Site icon Sanchika

సూర్యుడు ఉదయించే భూమిలో…

[box type=’note’ fontsize=’16’] “ఎన్ని విధ్వంసాలు సంభవించినా కోలుకుని అభివృద్ధి వైపు దూసుకువెళ్ళే జపాన్ తీరు, ఆ దేశాన్ని పర్యటించేందుకు ఆసక్తిని కలిగించింది” అంటూ జపాన్ పర్యటన గురించి వివరిస్తున్నారు నర్మద రెడ్డి.  [/box]

[dropcap]కొ[/dropcap]న్ని ప్రయాణాలు అనుకోకుండా జరుగుతాయి. మరి కొన్ని అనుకొని జరుగుతాయి. మేము చేసిన ఈ జపాన్ ప్రయాణం అనుకొని, ఒక ఛాలెంజ్‌గా తీసుకొని చేసిన ప్రయాణం. ఒక దేశ పర్యటనకు ఛాలెంజ్ ఎందుకూ అనే ప్రశ్న రావచ్చు. దానికి కారణం లేకపోలేదు. అయితే ఈ ఛాలెంజ్ కంటే ముందు ఈ దేశం పట్ల మాకు కలిగిన ఆసక్తి గురించి చెప్పాలి.

చిన్నప్పటి స్కూలు రోజుల నుండి జపాన్ దేశం ఒక చిన్న ప్రశ్నను రేకెత్తించింది. అది చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అదే ఆ దేశాన్ని ‘సూర్యుడు ఉదయించే భూమి’ అని అంటారని. అసలు ఆ దేశాన్ని అలా ఎందుకు పిలుస్తారో అనే ప్రశ్న చాలా ఏండ్లుగా మిగిలిపోయే ఉంది.

ఇక రెండో కారణం. ఆ దేశాన్ని గురించి ఎప్పుడు పత్రికల్లో చదివిన, టీవీల్లో దాని గురించి చదివినా నిత్యం భూకంపాలు సంభవించడం. అగ్ని పర్వతాలు విరుచుకుపడటం వార్తలుగా చూస్తూనే ఉన్నాం. దీనికి తోడు ఈ దేశంలోని రెండు నగరాలపై అమెరికా అణుబాంబులతో దాడి చేసి కనీవిని ఎరుగని రీతిలో విధ్వంసం సృష్టించినా దాని నుండి కోలుకుని అభివృద్ధి వైపు దూసుకువెళుతున్న తీరు మాకు ఎప్పుడూ ఆశ్చర్యాన్ని కలిగించేది. అందుకే ఆ దేశాన్ని పర్యటించి రావాలనే ఆసక్తి మమ్ముల్ని ఆ దేశానికి వెళ్లేలా చేసింది.

దీనికోసం టికెట్లు కూడా బుక్ చేసుకున్నాం. అయితే మా ప్రయాణం విషయాన్ని కవిత అనే మా ఫ్రెండ్‍కు చెబితే అక్కడి వాళ్లకు ఇంగ్లీషు రాదు, మనం అక్కడికి వెళ్లాలంటే చాలా కష్టం. అందుకని ఆరు రోజుల ప్యాకేజీగా మాట్లాడుకొని వెళితే రెండు లక్షల డెభై వేలతో అన్ని ఈజీగా చూసి రావచ్చు అని చెప్పింది. ఇన్నీ దేశాలు తిరిగిన మాకు భాష సమస్య పెద్దగా ఎక్కడా కాలేదు. మా వారు మాత్రం మీ ఫ్రెండ్ కష్టం అంటుంది కదా మనకు ఒక ఛాలెంజ్. ప్యాకేజీ కాకుండా నార్మల్‌గా ఒక రూం (ఒక్క రోజుకు మాత్రమే) బుక్ చేసుకొని వెళ్తాము అన్నాడంతో జపాన్‌కు బయలుదేరాము.

టోక్యో విమానాశ్రయంలో అడుగు పెట్టగానే ముందుగా అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ సెంటర్లోకెళ్ళి అక్కడ చూడాల్సిన ముఖ్యమైన ప్లేసులన్నీ వున్న ఒక బుక్లెట్ తీసుకున్నాము. జపాన్‌లో వారి ప్యాకేజీ ప్రకారం 5 లక్షలు ఖరీదుచేసే ప్యాకేజి టూర్ అది. దాని ప్రకారం నేను జపాన్ ట్రైన్ పాస్ కొని ఆ ట్రైన్ పాస్‌తో 10 రోజులు ఈ ప్రదేశాలన్నీ చూడాలని ప్లాన్ చేసుకున్నాము.

టోక్యో ఎయిర్‌పోర్టు నుండి బయటకు రాగానే ఒక లోకల్ ట్రైన్‌లో మేము బుక్ చేసుకున్న హోటల్‌కి వెళ్ళాలనుకున్నాము. అనుకున్నట్లు ఒక రైల్వే స్టేషన్‍కు వెళ్లి ట్రైన్ కనిపిస్తే అందులో ఎక్కి కూర్చున్నాం. ఆ ట్రైన్ ఒక గంట ప్రయాణం చేసిన తర్వాత టికెట్ కలెక్టర్ వచ్చి చెబితే తప్ప మాకు అర్థం కాలేదు. మేము రాంగ్ రూట్లో ప్రయాణం చేస్తున్నామని, కుడివైపు వెళ్లాల్సిన ట్రైన్‌లో ప్రయాణించాల్సిన మేము ఎడమవైపు వెళ్లే ట్రైన్‍లో ఎక్కినామని. అప్పటికే ఒక గంట ప్రయాణం చేసి ఉన్నాం. ఇక చేసేది ఏమీ లేక తర్వాతి స్టేషన్లో దిగి అక్కడి నుండి రివర్స్‌లో ఇంకో ట్రైన్ పట్టుకొని మా హోటల్‌కు చేరుకున్నాం. ప్రయాణ బడలికతో బాగా అలసిపోయి పడుకున్నాము.

సూర్యుడు ఉదయించే దేశంగా…

అయితే జపాన్ గురించి ఒక విషయం చెప్పాలి. స్కూల్ రోజుల్లో ఈ విషయం గురించి చదువుకుని ఉండొచ్చు అనుకొండి కానీ సందర్భం కాబట్టి జపాన్ కు ఈ పేరు ఎందుకొచ్చిందో తెలుసుకోవాలనే ఆలోచన కలిగింది. ప్రపంచంలో ఎక్కడైనా సూర్యుడు ఉదయిస్తాడు. అదీ తూర్పు దిక్కు నుండే. కానీ జపాన్‌ని మాత్రమే ‘ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్’ అని పిలుస్తాం. దానికి కారణం చైనీయులే. జపాన్ ఏర్పడక ముందు చైనీయులకి ప్రతిరోజూ సూర్యుడు వాళ్ల దేశానికి తూర్పు భాగంలో ఉదయిస్తూ కనబడేవాడు. దాంతో ఆ ప్రాంతం నుంచి మాత్రమే సూర్యుడు ఉదయిస్తాడని నమ్మేవారు. ఆ తరవాత జపాన్ ఏర్పడింది. వాళ్ల నమ్మకం ప్రకారం సూర్యుడు అటు నుంచే ఉదయిస్తాడు కాబట్టి ఆ దేశాన్ని సూర్యుడు ఉదయించే ప్రాంతంగా పిలిచేవారు. అలా దానికి ఆ పేరు స్థిరపడిపోయింది.

జపాన్ అనేది తూర్పు ఆసియా ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న ఒక ద్వీప దేశం. మూడువేల పైచిలుకు ద్వీపాల సమూహమే ఈ జపాన్, వాటిల్లో ముఖ్యమైనవీ పెద్దవీ ఐదారే. ఇది చైనా, కొరియా, రష్యా దేశాలకు తూర్పు దిశగా ఉంది. జపాన్ దేశపు ఉత్తరాన ఉన్న సముద్ర భాగాన్ని ఓఖోట్‌స్క్ సముద్రం అని, దక్షిణాన్న ఉన్న సముద్ర భాగాన్ని తూర్పు చైనా సముద్రం అనీ అంటారు. విస్తీర్ణంలో చాలా చిన్నదైనప్పటికీ జనంతో కిక్కిరిసి ఉంటుంది. అక్షరాస్యత, ఆర్థికాభివృద్ధి, టెక్నాలజీ, రవాణా, పరిశుభ్రత ఇలాంటి ఎన్నో విషయాల్లో దూసుకుపోతుంది.

జపాన్‌లో మా మొదటి రోజు ప్రయాణం టోక్యో నగరం నుండి మొదలైంది. ముందుగా ఈ నగరం గురించి చెప్పాలి. టోక్యో జపాన్ దేశ రాజధాని నగరం. ప్రపంచంలో అతి పెద్ద నగరం కూడా ఇదే, అలాగే ప్రపంచంలో మూడు ప్రధాన వాణిజ్య మహా నగరాల్లో ఇదీ ఒకటి. ఒకప్పుడు ఈ టోక్యో అనేది ఒక చిన్న ఫిషింగ్ విలేజ్‌గా ఉండేదట. దీని అసలు పేరు ఇడొ. 1868లో దీన్ని జపాన్ రాజధానిగా మార్చినప్పుడు టోక్యోగా పేరు మార్చారు. టోక్యో అంటే ‘తూర్పు రాజధాని’ అని అర్థం. ఇవాళ ఈ టోక్యో నగరం ఖరీదైన హెూటళ్లకు పెట్టింది పేరు. ఇక్కడి ‘రిట్జ్ కార్ల్‌టన్’ అనే హోటల్ ప్రపంచంలోని ఖరీదైన హెూటళ్లలో ఒకటి. ఇక్కడ ఒక్క రోజు రాత్రి ఉండటానికి మన కరెన్సీలో ఆరున్నర లక్షల రూపాయలు కావాలి. దేశ విదేశాల నుండి వచ్చే ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఈ నగరంలోనే ఉండటానికి ఇష్టపడతారు.

అయితే ఈ నగరం వాణిజ్యాన్ని ఎంత ఫేమసో పార్కులకు, పూల చెట్లకు అంత ఫేమస్. మేము మొదట దగ్గర్లో వున్న ఉఎనో (UENOPARK) పబ్లిక్ పార్కుకి వెళ్ళాము. దీనిని 1873లో నిర్మించారు. ఈ పార్క్లో అనేక ఆలయాలు, పుణ్యక్షేత్రాలు, బోట్‌లేక్, చారిత్రాత్మక స్మారక చిహ్నాలు, చెర్రీ బ్లాసమ్ చెట్టు ఉన్నాయి. అయితే ఇక్కడున్న ఈ చెర్రీ చెట్లే ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ అని చెప్పవచ్చు. జపాన్‌లో చెర్రీపూల చెట్టకు పురాతన కాలం నుండి ప్రాశస్త్యం ఉంది. చెర్రీ బ్లోసమ్ పువ్వును జపాన్ జాతీయ పుష్పంగా పరిగణిస్తారు. ఈ పువ్వులు పూచే వసంత కాలంలో జపాన్ ప్రజలు దాన్నొక పెద్ద పండుగలా జరుపుకుంటారు. ఈ కాలాన్ని ‘హనామి’ అని పిలుచుకుంటారు. అందరూ కలిసి సందడిగా పండగ జరుపుతారు. ఆ చెట్ల ఆకులు చాలా అందంగా వున్నాయి. ఒక నది ప్రక్కన వున్న రోడ్ పైన దారికి ఇరువైపు తివాచీ పరిచినట్లు ఉంటుంది. ఎవరైనా ఆ దారిగుండా నడుస్తుంటే పూల వర్షం కురిసిందా అన్నట్లు కనిపిస్తుంటుంది. చాలా సినిమాల్లో కూడా ఈ దృశ్యం కనిపిస్తుంది మనకు.

నేను ఆ చెట్ల మధ్య నడుస్తుంటే, నాపై ఆ ఆకులు రాలుతుంటే ఆనందాన్ని పట్టలేక సంతోష బాష్పాలు రాల్చాను. ఎన్నో ప్రాంతాలను చూసిన నాకు ఈ ప్రకృతి అందం ముందు ఎన్ని అందాలైనా దిగదుడుపే కదా అనిపించింది. చాలా మంది ప్రయాణికులు ఆ అందాన్ని చూసేందుకు మనుషులు నడిపే రిక్షాల్లో ఎక్కి అంతా తిరిగి చూస్తున్నారు. అక్కడే రెండు గంటల పాటు గడిపి దగ్గర్లో ఒక బోటు షికారు ఉంటే మేము టికెట్ తీసుకొని ఆ తీరం వెంట ఆ పడవలో ఈ తీరం అందాల్ని చూస్తూ మైమరచిపొయ్యాము. ఇక్కడే చుట్టూ ఉన్న అన్నీ బిల్డింగులు గురించి, వాటి ప్రత్యేకతను మాకు ఆ బోట్లో వున్న గైడ్ వివరిస్తూ వుంటే అన్నీ చూస్తూ మధ్య, మధ్యన దిగుతూ, అక్కడ వున్న పార్కులు చూచి రాత్రికి రూమ్‌కి వచ్చి పడుకున్నాము.

రెండవ రోజు మేము నారా పట్టణంలోని కింకాకు-జి (Knukakuji) కి వెళ్లాము. ఇది చాలా పురాతనమైన నగరం. ఇక్కడి వారు క్యోటో (Kyoto) లో రాజులనే దేవుళ్ళుగా మొక్కినారట. ఇక్కడే ప్రసిద్ద గోల్డెన్ టెంపుల్ (Golden Temple) ఉంది. దీనిపై రెండు అంతస్తులను బంగారురేకులతో తాపడం చేశారు. ఇది మొదట చివరి షోగున్ అయిన అషికగా యోషిమిత్సు నివాసస్థలంగా ఉండేది. ఆయన రాసిన విల్లు ప్రకారం తరవాత దాన్ని జెన్ బౌద్ధాలయంగా మార్చారు. దానిచుట్టూ చిన్న కొలను ఉంది. ఈ బంగారు దేవాలయం దూరానికి కూడా మెరుస్తూ కనిపిస్తుంది. కొలనులో దాని నీడ చూడ్డానికి శోభాయమానంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం 10 మిలియన్ల జపనీయులు ఈ పురాతనమైన నగరాన్ని దర్శిస్తారట. ఇది ఎమిమిది తొమ్మిదో శతాబ్దంలో రాజుల కళలకి (Art) చాలా ప్రాముఖ్యతనిచ్చిన రోజులలో 500 కి.మీ. విస్తీర్ణంలో ఎన్నో దేవుని విగ్రహాలు, టెంపుల్స్, షింటో టెంపుల్, బుద్ధుడి ఆలయాలు నిర్మించిన స్థలం. ఎన్నో ఉద్యానవనాలు నిర్మించారు.

  

అయితే ఇదే క్రీ.శ. 710లో జపాన్ రాజధాని నగరం. కొన్ని రాజకీయ కారణాల కారణంగా 794లో క్యోటోని రాజధానిగా చేశారు. 794లో పస్ట్ టెన్నో (First Tenno), కమ్ము (Kammu), అనే మహారాజు, ఉదా (UDA) అనే గ్రామంలో తన స్థావరాన్ని ఏర్పరచుకున్నారు. దీనినే అతడు హియాన్ క్యో (Heiankyo) అని పిలిచేవాడు. అంటే శాంతి స్థావరము (Capital of Peace) అని అర్థం. తర్వాత ఇదే గ్రామం క్యోటోగా (Kyoto) మారింది. ఇది చైనీస్ లైన్లలో గీస్తే ఒక Chess Board లాగా వుంటుంది. 272 అడుగుల వెడల్పు, 83 మీ.తో వీధులలో జిల్లాల వారిగా 2 జిల్లాలుగా విభజించిన outline లాగా కన్పిస్తుంది. ఇక్కడ Kammu అనే రాజు, 4,00,000 మంది జనాభాతో వున్న ప్రదేశంలో Kammu రాజుని షింటో అనే జాతివారు Sun of Godess గా Kammu పూజించేవారు. రాజునే దేవుడిగా కొలిచేవారు. రెండవ ప్రపంచ యుద్ధం వరకు కమ్మునే దేవుడిగా కొలిచేవారు. ఇక్కడే ఇంపీరియల్ గార్డెన్స్ వున్నాయి. ఇది చాలా సార్లు కాలిపోయినా మళ్ళీ దీన్ని పునఃనిర్మించారు.

ఇక్కడికి వెళ్ళగానే, ఆ గుడి చుట్టూ నీళ్ళు. ఆ నీళ్ళలో ఈ బంగారు టెంపుల్ నీడపడి ఎంతో అందంగా అన్పించింది. ఎర్రని ఆకులతో ఆ ఉద్యానవనంలో తిరుగుతూ ఉంటే ఎక్కడికో విహరింప చేసింది ఈ ఉద్యానవనము. ఎంతోమంది యాత్రికులతో కిటకిటలాడుతూ కనిపించిది. లోపలికి వెళ్లి మొక్కి వచ్చాము.

దేవుని దూతలు జింకలు!

ఇక్కడ చూడాల్సిన వాటిలో జింకల పార్కు చెప్పుకోదగ్గది. 1880లో పెట్టిన ఈ పార్కులో వందల జింకలు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. షింటో మతం ప్రకారం వీటిని దేవుని దూతలుగా భావిస్తారు. ఆహారం కోసం అవి మన దగ్గరకు వస్తాయి. ఆహారం లేకపోతే రెండు చేతులూ పైకి ఎత్తితే, వెనక్కి వెళ్లిపోతాయి. జపాన్‍లో షింటోతోబాటు బౌద్ధాన్నీ అనుసరిస్తారు.

పేయింగ్ గెస్ట్‌గా…

మేము టోక్యోలో గంటకి 320 కి.మీ. వేగంతో నడిచే స్పీడ్ ట్రైన్ ఎక్కి 3 గంటలలో ఇక్కడికి చేరి ఈ ప్రదేశాన్ని చూచి అక్కడే రాత్రికి వుందామని bach pach లో ఒక డ్రెస్ తీసుకొని ట్రెయిన్ స్టేషన్‌కి వెళ్ళి అక్కడ ఇన్ఫర్మేషన్ సెంటర్ దగ్గరకు వెళ్లి “ఇక్కడ ఉండటానికి దగ్గర్లో వున్న ఏదైనా హోటల్ ఉందా” అని అడిగాము. అక్కడున్న ఆమె పెయింగ్ గెస్ట్‌గా (paying guest) వుంటారా అని అడిగారు. మేము బయలుదేరింది ప్యాకేజీ టూర్లో కాదు కాబట్టి ఎక్కడైన ఉండటానికి చోటుంటే చాలు అనుకొని అవిడకు ఒకే అని చెప్పాము. ఆమె చిన్న స్లిప్ (slip) మీద అడ్రస్, అక్కడి వారి ఫోన్ నెంబర్, వీధి నెంబర్ అన్ని వివరంగా రాసిచ్చారు. అది తీసుకొని వెతుక్కుంటూ వెళుతుంటే దారిలో ఒక అబ్బాయి కనిపించాడు. అతన్ని అడిగితే, ఆ అబ్బాయి వెంటనే నేను చూపిస్తాను రమ్మని 12 మైలు దూరం వరకూ మాతోపాటు నడుచుకుంటూ వచ్చి ఆ యిల్లు చూపించి వెళ్ళాడు. మేము ఆ అబ్బాయిని మీరు ఇక్కడే మీరు వుంటారా అని ప్రశ్నిస్తే. లేదు, నేను ఆఫీసుకు వెళుతున్నాను. మీకు అడ్రస్ చూపించడానికే ఇక్కడి వరకు వచ్చాను అని చెబితే ఆశ్చర్యపోయాము. కేవలం అడ్రస్ చెప్పి చెప్పి వెళ్లకుండా మా వెంబడి ఇంత దూరం వచ్చాడు కదా అని ఆశ్చర్యపొతూనే ఆ అబ్బాయికి థాంక్స్ చెప్పాను.

ఈ సందర్భంగా జపాన్ వారి ఆతిథ్యం గురించి చెప్పాలి. మనలాగే ఈ దేశస్తులకు కూడా అతిథి మర్యాదల్లో పేరుందనుకోండి. కొత్తవారు కలిసినప్పుడు వారి అభివాదము, వారి సౌమ్యత, స్నేహపూర్వకమైన సంభాషణ ఇతర దేశాలలో ఎక్కడా చూడలేదు. మేము పెయింగ్ గెస్ట్‌గా ఉన్న ఆ ఇంటి యజమానులు (ముసలివాళ్ళు) కూడా మాకు మంచి అతిథ్యమే ఇచ్చారు. ఒక రోజుకి 1000 రూపాయలు చెల్లిస్తే బ్రేక్‌ఫాస్ట్ (Bread & Break-fast) తోపాటూ ఒక బెడ్‌రూమ్ ఇచ్చారు. అయితే వాళ్లకి ఇంగ్లీషు రాకపోవడం. మాకు వాళ్ల బాష అర్థం కాకపోవడంతో వాళ్లతో ఏమీ మాట్లాడలేకపోయాము. అయినా దేశం కానీ దేశంలో ముక్కుమొఖం తెలియని వాళ్ళ ఇంట్లో పెయింగ్ గెస్ట్‌గా  ఉండటం మంచిగానే అనిపించింది.

అక్కడి నుండి మేము మరుసటి రోజు తోడాజీ (Thodaji) టెంపుల్, జింకల పార్కు వెళ్ళాము. ఇద్దరు కాలేజీ అమ్మాయిలతో వెళ్ళాము. వారిద్దరూ ఇంటర్మీడియట్ చదువుతున్నారట. వాళ్లు ఆ గుడిలో ఉన్న పార్కు చూడటానికి వచ్చారు. ఆ కాలేజీ పిల్లలతో పాటు ఆ గుడికి బయలుదేరాము. అక్కడికి వెళ్లాలంటే ఒక కిలోమీటరు దూరం నడవాలి. ఈ కిలోమీటరు పొడవునా ఆ అమ్మాయిలతో మాట్లాడుతూ నడిచాము. ఒక అమ్మాయి జపనీస్ పాట పాడింది. నేను కూడ ఒక పాట పాడాను.

  

జపనీయులు షింటోతోపాటు బౌద్ధాన్నీ అనుసరిస్తారు. తొడై -జి అనేది ఇక్కడున్న అతిపెద్ద, పురాతన ఆలయం. చెక్కతో కట్టిన ఈ ఆలయం ప్రపంచంలోనే అతి పెద్దది. 3000 రాగితో వున్న లాంతర్లు, వారి పనితనము, నగిషీతనము చూచి ముగ్ధురాల్ని అయ్యాను. ఇక్కడ అశోక స్తంభం చూచి ఆశ్చర్యపొయ్యాను. ఆ స్తంభం దగ్గర ఒక 20 నిమిషాలు గడిపి, మ్రొక్కి కిందకు దిగి వచ్చేశాము.

కాలినడకన అగ్నిపర్వతం పైకి…!

అక్కడి నుండి మేము ఫ్యూజీ అగ్నిపర్వతం (Fuji mountain) వెళ్లాలని అనుకున్నాము. ఎవరిని అడిగినా బస్సులు తప్ప ట్రైన్ లేవు అని అన్నారు. కాని మాకు ట్రైన్ పాస్ వుంది కాబట్టి, ఎలా అయినా ట్రైన్‌లో వెళ్ళాలని అనుకున్నాము. చాలామందిని అడిగితే ఒక్కరు మాత్రం మీరు ట్రైన్లో కూడా వెళ్ళవచ్చు, అయితే చాలా స్టాప్స్ దిగి మళ్ళీ ట్రైన్ ఎక్కాల్సి వుంటుంది అని ఒక సలహా ఇచ్చాడు. పర్వాలేదులే అనుకొని అతనినే ఎక్కడెక్కడ ట్రైన్స్ మారాలో కనుక్కొని, ప్యూజీ పర్వతం (Fuji mountain) ఫొటో ఒకటి తీసుకొని ట్రైన్ ఎక్కాము. ఆ ట్రైన్ నుండి మరో ట్రైన్, మరో ట్రైన్ మారుతూ చివరికి ఫ్యూజీ పర్వతానికి దగ్గర్లో వున్న స్టేషన్లో దిగి అక్కడ మళ్లీ ఒక బస్ ఎక్కి ఫ్యూజీ అగ్నిపర్వతం దగ్గరకు చేరుకున్నాం..!

ఈ ఫ్యూజీ అగ్నిపర్వతం జపాన్ దేశంలోనే అత్యంత ఎత్తైన పర్వత ప్రదేశం. టోక్యోకి నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీని శిఖరం 3776 మీటర్ల (12,389 అడుగులు) ఎత్తు ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు ఇది ఎంత ఎత్తైనదో. ఇది జపాన్ రాజధాని నగరమైన ప్రకృతి అందాల్లో ప్రత్యేకత కలిగిన ఈ పర్వతం జపాన్ దేశపు ప్రాచీన స్థలాల్లో ఒకటిగా భావిస్తారు. 2013లో యునెస్కో వారు దీన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటిగా గుర్తించారు. ఈ ఫ్యూజీ పర్వతం కొన్ని శతాబ్దాలుగా కళాకారులకు, కవులకు స్ఫూర్తి కలిగిస్తూందనీ, అనేక మంది యాత్రికులను ఆకట్టుకుంటోందని ప్రశంసించారు కూడా. ఇది టోక్యో నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తుంది.

ఆ పర్వతం పైకి మేము కాలినడకన ఎక్కాము. 377 మీటర్లు అంటే 12389 అడుగుల ఎత్తుకి వెళ్ళాము. చాలా చలిగా వుంది, కాని అక్కడ నుండి చూస్తే అన్నీ పూలతో పచ్చికతో, లోయలతో, మబ్బులతో ఎంతో అందంగా వుంది. అయితే సంవత్సరంలో చాలా నెలలపాటు మంచుతో కప్పబడి స్పష్టంగా కనిపించనప్పటికీ దీన్ని నిత్యం అనేక మంది యాత్రికులు, పర్వతారోహకులు సందర్శిస్తుంటారట. అయితే అప్పుడప్పుడు బద్దలవుతుంది కూడా అని తెలిసింది. 1707-08 సంవత్సరాల మధ్యలో ఒకసారి ఇలా బద్దలవ్వడంతో వేలాది మంది మృత్యువాత పడ్డారని తెలిసింది.

ఆ పర్వతాన్ని చూసి అక్కడి నుంచి కిందకు దిగి వచ్చాము. రాగానే దగ్గర్లో వున్న ఒక గ్రామానికి బస్‌లో వెళ్ళాము. ఆ గ్రామానికి వెళ్ళేటప్పుడు ఒక హంస పడవ అక్కడున్న లేక్‌లో కనిపించింది. అది ఎక్కుదామని కుతూహలంతో అక్కడే ఆగిపోదామని ఎన్ని హోటల్స్ వెతికినా రూమ్ దొరకలేదు. రాత్రి 10 గంటలకి బస్ తీసుకోని హిరోషిమాకి వెళ్ళాము.

హిరోషిమాలో…

1945లో రెండవ ప్రపంచ యుద్ధం చివరి దశకు చేరుకున్న సమయంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాగి అనే రెండు నగరాలపై అమెరికా అణుబాంబు దాడులకు పాల్పడింది. ఆగస్టు 6న బాంబు ప్రయోగించిన  కొన్ని క్షణాలకే హిరోషిమా నగరం మొత్తం నేలమట్టమైంది. మూడు రోజుల తర్వాత ఆగస్టు 9న నాగసాకి నగరంపై కూడా అణుబాంబును ప్రయోగించి విధ్వంసం సృష్టించింది. ఈ అణుబాంబు దాటికి క్షణాల్లో కొన్ని వేల భవంతులు (అధికారిక లెక్కలు 76 వేలు) నేలకూలాయి. లక్షల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. బతికిన వాళ్లూ అణుబాంబు విస్పోటనం కారణంగా రోగాల బారినపడ్డారు.

హిరోషిమాలో అణుబాంబు సృష్టించిన మానవ విధ్వంసం గురించి కథలు కథలుగా విన్నాం. దీని మీద చాలా సినిమాలు కూడా వచ్చాయి. అలాంటి ప్లేస్‌ను చూడటానికి వెళుతున్నామంటే కాస్త ఉద్వేగానికి లోనయ్యాము. హిరోషిమా శాంతి మ్యూజియంలో దాడికి ముందు నగరం ఎలా ఉందో తెలిపే ఫొటోలు, వీడియోలూ ప్రదర్శనకు ఉంచారు. ప్రాణాలు కోల్పోయిన వారి దుస్తులూ వస్తువులూ అక్కడ భద్రపరిచారు. వాళ్ల ఛిద్రమైన దుస్తులూ రూపం మారిన వస్తువులూ చూస్తే కళ్లలో నీళ్లు తిరిగి ఏడ్పు వచ్చింది. నగరంలో ఆర్చి ఆకారంలో ఓ నిర్మాణం కనిపిస్తుంది. చనిపోయిన వారి గుర్తుగా కట్టిన దీన్ని సెనోటాఫ్ అంటారు. మేం కూడా అక్కడ నిలబడి వాళ్ల ఆత్మకు శాంతి కలగాలని కాసేపు ప్రార్థించాం.

       

ఒకనాడు గడ్డిపోచ కూడా మొలవని హిరోషిమా నగరం ప్రస్తుతం 12 లక్షల జనాభాతో, పెద్ద భవనాలతో జపాన్‌లోనే అత్యంత ప్రత్యేక నగరంగా గుర్తింపు పొంది అభివృద్ధిలో దూసుకుపోతోంది. మేము హిరోషిమా యుద్ద భూమి అంతా చూసిన తర్వాత, ఆ మెమోరియల్ అంతా చూశాక ఆ రోజు సాయంత్రానికి క్యోటోకి తిరిగి వచ్చాము.

టోక్యోలో షో చూస్తూ…

జపాన్ శాస్త్ర, సాంకేతిక రంగంలో ఎంత ముందుడుగులో ఉన్నప్పటికీ తమకు వారసత్వంగా వచ్చిన సంప్రదాయాలను, కళలను కాపాడుకోవడంతో అంతే శ్రద్ధ పెడుతుంది. మేము టోక్యోకు తిరిగి వచ్చాక అక్కడికి దగ్గరలో ఒక షో జరుగుతుందంటే చూడటానికి వెళ్లాము. థియేటర్ అంతా ఫుల్‌గా ఉంది. అయిదే మా అదృష్టం కొద్ది ఎవరో ఇద్దరు వెళ్లకపోవడంతో ఆ టికెట్స్ ను తీసుకొని ఆ షోకి వెళ్లాము.

ఆ షోలో జపాన్ పిల్లలు ఎంత అందంగా ఉన్నారంటే, నేను ముందు వాళ్లను చూసి బొమ్మలు అనుకున్నాను. అసలు బొమ్మలను ఎలా తయారు చేస్తారో అలాగే ఉన్నాయి వాళ్ల ఫేసులు, వాళ్ల మేకప్ అంతా చూసి చాలా ఆశ్చర్యపోయాను. వాళ్లు చక్కటి నాటకం చేశారు. ఆ నాటకం అంత చూసిన తర్వాత నేను ఆ నాటకంలో ఉన్న ఒక నాటక కర్త ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని ఫాలో అయ్యాను. ఆ అమ్మాయితో మాట్లాడాను. ఆ అమ్మాయి కళ్లు కదిపితే ఒహో ఈమె బొమ్మ కాదు, అమ్మాయి అనుకున్నాను. అంత ఆశ్చర్యంగా కనిపించింది. మనకు గోడల మీద జపాన్ బొమ్మలు ఎలా కనిపిస్తాయో అచ్చం అలాగా తయారయ్యారు. ఆ షో కూడా చాలా బాగుంది. అదంతా చూసి మేము రాత్రి 11 గంటలకు రిటన్ వచ్చాము.

టోక్యో టవర్…

నెక్స్ట్ డే ఉదయమే మేము టోక్యోలో ఉన్న ఎతైన టవర్ను చూడటానికి వెళ్లాము. ఈఫిల్ టవర్‌లానే ఇక్కడో ఎత్తయిన టవర్ ఇది. దీని ఎత్తు ఏకంగా 1,092 అడుగులు. ఇదో కమ్యూనికేషన్, అబ్జర్వేషన్ టవర్. ఎక్కడెక్కడి నుంచో సందర్శకులు వస్తుంటారు. 1958లో ఈఫిల్ టవర్ నిర్మాణాన్ని ఆదర్శంగా తీసుకుని కట్టారట. అయిదు సంవత్సరాలకోసారి రంగులతో ముస్తాబు చేస్తుంటారు. అందుకు 7500 గ్యాలన్ల పెయింట్ వాడతారట. ఇలా పెయింట్ వేయడానికి ఒక ఏడాది సమయం పడుతుందట. అయినా అక్కడి అధికారులు దీన్ని కొనసాగిస్తునే ఉన్నారు.

    

 

దాన్ని చూసిన తర్వాత మేము ఒక రెస్టారెంట్‌కు వెళ్లాము. ఆ రెస్టారెంట్లో ఏముందా అని మెనులో చూస్తే బ్యాంబు పకోడ ఉంది. సో బ్యాంబు పకోడ తిందామని ఆర్డర్ ఇచ్చాము. మన ఇళ్లల్లో పెరిగే వెదురు కట్టెల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, ఆ ముక్కల్ని మన మిరపకాయ బజ్జీలులాగా సెనగపిండిలో ముంచి ఎలాగైతే వేయిస్తామో ఆ వెదురు ముక్కల్ని ఉడికించి దాంతో ఈ పకోడీలను తయారు చేశారు. నాకైతే చాలా నచ్చేసింది. నేను అనుకుంటాను జపాన్ అంతా తిరిగిన తర్వాత తిన్నది ఈ బ్యాంబు పకోడ మాత్రమే అని. మిగతా చోట్ల నేను తినలేకపోయాను. ఎందుకంటే అక్కడి ఫుడ్ జల్లీ జల్లీగా, అందులో ఏం ఏస్తారో, తేలు, పాములు అన్ని ఉన్నాయి. సో భయం వేసి వేటిని ముట్టుకోలేదు. ఈ ఒక్క డిష్ మాత్రం చాలా నచ్చింది.

జపాన్ దేశ పర్యటన ఎన్నో కొత్త విషయాలను నేర్పిందనే చెప్పవచ్చు. నిత్యం భూకంపాలతో ఆ దేశాన్ని వణికిస్తున్నా, వరుస సునామీలు వారిని ముంచెత్తుతున్న ప్రపంచం కనివిని ఎరుగని విషాధాన్ని చవిచూసినా ఏనాడు, ఎవ్వరి సాయం అడగని జపాన్ వారి అంకిత భావం, కష్టించే మనస్తత్వం వారి పట్టుదల ప్రతి ఒక్కరికి ఆదర్శమనే చెప్పవచ్చు. ఆ పట్టుదలే వారిని ప్రపంచంలో ముందు వరుసలో నిలిచేలా చేసింది.

Exit mobile version