[డా. జంధ్యాల కనకదుర్గ రచించిన ‘స్వతంత్రత నుండి.. స్వాతంత్ర్యానికి’ అనే గ్రంథాన్ని సమీక్షిస్తున్నారు డా. కొండపల్లి నీహారిణి.]
స్వతంత్రత నుండి.. స్వాతంత్ర్యానికి (తెలుగులో స్త్రీల సాహిత్యం – 1900-1947)
[dropcap]తె[/dropcap]లుగు సాహిత్య చరిత్ర ఒక మహా సముద్రం. అందులో స్త్రీల సాహిత్యం చాలా విశిష్టమైంది. కారణం పితృస్వామ్య వ్యవస్థ నుంచి కష్టాలు పడి వచ్చింది కాబట్టి ప్రత్యేకత సంతరించుకుందని. నేను తెలంగాణ స్త్రీల సాహిత్యం అనే అంశంపై పరిశోధనాత్మకంగా ఒక గ్రంథాన్ని రచిస్తున్నాను. నా చేతిరాతలో ఇప్పటికి ఓ నాలుగు వందల పేజీల విషయం రాసాను. అదీ ఎనభైయ్యవ దశకం వరకు తీసుకున్నదే. దిగితే కాని లోతు తెలియదు అని మన పెద్దలు ఎందుకన్నారో ఈ అనుభవమూ మళ్లీ చెప్తున్నది. చాలా ఉన్నది రాయాల్సింది. ఈ క్రమంలో తెలుగు సాహిత్యానికి విశేషమైన సేవ చేసిన కవయిత్రులు రచయిత్రులు ఎందరో ఉన్నారు కదా వాళ్ళందరివీ సమగ్ర అవగాహన కోసం చదువుతున్న క్రమంలో ‘స్వతంత్రత నుండి.. స్వాతంత్ర్యానికి’ గ్రంథం తారసపడింది. చదవగానే మీ అందరికీ తెలియజేయాలని ఇలా సమీక్ష వ్యాసం రాసాను. ఎంత గొప్ప సాహిత్యం వచ్చింది ఆ రోజుల్లో! ఓ విహంగ వీక్షణం మీ కోసం..
స్త్రీల భావజాలం ఇదీ అని చెప్పలేనంతగా సమాజం ఆమెను కట్టడి చేస్తుంది. అయినా రాళ్ళ కుప్పలోంచి వచ్చిన మొక్క మొలిచినట్టు ఏ కాలంలోనైనా, ఏ సందర్భంలోనైనా స్త్రీలు తలెత్తుతూనే ఉన్నారు.
జంధ్యాల కనకదుర్గ గారు ఈ గ్రంథంలో స్త్రీలు చారిత్రక నేపథ్యంతో ఉన్నవాళ్ళను ప్రముఖులను గురించి రాసారు. ఒక్కో కుటుంబంలో, ఒక్కో తెగలో, ఒక్కో వర్గంలో స్త్రీలు విభిన్నమైన సామాజిక జీవనంలో కనిపిస్తుంటారు. వారి వారి ప్రతిభా విశేషాలు వెలికితీయడమే సంఘసేవ.
కనకదుర్గగారు దాదాపు 1000 పుస్తకాలను చదివి మథించి నవలలు, కథలు, నాటకాలు, ఉపన్యాసాలు, వ్యాసాలు వంటి అన్ని ప్రక్రియలో దాదాపు 100 మంది రచయిత్రులు రచించినవి లభించిన విషయాల్ని క్రోడీకరించి ఈ గ్రంథంలో విశ్లేషించారు.
“1900 నుండి 1950 వరకు విని ఎరుగని దాదాపు 500 మంది మహిళా రచయిత్రుల రచనలలో వ్యక్తమైన వాళ్ళ ఆకాంక్షలు, ఆలోచనలు తెలిసివస్తూ స్త్రీల సాహిత్య చరిత్ర నిర్మాణథగా నన్ను పురికొల్పాయి” అంటారు కాత్యాయిని విద్మహే.
“విద్య, ఆర్థిక స్వాతంత్ర్యం, సంఘాలలో సమీకృతం కావటం వంటి మైలురాళ్ళ వంటి రాజకీయ భాగస్వామ్యం అనే దిశగా వాళ్ళ ప్రస్థానం దిశగా వాళ్ళ ప్రయాణం ఎట్లా జరిగిందో 1900 నుండి 1947 వరకు ప్రతి ఐదేళ్ళను ఒక యూనిట్‌గా చేసుకొని ఆ కాలపు స్త్రీల సాహిత్యం ఆధారంగా నిరూపించే ప్రయత్నం చేశారు కనకదుర్గ” అని ఈ గ్రంథానికి ముందుమాటను రాస్తూ అంటారు కాత్యాయనీ విద్మహే.
డాక్టర్ మేడిపల్లి రవికుమార్ గారు పీఠిక రాస్తూ “ఈ గ్రంథం చదివిన తరువాత పాఠకులెవరూ ఈ గ్రంథం చదవాక ముందున్న స్థితిలో ఉండలేరు. అనేక విషయాలు మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి” అనీ, ఈ రచయిత్రులెవరూ రంగవల్లిక గురించీ, రాగమాలిక గురించీ రచనలు చేసిన వారు కాదు. శక్తివంతమైన జాతీయోద్యమ సాహిత్యాన్ని సృష్టించినవారు. సామాజిక సంస్కరణ గురించి ఎలుగెత్తి చాటినవారు. స్త్రీ అస్తిత్వం కోసం, వారి ఆత్మగౌరవం కోసం నడుం బిగించిన వారు” అంటూ అద్భుతమైన భావప్రకటన చేసారు. ‘స్త్రీల సాహిత్య ప్రాముఖ్యత’ అంటూ ఈ గ్రంథ రచయిత్రి కనకదుర్గ, “సమాజంలో పురుషుల వలె స్త్రీలు సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వాన్ని అనుభవించ గల అవకాశాలతో పాటు గౌరవప్రదమైన సామాజిక జీవనం ఉండటాన్ని స్త్రీల వ్యక్తి స్వాతంత్ర్య చిహ్నంగా ప్రతిఫలించిన సాహిత్యమిది” అంటారు. ఇది అక్షరసత్యం, ఏ సౌకర్యాలు లేని కాలంలో వాళ్ళ రచనలను నిక్షిప్తం చేసుకునే మార్గాలు లేక ఆనాడు ఆ కవయిత్రులు, రచయిత్రులు ఎన్ని బాధలు పడి ఉంటారో! ఈ రచనల్లో వాళ్ళు వాళ్ళను గురించి కాకుండా స్త్రీ సమాజాన్ని గురించి పట్టించుకుని రాసిన రచనలు ఇవి. ఈ రచనలను చదివిన కనకదుర్గ ఖచ్చితమైన అభిప్రాయాన్ని, “లింగవివక్ష లేని భారతదేశ రాజ్యాంగ నిర్మాణానికి రహదారులను ఏర్పరిచిన సాహిత్యమిది” చెప్పడం సబబైన అభిప్రాయం. ఆనాడు పుంఖానుపుంఖాలుగా స్త్రీల సాహిత్యం వచ్చినప్పటికీ విస్తృత సాహిత్యంగా ఉండడం దురదృష్టం అంటుంది రచయిత్రి. శిథిలావస్థలో ఉన్న వందేళ్ళ నాటి పాత పత్రికలను తిరగేసి సేకరించడం అంటే మామూలు విషయం కాదు.
1896లోనే వేమూరి శారదాంబ స్త్రీవిద్యను ఆటంకపరిచే సమాజాన్ని ప్రశ్నిస్తూ ‘మాధవ శతకం’ అనే రచనతో ఆధునిక భావజాలపు స్త్రీ సాహిత్యం వెలుగు చూసిందనవచ్చు. ఆ తదుపరి 1998లో భండారు అచ్చమాంబ ‘అబలా సచ్చరిత్ర రత్నమాల’ అనే వచన గ్రంథాన్ని తీసుకువచ్చారు. జాతీయోద్యమంలో భాగంగా పత్రికలలో స్త్రీ వ్యాసాలు, కథలు, నాటికలూ, నాటకాలూ వచ్చేవి. ఆడవాళ్ళకు ఏ కొద్దిమందికో చదువుకునే అవకాశాలుండేవి. ఇంటి పనులతో సతమతమయ్యేవారు. వడ్లు దంపుకోవడం, పిండి రుబ్బుకోవడం వంటివాటి నుండి పనుల బాధ్యతలు, పిల్లల పెంపకం బాధ్యతలూ అన్నీ అధిగమిస్తూ రచనా వ్యాసంగానికి పూనుకున్నారు. తమదైన అభిప్రాయాన్ని ప్రకటించడం ద్వారా స్త్రీలలో చైతన్యాన్ని తీసుకురావాలన్న ధ్యేయం ఇది. విద్య ప్రాముఖ్యత, ఆరోగ్య పరిరక్షణ అవసరమూ వంటివన్నీ రాసేవాళ్ళు. స్త్రీల స్వాతంత్యం సమానత్వ హక్కుల ప్రస్తావన కోసం రాసారు. వ్యక్తి చైతన్యమే సంఘచైతన్యం. స్త్రీలు తమదైన విలువల కోసమెట్లా పోరాడాలో, దేశ స్వాతంత్ర్యం కోసమూ పోరాడాలని స్ఫూర్తినిచ్చేలా రాసారు. సత్యాగ్రహోద్యమాలలో పాల్గొన్నారు. రాజకీయ కోణాలను అర్థం చేసుకున్నారు.
‘స్వతంత్రత నుండి.. స్వాతంత్ర్యానికి’ పుస్తకం దేశచరిత్రను అర్థం చేసుకోవడానికి స్త్రీల పోరాట పటిమను అర్థం చేసుకోవడానికి ఒక చక్కని రిఫరెన్స్ బుక్‌గా నిలిచిపోతుంది. పత్రికారంగం చేసే ప్రత్యక్ష పరోక్ష సాయం ఇంతా అని చెప్పలేనంత ఉంటుంది చరిత్ర నిర్మాణానికి. ‘హిందూ సుందరి’ (1902), సావిత్రి, ఆంధ్రలక్ష్మి, గృహలక్ష్మి, సువర్ణరేఖ స్త్రీధర్మ వంటి పత్రికలలో స్త్రీలు రచించిన జానపద గేయాలు, గల్పికలు, పాటలు, స్వీయ, జీవిత చరిత్రలు, శతకాలు వంటి ప్రక్రియలకు ప్రత్యేక స్థానమిచ్చాయి. మొసలిగంటి రామాబాయమ్మ, వెంపల శాంతాబాయి, బాలాంత్రపు శేషమ్మ, మాడభూషి చూడమ్మ వంటి స్త్రీలు సంపాదకత్వ బాధ్యతలూ నిర్వహించారు. పులుగుర్త లక్ష్మీనరసమాంబ ‘సావిత్రి’ పత్రిక, చిల్లరిగె రమణమ్మ ‘వివేకవతి’, వింజమూరి వెంకటరత్నమ్మ ‘అనసూయ’, కళ్ళేపల్లి వెంకటరరమణమ్మ ‘ఆంధ్రలక్ష్మి’ అనిబిసెంట్ ‘ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్’ వంటి పత్రికలు స్త్రీల పత్రికారంగ సంపాదకత్వం ప్రతిభకు ఉదాహరణలు.
భండారు అచ్చమాంబ కథారచయిత్రిగా ప్రసిద్ధి గాంచినవారు. ‘గొంగళిపురుగు’, ‘నా స్వప్నము’, ‘రెండు వరాలు’ వంటి కథల్లో సమాజ వాస్తవ స్థితిగతులను ప్రస్ఫుటించారు. ఆనాటి పోరాటాలకు బలం చేకూర్చేలా ‘స్త్రీ పునర్వివాహ ప్రహసం’, ‘హాస్య సంజీవి’, ‘పతి వశీకరణం’, ‘ప్రేమవేదిక’ వంటి నాటకాలు స్త్రీలపరంగా ఆలోచనలలో మంచి ఒరవడిని తెచ్చాయి. ఇక మంగళహాతులు, కీర్తన, పాటలు, కవిత్వం వంటివీ విరివిగానే వచ్చాయి. ‘మనదీ భారతదేశం’, ‘ప్రబోధగీతాలు’ వంటి అభ్యుదయ భావాల కవిత్వమూ వచ్చింది. ఇక ‘శారద లేఖలు’, కమలకు లేఖలు, కల్పలిత వంటివి లేఖాసాహిత్యాన్ని సుసంపన్నం చేసాయి అనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచేలా వివరించారు కనకదుర్గ.
క్రమంగా ఆడవాళ్ళ నిత్యజీవన సమరాలను ప్రస్ఫుటిస్తూ బహుభార్యత్వాన్ని వద్దనడం, బాల్య వివాహాలు రద్దు చేయాలనీ, స్త్రీ విద్య ఆవశ్యకమనీ ఎన్నో మంచి ఆలోచనతో రచనలు చేసారు. ఏ వివక్షలూ లేని జీవితాన్ని కాంక్షించడానికి ఆనాటి రచయిత్రులు గట్టిగానే కలాలు ఎత్తారు. సతీ సహగమనాన్ని ఎదిరించినా, భర్త మరణానంతరం తన స్వశకితపై నిలబడి వ్యాపారం చేస్తూ పిల్లలను సాకిన తల్లులుగా ఉన్నా, అవసరార్థం పురుష వేషాన్ని వేసుకొని భర్తను రక్షించిన నైపుణ్యమున్నా ఇటువంటి అంశాలతో కథలు వచ్చాయంటే స్త్రీలు వ్యక్తిస్వాతంత్ర్యం కోసం సమాజాన్నెదిరించారనీ తెలుస్తున్నది. “అవిద్య, ఆస్తిహక్కు లేమియే స్త్రీ అసమానత్వానికి కారణం అనీ, స్త్రీలు అదనంగా సాంఘిక, ఆర్థిక స్వాతంత్ర్యాల కోసం పోరాడాలని భావించారు. స్త్రీల స్వాతంత్ర్యానికి దేశస్వాతంత్ర్యానికి అనుభవించ గలిగినప్పుడే దేశ స్వాతంత్ర్య సాధన సులభతరం అవుతుందని భావించారు” అని కనకదుర్గ అంటారు. ఈ విషయాలన్నీ ఏఏ సంవత్సరాలలో కార్యరూపం దాల్చాయో కూడా వివరించారు. ఈ క్రమంలో 1900-1909 కాలపు రాజకీయ, సాంఘిక విశేషాలతో రచయిత్రుల, సామాజికవేత్తల కృషిని అన్వయిస్తూ రాసారు. 20వ శతాబ్దపు మొదటి దశకంలో జరిగిన స్త్రీల చైతన్యాన్ని వివరించి ఇది సాహిత్యంలో ఎలా కనిపించిందో చెప్పారు. ఇందులో భాగంగా పత్రికాముఖంగా స్త్రీలు రచించిన వ్యాసాల ప్రభావాన్ని వివరించారు. “విద్యవలని లాభాలు (జులై 1907 సావిత్రి) దామెర్ల సీతమ్మ, వ్యాసాన్ని, అలహాబాద్ రోజాలీలాలు అనే మహిళ చేసిన ఉపన్యాసాన్ని రాసారు. ‘అతిబాల్య వివాహ ఫలితాలు’ వంటి వ్యాసం బాలికలు ధైర్యాన్ని కోల్పోవడానికి, శరీర పాటవం తగ్గడానికి కారణాలయ్యే విషయాలను చూపించిందనీ అన్నారు.
కొలికిపూడి సీతమ్మ, వేమరపు మహాలక్ష్మి, రుద్రవరపు కామేశ్వరమ్మ, పులగుర్తి లక్ష్మీనరసమాంబ, పి.కౌసల్య, కందుకూరి రాజ్యలక్ష్మమ్మ, ఉన్నవలక్ష్మీబాయమ్మ, పెద్దిబొట్ల వేంకటసుబ్బమ్మ, బాలాంతపు శేషమ్మ వంటివాళ్ళ ప్రయత్నాలు తెలుస్తున్నాయి. ఓ.ఆదెమ్మ 1902 హిందూసుందరి పత్రికలో “స్త్రీల విద్య” అనేది స్త్రీలకే గాక దేశానికి కూడా నాగరికతా చిహ్నమని అనడం బాగుంది. అ.లక్ష్మీకాంతమ్మ, గంటి జోగాంబ, గొడవర్తి బంగారమ్మ, వలిమేటి బాలాత్రిపుర సుందరమ్మ వెంపల శాంతాబాయి, వి.సీతమ్మ, చాడికుడుతమ్మ, బుర్రా బుచ్చి బంగారమ్మ, భట్టిప్రోలు రాజరాజేశ్వరమ్మ, కళ్ళేపల్లి వెంకట రమణమ్మ, దామెర్ల సుందరమ్మ, కొలిచిన కాంతమ్మ, అయ్యదేవర బాలాత్రిపుర సుందరమ్మ, పురిటి సూర్యనారాయణమ్మ, ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ, వి.సరస్వతి, కంచి మంగళమ్మ, పద్మావతీ శ్రీరామ్, కనుపర్తి వరలక్ష్మమ్మ, పొణకా కనకమ్మ, అట్లూరి వేంకటసీతమ్మ వంటివారు స్త్రీల విద్యా విషయాలపై వ్యాసాలు రాసారు. మద్దాలి సీతారావమ్మ 1929 గృహలక్ష్మి పత్రికలో వివాహ వయోనిర్ణయ బిల్లు వచ్చిందని వ్యాసంలో రాసారు. శారదా చట్టం వైవాహిక హక్కుల్ని, నిర్ణయాధికారాల్ని చెప్పే చట్టం అనీ రాసారు.
డా॥ కొటికల లక్ష్మమ్మ, కొడాలి సీతారామదేవి, కొత్తపల్లి కౌసల్యాదేవి, ఆలపాటి సీతమ్మ, కొంగర అన్నపూర్ణ, తుర్లపాటి రాజేశ్వరి, డా॥ ముత్తు లక్ష్మీరెడ్డి వంటివారు స్త్రీలు రాజకీయాల్లో పాల్గొనాలనీ, దేవదాసీ సేవానిషేధ చట్టాన్ని అమలులోకి తేవాలనీ, వేశ్యావ్యవస్థ, మద్యపానం, వరకట్న దురాచారాలను రూపుమాపాలనీ మహిళా సభల్లో ఉపన్యాసాలిచ్చినా, పత్రికల్లో వ్యాసాలు రాసినా తమదైన గొంతును వినిపించారు. (64 పేజీ)
ఇక కథలు కూడా ఎంతో ఆలోచనాత్మకమైనవి రాసారు ఆనాటి రచయిత్రులు. ‘హిందూ దైవం’ అనే కథ గుడిపూడి ఇందుమతీదేవి, (1924) (అనసూయ) రాసారు. కనుపర్తి వరలక్ష్మమ్మ, కుటీరలక్ష్మి; కనకవల్లి, బ్యాంకి బుచ్చిరాజు, ప్రేమప్రభావము, దీర్ఘ సుమంగళీభవ వంటి కథలలో సామాజికోన్నతికి స్త్రీల స్వతంత్ర అవసరమే రీతిలో కథలు రాసారు. రాజ్యలక్ష్మిదేవి ‘స ఫేర్ టీప్’ అనువాద కథను, ఆ భాస్కరమ్మ ‘ప్రభావతి’, సి.లక్ష్మి ‘శాంతి’ కథ, గుమ్మడిదుర్గాబాయి ‘నే ధన్యనైతిని’ కథ, వి.సుబ్బమ్మ ‘చిట్టి’ కథ తరతరాలుగా ఆడపిల్లల పెంపకంలో చూసే తేడాలను రాసారు. “పి.రుక్మిణీ బాయి వ్రాసిన ‘సుందరి’కథ, పెద్దాడ కామేశ్వరమ్మ ‘ఇది శాస్త్రీయమా?’ కథ వంటి ఆడపిల్లల పుట్టుకకు ఇవ్వాల్సిన విలువలను గురించి ఉన్నాయి.
ఆనాటి రచయిత్రులు నాటకాలు కూడా రచించారు. బాల్యవివాహాలు, స్త్రీవిద్య, సత్యాగ్రహోద్యమాలు వంటి నాటకాలు ఉదహరించారు. గుడిపూడి ఇందుమతి వ్రాసిన ‘ఉపాధ్యాయని’ (1923) నాటికలో పొరుగూరికి రైలులో వెళ్ళి వస్తున్న ఉద్యోగినికి వేరే స్త్రీ ఏవో కొన్ని నీతులు చెప్పినట్టు రాసారు. కనపర్తి వరలక్ష్మమ్మ వ్రాసిన ‘పురిటిగది’ (1923 శారద) అయ్యదేవర బాలాత్రిపుర సుందరి రాసిన ‘ఖద్దరు’ నాటకాలు ఆలోచనా త్మకమైనవి. మున్తా కోటేశ్వరమ్మ వ్రాసిన ‘సరిసమానులు గారా’ నాటకం వంటివి ఆనాటి సామాజిక పరిస్థితులను ఛేదించేలా రాసారు.
ఇక కవితలు విభాగాన్ని కనకదుర్గ గారు విశ్లేషిస్తూ, ఆనాటి పత్రికల్లోని కవితలు స్త్రీలను చైతన్యపరిచే కవితలను ఉదహరించారు. కవిత్వం ఎప్పుడూ ఎక్కడెక్కడ అవసరముంటే అప్పుడు ధ్వనిస్తుంది. ఆనాటి అతి ముఖ్యమైన సమస్య స్త్రీవిద్య పైన స్పందిస్తూ వేమూరి శారదాంబ ‘మాధవ శతకం’ రాసారు. ఈమె కవిత్వం 1901లోనే కళావతి పత్రికలో వచ్చింది.
“స్త్రీలు విద్యనేర్వ చెడిపోదురనుమాట
కల్లయనుదోప నెల్లఱకును
విశద పఱతునొక్క విద్యావతి చరిత్ర
సంగ్రహంబుగాగ చదువుడయ్య”
ఇంతకన్నా సూటిగా ఎలా చెప్తారు? ఎవ్వరు చెప్తారు? బాధితులే స్వచ్ఛంగా పలుకగలుగుతారు. విద్యావంతులైతే స్త్రీలు చెడిపోతారన్న భావాన్ని ఖండించిన కవిత్వాన్ని చూస్తాం. అలాగే సహాయ నిరాకరణోద్యమ భాగంగా కనపర్తి వరలక్ష్మి ‘స్వారాజ్యలక్ష్మి’ కవిత, నేమాని భారతీ రత్నాకరాంబ స్వజాత్యాభిమానాన్ని కాపాడుకోవాలని చెప్పిన కవితలను చూస్తాం.. అట్లాగే..
‘లలనలు సత్కళావిభవ లక్షణ సంయుతులౌచు..” అంటూ రాసిన వాడ్రేవు రంగనాయకమ్మ కవిత్వం చాలా బాగున్నది. ఆదిపూడి వసుంధరాదేవి స్వభాషలో దేశచరిత్రలను, శాస్త్రపరిజ్ఞానాన్ని ఆకాంక్షించారు. వి.జ్ఞానాంబ, వఠ్యం వెంకటానంతలక్ష్మి స్త్రీలు గౌరవ జీవితాన్ని గడపాలని కోరుతూ రాసారు. ద్రోణంరాజు లక్ష్మీబాయమ్మ, చట్టి రాధమ్మ వంటి కవయిత్రులు తోటి రచయిత్రి, సంఘసేవకురాలు మరణించిన సందర్భంలో కవితలు రాసారు. కాలనాథభట్ల సూర్యప్రకాశమ్మ ‘ఆంధ్రమాత’ అనే కవితనూ, వెలువోలు వసంత కుసుమావతి ‘స్త్రీ విద్య’ అనే కవితనూ, వెలుకోలు వసంతాదేవి ‘మహాత్మాగాంధీ’ కవితనూ, స్థానాపతి రుక్మిణమ్మ ‘ఝాన్సీ లక్ష్మీబాయి’ కవితనూ, నడివింటి వెంకటరత్నమ్మ ‘శారదా చట్రము’ అనే కవితను ప్రశంసిస్తూ రాసినటువంటి పద్య కవితలను కనకదుర్గ వ్రాయడాన్ని పరిశీలిస్తే 1929లలోనే స్త్రీల స్వాతంత్ర్యాన్ని దేశ స్వాతంత్ర్యాన్ని కాంక్షిస్తూ ఎన్నో కవితలు వచ్చాయని తెలుస్తున్నది.
నవలలు కూడా రెండింటిని పేర్కొన్నారు కనకదుర్గ. 1924లో పులవర్తి కమలావతీ దేవి ‘కుముద్వతి’ అనే నవలను రాసారు. శివాజీ కొడుకు శంభాజీ నరేంద్రునికి సంబంధించిన చరిత్రను తీసుకొని కుముద్వతి ఎలా వీళ్ళ అన్యాయాలను ఎదుర్కొన్నదీ చెప్తూ రాసిన నవల. అశ్వ విద్య తెలిసిన స్త్రీగా ధైర్యవతిగా, నీతిమంతురాలిగా, ప్రేమ త్యాగమయిగా కథానాయిక పాత్రలో కుముద్వతిని వర్ణించారు. పేదల పక్షాన నిలబడి, రాజ్యాన్ని రక్షించిన ధీరవనితగా ఈ పాత్రను తీర్చిదిద్ది ఆనాటి స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తికి ఉదాహరణగా రచించారని అంటారు కనకదుర్గ. మరోనవల 1924లోనే అ.పె. పిరాట్యమ్మ వ్రాసిన ‘శోభావతి’ నవల వేశ్యాలంపటం ఉన్న మగవాళ్ళ గురించి తీసుకొని, అందులో భార్య బాగా ఉండి చక్కని సంసారమున్న వాళ్ళు వస్తేనూ, పెళ్ళికాని యువకులు వస్తేనూ వాళ్ళలో మార్పు వచ్చేలా హితబోధ చేసినట్టు రాసారు. భార్యలపై అనురాగం ఏర్పడేలా వాళ్ళలోని గొప్పతనాన్ని చెప్పటం వంటి విషయంతో కుటుంబాలను నిలబెట్టిన వేశ్య కథ అంటారు.
1929లో లేఖలు కూడా వచ్చాయంటారు కనకదుర్గ. ధర్మవరం లక్ష్మీదేవి ‘శారదకు ప్రత్యుత్తరం’ అనే లేఖ రాసారు. శారదా యాక్ట్ వచ్చినా కూడా ‘అష్టవర్షాద్భవేత్కన్యా’ అనేది మారలేదనీ, చట్టాలు వస్తే మాత్రమేమి? స్త్రీలు తమంతటతాము సరిగ్గా మారాలనీ, స్వీయసంస్కారంతో స్వయంపోషకత్వాన్ని కలిగి ఉండాలని, అదే స్త్రీల స్వాతంత్ర్యానికి మూలమన్నారీ లేఖలో అని రాస్తారు.
ఊహా నెచ్చెలైన కల్పలలతకు ‘శారద’ పేరుతో వ్రాసిన ‘శారద లేఖల’ను రాసారు కనుపర్తి. వరలక్ష్మమ్మ స్త్రీలకు విద్య, ప్రపంచ జ్ఞానం కలిగితే జాతిసౌభాగ్యం కల్గుతుందన్నారు. అత్తల బాధలను, వంటకాల గురించి మాట్లాడుకునే స్థాయినుండి ఎదగాలని వ్రాశారనీ అన్నారు. స్త్రీలు రంగస్థల ప్రవేశానికి అర్హులనీ, ఉద్యమాలలో పాల్గొనాలనీ, స్వరాజ్యకాంక్ష కావాలనీ ఈ లేఖలలో అన్నారు. ఇక్కడివరకు ఈ విషయాలను చర్చిస్తూ 1930 నుండి ప్రారంభమైన ఉప్పుసత్యాగ్రహ స్వాతంత్ర్యోద్యమంలో తమ భాగస్వామ్యాన్ని తీవ్రతరం చేసారు స్త్రీలు అంటారు. 1930 నుండి 34 వరకు 80 వ్యాసాలు, 2 ప్రచురిత ఉపన్యాస వ్యాసాలు, 32 కథలు, 4 నాటకాలు, 35 కవితలు, 1 కీర్తన, 3 లేఖలు, 1 స్వీయచరిత్ర, 1నవల, 1 పాట వచ్చాయి అంటారు కనకదుర్గ. నెల్లూరు చెందిన పొణకా కనకమ్మ ఏడాది జైలుకెళ్ళిందనీ, కాంగ్రెస్ తొలి సభ్యురాలు, రాష్ట్ర ఉపాధ్యకక్షురాలనీ, కస్తూరిబా బాలికా విద్యాలయం స్థాపించారనీ అంటారు.
ఈ రచయిత్రులందరూ ఎంతో ఆలోచనాత్మకమైన వ్యాసాలను రాసారు. ఈ దేశంలోని స్త్రీలేమో బానిసత్వంతో ఉంటే దేశానికి స్వాతంత్ర్యం రావాలని ఎలా అనుకుంటారని ప్రశ్నించినా, చదువుకున్న స్త్రీలు ఎంతమందో లెక్కల ప్రకారంగా రాయడమైనా, స్త్రీలు ఒకరితో ఒకరు భావాలను పంచుకోవాలనీ, అక్షరజ్ఞానం ప్రభావవంతమైందనీ చెప్తూ రాయడమైన రచయిత్రుల ఆదర్శప్రాయమైన ఆలోచనలను తెలుపుతున్నాయి. ఆత్మన్యూనత ఉండవద్దనీ, శారీర సౌందర్యం పైన కాదు మానసిక సౌందర్యం పైన దృష్టి పెట్టాలనీ, స్త్రీలకు ప్రకృతి శాస్త్రం తెలియాలనీ రాసారు. దుర్గుణాలను చెప్పి భయభ్రాంతులకు లోను చేస్తారు జాగ్రత్తగా ఉండాలని వ్రాసారు. భర్త కోపిస్తే ఆత్మహత్యలు చేసుకోవద్దని రాసారు. విద్యావంతురాలైన భార్య ఉంటే ఇద్దరి మధ్య ప్రేమకు ఆస్కారం ఉంటుందనీ చెప్పారు. గృహ పరిశ్రమలు నిర్వహించే స్త్రీల గురించీ రాసారూ. ఇలా వివిధ పార్శ్వాలను రచయిత్రులు స్పృశిస్తూ వ్యాసాలు రాసినట్టు ఈ గ్రంథం ద్వారా తెలుస్తున్నది.
ఆచంట రుక్మిణమ్మ లాహోర్‌లో, పారిస్‌లో జరిగిన అఖిల భారత మహిళా సభకు అధ్యక్షత వహించారు. స్త్రీలు అంతర్జాతీయ స్థాయికైనా ఎదుగగలరని అన్నారన్నదీ రాసారు, లేళ్ళ నాగభూషణమ్మ. స్త్రీ రాజకీయ విషయాల్లో భాగస్వాములు కావాలన్నారు. ఇల్లిందల సరస్వతి ‘భరతమాతకొక జాబు’ అని వ్రాస్తూ, విద్యావిహీనులైన హిందూ స్త్రీలు ఉపన్యాసాలకు వచ్చినా సారాంశాన్ని గ్రహించలేకపోతున్నారని వేదన చెందారు. ఉపన్యాసాలు ఇస్తున్న స్త్రీలను వెక్కిరిస్తున్నారని ఆవేదన చెందుతూ భరతమాతకు లేఖ రాసారు. కొత్తపల్లి లక్ష్మీకాంతమ్మ, డి.రాజేశ్వరి, యన్.కమలావతీదేవి, మద్దాలి సీతారావమ్మ, గుమ్మడిదల దుర్గాబాయమ్మ వంటివాళ్ళు తరచుగా వ్యాసాలు వ్రాసేవారని తెలుస్తున్నది. స్త్రీలు శక్తిహీనులని పురుషులు ప్రచారాలు చేస్తున్నారనీ, దీన్ని తిప్పికొట్టాలంటే విద్య విజ్ఞానాలను సంపాదించుకున్నప్పుడే సాధ్యమవుతుందని వ్రాసారు.
ముప్పలనేని పుష్కరాంబ, పెద్దాడ కామేశ్వరమ్మ, చోరగుడి సీతమ్మ, ఇందిరాదేవి, అయ్యగారి రుక్మిణమ్మ, జి.వెంకమ్మ, యస్.రాజ్యలక్ష్మమ్మ, ఆచంట రుక్మిణి, దర్శి అన్నపూర్ణమ్మ, తూనుగుండ్ల వేంకట సుబ్బమ్మ, ఇల్లందల సరోజినీ దేవి, జి.శ్యామాలంబ, గంటి శేషమ్మ, సమయమంత్రి రాజ్యలక్ష్మమ్మ, రామరాజు మైత్రేయి, కోకా భానుమతి, బత్తుల కామాక్షమ్మ, సీరం సుభద్రాంబ, పరుచూరి భువనేశ్వరీ దేవి, పాలపర్తి సరోజినీదేవి, పేరి అన్నపూర్ణమ్మ, చావలి అన్నపూర్ణమ్మ, పరిమి సీతామణి, పాలకుర్తి సరస్వతి, కొప్పర్తి కృష్ణవేణి, కమలారత్నమ్మ, చిలుకూరి లక్ష్మీనర్సమ్మ, మనపాకం కమలమ్మ, పాకల సౌభాగ్యవతి, చిలకపాటి భారతీదేవి, వలివెల శాంతమ్మ, స్థానాపతి రుక్మిణమ్మ, దేశిరాజు భారతీదేవి, మందా ముత్యాలమ్మ, మద్దిశెట్టి తిరునాథమ్మ, వింజమూరి వెంకటరత్నమ్మ, చండూరు రత్నమ్మ, కందుకూరి శ్రీమహాలక్ష్మమ్మ, వేదవల్లి తాయారమ్మ, గాదె చూడికుడుతమ్మ, చిల్కపాటి సీతాంబ, తాడి నాగమ్మ, శ్రీసాధ్వీరత్నమ్మ, యార్లగడ్డ చిలుకమ్మ వంటి స్త్రీలు వ్యాసాలు రచించారు, అవి ఆనాటి గృహలక్ష్మి (1933) వంటి పత్రికల్లో ప్రచురించారు.
స్త్రీలు ధైర్యంగా అభిప్రాయ ప్రకటన చేయాలనీ, విడాకుల చట్టం ఉపయోగించే తాగుబోతులు, తిరుగుబోతులు దుర్మార్గులైన భర్తలతో ఉండాల్సిన పనిలేదు కాబట్టి విడిపోయినా తప్పులేదని నిర్భయంగా చెప్పారు. అంతేకాదు కొందరు రచయిత్రులు స్త్రీల సాధికారత కోసం ముందడుగు వేయాలంటే బహుభార్యత్వంలో, ప్రేమరాహిత్యంలో ఉండనక్కరలేదని వివాహ విచ్ఛేదం అవసరమనీ అన్నారు. స్త్రీలు బాగా చదువుకుంటే కన్యాశుల్కాలు, వరశుల్కాలు తగ్గుతాయనీ, స్త్రీలు అబలలు కారనీ, నీతి ధర్మం, భక్తి వంటివన్నీ స్త్రీ సమాజ అభివృద్ధికి తోడ్పడాలేగానీ, అట్టడుగున పడేయవద్దనీ ఎంతో ప్రామాణికంగా రాసారు. అలాగే స్త్రీలు ఉద్యోగాలు అనే అంశంపై వ్యాసాలు రాసారు.
“గరిటెఁనమృతమ్మ చిలికించు కాంతలౌర?” అన్న పద్యంలో స్థానాపతి రుక్మిణమ్మ వీటితో పాటు చాలా విషయాలపై కవితలనల్లారు. ఆత్మవిశ్వాస రాహిత్యంతోనూ మూఢవిశ్వాసాలతోనూ ఉన్నప్పుడు సాంఘిక దురాచారాలు పేట్రేగిపోతాయనీ, 1941 వరకే మాతృభాషలో విద్యాబోధన లేనందుకే స్త్రీలు వెనకబడి పోతున్నారు. గృహ పరిశ్రమల్లో ఎన్నో వస్తువులు తయారు చేయవచ్చని వ్యాపార రంగంలోనూ స్త్రీలు రాణించాలని రాసారు. కామరాజు మైత్రేయి అనే రచయిత్రి ‘పంజరంలో చిలుక’ అనే వ్యాసం 1941 గృహలక్ష్మిలో అచ్చయ్యింది.
గంటి కృష్ణవేణమ్మ “హింస-అహింస” అనే వ్యాసం రాసారు. దేశిరాజు భారతిదేవి, వడ్డాది కమలాదేవి “సప్తమ గంజాం మండల మహిళా సభ”లో మాట్లాడి విషయాలు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. స్త్రీల స్వాతంత్ర్యం కేవలం తీర్మానాల స్థాయికే పరిమితంగా ఉంటున్నాయి. గానీ ఆచరణలో లేవని చెప్పడం ఆలోచనాత్మకంగా ఉన్నది. పి.రాజరాజేశ్వరి ‘స్త్రీల హక్కులు’ అనే అంశంపై, ‘స్త్రీల ఆరోగ్యము’ అంశంపై శిఖరం కమలాంబ వ్యాసమైనా, ‘సంఘాన్ని బాగుచేసే ముఖ్య శాసనాలేవి’ అంటూ పాకల రాజామణెమ్మ రచించిన వ్యాసమైనా స్త్రీల జీవితాలు ముళ్ళపొదల్లో చిక్కిన గాలిపటాలేనని తెలియజేస్తున్నట్లే ఉన్నవని శీర్షికలతోనే ఒక అవగాహనకు వచ్చేలా ఉన్నవి. ఇది మా హక్కు అని తెలియని అమాయకతతో మ్రగ్గిపోతారు స్త్రీలు. మనిషి క్రమవికాసాన్ని పొందిన జంతువు. అసలు స్వరూపమేదో అడ్డుపడుతుందేమో, జాతి విభేదాలతో నడుచుకుంటుంటారు.
ఆ కాలంలో స్త్రీల జనాభా లెక్కలతో సహా వివరాలు ఇచ్చారు కనకదుర్గ. ఈ విషయాలన్నీ కూడా చూస్తే ఆనాటి పత్రికలు పెద్ద ఉపకారాన్ని చేసాయని తప్పకుండా అనిపిస్తుంది. ప్రజా ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని చెప్పడమైనా ‘మాతాశిశువుల ఆరోగ్యమే దేశ క్షేమమ’ని తెలియజెప్పడమైనా చాలా ఆలోచనాత్మకంగా ఉన్నాయని అనిపిస్తున్నది.
పాకల రాజామణెమ్మ, ‘సంఘాన్ని బాగుచేసే ముఖ్య శాసనాలేవి’ అనే వ్యాసమైనా, ‘రెండవ ప్రపంచ యుద్ధ పరిణామాల’ను గురించిన విషయాలైనా స్పష్టతనిచ్చేవే. ఇక వల్లభనేని సీతామహా లక్ష్మమ్మ ‘భోగం మేళాల నిషేధం’ అనే వ్యాసంలో ఎన్ని పేర్లతో వీళ్ళు పిలవబడ్తున్నారు, వారిపై ఆంక్షలేవి? పురుషుల భోగలాలసకు ఇవి చిహ్నాలని తెల్పుతూ రాసారు. ఆచంట రత్నకుమారి ‘వరకట్నాలు’ పైన, మద్దూరి మీనాక్షమ్మ ‘నవోదయము’ అనే వ్యాసంలో స్త్రీ సంఘాల కృషి గురించైనా, వల్లూరపల్లి వెంకట రత్నమణీబాయి కురువృద్ధులకు అమ్మాయిలనిచ్చి పెళ్ళి చేయడాన్ని నిరసిస్తూ రాసారు.
‘పెండ్లి చూపులెంతవరకు సమంజసం’ (జులై 1947 గృహలక్ష్మి) వ్యాసాన్ని కృష్ణబాయి వ్రాసారు. బోడపాటి అలివేలమ్మ ‘రావుపాటీ శిఫార్సులు’ వ్యాసంలో ఆస్తిహక్కు అవసరం, బహుపత్నీ నిరోధం వంటివి స్పృశించారు. ఇలా విస్తృతమైన వ్యాసాలలో స్త్రీలు చాలా గట్టిగానే వారి వారి అభిప్రాయాలు వెలిబుచ్చారు. (172-200 పేజీలు)
ఇక కథల విషయానికొస్తే 1940లలో పత్రికలలో 11 కథలే పత్రికాముఖంగా చూస్తున్నాం. ఇది నలభైల మాట! ఈ కథలు ఆనాటి స్త్రీల నిర్బంధ జీవితాలను చూపినవి. కనుపర్తి వరలక్ష్మమ్మ ‘ఎప్పటికో జ్ఞానోదయం’ కథ. 1940 ఆగస్టు గృహలక్ష్మి పత్రికలో వచ్చింది. “స్త్రీల మధ్య సంఘీభావం ఏర్పడితే తమ అధికారాలకు ముప్పు వస్తుందనే భయం కలగడమేనని తెలియజేసింది. కాబట్టి స్త్రీలకు జ్ఞానోదయం కలగాలంటే హరికథల కంటే కూడా స్త్రీ సమాజాలకు వెళ్ళాలనే యిష్టం స్త్రీలకు ఏర్పడాలని రచయిత్రి సూచించింది” అని విశ్లేషణ చేస్తారు కనకదుర్గ.
‘నీలాటిరేవు’ కథలో హిందూలా అనే చట్టం రావాలనీ, యువకుల హృదయాలలో పరివర్తన వస్తేగానీ ఈ వరకట్న సమస్య తీరదని కనపర్తి వరలక్ష్మి రాసిన కథ, ఆమె ఒక స్త్రీగా ఎంత వేదన చెందితేనో ఒక రచయిత్రిగా ఇంత అభ్యుదయాన్ని ఆకాంక్షించలేరు అనే అర్థం స్ఫురిస్తున్నది.
పులిపాక బాలాత్రిపుర సుందరమ్మ ‘ఆదర్శ నారీమణి’ కథ, ఒక పొదుపు చేసే స్త్రీకీ, ఒక దుబారా చేసే స్త్రీకి మధ్య ఉన్న అంతరాన్ని రెండు భిన్న కోణాల్లో చూపుతుందని రాసారు. ‘ప్రేమ వేదిక మీద’ కథను చంద్రకాంతం రచించారు. ఒక జడ్జి కూతురు స్వభావానికీ, ఆమె భర్త స్వభావానికీ మధ్య ఉన్న తేడా అంతా ఖద్దరు బట్టలు కట్టడమనే అంశంపై రాసిన కథ. ఆచంట సత్యవతమ్మ ‘దసరా బహుమానం’ కథ కూడా ఇదే అంశంపై ఉన్న కథ. ఇక, ఆయపెళ్ళి రామలక్ష్మి వ్రాసిన ‘ధన్యజీవులు’ కథ ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన కొడుకు మాలవారికి వైద్య చేయటం నచ్చక ఇంట్లో నుండి వెళ్లగొట్టబడతాడు. కాని అతని భార్య అతని కూడా మాలపల్లిలోనే ఉంటూ అక్కడి పిల్లలకు చదువు నేర్పిస్తూ ఉంటుంది. సమత్వ భావనే దేశభక్తి అని చెప్పిన ఈ కథ 1941 గృహలక్ష్మిలో ప్రచురించారు.
సమయమంత్రి రాజ్యలక్ష్మి కథ ‘రెండు వరాలు’ స్త్రీకి ఇంటా బయటా ఉన్న స్వేచ్ఛలేని తనాన్ని రాస్తే, బులుసు ప్రకాశమ్మ కథ ‘పిచ్చిది’ పితృస్వామ్య వ్యవస్థలో వితంతువుల జీవనచిత్రణ చేసారు. ఈమె మరో కథ ‘నీకేసి చూసినంతమందీ’ కథ పైకి ఉద్యమవాదులు లోపల భార్య స్వాతంత్ర్యాన్ని భరించలేని డొల్లతనం చూపే కథ. పి.హెచ్. దమయంతి కథ ‘దిక్కు మాలు మాల బాలకుని రక్షణ (1944 జూన్, జులై, హిందూ సుందరి) హరిజనోద్ధరణ కోసం నడుం కట్టిన కడప రాయచోటి డిప్యూటీ కలెక్టర్ ఆదర్శాన్ని చూపింది.
చుండూరు రమాదేవి కథ ‘బాతాఖాని’ నామసార్థకతలో సాగింది. ఆచంట శారదాదేవి ‘ఏమి అదృష్టం’ కథ డబ్బున్న వాడికంటే అనురాగం చూపే భర్త ఉండటం మంచిదని చెప్పిన కథ. 1940 నుండి 47 మధ్య వచ్చిన కథలలో స్వాతంత్ర్య పోరాటాల విషయాలపైనా, స్త్రీల చైతన్యం కోసమూ రాసినవిగా వీరు గుర్తించారు.
నాటకాలు కేవలం రెండే వచ్చాయని చెప్తూ, దేశిరాజు భారతీదేవి ‘వరకట్న ప్రహసనము’ నాటకం 1941 గృహలక్ష్మిలో వచ్చిందనీ చెప్తూ వరకట్నం తీసుకుంటే వరుని జీవితానికి భద్రత లేదని ఒక స్వామిజీలా వేషం కట్టిన స్నేహితుని నాటకంతో వాళ్ళు తీసుకోరన్నట్లు రాసారు. ప్రయోగాత్మకంగా చేస్తూ కనువిప్పు కలిగించారని అంటారు. భావరాజు రాజ్యరత్నమ్మ ‘చర్చ’ (గృహలక్ష్మి) అనే నాటకాన్ని స్త్రీల సాధికారత కోసం భార్యాభర్తల మధ్య జరిగిన వాగ్వివాదంగా నాటకీకరించారు. ఇక ఈ కాలంలో కవిత్వం బాగానే వచ్చినట్టు తెలుస్తున్నది.
“అబలలము కాము తేజమ్మునందినట్టి గృహిణులము మేము..” అంటూ వక్కలంక రమాబాయి రాసిన కవిత ఆనాటి గృహలక్ష్మిలో ప్రచురించారు. వల్లభనేని రంగాదేవి, రాజకీయాలతో చీలికలు లేని మహిళా సంఘాలు గొప్పవని ‘మహిళా – మహత్తు’ అనే కవితను, దేశిరాజు భారతీదేవి ఆంధ్ర స్త్రీల శక్తియుక్తులు దేశ సేవలో వినియోగించాలని ‘రాష్ట్ర ప్రబోధము’ అనే కవితను, కాంచనపల్లి కనకమ్మ ‘స్త్రీ స్వాతంత్ర్యము’ అనే కవితను, గంటి కృష్ణవేణమ్మ ‘దేశభక్తి’ అనే కవితనూ రాసారు.
కొండపల్లి సుభద్రాంబ ఈ సమాజం కొందరిని అస్పృశ్యులుగా భావిస్తున్నందుకు ఖండిస్తూ ‘క్షమార్పణ’ అనే కవితను, స్థానాపతి రుక్మిణమ్మ విప్లవగీతాలతో ఉద్యమంలో పాల్గొనాలని ‘గీత’ అనే కవితను, మధురాపంతుల విజయలక్ష్మి పురుషులతో పాటు స్త్రీలూ సమంగా పోరాటాలలో పాల్గొనాలనీ, దేశ వేదవల్లి తాయారమ్మ ‘పతాక సందేశము’ అనే కవితనీ, అడుసుమిల్లి సరస్వతీదేవి ‘పయనము గండీ’ అనే కవితనూ, చేబ్రోలు సరస్వతీదేవి ‘అంజలి’ అనీ, కవయిత్రులంతా స్త్రీలు తమ తోటి స్త్రీలను చైతన్యపరచాలని, స్వాతంత్ర్య సాధన కోసం కృషి చేయాలనీ, భరతమాత సంకెళ్ళు తుంచేయాలనీ పిలుపునిస్తూ రాసారు.
“భారతీయుల పౌరుషమ్ము/భారత స్త్రీ పౌరుషమ్ము
భారత స్త్రీల మేధస్సు / కంపెనీ సైన్యాన్ని గగ్గోలు పరిచాయి/ పాశ్చాత్య సామ్రాజ్య పటిమ నెదిరించాయి” అంటూ..
“ఫాసిజాన్నెగర గొడదాము/ప్రజల శక్తిని చూపుదాము/
మనది భారతదేశమమ్మా..”
అంటూ ఆయుధాలు లేకపోయినా గెరిల్లా దాడితో మట్టు పెట్ట వచ్చనునని లలిత ‘మనది భారతదేశం’ అనే కవితలో రాసారు.
వట్టికొండ విశాలాక్ష్మి “అభ్యుదయ గీతాలు” అనే స్వీయ కవితా సంపుటిలో (1943) “ప్రబోధ” మనే గీతంలో..
“పవిత్ర భారతభూమి మీదనే..
బాంబుల వర్షం కురియుచునున్నది
ఆలసించెదవదేల! సోదరా
హతమార్చర నీ శత్రు సైనికుల” అనీ,
“హిందూ ముస్లీంకు సందేహాలు ఎందులకోయి..”,
“ఆయుధాల్లేకున్న ఐకమత్యమే మంచి ఆయుధమ్మని నమ్మి మనము..” అంటూ గాఢమైన కవిత్వాన్ని రాసారు.
అలాగే “చెలోవీర యువతి” అనే ఇంకో కవితలో..
“చెలో వీరయువతీ/రణానికి చెలో ధీర యువతీ
శౌర్య సహిత సద్గుణ జాత, పావన చరిత, భారత వనితా”
అంటూ ఉత్తేజపూరితంగా స్త్రీల కోసం కలం ఎత్తారు. అంతేకాదు వీరి ‘భవిష్యత్తు’ అనే కవిత 1945 జులై భారతిలో ప్రచురితమైంది.
వట్టికొండ విశాలాక్ష్మి “కష్టములెన్నైనా రానీ నిష్ఠూరములెన్నైనా రానీ/ఇష్టపడి స్త్రీ జాతి కొరకే కష్టపడగలనని” అంటూ ‘శపథం’ కవిత రాసింది. వీర మాచినేని సరోజిని “జయహో భారతమాత” కవిత, అవ్వారి పూర్ణ ‘ఆశయం’ కవిత, కనకదుర్గ ఉదహరిస్తూ స్త్రీ జనోద్ధరణ, స్వాతంత్ర్యాన్ని కాంక్షిస్తూ, అస్పృశ్యతను పోగొట్టాలని ప్రబోధ గీతాలను రాస్తూ అక్షర పతాకలనెత్తిన కవయిత్రులను గురించి రాసింది.
పాట, ఎప్పటిలాగే ప్రజలకు చేరువకు చేర్చే తనదైన శైలిని మనము ఆ కాలంలో గమనించవచ్చు. 1945, అరసం వారి తెలుగుతల్లిలో వచ్చిన వట్టికొండ విశాలాక్ష్మి వ్రాసిన పాట –
“ఫాసిజమ్మంతటికి/ పట్టుగొమ్మైనట్టి
నాజిజాన్ని జనాళియే, చర్చిలూ/
నాశము చేసిందిలే/
దాస్యాంధకారాన/దారి తెలియని ప్రజలు
నిస్పృహను వదిలారులే, చర్చిలూ/ నేత్రాలు తెరిచారులే.. చర్చిలూ”
అంటూ చర్చిల్ ఫాసిజాన్ని, హిట్లర్ నాజిజమ్నూ ఖండిస్తూ కవితాత్మక గేయం రాసారు. ఇక కనపర్తి లక్ష్మీనరసమ్మ తన నెచ్చెలి కల్పలతకు వ్రాసిన ‘శారద లేఖలు’ (1940, గృహలక్ష్మి చాలా ప్రసిద్ధి పొందిన లేఖలు. మత, వర్గ భేదాలతో మాతృగర్భాన్ని ముక్కలుగా చీల్చాలనుకుంటున్నారనీ, ఈ వివాదాలే పరదేశీయులకు పాదం మోపేలా చేసాయనీ, వైషమ్యాలు వీడి కలసిపోవాలనీ ఆశిస్తూ రాసారు. సరోజిని దేవి చెప్పినట్లు, హిందూ మహమ్మదీయులు ఈ దేశమనే వస్త్రంలో పడుగు పేకల్లా ఉన్నారని; ఏ దారాన్ని ఏ వైపు నుండి తీసినా భారతదేశ స్వరూపం విరూపం అవుతుందని రాసారు. ఇంతటి వివేచనాత్మక కవిత ఇది. ఇది “రచయిత్రి యొక్క రాజనీతిజ్ఞతకు, ముందుచూపుకు నిదర్శనము” అంటారు కనకదుర్గ. ఈ కవిత్వాన్ని శారద అనే పేరుతో భావపురి (బాపట్ల) నుండి కనుపర్తి వరలక్ష్మి గారి ‘శారద లేఖలు’ చాలా ప్రసిద్ధి పొందినవి. ఆనాటి నిత్యావసరాల వస్తువుల కష్టాలు రేషన్ వస్తు వినిమయమూ వంటివీ, స్త్రీల చైతన్య విషయాలు, 1942లోని విప్లవాత్మక బ్లాకౌట్ లతో మిలిటరీ వీరవిహారాలు, దేశభక్తుల కడగండ్లు వంటివీ తమ నెచ్చెలికి లేఖల్లో వ్రాసినట్టున్న ఈ సాహిత్యం ఆనాటి సాంఘిక చరిత్రకు, రాజకీయాలకు ఉదాహరణగా నిలుస్తుంది అనడంలో అనుమానమే లేదు (422 పేజి). ఇక్కడివరకు వివరిస్తూ కనకదుర్గ గారు “స్త్రీల సాహిత్యంలో వచ్చిన విప్లవాత్మక ఆలోచనలు ఫలించేటట్లుగా సాహిత్యం ప్రతిఫలించింది” అంటారు. క్రమంగా స్త్రీలకు వచ్చిన అవకాశాలు గానీ, వాటిని వినియోగించుకుని తమను తాము చైతన్యపరుచుకోవడమే కాకుండా సమాజాన్ని చైతన్యపరిచేలా ఎదిగిన సాహిత్యంలా ఇక్కడివరకు గుర్తించవచ్చు.
ఇక భారతదేశానికి స్వాతంత్య్రం పోరాటాలు ఫలవంతమయ్యేవేళ స్త్రీల సాహిత్యం ఎట్లా వచ్చిందో పరిశీలిస్తే, పది వ్యాసాలు వచ్చాయంటారు కనకదుర్గ. వల్లభనేని సీతామహాలక్ష్మి, డాక్టర్ ముత్తు లక్ష్మీదేవి రాస్తూ “సరోజినీ నాయుడు వర్సెల్ సంధి తర్వాత స్వతంత్ర రాజ్యం సమకూడిన తర్వాత విదేశీ పర్యటనలో పాల్గొన్నప్పుడు 44 దేశాల పతాకాలు ఉన్నాయి గానీ భారతదేశం పతాకం లేకపోవడం తనకు సిగ్గు చింత కలిగిందనీ ఆమె బాధపడిన విషయాలను పత్రికలో వచ్చిన వీరి వ్యాసంలో రాసిన విషయాన్ని ఉదహరించడాన్ని వివరించారు. అలాగే కడప రామసుబ్బమ్మ (మాజీ కడప జిల్లా బోర్డు అధ్యక్షురాలు) ‘స్వాతంత్ర్యము – మన కర్తవ్యం’ అనే వ్యాసం గృహలక్ష్మి పత్రికలో వచ్చింది. అలాగే గృహలక్ష్మి పత్రికవారు గోనుగుండ్ల లక్ష్మీనరసమ్మ గారి ఉద్యమాలను గురించీ, వారు సి.క్లాసు జైల్లో ఒక ఏడాది కఠిన శిక్షను అనుభవించారనీ ప్రచురించిన విషయాన్ని రాసారు. యామినీ పూర్ణ తిలకమ్మ దేశసేవ అనే వ్యాసాన్ని ఆమె కూతురు కనకదుర్గ వ్రాసారనీ ‘పతిత స్త్రీ జనోద్ధరణ ఆమె యొక్క ప్రత్యేకతగా నేటికీ స్మరణీయమే అంటూ ఈ గ్రంథ రచయిత్రి కనకదుర్గ గారు అంటారు. ఆచంట సత్యవతమ్మ రాజకీయ పార్టీల ప్రభావం దేశాభివృద్ధికి ఆటంకం కలిగిస్తుందని వ్యాసం రాసారు.
పాటూరు బాలసరస్వతమ్మ గారు ‘శారద’ అనే పత్రికకు సంపాదకురాలు. ముత్యాల సరోజినీ దేవి, విజయలక్ష్మి పండిట్ వంటి వారిని గురించి ప్రచురించారు. నడింపల్లి శారదా కుమారి, బత్తుల కామాక్షమ్మ వంటి రచయిత్రులు స్త్రీలు కర్తవ్యాన్ని నిర్ణయించుకొని ముందడుగు వేయాలని వ్రాసారు అంటూ విశ్లేషణ చదివితే ఆదర్శవంతమైన ఆలోచనలున్న రచయిత్రులు సందర్భాన్ని బట్టి రచనలు చేస్తూనే ఉన్నారని అర్థం అవుతున్నది.
కవిత్వం ఎప్పుడైనా జీవనదిలా ప్రవహిస్తూనే ఉంటుందని వింజమూరి సీతాదేవి రచించిన ‘పంజరం’ అనే కవితను చదివితే తెలుస్తుంది.
“అరుణరాగాన పూర్వాద్రియందు స్వేచ్ఛ
కొలువుతీర్చు ప్రొద్దున వియత్తలములోన
కెగిరిపోయితి గాని, యీ గగన పథము
దూరమై తోచె, స్వేచ్ఛయే భారమయ్యె
తరతరమ్ముల దాస్యమ్ముపై బరువు దోచు
స్వేచ్ఛ నీ హృదయమ్మ మోసికొనలేదు”
అని రాయడం ఎంతో ఆలోచనాత్మకంగా ఉన్నది. తరతరాలుగా ఆడవాళ్ళు దాస్యంలో మగ్గిపోయి ఉన్నారనీ, విద్యతో కాస్త స్వేచ్ఛ దొరికినా, దాన్ని బరువుగానే భావిస్తున్నారనీ అనడంతోనే వ్యంగ్యంతో జాతిని మేల్కొలుపులు పలికారని గ్రహిస్తాం. ఈ కాలంలోనూ శారద లేఖల్లో స్వాతంత్ర్య విశేషాలను వ్రాస్తూ ఆనాటికే మరణించిన ఆనాటి ఉద్యమ నాయకుల పేర్లను వ్రాశారు కనుపర్తి వరలక్ష్మమ్మ. “ఇరువది లక్షల శిక్షితా సైన్యాన్ని తయారు చేసి భారతదేశానికిచ్చిన సుభాష్ చంద్రబోస్ నాడు లేడనీ, వారి పవిత్రాత్మలు మహోదయాన్ని ఉపలక్షిస్తున్నాయని భావించవచ్చని వ్రాసిందని వివరించారు కనకదుర్గ.
ఇక స్వాతంత్ర్య మహోత్సవ సాహిత్యం అంటూ వ్రాసిన చాప్టర్ ప్రారంభంలో అఖిల భారత మహిళా సభ తీర్మానాన్ని వివరిస్తూ ఎన్నో విషయాలను రాసారు. అమృతకౌర్ ఆరోగ్యశాఖామంత్రిణిగా, రాణీ లక్ష్మీబాయి ఏషియన్ రిలేషన్ కాన్ఫరెన్స్ కౌన్సిల్ ప్రతినిధిగా, కామేశ్వరి నెహ్రూ ఫండు రిహాబిలిటేషన్ మంత్రిత్వంలో స్త్రీల శాఖకు డైరెక్టర్‌గా ఉన్నారనీ ఇటువంటివెన్నో వ్రాస్తూనే స్వాతంత్య్రం సిద్ధించే నాటికి భారతదేశపు ఆర్థిక స్థితి డొల్లతనాన్ని ఆనాడు వీళ్ళంతా తెలియజేసారనే సమాచారాన్నంతా కనకదుర్గ ఉటంకించారు.
“పరులు మెచ్చెడి భూమి నా భరతభూమి
వేయి కాలాలు స్వేచ్ఛమై వెలయు గాక”
అంటూ రాసిన కనుపర్తి వరలక్ష్మి గారి కవిత్వాన్ని ఉదహరించారు. పొణకా కనకమ్మ “దినమణి ప్రాభాత వర్తనముల/అమ్మా! నీ చేతి కాగడాయై వెలగ” అని రాసారనీ, చేజెర్ల రామరత్నమ్మ ‘హెచ్చరిక’ అనే కవితలో
“అక్రమంబగు పాలక మంతమొంది
సత్యపాలన మిపుడే సంస్థాపనాయే
ఎర్ర కపిగము లీనాడు తుర్రుమనిరి
బడసితిమి గాదె స్వారాజ్య భవనమిలను”
అని వ్రాశారనీ ఉదాహరణలను వ్రాశారు. ఇక, ఆర్. జనాబాయి ‘కమల కాపురం’ (గృహలక్ష్మి, 1948 జులై) సంభాషణాత్మక రూపకాన్ని వ్రాశారనీ, కుటుంబ ఆర్థిక వ్యవస్థలో స్త్రీల భాగం ఎంతో ఉంటుందనేప్పుడు ఖద్దరు వస్త్ర తయారీ కోసం నూలును వడకడం వంటివన్నీ ఉదహరిస్తూ “ఈ సాహిత్యం అంతా ఎంతో అమూల్యమైంది” అంటారు. “స్త్రీలు వ్యక్తి స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకుంటూ దేశ స్వాతంత్ర్యాన్ని సంరక్షించుకోవటమే స్త్రీ, పురుషుల ముందున్న నిరంతర కర్తవ్యం. ఆ ఉద్యమ సాహిత్యాన్ని చదివి స్త్రీలు వ్యక్తి స్వాతంత్ర్యపు విలువలను తెలుసు కోవాల్సిన అవసరం నేటికీ ఉంది” అని తమ అభిప్రాయాన్ని చాలా స్వచ్ఛందంగా పంచుకున్నారు. ఈ గ్రంథం చివరలో స్వాతంత్య్రోద్యమ స్త్రీలు – కారాగార వాస పట్టిక అనే అనుబంధంలో 343 మంది స్త్రీల పేర్లు, ఎన్నాళ్ళు ఉద్యమాల్లో పాల్గొన్నారు, ఏ శిక్ష ఎన్నేళ్ళు అనుభవించారు అనే పట్టికను ఇచ్చారు. అలాగే సాహిత్య సూచికల పట్టికలో దాదాపు వందమంది కవయిత్రుల, రచయిత్రుల పేర్లు, ఎవరెవరు ఏవి, ఏఏ పత్రికల్లో ఎప్పుడు రచన చేసారో వివరంగా పట్టికను ఇచ్చారు. ఇదంతా ఎంతో గొప్ప కృషి. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయనో, ఉద్యోగమే దొరకాలనే కాదు ఈ పరిశోధన వెనుక గల ఆంతర్యం. కనకదుర్గ గారి అంతరంగంలో స్వాతంత్ర్య పోరాటాల్లో పాల్గొన్న స్త్రీమూర్తుల విషయాలు వివరాలు సభ్య సమాజానికి అందజేయాలని! ఎవరిది వాళ్లే చెప్పుకోవాలి అనే ఓ కొత్త పంథా మొదలైన ఈ నేపథ్యంలో తానో స్త్రీగా, తానో రచయిత్రిగానో ఆనాటి నాయకీమణుల, కవయిత్రుల, రచయిత్రుల పక్షాన వారి సేవకు ప్రతిరూపం ఈ గ్రంథం అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇంతటి నిస్వార్థ సాహిత్యసేవ చేసిన కనకదుర్గ గారిని మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.
***
రచన: డా. జంధ్యాల కనకదుర్గ
ప్రచురణ: జంకదు ప్రచురణలు, గుంటూరు
పేజీలు: 488
వెల: అమూల్యం
ప్రతులకు:
డా. జె. కనకదుర్గ,
5-35-18, 3వ లైను, 18వ క్రాస్ రోడ్డు,
బ్రాడీపేట, గుంటూరు.
ఆంధ్ర ప్రదేశ్ 522002
ఫోన్: 9491140299
email: jankadu1953@gmail.com