[box type=’note’ fontsize=’16’] డాక్టర్ గంటా జలంధర్‌రెడ్డి, జెట్టి శంకర్‌ల సంపాదకత్వంలో తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి ప్రచురించిన “బహుముఖ ప్రతిభావంతుడు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి స్మారక సంచిక” అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు కె.పి. అశోక్ కుమార్. [/box]
బహుభాషావేత్తగా, తొలితరం సాహితీవేత్తగా, చరిత్రకారుడిగా, ప్రసిద్ధ పరిశోధకుడిగా, కథకుడిగా, పత్రికా సంపాదకుడిగా, గ్రంథాలయ ఉద్యమసారథిగా తెలంగాణను జాగృతం చేసిన మేధావి సురవరం ప్రతాపరెడ్డి. ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’, ‘హిందువుల పండుగలు’, ‘రామాయణ విశేషణములు’, ‘హైందవ ధర్మవీరులు’, ‘యువజన విజ్ఞానం’ వంటి విలువైన తెలుగు గ్రంథాలను తెలుగు జాతికి అందించి, తెలుగువారి సాంస్కృతిక వికాసానికి కృషిసల్పిన సురవరం ప్రతాపరెడ్డి కేవలం 57 సంవత్సరాల వయస్సులో, అకాల మృత్యువుకు గురికావడం తెలుగు జాతిని కృంగదీసింది. ప్రతాపరెడ్డిగారి అకాలమృత్యువును జీర్ణించుకోలేని ఆయన ఆత్మీయులు, ఆయన అభిమానులు సమకాలీన రచయితలు, సాహితీవేత్తలు ప్రాంతీయ భేదాలకు అతీతంగా వారిని స్మరించుకుని వ్యాసాల రూపంలో, ఉపన్యాసాల రూపంలో, కవితల రూపంలో తమ తమ భావాలను వ్యక్తీకరించారు. వారందరి స్మృతి సాహిత్యాన్ని స్రవంతి సాహిత్య మాసపత్రిక సంపాదకులుగా ఉన్న ఆంజనేయ శర్మ, దాశరథి కృష్ణమాచార్య, సి. నారాయణ రెడ్డి గారు 1954లో స్మారక సంచికగా వెలువరించినారు. 64 ఏళ్ళ కిందటి ఈ స్మారక సంచికను వెలికితీసి, ఇప్పుడు తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి తరఫున వెలుగులోకి తెచ్చిన డా. జలంధర్‌రెడ్డి అభినందనీయుడు.
ఇందులో ‘శ్రీ ప్రతాపరెడ్డిగారి పరిశోధనా దక్షత’ అనే వ్యాసంలో మల్లంపల్లి సోమశేఖర శర్మ – ప్రతాపరెడ్డి గారికి సృజనాత్మక రచన కంటే పరిశోధన, సాహిత్య చారిత్రక విమర్శ రాయడం అంటే ఎక్కువ ఇష్టం. వారి వ్యాసాలలోనే కాకుండా – ‘హైందవ ధర్మవీరులు’, ‘హిందువుల పండుగలు’, ‘రామాయణ విశేషణములు’ అనే గ్రంథాలలో కనబరిచిన పరిశోధనా పాటవాన్ని ప్రస్తుతించారు.
“ప్రతాపరెడ్డి చారిత్రకుడు” అంటూ ఖండవల్లి లక్ష్మీరంజనం, తెలుగులో తొలిసారి ఆంధ్రుల సాంఘిక చరిత్రను వ్రాసిన ప్రతాపరెడ్డిగారు అందుకుగాను పురావస్తు ఆధారాలు, వాఙ్మయ ఆధారాలను సేకరించడం, విశ్లేషించడంలో చూపిన ప్రతిభను ప్రశంసించారు.
“నేనెరిగిన ప్రతాపరెడ్డిగారు” ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక సంస్థ. ఒక సంస్థ కాదు, పలు సంస్థల మూల రూపం. అనేక పరిషత్తులకు ఆయనే అధ్యక్షుడు. పండిత పక్షపాతి. సంస్కృత భాషాభిమాని. ధన, పదవీ వ్యామోహాలు లేవు. ఆయన దృష్టిలో నేటి రాజకీయాలు ఒక చీకటి బజారు. అర్థ లోభము, అధికార వాంఛ లేకుండా జీవితమంతా ప్రజాసేవకే సమర్పించిన ధన్యజీవి ప్రతాపరెడ్డి మహాశయుడు” అంటూ చెలమచెర్ల రంగాచార్యులు తెలియజేశారు.
బూర్గుల రామకృష్ణారావు ‘ప్రతాపరెడ్డి అన్నగారు’ గురించి వివరిస్తూ, “వకాలత్ ఆయనే విడిచిపెట్టినారు. వారి సంఘ సేవాసక్తి ఈ తరం వారికి తెలియకపోవచ్చును. కాని తెలుగు మాట్లాడే యావత్తు భూభాగంలోను వారి రచనాశక్తి, సాహిత్య సేవ మాత్రం మరిచిపోవడానికి వీలు లేదు” అంటూ వారితో గల అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు.
సురవరం వారిని “ఉత్తమ దేశికుడు”గా బిరుదురాజు రామరాజు పేర్కొంటూ “ప్రతాపరెడ్డి గారికి చురుకైన, ప్రతిభగల యువకుల ప్రోత్సహించుటయనునది ‘మహా దొడ్డగుణము’. విద్యార్థులందు వారు చూపిన వాత్సల్య మవేలము” అంటూ కొనియాడారు. “ప్రతాపరెడ్డిగారు నిజమైన పరిశోధకులు. పరిశోధనమున వారికుండిన సత్యదృష్టి ఇంతింతనరానది” అంటూ ఉదాహరణలతో తెలియజేశారు. “రెడ్డిగారిది యద్భుతమైన ధారణాశక్తి. వారి కభిమాన విషయముల నొకసారి విన్నంత, చూచినంత నెప్పటికిని జ్ఞప్తియందుంచుకొనెడివారు. అసలు రెడ్డిగారి లైబ్రరీనంతయు నొకచో భద్రపరుపవలయును. వారచ్చటచ్చట వ్రాసి పెట్టుకున్న నోట్సు, వారొనరించిన కృషి కూలంకుషముగా పరిశోధింపబడవలయును. వారు సేకరించిన నిఘంటువు లెక్కని పదముల పట్టిక చాలా పెద్దది” అంటూ వారి రచనలన్నింటినీ గ్రంథ రూపములో తీసుకురావలసిన ఆవశ్యకతను తెలియజేశారు.
“ప్రతాపరెడ్ది గారు – గ్రంథాలయాలు” అనే వ్యాసంలో పాతూరి నాగభూషణం – “తెలంగాణములోని గ్రంథాలయోద్యమాభివృద్ధికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ పాటుపడిన పెద్దలలో ప్రతాపరెడ్డిగారు ముఖ్యులు. వారు ‘గ్రంథాలయోద్యమము’పై పుస్తకం రాయడమే కాకుండా, 23, 25, 26, 27, 28వ ఆంధ్రదేశ గ్రంథాలయ మహాసభలలో నిర్వహించిన పాత్రను, వారి ప్రసంగాల గురించీ ఆసక్తికరంగా తెలియజేసారు.
“శ్రద్ధాంజలి” పేరిట మల్లాల దేవ ప్రసాదు ప్రతాపరెడ్డిగారి జీవిత చరిత్రను క్లుప్తంగా తెలియజేశారు. ప్రతాపరెడ్డి వ్యక్తిత్వాన్ని, సాహిత్యాన్ని, పత్రికాసేవను వివరిస్తూ, వారితో గల అనుబంధాన్ని తెలియజేస్తూ ఇల్లిందుల సరస్వతీదేవి “మహాపురుషుడు సురవరం ప్రతాపరెడ్డి” అని కొనియాడారు.
“విశాలమైన మానవ ధర్మమునకై సర్వస్వమును సమర్పించిన త్యాగి ఆయన” అంటూ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ “జోహారులు” సమర్పించారు. “స్మృత్యంజలి” అంటూ శిరోమణి కప్పగంతుల లక్ష్మణశాస్త్రి, “యశోరాశి” అంటూ దాశరథి, “విద్వన్మణి” అంటూ సి. నారాయణ రెడ్డి, “స్మృతిగీత” అంటూ సంపత్కుమార, “పవిత్ర స్మృతి” అంటూ బి.సి. బసవరాజు, “దివ్యస్మృతి” అంటూ చుక్కా కోటి వీరయ్య, “అశ్రుపూజ” అంటూ వేముగంటి నరసింహాచార్యులు, “వందనము” అంటూ అశ్వత్థామ – సురవరం వారి వ్యక్తిత్వాన్ని, వారి జీవితకాల కృషిని, వారి గొప్పదనాన్ని పద్యాలలో ప్రస్తుతిస్తూ రాయడం బాగా వచ్చింది. బహుముఖ ప్రతిభావంతుడైన సురవరం ప్రతాపరెడ్డి గురించి ఈ తరానికి తెలియజేయడానికిగాను ఈ స్మారక సంచిక ఉపకరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
***
“బహుముఖ ప్రతిభావంతుడు శ్రీ సురవరం ప్రతాపరెడ్డి స్మారక సంచిక”
సంపాదకులు: డాక్టర్ గంటా జలంధర్‌రెడ్డి, జెట్టి శంకర్
తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి, పెద్ద అంబర్‌పేట్.
పుటలు: 100, వెల: ₹100
ప్రతులకు: 9848292715