[శ్వేతకి – సత్రయాగము (ఖాండవ వన దహనము) గురించి ఈ వ్యాసంలో వివరిస్తున్నారు అంబడిపూడి శ్యామసుందర రావు.]
[dropcap]ఈ[/dropcap] కథను వైశంపాయనుడు జనమేజయునికి చెపుతాడు. జనమేజేయుడు అగ్ని యొక్క అజీర్ణానికి కారణాలు ఏమిటి అని అడిగితే ఈ కథ చెపుతాడు. ఖాండవ వన దహనానికి కారణము కూడా ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ కధ మహాభారతంలో ఆదిపర్వంలో వస్తుంది.
పూర్వము శ్వేతకి అనే రాజర్షి ఉండేవాడు. అయన ఇంద్రునితో సమానమైన శక్తి కలిగిన వాడు. భూమి మీద ఆయనకు సమానమైన రాజులు ఎవ్వరు లేరు. దానధర్మాలు చేయడంలోను, పరాక్రమాల లోను, సుపరిపాలనలో ఆయనకు ఆయనే సాటి. శ్వేతకి అప్పటికే ఐదు గొప్ప యజ్ఞాలు చేసాడు. అవే కాకుండా అనేక యాగాలు చేసి అనేక మంది బ్రాహ్మణులను సంతృప్తి పరచాడు. కానీ శ్వేతకి తానూ చేసిన యజ్ఞ యాగాదులు వల్ల సంతృప్తి చెందలేదు. శ్వేతకి యొక్క ఋత్వికులు యజ్ఞ యాగాలు చేసి చేసి విపరీతమైన పొగ వల్ల వారి కళ్ళకు ఇబ్బందులు కలగటం వల్ల రాజును విడిచి వెళ్ళిపోయారు. ఆ సందర్భంలో శ్వేతకి వందేళ్ల పాటు సాగే సత్రయాగాన్ని చేయాలనీ సంకల్పించాడు. కానీ ఋత్వికులు ఎవరు కూడా ఆ బాధ్యత వహించటానికి అంగీకరించలేదు. వందేళ్ల పాటు మేము మా ఆశ్రమాలను విడిచి ఇక్కడ ఉండి సత్రయాగాన్ని నిర్వహించలేము అని రాజు తో చెప్పారు. వారు రాజుతో ఈశ్వరుని ప్రార్థించి ఈ సత్రయాగానికి ఋత్వికుని ఏర్పాటు చేయవలసిందిగా కోరమని సలహా ఇచ్చారు.
ఋత్విక్కుల సలహా మేరకు శ్వేతకి శివుని కోసము కఠోర దీక్షతో తపస్సు ప్రారంభించాడు. శ్వేతకి తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై, “నీ కఠోర తపస్సుకు కారణము ఏమిటి” అని అడుగుతాడు. శ్వేతకి తన కోరికను పరమేశ్వరునికి తెలుపగా శ్వేతకి దృఢ సంకల్పం తెలుసుకోవటానికి శివుడు, శ్వేతకితో “పన్నేడ్ల పాటు నెయ్యిని నిరాఘాటంగా అగ్నిహోత్రములో పోస్తూ బ్రహ్మచర్యము పాటిస్తూ యాగము చేస్తే నీకు ఋత్విక్కును ఏర్పాటు చేస్తాను” అని చెపుతాడు.
శ్వేతకి అలాగే పన్నెండ్ల పాటు పరమేశ్వరుడు చెప్పినట్లు హోమములో నెయ్యి నిరంతరమూ పోస్తూ యాగాన్ని నిర్వహించాడు. సంతృప్తి చెందిన శివుడు, “శ్వేతకీ యజ్ఞాలు చేయవలసిన బాధ్యత బ్రాహ్మణులది. అందుకని నీకు దుర్వాసుని యాజ్ఞికునిగా నియమిస్తున్నాను. నీవు నూరు సంవత్సరాలు ఎడతెగని నేతి ధారతో యజ్ఞం చేసి అగ్ని దేవుని తృప్తిపరచుము” అని చెప్పి అంతర్ధానం అయ్యాడు.
శివుని ఆజ్ఞ మేరకు దూర్వాస మహాముని శ్వేతకి కి ఋత్విక్కుగా ఉండి సత్రయాగాన్ని నిర్వహించటానికి అంగీకరించి యాగాన్ని మొదలుపెట్టాడు. వచ్చిన బ్రాహ్మణులకు రాజు భారీగా కానుకలు ఇచ్చి సత్కరించాడు. బ్రాహ్మణులు తృప్తిగా వారి ఆశ్రమాలకు వెళ్లిపోయారు. దూర్వాసుడు కూడా యాగాన్ని ముగించాక తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. నిరంతరమూ నెయ్యిని ధారాళముగా త్రాగటం వలన అగ్ని తన సహజమైన రంగును కోల్పోయి పాలిపోయినట్లు అయినాడు. ఆకలి మందగించి అజీర్తి మొదలై అనారోగ్యం పాలయ్యాడు. అప్పుడు అగ్ని తరుణోపాయము చెప్పమని బ్రహ్మను వేడుకున్నాడు. అగ్ని దేవుని బాధను తెలుసుకున్న బ్రహ్మ అగ్నితో, “నీ అజీర్తి తగ్గాలంటే నీవు ఖాండవ వనాన్ని దహించు. ఆ వనములో ఉన్న శక్తివంతమైన మూలికలు, అనేక వన్య ప్రాణులు దహించబడితే నీకు ఉపశమనం కలుగుతుంది” అని ఉపశమన మార్గము చెప్పాడు. బ్రహ్మ దేవుని మాటలు విన్న అగ్ని ఖాండవ వన దహనాన్ని వాయుదేవుని సహాయంతో మొదలు పెడతాడు.
ఖాండవ వనములోని ఏనుగులు మంటలను ఆర్పటానికి నీటిని తొండాలతో చిమ్ముతాయి. ఇలా వనం లోని అన్ని జంతువులూ మంటలను ఆర్పటానికి విశ్వ ప్రయత్నం చేశాయి. అలా అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని ఏడుసార్లు దహించడానికి ప్రయత్నించాడు. ఇంద్రుడు అగ్ని ప్రయత్నాలకు అడ్డు వచ్చాడు. అప్పుడు బ్రహ్మ అగ్ని దేవునికి ఖాండవ వన దహనానికి నరనారాయణులు సహాయము అర్థించమని చెప్పాడు.
అర్జునుడు కృష్ణుడు వన ప్రాంతాలకు వెళ్లి విహరిస్తున్నప్పుడు అగ్ని దేవుడు బ్రాహ్మణ వేషంలో అక్కడి వచ్చాడు. అప్పుడు కృష్ణార్జునులు ఆయనకు అర్ఘ్యపాద్యాలు ఇచ్చి సత్కరించారు. బ్రాహ్మణ వేషంలో ఉన్న అగ్ని, “అయ్యా నాకు బాగా ఆకలిగా ఉన్నది తమరు భోజనము పెట్టగలరా?”అని అడిగాడు. అప్పుడు “మీకు ఇష్టమైనదేదో చెబితే అదే పెడతాము” అంటే అగ్నిదేవుడు తన నిజ రూపములోకి వచ్చి, “కృష్ణార్జునులారా నేను అగ్నిదేవుడిని. నా ఆకలి ఖాండవ వనాన్ని దహించి వేస్తే గాని తీరదు. కానీ నా ప్రయత్నానికి ఇంద్రుడు తన మిత్రుడు తక్షకుడు ఆ వనములో ఉండటం వలన అడ్డు తగులుతున్నాడు.” అని చెప్పాడు.
ఇది విన్న అర్జునుడు, “అగ్నిదేవా మీకు ఖాండవ వనాన్ని దహించి వేయాలి అన్న ఆలోచన ఎందుకు కలిగింది?” అని ప్రశ్నించాడు. దానికి జవాబుగా అగ్ని దేవుడు శ్వేతకి సత్రయాగాన్ని గురించి దాని పరిణామాల గురించి వివరించాడు. “శ్వేతకి చేత నూరు సంవత్సరాలు నిరాఘాటముగా జరిగిన సత్ర యాగంలో త్రాగిన నెయ్యి నాకు అజీర్ణ వ్యాధిని ఇచ్చింది. ఖాండవ వనంలో ఉన్న ఔషధులను దహిస్తే కానీ ఈ వ్యాధి తగ్గదు అని బ్రహ్మ దేవుడు చెప్పాడు. అందుకని ఖాండవ వనాన్ని దహించాలని అనుకుంటున్నాను” అన్నాడు.
ఆర్జునుడు “అగ్నిదేవా నీకు సహాయము చేయాలంటే మాకు ఆయుధాలు కావాలి కదా. నా వద్ద ప్రస్తుతం ఆయుధాలు లేవు” అన్నాడు. అగ్నిదేవుడు “అర్జునా నీకు ఆ చి౦త వలదు. నీకు కావలసిన ఆయుధాలు నేను సమకూరుస్తాను” అని వెంటనే వరుణుని స్మరించగానే వారి ముందు వరుణ దేవుడు ప్రత్యక్షం అయ్యాడు. అగ్నిదేవుడు “వరుణదేవా! నీకు బ్రహ్మ దేవుడు ఇచ్చిన ధనస్సు, అమ్ముల పొది, రథం అర్జునినికి ఇచ్చి, చక్రాన్ని, గదని శ్రీ కృష్ణునికి ఇవ్వు” అన్నాడు. వరుణుడు గాండీవమనే ధనస్సును, అక్షయ తుణీరాన్ని, కపిద్వజంతో కూడిన రథాన్ని అర్జునుడికి ఇచ్చాడు. అలాగే సుదర్శనం అనే చక్రాయుధాన్ని, కౌమోదకి అనే గదను శ్రీ కృష్ణునికి ఇచ్చాడు. ఆ అయుధాల సహాయంతో రక్షించమని చెప్పి వారి వద్ద అభయం తీసుకుని రెట్టించిన ఉత్సాహంతో ఖాండవ వనాన్ని దహించడం మొదలు పెట్టాడు అగ్నిదేవుడు.
కృష్ణార్జునులు ఇరువైపులా రక్షణకు నిలబడ్డారు. అడ్డగించిన వన రక్షకులను సంహరించారు. వనంలోని జంతువులు, పక్షులు, పాముల అగ్నిజ్వాలలో పడి మరణించసాగాయి. దేవతల ద్వారా ఇది తెలుసుకున్న ఇంద్రుడు మేఘాలను పిలిచి ఖాండవ వనంపై కుంభవృష్టి కురిపించమని ఆజ్ఞాపించాడు. ఇంద్రుడు కురిపించే కుంభవృష్టి ఖాండవ వనం మీద పడకుండా బాణాలతో అర్జునుడు ఒక కప్పు నిర్మించాడు. అగ్ని జ్వాలల నుండి రక్షించుకోవడానికి తక్షకుని కుమారుడైన ఆశ్వసేనుడు తల్లి తోక పట్టుకుని ఆకాశంలోకి ఎగిరాడు. ఇది చూసిన అర్జునుడు తన బాణాలతో అశ్వసేనుని కొట్టాడు. అది చూసిన ఇంద్రుడు అర్జునుడిపై మోహినీ మాయను ప్రయోగించి అశ్వసేనుని అతని తల్లిని కాపాడాడు. ఇంద్రుడికి అర్జునునికి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. కుమారుని పరాక్రమానికి ఇంద్రునికి సంతోషం కలిగినా తక్షకుని రక్షించడానికి యుద్ధం చేస్తూనే ఉన్నాడు.
ఇంతలో ఆకాశవాణి “దేవేంద్రా! వీరు నరనారాయణులు. వీరిని జయించడం నీకు సాధ్యం కాదు. తక్షకుడు తప్పించుకుని కురుక్షేత్రం వెళ్ళాడు” అని పలికింది. అది విని ఇంద్రుడు తన సేనలతో దేవలోకానికి వెళ్ళాడు.
నముచి అనే రాక్షసుని తమ్ముడు మయుడు అర్జునుని శరణుజొచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఇలా మయుడు, మందపాలుడు, అతని తల్లి, నలుగురు శార్జకులు ప్రాణాలతో తప్పించుకున్నారు.
కథ వింటున్న జనమేజయుడు “మహాత్మా! మందపాలుడు ఎవరు? వారు ఎలా తప్పించుకున్నారు” అని అడిగాడు.
“పూర్వం మందపాలుడనే మహాముని బ్రహ్మచర్యం అవలంబించాడు. మరణానంతరం కుమారులు లేని కారణంగా పుణ్యలోకాలకు వెళ్ళలేక పోయాడు. ఆ కారణంగా త్వరగా సంతానం పొందడానికి పక్షిగా జన్మించి జరితతో చేరి నలుగురు కుమారులను పొందాడు. వారంతా ఖాండవ వనంలో ఉంటున్నారు. అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహించే ముందు మందపాలుడు తన కుమారులను రక్షించమని అగ్నిదేవుడిని ప్రార్ధించాడు. అందుకు అగ్నిదేవుడు అంగీకరించాడు. మందపాలుడు తన కుమారుల దగ్గర ఉన్నాడు. కుమారులను కలుగులో దాక్కోమని చెప్పాడు. వారు “తండ్రీ కలుగులో దాక్కుంటే ఎలుకలు తింటాయి. ఇక్కడ ఉంటే పవిత్రమైన అగ్నికి ఆహుతి కావడం మంచిది కదా” మందపాలుడు అందుకు అంగీకరించాడు. జరిత పైకి ఎగిరి పోయింది. శార్జకులు వేద పఠనం చేస్తూ రక్షించమని ప్రార్ధించాయి. అది విన్న అగ్నిదేవుడు వారు మందపాలుని కుమారులుగా గుర్తించి ఆ చెట్టుని వదలి వేసాడు. కుమారులు సురక్షితంగా ఉన్నారని తెలుసుకుని మందపాలుడు పుణ్యలోకాలకు వెళ్ళిపోయాడు. అగ్ని దేవుడు నిర్విఘ్నంగా ఖాండవ వనాన్ని దహించి తన రోగం పోగొట్టుకున్నాడు. కృష్ణార్జునులను దీవించాడు. దేవేంద్రుడు కుమారుని పరాక్రమానికి మెచ్చి అర్జునునికి వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం ఇచ్చాడు. కృష్ణార్జునులు మయుని వెంట పెట్టుకుని ఇంద్రప్రస్థానికి వెళ్ళి ధర్మరాజాదులకు జరిగినది చెప్పి మయుని పరిచయం చేసాడు.” అని చెప్పాడు వైశంపాయనుడు.
ఈ విధముగా శ్వేతకి సత్రయాగము వలన అగ్నికి ఏర్పడ్డ అజీర్ణ వ్యాధి కృష్ణార్జునులు సహకరించటంతో ఖాండవ వన దహనము వలన పూర్తిగా తగ్గింది. ఈ క్రమంలో అర్జునుడు దేవేంద్రుని వద్ద నుండి వారుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వాయవ్యాస్త్రం పొందాడు. వీటిని భవిష్యత్తులో జరగబోయే కురుక్షేత్ర యుద్ధంలో ఉపయోగించటానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ఖాండవవన దహన రూపంలో అనుగ్రహించాడు.
ఈ విషయాలను జనమేజయుడు వైశంపాయుని ద్వారా తెలుసుకున్నాడు.