రంగుల హేల 7: సువాసనలూ – జ్ఞాపకాలూ

2
2

[box type=’note’ fontsize=’16’] “ప్రాణం లేని వాసనలు, ప్రాణంతో గుండెల్లో పదిలంగా ఉండే అనుభవాల్ని మదిలో ఎంత చక్కగా రీలు తిప్పుతాయో” అంటున్నారు అల్లూరి గౌరీ లక్ష్మి రంగుల హేల కాలమ్‌లో.  [/box]

[dropcap]జ్ఞా[/dropcap]పకాలనేవి మనసులో సముద్రపు కెరటాల్లా  నిరంతరం ఎగిసి పడుతూనే ఉంటాయి. ఖాళీగా ఉన్నప్పుడు వాటిని మనం జాగ్రత్తగా గమనిస్తాం. బిజీగా ఉన్నప్పుడు పట్టించుకోము.

పిక్చర్ ఇన్ పిక్చర్ లాగా ఒక మూల తెరపై గతం సినిమా నడుస్తూనే ఉంటుంది. మన గడిచిన జీవితానుభవాలు కొన్ని వాసనలతో కలిసిపోయి మన బ్రెయిన్‌లో రికార్డు అయ్యి ఉంటాయి. అప్పుడా వాసనలు కీ బటన్ లా పని చేస్తూ ఒకోసారి మనల్ని గతంలోకి లాక్కెళుతూ ఉంటాయి. ఆ ప్రత్యేకమైన వాసన మన ముక్కుకు తగలగానే దానికి సంబంధించిన సంఘటనలు మన మనోయవనికపై నర్తించి వెళ్లిపోతుంటాయి. ఇదీ ముక్కుకీ మెదడుకీ ఉన్న ఇంటర్ కనెక్షన్ అన్నమాట.

ఎర్ర గులాబీ వాసన చూడగానే నేను ఏడో క్లాస్ చదువుతున్నప్పుడు మా ఇంటి పెరట్లో ఓ  ఇరవై గులాబీ మొక్కల్ని తోటలా వేసి  పూయించిన గులాబీలు గుర్తొస్తాయి.  మల్లెల వాసన చూడగానే మా నానమ్మ తలపులొస్తాయి. ఆమె దొడ్లో పెద్ద బొడ్డుమల్లె చెట్టుండేది. దాన్నిండా గులాబీలంత సైజు మల్లె పువ్వులు. వాటి కోసం కజిన్స్ అందరం ఎవరికి ఎన్ని పూలు దొరుకుతాయో అన్న ఆత్రం కొద్దీ నేనుముందంటే నేనని పరుగు పరుగున వెళ్ళేవాళ్ళం. కొత్తిమీర వాసన ముక్కుకి తగలగానే వాకిట్లో పొయ్యి మీద, పక్కనే మొక్కల మధ్య ఉన్న కొత్తిమీర తుంపి కడిగి వేసి  మరిగించే పెద్దమ్మ పప్పులుసు గుర్తొస్తుంది.

యాలకుల వాసన చూడగానే పండగ బూరెలు, పరమాన్నం, మిరియాల వాసన చూడగానే జున్ను,తీవ్రంగా జలుబు చేసినప్పుడు గొంతు మండిపోయేలా  మిరియం పొడి వేసి పెద్ద వాళ్ళు బెదిరించి తాగించిన పాలు గుర్తొస్తాయి.

దేవుడి దగ్గర శాస్త్రానికి చిన్న గ్లాస్‌లో పెట్టిన పానకం  (మా కొద్దని ఇంట్లో అంతా పారిపోతుంటే ) పౌరుషంగా నేనే తాగుతుంటే  ఒక్క గ్లాన్స్‌లో, శ్రీ రామనవమి పందిరి, వడపప్పు మిరియాల పానకం, అడిగి అడిగి తీసుకున్న విసనకర్ర గుర్తొస్తాయి. ఆ పై  సీతా రామ కళ్యాణం  చూస్తూ  చిర్రెత్తి పోయే ఎండలో గుడిలో కూర్చున్న రోజులు వీపు తట్టి వెళ్లిపోతాయి.

ఇక ఇంగువ పులిహోర రుచి ఎక్కడన్నా నోటికి తగలగానే మా ఊరి గుళ్లో  ఆచారి గారు పెట్టిన పులిహోర ప్రసాదంలో ఆఖరి మెతుకు వరకూ నిలిచిన రుచి గుర్తొచ్చి మనసును ఎటో తీసుకుపోతుంది.  అలాంటప్పుడు ఏమీ లేనప్పుడు హడావిడిగా ఓ గరిటె అన్నంలో ఓ నిమ్మకాయ చెక్క పిండి పోపు వేసుకుని డబ్బాలో పెట్టుకుని ఆఫీసుకి పరిగెత్తే మా లాంటివాళ్ళకి గుళ్లో పులిహోర వైభవం  మదిలో మెదిలి దుఃఖ మొస్తుంది.

బజార్లో మావిడి పళ్ళు కొంటున్నప్పుడు వచ్చే వాసన (తినేటప్పుడు కాదు) స్టోర్ రూమ్‌లో అమ్మమ్మ ముగ్గేసిన  మా తోట చెట్టు మావిడిపళ్ళని తలపిస్తుంది. అప్పుడు అమ్మమ్మతో ప్రేమానుభవాలు వరస కడతాయి.

చేమంతి వాసన అమ్మ జడ కుట్టినప్పుడు కలిగిన అనుభూతిని తియ్యగా గుర్తు చేస్తుంది. బంతి వాసన హై స్కూల్‌లో క్లాస్ అంతా వరసగా  రంగు రంగుల బంతి పూలు  తలలో పెట్టుకున్నప్పుడు, తెలుగు మేడం “ ఇవాళ బంతి  పూల తోట నా క్లాస్ కి వచ్చిన్నట్టుంది”  అన్న జోక్‌ని గుర్తు చేసి పెదాలపై నవ్వును పూయిస్తుంది. తొలి వేకువలో మార్నింగ్ వాక్‌కి గార్డెన్‌కి వెళుతున్నప్పుడు (డాక్టర్ గారి బెదిరింపు వల్ల) అక్కడ వయ్యారంగా చెట్టుకింద పది ఉన్న పారిజాతాలు, కాడ మల్లెలు ఊరి కాలవ గట్టు వారంటా  నడుచుకుంటూ బడికెళ్లే దారిని జ్ఞప్తికి తెస్తాయి.

ఎన్ని హోటల్స్‌లో ఎన్నెన్ని బిరియానీలు తిన్నా రాని గుర్తు, కిరాణా షాప్‌లో నిలబడి అక్కడ కనబడ్డ పలావ్ ఆకు నలిపినపుడు మాత్రం ఒక్కసారిగా మా మేనత్త చేసే పలావ్ వాసనని ఊహించి ఊరిస్తుంది.

సన్నజాజుల స్మెల్ రాగానే డిగ్రీ చదువుకునే కజిన్ అక్కయ్య సన్నజాజుల్ని ఓపిగ్గా కోసి అందంగా మాల కట్టడం  మనసులో మెదులుతుంది.  నేను ప్రయత్నిస్తే మాల  లూజ్ లూజ్‌గా వంకర టింకరలుగా వచ్చేది (ఇప్పటికీ అంతే లెండి).

గంధం అగర బత్తీ ల సుగంధం నాన్నమ్మ సానపై గంధం చెక్క అరగదీసి కాలి వాపుపై ప్రేమగా వెయ్యడాన్ని గుర్తు చేసి కళ్ళ నీళ్లను తెప్పిస్తుంది. తొలకరి చినుకు మట్టి వాసన మనూరికి లాక్కెళ్ళకుండా ఉంటుందా ?

ఎప్పుడో ఒకసారి రుచిగా ఉండే మన పెరుగు, పెద్దమ్మ రోజూ దోరగా దాలి పొయ్యిపై గోధుమ రంగు వచ్చే వరకూ కాచి  ఆ పై దాన్ని తోడుపెట్టి మజ్జిగ చేసి ఉప్పు వేసి  అందరికీ గ్లాసుల్లో ఇచ్చిన కమ్మని రుచిని తలపిస్తుంది.

పక్క ఫ్లాట్ లోంచి మాడిపోయిన కూర వాసన రాగానే, ఒకసారి బంధువులొస్తున్నారని అమ్మ కూర పొయ్యి మీద వేసి చూస్తుండమని నాకు చెప్పి పచ్చడి రుబ్బడానికి నూతి గట్టు వైపు వెళ్ళినప్పుడు ‘మీనా’  నవల చదువుతూ నేను కూర మాడగొట్టడం అది చూసి అమ్మ నా వీపు వాయ గొట్టడం తలలో తిరిగి నవ్వొస్తుంది.

ఇంతెందుకు, ఘుమ ఘుమ లాడే ఓ అరిసె ముక్క చాలదా,  మనల్ని లాక్కెళ్లి అలనాటి బాల్యపు బంగారు సంక్రాతిసంబరాల్లో ముంచి లేపడానికి !

 ఇలా ప్రాణం లేని వాసనలు, ప్రాణంతో గుండెల్లో పదిలంగా ఉండే అనుభవాల్ని మన మదిలో ఎంత చక్కగా రీలు తిప్పుతాయో చూసారా !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here