Site icon Sanchika

స్వాతంత్య్ర సంగ్రామంలో భావ సమైక్యతకు తెలుగు సాహిత్యం ఎలా దోహదపడింది?

[box type=’note’ fontsize=’16’] దేశ స్వాతంత్య్ర పోరాటంలో భావ సమైక్యతకు తెలుగు సాహిత్యం దోహదం చేసిన వైనాన్ని ఈ వ్యాసంలో వివరిస్తున్నారు డా. సి.భవానీ దేవి. [/box]

“అపి స్వర్ణమయీలంకా
నమే లక్మణ! రోచతే
జననీ జన్మభూమిశ్చ
స్వర్గాదపి గరీయసి!”

ఇవి శ్రీరాముడు లక్ష్మణునితో రావణ సంహారం జరిగిన తర్వాత అన్న మాటలు. దీని భావం ఇలా ఉంది!

“లక్ష్మణా! ఈ లంకా నగరం ఎంత స్వర్ణమయమయినా నాకే మాత్రం ఇష్టంగా లేదు. ఎందుకంటే, మనకు జన్మ ఇచ్చిన తల్లి, జన్మ భూమి స్వర్గం కంటే కూడా ఎంతో గొప్పవి.”

శ్రీరామాయణం ద్వారా మనం నేర్చుకోవలసింది, ‘మాతృదేశంపై మమకారం. దేశ భక్తిని కలిగి ఉండటం’.

జాతీయ భావాలున్న వాళ్ళకి స్వాతంత్య్రకాంక్ష తప్పనిసరిగా ఉంటుంది. జాతీయత అంటే ఒక జాతి ఆత్మగౌరవానికి, ఔన్నత్యానికి సంబంధించిన స్థితి! స్వాతంత్య్రం లేని మనిషి, లేదా దేశ పరిస్థితి ఒడ్డున పడిన చేపలా ఉంటుంది.

బ్రీటీషు వారి పాలనలో వారి నిరంకుశ క్రూరవైఖరి వల్ల భారతీయులో అసహనం వెల్లువయింది. దేశ ప్రజలంతా ఏకం కావాల్సిన సమయం వచ్చేసింది. 1905వ సంవత్సరంలో బెంగాలు విభజనతో భారతీయుల హృదయాలలో అగ్ని రాజుకుంది. ఆంగ్లేయులు ఆధునికతనూ, నూతన విద్యావిధానాన్ని, నవీన శాస్త్రావిష్కరణలను నూతన సమాజాన్ని ఇచ్చినా దేశ స్వాతంత్య్రాన్ని అపహరించారనే విషయం యావద్భారతతాన్ని జాగృతపరిచి జాతీయోద్యమాన్ని ఉవ్వెత్తున విజృంభింపజేసింది. నాటి జాతీయోద్యమకారుల్లో లాలా లజపతిరాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్ చాలా ప్రముఖులు. వీరినే లాల్-బాల్-పాల్ అని పిలిచేవాళ్ళు. బిపిన్ చంద్రపాల్ బ్రిటీషు వారికి వ్యతిరేకంగా చేసిన ప్రసంగాలు ప్రజల్లో దేశభక్తిని ప్రజ్వరిల్ల జేశాయి. ఆయన కలకత్తా నుంచి ఆంధ్రప్రాంతంలో పర్యటించి రాజమహేంద్రవరంలో చేసిన ఉపన్యాసం వల్ల తెలుగు ప్రజల్లో జాతీయాభిమానం అగ్నిశిఖలై పైకెగిసింది. ఆ సభలోనే తొలిసారిగా తెలుగులో జాతీయోద్యమ రచన చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి నోట ఆశువుగా ప్రవహించింది.

“భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగ దూడలై ఏడ్చుచుండ
తెల్లవరను గడుసరి గొల్లవారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి.”

ఈ పద్యం ఆనాడు ప్రతి తెలుగు వారి నోట ప్రతిధ్వనించింది. ‘వందేమాతరం’ నినాదంలో జాతీయవాదం బలపడింది. 1917 సంవత్సరంలో గాంధీజీ ఉద్యమంలో ప్రవేశించాక సహయ నిరాకరణోద్యమం, స్వదేశీ ఉద్యమం, ఖాదీ ఉద్యమం, సైమన్ కమిషన్ బహిష్కరణ, శాసనోల్లంఘన ఉద్యమం. ఉప్పుసత్యాగ్రహం మహోద్యమాలుగా భారతీయుల స్వాతంత్య్ర కాంక్షాకేతనాన్నెగరేశాయి.

తెలుగు కవులు స్వాతంత్య్ర సంగ్రామంలో జాతీయ భావ సమైక్యతకు తమ వంతు అక్షర కృషిని దేశ ప్రేమను సమర్పించారు. ‘జాతీయత’ అనే భావాత్మక పదాన్ని తొలిసారిగా స్వామి వివేకానంద ప్రచారం చేశారు. ఈ ఏకసూత్రమే భారత ప్రజలను ఏకత్రాటిపై నడిపించింది. భౌగోళిక, జాతీయ, ధార్మిక, సాంస్కృతిక, రాజనైతిక ఏకత్వాలతో ‘భారతమాత’ను జాతికి ప్రతీకగా నదీనదాల సమన్వయాన్ని కూడా సాధించిన మహనీయ దేశ సంస్కృతి పట్ల ఆరాధనా భావం పెరిగింది.

స్వాతంత్య్రోద్యమ కాలంలో భాగంగా ఎందరో ఉద్యమకారులను లాఠీలతో కొట్టారు పరాయి ప్రభుత్వంవారు. జైళ్ళలోకి తోశారు. అయినా ఎవ్వరూ భయపడలేదు. లాలాలజపతిరాయ్‌ను జైలులో నిర్భందించినప్పుడు ఆంధ్రదేశంలో కూడా నిరసన ఉద్యమం వెల్లువయింది. చిలకమర్తి ఇలా… ఒక పద్యంలో ఉత్తేజపరిచారు.

“చెరసాలల్ పృథు చంద్రశాలలె యగున్,
చేదోయి కీలించు నయ్యర దండల్
విరిదండలయ్యెడును,
హేయంబైన చోడంబలే పరమాన్నంబగు,
మోటు కంబళులు దాల్పన్ పట్టు సెల్లాలగున్
స్థిరుడై యే నరుడాత్మ దేశమును
భక్తింగొల్చు నవ్వానికిన్”

జాతీయోద్యమకాలంలో మంగిపూడి వేంకటశర్మ, తుమ్మల సీతారామమూర్తి, వడ్డాది సీతా రామాంజనేయకవి, వేదుల సత్యనారాయణశాస్త్రి… మొదలైన కవివరులెందరో మాతృస్తుతి – దేశస్తుతి చేసి దేశాభిమానం పెంచటానికి, దేశ వైభవాన్ని కీర్తించే రచనలు చేశారు. ఆసేతు హిమాచలంలో అన్ని ప్రాంతాల అన్ని భాషల్లోని కవులు భావ సమైక్యతను, జాతీయతను ప్రోది చేసే శక్తి వంతమయిన సాహిత్యాన్ని సృష్టించారు.

చిలకమర్తి భారమైన ఆంగ్ల ప్రభుత్వ పన్నుల గురించి…

“నేల దున్నుదమన్న జాలతరము పన్ను,
నీరు గావలెనన్న నీటి పన్ను,
వాణిజ్యమునరింప వచ్చు వడికి పన్ను,
సరుకులమ్ముదమన్న సంత పన్ను,
కర్రలమ్ముదమన్న బండి హసీలు పన్ను,
కొంపమ్ముకున్నచో స్టాంపు పన్ను,
ఉన్న మట్టుకు తినకుండ ఉప్పు పన్ను,
ననెడు పన్నులు దిశదీసె జనులనెల్ల”

పరతంత్రాన్ని భరించలేని కవులు దేశ భక్తితో అనేక రచనలు చేశారు.

“దండాలు దండాలు – భారతమాత
అవి అందుకొని దీవించు – భారతమాత” అనే పాట ప్రజల నాలుకలపై నర్తించింది.

రాయప్రోలు రాసిన గేయం

“ఏ దేశమేగినా ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపురా నీ జాతి నిండు గౌరవము”

అంటూ జాతీయత వైపు ప్రజలను నడిపించింది. దేశభక్తిని గురించి రాసిన ఈ 56 పాదాల గేయం జీతీయ కవితామతల్లికి కంఠాభరణమైంది. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి ప్రముఖ గేయంలో

“జయ జయ జయ ప్రియ భారత
జనయిత్రి దివ్యధాత్రి!
జయ జయ జయ శతసహస్ర
నరనారీ హృదయనేత్రి”

అని భారతమాతను వేనోళ్ళ కీర్తించారు.

దువ్వూరి రామిరెడ్డి, తల్లావఝ్జుల విశ్వసుందరమ్మ, చావలి బంగారమ్మ, బసరరాజు రాజ్యలక్ష్మిగారు ఉద్యమ రచనలు చేశారు, ప్రబోధించారు.

గరిమెళ్ళగారి

“మాకొద్దీ తెల్ల దొరతనము – దేవా
మా కొద్దీ తెల్లదొరతనము”

పాట ప్రజల హృదయాల్లో చొచ్చుకొని పోయి కవిగార్కి జైలుశిక్షను కూడా విధింపజేసిందంటే తెలుగు సాహిత్యం ఎంతగా భావసమైక్యతకు దోహదపడిందో అర్థమౌతుంది. ఖద్దరు గురించి రాశారు. రాట్నం గురించి, జాతీయ పతాకం గురించి, జైలు గురించి శక్తివంతమైన ఉత్తేజభరితమయిన సాహిత్యాన్ని సృష్టించారు. ఉమర్ అలీషాకవి. జాతీయవాదానికి, మతసమైక్యతకు ప్రోది చేసిన వాడు గాంధీజీ అని గుర్తించి…

“హిందూ ముసల్మాను లేకమైనారన్న
గాంధీ మహాత్ముని కతనగాదె” అన్నారు.

స్వాతంత్ర్యోద్యమంలో జాతీయతా భావ సమైక్యతకు గాంధీజీ ప్రభావం తెలుగు సాహిత్యం పైన ప్రసరించటం కూడా ఒక కారణం. దామరాజు పుండరీకాక్షుడు, బసవరాజు అప్పారావు, రాజశేఖర శతావధాని, గడియారం శేషశాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, పుట్టపర్తి, కొడాలి సుబ్బారావు, కరుణశ్రీ, చర్ల గణపతిశాస్త్రి మొదలైన కవి శ్రేష్ఠులెందలో జాతి సమైక్యతకు వాగ్విభూతిని పంచిపెట్టారు.

గురజాడగారు

“చెట్టపట్టాల్ పట్టుకొని
దేశస్థులంతా నడువ వలెనోయ్
అన్నదమ్ముల వలెను జాతులు,
మతములన్నీ మెలగవలెనోయ్”

అంటూ దేశాన్ని ప్రేమించమని ప్రబోధించిన గేయం ప్రసిద్ధి పొందింది. జలియన్‌వాలా బాగ్, దురంతం, నవకాశి ఘోరకృత్యాలు దాటి క్విట్ ఇండియా విప్లవ శంఖం నేషథ్యంలో విజయ గంటలు మోగి 1947 ఆగష్టు 15వ తేదీ మన దేశానికి స్వాతంత్య్రం లభించింది.

‘పతాకోత్సవం’ జరిగింది.

“ఎత్తండి స్వరాజ్యజెండా” అని అంతా ఒకే కంఠంతో పాడారు.

“ఎగురవే! వినువీధీ. ఎగురవే జెండా.”

“ఝండా ఊంచా రహే హమారా”

ఎంత సాహిత్యం ఎన్ని కావ్యాలు. ఎన్నెన్ని గేయాలు! అన్నీ… జాతి సమైక్యతకు జెండాధ్వజంగా నిలిచి పతాకాన్నెగరేశాయి.

స్వాతంత్య్ర అమృతోత్సవ వేడుకులు జరుపుకుంటున్న భారత జాతి ఒక ఘనమైన జాతి సమైక్యతకు వారసత్వంగా నిలబడింది. వర్తమానాన్ని మరింత ఘనంగా తీర్చిదిద్దుకుంటోంది. మహాకవి దాశరధిగారి మాటల్ని ఈ సందర్భంలో హృదయంలో ప్రతిష్ఠించుకుందాం!

“దేశం ఒక దేవాలయం
దేశమాత మన దైవం.”

జైహింద్.

Exit mobile version