గురించి మాట్లాడే సందర్భంలో తన ముందు తరం, తన తరం వాళ్ళ కంటే భిన్నంగానూ, సాహిత్య సహచరునిగా తన బాబాయి సంపత్కుమారతో కలిసి నడుస్తున్నా తనదైన ఒక వైవిధ్యాన్ని, విభిన్నతని సాహిత్య విమర్శలో సాధించిన వ్యక్తి సుప్రసన్న.

 ఆయన సాహిత్య విమర్శ అంశాలను గమనిస్తే పాఠకుడు కేంద్రంగా ఉన్న సాహిత్య విమర్శ రావాలన్నారు. ఇది నాటికి ఒక కొత్త ఆలోచన. దీంట్లో కొత్తదనం ఏముంది. ఆయన కాలానికి అది కొత్తగా అనిపించి ఉండవచ్చు అని అందరూ అనుకుంటారు కానీ ‘రీడర్స్ రెస్పాన్స్ థియరీ’ అని నేడు ఆధునికాంతర కాలంలో కనిపిస్తున్న భావనకు సంబంధించిన జాడలు లేని కాలంలోనే సహృదయుడు ప్రమాణంగా సాహిత్య విమర్శ ఎదగవలసి ఉందని ఒక ప్రతిపాదన చేశారు సుప్రసన్న. ఇది మౌలికమైన ప్రతిపాదన. తనకంటే ముందున్న కట్టమంచి రామలింగారెడ్డి, రాళ్లపల్లి వారు, విశ్వనాథ సత్యనారాయణ మరికొందరు నాటి కాలపు సాహిత్యవిమర్శకులు రచనా కేంద్రంగా, కవి కేంద్రంగా సాహిత్య విమర్శ చేశారు. వీళ్లు మౌలికంగా ఏం చెప్పాలి అన్నది కావ్యంలోకి వెళ్లి వెతికారు. విశ్వనాథ నన్నయ్య గారి కథాకథన దృష్టిని మహాభారతం ఆధారంగా చెప్పడానికి ప్రయత్నించారు. అల్లసాని వారి ‘అల్లిక’ ‘జిగిబిగి’ అని అల్లసాని వారిని, మనుచరిత్రని కేంద్రంగా చేసుకునే చెప్పారు. అంటే శిల్పపరమైన ఒకానొక విమర్శ వచ్చింది. శిల్పం మేధస్సుకు సంబంధించిన అంశం. సుప్రసన్నాచార్య మార్గం మేధ కాదు, వారి విమర్శ హృదయం నుంచి మేధకు ప్రయాణించింది. సాహిత్య విమర్శలో తన కంటే ముందున్నతరంలో చాలా మౌలికమైన గొప్ప ఆలోచనలు వచ్చాయి. వారు కొన్ని విశేషాలు చెప్పారు. రచయిత, రచన, పాఠకుడు కవి, సమాజం ఇలా నాలుగు రకాలుగా సాహిత్య విమర్శ ఉందని మనం అనుకుంటే దాంట్లో పాఠకుడు కేంద్రంగా సాహిత్య విమర్శ రావాలి అనే మాటను దగ్గర సహృదయుడు కేంద్రంగా అని అర్థం చేసుకోవాలి. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన మాట. పాఠకుడు కేంద్రంగా అంటే నన్ను ఆ రచన ఎలా లాక్కు వెళ్ళింది. తనలోకి ఆ రచన ఎలా తీసుకెళ్ళింది. ఇలాంటి విషయాలని పాఠక కేంద్ర విమర్శలో మనం మాట్లాడుతూ ఉండటం అంటే ‘రీడర్స్ రెస్పాన్స్ థియరీ’లో మాట్లాడుతున్నాం. కవి రాసిన వాక్యానికి సంబంధం లేదు కవి రాశాక ‘కవిస్వామ్యం’ ఏం లేదు. దానికి విమర్శకుడు లేదా పాఠకుడిగా తన అభిప్రాయాన్ని తాను చెప్పవచ్చు. ఇది ఇప్పటి కాలంలో గొప్ప విషయమే కావచ్చు. కవి మనకు ఇచ్చిన అనుభవం ఏమిటి అని మాట్లాడేటప్పుడు ఆ సందర్భానికి కవి చెప్పదలుచుకున్నటువంటి విషయం అనుభవ పూర్వకంగా మన అనుభూతిలోకి ఎట్లా తెస్తున్నాడు అని మనం గమనించినప్పుడు మనకు తెలిసేటటువంటి విషయాలు చాలా మౌలికంగా ఉంటాయి. కాబట్టి మొత్తం తెలుగు సాహిత్య విమర్శని ఒక్కసారిగా ఈ నిర్వచనంతో ఆలోచింపజేశారు సుప్రసన్నాచార్య. సహృదయుడు కేంద్రంగా అన్నప్పుడు నీ జ్ఞానేంద్రియాలకి ఆ రచన ఇచ్చిన అనుభవం ఏమిటి? ఆ అనుభవం నీకు ఇచ్చిన అనుభూతి ఏమిటి. అన్నది కొలమానంగా చేసుకుంటే, నీవు సాహిత్యాన్ని గురించి మాట్లాడే మాటలు అన్నీ కూడా చాలా సత్యంగా అనిపిస్తాయి అన్నది మొదటి అంశం. ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సిన ఒక అంశం. ఎప్పుడు మీరు అనుభూతిని ప్రధానం చేసుకుంటారో, ఈ సహృదయత్వాన్ని ప్రమాణంగా తీసుకుంటారో, అక్కడికి దేశము, కాలము, ప్రాంతము, ప్రాచీనము, ఆధునికము, కులము, మతము, ఇవేవీ రావు. రచయిత లేదా ఆ కవి తాను ఏ రకమైనటువంటి ఒకానొక ఆస్వాదనీయతను తన రచన ద్వారా వెలుగులోకి తెస్తున్నాడో దాన్ని మాత్రమే మనం వ్యక్తం చేయడానికి ఉద్యుక్తులమవుతాము. అలాంటి వాతావరణంలోకి వెళ్తాం. కాబట్టి సహృదయుడు ప్రమాణంగా తెలుగు సాహిత్య విమర్శ ఎదగాలి అనేది సుప్రసన్నాచార్య మౌలికమైన ప్రతిపాదన. అందుకనే ఆయన సాహిత్యం అంటే హితాన్ని చేకూర్చేది అని ‘హితేన సహితం సాహిత్యం’ అని ఇలాంటి మాటలు చెప్పరు. ‘రసేన సహితం సాహిత్యం’ అన్నది సుప్రసన్నాచార్య ఆలోచన. రసానుభూతిని కలిగించేటటువంటి ఒకానొక అంశం మాత్రమే, లక్షణం మాత్రమే సాహిత్యం అవుతుంది తప్ప మరేదీ సాహిత్యం కాదు అన్నది వారి ఆలోచనలో ఉన్న ఒక మౌలికమైన అంశం.

ఒక కావ్యాన్ని పాఠకుడిగా మనం చదువుతున్నాం, అందరం సుప్రసన్న గారి లాగే ఒక ఆలోచనతో మౌలికమైన విషయాన్ని చెప్పుకొని మనం ఏదైనా చేయాలా అని అంటే అది మనకు అనుకూలంగా ఉండే అంశం కాదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా సుప్రసన్నాచార్య ఆలోచనని గమనించాలి. అదేమిటంటే కావ్యాన్ని మనం మూడు అంతస్తుల్లో చూడాలి, కావ్యానికి మూడు అంతర్వులు ఉంటాయి అన్నది మరో మౌలికమైన ప్రతిపాదన. కావ్యం లేదా ఒక రచనలో ఆ మూడు ఏమిటి అంటే , ఒకటి మానవజీవన పక్షం, రెండు శాస్త్ర వ్యాఖ్యానం లేదా సౌందర్య పక్షం, మూడు ఆధ్యాత్మిక సాధనా పక్షం. ఇలా మూడు తరాల్లో కావ్యం ఉంటుంది. ఇదొక గొప్ప సూత్రం, ఈ మౌలికమైన ఆలోచన ద్వారా సుప్రసన్న గారు ఒక కావ్యం చదివినప్పుడు ఎలా ఆలోచిస్తారో తెలుస్తుంది. మనకు వారిలాగే ఆలోచించగలిగే స్తోమత లేకపోవచ్చు అంతటి ఘనత మన దగ్గర లేదన్నప్పుడు నీవు కావ్యాన్ని మానవ జీవన పక్షం నుంచి వ్యాఖ్యానించు. మానవ జీవన పక్షం నుంచి అర్థం చేసుకో బాగుంటుంది అనేది ఒక పార్శ్వం. అంటే నీవున్న లోకంతో నీవు చదివిన కావ్యం లోని లోకాన్ని తెలుసుకో. ఇది ఒక సూత్రం. తరువాత నీవు ఉన్న లోకం కావ్యంలో ఉన్న లోకం ఒకలాంటిదిగా నీకు కనిపించదు. చిన్న మార్పేదో ఉంటుంది. కావ్య జగత్తు వేరు, వాస్తవిక జగత్తు వేరు. సాహిత్యంలో వాస్తవికత, లోకంలోని వాస్తవికత రెండూ వేరు వేరు. మరి సాహిత్యంలోని వాస్తవికతను నీవు అర్థం చేసుకోవాలంటే ఏం కావాలి. కొంచెం సాహిత్య సౌందర్యం ఏమిటో తెలుసుకోవాలి. రెండవ అడుగులోకి వెళ్లడానికి అలంకార శాస్త్రం నీకు కొంత సహాయం చేస్తుంది. సాహిత్యంలో సౌందర్యం ఏమిటో తెలుసుకోవడానికి ఒక ఆలోచనను ఇస్తుంది. అలాంటి ఒకానొక సమన్వయాన్ని ఇస్తుంది. అలాంటి ఒకానొక ఆలోచన కలిగించటానికి రెండవ అంశం సౌందర్య శాస్త్రం. అందులో ఉన్న వర్ణన, అలంకారం, గుణం, రీతి, ధ్వని ఇవన్నీ కూడా లోకం కంటే సాహిత్య లోకం భిన్నమయినదన్న అవగాహనను మనకు కల్పిస్తుంది. ఒక రచనలో మనిషి జీవితం ఏమున్నది అని చూడటం ఒక పద్ధతి అయితే, మనిషి జీవితంలో లేని ఒకానొక అందం అక్కడ ఏదో కనిపిస్తుంది. ఆ అందం ఏమిటి? అని తెలుసుకోవడం రెండవదైతే, మూడవది పై రెంటికి పైది. ఇది ఇచ్చేతాత్త్విక సత్యం ఏమిటి. జీవితానికి ఒక ఫిలాసఫీ ఉండాలి అని వ్యక్తిత్వ వికాసం క్లాసులు చెప్పే వ్యక్తి కూడా అంటున్నాడు. ఆ వికాసం ఏమిటి, ఆ వ్యక్తిత్వం ఏమిటి అని సాహిత్యం ద్వారా ఆధ్యాత్మిక పక్షం నుంచి ఆ రచనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమే మూడవది. ఇక్కడ చెప్పేదంతా ఆధ్యాత్మిక జీవన పక్షం. దీన్ని నవలకు అన్వయించాలా? ప్రాచీన కావ్యానికి అన్వయించాలా? దీర్ఘకావ్యానికి అన్వయించాలా? ఒక వచన కవితకి అన్వయించాలా? సుప్రసన్నాచార్య గారిని వెళ్లి ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కవి స్థాయి ఏదైతే అదే మనకు అన్వయం. రచయిత స్థాయి మూడు అంతర్వుల్లో కూడా ఉండేంతగా ఉంటే ఈ మూడు రకాలుగా కూడా ఆ రచయిత లేదా కవి మనకు అర్థమవుతాడు. ఇది ప్రాచీనానికో, ఆధునికానికో, వర్తించేది కాదు. శ్రీశ్రీ ‘కవితా ఓ కవితా’ని తీసుకోండి ‘మను చరిత్రను’ తీసుకోండి ఈ మూడు అంతర్వుల్లో మీరు చూడడానికి అవకాశం ఉంటుంది. అని కావ్యాన్ని లోతుల్లోకి వెళ్లి చూడటానికున్న మార్గం ఏమిటో మన కళ్ళ ముందుకు తెచ్చారు సుప్రసన్న.

మూడవ ప్రతిపాదన ఆయన చాలా సందర్భాల్లో చెప్పే మాట సాహిత్యం బుద్ధి ప్రధానమయినది కాదు. అనుభూతి ప్రధానమయినది. బుద్ధి ప్రధానమయినది శిల్పం. సుప్రసన్న గారి సమకాలీనులు ముందు తరం వారు చాలామంది శిల్ప సౌందర్యాన్ని గురించి చాలా మాట్లాడారు. కానీ ఆ శిల్పం అనుభూతిపరం ఎట్లా అయింది అని చెప్పడానికి సుప్రసన్నాచార్య సాహిత్య విమర్శ ఎక్కువ పనిచేసింది. ఇక్కడ కవి/ రచయిత చూపించిన శిల్పమూ, రచనా ప్రతిభ ఏమిటి అన్నది చెప్పడం కంటే కూడా అది అనుభూతిపరం ఎట్లా అయింది, తన అనుభవంలోకి ఎట్లా వచ్చిందని చెప్పడానికి సుప్రసన్న సాహిత్య విమర్శ పనిచేసింది. దీనికి ఉదాహరణగా విశ్వనాథ రచనలు, కావ్య ప్రబంధాలు, భావకవుల గురించి చేసిన ఆలోచనలు అన్నింటిని గమనించవచ్చు. వీటి ద్వారా అనుభూతి, అనుభవం ఆధారంగా కావ్యానికి విలువ కట్టాలన్న అభిప్రాయం చెప్పారు. ఈ మాట ద్వారా రచన ముందు మనసు మీద ఒక ముద్ర వేయాలి. అదే రచన ఇచ్చే ప్రయోజనం. అలాంటి ఒక ముద్ర మనకు సాహిత్య విమర్శలో ఉండాలి. అందుకే అనుభవం, అనుభూతి ప్రధానంగా ఉన్న సాహిత్య విశ్లేషణ రావాలనడం వారి మూడవ మౌలిక ప్రతిపాదన. అనుభవం, అనుభూతి ప్రధానంగా సాహిత్యాన్ని మనం పరిశీలించాలి అని చెప్పడం ఇక్కడ ప్రధానం.

అనుభూతి ఒకటే మౌలికం అయిందని చెబుతూ దానిని విస్తరించుకుంటూ ఆయన చేసిన ఆలోచనలు కొన్ని ఉన్నాయి. అనుభూతి ప్రధానంగా సాహిత్య విమర్శ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, దాని చుట్టూ ఉన్న అంశాలన్నీ పటాపంచలవుతాయి. మన మనసు మీద ఆ రచన ఎలాంటి ప్రభావం చూపింది అన్నది మాత్రమే నిలబడుతుంది. సాహిత్యాన్ని కూడా అలాంటి దృక్కోణం నుంచే వారు చూస్తారు.

సుప్రసన్న ప్రాచీన సాహిత్యాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని ఆలోచించినప్పుడు రెండు ప్రతిపాదనలు ఉన్నాయి. ప్రాచీన సాహిత్యం అంతా సత్త్వ, రజ, తమో గుణాలతో కూడినది అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. కవిత్రయ యోగమంతా సాత్త్విక సత్వగుణం ప్రధానమని, శ్రీనాథుడు, ప్రబంధ యుగం అంతా కూడా రజోగుణ ప్రధానమని, దక్షిణాంధ్ర యుగం, ప్రబంధ అనంతరం అంతా తమోగుణ ప్రధానమని, ‘హిరణ్య గర్భ’ అన్న ఒక కవితా సంకలనానికి రాసిన పీఠికలో అంటారు. ఇది సాహిత్యం మొత్తం ఎలా చూడాలి అని చెబుతున్న నియమమా? లేదా ఆ కాలంలో ఉన్న సాహిత్యాన్ని ఇలా అర్థం చేసుకోవాలి అని చెబుతున్న నియమమా? అంటే సుప్రసన్నాచార్య ఆలోచనరీతి అలా ఉంటుంది. తాను చెప్పే ఒకానొక సూత్రం ఆనాటి రచనకు అన్వయిస్తుంది. విమర్శకుడు ఆనాటి రచనని అర్థం చేసుకోవడానికి ఎలాంటి పరికరాలు ఎన్నుకోవాలి అనడానికి ఉపయోగపడుతుంది. ఈ రెండు రకాలైన వైవిధ్యం ఆయన మాటల్లో చాలా చోట్ల ఉంటుంది.

సాహిత్యవిమర్శ ముందే చెప్పినట్లు మనోనిష్ఠం, హృదయనిష్ఠం ఇది కూడా అంతే. ఆధునిక సాహిత్యానికి సంబంధించిన అమలిన శృంగార ప్రణయం కానీ, కులపాలికా ప్రణయం కానీ మరి ఏదైనా కానీ దీనికి కొంత బుద్ధి పనిచేయకపోతే ఆ రకమైనటువంటి ఆలోచన విధానం ఎందుకు వచ్చింది అనేది చెప్పడం కష్టం. అలా మనం చెప్పడానికి అవకాశం ఉంది కనుకనే అలాంటి ఒక సూత్రం చెప్పే సందర్భంలో మనం ఆ రచనను చూడవలసిన రీతి ఏమిటి అని చెప్పడం ఆయన విమర్శలో ఉన్న లక్షణం.

రెండవది ఆధునికత విషయంలో చాలామందితోబాటు సుప్రసన్న గారు కూడా ఆలోచన చేశారు. చేతనావర్త పీఠికలో ఐన్స్టీన్, ఫ్రాయిడ్, న్యూటన్, మార్క్స్ ఇలాంటి వారి యొక్క ఆలోచన విధానం నుంచి ఆధునికత పెరిగింది అని ఒక భౌతికమైన విషయాన్ని కేంద్రంగా చేసుకొని ఆధునికత గురించి మాట్లాడితే సుప్రసన్న గారి ఆలోచన విధానంలో వేదాలకి వ్యాఖ్యానం రాయడం, వేదాలను ఆధునికంగా వ్యాఖ్యానించడం, ఉపనిషత్తులను తార్కిక దృష్టితో విశ్లేషించడం. ఇవన్నీ కూడా మనకి దయానంద సరస్వతి, అరవిందో లాంటి వారు చేసుకుంటూ వచ్చారు. ఇది కూడా ఒక రకమైన ఆధునికతే అంటారు. ఆలోచనల్లో వచ్చిన ఆధునికతలో భావం ప్రధానం. ఆధునికత కాలవాచి కాదు, వ్యక్తి వాచి కాదు భావ వాచి అని ఆధునికత గురించి మాట్లాడే అందరూ చెబుతారు. కానీ అది సాంస్కృతికమైన భూమిక నుంచి ఆధునికతను ఎట్లా అర్థం చేసుకోవాలని చెప్పడానికి చేసే ప్రయత్నం. ఆయన సాహిత్య వ్యాసాల్లో ఇది చాలా చోట్ల కనిపిస్తుంది. మరో రకంగా చెప్పాలంటే ఆధునిక చైతన్యమంతా కూడా సాంఘికమైనటువంటి ఒక భూమిక మీద ఉందని అనడానికి ఆయనకు ఏ రకమైన అభ్యంతరము లేదు. కానీ అది మనసు మీద వేసే ముద్రగా ఉండాలి తప్ప మెదడు మీద, బుద్ధి మీద వేసే ముద్రగా ఉండకూడదు. సాంఘిక చైతన్యం పునాది. కానీ దానిని వ్యాఖ్యానించడంలో, విశ్లేషించడంలో ఈ తాత్త్వికుల ఆలోచన విధానం ఎలా ఉంది అని చెప్పడం వారి విమర్శలో ప్రధానం.

సుప్రసన్న గారు తెలుగు సాహిత్య ఆచార్యులు అయ్యారు కానీ ఫిలాసఫీకి సంబంధించిన ఆచార్యులు అయి ఉండి ఉంటే కొత్త సచ్చిదానందమూర్తి, సర్వేపల్లి రాధాకృష్ణ లాగా కొన్ని ఆలోచనలను పుస్తకంలోకి తీసుకొచ్చి ఉంటే గొప్ప తత్త్వవేత్తగా కనిపించేవారు. అయినా వారి విమర్శలో భారతీయ సాంస్కృతికమైన లేదా ఈతాత్త్వికమైన పునాదిని చారిత్రకంగా అర్థం చేసుకోవడానికి మౌలికమైన సూత్రాలు మనకు కనిపిస్తాయి. తెలుగు ప్రొఫెసర్ అయినంత మాత్రాన అవి అందులో లేవని కాదు. అదే భావధారతో ఆయన చేసిన ఆలోచనలని ఒక వరుస పెట్టుకుని చదివితే సాంస్కృతికంగా మనం చాలా ముందుకు వెళ్ల గలుగుతాం. ఆనాటి వేద కాలం నుంచి నిన్న మొన్నటి శివానందమూర్తి గారి దాకా, నేటిదాకా ఉన్న ఋషులు, దార్శనికులు తాత్త్వికులు వీరందరూ ఎలాంటి ఆలోచనలను ముందుకు తీసుకెళ్లారు అవి సాహిత్యంలో ఎట్లా ప్రతిబింబించాయి అన్నది ప్రతిపాదించడానికి, ఆలోచించడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఆయన పునరుజ్జీవనం లాంటి మాటలను కూడా ఈ కోణం నుంచే మాట్లాడుతారు. ఇక్కడ నాలుగవ మౌలికమైన ప్రతిపాదన ఏమిటంటే ఆధునికత, కాల వాచి లేదా వ్యక్తి వాచి, భావ వాచిగా చూడాలి అని చాలామంది అంటుంటే ఆ భావనలో భౌతికమైన నియమం కంటే తాత్త్వికమైన పునాదినేదే చూడాలి అనీ దాని వెనక ఒక సాంస్కృతికమైన భావధార, భారతీయత ఉందన్నది వారి మాటలలో గమనించాల్సిన అంశం.

సాహిత్యాన్ని ఎట్లా చూడాలి? నేటి సాహిత్యం జాతీయత లేకపోతే మనం సాహిత్యాన్ని చూడవలసిన రీతులు ఏమిటి? ప్రబంధాన్ని ఇప్పుడు ఎట్లా చదవాలి? వీటిని తెలిపే సందర్భంలో దృక్పథం సాహిత్య అధ్యేతకి ఉండకూడదు. అసలైన సాహిత్యాన్ని అర్థం చేసుకోవడానికి మౌలికంగా కవి చెప్పిన విషయాన్ని తెలుసుకోవడానికి దృక్పథం అడ్డు అంటాము, కానీ సాహిత్య సాధనలో సాంప్రదాయికత అన్నది ఎట్లా పనిచేస్తున్నదో ఆయన వ్యాసాలు తెలుపుతాయి. నేటి సాహిత్యాన్ని హిందువు ఎలా అర్థం చేసుకున్నాడు. సాహిత్యాన్ని చూడడానికి ఒక భావజాలం ఆధారంగా ఉంటుంది. రచయితలో ఒక ఆలోచన ధార నడుస్తుంది అన్నది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడంలో సాంప్రదాయికత, జాతీయత అన్నది సాహిత్యానికి ఎట్లా తోడ్పడుతుంది అన్నది చెప్పడం మరోరకమైన ప్రతిపాదన.

అమలిన శృంగార సిద్ధాంతాన్ని చాలామంది ఒప్పుకోలేదు. ఇది నిలబడని సిద్ధాంతం అని కొందరు భావిస్తే ఇక్కడ వ్యక్తి ధర్మం మనోధర్మం అని రెండు కోణాలు తీసుకుంటే మనో ధర్మాన్ని నీవు పునాదిగా చేసుకుంటే అది ఎందుకు అసాధ్యం అంటారు సుప్రసన్న. వ్యక్తిని కేంద్రంగా తీసుకొని ఆయన ఆకర్షణను కేంద్రంగా తీసుకున్నప్పుడు నీకు అది క్లిష్టమైన పని కానీ నీ ఇంద్రియ శక్తిని జ్ఞానేంద్రియ కర్మేంద్రియాల శక్తిని ప్రధానంగా చేసుకొని అదెందుకు కష్టమయినది అన్నది వారి భావన. భావ కవిత్వంలో అందరికీ ఊహా ప్రేయసి ఉందని మాట్లాడే సందర్భాన్ని మనం తీసుకున్నప్పుడు గిరి కుమారుని ప్రేమ గీతాలు, నాయని సుబ్బారావు గారి కవిత్వం ఎట్లా కులపాలిక ప్రణయానికి ఆధారంగా కనిపిస్తుందో చెప్తారు సుప్రసన్న.

ఆధునిక సాహిత్యంలో ఉన్న సంఘసంస్కరణ మొదలుకొని నిన్నటి ప్రపంచీకరణ దాకా ఉన్న పరిణామాలను సాంస్కృతిక కోణం నుంచీ ఆలోచించటం మరో పార్శ్వం. సాంస్కృతిక సామ్రాజ్యవాదం అనే మాట పి.వి నరసింహారావు వాడారు. దాన్ని కేంద్రంగా చేసుకొని ‘గ్లోబలైజేషన్’ గురించి సుప్రసన్న గారు మాట్లాడారు. వైదేశికమైన ఒకానొక వ్యవహారం భారతదేశంలో ఉండేటటువంటి కాలంలో చరిత్రలో వచ్చిన పరిణామాలను దేశీయం చేసుకొని జాతీయత పునాదిగా ఆలోచించాలి అన్నదానికి ఈ భారతీయ సంస్కృతికి మూలాలు ఎట్లా ఉపయోగపడతాయి అని చెప్పడం మరో మౌలికమైన ప్రతిపాదన.

ఆ తరువాత ‘విశ్వలయ’ అనే ఒకానొక మాటను ఉపయోగించారు. ఈ లయ గురించి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ చెబుతూ సాహిత్యంలో ఈ లయ శిల్పమే. ఒక రకంగా చెప్పాలంటే విషయాలన్నీ ఒక దగ్గరికి సమన్వయం అవుతూ ఉన్నాయి. అలా సమన్వయం కావడానికి ప్రధానమైన కారణం ఏమిటి అంటే లయే. సాహిత్యంలో సామంజస్యమే లయ అనే మాట రాళ్లపల్లి వారంటారు, సంజీవదేవ్ శిల శిల్పం కావడమే లయ అంటారు. అంటే ఒదగవలసిన విషయాలు, అందులో చెప్పవలసిన విషయాలు మన ప్రయత్నం లేకుండానే కొనసాగుతూ ఉండేది లయ. అది వారి సాహిత్య పరంగా, కళలపరంగా ఉంటుంది. అది సాహిత్యంలో ఒక frame లో మనకు కనిపిస్తుంది. ఇవి కళా స్వరూపాన్ని అర్థం చేసుకోడానికి ఉపయోగపడతాయి. కానీ కళా స్వరూపంలో రచయిత విశ్వజనీయమైనటువంటి భావాల్ని ఎలా అన్వయం చేస్తున్నాడు అన్నది మనం అర్థం చేసుకోవాలి. అక్కడే విశ్వలయ అవసరం అనేది సుప్రసన్న గారు చెప్పే అంశం. అంటే కళానుభవానికి కళాత్మకతకి కారణాలు రాళ్లపల్లి, సంజీవదేవ్ చెబితే రసానుభవానికి కారణం విశ్వలయ అని సుప్రసన్న గారు అంటున్నారు. ఇది ఒక రకంగా సాధారణ కారణమే మానవులందరిలో వాసనా రూపంలో రసం ఉన్నది. స్థాయిభావం ఉన్నది కానీ అందరికీ ఒకే రీతిగా ఎందుకు కలగడం లేదంటే ఆ తాదాత్మ్యాన్ని పొందడం అనేది ఎవరి అనుభవంలో వారిదే కావచ్చు గాక ఆ తాదాత్మ్యానికి విశ్వలయ లేదా లయాత్మకత కారణం అవుతుంది. ఆ రసాన్ని మనం పొందడానికి పునాదిగా నిలుస్తుంది అని చెప్పడం సుప్రసన్న గారి ఉద్దేశం.

ఆధునిక సాహిత్యంలో ప్రయోగవాదం, ప్రగతి వాదం రెండున్నాయి అన్నది మరో మౌలిక ఆలోచన. 60ల్లో 70లో వారు తీసుకొచ్చిన ఆలోచన. అంతకుముందు వారు కవిత్వాన్ని కవిత్వంగా చూశారు. కానీ ఆధునిక సాహిత్యంలో రెండు పాయలు నడుస్తున్నాయి ప్రయోగ దృష్టితో రాసేటువంటి వారు ప్రగతి దృష్టితో రాసేటువంటి వారు. ప్రగతి అన్న మాటకి అభ్యుదయ సాహిత్యం. మిగతా వాళ్ళు ఏ రకమైన లక్షణాలు చెబుతారో దాన్ని సంపత్కుమార గాని సుప్రసన్న గారు కానీ ఒప్పుకోరు. ప్రగతి అనేది భౌతికమైన ప్రగతిలో చూసే విషయం గాక మానవ జీవితంలో తాత్వికంగాను వ్యక్తి పరంగాను జరిగే ఒకానొక లక్షణంగా చూడటంగా ఇక్కడ చెబుతారు.

సుప్రసన్నాచార్య సాహిత్య విమర్శ మొదటి నుండి ఇప్పటిదాకా ఉన్న లక్షణం ఆయన ప్రబంధాల గురించి మాట్లాడినా లేకపోతే మరో రకమైన ప్రక్రియల గురించి మాట్లాడినా వాటిని గురించి కారణం చెప్పడం కాదు వాటి మూలం చెప్పడం ఆయన పద్ధతి. ఉదాహరణకు ఆరంభం పెద్ద అవస్థ అని శ్రీశ్రీ వ్యాసం, విశ్వనాథ సత్యనారాయణ రాసిన కృత్యాద్యవస్థ వ్యాసం కావ్య ఆవిర్భావంలో, కవి పడే మథనం గురించి మాట్లాడతాయి. కవి జగత్తులో జరిగే విషయాల గురించి మాట్లాడుతాయి కానీ సుప్రసన్నాచార్య దానికి మూలాన్ని చెబుతూ కావ్య ఆవిర్భావం కావ్య పుట్టుక మొట్టమొదటిసారి మనసులో కలిగే ఒక భావ స్పందన రెండోది అది ఒక క్రమంలో బయటకు రావడం ఒక లయాత్మకంగా బయటికి రావడానికి పడే పెనుగులాట, మూడవది వ్యక్తమైన స్థితి. ఈ మూడు కవిత్వావిర్భావంలో ఉంటాయి అన్న దానికి వాల్మీకి తపస్సు మానిషాద, రామాయణ ఆవిర్భావం ఈ క్రమాలు ఉదాహరణగా చెబుతారు. ఇంకో రకంగా చెప్పాలంటే పాట తొలిదశ, హృదయం రెండోదశ, బుద్ధి మూడవ దశ అక్కడికి వచ్చిన తర్వాతే సాహిత్యంలో ప్రయోగం మొదలైంది. ఇలా మొత్తం సాహిత్యాన్నికవిత్వ ఆవిర్భావ వేళ, ప్రక్రియ ఆవిర్భావ వేళ, కవి అంతరంగంలో జరిగే మానవ జగత్తులో జరిగే ఒక పరిణామాన్ని చెప్తారు.

రస సిద్ధాంతాన్ని గురించి, అలంకార శాస్త్రాన్ని నేపథ్యంగా చేసుకున్నవి, ఆలంకారికుల ఆలోచనలతో సంవదించేవి వారి మాటలలో ఉంటాయి. కానీ దానికి కొనసాగింపుగా చెప్పే విషయాలు ఉంటాయి. ఇవి సుప్రసన్న గారు చేసిన మౌలిక ప్రతిపాదనలు.

ఆయన అనుసరించిన విమర్శ రీతులలో ప్రాగ్రూప విమర్శ, మనోవైజ్ఞానిక విమర్శ, ఆలంకారిక విమర్శ ఉన్నాయి. ఈ ప్రాగ్రూప విమర్శను చేసే వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ పాత్రకి ఈ కథకి ఆలోచనకి మూలం ఏమిటని అతని అన్‌కాన్షియస్‌కి ఎట్లా పనిచేసింది అవచేతన ఎట్లా పనిచేసింది ఇవన్నీ చెప్పడానికి ఈ కథకు అది ఎట్లా మూలం అని చాలామంది మాట్లాడతారు. పాత్ర కోణంతో మాట్లాడుతారు. కానీ కవిత్వావిర్భావానికి ప్రాగ్రూపాలకి సుప్తచేతనకి ఉన్న సంబంధం ఏమిటి సృజన మూలంగా ప్రాగ్రూపం ఏమిటి? అని మాట్లాడిన వ్యక్తి సుప్రసన్న గారు. ఇంకా ఆయన వీటిని చిత్, అచిత్, ఈశ్వరుడు అని సిద్దాంతం ఉన్నట్లు ఈ సమిష్టి చేతననే చిత్‌నే యూంగ్ చెప్పినాడనుకోవచ్చా? అని ఆలోచన వస్తుంది. ఆర్ ఎస్ సుదర్శనంలో కూడా ఈ లక్షణం కనిపిస్తుంది, పాశ్చాత్య తాత్త్విక సిద్ధాంతాలలో ఏవి భారతీయ భూమిక మీద కొనసాగుతున్నవి అని తమ ప్రాంతంలో, దేశంలో తమ జీవితాన్ని, తాత్త్విక వ్యవహారాల్లో కనిపించే రీతికి అన్వయించి చూడవచ్చు. ఇది సుప్రసన్న విమర్శలో కనిపిస్తుంది.

ఆ తర్వాత అలంకార శాస్త్రాన్ని గురించి శ్రవ్య కాలాల గురించి భోజుని పునాదిగా చేసుకుని శ్రవ్య కావ్యాలను గురించి వాటి ఇతివృత్తాల గురించి మాట్లాడడం ఒక మౌలికమైన ఆలోచన. విశ్వనాథ సత్యనారాయణ గారు గరుడోపాఖ్యానాన్ని ఒకటి రెండు కథల్ని ఉదాహరణగా తీసుకొని అంతరార్థకథ నాన్ని రహస్య కథనాన్ని చెప్పడానికి ప్రయత్నిస్తే దాన్ని రుక్మిణి కల్యాణానికి, పూర్ణమ్మ కథకు ఆధునికమైన వాటికి అన్వయించుకొని మాట్లాడటం కనిపిస్తుంది. రహస్య కథనం సంప్రదాయం అన్న సాహిత్య విమర్శనూ కొనసాగించారు సుప్రసన్న గారు.

ఈ విమర్శ రీతులలో నడుస్తూనే ఆయన నిర్మించిన ఒక సాహిత్య విమర్శరీతి ఉంది. ఒక రచనని అనుభూతిలోకి, అనుభవంలోకి తెచ్చుకొని దాని జీవితాన్ని వ్యాఖ్యానించడం కాదు అందులో ఉన్న జీవనతాత్త్వికని కావ్య పరమార్థ దృష్టితో ఎట్లా విశ్లేషించుకోవాలి అన్నది ఒక విమర్శరీతిగా ఆయన చేశారు. విమర్శరీతులు అన్నీ కూడా పారామీటర్స్‌తో నడుస్తాయి. అవి సహృదయుడు ప్రమాణంగా ఉండే విమర్శరీతులు కాదు ఆలోచనలు ప్రధానంగా ఉండే విమర్శరీతులు. అనుభూతి ప్రధానంగా ఉండే రీతి తన కావ్యానుభావాన్ని వ్యాఖ్యానించే రీతిలో ఉండాలన్నది మౌలికమైన రీతిగా ఆయన చెబుతారు. మొత్తం సాహిత్యాన్ని అలాగే చూస్తారు. అందులో రచన, కాలప్రవాహం, రచయిత, పాఠకుడిపై వేసిన ముద్ర అన్నీ ఉన్నాయి. అనుభూతి ధోరణి అంతా ఉంది.

నవ్య సంప్రదాయం గురించి కొత్త ఆలోచనలు జరుగుతున్న మొదట్లోనేనే వారన్నమాట సనాతనమైన చందస్సు కాల్పనికమైన అభివ్యక్తి అంతా నవ్య సంప్రదాయం అంటారు. సాహిత్యానికి మూలం, తాత్త్వికం ఏమిటని, అందులోని మౌలికత ఏమిటని చెప్పే స్వభావమే ఆయనని మిగతా వారి కంటే ఆధునికంగానూ, భిన్నంగానూ ఉంచింది.

సుప్రసన్న గారు చర్చోపచర్చలకు సంబంధించిన విషయాల్లో కలగజేసుకున్నట్లు అనిపించరు. కానీ ఆయన వ్యాసాలు అన్నీ జాగ్రత్తగా పరిశీలిస్తే ఆయన సాహిత్య విమర్శలో వాటికి సమాధానాలు చెప్పిన ఘట్టాలు ఉంటాయి. అలాంటి సాహిత్య విమర్శలో కూడా ఒకే ఒక రచన తీసుకొని దాన్ని పూర్తిగా వ్యాఖ్యానించే విమర్శ గ్రంథం వసుచరిత్ర పై చేసిన పరిశోధన గ్రంథం తప్ప అలాంటిది మరొకటి కనిపించదు. తాత్త్విక సత్యాన్ని ఆవిష్కరించడమే సాహిత్య విమర్శ చేయవలసిన ప్రధానమైన పని అని తన మౌలికమైన ప్రతిపాదనతో తన విమర్శని కొనసాగించారు. అది చెప్పే సందర్భంలో అది అలంకారికమా మరొకటా అన్నదేమీ ఉండదు. వేద కాలంలో ఉండే విషయం నుంచి, ఆధునికంలో ఉండే తాత్త్వికత దాకా సమన్వయం చేసుకుంటూ చెప్పే విమర్శ రీతి సుప్రసన్నలో అణువణువున కనిపిస్తుంది. అది చిన్న వ్యాసం మొదలు పెద్ద కావ్యం వరకు వ్యాపించింది. వారి సాహిత్య విమర్శను మనమూ అనుభూతి, అనుభవం పునాది మీదనే అర్థంచేసుకోవాలి.

Exit mobile version