Site icon Sanchika

సువాసిని

[dropcap]రా[/dropcap]ములవారి కోవెలలో నుండి “కౌసల్యా సుప్రజారామా… పూర్వాసంధ్యా ప్రవర్తతే…” అని కాలనీ అంతా ప్రతిధ్వనిస్తోంది. ధ్వజస్తంభాల మీద వాలిన పక్షులు కోరస్ పాడుతున్నాయి… తెలి మంచు కరిగి తొలి భాను కిరణాలతో ప్రకృతి పులకరిస్తుండగా…

నల్లరాతి విగ్రహం నడకలు నేర్చి వస్తున్నట్లుగా, మంచి నీళ్ళ బిందె చంకన పెట్టుకుని, గుడి మెట్లు ఎక్కి అరుంధతి నడిచి వస్తూ కనిపించింది.

గర్భగుడిలో నిర్మాల్యాన్ని తొలగిస్తున్న గణపతిశాస్త్రి “ఇంకా అరుంధతమ్మ రాలేదేవిటా? అనుకున్నాను… ఆ మడి నీళ్ళు అక్కడ పెట్టు… మీ అత్తగారి కెలా వుందీ?” అని అడిగాడు.

ఆమె బిందె కింద పెట్టి, నడుముకి దోపిన కొంగుతో మొహం తుడుచుకుంటూ వుండగా, కుంకుమ మొహం అంతా పరచుకుని, గర్భగుడిలో ఇద్దరు అమ్మవారి మూర్తులున్నట్లు ప్రకాశించింది. కానీ… ఆమె చెయ్యెత్తినప్పుడు ఎర్రని రవికెకి వున్న చిరుగు ఆమె దైన్యాన్ని చెప్పకనే చెప్పింది!

వెలసి మాసికలు పడ్డ ఆకుపచ్చ చీర, శివాలయం ప్రాంగణంలో దుమ్ము పరుచుకున్న నాగమల్లి చెట్టు ఆకుల్లా, శుశ్రూష లేని తులసికోటలా, వెలసిన కపిరాజు జెండాలా, కనిపించింది!

“అత్తయ్య మూసిన కన్ను తెరవడం లేదు! ఆర్.ఎం.పి. డాక్టరు గారు, ఎందుకైనా మంచిది ధర్మాసుపత్రికి తీసుకెళ్ళమన్నారు… పిల్లలకి పరీక్ష ఫీజులు కట్టలేదని బయట ఎండలో నిలబెడ్తున్నారట… అందుకే వరుసగా తద్దినపు వంటలకీ, మూసివాయినాలకీ ఒప్పుకున్నాను… ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి వీలవడం లేదు!” బాధగా అంది అరుంధతి.

గణపతి శాస్త్రి నిట్టూర్చి, “ఇంటికీ మగాడున్నాడన్న మాటే గానీ, మీ బావగారు మతి లేనివాడాయె పాపం… నీ పిల్లల కన్నా చిన్న పిల్లవాడిలా, వేళ్టికి అన్నం పెట్టి, వేళ తప్పి రాకపోతే, వెతుక్కోచ్చుకుని సాకుతున్నావు… నీ బాధలకి విముక్తి ఎప్పుడో? రామయ్య కన్ను తెరిచి చూసేదెన్నడో… ఆ కట్టుకున్నవాడు నిన్ను అన్యాయం చేసి పోకుండా వుండి వుంటే…” అంటుండగానే అరుంధతి అడ్డం పడి “ఆయనేం చేసాడండీ నా ఖర్మకి! ఎక్కడా వుద్యోగం రాక, వచ్చినా నిలవక, ఇంత సంసారాన్ని ఈడవలేక విరక్తి పుట్టి పోయారు… ఇల్లాలిగా నాదే తప్పేమో… ఆపలేకపోయాను… వెళ్ళిపోయేదాకా, వెళ్ళిపోతారని తెలుసుకోలేకపోయాను…” ఆమె కనుకొలకుల్లో ముత్యుపు బిందువుల్లా కన్నీళ్ళు!

గణపతి శాస్త్రి నవ్వి, “రాత్రీ పగలూ పనులు చేసి, పెళ్ళాం పిల్లలకి ఏ కొరతా రాకుండా చూస్తున్న మొగుళ్ళ మీద కూడా వుండదేమో ఇంత అలవి కాని ప్రేమ! అరుంధతమ్మా… నువ్వు నిజంగా అరుంధతివే!… ఆ కొబ్బరి చిప్పలూ, అరటిపండ్లూ పట్టికెళ్ళు… పిల్లలకి ప్రసాదం తీసి వుంచుతాను. వచ్చి పట్టికెళ్ళమను మధ్యాహ్నం” అన్నాడు.

“చూసారా… ఆ మహారాజు నన్ను వదిలేసినా, ఈ మారాజు కడుపు నింపుతున్నాడూ!” ఆమె భక్తిగా సీతారాములకి నమస్కరించింది.

ఆమె మెట్లు దిగి వెళ్తుంటే, అన్నపూర్ణమ్మ పలకరించింది. “మీ ఇంటికే వద్దాం అనుకుంటున్నాను.. భ్రమరాంబ చేట నోము నోస్తోందట… ముత్తయిదువ కావాలంది!” అంది.

“ఎప్పుడూ?” అరుంధతి అడిగింది.

“రేపు మధ్యాహ్నం… భోజనం, సంభావనా, ఓ చీరా, జాకెటు ముక్కా అన్నీ ఘనంగానే ముట్ట జెప్తారులే… ఏ ఖర్చుకైనా వస్తుంది!” అని ఆశ పెట్టింది.

“సరే కానీ… అత్తయ్యని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి…”

“అయ్యో… ఎక్కడి సత్తెకాలపు దానివమ్మా… ఆవిడ ఇప్పుడు లేచి తిరుగుతుందనా నీ ఆశ! ఆ కట్టుకున్న మొగుడు… తన కన్న తల్లినీ, మతి లేని అన్ననీ, ఇద్దరు పిల్లలనీ నీ ఎధాన పడేసి తన దోవ తను చూసుకున్నాడు… నీ కెందుకుమ్మా ఈ బాధ్యత? ఏ శరణాలయానికో పంపక…” అన్నపూర్ణ ఉచిత సలహా పారేసింది.

“నీ తల్లి అయితే అలా చేస్తావా వదినా?” అరంధతికి ఆ మాటలకి చాలా బాధ కలిగింది.

“ఆ పెద్ద దిక్కే లేకపోతే, నేనూ, నా పిల్లలూ ఏమయిపోయేవాళ్ళం? బావగారికి మతి లేదు కానీ, పిల్లలతో బాటు ఆడ్తారు… వాళ్ళు బడి నుండి రావడం అడుగు ఆలశ్యం అయితే వెళ్ళి వెంట పెట్టుకొస్తారు… ఈ ఇంటికో మగదిక్కు… నాకు తోడపుట్టిన వాడితో సమానం… ఆకలేస్తే అన్నం అడగడం కూడా రాని ఆ పెద్దమనిషిని ఏ శరణాలయంలో వదిలిపెట్టనూ?… నాకు పుట్టగతులుంటాయా?” అంది.

“సరిపోయింది… నీ వెర్రి… సరే రేపు భ్రమరాంబ గారింటికి రావడం మర్చిపోకు… పిల్లలకి బడి ఫీజు అయినా అడుగుదువు గాని…” అని ఆశ పెట్టి అన్నపూర్ణమ్మ వెళ్ళిపోయింది.

పన్నెండేళ్ళ భారతికి వూహ వస్తోంది. తల్లి కష్టం అర్థం అవుతోంది. తెల్లవారు ఝామున లేచినప్పటి నుండీ, ఇంట్లో వంట పనీ, నాయినమ్మకి సేవలూ, బయట ఒప్పుకున్న వంట పనులూ, తీరిక దొరికితే విస్తళ్ళు కుట్టడం, వత్తులు చెయ్యడం… రాత్రి పూట కళ్ళు పోయేదాక బట్టలు కుట్టడం, ఇన్ని చేసినా ఇంటద్దె కట్టలేక, తనకీ తమ్ముడికీ బడి ఫీజు కట్టలేకా, నానా మాటలు అనిపించుకోవడం, ప్రతీ రోజు ఐదు కంచాలు రెండు పూటలా నింపడానికి అవస్థ పడడం చూసి ఆ చిన్న మనసు అల్లల్లాడిపోతూ వుంటుంది.

“అమ్మా… నేనీ చదువు చదవనే… నీతో బాటు వంటకొస్తాను” అంటే తల్లికి ఎన్నడూ రానంత కోపం వస్తుంది ఆ మాటలకి! “నోర్ముయ్… నీ రాతా నా రాతలా అవ్వాలా? ఆ పది పాసయి నర్స్ ట్రెయినింగ్‌కి వెళ్ళి, తమ్ముడిని చదివిస్తావని ఆశలు పెట్టుకున్నాను” అంటుంది.

ఆ పూట పొయ్యిలో పిల్లి లేవలేదు! తల్లి వంట చేసిన వాళ్ళు “డబ్బులు ఆనక ఇస్తాం అరుంధతీ” అంటే వాళ్ళిచ్చిన నాలుగు గారెముక్కలతో తలొంచుకుని వొస్తుందే కానీ, డబ్బులు అడగదు. భారతి ఆఖరి బియ్యం గింజతో సహా దులిపి నాయినమ్మకీ, పెద్దనాన్నకీ గంజి కాచి ఇచ్చింది.

“అక్కా ఆకలి” అని వచ్చిన తమ్ముడికి ఓ కొబ్బరి చిప్ప కొట్టి ఇచ్చింది.

చీకటి పడ్తుండగా అరుంధతి చిన్న మూటతో వచ్చింది. “భారతీ… ఇదిగో ఇందులో రవికెల బట్టా, చీరా వున్నాయి… చిల్లర డబ్బులు తీసుకెళ్ళి పచారీ షాపులో ఇచ్చి నాను రొట్టె కొనుక్కురా!… ఆ చీరా జాకెట్టు నాగలక్ష్మి అత్తయ్యకి ఇచ్చి ఆవిడిచ్చిన పాతికో పరకో పట్రా!” అని వుస్సూరుమంటూ కూర్చుంది.

భారతి విసుగ్గా “నాగలక్ష్మి అత్తయ్యకి రెండొందల చీర పాతికకి ఎందుకివ్వాలి?నీ ఒంటి మీద చీర చూసుకో… పోగులు తక్కువా, చిరుగులు ఎక్కువా వున్నాయి… నువ్వే కట్టుకో!” అంది.

రవి వచ్చి తల్లి సంచి తడిమి, లడ్డూ వుండ తీసుకుని ఆవురావురుమని తినసాగాడు.

అరుంధతి చిరునవ్వుతో “మీ టీచరమ్మ కనీసం రవి ఫీజు కట్టమందే భారూ! నీకు ఆవిడే కడ్తానంది. తెలివైన పిల్లవని ఆవిడకి అభిమానం!” అంది.

“అయినా సరే! చిరుగుల చీరతో నువ్వు తిరుగుతూ వుంటే నాకు సిగ్గేస్తోంది! మొన్న కనకరాజు గారింట్లో పిండి దంచుతుంటే ఆయన నిన్ను ఎట్లా చూసారో తెలుసా?” అంది కన్నీళ్ళతో భారతి.

అరుంధతికి తెలుసు…. చెయ్యెత్తి పోటేస్తున్నప్పుడు దాగని ఎద సంపదా… దాన్ని దాచలేని దారిద్రం… మగవాడి ఆకలి చూపులూ! కానీ వాటిని పట్టించుకుంటే ఈ గంజినీళ్ళు కూడా దక్కవు! “తోడేళ్ళున్న చోటే, తోడూ నీడా కూడా ఏర్పాటు చేసాడమ్మా ఆ భగవంతుడు… రామాలయం పూజారి గారు రమ్మన్నారు… వెళ్ళి ప్రసాదాలు తెచ్చుకున్నారా?” అడిగింది.

“ఆ… ఆ దద్దోజనం, పులిహోరలే పెద్దనాన్నకీ, తమ్ముడికీ పెట్టాను” అంది భారతి.

“పిచ్చి తల్లీ… నువ్వేం తినలేదూ?… ఏదీ తినకుండ బడ్లో అంత చదువెలా చదువుకుంటావమ్మా?” ఆ తల్లి ప్రాణం పెరపెరలాడిపోయింది.

భారతి ఆ తల్లి కడుపులో నరమే… నవ్వి “నాకేం తక్కువ కాలేదులే… రెండు అరటి పళ్ళు కూడా ఇచ్చారుగా పూజారి గారూ!” అంది.

అరుంధతి అర్ధరాత్రి యశోధరని వదిలిపోయిన సిద్ధార్థుడిలా తన భర్త రామం తనని వదిలి పోవడం గుర్తు తెచ్చుకుంది. అప్పటికి నాలుగు రోజులుగా అత్తగారు హై బిపి వచ్చి, మూతి వంకరపోయి, ధర్మాసుపత్రిలో పడి వున్నారు. పిల్లలు “నాన్నా, బియ్యం తెచ్చావా? ఆకలేస్తోంది” అని అడుగుతున్నారు. అరుంధతింకా బయట కెళ్ళి రెక్కలు ముక్కలు చేసుకోవడం మొదలు పెట్టలేదు! రామం ఆ రాత్రి అరుంధతి నిద్రపోయిందని అనుకుని, ఆమె చెక్కిళ్ళు ముద్దాడాడు… తల్లిదండ్రుల ఫొటోల దగ్గర కన్నీరు పెట్టాడు! ఆమె పక్కనే పడుకున్న వాడు అర్ధరాత్రి లేచి తలుపు తోసుకుని వెళ్ళిపోయాడు. అతనే వస్తాడనుకుని తెల్లారే దాక ఎదురు చూసిన అరుంధతికి… తన బతుకు కూడా తెల్లారిందని, తెల్లని వెలుతురులో అతను దిండు కింద పెట్టిన తెల్లని కాయితం మీద బరికిన రెండు వాక్యాలు చెప్పాయి.

“నా గురించి వెదకకు… అమ్మా, అన్నయ్య, పిల్లలూ జాగ్రత్త!”

ఆమెకి ఏడవాలో, తల బాదుకుని గొడవ చెయ్యాలో కూడా తోచలేదు. ఓదార్చడానికొచ్చిన పక్కింటావిడని “వదినా… ఏదైనా పని ఇప్పించు… అంట్లో తోమడం అయినా సరే! నా పిల్లల కడుపు నింపాలి” అంది. ఆ నాటి నుండీ అరుంధతి కంటి నిండా నిద్రా, కడుపు నిండా తిండీ అన్నది మరిచిపోయింది. ఏడుస్తున్న అత్తగారినీ, ఏవీ తెలీని బావగారినీ, పిల్లలనీ కోడిపెట్టలా తన రెక్కల కింద పొదువుకుంది. ఏదైనా చేసి ఆ ఐదు కంచాలు నింపేది. కానీ రోజులు మారాయి. పూజలూ, వ్రతాలూ తగ్గాయి. తద్దినం వంటకి ఎవరూ పిలవడం లేదు! ముత్తైదువకి వెళ్తే వాళ్ళిచ్చే చీరలకీ, రవికెల బట్టలకీ గిరాకీ వుండటం లేదు. సంభావన పెద్దగా ఇవ్వరు. వంటకి అసిస్టెంటుగా వెళ్తే ఏవీ పెద్దగా రాదు. విడిగా వెళ్దాం అన్నా, అంతా పెద్ద పెద్ద కేటరింగ్ కంపెనీలకే ఇస్తున్నారు. పిల్లలు పెద్దవుతున్నారు. భారతి పెద్దమనిషైంది. అవసరాలు పెరిగాయి. బలహీనంగా వుండబట్టి పిల్లకి పయిట అవసరం రాలేదు! రాన్రాను పచారీ షాపుల్లో ‘అరువు’ అన్న మాట లేదు! ఎక్కడ చూసినా సూపర్ బజార్లే! ధరలు అమ్మబోతే అడవీ, కొనబోతే కొరివీ అయ్యాయి. తను దేవాలయానికి మడి నీళ్ళిచ్చీ, ప్రాంగణం శుభ్రం చేసీ సంపాదించే వెయ్యి రూపాయల్లో సగం ఇంటద్దెకీ, ఇంకో సగం పిల్లల సగం జీతానికి పోతోంది. తిండికి తనకొచ్చే వంటా, ముత్తైదువల కెళ్ళడాలూ, వుపయోగపడ్తున్నాయి.

“అమ్మా! సాయిబాబా గుడిలో గురువారం కడుపునిండా అన్నం పెడ్తున్నారు” అని ఆనందంగా రవి వచ్చి చెప్తే ఆమె కడుపు చెరువైంది! కానీ ధరలతో బాటు పెరిగిన పాపాలూ…. వాళ్ళు చేసే దానాలూ ఇలాంటి వాళ్ళ కడుపులు నింపుతున్నాయని ఆనందపడింది.

“అరుంధతీ… ఇంట్లో వున్నావా?” అంటూ అన్నపూర్ణమ్మ వచ్చింది. “రా వదినా” అంటూ చాప వాల్చింది అరుంధతి.

“నీకు అదృష్టం కలిసొచ్చిందనుకో… లాయర్ గారి భార్య సువాసినీ పూజ చేసుకుంటోంది… అందరికీ వెయ్యినూట పదహార్లు సంభావన ఇస్తుందిట…” ఆనందంగా చెప్పింది.

అప్పటికి వారం రోజులుగా తెగ దగ్గుతున్న బావగారికి దగ్గు మందు కొనలేదు! పిల్లకి స్కూల్ డ్రెస్ చిరిగిపోయింది. పిల్లాడు కాళ్ళకి బూట్లు లేవని బడికెళ్ళడం లేదు… డబ్బాలో బియ్యం తప్ప, పప్పూ, వుప్పూ లేవు! గూట్లో రూపాయి లేదు. దేవుడు దీపానికి నోచుకోలేదు!

“వారి ఇల్లెక్కడ వదినా? ఎన్నింటికి రానూ?” ఆశగా అడిగింది అరుంధతి. “శివాలయం దగ్గర ఎడమ చేతి వైపు తిరుగు. జూకా మందార చెట్టున్న ఇల్లు. అడ్వకేట్ తిరుమలరావు అని బోర్డు వుంటుంది” అని చెప్పి, మళ్ళీ మళ్ళీ, “ప్రొద్దుటే ఏడింటికల్లా రావాలి” అని చెప్పి వెళ్ళిపోయింది.

“భగవంతుడా! నువ్వే దారి చూపించాలి” అనుకుంది అరుంధతి.

***

పూజ జోరుగా జరుగుతోంది.

అరుంధతి కాళ్ళకి కూడా పసుపు రాసి, పారాణి పెట్టారు. లాయర్ గారి భార్య జానకీదేవిది గొప్ప మనసు. అరుంధతిని చూసి “అచ్చు గుళ్ళో సీతమ్మవారిలా వున్నారమ్మా… పిల్లలకి మిఠాయిలూ, మా పిల్లల పొట్టైన బట్టాలూ వున్నాయి… వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళండి…” అని చెప్పింది. “సంభావన కూడా మీకింకో వెయ్యి ఎక్కువిస్తాను” అంది. అరుంధతి కృతజ్ఞతతో కరిగిపోయింది.

పూజా కార్యక్రమాలు అయి, ముత్తైదువలకి సంభావనలిస్తున్నారు. అరుంధతి ఆశగా ఎదురుచూస్తోంది! పిల్లాడి బూట్లూ… పిల్ల దానికో లంగా, బావగారికి దగ్గుమందూ… గుర్తొస్తున్నాయి!

“ఆపండి… నువ్వు అరుంధతివి కాదూ?” అంది ఒక పెద్దావిడ, సంభావనిస్తున్న జానకి చెయ్యి పట్టి ఆపుతూ.

“అవును” భయంగా అంది అరుంధతి. “నీకు సువాసినీ పూజేమిటీ? నీ భర్త రామం, ఎన్నడో కాశీలో పోయాడు… ఈ సంగతి మీ బంధువులకి తెలియబరిచాను కూడా! మా చౌలట్రీ పక్కన అనాథ ప్రేతం పడుందంటే నేనూ, మా వారూ వెళ్ళి చూసి, రామం కదూ… దుర్గమ్మ కొడుకు” అని గుర్తు పట్టాం” అని ఆ పెద్దావిడ గుడ్లురుముతూ చెప్పి “నీకు తెలీదంటే నమ్మను… లే… లే.. మా పిల్ల శుభమా అని సువాసినీ పూజ చేసుకుంటుంటే వచ్చి పాడు చేస్తావా? ముత్తైదువకి పెట్టాల్సిన పారాణీ నీలాంటి…”

“ఆపండి…” అరుంధతి కళ్ళ నిండా నీళ్ళు  నిండాయి. చేతి దాకా వచ్చిన సంభవన చేయ్యి జారిపోతుంటే తట్టుకోలేకపోయింది… పిల్లల మొహాలు గుర్తొస్తున్నాయి!

“నా మొగుడు బ్రతికుండగా నాకూ, తన కన్న పిల్లలకూ, తనని కన్న తల్లికీ ఏవీ చెయ్యలేదు… కడుపు కూడా ఒక్క పూటైనా నింపలేదు! కానీ అతను కట్టిన పసుపుతాడూ, ఈ బొట్టూ మా కడుపులు నింపుతున్నాయి… ఈ రోజున అర్థాంతరంగా చచ్చి నాకీ వుపాధి కూడా లేకుండా చేస్తాడని అనుకోలేదు… పోయిన ఆ బాధ్యతారహితుడి కిచ్చిన ప్రాధాన్యం… బతికున్న నాకూ, నా పిల్లలకీ ఇవ్వరా? నేనేం పాపం చేసానని నన్ను అవమానిస్తున్నారు? ఇందులో నా తప్పేంటి? చేతి దాకా వచ్చిన ముత్తైదువ కట్నం ఎందుకు ఇవ్వడం లేదూ? ఈ బొట్టూ, ఈ మెడలో తాళీ, అది కట్టి మరిచిపోయిన నా మొగుడూ… మీ పుణ్యానికి అడ్డు పడ్తున్నారా?… మీకు నా వల్ల ఎప్పుడో పోయాకా వచ్చే వుత్తమ గతులూ, వచ్చే జన్మలో కలిగే సువాసినీతనం పోతుందన్న భయం తప్ప… నా ఇంట్లో కాలుతున్న ఐదుగురి కడుపులూ…. ఇద్దరు చిన్నపిల్లల భవిష్యత్తూ కనపడటం లేదా?” అందామనుకుంది…. కానీ అనలేదు!

అప్పటికే చుట్టూ వున్న ఆడవాళ్ళు గుసగసలు… పూర్వ సువాసినులు “బొట్టూ పసుపు పెట్టుకుని ఎంత ఇదిగా తిరిగిందీ?” అని సూటీపోటీ మాటలు! ఆమెని చూపులతో గుచ్చుతూ, ‘ఇంకా ఎందుకు బతికి వున్నావ్?’ అన్నట్లు చూస్తున్నారు!

ఎవరన్నారు ‘సతి’ అనే మూఢాచారం సమసిపోయిందని. ఇప్పటికీ మరో రూపంలో బతికే వుంది! అరుంధతి ఖాళీ చేతులతో, ఓటి హృదయంతో, ఆశగా తన రాకకై ఎదురుచూసే పిల్లలని తలచుకుంటూ వెనుతిరిగింది… ఆమెకి ఆ నిమిషంలో భర్త ఇంక ఎప్పటికీ రాడు… పోయాడు అనే బాధ లేదు…. అత్తగారిని ఆసుపత్రికెలా తీసుకెళ్ళను? పిల్లల జీతం ఎలా కట్టను? ఇన్ని కడుపులు ఎలా నింపను? అనే బాధ తప్ప! చూపు అలుక్కుపోయీ, కాలు జారి పడబోయింది… రెండు చేతులు ఆమెని ఒడిసి పట్టుకున్నాయి… ఆమె జానకీదేవి. “సంభావన తీసుకోకుండా వెళ్ళకండి… సీతమ్మలా కనిపిస్తున్నారు!” అంది…. ఆమెకి సంభావన ఇస్తూ… నిండుగా నవ్వి…

(శుభం)

Exit mobile version