స్వామి స్నేహితులు : వెనక్కి తిరిగిన కాలచక్రం

1
2

1

ఆర్ కె నారాయణ్ పరిచయం:

[dropcap]1[/dropcap]970 చివరి దశకంలో.. నేను అప్పుడు 8,9,10వ తరగతుల్లో ఉన్నాను… ఆర్.కె. నారాయణ్ రాసిన ‘స్వామి స్నేహితులు’ పుస్తకం మా ఊరు బోథ్ లైబ్రరీలో కంటబడింది. అది ఆయన ఇంగ్లీష్‌లో రాసిన Swamy and Friends పుస్తకానికి అనువాదం. దక్షిణ భారత పుస్తక సంస్థ వారి సహకారంతో విజయవాడ ఆదర్శ గ్రంథ మండలి వారు తెలుగు అనువాదాన్ని1959లో ప్రచురించారు. అనువాదం చేసింది శ్రీనివాస చక్రవర్తి. అప్పట్లో అనువాదం ఎవరు చేశారో గుర్తుకు లేదు కాని మూల రచయిత ఆర్ కె నారాయణ్, పుస్తకంలో బొమ్మలు వేసిన ఆర్ కె లక్ష్మన్ మాత్రం గుర్తుండి పోయారు. అట్ట మీద, పుస్తకం లోపల వేసిన బొమ్మలు, పుస్తకంలో ప్రధాన పాత్రలైన స్వామి, మణి, రాజంల చిత్రాలు మనసులో నిక్షిప్తం అయిపోయినాయి. ఆ రోజుల్లో ఆ పుస్తకం మాకు ఆ పుస్తకం నిత్యపారాయణ గ్రంథం. ఇంగ్లిష్ పాఠ్య పుస్తకాల్లో కూడా swamy and friends పుస్తకం లో నుంచి కొన్ని భాగాలు ఉండేవి. ఆర్ కె నారాయణ్ ఇతర కథలు కూడా హై స్కూలు, ఇంటర్ పాఠ్య పుస్తకాల్లో ఉండేవి.

బోథ్‌లో మా స్కూలు జూనియర్ కాలేజికి అనుబంధంగా ఉండడం చేత జూనియర్ కాలేజి అధ్యాపకులు కూడా మాకు ఇంగ్లిష్, లెక్కలు, భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ తదితర సబ్జెక్టులు బోధించేవారు. అట్లా ఇంగ్లీష్‌లో మాకు శ్రీనివాసరావు అని ఒక సీనియర్ అధ్యాపకులు ఇంగ్లిష్ పాఠాలు చెప్పినారు. ఆయన సబ్జెక్టు ఆర్థిక శాస్త్రం అయినా కూడా ఇంగ్లిష్ అంటే ఆయనకు మక్కువ. హిందూ పత్రికకు వ్యాసాలూ కూడా రాసేవారు. మా బోథ్‌పై కూడా “A Place called Boath” అని ఒక వ్యాసం రాసినాడు. ఆయన తర్వాత పుల్లయ్య గారు మాకు ఇంగ్లిష్ బోధించినారు. వీరిద్దరి బోధనల వలన ఇంగ్లిష్ భాష కొంత వొంటబట్టింది. వీరు పాఠంతో పాటు ఆ రచయిత రాసిన ఇతర రచనలను కూడా పరిచయం చేసినారు. అట్లా ఆర్ కె నారాయణ్ రాసిన “ది గైడ్, బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, పెయింటర్ ఆఫ్ సైన్స్” మొదలైన రచనలు పరిచయం అయినాయి.

స్నేహితుల అన్వేషణ:

ఆ రకంగా ఆర్.కె. నారాయణ్ రాసిన స్వామి స్నేహితులు పుస్తకం నా మనసు మీద వేసిన ప్రభావం ఎంతటిదంటే.. ఇవ్వాళ్ళ 57 ఏండ్ల వయసులో కూడా ఆ పుస్తకాన్ని పది పన్నెండు సంవత్సరాల పిల్లాడిలా చదివేసాను. నా కాల చక్రం మళ్ళీ వనక్కి తిరిగింది. నన్ను ఆ బాల్యపు లోకం లోనికి తీసుకు వెళ్ళింది. మాల్గుడిలో స్వామీ స్నేహితులు తిరిగిన అన్ని రకాల ప్రదేశాలు బోథ్‌లో కూడా ఉన్నాయి ఒక్క రైల్వే స్టేషన్ తప్ప. మా ఊర్లో పారే పెద్ద వాగు మాల్గుడిలో ఉన్న సరయూ నదిని తలపించేది. మా పెద్ద బడి (జిల్లా పరిషత్ హై స్కూల్) స్వామి స్నేహితులు చదువుకున్న ఆల్బర్ట్ మిషన్ స్కూల్ లాగా ఊహించుకున్నాను. బడిలో టీచర్లు, వారికి పిల్లలు పెట్టుకున్న మారు పేర్లు, విశాలమైన మైదానం, చుట్టూ అడవి, సెలయేర్లు, పొచ్చెర, కుంటాల జలపాతాలు, గుట్టలు ఇవి ఉండనే ఉన్నాయి. ఈ పుస్తకం మళ్ళీ నా జీవితంలోని రావటం నన్ను ఉద్వేగానికి లోను చేసింది. ముప్పై ఏండ్లుగా ఈ పుస్తకం కోసం నా వెతుకులాట జూన్ 21, 2020 న సఫలం అయ్యింది.

1978లో పది పాసయిన తర్వాత బోథ్‌లో జూనియర్ కాలేజి ఉన్నప్పటికీ లెక్కల సబ్జెక్టు లేకపోవడం చేత ఇంటర్ చదువు కోసం మా జిల్లా కేంద్రమైన ఆదిలాబాద్ వెళ్ళవలసి వచ్చింది. అక్కడ మా మేనమామ గోవిందరావు దేశ్ పాండే ఇంట్లో ఉండి ఇంటర్ చదువుకున్నాను. అదే కాలేజిలో డిగ్రీ చదువుతున్న మా మేనబావ సతీష్ చంద్ర సహచర్యం నాకు తోడయ్యింది. ఉదయం 7 నుంచి 7.30 దాకా రేడియో సిలోన్‌లో హిందీ సినిమా పాత పాటలు వినటం ఒక తప్పనిసరి దినచర్య. ఆ కార్కక్రమం విశేషం ఏమిటంటే.. చివరి పాట సైగల్ పాటను వేసేవారు. అట్లా సైగల్ పరిచయం అయినాడు. ఆదిలాబాద్‌లో పాత హిందీ సినిమాలు సతీష్‌తో కలిసి చూసేవాడిని. ఆదిలాబాద్‌లో జూనియర్, డిగ్రీ తరగతులు ఒకే కాలేజిలో జరిగేవి. ఆదిలాబాద్‌లో చదువు, ఆటా పాటలు, విద్యార్థి సంఘ రాజకీయాలతో ఉద్వేగభరితంగా సాగింది. ఆదిలాబాద్‌లో జిల్లా కేంద్ర గ్రంథాలయం, కాలేజి గ్రంథాలయం నా పుస్తకాల దాహాన్ని తీర్చే కేంద్రాలుగా ఉండేవి. నా తిరుగుళ్ళు చూసి మా మామి వీడెక్కడ చెడిపోతాడో అనే భయంతో నన్ను కనిపెట్టుకొని ఉండేది. అయితే ఇంటర్‌లో కాలేజి టాపర్‌గా నిలిచి వారి భయం అబద్దం అని రుజువు చేసాను. రెండు సంవత్సరాల ఇంటర్ చదువు వలన ఆదిలాబాద్‌లో మంచి మిత్ర బృందం ఏర్పడింది. ఆ స్నేహాలు ఇప్పటికీ అపురూపంగా కొనసాగుతున్నాయి. ఇంటర్ తర్వాత 1981లో ఇంజనీరింగ్ చదువు కోసం హైదరాబాద్ చేరుకున్నాను. అప్పటికే మా బోథ్, ఆదిలాబాద్ లైబ్రరీల పుణ్యమాని చదవడం బాగానే అలవడిన కారణంగా నా పాకెట్ మనీలో పెద్ద మొత్తం పుస్తకాల కొనుగోలు కోసమే ఖర్చు పెట్టేవాన్ని. అప్పట్లో సోవియట్ యూనియన్ నుంచి తక్కువ ధరకే పిల్లల పుస్తకాలు అందుబాటులో ఉండేవి. సెలవులకు ఇంటికి వెళ్ళేటప్పుడు మా మేనల్లుల్లకు, మేన కోడళ్ళకు బోలెడన్ని సోవియట్ పుస్తకాలు కొని తీసుకుపోయే వాడిని. హైద్రాబాద్‌లో అబిడ్స్ ఫుట్‌పాత్ మీద పుస్తకాలు కొనేవాడిని. అట్లా స్వామి స్నేహితులు అబిడ్స్ ఫుట్‌పాత్‌పై మళ్లీ కనబడింది. వెంటనే కొని బైండింగ్ చేపించి మా మేనల్లుడికి కానుకగా ఇచ్చాను. ఇంజనీరింగ్ చదువు 1985 పూర్తి అయ్యాక ఒక సంవత్సరం మహారాష్ట్రా పూసద్‌లో ఒక ఇంజనీరింగ్ కాలేజిలో అధ్యాపకుడిగా పని చేసి 1987 సాగునీటి శాఖలో జూనియర్ ఇంజనీర్‌గా చేరాను ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో. 1989లో హైదరాబాద్‌కి బదిలీ మీద వచ్చాను. ఇక అప్పటి నుండి ఉద్యోగం సద్యోగం అన్నీ హైదరాబాద్ లోనే. ఆబిడ్స్ ఫుట్‌పాత్ కొనుగోళ్ళు వీలుచేసుకొని చేస్తూ ఉండేవాడిని.

స్వామి మిత్రులు:

ఇక మా బిడ్డలు చదుకునే వయసు వచ్చేసరికి అబిడ్స్ ఫుట్‌పాత్ మీద కూడా ఈ పుస్తకం కంటబడలేదు. అయితే 1996 ఎన్ బి టి వారు స్వామి మిత్రులు పేరిట ఒక పుస్తకాన్ని ప్రచురించారు. అనువాదం డా.వాసిరెడ్డి సీతాదేవి. పుస్తకంలో బొమ్మలు వేసింది మనోభిరామ చక్రవర్తి. ఈ పుస్తకాన్ని మా పెద్దమ్మాయి అంజలికి, ఆ తర్వాత వెన్నెలకు కొని ఇచ్చాను. ఇప్పుడు ఈ పుస్తకం కూడా అందుబాటులో లేదు. అయితే స్వామి స్నేహితులు నా మదిలో మెదులుతూనే ఉంది. నేను చదివిన పుస్తకం మా బిడ్డలకు ఇవ్వాలన్న కోరిక రగులుతూనే ఉన్నది. కె.పి. అశోక్‌ను అడిగాను. ఆయన కూడా దొరకబట్టలేకపోయాడు. మా బోథ్ లైబ్రరీలో వెతికాను. అది ఎప్పుడో చోరి అయిపొయింది. మొన్న అమెరికా నుంచి మా పెద్దమ్మాయి ఫోన్ చేసి తన చిన్నప్పటి పుస్తకాలు అన్నీ స్వామి మిత్రులు సహా అమెరికా పంపమని అడిగింది. పుస్తకాలు అన్నీ వెతికి బయటకు తీశాను అయితే స్వామి మిత్రులు మాత్రం దొరక లేదు. దొరికిన పుస్తకాలను కొరియర్ చేసాను. స్వామి మిత్రులు PDF కాపి కె పి అశోక్ కుమార్ పంపితే ఆ PDF కాపీని మా బిడ్డకు మెయిల్ చేసాను. అయితే స్వామి స్నేహితులు కావాలని అశోక్‌ను అడిగాను. ఆయన కూడా ఆ పుస్తకం వెతుకులాటలో ఉండడగానే.. అనిల్ బత్తుల గారు గతంలో అనేక పాత పుస్తకాలను పరిచయం చేస్తూ ఫేస్‌బుక్ లో పోస్టులు పెట్టడం గుర్తుకు వచ్చి ఆయన వాల్ మీద వెదికాను. అక్కడ దొరికింది ఈ పుస్తకం. సంతోషానికి హద్దులు లేకుండా పోయింది.

జూన్ 21 న దొరకటం, ఆ దినం ఫాదర్స్ డే కావటంతో వెంటనే లింక్‌ను మా బిడ్డలకు ఫాదర్స్ డే కానుకగా పంపించాను. ఆ తర్వాత రెండు రోజులకు దత్తసాయి గ్రాఫిక్స్ యజమాని, నా చిరకాల మిత్రుడు అయిన శ్రీ వీరయ్య గారు ఆ పుస్తకాన్ని ప్రింట్ చేసి పర్ఫెక్ట్ బైండింగ్ చేసి నా చేతిలో పెట్టాడు. అనిల్ గారికి ఫేస్‌బుక్ మాధ్యమంగా కృతఙ్ఞతలు చెప్పాను. నా ఫేస్‌బుక్ వాల్ మీద, నా బాల్య మిత్రులు చాలా మందికి వాట్సాప్ ద్వారా లింక్ పంపినాను. అందులో చాలా మంది పుస్తకం ప్రింట్లు తీసుకొని తమ బిడ్డలకు అందించారని, తామూ చదివారని తెలిసింది. ముఖ్యమంత్రి గారి పి ఆర్ వొ గటిక విజయ్ కుమార్ గారు నా కంటే ముందే ప్రింట్ తీసుకొని నాకు ఫోటో పంపించి నన్ను రెచ్చగొట్టినారు. సాక్షి జర్నలిస్టు మిత్రుడు రాజశేఖర్ రెడ్డి కూడా ప్రింట్ తీసుకున్నట్టు చెప్పాడు. మొత్తం మీద పుస్తకాన్ని తనివితీరా తడిమి పుస్తకాన్ని ఆవాహన చేసుకొని టైమ్ మెషీన్ లో కూసోని కాల చక్రాన్ని వెనక్కి తిప్పి పుస్తకం లోపలి ప్రపంచం లోనికి.. మాల్గుడిలోకి వెళ్లి స్వామి, మణి, రాజం బృందంలో సభ్యుడిగా వారి వెంట తిరిగాను. మూడు రోజులు ఆ లోకంలో గడిపి, స్వామి, మణి లతో కలిసి రాజంకు వీడ్కోలు పలికి టైమ్ మెషీన్ ఎక్కి, కాల చక్రాన్ని ముందుకు తిప్పి బయటకు వచ్చాను.

2

ఫ్రెండ్స్ క్రికెట్ క్లబ్ జ్ఞాపకాలు:

ఇక మాల్గుడిలో అన్ని అనుభవాలను కాదు గాని వారి మాల్గుడి క్రికెట్ క్లబ్ (MCC) విశేషాలు చదువుతుంటే మా చిన్నప్పటి క్రికెట్ అనుభావాలు యాదికి వచ్చాయి. టైమ్ మెషీన్‌ను మళ్ళీ వెనక్కి తిప్పి వాటిని మీతో పంచుకుంటాను.

మేము హైస్కూలు స్థాయికి వచ్చేటప్పటికి ఊర్లోకి క్రికెట్ ప్రవేశించింది. మా సీనియర్లు 1972 నాటి నుండే క్రికెట్ ఆడటం ప్రారంభించినారు. మ ఊరిలో ఫ్రెండ్స్ క్లబ్ అని చాలా ఏండ్ల నుంచి ఉన్నది. ఆ పేరు మీదనే ఫ్రెండ్స్ క్రికెట్ క్లబ్ ఏర్పాటు అయ్యింది. జూనియర్లము వారితో సామాన్లు మోసుకొని వెళ్ళటం, ఫీల్డింగ్ చేయడం చేసేది. ఆట ఆఖరుకు దయతలచి ఒక ఓవరో రెండు ఓవర్లో బ్యాటింగ్‌కి అనుమతి ఇచ్చేది. మేము చిన్న పిల్లలం కనుక బాల్ ను మెల్లగా వేసేవారు. అటు సీనియర్ల వద్ద ట్రయినింగ్ అవుతూనే మా జూనియర్ల జట్టు ఒకటి తయారు చేసుకున్నాము. సీనియర్ల జట్టులో అరివీర భయంకర ఫాస్ట్ బౌలర్లు రాజు, గిరీష్, మహేష్, రమేశ్‌లు ఉండేవారు. ఆకుల నారాయణ ఆఫ్ స్పిన్నర్. శేఖర్, ముర్తుజా ఖాన్ మీడియం పేసర్లు. మా చిన్నన్న గిరిధర్ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్. అందరి ఆశలు ఆయన మీదనే ఉండేవి. వామన్ రావు సీనియర్ జట్టు కెప్టెన్. ఆయన తర్వాత రాజు కెప్టెన్ అయ్యాడు. శ్యాం (ఇప్పుడు దేవాదాయ శాఖ అప్పిలేట్ ట్రిబ్యూనల్ ఛైర్మన్) జట్టుకు మేనేజర్. అందరిని నవ్వించి స్పూర్తిని నింపేవాడు. జట్టు బ్యాటింగ్‌లో కొంత వీక్ గానే ఉండేది. మొదట్లో బ్యాట్‌కు స్ట్రోక్ బాగా ఉండడానికి పైన లిన్ సీడ్ నూనె పట్టించేది. ఆ తర్వాత కవర్ బ్యాట్ లు వచ్చిన తర్వాత నూనె పట్టించే బాధ తప్పింది.

టెస్ట్ మ్యాచులు:

సీనియర్ల జట్టు కొద్ది రోజుల్లోనే టెస్ట్ మ్యాచులు.. అంటే పక్క ఊరి వాళ్ళతో.. ఆడటం మొదలు పెట్టింది. మా బోథ్‌కు 30 కిలోమీటర్ల దూరంలో మహారాష్ట్రలో ఉన్న కిన్వట్ జట్టుతో, గట్టు కింద(మహబూబ్ ఘాట్ల కింద) ఉన్న నిర్మల్ జట్టుతో, మా ఊరి పక్కన ఉండే కౌఠ జట్లతో మ్యాచులు జరిగేవి. కిన్వట్ జట్టుతో ఎక్కువ మ్యాచులు ఆడేవాళ్ళం. ఒకసారి మేము కిన్వట్ వెళితే, మరొకసారి వారు బోథ్‌కి వచ్చేవారు. మా జట్టు బౌలింగ్ బాగున్నా బాటింగ్‌లో ఫెయిల్ అవుతుండడంతో ఎక్కువ సార్లు ఓటమే ఎదురయ్యేది. హిట్టింగ్ కోసం ముర్తుజా ఖాన్ అన్న ముస్తఫాను బరిలోకి దించేది కెప్టెన్ వామన్ రావు. అడ్డిమార్ గుడ్డి దెబ్బలు. బ్యాట్ కు తగిలితే సిక్సర్. లేదంటే అవుట్. టెస్ట్ మ్యాచుల్లో మాకు ఎంట్రీ దక్కక పోయినా వారితో కలిసి మ్యాచులు చూడటానికి, వస్తువుల కాపలాకి మమ్ములని తీసుకుపోయేది. కిన్వట్ పోవడానికి పొద్దున్న4 గంటలకు నైట్ హాల్ట్ బస్సు ఎక్కాలి. 4 గంటలకు బస్సు పట్టుకోవడానికి రాత్రంతా మెలకువగా ఉండవలసి వచ్చేది. నిద్రలేమి ఆట మీద ప్రభావం పడేది. బాటింగ్ వైఫల్యం మమ్ములని ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. అవుతల జట్టును తక్కువ స్కోర్‌కు అవుట్ చేసినా కూడా బాటింగ్ ఫైఫల్యం ఆ స్కోర్‌ను చేదించలేక మ్యాచులు ఓడిపోయేవారం. బలమైన ఆదిలాబాద్ జట్టుతో ఒకే ఒక మ్యాచ్ ఆడితే ఘోరంగా ఓడిపోయాము. ఎన్ని మ్యాచులు ఓడిపోయినా క్రికెట్ స్పూర్తి మాత్రం మిగిలేది. నవ్వుతూ తూలుతూ ఆటను విశ్లేషించుకునే వాళ్ళం. ఓటమి బాధ శ్యాం జోకులతో ఎగిరిపోయేది. మరో ఓటమిని ఎదుర్కోవడానికి సిద్దం అయ్యేది టీం.

జూనియర్ జట్టు:

మేము పదవ తరగతి వచ్చేనాటికి మా జూనియర్ జట్టు నుంచి నేను, గంగాధర్ గౌడ్, బి రమేశ్, గోవర్ధన్, మహమూద్ తదితరులం సీనియర్ జట్టులోకి ఎంపిక అయినాము. జూనియర్ల జట్టుకు కెప్టెన్ నేనే. నేను ఓపెనింగ్‌కి దిగేవాడిని. గంగాధర్ గౌడ్ డిఫెన్స్ మినిస్టర్‌గా పేరు గాంచాడు. రమేశ్ లెఫ్ట్ హాండ్ బాటింగ్, రైట్ హాండ్ బౌలింగ్. సవ్యసాచి. గోవర్ధన్ ఆల్ రౌండర్. వాడు ఒక్కొక్క సిక్సర్ కొడితే బాల్ దొరకడానికి 15 నిమిషాలు పట్టేది. వాడిలాంటి ఆటగాడు హైదరాబాద్‌లో ఉంటే గనుక హైదరాబాద్ జట్టుకు మరో కపిల్ దేవ్ దొరికి ఉండేవాడు. జూనియర్ జట్టుకు బ్యాట్లు, స్టంపులు అన్నీ స్థానికంగానే తయారు చేసుకునేది. మా క్లాసులో ఉన్న వడ్ల బక్కన్న టేకు చెక్కతో బ్యాటు చెక్కి ఇచ్చేవాడు. టేకు పెండే కట్టెలతో స్టంపులు తయారు చేసేవాడు. బ్యాటు బరువుగా ఉండేది. బ్యాటు చేతిలో నుంచి జారిపోకుండా ఉండటానికి హండిల్‌కు సైకిల్ ట్యూబ్ ఎక్కించేవారం. బస్టాండ్‌లో ఉన్నబాపురావు టేలాలో కార్క్ బంతులు దొరికేవి. వాటితో మా క్రికెట్ ఆట షురు అయ్యింది.

రేడియోలో క్రికెట్ కామెంటరి:

అప్పట్లో టివిలు లేవు కాబట్టి ఆల్ ఇండియా రేడియో వారు లైవ్ కామెంటరి ప్రసారం చేసివారు. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో కామెంటరి వంతులవారీగా ప్రసారం అయ్యేది. సుశీల్ దోషి హిందీ కామెంటరి, అనంత్ సెటిల్వార్ ఇంగ్లిష్ కామెంటరి బాగా నచ్చేది. ఇండియాలో మ్యాచ్‌లు జరిగితే పొద్దంతా అదే ధ్యాస. ఇంగ్లాండ్‌లో మ్యాచ్‌లు అయితే పగలు రాత్రి కామెంటరి ప్రసారం అయ్యేది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో జరిగే మ్యాచ్‌లకు పొద్దున్నే మూడు గంటలు మొదలై ఉదయం తొమ్మిది కల్లా అయిపోయేది. వెస్ట్ ఇండీస్ లో అయితే అర్ధ రాత్రి ప్రసారం అయ్యేది. క్రికెట్ కామెంటరి వినటం ఒక వ్యసనంగా మారింది. ప్యాంటు జేబులో పట్టే చిన్న ట్రాన్సిస్టర్ తీసుకొచ్చి బడిలో సార్ లేనప్పుడు దొంగతనంగా వినటం ఒక సరదాగా ఉండేది. ఇంగ్లాండ్, వెస్ట్ ఇండీస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో జరిగే మ్యాచ్‌లకైతే బడిలో కామెంటరి వినే బాధ ఉండేది కాదు. టివిలు వచ్చే దాకా రేడియో కామెంటరి వినే వ్యసనం మమ్ములను వదలలేదు. మా బోథ్‌లో కేబుల్ టివి 1986 లో ఏర్పాటు అయ్యింది. ఆ సంవత్సరం మెక్సికోలో జరిగిన ఫుట్‌బాల్ ప్రపంచ కప్ ప్రసారాలను అర్ధరాత్రి క్రమం తప్పకుండా చూసాము. ఆ వరల్డ్ కప్‌లో అర్జంటినా ఆటగాడు డీగో మారడోనా విన్యాసాలు మనందరికీ తెలిసిందే. 1986 ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ను అర్జంటినా గెలుచుకున్నది. ఇక అప్పటి నుండి రేడియో కామెంటరి ప్రసారాలు ఉన్నా కూడా టివి లైవ్ ప్రసారాలకే మొగ్గు చూపే పరిస్థితి వచ్చింది. అయితే రేడియోలో విన్నట్టు ఎక్కడ పడితే అక్కడ టివి చూడటం కుదరదు. ఇంట్లోనే చూడాలి. ఈ పరిమితి ఉన్నా ఆటగాడు ప్రత్యక్షంగా కనిపించే టివి ప్రసారాల ముందు రేడియో ప్రసారాలు దిగదుడుపే. అయితే 1983లో ఇండియా గెలిచిన ప్రపంచ కప్ ప్రసారాలు రేడియోలో విని ఉద్వేగానికి లోనయ్యాము. అండర్ డాగ్ గా బరిలోకి దిగిన ఇండియా బలమైన వెస్ట్ ఇండీస్ జట్టును ఓడించి కప్ గెలవడం ఎవ్వరూ ఊహించని పరిణామం.

పిచ్ తయారి:

1976-77లో టోని గ్రేగ్ నాయకత్వంలో ఇంగ్లాండ్ టీం భారత పర్యటనకు వచ్చింది. అప్పుడే పత్రికల్లో క్రికెట్ వార్తలు తెలుసుకోవడం.. ముఖ్యంగా హిందూ పత్రికలో క్రీడా వార్తలు బాగా వచ్చేవి. ఆ సీరీస్‌లో ఇంగ్లాండ్ తో మొదటి టెస్ట్ మ్యాచ్ దిల్లీలో జరిగింది. ఆ టెస్ట్‌లో ఇంగ్లాండ్ ఓపెనింగ్ బ్యాట్స్ మన్ డెన్నిస్ అమిస్ 175 పరుగులు చేసినట్టు గుర్తు. ఆ మ్యాచ్ లో భారత్ ఘోరంగా ఓడిపోయింది. అప్పుడే కిన్వట్‌తో మా జట్టు మ్యాచ్ ఫిక్స్ అయ్యింది. కాలేజి గ్రౌండ్‌లో మ్యాచ్ కోసం ఒక పిచ్ తయారు చేద్దామని నిర్ణయించారు. మొదట పిచ్ పొడవున నల్ల మట్టిని తవ్వి అందులో మొదటి లేయర్ గా కంకర పరచాలి. ఆ తర్వాత ఎర్రమట్టిని నింపాలి. కంకరను రహమత్ అలీ అనే కాంట్రాక్టర్‌ను అడిగి తెచ్చుకున్నాము. అందుకోసం ముర్తుజా తమ ఇంట్లో ఉన్న డకల్(తోపుడు) బండిని తీసుకొచ్చాడు. మా ప్రాంతంలో ఎర్ర మట్టి కడెం నది ఒడ్డున ఉన్నకుప్టి వద్ద మాత్రమే దొరుకుతుంది. ఎడ్ల బండిని కడెం నది ఒడ్డున ఉన్నకుప్టి గ్రామానికి పంపి ఎర్రమట్టిని తెప్పించాము. ఎర్ర మట్టిని జల్లెడ పట్టి సన్నని మట్టిని వేరు చేసి కంకర మీద దొడ్డు మట్టిని మొదటి లేయర్ వేసి దిమ్మిసతో దంచడం, దాని మీద సన్నని మట్టి పోసి మళ్ళీ దంచడం చేసి పిచ్‌ని తయారు చేసినారు. మట్టిని దంచడానికి దిమ్మిస తెచ్చింది సబ్బని నర్సయ్య. దిమ్మిస తెచ్చినందుకు వాడిని అందరు అమిస్ దిమ్మిస్ అని ఆటపట్టించేవారు. వాడు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా మంచి లెగ్ స్పిన్ ప్రాక్టిస్ చేశాడు. కొత్తగా తయారు చేసిన పిచ్ మీద ప్రాక్టిస్ మొదలుపెట్టి మంచి ఆత్మ విశ్వాసంతో కిన్వట్ జట్టును ఆహ్వానించాము. బాటింగ్‌లో మళ్ళీ ఫైఫల్యం. జట్టు ఓడిపోయింది.

క్రికెట్ టోర్నమెంట్:

1985 లో ఒక తాలూకా స్థాయి 20 ఓవర్ల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించాలని అనుకున్నాము. నేను అప్పుడు ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్‌లో ఉన్నా. ఊరిలో మా అందరికి సలహాదారు, పెద్దమనిషి ఏనుగు రమేశ్ చంద్రారెడ్డి గారిని చైర్మన్‌గా పెట్టి ఒక ఆర్గనైజింగ్ కమిటిని వేసాము. అంపైర్ల పానెల్‌ని ఎంపిక చేసాము. బోథ్ తాలూకాలో క్రికెట్ జట్లు ఉన్న ఊర్లు కొన్నే. ఆరు జట్లను ఎంపిక చేసాము. వారికే ఆహ్వానం పంపినాము. బోథ్, ఇచ్చోడ, వడూర్, సోనాల, ధన్నూర్, కౌఠ జట్లు టోర్నమెంట్‌లో పాల్గొన్నాయి. ఆ టోర్నమెంట్ గెలిచి తీరాలని బాగా ప్రాక్టీస్ చేసాము. నిధులు సేకరించాము. ఈ టోర్నమెంట్‌కు ఆర్థికంగా బాగా సహకరించిన వారిలో కాటన్ కార్పోరేషన్ ఆఫీసర్ కోటేశ్వరరావు ఒకరు. ఆయనకు క్రికెట్ అంటే పిచ్చి. సీనియర్లు అందరు చదువుల కోసం వెళ్ళిపోయిన కారణంగా జూనియర్ జట్టులో ఉన్న చాలా మందికి ప్రమోషన్లు వచ్చాయి. నేను ఇంజనీరింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళినా కూడా నన్ను బోథ్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేసారు. రమేశ్, గోవర్ధన్, మహమూద్ లు ఫాస్ట్ బౌలింగ్, నేను ఆఫ్ స్పిన్, సబ్బని నర్సయ్య.. అదే అమిస్ దిమ్మిస్ లెగ్ స్పిన్, బ్యాటింగ్ లో నేను, చింటూ, అజయ్, గోవర్ధన్, మెహమూద్.. ఇట్లా టీం బలంగానే ఉండింది. గంగాధర్ గౌడ్ ఆనాటికే బోథ్ వదలి ఇచ్చోడలో సెటిల్ అయ్యాడు. నేను హైదరాబాద్‌లో ఉన్నాను కనుక టోర్నమెంట్‌కు అవసరమయ్యే క్రికెట్ సామాన్లు కొనుక్కు రావడానికి నన్ను హైదరాబాద్ పంపించారు. సికిందరాబాద్‌లో క్రీడా వస్తువులు అమ్మే దుకాణంలో మ్యాట్, బ్యాట్లు, ప్యాడ్‌లు, స్టంపులు, హాండ్ గ్లోవ్స్, ప్రైజ్‌ల కోసం కప్పులు అన్నీ కొని తీసుకువచ్చాను. మా ఊరి మధ్యలో ఉన్న ఫకీరోని చేనుని బోథ్ మార్కెట్ యార్డ్ కోసం సేకరించినారు. విశాలమైన మార్కెట్ యార్డును టోర్నమెంట్ నిర్వహణ కోసం ఎంపిక చేసాము.

మా మొదటి మ్యాచ్ మన్నూర్ జట్టుతో జరిగింది. రెండో మ్యాచ్ ఇచ్చోడ జట్టుతో జరిగింది. ఇచ్చోడ జట్టు అప్పటికే బలమైన వడూర్ జట్టును ఓడించింది. టీం అన్ని రంగాల్లో రాణించి మన్నూర్, ఇచ్చోడ జట్లతో మ్యాచ్‌లను గెలిచి ఫైనల్ లో అడుగు పెట్టాము. ఫైనల్ మ్యాచ్ ధన్నూర్ జట్టుతో. ఆ మ్యాచ్ గెలిస్తే కప్పు మనదే. మొదట బ్యాటింగ్ బోథ్ జట్టు చేసి మంచి స్కోర్ సాధించాము. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ధన్నూర్ వారు ఓడిపోతున్న తరుణంలో అంపైర్ LBW నిర్ణయంతో పెద్ద గొడవ లేవదీసారు. అంపైర్ నిర్ణయాలు సరిగా లేవని, బోథ్ జట్టుకు అనుకూలంగా ఉన్నాయని స్టంపులు కింద పడేసి గొడవకు దిగారు. ఈ సారి బ్యాటింగ్, బౌలింగ్ రంగాల్లో బాగా రాణించినప్పటికీ ధన్నూర్ టీంతో వచ్చిన గొడవ కారణంగా చైర్మన్ నిర్ణయం మేరకు విజేతగా ధన్నూర్ టీంను ప్రకటించాలని నిర్ణయించారు. టోర్నమెంట్ ను నిర్వహిస్తున్న జట్టుగా త్యాగానికి సిద్దపడ్డాము. చైర్మన్ నిర్ణయం మేరకు ఫైనల్ మ్యాచ్ లో ధన్నూర్ జట్టును విజేతగా ప్రకటించి వారికి కప్పును అందజేసాము. ఆ తర్వాత కొద్ది రోజులకు ఇచ్చోడలో కూడా ఇటువంటి టోర్నమెంట్ జరిగింది. అక్కడ కూడా ఇచ్చోడ జట్టుతో మొదటి మ్యాచ్ రసవత్తరంగా జరిగింది. నేను చింటూ మంచి ఓపెనింగ్ భాగస్వామ్యం ఇచ్చాము. ఆ తర్వాత గోవర్ధన్ ఇచ్చోడ బౌలర్లపై విరుచుకుపడి సిక్సర్‌లు బాది వారికి చెమటలు పట్టించాడు. వాడు అవుట్ అయిన తర్వాత జట్టు కుప్ప కూలిపోయింది. ఇచ్చోడ జట్టు మేము పెట్టిన టార్గెట్‌ను తేలికగానే ఛేదించి టోర్నమెంట్‌లో ముందుకు సాగారు. బోథ్ టోర్నమెంట్ లో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నారు. మేము ఇంటి దారి పట్టాము.

ఇట్లా మా క్రికెట్ సంబురాలు కొనసాగినాయి. 1987లో సాగునీటి శాఖలో జూనియర్ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరడంతో నా క్రికెట్ ఆటకు ఫుల్‌స్టాప్ పడింది. క్రికెట్ జ్ఞాపకాలు మాత్రం హృదయంలో నిలచిపోయినాయి. స్వామి స్నేహితులు మళ్ళీ నన్ను నా క్రికెట్ జ్ఞాపకాల్లోకి తీసుకుపోయారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here