[box type=’note’ fontsize=’16’] భారతదేశ ప్రథమ స్వాతంత్ర్య పోరాటానికి పది యేళ్ళకు ముందే, అంటే క్రీ.శ. 1847 లో ఆంగ్లేయులపై తిరుగుబాటును ప్రకటించిన రేనాటి తెలుగుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని గురించి వివరిస్తున్నారు రవి ఇ.ఎన్.వి. [/box]
రాజారావు, రాజబహదురు నారసింహరెడ్డి
రెడ్డి కాదు, బంగారపుకడ్డీ నారసింహరెడ్డి
ములుకోలకట్టె చేతులో వుంటే మున్నూటికీ మొనగాడు
కరువు వచ్చినా కాటకమొచ్చినా ఆదరించె రెడ్డి॥
రెడ్డి కోసమూ కాటకమొచ్చిన స్వర్గం వస్తుంది
యీపొద్దిదియా, రేపు తదియరా, నరుని ప్రాణమోయీ
నీటిమీదను, బుగ్గవంటిది నరుని శరీరంబు
పదరా పదరా తెల్లవారిని తెగనరుకుదాము॥
***
[dropcap]భా[/dropcap]రతదేశ ప్రథమ స్వాతంత్ర్య పోరాటానికి పది యేళ్ళకు ముందే, అంటే క్రీ.శ. 1847 లో ఆంగ్లేయులపై తిరుగుబాటును ప్రకటించిన రేనాటి తెలుగుబిడ్డ ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని గురించి ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ వీరునికి సంబంధించిన వ్యాసాలు,పుస్తకాలు, కావ్యాలు కూడా బయటకు రావడం ముదావహం.
ఆ మధ్యకాలంలో మహమ్మద్ అజీజ్ అనే రచయిత కూడా ఉయ్యాలవాడ నరసింహారెడ్డిపైన పాలెగాడు అన్న పేరిట చక్కని నవలను వ్రాశారు.
అయితే ఆ విప్లవవీరునిపైన సమగ్రంగా పరిశోధన చేసింది తంగిరాల వేంకట సుబ్బారావు గారు. వీరు 1969 లో వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ’తెలుగు వీరగాథాకవిత్వము’ అన్న పేరిట పరిశోధన పత్రం సమర్పించారు. అందులో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి వ్రాశారు. తదనంతర కాలంలో వీరే ’రేనాటి సూర్యచంద్రులు’ అన్న పేరిట సమగ్రమైన పుస్తకాన్ని వెలువరించారు. ఈ సూర్యచంద్రులలో సూర్యుడు – ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే యోధుడు, చంద్రుడు – బుడ్డా వేంగళరెడ్డి అనబడే ఒక వితరణశీలి. ఈ పుస్తకంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించిన సమగ్రమైన సమాచారం దొరుకుతోంది. ఈ పుస్తకాన్ని అంతర్జాలంలో ఈ లంకె ద్వారా ఉచితంగా దింపుకోవచ్చు.
***
శ్రీ తంగిరాల వారి పరిశోధన ఇంకా వెలువడని రోజులు. కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ గ్రామంలో రైతు సభ జరుగుతోంది. ఆ సభలో స్వాతంత్రపోరాట యోధులు కల్లూరు సుబ్బారావు గారు, దామోదరం సంజీవయ్య గారు, కీ.శే. కళా వేంకట్రావు గారు ప్రభృతులు వేదికను అలంకరించి ఉన్నారు. ఆ సభలో స్వాగతోపన్యాసం చేస్తూ ఓ కవి వాళ్ల ఊరి ప్రాభవాన్ని ప్రకటిస్తూ, ఈ క్రింది పద్యం చదివినాడు. ఆ కవి పేరు పాణ్యం నరసరామయ్య.
మ॥
అమితప్రాభవ సర్వసైన్యసముపేతాంగ్లేయసామ్రాజ్య సిం
హము మీసల్ నులివెట్టి లాగుచు నుదగ్రాటోప వీరోచితో
ద్యమ సంరంభమొనర్చినట్టి “నరసింహారెడ్డి” కాస్థాన రం
గముగా భూరియశంబు గాంచినది మా గ్రామంబు పూర్వంబునన్ ॥
తా: గొప్ప ఖ్యాతి పొంది, విశాలమైన సైన్యంతో కూడిన ఆంగ్లసామ్రాజ్యమనే సింహము యొక్క మీసాలను పురిత్రిప్పి లాగే చందాన మహాప్రతాపంతో ఆ ఆంగ్లసైన్యాన్ని ఎదుర్కొన్న నరసింహారెడ్డి కి ఆస్థానరంగమై, మా గ్రామము ఒకప్పుడు ప్రఖ్యాతిపొందింది.
ఈ పద్యాన్ని విన్న ఆహూతులు ఆ కవిని పిలిపించుకుని ఆయన ద్వారా నరసింహారెడ్డి ఉదంతాన్ని విన్నారు. ఆ వీరచరిత్రను రచించమని కవిని ఆదేశించారు. శ్రీ తంగిరాల వారు కూడా కవికి అదే సారాంశంతో లేఖలు వ్రాశారు. ఎట్టకేలకు 1973 లో తంగిరాల వారి పరిశోధనను కూడా పరిశీలించిన పిదప స్వాతంత్ర్య వీరుడు అనే అందమైన చిరుపొత్తం పద్యకావ్యరూపంలో వెలుగు చూసింది.
ఆ చిరుకావ్యం పేరు “స్వాతంత్ర్యవీరుడు“. ఈ పద్యకావ్యాన్ని రచించినది పాణ్యం నరసరామయ్య గారని ఇదివరకే చెప్పుకున్నాం. శ్రీ నరసరామయ్య గారు ’వీరకంకణం’ అనే కావ్యం ద్వారా రాయలసీమ ప్రాంతాలలో అదివరకే లబ్ధప్రతిష్ఠులు. వీరరసప్రాధాన్యమైన ఆ కావ్యం కవిపండితుల మన్ననలు పొందినది. వీరి కవిత్వం ఒక రసఝరీప్రవాహం. ప్రత్యక్షరరమణీయం. వీరి రచనల్లో ‘వీరకంకణ’ కావ్యం కొంత ప్రౌఢరచన. అయితే ‘స్వాతంత్ర్యవీరుడు’ అన్న ఈ రచన మాత్రం పండితపామర జనామోదంగా, సరళంగా రచించారీయన. వీరకంకణం కంటే చిన్నదైనా గుణంలో దొడ్డది. తన కవనశైలికి మూలం గడియారం వేంకటశేషశాస్త్రి గారి ‘శివభారతము’ అని వినయంగా కావ్యప్రస్తావనలో చెప్పుకుంటారు కవి. పుస్తకం ఆరంభంలో వీరి ముందుమాట కూడా వినయసుందరంగా ఉంటుంది.
ఆంగ్ల ముష్కరులతో తలపడిన శ్రీ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథ చాలామందికి తెలిసిందే. ఆ నేపథ్యంలో ఈ పద్యకావ్యపు కథను, అక్కడక్కడా కొన్ని పద్యాలను, వాటి సొబగులను, ఇతరత్రా గుణాలను గురించి, చెప్పుకుందాం. తంగిరాల సుబ్బారావు గారి పుస్తకంలో ప్రస్తావనలనూ అక్కడక్కడా చెప్పుకోక తప్పదు.
***
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నిలువెత్తు రూపాన్ని నరసరామయ్య గారు ఇలా వర్ణిస్తారు.
సీ॥
కలికి తురాయి గీల్కొలుపు పట్టురుమాలు
గట్టిన యుత్తమాంగంబు తోడ
వైష్ణవభక్తిభావము చాటు నూర్ధ్వపుం
డ్రము నీటుగొలుపు ఫాలంబుతోడఁ
గ్రేవలఁ గెంజాయ రేకలింపారు నా
తత దీర్ఘధవళ నేత్రములతోడఁ
జిఱునిమ్మకాయల నిరువైపు నిల్పుకో
జాలిన గుబురు మీసములతోడ
గీ॥
వైరి హంవీర విదళన ప్రళయకాల
దండనిభ ఖడ్గకలిత హస్తంబుతోడ
ప్రజకు భయభక్తి సంభ్రమభావములను
గొలుపు వర్ఛస్సుతోడ నబ్బలియుఁడలరు. ॥
ఆతని ఉత్తమాంగము (శిరస్సు) పై కలికితురాయి అమర్చిన పట్టురుమాలు కట్టి ఉంది.
నుదుటిపై విష్ణుభక్తి ప్రకటించే తిరునామాలు దిద్ది ఉన్నాయి. (రెడ్డికి అహోబల నరసింహస్వామి కులదైవం)
ఆతని తెల్లని కనుపాపల చివరన ఎరుపు రంగు జీరలు ఉన్నాయి.
ఆతని మీసాలు – చిన్న చిన్న నిమ్మకాయలను నిలుపుకోగలిగినంత దట్టంగా ఉన్నై.
శూరులైన శత్రువులను దునుమాడే యమపాశంలాంటి నల్లగా నిగనిగలాడే ఖడ్గాన్ని చేత ధరించాడాతడు.
ఇలా ఆ బలశాలి వర్ఛస్సు ఆశ్రితులకు భక్తిని, శత్రువులకు భయాన్ని కలిగిస్తోంది.
సాధారణంగా నాయకుని ఆకారవిశేషాన్ని స్ఫుటంగా వర్ణించటానికి సీసపద్యాన్ని ఉపయోగించటం తెలుగులో ఏర్పడిన ఓ సాంప్రదాయం.
నరసింహారెడ్డి కళ్ళ చివరన ఎరుపు రంగు జీరలు ఉన్నాయట! మధురావిజయం అనే కావ్యంలో కంపరాయల వర్ణన ఇలా ఉంటుంది.
వినిద్రపంకేరుహ దామదీర్ఘయోదృశోరుపాన్తే జనితోऽస్య శోణిమా ।
అనర్గలస్వప్రసరప్రరోధక శ్రుతిద్వయీదర్శిత రోషయోరివ ॥
ఆతని కన్నులు కమలముల వలే విచ్చుకున్నాయి. వాటి విస్తరణకు అడ్డుపడిన చెవులపై రోషం వహించినట్టుగా వాటి చివరలయందు ఎఱుపు రంగు అలముకున్నది.
ఈ విధంగా కనుచివరలయందు రక్తిమ – ఉత్తమ క్షత్రియుని లక్షణమని కావ్యసాంప్రదాయం.
గీతి ఆరంభంలోని ఉపమ ’వైరి హంవీర విదళన ప్రళయకాల దండనిభ ఖడ్గకలిత హస్తంబు’ – అద్భుతమైన ఎత్తుగడ.
వైరి హంవీర = శత్రుశూరుల; విదళన = మర్దించు; ప్రళయకాల దండనిభ = ప్రళయకాలమందు చరించే యముని పాశంలా ప్రకాశించు; ఖడ్గకలిత హస్తంబు = కరవాలాన్ని పూనిన కరము.
ఆరంభంలో వర్ణించిన – నాయకుని శిరస్సు, ఫాలము, కనుచివరలు, మీసాలు – ఇవన్నీ మెడకు పైభాగాలు, స్థిరమైనవి. అయితే నాయకుని హస్తము మాత్రం శత్రువులను దునుమాడుతూ మహా వేగంగా చలిస్తూ ఉంటుంది. ఈ భావాన్ని తన సుదీర్ఘ సమాసం లోని వృత్త్యనుప్రాసతోటి, ఖడ్గచాలనాన్ని ప్రతిబింబించే శబ్దసముదాయంతో కవి నేర్పుగానూ, అనాయాసంగానూ చెప్పటం ఇక్కడ కనిపిస్తోంది.
ఆకారవిశేషానికి ముందు నరసింహారెడ్డి పరాక్రమాన్ని ఇలా వర్ణిస్తాడు.
గీ ॥
పుక్కిటను బట్టి యూదిన మొరమురాళ్ళు
చెట్టుకొమ్మలపైనున్న పిట్టలకును
దవిలి కూలంగఁజేయు నంతటి శరీర
బలము నార్జించె, వ్యాయామకలనచేత ॥
చెత్తో గులకరాళ్ళను పట్టుకుని, చెట్టుపైనున్న పిట్టలకు తగిలేంత విసురుగా ఆతడు గాలి ఊదేవాడట. అలా నోటితోనే ఊదగలిగినప్పుడు ఇక శరీరబలము గురించి చెప్పనేల? అంతగా ఆతడు వ్యాయామపరిశ్రమ చేశాడు.
ఇలా ఆతడు ఎంత ఉద్దండుడో అంతటి శాంతమూర్తి.
***
ఈ చిరుకావ్యంలో చెప్పుకోగల మరో నవ్యగుణం ఒకటి ఉంది. ఇందులో కథకు అనుగుణంగా తప్ప, అదనంగా సుదీర్ఘమైన వర్ణనలు లేవు. మొత్తం పద్యాలతోనే ఈ కావ్యం కూర్చాడు కవి. వచనములు లేవు. ఈ సంవిధానం ’శివభారతము’ లో కూడా కనబడుతుంది. శివభారతము అన్న కావ్యం గడియారం వేంకటశేషశాస్త్రి గారి రచన. ఈ రచనను ఆధునికపురాణంగా తెలుగువారు సంభావిస్తారు.
కథకు వెళదాం. తనకు ఏటా రావలసిన భరణం గురించి కనుక్కోవడానికి కోవెలకుంట్ల తహసీల్ దారు వద్దకు తన పుత్రుడు దొరసుబ్బయ్య ను పంపుతాడు రెడ్డి. ఆ తహసీల్ దారుకు అదివరకు రెడ్డితో ఓ చిన్న వాగ్వాదం ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని “దాసరి క్రిందకూడ, నొక దాసరియా, యని” యీసడిస్తాడు అతడు. ఆ సమాధానం పుత్రుని ద్వారా విన్న నరసింహారెడ్డి మహోగ్రుడౌతాడు.
“అవురా! వాడధికార దుర్మదముతో నట్లాడెనా? లేక మృ
త్యువు వానిం గబళింపఁబూని ముఖమందున్నిల్చి యాడించెనా?” అని తలచి, ఆతని రేపే చీల్చి చెండాడతానంటాడు. ఇది శివభారతము లో శివాజీ స్వభావాన్ని స్ఫురింపజేస్తుంది. ఆపై రెడ్డి ఆ తహసీల్ దారుతో పెట్టుకునే పోట్లాటకు భవిష్యత్తులో ఏ పరిణామాలెదురవుతవో ఊహిస్తాడు. ఆతనికి దేశభక్తి ఉప్పొంగుతుంది. ఈ ముష్కరులను ఎదిరించటానికి, విప్లవం పాదుకొనటానికి ఇది తొలిచర్య కాగలదనుకుంటాడు. ’కలవటాల’ కు వర్తమానం పంపి రెండు వందల బోయ యోధులను సాయం పిలిపించుకుంటాడు. ’చెప్పి దెబ్బ కొట్టటం పౌరుషశాలి లక్షణమని భావించి తహసీల్ దారుకు వర్తమానం పంపుతాడు. ఇది మహారోచకంగా ఉంటుంది.
గీ.
నీవు పలికిన రీతిగా నిజముగాను
దాసరిని సుమ్ము నరసింహదైవమునకు,
నీకు మాత్రము కాలసన్నిభుఁడ సుమ్ము
తెలిసికొనుమింత, రేప యేతెంతు నేను. ॥
భావం సులభంగానే తెలుస్తూంది. పరాక్రమస్ఫూర్తితో రచించినప్పటికీ చక్కని ధారతో ఉన్న ఆ చిన్ని పద్యంలో వెతికితే సహృదయులకు కవిబ్రహ్మ తిక్కన కవి ఛాయ కనిపించకపోదు.
నేనడిగింది నాకు చెందవలసిన డబ్బే అయినా అవమానించావు. కాచుకో నాకు కావలసిన డబ్బు తీసుకెళతానంటాడు. అతని గుర్రం వెంట బోయదళం “కోబలీ” అంటూ సాగింది. రెడ్డి కోవెలకుంట్ల పట్టణాన్ని ముట్టడిస్తున్నాడని పుకారు పుట్టగానే అక్కడ ప్రభుత్వ అధికారులు దిక్కులకొక్కరుగా చెదరిపోతారు. అక్కడ రెడ్డి రాకను గురించిన కంద పద్యం యిది. (పోతన ఛాయ)
కం॥
సమరసముద్భట భటతం
డము కేకలు, మురజ పటహ ఢక్కాఘన రా
వము లొరసి పోరుకొల్పఁగఁ
గ్రమముగ నాతండు పురముకడ నరుదెంచెన్ ॥
తా: యుద్ధానికి సిద్ధమైన సైనికుల సమూహపు నాదాలు మృదంగము, తప్పెట, ఢక్కా, వాయిద్యాల శబ్దాలు ఒకదానికొకటి ఒరిసికొని పోరుసల్పినట్టుగా అగుపిస్తుంటే క్రమంగా అతడు కోవెలకుంట్ల గ్రామాన్ని చేరాడు.
ఇలా కోవెల కుంట్లకు చేరిన రెడ్డి, తహసీల్ దారును వెతకటానికి బోయ అనుచరులను పంపుతాడు. “స్త్రీలను, చిన్నపిల్లలను ఏ మాత్రం స్పర్శించరాదని” ఆదేశిస్తాడు. వారలతో బాటు వెతకి వెతకి చివరికి ఓ ఇంట్లో మూలనక్కిన తహసీల్ దారుని పట్టుకుని వధిస్తాడు రెడ్డి. ఆపై కోశాగారాన్ని చేరుకొంటాడు. అక్కడ కోశాగారాన్ని ’నరసింగ’డనే బుందేల్ ఖండ్ యోధుడు కాపలా కాస్తుంటాడు. అతడు రెడ్డిని ఒంటరిగా ఎదిరించటానికి పూనుకుంటే, ఆతని పరాక్రమాన్ని చూచి “అన్నా! యెవ్వఁడవో యెఱుంగ..నీ పరాక్రమం చూచి నాకు ఆనందమౌతుంది. ఈ ఆంగ్లదాస్యాన్ని వీడి నాతోబాటు చేరమని నచ్చజెబుతాడు. ఆ నారసింగుడు, రెడ్డి మాటలను గౌరవించినా కూడా కర్తవ్యాన్ని వీడడు. చివరికి ఆతణ్ణి రెడ్డి అనుచరుడు ఒడ్డెఓబన్న సంహరిస్తాడు. ఆపై ద్రవ్యాన్ని కొల్లగొట్టి రంగనాయక స్వామికి మ్రొక్కుకుని తన స్వగ్రామానికి చేరతాడు.
ఇది ప్రథమ ఘట్టం.
***
ద్వితీయఘట్టము:
పట్టపగలే తమ సంస్థానాన్ని దోచిన రెడ్డిని నిలువరించకపోతే, మామూలు ప్రజకూడా తమకు ఎదురు తిరుగుతుందని ఆంగ్లేయులకు భయం పట్టుకుంది. బ్రిటీష్ మండలాధిపతి ’కాకరే’, కోవెలకుంట్లపైకి కొందరు రక్షకభటులను పంపాడు. వారు రెడ్డి పరాక్రమానికి భయపడి ఊరిబయటే దేరాలు వేసుకుని ఉన్నారు. భారతదేశీయులైనందున వారిని చంపడం సబబు కాదనుకున్నాడు నరసింహారెడ్డి. వారిని హెచ్చరించాడు.
గీ॥
పెద్దపులినైన విడిచేత బిట్టడంచి
కోరలను బీకఁజాలిన వీరవరుల
కాకరంబగు నిచ్చోట కలవిగాని
పనిని సాధింపఁ దలపోసి వచ్చినార?
తా: పెద్దపులిని కూడా పరాక్రమంతో లొంగదీసి, కోరలను పీకగలిగిన వీరవరులకు నెలవైన ఈ చోటకు, అలవిమాలిన పనిని సాధింపతలపోసి ఎలా వచ్చారు?
ఆంగ్లేయులు ఉసిగొలిపిన వీరులు రెడ్డి అనుచరులను చూచి భయంతో పరుగులు పెట్టారు. ఆ పద్యం తిక్కన విరాటపర్వంలో “సింగంబాకటితో…” అన్న పద్యాన్ని స్ఫురింపజేస్తుంది.
మ.
అడుగో! వచ్చుచునున్నవాఁడు నరసింహారెడ్డి, కల్పాంత కృ
న్మృడ భీమార్భటితో నటంచును భయంబేపార నల్వైపులం
బడి పర్వెత్తగఁజూచి బోయలు రణవ్యాపారులవ్వారి వెం
బడి పర్వెత్తుచుఁ బట్టి రెడ్డికడ నిల్వంబెట్ట వారందరున్.
తా: అదుగో యముని వలె భీకరంగా వస్తున్నవాడు నరసింహారెడ్డి, అని భయంతో దిక్కులకొకరు పరుగులెత్తారు. వారి వెంటబడి బోయలు, ఇతరసేనలు వెంటబడి పట్టి రెడ్డి కడకు తీసుకొచ్చి నిలుపగా, ఆయన వారి వద్ద ఉన్న తుపాకులు, ఇతరత్రా ఆయుధాలను స్వాధీనం చేసుకుని, వారిని వదిలేశాడు.
ఆపై రెడ్డి యిలా ఆలోచించాడు. ఈ బ్రిటీష్ వారిపైన యుద్ధం ఇప్పట్లో తెగేది కాదు. పైగా ఈ స్థావరంలో ఉప్పు నీళ్ళు! కాబట్టి మకాం మర్చాలనుకుని బాగా ధృఢంగా ఉన్న నొస్సం కోటకు మార్చాడు. ఆ కోటలు చాలా కాలం నిలువ ఉండే విధంగా ఆహారపదార్థాలు సమకూర్చుకున్నాడు. ఎన్నో విషయాలను అంజనం వేసి చెప్పగల “గోసాయి వెంకన్న” అన్న ఓ సిద్ధుణ్ణి తన వద్దకు పిలిపించుకున్నాడు. ఆ వెంకన్నది ఆకుమళ్ళ గ్రామం. అతడు వీలైతే కత్తిపట్టి యుద్ధం చేయగల యోధుడు కూడానూ.
ఇంకా, తన బలగం పెంచుకుందుకు, శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అళియరామరాయల వంశస్థుడు, “ఔకు” సంస్థానాధీశుడైన నారాయణరాజును కలిశాడు.
శా.
అన్నా! రోజుకు రోజు తీండ్రమగు నయ్యాంగ్లేయ దుష్పాలనం
బెన్నాళ్ళంచు సహించుచుందు, మికనిట్లే, చూచుచుం వెయ్యి యేం
డ్లున్నన్ – దానికదే యడంగునె? మహోద్యోగంబునం, బోరికిం
సన్నాహంబొనరించి పైఁబడకయున్న న్నీవె యోజింపుమీ?
అన్నా, రోజురోజుకూ ఆంగ్లేయుల ఆగడం పెచ్చుమీరుతూ ఉంది. వారిని చూస్తూ కూర్చుంటే, ఎన్నాళ్ళైనా ఇలానే ఉంటుంది. మనం వారిని ఎదిరించక తప్పదు, మన పూర్వీకుల బాటపట్టక తప్పదని, స్వాతంత్రం కోసం పోరాడవలసిందని ప్రేరేపించాడు. అందుకు నారాయణరాజు ఒప్పుకున్నప్పటికీ, మనమిద్దరం కలిస్తే లాభం లేదని, బలగం పెంచుకుని, అదనుకై వేచి యుండి ఆపై యుద్ధం చేయాలని, అప్పటివరకూ బలగాన్ని ఎలా పెంచుకోవాలో ఆలోచించాలని చెప్పి, ధనసహాయం మాత్రం చేసి నిష్క్రమించినాడు.
చ.
అఱయగఁ గార్యవాది సమయాసమయమ్ము లెఱింగి యుక్తమౌ
తెఱఁగున సంచరించి, తన ధ్యేయము నొందును కాని యెన్నడేం
ద్వఱపడునే? త్వరంపడుచు, వాలును గైకొని యుద్ధరంగమం
దుఱికినమాత్ర యత్నము ఫలోదయమౌనె యకాల సంగతిన్.
నరసింహారెడ్డి కొంచెం అతృప్తి చెందినా, ఆప్తవాక్యం అవశ్యం ఉపాదేయమని తలంచి ఊరుకున్నాడు. తన సైన్యంలో ముక్కమళ్ళ, ముదిగోడు, కానాల, సంజామల జనపదాల బోయలను చేర్చుకున్నాడు.
ఈ లోపల తెల్లవాళ్ళు వాట్సను అనే వాణ్ణి నొస్సం కోటపైకి యుద్ధానికి పంపారు. వారిని ఎదుర్కోవటానికి రెడ్డి, వారు విడిది చేయబోయే చోట చెరువులలో నీళ్ళను తూముల ద్వారా మళ్ళించి, నీటి ఎద్దడి సృష్టించాడు. వడిసెలను ఉపయోగించే యోధులను కొన్ని కొన్ని స్థానాల్లో పెట్టించాడు. కోటపైన సలసల కాగే నూనె పెట్టించాడు. ఈ ప్రకారం వాట్సను ను ఎదుర్కున్నాడు. వాట్సను దగ్గర మందుగుండు సామగ్రి అయిపోయింది. బళ్ళారి నుంచి తెప్పించాలి. వాట్సను ఆ పని మీద ఉండగా, బెళ్ళారి నుంచి వచ్చే ఆ మందుగుండును అవుకు రాజు అడ్డగించాడు, అంతే కాక వాట్సను దగ్గర ఆయుధాలు లేవనీ, అతణ్ణి ఎదుర్కోవలసిందని రెడ్డికి గూఢచారుల ద్వారా తెలియజేశాడు.
సీ.
నడుము డాపలనున్న యడిదంబుఁ జేబూని
శిరములు పైకెగఁ జిమ్మి జిమ్మి;
మొలనున్న పిడిబాకు వలనొప్ప ధరియించి
కుత్తుక క్రోవులం గోసి గోసి;
వెస, భుజంబుననున్న వేట కొడవలి దాల్చి
కరములు పాదముల్ నఱికి నఱికి;
తురగంబుపై భద్రపఱచిన బల్లెంబుఁ
గొని, వడి ఱొమ్ములం గ్రుమ్మి గ్రుమ్మి
గీ.
దక్షవాటీ భయానకోద్దందమూర్తి
వీరభద్రుని యపరావతారమనఁగఁ
జందతేజుండు రెడ్డి వీరుండు సమర
తలము పీనుఁగుపెంటగా సలుపఁదొడఁగె.
నడుముకు సంధించిన కరవాలం చేపట్టి శత్రువుల తలలు జిమ్ముతూ, మొలలో ఉన్న పిడిబాకుతో కుత్తుకలు కోస్తూ, భుజాన నున్న వేటకొడవలితో శత్రువుల కరచరణాలను నఱుకుతూ, గుర్రంపై తగిలించిన బల్లెంతో రొమ్ములను క్రుమ్ముతూ దక్షవాటికలో బీభత్సం సృష్టించిన వీరభద్రుని అవతారం లా రెడ్డి యుద్ధరంగాన్ని పీనుగుపెంటగా మార్చసాగాడు.
(ఈ పద్యం లో IIUI – సలములు యెక్కువగా కనిపిస్తున్నవి. ఇది గేయధోరణి.)
అలా నరసింహారెడ్డి చిచ్చరపిడుగులా శత్రువులపై పడ్డాడు. ఒక్కడినీ వదలకుండా, నిశ్శేషంగా శత్రుసైన్యాన్ని నిర్జించాడు రెడ్డి.
***
పాణ్యం నరసరామయ్య గారు రచించిన “స్వాతంత్ర్య వీరుడు” కావ్యం – ఇంతవరకే ఉంది. తర్వాతి భాగం ఆయన వ్రాసినట్టు తెలియటం లేదు.
కవితారీతి:
ఈ కావ్యంలో కనబడేది అద్భుతమైన ధార. వీరరసప్రధానమైన కావ్యానికి ప్రధానంగా ఉపకరించిన ప్రవాహసదృశమైన శయ్య. నిజానికి కావ్యంలో భాగంగా కథ చెప్పుతూ,అనేక ప్రాంతాలనూ, పేర్లనూ ప్రస్తావించాడు. ప్రాంతాల పేర్లూ, వ్యక్తుల పేర్లూ పద్యంలో నిర్వహిస్తూ, ధార చెడకుండా నిర్వహించటం ఆషామాషీ వ్యవహారం కాదు నిజానికి. అయితే చాలా సునాయాసంగా ఇది పాణ్యం నరసరామయ్య కవికి అలవడింది.
వీరరసావిష్కరణకు ఓజోసదృశంగా, సమాసభరితమైన శబ్దనిర్వహణ ను కల్పించాలని కావ్యజ్ఞులంటారు. అయితే అది నియతం కాదు. అలాంటి నియమాలు పాటించకనే వీరరసాన్ని నిర్వహించినది కవిబ్రహ్మ తిక్కన. పాణ్యం నరసకవికి కూడా తిక్కన ఆవేశించినట్లు కనిపిస్తూంది.
ఈ చిరుకావ్యం ప్రధానంగా ఓ స్వాతంత్ర్య యోధుడి కథను చెప్పటానికై రచించినది.అందుచేత అనవసరమైన వర్ణనలు, అనవసర భావ, భాషాడంబరాలూ, మిక్కుటంగా అలంకారమయమైన పద్యాలు వగైరా ఎక్కడా ఇందులో కానరావు. వచనాన్నే సొబగైన కావ్య రూపంలో నిర్మిస్తే ఈ పద్యకావ్యమవుతుంది. ఈ కావ్యం గురించి ఇంతా వ్రాసింది చర్వితచర్వణమూ, అనవసర పునరుక్తీనూ. చిన్న కావ్యమే కాబట్టి వీలైన పక్షంలో చదువుకోవచ్చు. పూర్తిగా అర్థం కాకున్నా, ఈ పద్యాల్లో తూగు కోసం చదవవచ్చు.
కావ్యానికి గడియారం శేషశాస్త్రి, గొల్లాపిన్ని రామకృష్ణశాస్త్రి ఇత్యాది ప్రముఖులు ముందుమాట వ్రాశారు. గడియారం వారి ఆశీస్సు హృద్యంగా ఉన్నది.
మ.
అమృతప్రాయము తెల్గుబాస,నరసింహారెడ్డిదౌ దివ్యకా
వ్యము, “పాణ్యం నరసరామయ” తదీయాభ్యాస సంధాత, యో
గ్యములౌ భావపదార్థ సంక్రమదలంకారంబులన్ హృద్యప
ద్యములన్ నింపిన కైత, యీ ప్రజల పుణ్యంబెన్న సామాన్యమే.
ఈ చిఱుకావ్యాన్ని ఇక్కడ నుంచి ఉచితంగా దింపుకోవచ్చు.
స్వాతంత్ర్యవీరుడు – ఈ కావ్యం అర్థంతరంగా ఈ పద్యకావ్యంలో ముగిసినది కానీ ఆపై కథ తంగిరాల వారి పుస్తకంలో ఉంది. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి క్రీ.శ. 1846 అక్టోబర్ 6 న ఆంగ్లేయులకు పట్టుబడినాడు. ఆంగ్లేయులు అతణ్ణి అత్యంత కిరాతకంగా ఉరితీసారు.
స్వాతంత్ర్య యోధుడు నరసింహా రెడ్డి ని గురించి జానపదులూ, పల్లెకారు వాళ్ళూ రకరకాల పాటలు కట్టి పాడుకొన్నారు. ఆ పాటల్లో స్థానిక శబ్దాలు, మాండలిపపు మాధుర్యం ఘుప్పుమంటూ ఉంటుంది.
(తంగిరాల సుబ్బారావు గారి ’రేనాటి సూర్యచంద్రులు’ గ్రంథం నుండి స్వీకృతం.)
^^^^_^^^^