Site icon Sanchika

స్విట్జర్లాండ్ జాతీయ పుష్పం ‘ఎడిల్‌వీస్’

[డా. కందేపి రాణీప్రసాద్ గారు రచించిన స్విట్జర్లాండ్ జాతీయ పుష్పం ‘ఎడిల్‌వీస్’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]స్వి[/dropcap]ట్జర్లాండ్ ప్రపంచంలోని అత్యధిక ధనిక దేశాలలో ఒకటిగా పేరు పొందింది. స్విట్జర్లాండ్‌కు నాలుగు వైపులా భూమి మాత్రమే ఉంటుంది. సముద్రంతో సంబంధం లేని చిన్న దేశం స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్‌ – తూర్పున ఆస్ట్రియా, లిచెన్‌స్టెయిన్‌లు పశ్చిమాన ప్రాన్స్ దేశం, దక్షిణంగా ఇటలీ దేశం, ఉత్తరంగా జర్మనీ దేశం సరిహద్దులుగా కలిగి ఉన్నది. స్విట్జర్లాండ్ ఐరోపా ఖండంలో మధ్య ప్రాంతంలో ఉన్నది. ఈ దేశం కేవలం 15,940 చదరపు మైళ్ళు విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నది. స్విట్జర్లాండు అంటే ఎత్తైన పర్వతాలు, లోతైన సరస్సులు, అందమైన వ్యవసాయ భూములు, లోయలు, జనాలతో సందడిగా ఉండే గ్రామాలు, చారిత్రాత్మక శిల్పకళతో కూడిన నగరాలు.

2009 లోనో 2010 లోనో మేరకు స్విట్జర్లాండ్ దేశానికి వెళ్ళాము. ప్రాన్స్‌ను చూసుకుంటూ రోడ్డు మార్గంలో స్విట్జర్లాండులో ప్రవేశించాం. అక్కడ మేము ‘ఎంగిల్ బర్గ్’ అనే ప్రాంతంలో బస చేశాం. మేము దిగిన హోటల్ పేరు ‘ఎడిల్‌వీస్’. పేరు తమాషాగా ఉంది! అనుకుంటుంటే మా గైడు “ఇది స్విట్జర్లాండ్ జాతీయ పుష్పం” అన్నాడు. “అవునా! చాలా బావుంది” అన్నాము. నాకు ఎక్కడికి వెళ్ళనా చెట్లు చేమలు పువ్వుల గురించి తెలుసుకోవటం ఒక హాబీ కదా! ఈ హోటల్ ప్రాంగణంలోనే పైన్ చెట్లు ఉన్నాయి. వాటి శంకులే నేను ఏరుకుని తెచ్చుకున్నాను. అలాగే అక్కడ ఉన్న ‘ఎడిల్‌వీస్’ పూలనూ చూపించాడు. పూలు చిన్నవిగా తెల్లగా అందంగా ఉన్నాయి. స్విట్జర్లాండ్ తెల్లని మంచుతో కప్పబడిన పర్వతాలతోనే కాదు తెల్లని రంగులో ఉండే ఎడిల్‌వీస్ పుష్పాల తోనూ నిండి ఉన్నది.

స్విట్జర్లాండ్ అంటేనే ఆల్ఫ్స్ పర్వతాల శ్రేణి దేశంలో మూడింట రెండు వంతుల ప్రాంతమంతా ఈ పర్వతాల తోనే నిండి ఉన్నది. ఆల్ఫ్స్ పర్వతాలతో పాటు ‘ఎడిల్‌వీస్ అనే ఇంగ్లీష్ పేరు రెండు జర్మన్ పదాల కలయికతో ఏర్పడింది. ‘ఎడిల్’ అంటే ‘గొప్పది’ అనే అర్థం. అలాగే ‘వీస్’ అంటే ‘తెలుపు’ అని అర్థం. అంటే ఎడిల్‌వీస్ అనే పదానికి ‘ఉదాత్తమైన తెలుపు’ అనే అర్థం వస్తున్నది.

స్విట్జర్లాండ్ దేశంలో పచ్చిక భూములు, అడవులు, నదులు, జంతువులు, శిలింద్రాలు మరియు 64000 జాతుల మొక్కలు ఉన్నాయి. ప్రపంచం లోని అన్ని భాగాల్లో లాగే ఇక్కడ వ్యవసాయ భూములలో జీవ వైవిధ్యంలో చాలా నష్టం జరిగింది. ఆ తర్వాత పర్యావరణ పరంగా జీవ వైవిధ్యాన్ని మెరుగు పరచడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరిగాయి. వీటి ఫలితంగా వ్యవసాయంతో పాటు నదులు, సరస్సులు సైతం బాగుపడ్డాయి. అన్ని దేశాలూ కూడా పర్యావరణ దిశగా అలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.

‘ఎడిల్‌వీస్’ పువ్వు యొక్క శాస్త్రీయ నామం ‘లియంటోపోడియం నివేల్’. ఈ పువ్వులు డైసి కుటుంబానికి చెందినవిగా కనిపిస్తాయి. ఈ పువ్వు స్పైకి స్టార్ ఆకారంలో కనిపిస్తుంది. ఇదొక ఫర్వత పుష్పం. ఈ మొక్క 1800 నుంచి 3,400 మీటర్ల ఎత్తులో పెరుగుతుంది. కొండల మీద రాతి సున్నపురాయి ప్రదేశాలను ఇష్టపడుతుంది. ఇది కేవలం స్విట్జర్లాండ్ దేశానికే కాక అనేక దేశాలకు జాతీయ పుష్పంగా పేర్కొనబడింది. జానపద సంప్రదాయ ప్రకారం ఈ పువ్వును ఇష్టమైన వ్యక్తికి ఇచ్చి ప్రేమను ప్రకటిస్తారు. అంతేకాకుండా మార్చి 5వ తేదీన ‘ఎడిల్‌వీస్ దినోత్సవం’ను ప్రత్యేకంగా జరుపుకుంటారు. ఈ పువ్వును ‘అల్పి నిజం’ కు చిహ్నంగా ఉపయోగిస్తారు.

‘ఎడిల్‌వీస్’ – ‘అష్టి రేసి’ కుటుంబానికి, ‘అష్టి రేల్స్’ క్రమానికి చెందిన మొక్క. దీనిని స్లోవేనియాలో ‘ప్లానికా’ అంటారు. ‘ప్లానికా స్టెల్లా అల్పినా’ అని పిలుస్తారు. వీటి అర్థం ఏమిటంటే ఆల్ఫ్స్ యొక్క నక్షత్రం అని అర్థం. అలాగే రొమేనియా దేశంలో దీన్ని ‘ఫ్లోర్ డి కొల్ప్’ అని పిలుస్తారు. అంటే దీనర్థం అమిటంటే ‘క్లిఫ్ హ్యంగర్స్ ఫ్లవర్’ అని. గ్రీకు భాషలో ‘లియంటో పోడియాన్’ అంటే ‘lion’s paw’ అని అర్థం. లాటిన్ భాషలో ‘నివాలే’ అంటే ‘మంచు’ అర్థం.

ఎడిల్‌వీస్ మొక్క ఆకులు, పువ్వులు సన్నని తెల్లని వెంట్రుకలతో కప్పబడి ఉండటాన ‘ఉన్ని పువ్వు’ అనే పేరు కూడా వచ్చింది. అడవిలో ఈ పుష్ప కాండాలు 8 అంగుళాల వరకూ పెరుగుతాయి. అదే సాగులో అయితే 16 అంగుళాల వరకూ పెరుగుతాయి. ఇవి జూలై నుండి సెప్టెంబరు దాకా పూలు పూస్తాయి. తెల్లని ఆకర్షణ పత్రాలు కలిగి మధ్యలో పసుపు గుత్తులు గల స్పైక్ లెట్ లను కలిగి ఉంటుంది.

19 వ శతాబ్దానికి ముందు ఈ మొక్క నిర్లక్ష్యానికి గురి కాబడింది. ఈ శతాబ్దంలో అల్పినిస్ట్‌లు ఈ ఎడిల్‌వీస్ పువ్వును తమ కఠినమైన పర్వతారోహణకు, సాహసోపేతమైన యంత్రాలకు చిహ్నంగా ఉపయోగించారు. అత్యంత దుర్గమమైన దారులలో కఠినమైన పర్వత ప్రాంతాలలో మాత్రమే ఈ పువ్వులు పెరుగుతాయని భావించేవారు. గడ్డి వాలులలో, పర్వత ప్రాంతాలలో లోయల పచ్చిక బయళ్ళలో ఈ ఎడిల్‌వీస్ పెరుగుతుంది. సూర్య కాంతిలో వెండిలా మెరుస్తాయి ఈ పుష్పాలు. ఎంత దూరాన ఉన్నా ఈ పువ్వులను గుర్తించేలా చేస్తుంది మొక్క, చాలా యురోపియన్ దేశాలలో పర్వతాలలో పెరిగే పర్వత మొక్క ఎడిల్‌వీస్.

ఈ పువ్వు దైర్యం, బలానికి సూచికగా వాడబడుతుంది. దీనికి సాంస్కృతికంగా మంచి పేరున్నది. అల్పి నిజం యొక్క జనాదరణతో పాటు జానపద పురాణాల్లో సైతం ప్రజాదరణ పొందింది. పర్వతరోహకురాలు ఈ పువ్వుల్ని కనుక్కొని తీసుకుని వచ్చి తమ కిష్టమైన మరియు ప్రియమైన వ్యక్తులకు ఇచ్చి తమ ప్రేమను చాటుతారు. 18వ శతాబ్దంలోనే ఇది ఎడిల్‌వీస్ స్విట్జర్లాండ్ యొక్క జాతీయ పుష్పంగా ఎంపికైంది.

ఇది ఒక పువ్వు కాదు పుష్పగుచ్ఛం. 500 నుండి 1000 దాకా ఉండే చిన్న చిన్న పుష్పాలు తెలుపు, వెల్వెట్ ఆకులతో సమూహాలుగా ఉంటాయి. ఇది ఐదు లేదా ఆరు సముహ స్పైక్ లెట్ పుష్ప గుచ్ఛాల మాదిరిగా పూస్తాయి. తెల్లని రేకుల వంటి బ్రాక్ట్ లతో రెండు స్టార్ లను ఏర్పరుస్తుంది. ఉన్ని ఆకులతో తెల్లని పువ్వులు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. ఇవి ఒక అడుగు ఎత్తు వరకు పెరుగుతాయి. 5 వేల నుంచి 10 వేల అడుగుల ఎత్తులో పెరిగే పర్వత పుష్పాలు ఎడిల్‌వీస్ పుష్పాలు. స్విన్ ఎయిర్‌లైన్స్‌కూ, మిలిటరీ చిహ్నం గానూ, ఎడిల్‌వీస్ను ఉపయోగిస్తారు. ఇది ఆల్ప్స్ పర్వతాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. సాంస్కృతిక మరియు రాజకీయ ఉద్యమాలకు చిహ్నంగా కూడా ఎడిల్‌వీస్ పువ్వును వాడుతారు. దీని వలననే స్విట్జర్లాండు పొరుగు దేశాలైన జర్మనీ, ఆస్ట్రియా వంటి ఇతర యురోపియన్ దేశాలతో సంబంధం కలిగి ఉన్నది. ఆస్ట్రియన్ జానపద సంస్కృతిలో భాగంగా ఎడిల్‌వీస్ పువ్వును ‘ద సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ చిత్రంగా మార్చారు.

ఎడిల్‌వీస్ పువ్వు ను ‘వోల్ బ్లూమ్’ అని కూడా పిలుస్తారు. ఆల్ఫ్స్ పర్వతాల్లోని సంప్రదాయ జానపద వైద్యంలో ‘ఎడిల్‌వీస్’ మొక్కల్ని వాడతారు. శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, విరేచనాలు, పొత్తి కడుపు నొప్పి మొదలైన ఆరోగ్య సమస్యలకు ఈ మొక్కలోని వివిధ భాగాలను ఉపయోగిస్తారు. దీని వలననే ఈ పువ్వును “బొడ్డు పువ్వు” అని పిలుస్తూ ఉంటారు. సౌందర్య సాధనాలలో సైతం ఈ పువ్వును ఉపయోగించడం తర తరాలుగా తెలుసు. అక్కడి ప్రజలు ఉపయోగించే ప్లవర్ బోకేలలో సైతం ఈ పువ్వు బాగా ఉపయోగపడుతుంది.

1918 సంవత్సరానికి ముందు హాబ్స్ బర్గ్ సైన్యంలో ఎడిల్‌వీస్ బ్యాడ్జీలు ఉండేవి. మిలిటరీ పర్వత గైడ్ అవార్డులో ఎడిల్‌వీస్ పువ్వు పర్వత తాడుతో మంచు గొడ్డలి గుర్తు ఉంటుంది మరియు కాలర్ పై ఎడిల్‌వీస్ పువ్వులు ఉంటాయి. కమాండోలు, సైనికులు మరియు అనేక ఆల్పైన్ యూనిట్లు గర్వంగా ఎడిల్‌వీస్ బ్యాడ్జీ లను ధరించేవారు. ఆల్ఫ్స్ పర్వతాల్లోని ఒంటరి శిఖరాలకు, స్వచ్చమైన గాలికి ఈ పువ్వు చిహ్నంగా ఉంటుంది. స్విస్ ఆర్మీలో ఎడిల్‌వీస్ పువ్వుల్లా ఉండే బ్యాడ్జీ లను అత్యున్నత సైనికాధికారులు ధరిస్తారు.

1945వ సంవత్సరంలో జనరల్ హిట్లర్ గురించిన సమాచారాన్ని, అతని కోటను తెలుసు కోవడానికి పెట్టిన ప్రాజెక్ట్ పేరు ఎడిల్‌వీస్. ఆస్ట్రియా ప్రభుత్వం వారి నాణేలపై ఒక ఎడిల్‌వీస్ పువ్వును చిత్రించింది. స్విస్ జాతీయ పర్యాటక సంస్థ యొక్క చిహ్నంగా కూడా ఎడిల్‌వీస్ పువ్వు ఉంటుంది. స్విట్జర్లాండ్ లోని అంతర్జాతీయ విమానయాన సంస్థ ‘ఎడిల్‌వీస్ ఎయిర్’. దీని లోగో కూడా ఎడిల్‌వీస్ పువ్వు ఉంటుంది. ఇంకా ఎడిల్‌వీస్ ఎన్నో సంస్థలకి చిహ్నంగా ఉన్నది. ఇవి ఎడిల్‌వీస్ పువ్వు విశేషాలు.

Exit mobile version