స్వప్న నక్షత్రం

11
2

(చార్లెస్ డికెన్స్ వ్రాసిన ‘A Child’s Dream of a Star’ అనే కథని అనువదించి అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.)

[dropcap]అ[/dropcap]నగనగా ఒక బాలుడుండేవాడు. ఆ పిల్లవాడు ఎప్పుడూ బొంగరంలా అటూ ఇటూ  తిరుగుతుండేవాడు. అలా తిరుగుతూ అనేక విషయాల గురించి ఆలోచిస్తూండేవాడు. అతనికి ఓ చిట్టి  చెల్లెలు ఉండేది.  అతడితో కలిసి అతడు ఎటు వెళ్తే అటు వైపే వెళ్ళేది. వీళ్ళిద్దరూ రోజంతా తిరుగుతూనే ఉండేవారు.

వాళ్ళు అందమైన పూలను చూసి, వాటి అందం చూసి ఆశ్చర్యపోతూండేవారు.  ఆకాశం అంత ఎత్తుగా ఉండడం గురించి, దాని నీలి రంగు గురించి అబ్బురపడేవారు.  నీటి లోతు గురించి ఆలోచిస్తూ మురిసిపోయేవారు. ఇంతటి అత్యద్భుతమూ, అంతులేని అందమైన ప్రపంచాన్ని సృజించిన భగవంతుడి మంచితనం, దయాగుణం గురించి ఆలోచిస్తూ ఆనందపడేవారు. ఆశ్చర్యపోతుండేవారు.

ఒకవేళ ప్రపంచంలోని పిల్లలందరూ మరణిస్తే ఈ భూమిపై ఉన్న పూలు, నీళ్ళు, ఆకాశం బాధపడతాయా? అని చర్చించుకునేవారు. ఇవన్నీ బాధపడతాయని తీర్మానించి సంతృప్తి పడేవారు. అవి ఎందుకు బాధ పడతాయంటే, మొగ్గలు పూవుల  పిల్లలు; కొండలపై నుంచి దూకే నీటి ధారలు, నీటి సంతానం; రాత్రంతా దోబూచులాడే వెలుగురేఖలు నక్షత్రాల పిల్లలు అయి ఉంటాయని వారు భావించేవారు. అందుకే తమ పిల్లలతో ఆడుకునే పిల్లలు భూమిపై నుంచి అదృశ్యమయితే ఇవన్నీ బాధపడతాయని నమ్మేవారు.

అయితే ఆకాశంలోని నక్షత్రాలన్నిటిలోకి ఒక నక్షత్రం వారిని అమితంగా ఆకర్షించింది. అది సరిగ్గా చర్చి శిఖరం ఆకాశాన్ని తాకే చోట, సమాధులపైన, అన్ని ఇతర నక్షత్రాల కన్నా ముందు ఉదయించేది. ధగధగా మెరిసేది. ఇతర నక్షత్రాలన్నిటి కన్నా ఈ నక్షత్రం అందంగా ఉందనీ, ధగధగా మెరుస్తోందనీ పిల్లలిద్దరికీ అనిపించింది. ప్రతీ రాత్రి కిటికీ దగ్గర నుంచుని, ఒకరి చేతులొకరు పట్టుకుని ఆ నక్షత్రం ఉదయించటం కోసం అన్నాచెల్లెళ్ళు ఎదురుచూసేవారు. ఆ నక్షత్రాన్ని ఎవరు ముందు చూస్తే వారు ఏదో సాధించినట్లు సంతోషంతో, సంబరంగా “నాకు నక్షత్రం కనిపించింది” అని అనేకమార్లు అరిచేవారు. వారికి ఆ నక్షత్రం ఏ వైపు ఎప్పుడు ఉదయిస్తుందో తెలుసు కనుక దాన్ని ఇద్దరూ ఒకేసారి చూసేవారు. ఇద్దరూ కలిసి సంబరంగా అరిచేవారు.

ఆ నక్షత్రం వారికి ఎంత సన్నిహితమైపోయిందంటే, ఆ నక్షత్రాన్ని వారు తమకు అత్యంత ఆప్తస్నేహితుడిలా భావించేవారు. రోజూ నిద్రించే ముందు నక్షత్రాన్ని మరోసారి చూసి దానికి ‘శుభరాత్రి’ చెప్పేవారు. అంతేకాదు, నిద్రలోనే ‘దైవం ఆ నక్షత్రాన్ని కాపాడాలి’ అని ప్రార్థించేవారు.

అయితే ఇంకా బాల్యం వీడకముందే, పసితనంలోనే, అతడి చెల్లెలు బలహీనమవటం మొదలయింది.  ఆమె ఎంతగా బలహీనమైందంటే ఆమె అతడితో పాటు కిటికీ దగ్గర నిలబడలేకపోయేది. అతడు ఒంటరిగా, కిటికీ దగ్గర విషాదంతో నిలబడి నక్షత్రం కోసం చూసేవాడు. నక్షత్రం కనబడగానే మంచంపై నున్న సోదరి వైపు తిరిగి “నాకు నక్షత్రం కనిపించింది” అని చెప్పేవాడు. అతడి మాటలు విన్న సోదరి చిరునవ్వు నవ్వి “దేవుడు నా సోదరుడిని, నక్షత్రాన్ని చల్లగా చూడాలి” అని బలహీనంగా అనేది.

సోదరుడు ఒక్కడే ఒంటరిగా కిటికీ లోంచి నక్షత్రం కోసం చూసే రోజు త్వరగానే వచ్చింది. మంచం పై నుంచి అతని సోదరి అదృశ్యం అయింది. ఇంతకు ముందు లేని ఓ చిన్న సమాధి, అంతకు ముందున్న సమాధులకు తోడయింది. ఆకాశంలోని నక్షత్రం నుంచి ప్రకాశవంతమైన కిరణాలు అతడిని తాకుతున్నప్పుడు నీళ్ళు నిండిన కళ్ళతో వాటిని చూస్తూండేవాడు ఆ పిల్లవాడు.

నక్షత్రం నుంచి భూమి పడుతున్న కిరణాలు ఎంత ప్రకాశవంతంగా ఉండేవంటే అవి భూమి నుండి ఆకాశానికి దారిని ఏర్పాటు చేసినట్టు అనిపించేది. ఆ నక్షత్రం గురించి కలలు కంటూ నిద్రపోయేవాడు పిల్లవాడు, ఒంటరిగా! నిద్రలో, కలలో అతడు ఎంతో మంది మనుషులను, ఆ ప్రకాశవంతమైన కిరణాల మార్గం నుండి ఆకాశానికి దేవదూతలు తీసుకువెళ్ళటం చూసేవాడు. ఆ నక్షత్రం తన అదృశ్య ద్వారాలు తెరిచి, లోపల దివ్యమైన వెలుతురులో ఎంతోమంది దేవదూతలు, భూమిపై నుంచి ప్రకాశవంతమైన మార్గం ద్వారా వస్తున్న వారిని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండటం చూపించేది.

మనుషులు నక్షత్రం చేరటం కోసం ఎదురు చూస్తున్న దేవదూతలు,  మెరుస్తున్న కళ్ళతో తమ వద్దకు వస్తున్న మనుషులపై కాంతి కురిపించేవారు. కొందరు ముందుకు వచ్చి, వస్తున్న వారిని కౌగిలించుకుని, మృదువుగా చుంబించి, వారిని వెంట తీసుకుని వెలుగు లోకంలోకి వెళ్ళిపోయేవారు. వారందరూ ఆ లోకంలో ఎంతో సంతోషంగా ఉండడం చూసి పిల్లవాడు నిద్రలోనే ఆనందబాష్పాలు రాల్చేవాడు.

అలా ముందుగా   అందరు దేవదూతలు మనుషులను కలిసేవారు కాదు. వారిలో ఒక దేవదూతను అతను గుర్తుపట్టాడు. మంచంపై బలహీనంగా, బాధతో పడుకున్న పాప వదనం ఇప్పుడు ఆనందంతో, వింత వెలుగుతో మెరిసిపోతుంది. దేవదూతల నడుమ ఉన్న తన సోదరిని అతడు గుర్తించాడు.

అతని సోదరి ఇతర దేవదూతలతో కలిసి స్వర్గద్వారం వద్ద నిలబడి ఉండేది. భూమి నుంచి వస్తున్న వారందరినీ చూస్తూ – “నా సోదరుడు వీరితో వస్తున్నాడా?” అని మనుషులను తీసుకువస్తున్న దేవదూతను అడుగుతూండేది.

“లేదు” అనేవాడతను.

నిరాశతో అతని సోదరి వెనుతిరుగుతుంటే, ఇక్కడ నిద్రలో మంచం మీద నుంచే అతడు రెండు చేతులు చాచి “నేను ఇక్కడ ఉన్నాను. నన్నూ తీసుకుపో నీ వెంట” అని అరిచేవాడు.

ఆమె మెరుస్తున్న కళ్లను అతని వైపు తిప్పేది. ఆ చీకటిలో నక్షత్రం నుంచి మెరుపుల కిరణాలు గదిలో పరుచుకున్నాయి. ఆ కిరణాలు తమ బాహువులను చాస్తున్నట్లు కన్నీళ్ళ మధ్య అతడికి కనిపించేది.

ఇంతలో అతనికి తమ్ముడు పుట్టాడు. అతనికి ఇంకా మాటలు రాకముందే మరణించాడు.

మళ్ళీ అతనికి నక్షత్ర ద్వారాలు తెరుచుకుంటున్న కల వచ్చింది. దేవదూతలు కనిపించారు. కిరణాల దారుల్లో నడుస్తూ నక్షత్రానికి వెళ్తున్న మనుషులు కనిపించారు. అలా వస్తున్న మనుషులకు మెరుస్తున్న కళ్ళతో చూస్తున్న దేవదూతల వదనాలు కనిపించాయి.

దేవదూతల నాయకుడిని అతని సోదరి అడిగింది.

“నా సోదరుడు వచ్చాడా?”

“నీ అన్న రాలేదు. చిన్న తమ్ముడు వచ్చాడు” సమాధానం వచ్చింది.

అతడి సోదరి దేవదూత లాంటి చిన్న తమ్ముడిని ఎత్తుకుంటున్నప్పుడు “నేను ఇక్కడున్నాను. నన్ను తీసుకుపో” అని అరిచాడు అతడు. చిరునవ్వుతో అతడి వైపు చూసి నవ్వింది అతని సోదరి. నక్షత్రం ధగధగలాడింది.

అతడు యవ్వనంలోకి అడుగుపెట్టాడు. పుస్తకాలు చదవటంలో మునిగి ఉన్నప్పుడు ఓ సేవకుడు గదిలో అడుగుపెట్టాడు.

“మీ అమ్మ మరణించింది. ఆమె ముద్దుల తనయుడికి అమ్మ ఆశీస్సులుండు గాక” అన్నాడు.

ఆ రోజు రాత్రి మళ్ళీ అతడి కలలో నక్షత్రం దర్శనమిచ్చింది. గతంలో లాగే దేవదూతలు మనుషులు, వెలుగు సముద్రాలు కనిపించాయి.

అతడి సోదరి దేవదూతల నాయకుడిని అడిగింది.

“నా సోదరుడు వచ్చాడా?”

“లేదు. మీ అమ్మ వచ్చింది” సమాధానం వచ్చింది.

నక్షత్రం ఆనంద సంరంభాలతో వెలిగిపోయింది. తల్లి తన కూతురు, చిన్న కొడుకుతో కలిసినందుకు నక్షత్రమంతా ఆనందం వెల్లివిరిసింది.

అతడు తన చేతులను నక్షత్రం వైపు జాపి అడిగాడు –

“అమ్మా, చెల్లీ, తమ్ముడూ.. నేను ఇక్కడున్నాను. నన్ను కూడా మీ దగ్గరకు తీసుకువెళ్ళండి”.

“ఇప్పుడే కాదు” వచ్చింది సమాధానం.

నక్షత్రం ధగధగ మెరిసిపోతోంది.

అతడు పెద్దవాడయ్యాడు. అక్కడక్కడా అతడి జుట్టు నెరవటం ప్రారంభమైంది. అతడి వదనంపై విషాద మేఘాలున్నాయి. అతని కళ్లు నీటితో నిండి ఉన్నాయి.

నక్షత్ర ద్వారం తెరుచుకుంది.

అతడి సోదరి దేవదూతల నాయకుడిని అడిగింది.

“నా సోదరుడు వచ్చాడా?”

“లేదు. అతడి కూతురు వచ్చింది”

ఒకప్పుడు పిల్లవాడిగా ఉన్న వ్యక్తి, తాను కోల్పోయిన కూతురుని దేవదూతల నడుమ కాంతి ప్రవాహంలో చూశాడు.

‘నా కూతురి తల నా సోదరి భుజంపై ఉంది. ఆమె తన రెండు చేతులతో నానమ్మ మెడను పెనవేసుకుంది. ఆమె పాదాల దగ్గర పసిపిల్లవాడయిన నా సోదరుడున్నాడు. నన్ను వదిలి వెళ్ళినా, నా వాళ్ళ తోటే నా కూతురు కలిసిందని, వాళ్ళ నడుమనే ఉందని సంతోషిస్తున్నాను. దైవం లీలలు విచిత్రమైనవి’ అనుకున్నాడు అతడు.

నక్షత్రం ధగధగలాడుతోంది.

పసిబాలుడు పండు ముసలివాడయ్యాడు. మృదువుగా ఉండే అతడి ముఖం ముడతలు పడింది. పరుగెత్తిన అతని కాళ్ళు అడుగు తీసి అడుగు వేయటానికి బలహీనంగా వణుకుతున్నాయి. అతని నడుము వంగిపోయింది.

ఒక రాత్రి, అతని మంచం చుట్టూ అతని పిల్లలు విషాదంగా   నిలబడి ఉన్నారు. అప్పుడతడు హఠాత్తుగా సంభ్రమాశ్చర్యాలతో అరిచాడు “నాకు నక్షత్రం కనిపిస్తోంది”.

‘మరణం ఆసన్నమయినట్టుంది’ మంచం చుట్టూ ఉన్నవారు గుసగుసలాడుకున్నారు.

‘నేను నిజంగా నక్షత్రాల్ని చూస్తున్నాను. నా వయసు దుస్తుల్లా నా నుంచి జారిపోతోంది. నేను పసిపిల్లవాడిలా నక్షత్రం వైపు ప్రయాణిస్తున్నాను. దేవుడా, నీకు నేను అనంతకాలం కృతజ్ఞుడను. నా కోసం ఎదురుచూస్తున్న నన్ను ప్రేమించే వారందరినీ నక్షత్రంలోకి అనుమతించి, వారు నాకు ఆహ్వానం పలికే అవకాశాన్ని కల్పించిన నీకు ధన్యవాదాలు.’

ఆ నక్షత్రం ధగధగలాడుతోంది. ఆ నక్షత్ర కిరణాలు అతని సమాధిపై నృత్యం చేస్తున్నాయి.

~

(Images Credit: Project Gutenberg)

మూలం: చార్లెస్ డికెన్స్

అనువాదం: కస్తూరి మురళీకృష్ణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here