[dropcap]‘మ[/dropcap]నసొక మధుకలశం’ అన్న కవి వాక్యం కొందరి విషయంలో అక్షరసత్యం అనిపిస్తుంది, కనిపిస్తుంది కూడా.. అలాంటి వారిలో తొలివరుసన ముందుగా నిలిచిన రచయిత శ్రీమతి శాంతి కృష్ణ.
‘తెలుగుసాహితీవనం’ నిర్వహించిన పుస్తక సమీక్షల పోటీలో నేను గెలుచుకున్న ‘స్వప్న ధార’ పుస్తకాన్ని శాంతి కృష్ణ గారి చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది. వారితో తొలి పరిచయం కూడా కలిగింది. ఇది ఒక మధురానుభూతి. ఇందుకు చాలా సంతోషం వేసింది.
నాకు అర్థమైనంతలో ‘స్వప్న ధార’కు చిన్న విశ్లేషణ..
గొప్ప సమీక్షకురాలి పుస్తకాన్నే సమీక్షించడమంటే ఎంతటి సాహసమో మనందరికీ తెలుసు.
నేను చదివిన శాంతి కృష్ణ తొలి పుస్తకం ‘స్వప్న ధార’.
కవితల నిండా ఎంతో లోతైన భావాలు.. ఊహలను ఉన్నపళంగా అక్షరీకరించటం, వాటికి భావుకత్వపు పరిమళాన్ని అద్దడం అంత సులువేమీ కాదు. అందరికీ సాధ్యం కూడా కాదు. చిన్నతనం నుంచే కవిత్వంపై మక్కువ, జన్మతః వచ్చిన భావుకత, ప్రేమ స్వభావం ఇవన్నీ కలిగి వుంటేనే కానీ కవిత్వం పండదు. అలాగే తెలుగు సాహితీవనం అనే సాహితీ వనమును ఇరవై మూడు వేల మంది సంఖ్య దాటిన సమూహ సభ్యులతో ఐదు సంవత్సరాలుగా అద్వితీయమైన రీతిలో నడుపుతున్న ప్రతిభాశక్తి శ్రీమతి శాంతి కృష్ణ.
ఇక పుస్తకంలోకి వెళదాం..
‘ప్రేమెపుడూ ప్రవహించే జీవనది’
‘ప్రేమెపుడూ మనలోని గుండెసడి’ అంటారు.. ముందు మాటగా (తన) ‘నాహృదయ స్పందన’లో.. నిజమేకదా! ‘విశ్వప్రేమ’ కలిగి ఉంటేనే తప్ప ఇలా కవిత్వం తేనెను చిలుకరించదు! ‘స్వప్న ధార’లో మొదటి కవిత ‘అడుగుల సవ్వడి’ నుంచి చివరి కవిత ‘గుండె సవ్వడి’ వరకు మొత్తం 59 కవితలలో ప్రేమ సుధా ధారలున్నాయి.
//స్వప్నమో ఏమో తెలియదు నీ రాక
మల్లెలవాగులో వెన్నెలపడవలా ఉంటోంది.. //
మొదటి కవిత ‘అడుగుల సవ్వడి’ ఇది కదా ప్రేమ లోని మాధుర్యాన్ని, మల్లెల స్వచ్ఛతను, వెన్నెల నిష్కల్మషత్వాన్నీ ప్రేమ లోని ఔన్నత్యానికి నిదర్శనంగా ఆవిష్కరించిన తీరు అద్భుతం కదా..
//మదికెంత ఊరటో
విరిగిన మమతల గూడును
మళ్ళీ అల్లుకుంటోంది..//అంటారు ‘అడుగుల సవ్వడి’లోనే…
ఇదెంత వాస్తవం కదా!.. మనసు అప్పడప్పుడు కాస్త నొచ్చుకుంటున్నా.. మళ్ళీ మళ్ళీ మమతల వైపే పరుగులు తీస్తుంది. ఇది వదులుకోలేని ప్రేమతత్వం..
//నమ్మకాల పునాదులపై
నాలుగు చేతులతో అల్లుకున్న
అనుబంధపు అంతఃపురమే కదా ప్రేమంటే..// ‘తేనె సంతకాలు’ కవితలో…
ఇంతకన్నా గొప్ప నిర్వచనం ఉంటుందా నిష్కళంకమైన ప్రేమకు.. వర్ణన అమోఘం, అద్వితీయం..
//వెన్నెలక్కూడా జాగరణే
నా కన్నుల కలికి నవ్వులు చూసి..//
హృదయం లోతుల నుండి వచ్చే భావనలు కానీ నవ్వు కానీ చాలా స్వచ్ఛంగా ఉంటాయి. అలాంటి నవ్వును చూస్తే వెన్నెల కూడా పరవశం చెందుతుందనే భావన మధురం..
//ఎంత మురిపెంగా చూస్తున్నాయో
మంచు బిందువులిపుడు
నా కన్నుల్లో జారే నీలాల చినుకులను..// ‘కలల నెగళ్ళు’ కవితలో
బాష్ప వర్ణన లోని భావుకత అపురూపం, అపూర్వం.. మంచుబిందువులు మురిసిపోతున్నాయనే ఊహ చాలా గొప్పగా ఉంది.
//ఆనంద వర్షమేమో
రెప్పల మేఘాలనుండి
చుక్కలు చుక్కలుగా..// అంటారు మళ్ళీ వెంటనే.. కనురెప్పలు మేఘాలై వర్షిస్తున్నాయనే భావన.. సరికొత్తగా ఉంది. చదువుతున్నంతసేపూ మనసు ఎంత మధువు గ్రోలుతుందో వర్ణించలేము..
//కనుపాపలోని నీ రూపుకి
నిత్యాభిషేకం చేయడానికి
తాను సజీవ నదిగా మారిందని
కన్నీటి చుక్కనడిగితే చెబుతుంది// అంటారు ‘నామనసంతా నువ్వే’లో..
జారే కన్నీటికి ఇంత చక్కని భాష్యం ఉంటుందా.. ఉంటే ఇలాగే ఉంటుంది సుమా..
మనసులో ప్రేమొక మధుకలశమైనప్పుడు కలలూ, ఊహలూ మకరందంలో తడిసి వుంటాయికదా! ప్రతి పదంలోనూ తేనెధారలే!.. ప్రతి కవితా, ప్రతి వాక్యమూ ఆలోచనామృతమే, విశ్లేషణాత్మకమైనవే..
మరికొన్ని స్వప్నధారలలో తడిసి తన్మయమవుదాం..
//రేయంతా కురిసినా..
తొలి పొద్దుకంతా మురిపెంగా
మళ్ళీ హాజరవుతున్నావ్..// ‘దిగులెందుకే వాన’లో.. వానతో కూడా ఇలా ప్రేమగా సంభాషించడం చూస్తే ఈ రచయిత్రికి వానంటే ఎంత ఇష్టమో తెలుస్తుంది..
ప్రకృతిలోని అణువణువునూ అద్భుతాలుగా ఆవిష్కరించగల ప్రేమతత్వమే ఈ కవితా పరిమళం..
//నువ్వొచ్చే అడుగుల సవ్వడివైపు
దారంతా చుక్కలపూలు చల్లమని
నింగిని బతిమాలుకుంటాను…// ‘ఈరేయి’లో.. ఎంత గొప్ప అభ్యర్ధన..
//నమ్మకానికీ అపనమ్మకానికీ
మధ్యన జీవించలేక..
మనసు నిశ్శబ్దంలో తనను తాను
దగ్ధం చేసుకుంటోంది.. // ‘మనసు నిశ్శబ్దంలో’.. నిశ్శబ్దంగా మనసు తనలో తాను జరుపుకుంటున్న యుద్ధమే ఇది..
//మసకేసిన జాబిలికోసం..
మౌనంగా వెతికే నింగిని అవుతా.. // ‘నువ్వొచ్చే దారుల్లో’..
ప్రకృతికీ.. స్నేహానికీ.. ప్రేమకి.. మధ్యన ఉన్న తీయని అనుబంధాల అద్భుతమైన అభివర్ణనలు ఎన్నో కలిసి ‘స్వప్న ధార’లయినాయి. పాఠకుల మనసులపై కురిసే ప్రేమధారలయినాయి.. అందరూ తప్పకుండా చదువవలసిన అమూల్యమైన చక్కని కవితాసంపుటి శాంతి కృష్ణగారి ‘స్వప్న ధార’..
రచయిత్రి శాంతి కృష్ణ గారికి మనసారా స్నేహాభినందనలు. మీనుండి మరెన్నో భావుకత్వపు పరిమళాలు అద్దుకున్న సాహిత్యపు కుసుమాలు ఇలా సంపుటాలుగా వెలువడాలని కోరుకుంటున్నాను.
***
స్వప్న ధార (కవిత్వం)
రచన: శ్రీమతి శాంతి కృష్ణ
ప్రచురణ: శామ్ పబ్లికేషన్స్
పుటలు: 80
ధర: ₹ 120
పుస్తకం కొరకు సంప్రదించ వలసిన ఫోన్ – 9502236670