సుతుడవై… తల్లివై

8
2

[dropcap]బి.[/dropcap]కాం డిగ్రీ రెండవ సంవత్సరం తెలుగు క్లాసు.

రామకృష్ణ మాష్టారు పింగళికాటూరి కవుల సౌందరనందం కావ్యంలోని పాఠ్యాంశాన్ని హృద్యంగా చెపుతున్నారు. విద్యార్థులంతా కదలకుండా మంత్రముగ్ధుల్లా వింటున్నారు. సహజంగా, తెలుగుక్లాసులో అల్లరి చేస్తారంటారు కాని, రామకృష్ణగారి క్లాసు అందుకు విరుద్ధం.

తన దగ్గర ధర్మదీక్ష పొందిన నందుడు, భార్యపై వ్యామోహాన్ని వదల లేకపోవటం గ్రహిస్తాడు బుద్ధుడు. అతని వ్యక్తిగత ప్రేమను విశ్వమానవాళిపై ప్రసరింపజేయగలిగితే బౌద్ధరామాలు ఎంత వికసిస్తాయో అనుకుంటాడు. కారణ సహితమైన తన భార్య, తన పిల్లలు అనే మమకారం కన్న మమతారహితమైన విశ్వమానవ ప్రేమ గొప్పదని చెపుతాడు. సుతులు లేని వారికి సుతుడవై, మాతృహీనులకు తల్లివై, అనాధలకు, దీనులకు ఆప్తుడవై సేవ చేయమని బోధించాడని, బుద్ధుని బోధతో నందుడు పరివర్తన చెందాడని రామకృష్ణ మాష్టారు ఒక్కొక్క పద్యాన్ని చదువుతూ, భావాన్ని వివరిస్తూ, విద్యార్థులను ప్రత్యేక వాతావరణంలోకి తీసుకుని వెళ్ళిపోయారు. మాష్టారు ప్రతిపాఠం నుంచి ఒక నీతిని, సందేశాన్ని గ్రహించి యువత ఆచరించాలని చెపుతుంటారు. “సౌందరనందం పాఠం ద్వారా యువత స్వార్థం కొంచెం పక్కన పెట్టి, నా అనేవారు లేని అనాథలకు, సంతానానికి దూరంగా ఉండే వృద్ధులకు చేతనైన సాయం చేయటం అలవరచుకోవాలి. తన కుటుంబం అనే చట్రంనుంచి బైటపడి ఇతరులకు సహాయపడినప్పుడు కలిగే తృప్తి, ఆనందం అనుభవిస్తేనే తెలుస్తుంది. మీరంతా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తులుగా మనుగడ సాగిస్తారని, ఆరోగ్యకర సమాజ నిర్మాణానికి సారధులవుతారని అనుకుంటున్నాను. తెలుగు పాఠాల నుంచి నేర్చుకోవలసిన విలువలివే” అంటూ నవ్వుతూ ముగించారు. అంతలో గంటమోగింది.

***

మేడమెట్లు దిగి కింది ఇంటి వాళ్ళింట్లోకి అడుగుపెట్టిన జయసూర్య ఇంటియజమాని రుక్మిణిని పిలవబోయి అక్కడే ఆగిపోయాడు.

“ఏం తప్పు చేశాం దేవుడా! ఈ వయసులో ఇలాంటి శిక్ష వేశావేమిటి? ఇంటిపనులు చేసుకోలేకపోతున్నాను. ఆసుపత్రుల చుట్టూ తిరగలేకపోతున్నాము. ఒంట్లో ఓపిక లేదు. చేసుకోక తప్పట్లేదు. ఉన్న ఒక్కగానొక్క కొడుకు మీదే ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న మాపై వాడి మనసులో కొంచెం ప్రేమ కలుగజేయవా స్వామీ!” అని దేవుడి మందిరం ముందు కూర్చుని ఏడుస్తూ మాట్లాడుతున్న రుక్మిణి గొంతులో ఆర్తి, వేదన జయసూర్యను గుమ్మంలోనే ఆపేసింది.

రుక్మిణిని చూస్తుంటే నిన్నటి తెలుగు క్లాసులో రామకృష్ణ మాష్టారు చెప్పిన సంతానానికి దూరంగా వున్న వృద్ధులకు చేతనైన సాయం చేయాలన్న మాటలే సూర్య హృదయంలో ప్రతిధ్వనిస్తున్నాయి.

“సూర్యబాబూ! ఎంతసేపయింది వచ్చి? అక్కడే నిలబడిపోయావేం?” అంది రుక్మిణి ఆవిడ కళ్ళు రాత్రంతా నిద్రలేనట్లు ఎర్రబడి వున్నాయి.

“ఆంటీ! నీళ్ళు రావట్లేదు. మోటర్ వేస్తారేమోనని…”

“అయ్యో! మర్చిపోయాను. వేస్తా బాబూ! కాలేజీకి టైమ్ అవుతున్నట్లున్నది నీకు” అంటూ లోపలికి వెళ్ళబోయింది.

“ఆంటీ!”

“ఏం బాబూ?”

“అలా వున్నారేమిటి? అంకుల్‍కి ఒంట్లో బాగోలేదా? లేకపోతే మీకే బాగోలేదా?”

“ఈ వయసులో ఈ దిగుళ్ళతో ఆరోగ్యాలు ఏం బాగుంటాయి బాబూ! రాత్రంతా ఆయనకు నిద్రలేదు. కాళ్ళు, చేతులు లాగేస్తున్నాయన్నారు. ఒళ్ళు వేడెక్కింది. నూనె రాస్తూ, ఆయన్ని చూస్తూ నేనూ నిద్రపోలేదు. తెల్లవారుతుండగా పడుకున్నారు. ఇంకా లేవలేదు. నేనూ లేచేటప్పటికి ఆలస్యమయింది. మోటర్ వేయటం కూడా మర్చిపోయాను” అంది రుక్మిణి.

“ఆంటీ! అంకుల్‍ని హాస్పిటల్‍కి తీసుకువెళ్ళాలా? నేను తీసుకువెళ్ళనా?” అన్నాడు సూర్య.

“నీకు మాత్రం ఖాళీ ఎక్కడున్నది నాన్నా! మధ్యాహ్నం రెండింటికి కాలేజినుంచి వస్తావు. మళ్ళీ ఏవేవో కోర్సులంటూ, క్లాసులంటూ వెళతావు. తీరిక ఎక్కడుందీ? ఈ తిప్పలు మాకు తప్పవులే” అంది రుక్మిణి.

“అలా అనకండి ఆంటీ! నేను తీసుకెళతాను అవసరమైతే, కాలేజీ నుంచి వచ్చాక  కలుస్తాను” అంటూ పైన తన గదికి వచ్చేశాడు.

జయసూర్య తండ్రి బ్యాంకు ఆఫీసరు. సూర్య డిగ్రీ రెండవ సంవత్సరం మొదట్లోనే ఆయనకు వేరే ఊరు ట్రాన్స్‌ఫర్ అయితే వెళ్ళిపోవలసి వచ్చింది. కాలేజీకి హాస్టలున్నా సూర్య గది తీసుకుని ఉండటానికే ఇష్టపడటంతో తల్లీ తండ్రి కాదనలేక, తెలిసిన వాళ్ళ ద్వార రుక్మిణి వాళ్ళ మేడమీద గది ఇస్తారని తెలుసుకుని, అందులో ఏర్పాటు చేసి వెళ్ళిపోయారు. సూర్య ఈ గదిలోకి వచ్చి నెలపైనే అవుతుంది.

సూర్యకు అన్న, అక్క ఉన్నారు. ఇద్దరికీ పెళ్ళిళ్ళయి, వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారు. సూర్యది అక్క, అన్నల కంటే భిన్నమైన మనస్తత్వం. సున్నితమైన హృదయం. ఎవరికీ అవసరమొచ్చినా ముందుంటాడు. లెక్చర్లంటే భక్తి భావం! చిత్రకారుడు. బొమ్మలు అద్బుతంగా గీస్తాడు. స్నేహశీలి. స్నేహబృందమూ ఎక్కువే. మంచి విధ్యార్థిగా, చురుకైన విద్యార్థిగా కాలేజిలో పేరుంది. తనకిష్టమైనట్లు బొమ్మలు గీసుకోవటానికి వీలుగా ఉంటుందని గది తీసుకుని వుంటున్నాడు. అక్క, అన్న బి.టెక్ చదవమని పోరు పెట్టినా ఇష్టపడి బి.కాంలో చేరాడు. అతని మనస్తత్వం తెలిసిన తల్లి, తండ్రి అభ్యంతర పెట్టలేదు.

ఇంకా రుక్మిణి ఇంటి పరిస్థితి సూర్యకు బాగా తెలియదు. కొడుకు, కోడలు ఢిల్లీలో మంచి ఉద్యోగాలలో ఉన్నారని తెలుసు. కాలేజీలో ఉన్నా రుక్మిణి మాటలే గుర్తుకు వస్తున్నాయి. వాళ్ళబ్బాయి పట్టించుకోడా?

సూర్య కాలేజీ ఒక్కపూటే. ఒంటిగంటకు అయిపోతుంది. ఒక్కోసారి వీధిచివర ఉన్న మెస్‍లో తిని వస్తాడు. ఒక్కోసారి బైట నుంచి కూరలు, సాంబార్ తెచ్చుకుని గదిలో రైస్ కుక్కర్‍లో అన్నం వండుకుంటాడు. ఎలా చేయాలనిపిస్తే అలా! మధ్యాహ్నం మూడింటికి కంప్యూటర్ క్లాసులకు వెళ్ళి అట్నుంచటే సాయంత్రం ఆ ఊళ్ళో ఓ అనాథాశ్రమంలో పిల్లలకు పాఠాలు చెప్పి రాత్రి ఎనిమిదింటికి గదికి చేరుకుంటాడు. ఇది అతని దినచర్య. స్నేహితులు ఎంతోమంది ఉన్నా సూర్యకు రాజేష్ ఒక్కడే ప్రాణమిత్రుడు. ఇద్దరూ కలిసి చదువుకుంటారు. కలిసి మధ్యాహ్నం క్లాసులకు వెళతారు. కలిసి అనాథాశ్రమంలో పాఠాలు చెబుతారు. రాజేష్ తన ఇంటి నుంచే కాలేజీకి వెళతాడు.

ఆ సాయంత్రం ఐదింటికి సూర్య కింద ఉన్న రుక్మిణిగారింట్లోకి వెళ్ళాడు. ఇద్దరూ కూర్చుని టీ తాగుతున్నారు.

“రా నాయనా! టీ తాగుతావా?” అంది రుక్మిణి.

“అలవాటు లేదాంటి, మీరు తాగండి” ఆంటూ సూర్య అక్కడ ఉన్న కుర్చీలో కూర్చున్నాడు.

కొంచెం పాత ఇల్లది. వరుసగా మూడు గదులు. ముందుగదిలో నాలుగు కుర్చీలు వేసున్నాయి. మధ్యగదిలో రెండు మంచాలు, పక్కనే చిన్న డైనింగ్ టేబుల్, రెండు కుర్చీలు ఉన్నాయి. తరువాత వంటిల్లు, అందులోనే దేవుడి మందిరం. వీధి గుమ్మంలో నిల్చుంటే వంటింటి దాకా ఇల్లు కనిపిస్తుంది. కొడుకు, కోడలు ఎప్పుడైనా వస్తే ఉంటుందని, కొడుకు పెళ్ళయ్యాక పైన గది వేయించారు. వాళ్ళు రావటం లేదని ఈ మధ్యే సూర్యకి అద్దెకిచ్చారు. తక్కువ స్థలంలో పొందిగ్గా కట్టించుకున్న ఇల్లది. ముందున్న కాస్త ఖాళీ జాగాలో పూలమొక్కలు, ఆకుకూరలు వేశారు. ఆ ఇంట్లోకి వెళుతుంటే ఓ ప్రశాంతమైన ఆశ్రమంలోకి వెళుతున్న భావన కలుగుతుంది ఎవరికైనా!

“ఆంటీ! అంకుల్‍కి ఎలా ఉందిప్పుడు?”

“బాగనే ఉంది. పొద్దున్న కొంచెం ఒళ్ళు వేడిగానే ఉంది కాని ఇప్పుడేం లేదు”

“మీకు మందులేమైనా తేవాలన్నా, బజారు నుంచి ఏమైనా కావాలన్నా చెప్పండి ఆంటీ మొహమాటపడకండి”

“చేసుకోలేనప్పుడు తప్పకుండా అడుగుతాంలే బాబూ”

రోజూ రుక్మిణినే పాలప్యాకెట్లు తెచ్చుకుంటుంది. కొట్లో సరుకులు కూడా తెచ్చుకుంటుంది. సత్యనారాయణ గారు ఈ మధ్య ఇంటికే పరిమితమైపోయారు. ఇంట్లోనే నడుస్తూ ఉంటారు. ఆయనకు బి.పి, షుగర్ ఉన్నాయి. ఆయన వయసు అరవై అయిదు. రుక్మిణి వయసు అరవై.

మనోవ్యాధికి మందులేదు. దిగులు, ఒంటరితనం ఇద్దరినీ కృంగదీస్తుంది. ఇద్దరు పిల్లలు పోయాక, ఎన్నోనోములు, వ్రతాలు, తీర్థయాత్రలు చేసి, ఎన్నో ఆశలతో కన్నకొడుకు. శేషజీవితం అతని దగ్గరే వెళ్ళిపోతుందనుకుంటే ఇటుపక్క చూడట్లేదు ఆ కొడుకు.

సత్యనారాయణగారు బట్టల కొట్టులో లెక్కలు రాసేవారు. కొడుకు బాగా చదివి పెద్ద ఉద్యోగం చేయాలని స్తోమత లేకపోయినా, కష్టపడి చదివించారు. మంచి ప్రభుత్వ సంస్థలో ఆఫీసరుగా ఉద్యోగం వచ్చింది. పెళ్ళి తన ఇష్టప్రకారమే కాదనలేదు. ఇద్దరు మనవలు స్కూల్లో చదువుతున్నారు. మనవలతో కలిసి ఉండాలని వీళ్ళ కోరిక. మర్యాదకైనా ఓ వారంరోజులు అట్టి పెట్టుకుంటానని కొడుకు అనడు.

వృద్ధాప్యంలో ఒంటరితనం పెద్ద శాపం. చిన్నప్పుడు తమ చేయి పట్టుకుని నడిపించిన ఆ చేతులను వదలకుండా, పెద్దయ్యాక వారికి ఆసరాగా ఉండి నడిపిస్తుంటే వృద్ధాప్యంలో అనారోగ్యాల తాకిడి అంత ఉండదు. సొంత యింటికి వదిలిపెట్టి ఎక్కడికీ వెళ్ళమని బిగుసుకు కూర్చునే వాళ్ళ సంగతి సరే! తాము వాడు ఎక్కడుంటే అక్కడే ఉందామని ఆశపడుతున్నారు కదా, ఒక్కసారైనా రమ్మని అనడని రుక్మిణి దంపతుల నిరంతర వేదన!

సూర్య రోజూ వాళ్ళని కాలేజికి వెళ్ళేటప్పుడు ఒకసారి, రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి పలకరించి వెళుతున్నాడు. ఖాళీగా ఉన్నప్పుడు కాసేపు కూర్చుని కబుర్లు చెప్పి నవ్వించి వెళతాడు. వాళ్ళకీ ఇది కొంచెం ఉత్సాహంగానే ఉంది.

ఆ రోజు సూర్య మధ్యాహ్నం కాలేజినుంచి ఇంటికి వచ్చినప్పుడు రుక్మిణి వాకిట్లోనే నిల్చుని వుంది.

“ఆంటీ! పడుకోలేదా?” పలకరించాడు సూర్య.

“లేదు బాబూ! నీ కోసమే చూస్తున్నా. చిన్నపని”

“చెప్పండి”

“ఇవాళ అబ్బాయి, కోడలు పక్కఊళ్ళో పెళ్ళిచూసుకుని నాలుగ్గంటలకి వస్తారుట. ఓ పావుకేజి స్వీటు, హాటు తెచ్చిపెడతావని. సెంటర్‍లో గాని మంచిషాపులు లేవు. వస్తూనే పెడితే తింటారు కాస్త”

“అలాగే ఆంటీ” అని వెళ్ళబోతుంటే “”అహ తొందరేంలేదు. నాలుగ్గంటలకి కదా వచ్చేది! నువ్వు భోజనం చేసి విశ్రాంతి తీసుకున్నాక వెళ్ళు”

“సరే ఆంటీ! భోజనం చేసి తెస్తాను” వెళ్ళిపోయాడు.

భోజనం చేసి వచ్చి “ఆంటీ! ఏం తెమ్మంటారు?” అన్నాడు సూర్య.

“మా వాడికి కోవా స్వీటు ఏదైన ఇష్టమే” అంది రుక్మిణి.

“సరే ఆంటీ. ఉంటారా ఇవాళ?”

“ఈ రాత్రికి ఉండి రేపు పెళ్లి వారింటికి వెళ్లి అక్కడ నుండి ఢిల్లీ వెళ్ళిపోతారుట. కోడలు వాళ్ళి పిన్నివాళ్ళేలే!”

బైక్ మీద వెళ్ళీ స్వీటు హాటూ తెచ్చి ఇచ్చేసి “ఆంటీ! నేను రాజేష్ వాళ్ళింటికి వెళతాను. వాళ్ళను పైన పడుకోమనండి. రేపొద్దున వస్తాను” అంటూ తాళంచెవి రుక్మిణీ చేతిలో పెట్టాడు.

“అయ్యో! వద్దు నాన్నా! ఇక్కడే ఉంటారు” అంది కంగారుగా.

“ఫరవాలేదు” అంటూ వెళ్ళిపోయాడు.

’ఎంత మంచి పిల్లాడు’ అనుకుంటూ ‘పోన్లే పెళ్ళిలో అలసిపోయి వస్తారు. పైన కాస్త ప్రశాంతంగా పడుకుంటారు’ అని తృప్తిపడింది రుక్మిణి.

ఆ రాత్రి పదకొండుగంటలకి రాజేష్‍తో కబుర్లు చెపుతున్న రుక్మిణి ఫోన్!

“నాన్నా! ఇంటికి వస్తావా?” ఆమె గొంతులో అంతులేని వ్యధ.

‘ఏదో జరిగింది’ అనుకుంటూ “వస్తున్నా ఆంటీ!” అని రాజేష్‍తో చెప్పి బయలుదేరిపోయాడు సూర్య.

గేటు తీసుకుని లోపలికి వచ్చి “ఆంటీ!” అని పిలిచాడు గుమ్మంలోనుంచే. తాళం చెవి ఇచ్చింది రుక్మిణి.

“రాలేదా ఆంటీ?”

“దీని పిచ్చిగాని వాళ్ళెందుకు వస్తారు? వస్తే ఈ ముసలాళ్ళు ఎక్కడ వెంటపడతారోనని వాళ్ళ భయం. వీడు లేకుండా ఇన్నాళ్ళూ బతకలేదా, ఇప్పుడు బతకలేమా?” సత్యనారాయణగారికి ఆవేశంలో దగ్గు, ఆయాసం వచ్చేసింది.

“మీరు అరవకండి అనవసరంగా” అంటూ మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది.

సూర్య కూడా “అంకుల్! ముందు మీరు కూర్చోండి. ఆవేశపడకండి. వాళ్ళకి కుదరలేదేమో వదిలేయండి” అంటూ చేయిపట్టుకుని కుర్చీలో కూర్చోపెట్టాడు. మంచినీళ్ళు తాగాక కొంచెం స్థిమితపడ్డారు సత్యనారాయణ గారు.

సూర్యతో పాటు బయటికి వచ్చింది రుక్మిణి.

“ఏమైందాంటీ?”

“ఏమో నాయనా! నువ్వు వెళ్ళాక ఫోన్ చేస్తే ఆరవుతుంది రావటానికి అన్నాడు. ఆరయినా… ఏడైనా… ఏనిమిదయినా జాడలేదు. నేనూ ఫోన్ చేయలేదు. పదింటికి ఇక్కడే సరిపోయిందమ్మా! రాలేకపోయాం. రేపు వ్రతం తప్పకుండా ఉండమంటున్నారు. ఈసారి అక్కడికే వస్తాంలే రేపు వెళ్ళిపోవాలి” అన్నాడు.

“వాడికి ఇక్కడికి రావలసిన అవసరం ఏముందిలే! మా దగ్గరా ఆస్తులేమున్నాయి? ఈ పాత ఇల్లు వాడికో లెక్కా! వాడికి ఈ నగరంలో రెండు సొంత ఇళ్ళున్నాయి. కన్నకొడుకు ఇంత దారుణంగా ఉంటాడని ఎక్కడా వినలేదు” అంటూ కళ్ళు తుడుచుకుంది.

“ఊరుకోండి ఆంటీ! అంకుల్‍కి చెప్పి మీరే అలా బాధపడతారేమిటి? వదిలేయండి. ఏం ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోండి ఇద్దరూ” అని చెప్పేసి సూర్య గదికి వచ్చేశాడు.

ఎందుకిలా చేశాడు వాళ్ళబ్బాయి? ఇంత దగ్గరకు వచ్చి కూడా రాకుండా? ఎంత బాధపడుతున్నారు వాళ్ళు? అమ్మో! అమ్మా, నాన్నలకు ఇటువంటి స్థితి నావల్ల ఎప్పుడూ రాకూడదు” ఇలా ఆలోచిస్తూ… ఆలోచిస్తూ నిద్రలోకి జారిపోయాడు సూర్య.

రాత్రి ఒంటిగంటకు రుక్మిణి నుంచి ఫోన్ “ఒక్కసారి కిందకు రా నాన్నా!” అంది.

వెంటనే దిగి వచ్చేశాడు. సత్యనారాయణ గారు ఆయాసంతో రొప్పుతున్నారు. రుక్మిణి ఏడుస్తుంది. సూర్య కంగారుపడవద్దని చెప్పి ఆటో తెచ్చి, రాజేష్‍ని ఫలానా హాస్పిటల్‍కి రమ్మని ఫోన్‍చేసి, ఇద్దరినీ ఆటోలో తీసుకువెళ్ళాడు. సత్యనారాయణ గారిని హాస్పిటల్‍లో జాయిన్ చేసుకుని, టెస్టులన్నీ చేసి, ఎక్కువగా ఆలోచించకూడదని, ప్రశాంతంగా ఉండాలని చెప్పి డాక్టర్ మందుకు రాసి, మర్నాడు సాయంత్రం పంపించారు. సూర్య కాలేజి మానేసి రుక్మిణికి సాయంగా ఉండిపోయాడు. అన్నీ తానే అయి చూసుకున్నాడు. ఇంటికొచ్చాక కూడా నాలుగురోజుల పాటు రాత్రిళ్ళు వాళ్ళ ముందుగదిలోనే పడుకున్నాడు. రుక్మిణికి ఎంతో ధైర్యం అనిపించింది.

‘ఇలా తోడునీడగా ఉంటాడని కదా అనుకున్నాం. పెళ్ళయ్యాక మారాడని అనుకోవటానికీ లేదు. పెళ్ళికి ముందూ, చదువుకునేటప్పుడూ అంతే! అమ్మా నాన్నల పట్ల బాధ్యత, ప్రేమ లేకుండా వాడి చదువు, స్నేహాలు ఎప్పుడూ, వాడి అదృష్టం మంచి ఉద్యోగం వచ్చింది. వెళ్ళిపోయాడు. పెంపకంలో లోపమా అంటే బాగానే పెంచాం. కష్టం సుఖం చెపుతూనే వచ్చాం. ఏమిటో మా రాత ఇలా ఉంటే ఇంకోలా ఎలా జరుగుతుంది’ అనుకుంటూ నిట్టూర్చింది రుక్మిణి.

ఆ రాత్రి సూర్య పైకి తన గదికి వెళుతూ “ఆంటీ! రేపొద్దున్న అమ్మ వస్తోంది” అన్నాడు సంతోషంగా.

“అలాగా నాన్నా! నిన్ను చూడాలనా?”

“అవునాంటీ! ఆశ్రమంలో పిల్లలకు పరీక్షలు దగ్గరకొస్తున్నాయి. చదివించాలి. నేను వెళ్ళట్లేదని అమ్మే వస్తోంది”

“మంచిది నాయనా!”

పొద్దునే స్టేషన్‍కి వెళ్ళిన సూర్య వాళ్ళమ్మ స్వర్ణను తీసుకొచ్చాడు. గేటు తీస్తుండగానే రుక్మిణి కనిపిస్తే “బాగున్నారా అక్కయ్యగారూ!” అంటూ వరుస కలుపుతూ పలుకరించింది స్వర్ణ.

“బాగున్నానమ్మా. ఒక్కరే వచ్చారా?” అంది రుక్మిణి.

“అవునండీ! వీడికి రావటానికి కుదరట్లేదని చూసి వెళదామని నేనే వచ్చాను” అంది స్వర్ణ.

“కాఫీ పంపుతాను”

“వద్దు… వద్దు… మీరేం శ్రమపడవద్దు. స్టవ్ ఉందిగా. పాలుకూడా తీసుకున్నాం” అంది స్వర్ణ పాలపాకెట్ చూపిస్తూ.

“శ్రమేముందు ఇందులో బ్రహ్మచారి గదిలో సరుకులు ఏం ఉంటాయి? టిఫిన్ అయినా చేసిస్తా” అంది రుక్మిణి.

“టిఫినేం తినమండి. స్నానం చేసి అమ్మవారి గుడికి వెళదామని” అంది స్వర్ణ.

“అయితే భోజనానికి వచ్చేయండి ఇద్దరూ” అంది రుక్మిణి.

ఇంక కాదంటే బాగుండదని “సరే” అన్నారిద్దరూ.

తల్లిని గుడినుంచి తీసుకునివచ్చి గేటుముంది దింపి, సూర్య కాలేజీకి వెళ్ళిపోయాడు. స్వర్ణ పైకి వెళ్ళి, కాసేపు పడుకుని, గదంతా సర్ది పదకొండు అవుతుండగా కిందికి వచ్చింది.

రుక్మిణి సాదరంగా ఆహ్వానించింది. సత్యనారాయణగారు కుశల ప్రశ్నలు వేశారు. సూర్యను ఇద్దరూ తెగ మెచ్చుకున్నారు. తమకెంతో సాయంగా ఉన్నాడన్నారు. అలాంటి కొడుకు ఉండటం అదృష్టమన్నారు.

ఆడవాళ్ళు తొందరగా కలసిపోతారు. రుక్మిణి గుండెల్లో గూడుకట్టిన వేదనంతా ఏడుస్తూ వెళ్ళగ్రక్కింది. కొడుకు బాధ్యతారాహిత్యాన్ని ఏ రోజు ఎలా ఉంటుందో, తెలియని తమ ఆరోగ్యాన్ని గురించి కంగారును చెప్పి కొడుకు ఉన్నా లేనివాళ్ళలా బతుకుతున్న దుర్భరస్థితికి కన్నీళ్ళు పెట్టుకుంది. సూర్య వచ్చాక కొంచెం సంతోషంగా ఉన్నామని కూడా చెప్పింది. చదువయిపోతే వెళ్ళిపోతాడుగా అని దిగులు వ్యక్తం చేసింది.

“మీరిద్దరూ ఏం దిగులుపడకండి. వాడు మీ బిడ్డే అనుకోండి. కడూపున పుడీతేనే పిల్లలవుతారా? వాడు చదువయిపోయినా ఇక్కడే ఏదో ఉద్యోగం చూసుకుంటాడు గాని ఈ ఊరు వదలడు. ఈ ఊళ్ళో వాడికున్న బాధ్యతలు అటువంటివి. అనాథాశ్రమంలో పిల్లల బాధ్యత, ఇంకో వృద్ధాశ్రమంలో సేవలు ఇలాంటివెన్నో ఉన్నాయి. ఆయన రిటైర్ అయ్యాక మేం ఇక్కడికి రావలసిందేకాని వాడు రాడు. మా పెద్దబ్బాయి కొంచెం అంటీ ముట్టనట్లు ఉంటాడు కాని మా సూర్యకు ప్రేమాభిమానాలు ఎక్కువ. పెళ్ళయినా వాడు మారడని నా నమ్మకం. వాడు మీకెప్పుడూ తోడుగా ఉంటాడు” అంది స్వర్ణ.

ఆ మాటలు వాళ్ళిద్దరికీ ఎంతో ధైర్యాన్నిచ్చాయి. అంతేకాదు, తమ తదనంతరం ఈ ఇంటిని సూర్య సేవాకార్యక్రామాలకు ఇచ్చేయాలనే ఆలోచనా వాళ్ళ మనసులలో రూపుదిద్దుకుంది.

ఇంతలో సూర్య వచ్చాడు. “ఆంటీ! స్పెషల్స్ ఏంటీ?”అంటూ వాళ్ళమ్మ చెప్పిన పళ్ళు, పూలు, స్వీట్లు అన్నీ తెచ్చి అక్కడ పెట్టాడు. వడ్డనలో సాయం చేశాడు.

ఇల్లంతా నవ్వులతో మారుమోగిపోయింది.

ఆ రాత్రి స్వర్ణ “నానీ! రుక్మిణీ ఆంటీ వాళ్ళు కాస్త ప్రేమకోసం, ఆత్మీయమైన పలకరింపు కోసం అలమటించిపోతున్నారు. నీలో వాళ్ళబ్బాయిని చూసుకుని ఒంటరితనాన్ని మర్చిపోతున్నారు. నీవల్ల వాళ్ళకంత సంతోషం కలుగుతుందంటే జీవితానికి అంతకంటే సార్థకత ఏముంటుంది చెప్పు! నువ్వు ఎక్కడున్నా వాళ్ళని వదలకూడదు నేను వాళ్ళకి అదే చెప్పాను” అంది.

“తప్పకుండా అమ్మా! నేను వాళ్ళని బాగా చూసుకుంటాను. వాళ్ళ బాధ్యత నాది” అన్నాడు సూర్య.

సంతానానికి దూరంగా వృద్ధులకు చేతనైన సాయం చేయాలనే రామకృష్ణ మాష్టారి మాటలు పదేపదే గుర్తుకువస్తున్నాయి. ‘సుతులు లేనివారికి సుతుడవై, మాతృహీనులకు తల్లివై’ ఉండాలనే బుద్ధుడి బోధ సూర్యకి కర్తవ్యాన్ని ఉపదేశిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here