స్వీయ సాక్షాత్కారం

0
2

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘స్వీయ సాక్షాత్కారం’ అనే రచనని అందిస్తున్నాము.]

ఆశ్చర్యవత్పశ్యతి కశ్చిదేన మాశ్చర్యవద్వదతి తథైవ చాన్యః।
ఆశ్చర్యవచ్చైనమన్యశ్శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్॥
(భగవద్గీత 2వ అధ్యాయం, సాంఖ్యయోగం లోని 29వ శ్లోకం.)

ఓ అర్జునా, కొందరు ఆత్మను అద్భుతమైనదానిగా చూస్తారు. కొందరు దానిని అద్భుతమైనదానిగా వర్ణిస్తారు. మరి కొందరు ఆత్మను అద్భుతమైనదానిగా శ్రవణం చేస్తారు అని పై శ్లోకం భావం.

దేహీ నిత్యమవధ్యోఽయం దేహే సర్వస్య భారత।
తస్మాత్ సర్వాణి భూతాని న త్వం శోచితుమర్హసి॥
(భగవద్గీత 2వ అధ్యాయం, సాంఖ్య యోగం లోని 30వ శ్లోకం)

ఓ అర్జునా, భరత వంశీయుడా, ఈ శరీరంలో నివసించే దేహి ఎన్నడూ చంపబడదు కాబట్టి భగవంతునిచే సృష్టింపబడిన ఏ జీవి గురించి దుఃఖించడం తగదు అని శ్రీకృష్ణుడు ఆర్జునుడికి పై శ్లోకం ద్వారా బోధిస్తున్నాడు. ఆత్మ యొక్క అమరత్వాన్ని మరియు శరీరానికి దానికి ఉన్న భేదాన్ని చెప్పిన ఉపదేశ సారాంశము ఈ శ్లోకం.

కఠోపనిషత్‌లో యమధర్మరాజు నచికేతునికి ఆత్మతత్వము గురించి విపులంగా వివరించాడు. యమధర్మరాజు, నచికేత సంవాదం ప్రకారం ఆత్మ జన్మించదు, మరణించదు, దేని నుండి ఉద్భవించదు. ఆత్మ జన్మ లేనిది, శాశ్వతమైనది అయిన ఈ ఆత్మ తన దేహము త్యాగం చేసినప్పుడు తాను చంపబడుట లేదు. దానికి అనంగ స్వభావం వుంటుంది అంటే ఎటువంటి సంగత్వం లేనిది. అణువుకంటే అణువు గాను, మహత్తుకంటే మహత్తుగాను ప్రతి జీవి హృదయంలో నివసిస్తోంది.

నేను అనుక్షణం నేనై భావించే ఈ శరీరం కాదని, ఆత్మ అని తెలుసుకోవడమే మానవ జీవిత లక్ష్యం అని వేదం స్పష్టంగా నిర్వచించింది. మనుషులంతా ఆత్మ స్వరూపులేనని యోగులు, ఆధ్యాత్మికవేత్తలు భావిస్తుంటారు. శరీరంతో ఆత్మ తాదాత్మ్యం చెందినప్పుడు మనిషిలో ‘నేనే అన్నింటికీ కర్తను, అనుభవించే భోక్తను’ అన్న అహంకారం కలుగుతుంది. ఈ భావనలే మానవ జీవిత వినాశనానికి దారితీస్తున్నాయి. విషయ వాంఛలను విడిచిపెట్టడం అంత సులువు కాదు. వేదవేదాంగాల్ని, పురాణాలను వింటూ, పఠిస్తుంటే ముక్తి మార్గం పట్టినట్టు కాదు. ఆత్మ సాక్షాత్కారం పొందినవాడికి సర్వము ఒక్కటే అంతా నిరాకార నిర్గుణ నిర్వికల్ప నిర్లింగ సర్వాతీత పరబ్రహ్మ స్వరూపమే ఉన్నదని తెలుసుకోవడం.

ఇతర లోహాల నుండి బంగారాన్ని వేరు చేయడానికి స్వర్ణకారుడు అవసరం అయినట్లే, ఆత్మసాక్షాత్కారం పొందడానికి ఆధ్యాత్మిక గురువు అవసరం. ఆధ్యాత్మిక గురువు అనుగ్రహంతో, జ్ఞాన విధి అనే శాస్త్రీయ ప్రక్రియ ద్వారా ఈ స్వీయ సాక్షాత్కారాన్ని సాధించడం సాధ్యమవుతుంది.

ఆత్మదర్శనం కేవలం విచారణ వల్ల మాత్రమే కలుగుతుంది. పూజ, యజ్ఞం, దానధర్మాలు మొదలైన కర్మల వల్లగానీ, జపం, ధ్యానం మొదలైన సాధనల వల్లగానీ, ప్రాణాయామం మొదలైన ప్రక్రియల వల్ల గాని ఈ అహం భావన మరియు శారీరక స్పృహ తొలగిపోదు. ఈ సాధనలన్నీ ఆత్మ సాక్షాత్కారం దిశగా సాగేందుకు ఉపకరించే కొన్ని ప్రక్రియలు మాత్రమే. అహం పుట్టుక ఎక్కడో వెతకడం వల్లనే అది పడిపోతుంది అని భగవాన్ రమణులు కూడా చెప్పేవారు.

శరీర స్పృహ నుండి ఆత్మతత్వం వైపు పయనించడమే సాధన. ఇటువంటి సాధన ఒక సద్గురువు లేదా భగవంతుని అనుగ్రహంతో చేస్తే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here