స్వాగతం

2
2

[dropcap]కా[/dropcap]రు దిగి ఇంటిలోకి వెడుతున్న సందీప్, సెల్ మోగడంతో తీసి చూసాడు ఏదో కొత్తనెంబర్. ‘హలో’ అన్నాడు.

“బాబూ సందీప్, మీరేనా”

“అవును, మీరు?”

“నేను వింధ్య మదర్‌ను. నా పేరు నళిని.”

“నమస్తే ఆంటీ. మీతో ఎప్పుడు ఫోన్‌లో మాట్లాడక మీ గొంతు గుర్తు పట్టలేదు. వింధ్య ఇంటికీ ఇంకా రాలేదా ఆంటీ..”

“వచ్చింది బాబూ, మీ గురించి చెప్పింది. థాంక్స్, బాబూ.”

“అయ్యో దానికే థాంక్స్ చెప్పాలా. మీరు నన్ను మీరు అనకండి సందీప్ అంటే చాలు.”

“అలాగే అయితే నన్ను నువ్వు కూడా అత్తయ్యా అని పిలువు చాలు. ఆంటీ అంటే ఏదో పరాయి వాళ్ళను పిలిచినట్టు వుంది.” నవ్వుతూ అంది నళిని.

ఫోన్ ఆఫ్ చేసి జేబులో పెట్టుకుని కారు తాళాలు ఎగరేస్తూ లోపలోకి వచ్చాడు సందీప్. హాల్లో సోఫాలో కూర్చొన్న తండ్రిని చూసి కాస్త కుదురుగా నడుచుకుంటూ లోపలికి పోయాడు. వెనకాలే వచ్చింది. అరవింద “ఏం జరిగింది సందీప్, ఆ అమ్మాయి వచ్చిందా. మాట్లాడుకున్నారా”.

తల్లి ఆతృత చూసి నవ్వొచ్చింది. “ఎందుకమ్మా ఆ కంగారు. నేను నెమ్మదిగా చెబుతానుగా.”

“ఏమోరా నా ఆదుర్దా నాది. నేనేమిటి మీ డాడీ కూడా రెండుసార్లు అడిగారు. నువ్వు ఇంటికి వచ్చావా అని. అవును నువ్వు ఫోన్‌లో మాట్లాడుతూ లోపలికి వచ్చావు ఎవరు ఆ ఫోన్.”

“వింధ్యా వాళ్ళ అమ్మగారమ్మా. ఆవిడకు నీలాగే ఏం జరిగిందో అని కంగారు.”

“ఉంటుందిరా మరి… ఈ రోజుల్లో పెళ్లి వ్యవహారాలు అలా వున్నాయి.” అప్పుడే ఆ గదిలోకి వచ్చిన రమేశ్ అన్నాడు.

“బాగానే మాట్లాడుకున్నాం డాడీ. తను ఆలోచిస్తానంది.”

“సరిపోయింది, ఇంతసేపూ మాట్లాడితే ఇదా జరిగింది. అయినా ఆ అమ్మాయికి అంత పొగరేమిటిరా.” కాస్త కోపంగా అన్నడు రమేశ్.

“ఏవో వాళ్ళ అనుమానాలు వాళ్ళకి వుంటాయి డాడీ.”

“సరేలెండి ఎన్ని చూడలేదు అందులో ఇది ఒకటి. పదండి, నిద్రపోదురుగాని.”

ఇద్దరూ సందీప్ గదిలో నుండి వెళ్ళిపోయారు. సందీప్ బట్టలు మార్చుకుని మంచం మీద పడుకున్నాడు.

అతనికి పదిరోజుల క్రితం జరిగిన తన పెళ్లి చూపులు గుర్తుకొచ్చాయి.

తల్లి తండ్రి తనకు పెళ్లి చేయాలనీ రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. తనూ వాళ్ళకి సహకరిస్తూనే వున్నాడు కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలే పెళ్లి అంటే ముందుకు రావడం లేదు. కొంతమంది తనకు నచ్చక, కొంతమందికి తను నచ్చక తన పెళ్లి ఆలస్యమవుతూ వచ్చింది. ఈ వింధ్య సంబంధం తనకెందుకో చాలా నచ్చింది. ఫోటోలో ఆమె రూపం, చదువు తనకు, కుటుంబ వివరాలు పెద్దవాళ్ళకి నచ్చాయి. అందుకే ఈ కథ పెళ్లిచూపుల వరకూ వచ్చింది. తనూ, తల్లీ బెంగుళూరులో వున్న అక్కని కూడా పెళ్లిచూపులకు రమ్మన్నారు. ‘మీ అందరికీ నచ్చితే నేను తర్వాత చూస్తాను’ అంది. ఒక మంచిరోజు చూసుకుని పెళ్లిచూపులకు వెళ్ళారు, ముగ్గురం వెళ్ళకూడదు అంటూ తల్లి పక్క వాళ్ళ అమ్మాయి పదేళ్ల నవ్యను కూడా ప్రయాణం చేయించింది.

“అన్నా నీకు పెళ్లి కుదిరితే నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి” అంది డ్రైవ్ చేస్తున్న సందీప్‌తో.

“అమ్మా ఈ పిల్లను తీసుకువచ్చావెందుకు… పెళ్ళికి వెడుతూ పిల్లిని చంకను పెట్టుకు వెళ్ళడం అంటే ఇదే.” అన్నాడు సందీప్ నవ్వుతూ.

“పోరా శుభామా అని చూపులకు వెడుతూ ఆ జంతువు పేరు ఎందుకు.” అంది అరవింద.

వింధ్య ఇల్లు బాగుంది, వాళ్ళు బాగానే మాట్లాడారు. వింధ్య మాత్రమే ఎందుకో ముభావంగా వుంది. ఏవో చదువు, ఉద్యోగాల గురించే అందరూ కలిసి మాట్లాడుకున్నారు. మొత్తం ఒక గంట వున్నారు వాళ్ళ ఇంట్లో. తమ ఇంటికి రాగానే అందరూ వింధ్య నచ్చిందనే నిర్ణయానికి వచ్చారు. మర్నాడే అమ్మాయి తమకు నచ్చిందని వింధ్యా వాళ్ళకి తెలియజేసారు. వాళ్ళు మాత్రం ఏమీ చెప్పలేదు. వారం గడిచాక వింధ్య సందీప్‌తో మాట్లాడాలనుకుంటోంది అని చెప్పారు.

వింధ్య, సందీప్ ఒక హోటల్‌లో కలుసుకున్నారు. “చెప్పండి మాట్లాడాలని వచ్చి మౌనంగా వుంటే ఎలా?” అన్నాడు సందీప్.

“ఏం మాట్లాడాలో తెలియడం లేదు, మీరు నేను నచ్చానని చెప్పారు థాంక్స్.” అంది వింధ్య,

సందీప్ నవ్వేసాడు. “అలాంటి థాంక్స్ నేనూ చెప్పాలనుకుంటున్నాను.”

“ఓ, మీరు నేను అనుకున్న దానికన్నా తెలివైనవారు.” అంది వింధ్య.

అతను భుజాలు ఎగరేశాడు. ఆమె ఏదో ఆలోచిస్తూంది. సందీప్‌కు కాస్త విసుగొచ్చింది. ఆమె మెల్లిగా మొదలు పెట్టింది. “నాకు భయంగా వుంది.”

“దేనికి? ఎందుకు?”

“పెళ్ళంటేనే భయంగా వుంది.”

“ఎందుకు.”

“మా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు చూసాక భయంగా వుంది. పెళ్ళంటేనే చిరాగ్గా వుంది.”

సందీప్‌కు కాస్త కోపం వచ్చింది. కానీ ఆమెను పెళ్లి చేసుకోకుండా వదులుకోవాలని లేదు. వింధ్య ఒక్కసారిగా మాటలు వచ్చినట్టుగా మొదలు పెట్టింది. “మా బంధువుల అమ్మాయి చదువుకుంది. మనిషి బాగుంటుంది.. కానీ పెళ్లి అయ్యాక అతను ఆమెను ‘నువ్వు నాకు నచ్చలేదు’ అంటూ ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు. మా ఫ్రెండ్ ప్రేమించానని తన కొలీగ్‌నే పెళ్లి చేసుకుంది.వాడు మరో అమ్మాయిని తీసుకుని ఫారిన్ పోయాడు. మా వదిన చెల్లెలు……”

“ఇలాటివి ఈ రోజుల్లో జరగడం లేదని నేను అనడం లేదు. కానీ మన జీవితం వాళ్ళ జీవితంలా ఉంటుందని ఎందుకనుకోవాలి.” సందీప్ అన్నాడు.

“ఉండదని గ్యారంటి ఏముంది.”

అతను ఒకసారి అటూ ఇటూ చూసాడు.

“చూడండి ఏ పనైనా ఒక నమ్మకంతో మొదలు పెట్టాలి. అందరూ చెప్పే ఉదాహరణే నేను చెబుతున్నా అనుకోకపోతే యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని మనం ప్రయాణాలు మానేసామా…….ఇదీ అంతే.” ఆమె మాట్లాడలేదు. టెన్షన్ పడే దానిలా కింది పెదవి కొరుకుతోంది. ఈ లోగా బేరర్ మళ్ళీ వచ్చాడు, ఏదో ఒకటి ఆర్డర్ ఇవ్వకపోతే బాగుండదని అతను పిజ్జా ఆర్డర్ చేసాడు.

“చూసారా మీరు నాకు ఇష్టమా కాదా అని అడగకుండా పిజ్జా ఆర్డర్ ఇచ్చారు. ఇది మేల్ ఇగో కాదా” సందీప్ అదురుకున్నాడు,ఇంత చిన్న విషయానికి ఆమె అంత రియాక్ట్ అవుతుందనుకోలేదు.

“మనం వచ్చి చాలా సేపయ్యింది. అతను రాకపోతే నేనేమి ఆర్డర్ చేసే వాడిని కాదు. మీరేదో ఆలోచనలో వున్నారని ఆర్డర్ చేశాను. నచ్చకపోతే కేన్సిల్ చెయ్యొచ్చు, లేదా అది వదిలి మరొకటి మీకు నచ్చింది ఆర్డర్ ఇవ్వచ్చు. ఎంత చిన్న విషయాన్ని మేల్ ఇగో దాకా తీసుకువెళ్ళడం ఎందుకు?” ఆమెకు కాస్త మొహమాటం అనిపించింది, పరాయి వ్యక్తితో అలా మాట్లాడినందుకు.

నిజానికి ఆమెకు ఆకలిగా వుంది. ఇద్దరూ పిజ్జా తినసాగారు. వింధ్య టిఫిన్ తినే తీరు, వేళ్ళు కదిలినప్పుడల్లా చూపుడు వేలికి పెట్టుకున్న ఉంగరం సందీప్‌కు కవిత్వం వచ్చేట్టు చేస్తున్నాయి. అతను స్టయిల్‌గా తినే తీరు ఆ కూర్చోవడం వింధ్యకు అతనిపై ఇష్టం కలిగేట్టు చేసున్నాయి. కాస్త తిన్నాకా సందీప్ అన్నాడు. “ఏ బంధం నిలుపుకోవలన్నా దానికి సంబంధించిన ఇద్దరికీ సర్దుకు పోయే గుణం వుండాలి.”

“అంత అవసరం ఏముంది.. ఈ రోజుల్లో అమ్మాయిలు అన్ని రంగాల్లో తాము మగవాళ్ళతో సమానం అని నిరూపించుకుంటున్నారు.”

“కాదనడం లేదు… ఆ మాట కొస్తే మీ అమ్మాయిలతో మీకెప్పుడూ గొడవలు రాలేదా… ఇంట్లో మీ అన్నతో, డాడీతో అభిప్రాయభేదాలు రాలేదా.”

“వచ్చాయి కానీ అది వేరు… వాళ్ళు నా వాళ్ళు…..”

అతను నవ్వి.. “అదే నేను అనేది భర్తనో, భార్యనో నా వాళ్ళు అని మనం ఎందుకు అనుకోము. అప్పుడు గొడవలు వచ్చినా మనం సర్దుకుపోవచ్చు.”

ఇతను చెబుతుంటే నిజమే అనిపిస్తూంది.

“మా ఫ్రెండ్ కూడా…..”

సందీప్ మధ్య లోనే అందుకున్నాడు. “చెప్పుకుంటే చాలా విషయాలు వుంటాయి వింధ్యా… మీరు స్కూల్లో చేరినప్పుడు, కాలేజిలో చేరినప్పుడు ఇలాటి సందేహాలతో చేరారా… నేను చదవగలను, నేను వుద్యోగం తెచ్చుకునేలా చదవగలను అనే నమ్మకం తోనే చదివారు కదా, మరి పెళ్లి మీద ఎందుకు అంత నమ్మకం లేదు?”

“అప్పుడు ఇంకా జీవితం ఉందనే నమ్మకం ఉంటుంది.”

“ఇప్పుడు కూడా అదే నమ్మకంతో ఉండమంటున్నాను.”

“కానీ మీ వాళ్ళు…” ఆమెకు వాక్యం పూర్తి చేయడానికి భయం వేసింది.

సందీప్‌కు కాస్త కోపం వచ్చినమాట నిజమే కానీ ఈ రోజుల్లో పిల్లల పెళ్ళిళ్ళు అయ్యేవరకు అవడం లేదని బాధ, అయ్యాక భార్యాభర్తల మధ్య గొడవలు వస్తే సర్దిచెప్పాల్సింది పోయి ఈ పెద్దవాళ్లు కూడా వాళ్ళ పంతాలు, పట్టుదలలు చూపించుకుంటున్నారు. “కొన్ని కుటుంబాలలో పెద్దవాళ్లు కూడా సమస్యలకు కారణం అవుతున్నారు. కాదనడం లేదు… అసలు ఇద్దరు వ్యక్తుల మధ్యకు మూడో మనిషి రావడం దేనికి, చాలా సమస్యలని మనమే పరిష్కారం చేసుకోవచ్చు”. అతనికి నవ్వొచ్చింది… “మనం మన విషయాలు మానేసి చిన్నప్పుడు ఆవు గురించి వ్యాసం రాసినట్టు మనం పెళ్లి గురించి వ్యాసం రాసేట్టువున్నాం.” ఆ మాటలకూ ఆమెకు నవ్వొచ్చింది.

“సారీ నేను మీ పెద్దవాళ్ల గురించి అలా మాట్లాడకూదదేమో కదూ.”

“మీ సందేహాలు మీరు బయట పెడుతున్నారు, అందులో తప్పేమీ లేదు.”

“మరి మీకేమీ నా గురించి సందేహాలు లేవా…”

“చెప్పానుగా ఏదైనా నమ్మకంతోనే మొదలు పెట్టాలని, అయినా ఇంతో అంతో మీరు మీవాళ్లు నచ్చకుండా మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని చూడడం పధ్ధతి కాదుకదా. మీ అమ్మగారు, నాన్నగారు కలిసి వున్నారు, మీ అన్న, వదినా కలిసి వున్నారు. ఇంక ఇందాకా మీరు అన్నట్టు మా ఇంట్లో అమ్మ,నాన్నగారు; అక్క, బావగారు బాగానే వున్నారు. అందువలన ఎవరి గురించో మీరు పెట్టుకున్న భయాలేవి మా ఇంట్లో ఉండవు.” అతనికి తన వాళ్ళ పట్ల ఎంత నమ్మకం… తమ ఇంటికి వచ్చినప్పుడు కూడా చూసిందిగా మంచి కుటుంబం లాగానే అనిపించింది. ఇంతలో ఆమె ఫోన్ మోగింది. ఆమె తల్లి. “ఆ.. ఆ వస్తున్నా” అంటోంది.

“సరే మనం బయలుదేరుదామా” అన్నాడు సందీప్.

“ఏమీ అనుకోకండి మా అమ్మకు కంగారు ఎక్కువ.”

“అందులో తప్పేమీ లేదు, మన వాళ్ళు కాబట్టి మన గురించి ఆలోచిస్తారు.”

అతనే బిల్ చెల్లించాడు, ఆమె ఇవ్వబోతుంటే సున్నితంగా వారించాడు. అతనికి ఇంతసేపు మాట్లాడాకా ఆమె అభిప్రాయం తెలుసుకోవాలని వుంది. కానీ అడగడానికి ఏదో మొహమాటం అడ్డం వస్తోంది.

“పదండి మీ ఇంటి దగ్గర దింపుతాను.” అన్నాడు కారు తాళం తీస్తూ

“మీరు ఇంటికి వెళ్ళడానికి లేట్ అవుతుందేమో.”

“పర్వాలేదు. ఇద్దరం మరి కాస్సేపు మాట్లాడుకోవచ్చు.” ఆమె ఇంతసేపటికి వాఛీ చూసుకుంది. రాత్రి తొమ్మిది కావస్తోంది. ఆమె కారు ఎక్కింది.

“నేను ఒక మాట అడగనా.”

“ఆ.” అన్నాడతను డ్రైవ్ చేస్తూ.

“మీరు ఎవరి గురించైనా ఇలాగే పాజిటివ్‌గా మాట్లాడతారా”

“అది సరియైనా కారణం అయినప్పుడు ఎందుకు కోపం తెచ్చుకోవడం.” అతను ఒక నిముషం ఆగి అన్నాడు “చూడండి వింధ్యా, పెళ్లి చేసుకోవడం, చేసుకోకపోవడం మీ ఇష్టం.. అది మీ వ్యక్తిగతం. ఎవరి పెళ్లి విషయం అలా జరిగింది కాబట్టి నాకు అలాగే జరుగుతుంది అనుకోవడం తెలివితక్కువతనం…. మళ్ళీ మనం కలుసుకోవచ్చు, కలుసుకోక పోవచ్చు. నాకు మీరు నచ్చారు. అందుకే మీరు మాట్లాడాలంటే వచ్చాను, ఇలా చెప్పి మిమ్మల్ని ఎమోషనల్‍గా ఒప్పించాలని కాదు. నా అభిప్రాయం నేను చెప్పాను.” ఆమె మాట్లాడలేదు.

కారు ఆమె ఇంటికి కాస్త దూరానికి వచ్చింది. “ఇక్కడ దిగిపోతాను.” అంది

“అదేం ఇంటి దగ్గర దింపుతాను,”

“వద్దు, కాస్త దూరం నేను అలోచించుకుంటూ వెడతాను.”

“సరే, జాగ్రత్త. గుడ్ నైట్,”

తెల్లవారింది. రాత్రి ఆలస్యంగా నిద్ర పోయిన సందీప్ తల్లి తలుపు కొడుతూంటే నిద్ర లేచాడు. “ఏంటమ్మా సండేనేగా నిద్ర పోనివ్వకుండా” ….. అన్నాడు ఆవలిస్తూ.

“మంచి శుభవార్తతో నిద్ర లేపుదామనిరా…”

“ఏమిటి అక్క వస్తోందా.”

“ఆ… ఆ రావలసిందే నీ పెళ్ళికి.” అతనికి నిద్ర మత్తు వదిలి పోయింది.

“పాపం రాత్రి ఆ పిల్లకి పొగరనుకున్నానురా… కానీ పధ్ధతి గల పిల్లే. వాళ్ళ నాన్నగారికి చెప్పి మీ నాన్నగారికి ఫోన్ చేయించింది. ఈ పెళ్ళి తనకు ఇష్టమేనని. అదిగో మీ డాడీ మీ అక్కకు ఫోన్‍లో చెబుతున్నట్టున్నారు.” ఆవిడ హడావిడిగా వెళ్లిపోయింది. తను కూడా ఫోన్‌లో కూతురికి వింధ్య గురించి చెబుతోంది. “మంచిపిల్లే ఇంట్లో పెద్ద వాళ్ళకు చెప్పి మనకు ఫోన్ చేయించింది చూడు…….” సందీప్‌కు నవ్వొచ్చింది.

వింధ్యను ‘మంచిపిల్లను’ చేయడానికి తను ఎంత కౌన్సిలింగ్ ఇవ్వవలిసివచ్చింది….. ఆమె ఆలోచిస్తాను అంటే ‘మీ అభిప్రాయం రహస్యంగా నాకు చెప్పండి, బాహాటంగా మీ డాడీకి చెప్పి మా వాళ్ళకి ఫోన్ చేయించండి’ అన్నాడు. ఆమె రాత్రే తనకు మెసేజి పెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here