[dropcap]దే[/dropcap]శం కోసం అహరహం అకుంఠిత దీక్షతో పోరుసలిపి తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరవీరులు – భారతదేశ సిగలో పూసిన స్వాతంత్ర్య వీరులు అంటూ అమరవీరులకి ‘స్వాతంత్ర్య మొగ్గలు‘ అనే ఈ పుస్తకం అంకితం ఇచ్చారు డా. భీంపల్లి శ్రీకాంత్.
~
“మనిషికి స్వార్థం పెరగడం వల్లనేమో మరిచిపోవడం అనివార్యమయ్యింది. తన ఉనికికి, మనుగడకు ఆలంబనయైన, ఆధారభూతమైన మహనీయుల చరిత్రలను, సేవలను, త్యాగాలను, ఆత్మబలిదానాలను స్మరించకపోవడం భారత జాతికి ఆత్మహత్య సాదృశ్యంలా పరిణమిస్తుంది. వారిని మనోఫలకంపై చిత్రించుకోలేకపోవడం వల్ల మనం ప్రేరణ పొందలేకపోతున్నాం. ఒక స్వతంత్ర దేశంగా, భారతదేశ పౌరులుగా మనం ఏం చేయాలో? ఎలా చేయాలో? ఎందుకు చేయాలో? అన్న విషయాల్లో స్పష్టత కరువయ్యింది. భవిష్యత్తు అగమ్యగోచరంగా అంధకారంగా తోస్తుంది. ఇలాంటి సమయంలో స్వాతంత్ర్య మొగ్గలు పేరిట డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ వ్రాసిన మొగ్గలు కొంత ఊరటనిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. జాతీయ పండుగలైన స్వాతంత్ర్యదినాన్ని, రిపబ్లిక్ డే సంబరాలను ఏదో మొక్కుబడిగా జరుపుకునే తంతుగా నిర్వహించుకునే ఈ సందర్భంలో శ్రీకాంత్ కృషి ఆశాకిరణంగా గోచరిస్తుంది.
పరాయిపాలనలో వందల ఏళ్ళు భారతీయులు బానిసలుగా బతుకీడుస్తూ, దుర్భరమైన జీవితాలను గడిపిన దుస్థితి నుండి బయటపడడానికి చేసిన స్వాతంత్ర్యోద్యమ నాయకుల త్యాగాలను, వీరోచిత పోరాటాలను, తిరుగుబాట్లను, ఉద్యమాలను, సిపాయిలు తిరుగుబాటు, సహాయం నిరాకరణోద్యమం, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా వంటి అంశాలను, ఘట్టాలను సృశించడం వల్ల మన స్వాతంత్ర్య స్ఫూర్తిని రగిలించడానికి ప్రయత్నం చేశాడు శ్రీకాంత్.
పాఠక హృదయాల్లో దేశభక్తిని పెంపొందించడానికి, తమ వంతు పాత్ర పోషించడంలో పునరంకితులవడానికి ఈ స్వాతంత్ర్య మొదలు మార్గదర్శనం చేయడంలో దోహదపడుతాయని ప్రగాఢంగా విశ్వసిస్తూ…” అని వ్యాఖ్యానించారు తమ ముందుమాట ‘శుభాభినందనలు’ లో డా. శివార్చక విజయకుమార్.
~
“డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ గారు ఈ మొగ్గల నిండా దేశభక్తి, దేశం కోసం స్వాతంత్య ఆకాంక్షకై తెగింపు, జాతీయ సమైక్యత భావనను పెంపొందించే విధంగా త్యాగధనుల సమాధులపై మొగ్గలను పూయించారు. స్వాతంత్ర్య యోధులకు నివాళిగా అక్షరార్చన చేసి మొగ్గల బొండుమల్లెల దండవేసిన మొగ్గల ఆవిష్కర్త భీంపల్లి ఎంతైనా అభినందనీయులు. ఆయన కలం నుండి నిరంతరం విచ్చుకుంటున్న మొగ్గల హృదయాన్ని తడిమి చూడండి. నిత్యచైతన్యమై పారుతున్న భీంపల్లి అక్షరప్రవాహాన్ని అందరికీ తలా దోసెడు పంచుతున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.” అని పేర్కొన్నారు శ్రీ బోల యాదయ్య తమ ముందుమాట ‘త్యాగధనుల సమాధులపై పూసిన మొగ్గలు’లో.
~
“చంద్రునికో నూలుపోగులా నేను మొగ్గలు కవితా ప్రక్రియలో స్వాతంత్ర్య మొగ్గలు ఆవిష్కరించాను. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు వసంతంలోకి అడుగిడుతున్న సందర్భంగా ఈ మొగ్గల రచన చేశాను. డెబ్బై ఐదు వత్సరాల అమృత భారతికి డెబ్బైఐదు మొగ్గలతో అక్షరార్చన చేసిన రచన స్వాతంత్ర్య మొగ్గలు. అందరూ చదివి ఆదరిస్తారని, నాటి స్వాతంత్ర్య పోరాట నేపథ్యాన్ని అవగాహన చేసుకుంటారని ఆశిస్తున్నాను” అన్నారు కవి తమ ముందుమాట ‘అమృతభారతికి పాదార్చన’లో.
~
భారతీయ వీరుల వీరోచిత పోరాటసంగ్రామ ఫలితమే
భారతదేశానికి అర్ధరాత్రి సమయాన స్వాతంత్ర్యం సిద్ధి
భారత దేశ స్వాతంత్ర్య వేడుక ఆగష్టు పదిహేను
~
ఎందరో త్యాగమూర్తుల బలిదానంతో వచ్చిన స్వాతంత్ర్యం
అఖిల భారతావనిని ఆనంద సంబరాల్లో ముంచెత్తిన రోజు
భరతమాత చేతిలో నిండుగా రెపరెపలాడిన త్రివర్ణపతాకం
~
మాతృభూమి స్వేచ్ఛకోసం మొక్కవోని అకుంఠితదీక్షతో
లక్షలాదిమంది సాహసవంతుల వీరోచిత పోరాటం
వీరుల త్యాగఫలితమే మనకు దక్కిన స్వాతంత్ర్య ఫలం
~
శత్రుదేశపు గుండెల్లో మృత్యుఘంటికలు మోగించి
ఆంగ్లేయ పాలకులపై తిరుగులేని విజయం సొంతం
అకుంఠిత దీక్షతో స్వాతంత్ర్యం భారతీయుల వశం
~
ఇంకా చక్కని మొగ్గలు ఉన్న ఈ పుస్తకం ఆసక్తిగా చదివింపజేస్తుంది.
***
రచన: డా. భీంపల్లి శ్రీకాంత్
ప్రచురణ: పాలమూరు సాహితి
పేజీలు: 32
వెల: ₹30
ప్రతులకు:
డా. భీంపల్లి శ్రీకాంత్,
ఇం.నెం. 8-5-38, టీచర్స్ కాలనీ,
మహబూబ్‌నగర్
ఫోన్: 9032844017
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు