స్వీటీ, మిల్కీ, ఓ చిలుక

0
3

[dropcap]స్వీ[/dropcap]టీ, మిల్కీ సాయంత్రం ఇంటికొచ్చేసరికి తాతయ్య ఎదురోచ్చి “ఇవాళ మీ కోసం ఒక కొత్త నేస్తం వచ్చింది చూపిస్తాను రండర్రా!” అంటూ లోపలికి దారి తీశాడు.

“ఎవరు తాతయ్య! ఎవరు తాతయ్య!” అంటూ పిల్లలిద్దరూ ఆయన వెంట అతృతగా లోపలికి వెళ్ళారు. నడవాలో ఓ పక్కకు బట్టలు వేసుకోవడానికి కట్టిన తీగమీద ఉన్న రామచిలుకను చూపించాడు తాతయ్య. దాన్ని చూసి చూడగానే స్వీటీ, మిల్కీ ఎగిరి గంతేశారు. దాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించారు. తాతయ్య వద్దని వారించాడు. ‘ఎందుకు తాతయ్య’ అన్నట్లు ప్రశ్నార్ధక మొహంతో తాతయ్య వైపు చూశారు. తాతయ్య చూపుడు వేలుతో దాని కాలువైపు చూడమన్నట్లు సైగ చేశాడు. వాళ్ళు చిలక వంక చూశారు. చిలుక కాలుకు కట్టు కట్టబడి ఉన్నది. “అయ్యో చిలుక కాలుకేమైంది తాతయ్య” అంటూ స్వీటీ,మిల్కీ ఇద్దరు ఒకేసారి ఆదుర్దాగా అడిగారు.

“ఒక పిల్లి ఈ చిలుకను పట్టుకొని తినబోతుండగా జామచెట్టు మీద నుంచి జారిపడింది. అమ్మ అప్పుడు చెట్టు దగ్గరే నిలబడి ఉండటంతో పిల్లి వెనకడుగు వేసింది. అమ్మ దానిని లోపలికి తీసుకువచ్చి గాయాన్ని కడిగి మందుపూసి కట్టుకట్టింది” అని చెప్పాడు తాతయ్య. ‘అయ్యో’ అంటూ పిల్లలిద్దరూ బాధగా మొహం పెట్టారు. “మేం జాగ్రతగా చూసుకుంటాం తాతయ్య” అంటూ మాటిచ్చారు.

పిల్లలిద్దరూ మాట ఇచ్చినట్లుగానే రోజు కట్టుమార్చటం, మందు పూయటం వంటి పనులే కాకుండా ఆహారం కూడా పెడుతూ జాగ్రత్తగా చూసుకోసాగారు. ఆ చిలుకకు ‘మోతీ’ అని పేరు కూడా పెట్టారు. కొన్నాళ్ళకు చిలుకకు కాలు నొప్పి తగ్గటంతో మామూలుగా తిరగటం ఆరంభించింది. పిల్లలతో బాగా స్నేహం చేస్తోంది. ఇంట్లో వాళ్ళందరికీ మచ్చిక అయింది. స్వీటీ మిల్కీ స్కూలు నుండి రాగానే వాళ్ళ భుజాలపై వాలడం, స్కూలుకు వెళ్ళేటప్పుడు ఇంటి ముందున్న గేటుమీద వాలి ‘క్రీ క్రీ’ అంటూ అరిచేది. ఆ తర్వాత మాత్రం అస్సలు బయటకు వచ్చేది కాదు. ఎక్కడి నుండి పిల్లి వస్తుందో అని భయం దానికి.

వంటింట్లో అమ్మ వంట చేస్తుంటే గట్టు పక్కనున్న అలమర మీద వాలి ఏదో అరుస్తూ ఉండేది. అమ్మ వంట అవగానే నడవాలోకి వచ్చి దండెం తీగ మీద కూర్చునేది. ఫ్యాన్ మీద కూర్చుంటే బయటగేటు తెరుచుకుని లోపలికి వచ్చేవాళ్ళు కనిపిస్తారు. అందుకే అప్పుడప్పుడు అలా ఫ్యాన్ మీద వాలుతుంది. కానీ ఫ్యాన్ వేసేటప్పుడు ప్రమాదమని తాతయ్య దండెం మీదకే వదులుతాడు. ఒకరోజు స్వీటీ, మిల్కీలు ఇంటికి రాగానే చిలుకను చూసుకోకుండా స్వీటీ ఫ్యాన్ స్విచ్ వేసేశాడు. చిలుక తుర్రుమని ఎగిరింది. ఏం కాలేదు, పెద్ద ప్రమాదం తప్పింది. అందరూ స్వీటీని కోప్పడ్డారు! “మోతీ ఫ్యాన్ మీద ఉందని నాకేం తెలుసు” అంటూ స్వీటీ బుంగమూతి పెట్టాడు. అప్పటి నుంచి ఫ్యాన్ వేసేటపుడు ఒకటికి రెండుసార్లు చూసుకొని స్విచ్ వేస్తున్నారు. అలా మోతీ ఆ ఇంట్లో కుటుంబ సభ్యురాలిగా మారిపోయింది.

మద్యాహ్నం 12 గంటల కల్లా తాతయ్య రోజు ఇంటికొస్తారు. రాగానే బావి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని భోజనానికి కూర్చుంటాడు. తాతయ్య నేలమీద పీట వేసుకొని భోజనానికి కూర్చుంటాడు. తాతయ్య భోజనానికి రాగానే చిలుక తీగ మీద నుంచి కిందకు దిగుతుంది. తాతయ్య పప్పన్నంలో నెయ్యి కలిపి పెడితే చక్కగా తింటుంది. చిలక ఇలా అన్నం తినటం అందరికీ ఆశ్చర్యమేసింది. ఇంకా ఒకరోజయితే పప్పులో పులుసు కలిపి పెట్టాడు తాతయ్య. ఆరోజు చాలా ఇష్టంగా ఎక్కువ అన్నం ముద్దలు తిన్నది. అన్నం ముద్దలు చేసి తాతయ్య తన పళ్ళెం పక్కనే నేలమీద పెట్టగానే ముక్కుతో పొడుచుకొని తింటుంది మోతీ. అప్పటి నుంచి దానికి పప్పు పులుసన్నం ఇష్టమైన ఆహారమైంది. పులుసు వండినరోజు దానికి పండగే పండుగ.

అమ్మ రోజు కూరగాయలు కోసేటప్పుడు కొన్ని ముక్కలు మోతీ కోసం పక్కన పెట్టేది. స్వీటీ, మిల్కీ రోజు పండ్లు తినేటప్పుడు చిలుకకు పెట్టకే వాళ్ళు తినేవాళ్లు. చిలుక రాకముందు స్వీటీ, మిల్కీలను పండ్లు తినమని వెంటబడాల్సి వచ్చేది. ఇప్పుడు చిలుక కోసం వాళ్లూ తినటం నేర్చుకున్నారు. స్వీటీ, మిల్కీ వాళ్ళ నాన్న రోజు బజారు నుంచి అరటిపండ్లు, జామపండ్లు, యాపిలుపండ్లు, రకరకాల తాజా పండ్లు తెచ్చేవాడు. స్వీటీ, మిల్కీ వాటిని చిలుకకు పెడుతూ తాము తింటూ ఎంతో ఆనందపడే వాళ్ళు. చిలుకను భుజం మీద కూర్చోబెట్టుకుని ఇల్లంతా అల్లిబిల్లి తిరిగేవాళ్ళు. చేతివేళ్ళమీద నిలబడడం నేర్చుకున్నది మోతీ. పిల్లలతో ఆటలాడేటప్పుడు ఏవో శబ్దాలు చేస్తుండేది. అవి ఆనందానికి గుర్తులన్నమాట. రెక్కలు టపటప కొట్టుకుంటూ అరుస్తూండేది మోతీ. ఆ ఇంట్లో ఇప్పుడు మోతీతో సహో ముగ్గురు పిల్లలయ్యారు.

గాయం పూర్తిగా మానిపోయింది. మోతీ బాగా ఎగురుతోంది. అందరూ ఉన్నప్పుడూ మాత్రం పెరట్లోని చెట్లమీదకు ఎగిరి, మళ్ళీ వెంటనే కిందకు వచ్చేస్తుంది. బయటగేటు ఎవరైనా తీయగానే క్రీ క్రీ.. అంటూ మోతీ అరిచేస్తుంది. మోతీ ఇంట్లో అందరికీ బాగా అలవాటయిపోయింది.

ఇలా ఉండగా ఓ రోజు పెరట్లో జామచెట్టు దగ్గరకు రెండు రామచిలుకలు వచ్చాయి. అవి క్రీ క్రీ అంటూ శబ్దాలు చేశాయి. దానికి ప్రతిగా ఇంట్లో ఉన్న చిలక సమాధానమిచ్చింది. వెంటనే బయటకు వచ్చి వాటి దగ్గరకు వెళ్ళింది. స్వీటీ, మిల్కీలు ఆశ్చర్యంగా చూస్తుంటే మోతీ తల్లిదండ్రులు కావచ్చు అన్నాడు తాతయ్య. “అయ్యో మరి మోతీ వెళ్లిపోతుందా తాతయ్య” అని ఏడుపు గొంతుతో ఇద్దరు అడిగారు. తాతయ్య సమాధానం చెప్పేలోపే మోతీ ఎగురుకుంటూ వచ్చి స్వీటీ భుజంపై వాలింది. చెట్టుమీద ఉన్న చిలుకలు కొంచెం సేపు క్రీ క్రీ అంటూ అరిచి వెళ్ళి పోయాయి. మోతీ ‘మిమ్మల్ని వదిలి నేను వెళ్ళాను నేస్తాలూ’ అన్నట్లుగా ముక్కుతో వాళ్ళ బుగ్గలు రాస్తూ ఉంది పోయింది. స్వీటీ, మిల్కీలు కేరింతలు కొడుతూ మోతీని తీసుకుని ఎగురుతూ సంతోషించారు. అప్పుడప్పుడు ఆ రెండు రామచిలుకలు వచ్చి ఈ మోతీని చూసి వెళుతుండేవి. మోతీ మాత్రం స్వీటీ, మిల్కీలతోనే ఉండిపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here