[dropcap]మా[/dropcap]నవాళి గతిని మార్చిన దృక్పథాలు కలిగి ఉండి, జనజీవితాలను ప్రభావితం చేసే రచనలు చేసిన ఇద్దరు సుప్రసిద్ధ వ్యక్తులకు భారతదేశం జన్మనిచ్చింది. ఈ ఇద్దరు వ్యక్తులు మరెవరో కాదు, స్వామీ వివేకానంద మరియు మహాత్మా గాంధీలే. వారి గురించి మరింత స్పష్టంగా తెలుసుకునేందుకు, మనిషి లేదా మానవుడితో వారి సంబంధాన్ని గురించి చర్చించాల్సిన అవసరం ఉంది.
పాఠకులు నాతో నూరు శాతం ఏకీభవిస్తారని నేను భావించడం లేదు, కాని వారీ అంశాన్ని సరికొత్తగా చూడాలని మాత్రం కోరుకుంటాను.
ప్రస్తుత ప్రపంచంలో మానవుడి మనుగడే ప్రమాదంలో ఉందనేది వాస్తవం, నిష్పాక్షిక పరిశీలన జరపవలసిన అవసరం ఎంతైనా ఉంది.
ఈ వ్యాసం కొన్ని పరిచయ వ్యాఖ్యానాలతో మొదలై, తరువాత ‘మనిషి’ గురించి – స్వామిజీ (స్వామీ వివేకానంద) మరియు గాంధీజీ (మహాత్మా గాంధీ) అభిప్రాయాలను వివరిస్తుంది.
మన ఆలోచనాపరులు అభివృద్ధి చేసిన ‘మనిషి అనే భావన’ని తుదకు మానవ మనుగడ యొక్క స్వభావ రీత్యానే అర్థం చేసుకోవాలనీ, ప్రశంసించాలని నేను ప్రతిపాదిస్తున్నాను.
పరిచయం:
ఈ అంశాన్ని విశదీకరించినప్పుడు, స్వామీజీ యొక్క అభిప్రాయాలను, గాంధీజీ అభిప్రాయాలను పోల్చి చూడటం లేదా చరిత్రలో ఒకరికంటే మరొకరు గొప్ప వ్యక్తి అని నిరూపించడం నా ఉద్దేశం కాదు. ఇటువంటి పోలిక నిరర్థకం. ఇది – ఒక కావ్యంలా మహాభారతం కంటే రామాయణం మరింత గొప్పదనో చెప్పడం లాంటిది లేదా సంగీతంలో బీతోవెన్ అద్భుత విజయాలు బాచ్, మోజార్ట్‌ల విజయాల కంటే గొప్పవని చెప్పడం లాంటిది. కానీ వాస్తవం ఏమిటంటే – స్వామీజీ, గాంధీజీల ఆలోచనలు మన సంప్రదాయానికో రూపాన్నిచ్చాయి, తదనుగుణంగా వారు వెల్లడించిన అభిప్రాయాలు, బోధించిన అంశాలకు సంస్థాపక విలువ ఉందనేని చెప్పాలి.
మళ్ళీ చెబుతున్నాను, వారి ఆలోచనా విధానాల మధ్య సరిహద్దు రేఖను గీయడం నా ఉద్దేశం కాదు; బదులుగా, ‘మనిషి అనే భావన’కి సంబంధించి స్వామీజీ మరియు గాంధీజీల అభిప్రాయాలలో ఉన్న కొన్ని యాదృచ్ఛిక అంశాలను నేను ప్రస్తావిస్తాను.
స్వామీజీ, గాంధీజీ ఒక రకమైన మానవతావాదానికి ప్రాతినిధ్యం వహించారనీ; ఓ ‘స్వేచ్ఛా’ జీవిగా లేదా ‘వ్యక్తి’గా మనిషి హుందాతనంలోనూ, సామర్థ్యంలోనూ విశ్వాసాన్ని కలిగి ఉన్నారనీ మనం చెప్పవచ్చు.
మనిషిపై స్వామీజీ, గాంధీజీల అభిప్రాయాలను అధ్యయనం చేయటానికి ప్రయత్నించే ముందు, రెండు ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవాలి.
- i) మనిషి యొక్క స్వభావం గురించి ఎవరైనా ఎలా స్పష్టపరచగలరు?
- ii) ఏయే అర్ధవంతమైన పనులను మానవునికి సహేతుకంగా ఆపాదించవచ్చు?
స్వామీజీ, గాంధీజీకి సంబంధించిన అంశాలను వివరించడానికి ముందు భారతీయ దృక్పథంలో ‘మనిషి’ అంటే ఏమిటో క్లుప్తంగా తెలియజేస్తాను.
భారతీయ దృక్పథంలో మనిషి:
భారతీయ దృక్పథంలో మనిషి అంటే, మనిషి మరియు ప్రకృతిల కలబోత. ఒకరిలో ఒకరుంటారు. కానీ తెలుసుకోవడం ‘ఉనికి’కి చెందినది, అదే సమయంలో ప్రకృతి మనిషిలోకి ప్రవేశిస్తుంది. అందువలన ‘జ్ఞానం’, ‘ఉనికి’ ఒకటిగా మారుతాయి. భారతదేశపు సుదీర్ఘమైన సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక చరిత్రలో, ప్రకృతి – పురుషులు నిత్య సామరస్యంతో సహకరించుకోడం, పరస్పరం ఏకీకృతమవడం మనం గమనించవచ్చు.
తానే నిగూఢంగా ప్రకృతి యొక్క స్వీయ వ్యక్తీకరణ అయినప్పటికీ, మనిషి ఎప్పుడూ ప్రకృతి వద్దకు శ్రద్ధతోనూ, గౌరవంతోనూ, సానుభుతితోనూ చేరుతాడు. ఇది అతనికి అవసరమైన సౌందర్య మరియు నైతిక దృక్పథాన్ని ఇస్తుంది, ఇది తన చర్యలను సహజంగా నడిపిస్తుంది. దీని ప్రకారము, మనిషి ఈ ప్రపంచంలో తనకంటూ ఓ ఆవాసం కొరకు అన్వేషించడమే కాకుండా; – ప్రకృతితో ఏకమవ్వలానే తన సహజమైన కోరికను అతని చర్యలు ప్రతిఫలిస్తాయి. అందువల్ల సంతోషం లేదా ఆనందం అనేది తన జీవితంలో అతను సాధించిన గొప్ప విజయం అవుతుంది తప్ప భౌతిక విజయాలు కావు.
జీవన సాఫల్యం దిశగా స్వామీజీ ప్రయాణం:
ప్రపంచాన్ని ఓ కుదుపు కుదిపి, దిశానిర్దేశం చేసి – మానవ ఆలోచనల నమూనాలను ప్రభావితం చేసినవారిలో వ్యక్తులలో స్వామీ వివేకానంద ఒకరు.
తొలినాళ్ళలోనే స్వామీజీ విభిన్న సామాజిక మరియు మతపరమైన ప్రభావాలను గ్రహించారు, వాటిని విమర్శనాత్మకంగా విశ్లేషించి జీర్ణించుకున్నారు. తన మాతృమూర్తి ధార్మిక బోధనలు; పాశ్చాత్య విలువలపై తండ్రిగారి మెచ్చుకోలు; బ్రహ్మ సమాజం వారి వివేచనవాదం ఇంకా, శ్రీ రామకృష్ణ యొక్క ఆధ్యాత్మికత, భారతదేశంలో సంచరించిన ఒక సన్యాసిగా తన అనుభవము – అన్నీ మిళితమై, ఈ వైవిధ్యాలు ఆయనలో వ్యక్తీకరణ పొందాయి, ఒకదానిలో ఒకటి లీనమయ్యాయి.
వేదాంతాల ఘనమైన బోధనలను, సత్యం యొక్క ఏకత్వము, మనిషిలోని దైవత్వము, మత సామరస్యం గురించి మానవాళికి బోధించమని స్వామీ వివేకానందను శ్రీ రామకృష్ణ ఆదేశించినట్లు చెబుతారు. అందుకే, తన మిషన్ ఆరంభంలో, స్వామీజీ “ప్రాచ్యదేశాలకు బుద్ధుడు ఒక సందేశాన్ని అందించినట్లుగా పాశ్చాత్య దేశాలకు అందించడానికి నా వద్ద ఒక సందేశం ఉంది” (1) అని చెప్పారు. అలాగే మిషన్ ముగింపులో, వారు ఇలా చెప్పారు, “మాసిపోయిన దుస్తులను పారవేసినట్లు నేను ఈ శరీరాన్ని త్యజించి బయటకు పోవడం మేలై ఉండవచ్చు. కాని పని చేయడం మాత్రం మానను. దేవునితో ఐక్యాన్ని సకల జనులు గుర్తించేవరకూ నేను వారికి సర్వత్రా ప్రేరణ కల్పిస్తూనే ఉంటాను.”(2)
“వారి వ్యక్తిత్వంలో పాశ్చాత్య పౌరుషము, ప్రాచ్య సాధుత్వము కలగలిసి ఉన్నాయి. ఈ రెండు మానవ సంక్రమిత లక్షణాల ఉత్కృష్టత, పరిమితులు ఆయనకు స్పష్టంగా తెలుసు. వీటిని ఆయన సంపూర్ణ మానవ సంస్కృతి యొక్క రెండు కీలక అంశాలుగా గ్రహించి, ఆధునిక కాలంలో వాటి సమన్వయాన్ని ఉద్ఘోషించారు” అని స్వామీ రంగనాథానంద పేర్కొన్నారు (3).
స్వామీజీ దృష్టిలో ప్రకృతి లేదా మనిషి:
మానవ స్వభావాన్ని అధ్యయనం చేయని ఏ సాంఘిక, మత లేదా రాజకీయ ఆలోచనా విధానమైనా సంపూర్ణం కాదనేది వాస్తవం. మానవ స్వభావాన్ని అవగాహన చేసుకోవడమే సామాజిక వ్యవస్థకు, ఆలోచనా విధానానికి పరిపూర్ణత నిస్తుంది. కాబట్టి మనిషిని జీవితంలోని అన్ని అంశాల ద్వారా అధ్యయనం చేయాలి. మనుషులపై ఎలాంటి శాఖాభిమానపు వైఖరి లేకుండా చూసుకున్నారు స్వామీజీ. వారి దృష్టిలో మనిషి భూమి మీద జీవితాన్ని ఆస్వాదించాలి, తరువాత ఉన్నతాదార్శాల కోసం దానిని త్యజించాలి. కాబట్టి, మనిషిని అతని సంపూర్ణ సాఫల్యత ఆధారంగా సమగ్రంగా పరిశీలించాలి. తూర్పు మనిషైనా, పశ్చిమం మనిషైనా – సౌకర్యంగా ఉండగలిగేలా; సంపూర్ణ జీవన సాఫల్యం పొందేందుకు ప్రేరణ కల్పించేలా – మనిషి పట్ల తన దృక్పథాన్ని విస్తరించారు స్వామీజీ.
ఈ విధంగా, స్వామీజీ ఆలోచన, బోధన మరియు సందేశాలు వేదాంతాలు లేదా నవ్య వేదాంతాలు తప్ప మరొకటి కావు. “వేదాంత తత్వం ప్రకారం మనిషి, విశ్వంలో కెల్ల ఉన్నత జీవి…. దేవదూతలు లేదా దేవతలు… మీరు వారిని ఎలా పిలిచినా సరే… వారు కూడా సంపూర్ణమవ్వాలంటే మనుషులుగా మారాలి.” (4) మనిషి తన అజ్ఞానాన్ని తొలగించుకుని దైవత్వం పొందడానికి ప్రయత్నిస్తే తప్ప, దైవాన్ని అన్వేషించి, దర్శిస్తే తప్ప ‘మనిషి’ అనే ఈ భావనని అవగతం చేసుకోలేము. ఎందుకంటే మనిషి అంటే – మంచితనాన్ని తెలుసుకోవడం, పరిపూర్ణత సాధించడం, తనలోని దైవత్వాన్ని గ్రహించడమని స్వామీజీ విశ్వసించారు.
“మనిషి లోని దైవత్వం” వారి దృక్పథంలో అత్యంత కీలకం. మనిషి సృష్టిలో కెల్లా ఉన్నతమైన జీవి కాబట్టి, దైవత్వం కలిగి ఉన్నవాడు కాబట్టి – ప్రతి మనిషిలోని సామర్థ్యం, శక్తి, దృఢత్వం వెల్లడవ్వాలని స్వామీజీ కోరుకున్నారు. “ప్రతి ఆత్మ దైవాత్మ అయ్యే సామర్థ్యం కలిగి ఉంటుంది. వెలుపల, లోపలా ప్రకృతిని నియంత్రించడం ద్వారా అంతర్గతంగా ఉండే ఈ దైవత్వాన్ని బహిర్గతం చేయాలి. పని ద్వారా లేదా ఆరాధన ద్వారా లేదా అతీంద్రియ నియంత్రణ ద్వారా లేదా తత్వం ద్వారా… వీటిల్లో ఏ ఒక్కదానితోనో లేదా వీటన్నిటి ద్వారానో దీనిని సాధించాలి. ముక్తి పొందాలి. ఇదే మత సారం. సిద్ధాంతాలు లేదా మూడనమ్మకాలు లేదా ఆచారాలు లేదా గ్రంథాలు లేదా ఆలయాలు లేదా రూపాలు… ఇవన్నీ అప్రధాన వివరాలే (5).
స్వామీజీ ఉద్దేశంలో దైవత్వం అంటే ఏమిటి?
స్వామీజీ ‘మనిషి’ భావన – వారి దైవత్వం లేదా దేవుని భావన నుండి విడదీయరానిది. వారి ఆలోచన ‘మనిషి-దేవుడు’ సంబంధంతో అనుసంధానించబడింది. దైవత్వం మనిషికి అత్యంత ప్రధానమైనదైతే, మానవుడు ఇంద్రియాలను పరిత్యజించి, ప్రాపంచిక ఇంద్రియ అనుభవాల నుంచి మనసును ఉపసంహరించి; అద్భుతమైన యత్నంతో శక్తిని లోపలికి మళ్ళించి ఏకాగ్రత ద్వారా దీనిని సాధించాలి.
ఏకాగ్రతని లోపలికి మళ్ళించడమనేది స్వీయ-ప్రయత్నం, అపరాధీనత, స్వీయ నైపుణ్యంతో సాధిస్తే మనిషి తన అసలైన స్వభావాన్ని గ్రహించగలడు. కాని మనిషి ‘శరీరం-మనస్సు’ ద్వైధీభావానికి లోనై తన నిజ స్వభావాని గుర్తించడంలో విఫలమవుతాడు. మనిషి మౌలికంగా ఓ ఆత్మ, కానీ ద్వైదీభావానికి లోనవడం వల్ల వైమనస్యత పొందుతాడు. ఇదే కాకుండా, తనలోని దైవత్వం గురించి జ్ఞానం లేకపోవడం కూడా అతను తనని తాను దీనుడననీ, బలహీనుడననీ, నిస్సహాయుడననీ భావించేలా చేస్తుంది.
వాస్తవానికి మనిషి స్వచ్ఛమైనవాడనీ, స్వేచ్ఛగా ఉండేవాడని, అజ్ఞానం మరియు అసత్యాల కారణంగా, పతనమయ్యాడనీ, అప్పటినుంచే మనిషి తన అసలైన స్వభావానికి దూరమయ్యాడని వివరించేందుకు స్వామీజీ ఆడం స్వర్గం నుంచి పడిపోవటం ఉపమానాన్ని చెప్పేవారు. అందుకే స్వామీజీ, “ప్రతి ఒక్కరికి వారి నిజమైన స్వభావాన్ని నేర్పండి, నిద్రిస్తున్న ఆత్మని మేల్కొలపండి, అదెలా జాగృతమవుతుందో చూడండి. శక్తి వస్తుంది, మంచితనం వస్తుంది, నిద్రిస్తున్న ఆత్మ జాగృతమై స్వీయ-చైతన్య కార్యకలాపాలు చేపట్టుతుంది” (6) అన్నారు.
పరాయీకరణ మరియు అజ్ఞానం యొక్క మతపరమైన, సామాజిక మరియు భౌతిక అంశాలను అధిగమించడానికి ప్రతీ ఒక్కరికీ వారి నిజ స్వభావాన్ని తెలియజేయాల్సిన అవసరం గురించి స్వామీజీ నొక్కిచెప్పారు. నిద్రాణ స్థితిలో ఉన్న ఆత్మని మతం ద్వారా, కాదు, శాస్త్రీయ మరియు ఆచరణాత్మక వేదాంతం ద్వారా జాగృతం చేయవచ్చు. అతనికి మతమంటే అంధ విశ్వాసం లేదా ఉత్త సూత్రాలు లేదా జీవంలేని ఆచారాలు కాదు, అది ఉనికి, అదే యోగ్యము.
మతం అనేది ఆధ్యాత్మిక పరిపూర్ణత, దైవత్వం యొక్క సంపూర్ణ అభివ్యక్తి, జీవితంలోనూ, నడవడికలోనూ! ఆహారం, దుస్తులు, ఆశ్రయం మరియు భద్రత, శక్తి మరియు జ్ఞానం స్వతహగా లక్ష్యాలు కావు. అవి సాధనాలు మాత్రమే, అసలు లక్ష్యం అతనిలో ఇప్పటికే ఉన్న పరిపూర్ణతను వ్యక్తీకరించుకోవడమే! వేదాంతం జీవితాన్ని సంపూర్ణతతో చూస్తుంది, దాని నేపథ్యం మనిషి. సత్యం, సౌందర్యం, మంచితనం యొక్క సంపూర్ణత్వాన్ని అన్వేషిస్తాడు మనిషి. ఈ శోధన యొక్క కొంత భాగం బాహ్య ప్రపంచంలో జరుగుతుంది, కాని చాలా ముఖ్యమైన భాగం అంతర్గత ప్రపంచంలో నిర్వహించబడుతుంది. మొదటిదాని ద్వారా భౌతిక మరియు సామాజిక శాస్త్రాల అన్వయింపుతో సాంఘిక సంక్షేమం లభిస్తుంది; రెండవది నైతికత మరియు మతం యొక్క క్రమశిక్షణ ద్వారా ఆధ్యాత్మిక స్వేచ్ఛను అందిస్తుంది. ఈ రెండిటి మధ్య సంఘర్షణ ఉండదు. ఒకటి లౌకికమూ, మరొకటి పారలౌకికమూ అయినప్పటికీ ఆ రెండు ఒకే వ్యక్తి యొక్క ఎదుగుదలలోని రెండు దశలను సూచిస్తాయి. కాబట్టి, స్వామీజీ దృష్టిలో మనిషి యొక్క నిజమైన పరాయీకరణ ఏదంటే – అతను తన దైవిక స్వభావం నుంచి వేరుపడడమే. మనిషి స్వయం-సంపూర్ణత సాధించాలంటే దీనిని అధిగమించవలసి ఉంటుంది. పని ద్వారా లేదా ఆరాధన ద్వారా లేదా మానసిక నియంత్రణ లేదా తత్వశాస్త్రం ద్వారా… వీటిలో ఏదో ఒకదాని ద్వారా లేదా అన్నిటి ద్వారా స్వయం సంపూర్ణత… ఇంకా మెరుగ్గా చెప్పాలంటే, ఆత్మసాక్షాత్కారం సాధించవచ్చు. ఆత్మసాక్షాత్కారానికి సాధనంగా స్వామీజీ పనికి ప్రాధాన్యతనిచ్చినా… ఆరాధన, మానసిక నియంత్రణ లేదా తత్వశాస్త్రం వంటి ఇతర పద్ధతులనూ సూచించారు. వాస్తవానికి, మనిషి తనలోని దైవిక స్వభావాన్ని పూర్తిగా పొందాలంటే వీటన్నింటిని సామర్యంగా మేళవించాల్సి ఉంటుంది.
స్వామీజీ వర్తమానాన్ని ప్రకాశవంతం చేసేందుకు మాత్రమే గతాన్ని ప్రస్తావించారు, ఆయన వేదాలు, ఉపనిషత్తుల యొక్క ఆధ్యాత్మిక లక్ష్యాలను కలిగి ఉన్నప్పటికీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం యొక్క భౌతిక ప్రయోజనాలను త్రోసిపుచ్చలేదు. ఆయన ఆధ్యాత్మికత, శాస్త్ర విజ్ఞానాల సంయోగాన్ని సమర్ధించారు.
డాక్టర్. ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పినట్లు “మతం లేని విజ్ఞానం గుడ్డిది. విజ్ఞానం లేని మతం కుంటిది”. వేదాంతంపై ఇదే అభిప్రాయాన్ని స్వామీజీ శిరస్సు, హృదయాల సంయోగంగా వివరించారు. ఈ సంయోగపు దూరదృష్టి ‘మనిషి’ ఆలోచనకు స్వామీజీ చేసిన గొప్ప సేవ.
సోదరి నివేదిత ఇలా అంటారు, ‘ఇదే మా మాస్టర్ జీవితంలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉన్నది, ఇక్కడే ఆయన ఓ సంగమస్థలి అవుతారు, ప్రాక్పశ్చిమాలకే కాదు; గతానికీ భవిష్యత్తుకి కూడా. అయితే అనేకమూ, ఏకమూ ఒకే సత్యమైతే – అప్పుడు – సాక్షాత్కారానికి మార్గాలైన సృష్టిలోని అన్ని రీతులు ఆ సత్యము కాలేవు. కాబట్టి లౌకిక, పారలౌకికముల మధ్య వ్యత్యాసం లేదు. శ్రమించడమంటే ప్రార్థించడమే. జయించడమంటే త్యజించడమే. జీవితమే ఓ మతం. ఇవి విడిచిపెట్టడం మరియు తొలగించడం వంటివి కలిగి ఉండటం మరియు పట్టుకోవడం వంటివి.’ ఈ గ్రహింపే – వాస్తవవిరుద్ధ రూపంలో కాకుండా జ్ఞానం మరియు భక్తిల వ్యక్తీకరణ ద్వారా స్వామీజీని కర్మ యొక్క గొప్ప బోధకుడుగా చేసింది. వారి దృష్టిలో ఆరాధన, అధ్యయనం, పొలం మరియు క్షేత్రం అన్నీ సత్యాలే; దైవం మనిషి కలిసే దృశ్యాలకు నప్పేవే, సన్యాసుల గది కావచ్చు లేదా ఆలయ ద్వారం కావచ్చు! వారి దృష్టిలో మానవ సేవకీ, దైవారాధనకీ మధ్య; పురుషత్వానికీ, విశ్వాసానికీ మధ్య; నిజమైన ధార్మికతకీ, ఆధ్యాత్మికతకీ మధ్య వ్యత్యాసం లేదు.
ఒక అభిప్రాయము ప్రకారం వారి అన్ని మాటలు, ఈ కీలకమైన విశ్వాసంపై వ్యాఖ్యానంలానే అనిపిస్తాయి.’ స్వామీజీనే ఒకసారి చెప్పినట్లు “కళ, విజ్ఞాన శాస్త్రం మరియు మతం ఒకే సత్యాన్ని వెల్లడించే మూడు విభిన్న మార్గాలు. కానీ దీనిని అర్ధం చేసుకోవటానికి, మనము అద్వైత సిద్ధాంతం కలిగి ఉండాలి.”(7).
మనిషి పని ద్వారా తనలోని దైవత్వాన్ని వ్యక్తీకరించాలి. ఇక్కడ స్వామీజీ ఉద్దేశంలో పని – “పనే దైవం”, జీవుడిని శివుడిగా సేవించు” వంటి పద్ధతికి చెందినది. జీవుడిని (మనిషిని) శివుడిగా (దేవుడిగా) సేవించడమనే ఆరాధానా స్ఫూర్తి – మనిషికి పుటం వేసి అత్యున్నత స్థితికి చేరేందుకు దోహదం చేస్తుంది, అక్కడ ఇతర దుష్ప్రభావాలన్నీ తొలగిపోతాయి. ఇతర స్ఫూర్తితో చేసిన పనులు – మొహానికి, పరాధీనతకి, వేదనకి, దాస్యానికి దారితీస్తాయి.
‘పనే దైవం’ అనే దృక్పథం – సమాజాన్ని సుసంపన్నం చేసేందుకు ఉద్దేశించిన బాహ్య చర్యల, వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక ప్రగతికి ఉద్దేశించిన అంతర్గత చర్యలను జోడిస్తుంది. ఆధ్యాత్మిక ధోరణిలో చేసే సేవలు – సేవించేవారినీ, సేవలు పొందేవారినీ – ఇద్దరినీ ఉద్ధరిస్తాయి.
మనిషి ఎల్లప్పుడూ నైతికంగా, ఆధ్యాత్మికంగా ఎదగాలని వేదాంతాలు ఎల్లప్పుడూ నొక్కి చెబుతాయి, కాబట్టి మనిషి తన సొంత ఆధ్యాత్మికాభివృద్ధిని – తన పని ద్వారా సమాజంలో వినయంతోనూ, గౌరవంతోనూ పరిగణనలోకి తీసుకుంటాడు, అప్పుడు అతని అన్ని పనులు సేవగానూ, యథార్థమైన ఆరాధనగానూ మారుతాయి. తన పని ద్వారా, అతను తన తోటి మానవుల సంక్షేమానికి పాటుపడడమే కాకుండా, వారికి ఆనందం కలిగిస్తాడు. అంతేకాదు, గౌరవభావంతో చేసే సేవల ద్వారా తాను స్వయంగా ఆధ్యాత్మిక స్థితికి చేరుతాడు. “దరిద్రదేవోభవ” అనే పదబంధాన్ని పరిచయం చేస్తూ, స్వామీజీ పేద ప్రజలను మెరుగుపరిచి, సేవ చేయాలని కోరుకున్నారు.
“జీవితమంతా ఇవ్వడమేనని తెలుసుకోండి, ఇచ్చేడట్టు ప్రకృతే మిమ్మల్ని పురిగొల్పుతుంది. కాబట్టి మనఃపూర్వకంగా ఇవ్వండి. కొంచెము ముందో వెనకో మీరు త్యజించాల్సి ఉంటుంది. కాబట్టి, యాచకుడు కాకండి, మోహరహితంగా ఉండండి. ఇదే జీవితంలోని అత్యంత దుర్భరమైన కర్తవ్యం” (8) అన్నారు స్వామీజీ.
అంటే – స్వామీజీ “దరిద్రనారాయణ” అని సంబోధించిన పేద, అణగారిన ప్రజల కోసం – జీవితంలోని అత్యంత దుర్భరమైన కర్తవ్యాలను – నిర్మోహమైన పనితో నిరంతరంగా నిర్వహించాలి మనిషి. ఉపనిషత్తుల నుండి స్వామీజీ ఇచ్చిన పిలుపు – “లేవండి! మేల్కొనండి! గమ్యం చేరేవరకు విశ్రమించకండి” మనిషిని శాస్త్ర విజ్ఞానం విజయాల పట్ల, నాగరికత, నైతికత, సామాజిక న్యాయం యొక్క విజయాల పట్ల జాగృతం చేసేందుకు ఇచ్చిన పిలుపు. ఇదే మేల్కొలుపు ప్రక్రియని మరింత లోతుగా నిర్వహిస్తే, మనిషిని దేవుని పాదాల చెంతకు చేరుస్తుంది. తనే దైవమనే గ్రహింపు ద్వారా తనను తాను గుర్తిస్తాడు మనిషి. గాంధీజీ స్వామిజీకి నివాళులు అర్పిస్తూ, “నేను వారి రచనలన్నీ క్షుణ్ణంగా చదివాను, వాటిని అవగతం చేసుకున్నాకా నా దేశం పట్ల నా ప్రేమ వెయ్యి రెట్లు పెరిగింది” (9) అన్నారు.
ఈ విధంగా స్వామిజీ యొక్క ‘మనిషి’ భావన, వారి చర్య పునరుత్తేజం పొందిన మానవాళికి కొత్త ఆశలను కల్పించింది.
ఇప్పుడు గాంధీజీ యొక్క ‘మనిషి’ భావనను పరిశీలిద్దాం.
గాంధీజీ గొప్పవాడిగా జన్మించలేదు. ఆయన ఒక సాధారణ వ్యక్తి. కఠినమైన శిలపై ఉలితో పనిచేసే శిల్పిలా తీవ్రమైన తపనతో, అద్భుతమైన సహనంతో తనని తాను మలచుకున్నారు. తాను స్వయంగా సృష్టించిన శిల్పం కంటే మరేదీ సృజనాత్మకంగా ఉండదు.
తన గురించి తనకి బాగా తెలుసు, ఆయనే ఒకచోట వ్రాశారు, “నాలో అనేక వైరుధ్యాలున్నాయని ఒప్పుకోవాలి, (కానీ) ప్రకృతిలో వలె నాలోని వైరుధ్యాల గుండా నడిచే ఒక స్థిరత్వం ఉంది, పైకి కనబడే వైరుధ్యాల మధ్య ఏకత్వం ఉంది” (10) అని.
గాంధీజీ జీవితం స్వామిజీ వలె అకస్మాత్తుగా రూపాంతరం చెందలేదు. ఆయన ధార్మిక అన్వేషణ దక్షిణాఫ్రికాలో ప్రారంభమైంది, ఆ క్రమంలోనే ఒక ఉన్నత మధ్యతరగతి న్యాయవాది నుండి ‘దిగంబర సన్యాసి’ గా (నేక్‌డ్ ఫకీర్) మార్పుచెందారు. గాంధీజీ రాజకీయ లక్ష్యం మరియు ధార్మిక అన్వేషణ ఆయన ఇరవైలలో ఉన్నప్పుడు ఏకకాలంలో ప్రారంభమైంది; వారి మతపరమైన నమ్మకాలు ఆయనకి దృఢత్వాన్నిచ్చాయి, అర్ధ-శతాబ్దం పాటు సాగిన ఘనమైన రాజకీయ జీవితానికి కావలసిన బలాన్నిచ్చాయి. మతం రాజకీయం నుండి వేరు చేయబడదని ఆయన స్పష్టం చేశారు, కానీ తాను మూఢ విశ్వాసాలను, ఆచారాల గురించి ప్రస్తావించలేదని… అన్ని మతాల కీలక నైతిక సారం గురించి మాట్లాడుతున్నానని ఆయన స్పష్టం చేశారు. తన సొంత జీవితంలో గీత బోధనలను అమలు చేయటానికి ప్రయత్నించారు, ఏ రూపంలోనైనా అహింసను పాటించకుండా పరిపూర్ణ పరిత్యాగం అసాధ్యమనే నిర్ణయానికి వచ్చారు. ఆయన అద్వైతాన్ని విశ్వసించేవారు.
మరి, గాంధీజీ ‘మనిషి’ భావనని నిర్వచించడం ఎలా? “మనిషి అంటే కేవలం మేధ కాదు, లేదా స్థూల జంతు శరీరమో, లేదా గుండె లేదా ఆత్మ మాత్రమే కాదు. పరిపూర్ణమైన వ్యక్తిని రూపొందించాలంటే ఈ మూడిటిని సక్రమమైన, పొందికతో మేళవించడం అవసరం, ఇవి విద్య యొక్క నిజమైన ఆర్థిక విధానాలను ఏర్పరుస్తాయి.”(11) కాబట్టి, ప్రారంభంలో గాంధీజీ మానవ స్వభావం యొక్క ప్రాథమిక ఐక్యతను విశ్వసించారు, మనుషులు వారి సంస్కృతి మరియు సంప్రదాయం ఆధారంగా వేర్వేరుగా ఉన్నప్పటికీ!
గాంధీజీ మానవ శాస్త్రవేత్త ఎన్.కె. బోస్‌తో మాట్లాడుతూ “అరుదైన క్షణాలలో అత్యున్నత ఆలోచనా విధానాలలో చేరుకున్నందుకు కాకుండా నిత్య జీవితంలో పాటించే ఆదర్శాలను బట్టి మనిషిని అంచనా వేయాలి” (12) అన్నారు. ఇలా చెప్పి, మనిషిని అతని రోజువారీ పనుల ఆధారంగా అంచనా వేయాలనే నిర్ధారణకి వచ్చారు.
మనిషి ఆత్మకి నాశనం లేదని, ప్రతీ వ్యక్తిలోనూ, పైకి ఎంత దుర్మార్గుడుగా కనిపించినప్పటికీ అంతర్గతంగా ఒక నిగూఢ ఔన్నత్యం ఉంటుందనీ… అదే దివ్య స్ఫులింగమనీ, దానిని రగిలించవచ్చని గాంధీజీ విశ్వసించారు.
మహాత్మా గాంధీ యొక్క ధార్మిక అన్వేషణ ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడం సాయపడడమే కాకుండా, దక్షిణాఫ్రికాలో జాత్యహంకారాన్నీ, భారతదేశంలో వలసవాదాన్ని ఎదుర్కొనడంలో ఆయన రాజకీయ నైపుణ్యానికి కూడా సహాయపడింది. ఆయనలో పరిణామం చెందిన సత్యగ్రహం భావన, దానిని అమలు చేసిన విధానం – సువిస్తార సమూహమైన మానవాళి యొక్క సహజ స్వభావాన్ని అర్ధం చేసుకోడంలో ఆయనకి తోడ్పడింది. ఇతరుల కంటే ధర్మావలంబుకులైన వ్యక్తులకు సత్యాగ్రహం యొక్క మౌలిక భావనలను ఆమోదించడం సులువని ఆయన నిర్ధారణకు వచ్చారు, అది పోరాడదగినదనీ, ఒకవేళ చనిపోయినా ఆత్మకి మరణం ఉండడనీ, ఏ పీడించేవాడయినా నశ్వరమైన మానవ స్ఫూర్తిని నాశనం చేయలేడని నమ్మారు.
గాంధీజీకి దేవునిపట్ల అజేయమయిన విశ్వాసం ఉంది. గాంధీజీ దృష్టిలో దైవమంటే – సత్యం, ప్రేమ మరియు న్యాయం. దేవుడు మరియు మనిషి కలిసి ఉండాలని ఆయన నమ్మారు; లేదంటే, దేవుడు అదృశ్యమవుతాడు, జీవితమనే అరణ్యంలో మనిషి ఒంటరిగా మిగిలిపోతాడు. కానీ ఇది అసాధ్యం. ప్రతి మనిషిలోనూ ఓ ఆత్మ ఉంటుందని ఆయన నమ్మారు. భౌగోళిక, చారిత్రక స్థితిగతుల కారణంగానూ, వేలాది సంవత్సరాల క్రితం నాటి పరిస్థితుల మనుషులలో ఎటువంటి విభేదాలు ఉన్నప్పటికీ, ప్రతీ ఒక్కరిలోనూ తోటివారితో సమానమైన ఆత్మ ఉంటుందని గాంధీజీ విశ్వసించారు. దేవుడు మనిషిని తన ప్రతిబింబంలానే సృష్టించాడని బైబిల్ చెబుతుంది. ప్రతీ మనిషిలోనూ దేవుడుంటాడని గీత చెబుతుంది. బుద్ధుడు, మహ్మద్ ప్రవక్త కూడా ఇదే సత్యాన్ని ధ్రువీకరించారు. అందుకే, గాంధీజీ మానవ ఆత్మల సమానత్వాన్ని నమ్మారు.
ఈ సమానత్వంలో గాంధీజీ విశ్వాసం – ఏ పురుషుడు లేదా స్త్రీ గాని – తమలోని ఆత్మ యొక్క బలాన్ని గుర్తించలేనంత; జీవితం ప్రమాదంలో ఉన్నప్పుడు ఆత్మని ఉపయోగించుకుకోకుండా ఉండలేనంత చిన్నవారు, బలహీనమైనవారు లేదా నిస్సహాయులు కారనే నమ్మకం నుంచి అంకురింమంది. గాంధీజీ సర్వోత్కృష్టుడైన దేవుడిపై నమ్మకం ఉంచడమే కాకుండా, దైవంలో అంతర్భూతమైన సమానత్వాన్ని ప్రతీ స్త్రీలోనూ, పురుషుడిలోనూ దర్శించారు.
“ఓ వ్యక్తి ఆధ్యాత్మికత సాధించి, అతని చుట్టూ ఉన్నవారు బాధపడుతుంటే నేను దానిని విశ్వసించను. నేనెప్పుడూ మనుషులలోని ఐక్యతని ప్రధానంగా నమ్ముతాను, ఆ మాటకొస్తే, మొత్తం వారి జీవితకాలమంతా నమ్ముతాను” (13) అంటారు గాంధీజీ. మనిషి యొక్క ఆవశ్యక ఐక్యతను నమ్మినందున, ఆయన అనంతమైన వినయంతోనూ, సానుభూతితోనూ ఉండేవారు, సత్యం యొక్క ప్రతి వాదనను పరిగణనలోకి తీసుకున్నారు. కానీ ఆయన చాలా పట్టుదలగల వ్యక్తి, సత్యదూరమైన స్వల్ప విషయాలను తిరస్కరించేందుకు కూడా నిశ్చయించుకుని ఉండేవారు.
భారత సంప్రదాయంలో మనిషిని హేతుబద్ధమైన జంతువుగా; మరింత వివేచనా శక్తి గల జంతువుగా అర్థం చేసుకోకూడదని గాంధీజీ నొక్కిచెప్పారు. అలా కాకుండా మనిషిని ఒక ‘ఆధ్యాత్మిక జీవి’గా, ‘స్వీయ-ఉనికి’ లేదా ‘సొంత ఎరుక’ సామర్థ్యం గల జీవిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈ అవగాహన కారణంగానే, భారతదేశంలో నైతికత, మతాలను మనిషి యొక్క అవగాహన మరియు మానవ ఉనికి మరియు చర్యకి చెందిన మౌలిక అంశాలుగా పరిగణిస్తారు. ఒకసారి మానవ ఉనికిని దాని సర్వోత్కృష్ట ఆదర్శ స్వభావసహితంగా అర్థం చేసుకుంటే, దాని ప్రాముఖ్యతని గ్రహించడంలో మానవ ప్రయత్నం యొక్క ప్రాముఖ్యత స్పష్టమవుతుంది.
ఈ సర్వోత్కృష్టమైన ఆదర్శం – సంపూర్ణతకి, లేదా శుద్ధ ఆదర్శ-సత్యానికి లేదా మనకున్న పరిమితుల వల్ల మనమెన్నడూ గ్రహించలేని దైవానికి… తనని తాను సూచించుకుంటుందని గాంధీజీ విశ్వసిస్తారు. కానీ గాంధీజీ అభిప్రాయం ప్రకారం, మనం నశ్వరమైన చట్రాలకు లోబడి ఉండడం వల్ల… మనకి మన నశ్వర చట్రాలను అధిగమించి… దైవత్వాన్ని సంపూర్ణంగా సాధించడం సాధ్యం కాదు. అందువల్లే మనం బాధపడతాం, మనపై మనకి పరిపూర్ణ విశ్వాసం ఉండవలసిన ఆదర్శానికి; ఇతరుల పట్ల వినయం ఉండాల్సిన ఆదర్శానికి లొంగిపోయి చర్యలు చేపడుతాం. మనిషిలోని ఈ రెండు గుణాల మేళవింపు అతనిలోంచి – సత్యాన్ని సాధించడంలో అవరోధాలుగా ఉండే – వంచనని, పిరికితనాన్ని, హింసనీ తొలగిస్తాయి. మనలో అటువంటి సజీవ విశ్వాసం చాల అవసరం ఎందుకంటే, అది మాత్రమే మనకి సత్యాన్ని అన్వేషించడంలో అవసరమైన దృఢమైన సంకల్పాన్ని మనకిస్తుంది.
వినయం, తోటివారి పట్ల కారుణ్యం తప్పనిసరి, ఎందుకంటే, “సంపూర్ణ వినయం లేని ఏ శరీరమూ సత్యమును కనుగొనలేదు. మీరు సత్యం యొక్క సముద్రపు గర్భంలో ఈత కొట్టాలంటే, మిమ్మల్ని మీరు శూన్యానికి తగ్గించుకోవాలి.”(14)
అనంతాన్ని లేదా దైవాన్ని ‘ప్రేమ ద్వారా’ సమీపించవచ్చని గాంధీజీ చెప్పేవారు. అంటే గాంధీజీ ఉద్దేశంలో ‘దైవ ప్రేమ’ అనేది దానిని మనం ఆస్వాదించేడప్పుడు గాక, దానికై బాధల్లో ఉన్నప్పుడు అనుభవమవుతుంది. “వేదన అనేది మానవుని యొక్క ధర్మం… అది మనిషి అంతర్గత అవగాహన వెల్లడిస్తుంది.” అందువల్ల ఆయన విశ్వాసానికీ, వినయానికి ప్రాధాన్యతనిచ్చారు. గాంధీజీ మనిషి యొక్క మౌలికమైన పరిమితులను బహిర్గతం చేస్తారు. ఈ పరిమితులను అధిగమించడానికి మరియు ఆదర్శపు దూరదృష్టి స్పష్టంగా ఉండేందుకు వారు తీవ్ర ప్రయత్నాలను ప్రోత్సహిస్తారు.
గాంధీజీ దృష్టిలో నైతికత అనేది సాంఘిక సందర్భంలో వ్యక్తి ప్రవర్తన యొక్క సమస్య; క్రమశిక్షణ ద్వారా మార్గనిర్దేశం పొందుతాడు మనిషి, ఉదాహరణకి, చట్టం యొక్క అంగం సరైన మార్గంలో నడిచేట్టు అతన్ని నియంత్రించకుండా ఉండేందుకు తనని తాను అదుపులో ఉంచుకుంటాడు. కాగా మానవ పరిపూర్ణతకు దీన్ని ఓ పిలుపుగా భావించినా, మానవతావాద, దయామయ సమాజంలో ఒక క్రమం కొరకు అభ్యర్ధన కూడా.
గాంధీజీ యొక్క ఈ అభిప్రాయం స్వామిజీ అభిప్రాయంతో ఏకీభవించగా, ఎంఎన్ రాయ్ లాంటి రాడికల్ మార్క్సిస్ట్ ఆలోచనాపరుడు కూడా మనిషి నుంచి ఇదే ఆశిస్తున్నారని తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది, ఆయన అన్నారు: “మంచి సమాజం మంచి మనుషుల ద్వారా మాత్రమే నిర్మించబడుతుంది; మనిషి ప్రకృతిలో ఒక భాగం; ప్రకృతి యొక్క నేపథ్యం నుండి ఎదుగుతాడు, జడమైన పరిణామక్రమం నేపథ్యం నుంచి ఎదిగి ప్రకృతిని జీవిస్తాడు. ఈ మానవతావాదం అనేది తాత్కాలికంగా ఏర్పడలేదు… చట్టంతో నడిచే పొందికైన భౌతిక విశ్వంలో భాగంగా మానవ స్వభావం కూడా అనుగుణంగా ఉంటుంది; మానవ స్వభావం కూడా తార్కికమైనది మరియు హేతుబద్ధమైనది, ఇవి చట్టాన్ని కాపాడేవారి యొక్క వ్యక్తీకరణలు, తత్ఫలితంగా మానవ స్వభావంలో నైతిక నిర్ణయ సామర్ధ్యం అంతర్లీనంగా ఉంటుంది.” (16)
గాంధీజీ మనుషులలో ఉండే ఆత్మ శక్తిని నమ్మారు, అందుకే దక్షిణాఫ్రికాలోనూ, భారతదేశంలోను ‘మేల్కొనండి! లేవండి! అహింసా మార్గంలో చర్యలకు ఉపక్రమించండి’ అని తన ప్రజలకు పిలుపునిచ్చారు. దీనికి అద్భుతమైన ప్రతిస్పందన వచ్చింది, దైవంపట్ల, మనిషిపట్ల గాంధీజీకి ఉన్న విశ్వాసాన్ని సమర్థించింది. గాంధీజీ కార్యాచరణకు సాధనాలు సత్యాగ్రహం, అహింస. సత్యాగ్రహమంటే సత్యానికై పట్టుపట్టడం. అహింస, సత్యాగ్రహం అనేవి సామాజిక అన్యాయాలకి వ్యతిరేకంగా జరిపే పోరాటంలో పద్ధతులు. సామాజిక మరియు రాజకీయ అణచివేతకు వ్యతిరేకంగా గాంధీజీ పోరాటం కోసం (సత్యాగ్రహం, అహింసల పోరాట పద్ధతి) జనించినవి. వీటికి మూలం నైతికతలో ఉంది. “సత్యం, అహింస అనేవి నాకు ఒకే నాణెం యొక్క రెండు ముఖాలు” అని గాంధీజీ నొక్కి చెప్పారు. “నా లక్ష్యం, కేవలం భారతీయ మానవత్వం యొక్క సోదరభావం కాదు, నా లక్ష్యం కేవలం భారతదేశపు స్వాతంత్ర్యం కాదు, నేడు అది నిస్సందేహంగా నా మొత్తం జీవితంలోనూ, మొత్తం సమయంలోనూ లీనమైపోయింది. అయితే దేశానికి స్వాతంత్ర్యం సాధించడం ద్వారా మానవాళి యొక్క సౌభ్రాతృత్వాన్ని గ్రహించి లక్ష్యాన్ని కొనసాగవచ్చని ఆశిస్తున్నాను” (17) అని 1929లో గాంధీజీ (స్వామిజీ లానే) రాసుకున్నారు.
15 ఫిబ్రవరి, 1948 నాడు పాకిస్థాన్‌లోని కరాచీలో రామకృష్ణ మఠం మరియు మిషన్ నిర్వహించిన ఓ బహిరంగ సమావేశంలో ప్రసంగిస్తూ – కొత్త ఢిల్లీలో జనవరి 30, 1948 న హత్య చేయబడిన గాంధీజీని స్మరిస్తూ – “సమకాలీన ప్రజానాయకులలో తన ప్రత్యేకత ద్వారా, విశిష్టత ద్వారా గాంధీజీ సమున్నతంగా నిలుస్తారు. తాను ప్రజలకు చెప్పినదాన్ని ఆచరించి చూపిన నాయకులకు ఆయన ఉదాహరణ; అది రాజకీయ రంగం లేదా ఆర్థిక రంగం లేదా మతం లేదా వ్యక్తిగత నైతికత కావచ్చు, తన జీవితంలో తాను పరీక్షించి నిర్ధారించుకున్నవాటినే ప్రజలకు బోధించిన నేత గాంధీజీ” (18) అన్నారు స్వామీ రంగనాథానంద.
పైన ఉదహరించిన అంశాలు – మనిషి మీద, మనిషి గౌరవం, విధి పట్ల, తన సహజ స్వభావాన్ని సాధించడంలో మనిషి సామర్థ్యం పట్ల గాంధీజీ అంచలమైన విశ్వాసాన్ని వెల్లడిస్తాయి. ఎవరైనా తమ సామర్ధ్యం గ్రహించడం ద్వారానే ‘సొంత ఎరుక’ను సాధిస్తారని స్పష్టంగా తెలుస్తుంది. ఈ సందర్భంగా గుర్తించదగిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, గాంధీజీ యొక్క మానవతావాదం, స్వామీజీ యొక్క మానవతావాదంలానే మనిషి యొక్క సామర్ధ్యాలపై ఉన్న విశ్వాసం నుంచి; తన సామర్థ్యాన్ని గ్రహించడానికి మనిషి తగినంత కృషి చేయాలనే నమ్మకం నుండి ఏర్పడినదే.
ముగింపు:
స్వామీజీ పంతొమ్మిదవ శతాబ్దపు అత్యంత ఆకర్షణీయమైన భారతీయ ఆధ్యాత్మిక నాయకుడు, గాంధీజీ ఇరవయ్యవ శతాబ్దపు నేత. వారు సమకాలీకులే అయినా, వారు ఎన్నడూ కలుసుకోలేదు, సంప్రదించుకోలేదు. వారి జనజీవితం ఒకే సమయంలో మొదలైందనే వాస్తవం తరచూ నిర్లక్ష్యం చేయబడింది. చికాగో పార్లమెంటు ఆఫ్ రిలీజియన్‌లో స్వామీజీ విజయవంతమైన ప్రసంగం చేసినది 1893లో. అదే సంవత్సరంలో దక్షిణాఫ్రికాలో జాతివివక్షతకు వ్యతిరేకంగా గాంధీజీ తన పోరాటం ప్రారంభించారు. వారిద్దరూ భిన్నమైన నేపథ్యాల నుండి వచ్చారు. స్వామిజీ 1902లో 39 సంవత్సరాల వయస్సులో పరమపదించారు, 24 సంవత్సరాల వయస్సులో గాంధీ రాజకీయ రంగంలో అడుగుపెట్టారు, 1948లో మరణించే వరకూ జాత్యహంకారానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడారు.
ఈ తేడాలు ఉన్నప్పటికీ, స్వామీజీ మరియు గాంధీజీల ఆలోచనా విధానాలు, బోధనలు చాలా సారూప్యతను కలిగి ఉన్నాయి. సరైన దృక్పథంలో ఈ అంశాన్ని పరిశీలిస్తే, స్వామీజీ అసంపూర్ణంగా విడిచిపెట్టిన భారతదేశపు సంస్కరణ మరియు పునరుద్ధరణ పనిని గాంధీజీ కొనసాగించారు.
ఇప్పుడు మానవాళి మరోసారి కూడలిలో నిలబడింది. ప్రబలమైన హింస తీవ్రవాదం రూపం దాల్చి – ఆహారం, నీరు మరియు పర్యావరణ సంక్షోభాలతో సతమతమవుతున్న మనిషి ఉనికినే ప్రమాదంలో పడేస్తోంది.
నేడు భారతదేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాలు – విశ్వాసం, శీలాల సంక్షోభం, మానసిక మరియు నైతిక క్షయం, ఇంకా సంప్రదాయిక విలువల విచ్ఛిన్నం. ఈ ఇద్దరు జాతికిచ్చిన ప్రేరణాత్మక పిలుపు – బధిరులైన భారతదేశపు విధానకర్తలకు వినబడకపోవడం వారు దేశాన్ని మరింత లోతైన సంక్షోభంలోకి నెడుతున్నారు. స్వామీజీ, గాంధీజీల యొక్క ప్రాసంగిత నేడు మరింత ఎక్కువగా ఉంది.
భారతదేశం మరియు ప్రపంచమంతా రక్షింపబడాలంటే – స్వామీజీ, గాంధీజీల ఉద్దేశంలో ‘మనిషి’ అంటే దివ్యమైన మరియు ఆధ్యాత్మిక జీవి అనే భావనని జనబాహుళ్యంలో మరోసారి విస్తృతంగా వ్యాపించజేయాలి.
మూలం: శౌరీబంధు కర్
అనువాదం: కొల్లూరి సోమ శంకర్
(మూల రచన “The Concept of Man in the Philosophy of Mahatma Gandhi and Swami Vivekananda” పేరిట ఒడిశా రివ్యూ అక్టోబర్ – 2013 సంచికలో ప్రచురితం)
ఆంగ్లంలో మూల వ్యాసానికి ఆధార గ్రంథావళి:
- Collected works of Swami Vivekananda.
- Ibid.
- The meeting of East & West in Swami Vivekananda, – Swami Ranganathananda. Calcutta, 1968 P.-200.
- Collected works of Swami Vivekananda.
- CW Vol-I P.-257, 11th edition.
- CW Vol-III P.-I93, 4th edition.
- Introduction to the CW of Vivekananda, Vol-I, PP. xv-xvi.
- CW Vol- II, P.5-6.
- Young India, February 13, 1930 P.-52.
- Sadhana: Individual and universal.
- N.K. Bose: My day with Gandhi (Calcutta-I974), P.-22.
- Sadhana: Individual and universal, P.-I5.
- Sadhana: Individual and universal, P .-26.
- Sadhana: Individual and universal, P .27.
- Politics, Power and Parties: M.N. Roy, P.-23.
- In search of Gandhi : B.R. Nanda (Oxford 2002), P.-62.
- Eternal values for a changing society Vol-iv, P.-280.