తామరాకు మీద నీటిబొట్టు

0
2

[శ్రీపతి లలిత గారు రాసిన ‘తామరాకు మీద నీటిబొట్టు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“వి[/dropcap]జయా! ఇల్లు అమ్మేశారా! అంత అవసరం ఏమొచ్చింది?” ఫోన్‌లో బాధగా అడుగుతున్న అక్కతో “గిరిజక్కా! అమ్మెయ్యలేదు, డెవలప్మెంట్‌కి ఇచ్చాము” అంటున్న చెల్లితో “అదేలే డెవలప్మెంట్ అంటే సగం ఫ్లాట్స్, ఆ ఇల్లు కట్టే ఆయనకి ఇవ్వాలిగా మరి?” అంది గిరిజ.

“లేదక్కా! అంతా మేమే ఉంచుకుంటున్నాం. ఇవన్నీ ఫోన్లో మాట్లాడే విషయాలు కావు, నువ్వు వచ్చినపుడు చెప్తాను” అంటూ ఫోన్ పెట్టేసింది విజయ.

పొద్దున్న నుంచి ఇవే ఫోన్లు, తన బంధువులు, భర్త మోహన్ బంధువులు ఇవే ప్రశ్నలు..

“ఇల్లు అమ్మేశారా? ఎందుకు? డబ్బు అవసరమైతే మేమిస్తాంగా!” ఉదారంగా హామీలు.

‘నిజంగా అవసరమైతే ఒక్కళ్ళు ఇవ్వరు, అడగలేదు కనుక అందరూ ఇస్తామంటున్నారు’ అనుకుంది విజయ.

మోహన్, విజయలది చిన్న సంసారం,చింతలు లేని సంసారం. ఇద్దరూ ఒక ప్రభుత్వసంస్థలో పనిచేసి రిటైర్ అయ్యారు.

విజయ, మోహన్ ఉద్యోగంలో ఉన్నప్పుడు, అశోక్ నగర్‌లో, రెండు బెడ్ రూమ్‌ల ఇల్లు కట్టుకున్నారు, అప్పట్లో వాళ్ళకి అదే ఎక్కువ, రిటైర్ అయ్యేదాకా ఆ ఇంటి అప్పుకి కడుతూనే ఉన్నారు. ఆ చిన్న ఉద్యోగాలతోనే, పిల్లలు ఇద్దరినీ చదివించి, పెళ్లిళ్లు చేసి బాధ్యత తీర్చుకున్నారు.

కూతురు రమ్య, అల్లుడు హర్ష ఉద్యోగాలు హైటెక్ సిటీలో, వాళ్ళ పిల్లలు ఇద్దరితో హైటెక్ సిటీ దగ్గర ఫ్లాట్ కొనుక్కుని ఉంటున్నారు. రమ్య అత్త, మామలు వాళ్ళ తోనే ఉంటారు.

కొడుకు ఆదిత్య, కోడలు వందన ఇద్దరూ ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో డాక్టర్లు, వాళ్ళ అమ్మాయి శాన్వి. వీళ్ళు విజయ, మోహన్ లతో కలిసి ఉంటారు.

విజయ రిటైర్ అవడం, వందనకి కూతురు పుట్టడం జరిగింది, చాలా సులువుగా బామ్మ పాత్రలో ఇమిడిపోయింది విజయ.

మోహన్ రిటైర్ అయ్యాక కూడా ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేసేవాడు, డబ్బు కోసం కన్నా, ఏదో కాలక్షేపం ఉండాలి అని అక్కడ చేరాడు.

మొదటి నుంచి మధ్యతరగతి కుటుంబం వీళ్లది, అందుకని విజయ ఇంటి ఖర్చు చాలా జాగ్రత్తగా పెట్టేది. అవసరమైన చోట పెట్టినా, అనవసరంగా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేది కాదు.

ఇంటి ఖర్చుకి కొడుకు దగ్గర నుంచి నిర్మొహమాటంగా తీసుకునేది, “మా పెన్షన్ మొత్తం ఇంటికి పెడితే, రేపు మాకు అవసరమైనప్పుడు ఇవ్వడానికి ఆదిత్య దగ్గర ఉండాలిగా, అందుకే సగం మేము, సగం వాళ్ళు పెట్టాలి ఇంటికి” అనేది.

కుటుంబం పెరిగాక ఇల్లు చిన్నదైంది.

ఎప్పుడన్నా, రమ్య రెండు రోజులు తల్లి దగ్గర ఉందామని ఉన్నా, ఇల్లు సరిపోక, అమ్మా, నాన్న హాల్‌లో పడుకోవాలి అని ఉండేది కాదు, వందనా వాళ్ళ అమ్మా, నాన్న బెంగుళూరులో ఉంటారు. ఎప్పుడైనా వచ్చి మనవరాలితో ఉందామంటే, ఇల్లు సరిపోక మొహమాటంగా ఉండేది.

ఇవన్నీ చూసాక విజయ, మోహన్ ఆలోచనలో పడ్డారు.

ఇల్లు కూడా పాతపడుతోంది, చెయ్యాల్సిన మార్పులు, చేర్పులు చాలా ఉన్నాయి.

ఒక ఆదివారం పిల్లలని అందర్నీ కూర్చోపెట్టి మనసులో మాట చెప్పాడు మోహన్.

“పిల్లలూ! ఈ ఇల్లు కట్టి ముప్పయి ఏళ్ళు దాటుతోంది, ప్రతీ ఇటుకా మా కష్టార్జితం. ఎంతో ఇష్టపడి, కష్టపడి ఈ ఇల్లు కట్టాము, ఈ ఇంట్లో మాకు ఎన్నో తీపి గుర్తులు ఉన్నాయి. మీ అల్లర్లు, అలకలు, మీరు పరీక్షలు పాస్ అవడం, పెళ్లిళ్లు, మీ పిల్లలు పుట్టడం ఇలా ఎన్నో.. కానీ, ఇల్లు చాలా పాతపడింది, చిన్నదైంది, అందరికీ సరిపోవడం లేదు, పైన కట్టడానికి నా దగ్గర అంత డబ్బులు లేవు, కనీసం రిపేర్ చేయించాలన్నా పాతిక లక్షలు అవుతాయి, రమ్య వచ్చి ఉందామంటే కుదరట్లేదు, వందన వాళ్ళ అమ్మగారు వద్దామంటే సరిపోదు.

నేనూ, మీ అమ్మా మీకు రెండు ఛాయిస్లు ఇస్తున్నాము. ఒకటి, ఈ ఇల్లు అమ్మేసి, వచ్చిన డబ్బు మన ముగ్గురికీ సమానంగా చేసి, అందరం ఎవరికి కావాల్సిన చోట వాళ్ళు ఫ్లాట్ కొనుక్కోవడం, లేదా ఇక్కడే మనకి నచ్చినట్లుగా మూడు ఫ్లాట్స్ కట్టించడం.

ఒకవేళ ఇక్కడే ఫ్లాట్స్ కడదామంటే, అలా కట్టడానికి అయ్యే డబ్బు మీ ఇద్దరూ పెట్టుకోవాలి, అది దాదాపు రెండు కోట్లు అవచ్చు, మా తదనంతరం మా ఫ్లాట్ మీద మీ ఇద్దరికీ సమాన హక్కులు ఉంటాయి.

కట్టించడానికి డబ్బు మీరు పెడితే నేను, అమ్మా, దగ్గరుండి కట్టించే పని చూసుకుంటాం.

రమ్య వాటా అద్దెకి ఇవ్వచ్చు, ఆదిత్య వాళ్ళు విడిగా, విశాలంగా ఉండచ్చు. పాప కూడా పెద్దది అవుతోంది కనక తనకి వేరే రూమ్ కూడా ఉంటుంది, మీ అభిప్రాయం ఏదైనా మాకు పర్వాలేదు. కానీ, నేనూ, అమ్మా కూడా ఇంక విశ్రాంతిగా గడుపుదాం అనుకుంటున్నాం, అందువల్ల మేము వేరుగా ఉంటాం” అన్నాడు మోహన్.

ఇది ఏమాత్రం ఊహించని రమ్య, ఆదిత్య ఆశ్చర్యంగా చూసారు.

“మాకు ఎవరి మీదా కోపం కాదు, ఇప్పుడు మా వయసులో ఉరుకుల, పరుగుల జీవితం కాకుండా, నెమ్మదిగా, ప్రశాంతంగా ఉండాలి. ఉదయం లేవడం నుంచి మేము తినే ఆహార, వ్యవహారాల్ని మార్చుకోవాల్సిన వయసు. యువకులైన మిమ్మల్ని మాలాగా ఉండమని, తినమని అనలేం, అందుకే మేము వేరుగా ఉండడం. ఇది చిన్న విషయం కాదు, మీ భాగస్వాములతో ఆలోచించి, నిదానంగా నిర్ణయం తీసుకోండి. అవసరమైతే మీ అత్తగారు, మామగార్ల సలహా తీసుకోండి. మీరేమి నిర్ణయం తీసుకున్నా నేనూ, నాన్నా దానికి కట్టుబడి ఉంటాం” అంది విజయ.

రమ్య, ఆదిత్య ఏమీ మాట్లాడలేదు. ఒక వారం తర్వాత వాళ్ళంతట వాళ్ళే వచ్చారు.

“అమ్మా! నాన్నా! మాకు ఇక్కడే ఫ్లాట్ కావాలి, చిన్నప్పుడు పెరిగిన ఈ వాతావరణం వదలడం నాకు ఇష్టం లేదు, రమ్య కూడా ఇష్ట పడడంలేదు, మనం ఒక మంచి ఇంజినీర్ ద్వారా ఫ్లాట్‌లు కట్టిద్దాము. వీలైనంతవరకు మామిడి, జామ లాంటి పెద్ద చెట్లని కొట్టెయ్యకుండా కాపాడదాము. కింద కార్ పార్కింగ్, పనివాళ్ళ కోసం రూమ్ ఉంచి, ఒకో అంతస్తులో ఒక ఫ్లాట్ చొప్పున, మూడు ఫ్లాట్‌లు మూడు బెడ్ రూంలవి కడదాము” అన్నాడు ఆదిత్య, అవునన్నట్లు తలఊపింది రమ్య.

“నేను నా వాటా అద్దెకి ఇవ్వను. సెలవల్లో పిల్లలు వచ్చినా, ఎప్పుడైనా మా అత్తగారు మామగారు కూడా మాతో వచ్చినా ఇబ్బంది ఉండదు” అంది.

ఆదిత్య స్నేహితుడు ఇదే వ్యాపారంలో ఉంటే, అతనికి ఇల్లు కట్టించే పని అప్పచెప్పారు. పై ఎత్తున, మోహన్ చూస్తాను అన్నాడు.

మంచి రోజు చూసి పని మొదలు పెట్టాలి కనక, ఎలానో కట్టడానికి ఒక సంవత్సరం వరకు పడుతుంది అని దగ్గరలోనే ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అందులోకి మారారు వీళ్ళు.

సరిగ్గా అదే సమయంలో బంధువులు పెళ్ళికి పిలవడానికి వచ్చి, అద్దె ఇంట్లో వీళ్ళని చూసి, రకరకాల రంగులు అలిమి వార్తని వ్యాపింపచేసారు, దానిలో భాగమే గిరిజ ఫోన్.

విజయ అనుకున్నట్టుగానే గిరిజ మర్నాడు ఇంటికి వచ్చేసింది. అక్క ఆత్రం తెలిసినదే కనుక “ఎప్పటినుంచో రమ్మంటే రాలేదు, పోనీలే ఇప్పుడన్నా వచ్చావు, అసలు సంగతి తెలుసుకోవాలని ఆత్రంతోనన్నా!” విజయ నవ్వుతూ అన్నా, అందులో వ్యంగం అర్థం అయ్యింది గిరిజకి.

“అది కాదే, ఇల్లు ఇరుకు అని అప్పుడే భాగాలూ చేసారు, కావాలంటే మేడ మీద వెయ్యాల్సిందిగా?” భోజనాలయ్యాక నెమ్మదిగా మొదలుపెట్టింది గిరిజ.

“పిల్లలకి కూడా ఫ్లాట్స్ కట్టిస్తే ఇంటి మీద మీ హక్కు పోయినట్టేగా, కనీసం ఆ ఇల్లు ఉంచుకుంటే దాని మీద ఆశతో అన్నా కొడుకు, కోడలు మిమ్మల్ని చూసేవారు. ఇప్పుడు నీకు మనవరాలి చాకిరీ తప్పదు, విడిగా ఉన్నందుకు మీ ఖర్చు మీకూ తప్పదు” విసుగ్గా అంది.

గిరిజకి ఇద్దరూ ఆడపిల్లలు, ఇద్దరూ హైద్రాబాద్ లోనే ఉంటారు, పెళ్లి అప్పుడే చెప్పేసింది గిరిజ, “అప్పగింతలు అయ్యాక ఇంక మీరు వాళ్ళ పిల్లలే, పండగలూ, పురుళ్ళూ అంటూ వస్తే చేసే ఓపిక నాకు లేదు, ఎప్పుడో ఏడాదికి ఒక పూట భోజనం పెట్టి, నాకు తోచిన చీర పెడతాను” తల్లి విసుర్లు, విరుపులు తెలిసిన పిల్లలు, అత్తగార్లతో మంచిగా ఉండి పబ్బం గడుపుకుంటున్నారు.

అక్క మాటలకి నవ్వింది విజయ.

“అక్కా! నా పిల్లలకి, మనవలకి చెయ్యడం, చాకిరీ అని నేను ఎప్పుడూ అనుకోలేదు. ‘గీత లేకపోతే వాత పెట్టుకుంటే వస్తుందా?’ పిల్లలకి స్వతహాగా మన మీద ప్రేమ లేకపోతే నువ్వు డబ్బు ఆశ, ఆస్తి ఆశ చూపిస్తే ఉంటారా? వాళ్లకు పంపకం చెయ్యడం అనేది మేము ముందు నుంచి అనుకున్నదే. పిల్లలకు ఇవ్వదలుచుకున్నది మేము ఉండగానే ఇస్తే, ఆస్తి కోసం పిల్లల్లో మనస్పర్ధలు రావు. ఇల్లు పాతపడింది, మొత్తం పడగొట్టి కట్టాలి, మాకు అంత డబ్బు, శక్తి రెండూ లేవు. వయసులో ఉన్నప్పటి కంటే, వయసు మళ్లాకే మనకి సుఖాలు అవసరం. పెద్ద గదులూ, మంచి గాలీ, వెలుతురూ, వీలుగా ఉండే బాత్రూములు అవసరం.

ఒంట్లో శక్తి ఉన్నప్పుడు ఇల్లు ఇరుకైనా, వీలుగా లేకపోయినా, అన్నీ సర్దుకుంటాం కానీ, వయసు మళ్ళాక చిన్న ఇబ్బంది కూడా సర్దుకోవడం కష్టం.

మనకి బిపి, షుగర్, మోకాళ్ల నొప్పులు ఇవన్నీ వచ్చి, భోజనాలు కూడా చప్పగా ఉప్పు, కారాలు, నూనెలు తక్కువగా తినాలి. పిల్లలతో కలిసి ఉంటే ఇన్ని రకాలు చెయ్యలేక, అపత్యం తిండి తిని రోగాలు ఎక్కువవుతాయి.

ఎవరి దారిన వాళ్ళు ఉంటే వాళ్ళు వండుకుంటారా, మనిషిని పెట్టుకుంటారా వాళ్ళ ఇష్టం. ఉప్పూ, కారం తినాల్సిన వయసు పిల్లలని తినవద్దనలేముగా.

మనవల్ని చూడడం అంటావా, మన పిల్లల చిన్నప్పుడు ఆనందించలేనివి, మనవలతో ఆనందిస్తాం. మనవలు మన బాధ్యత కాదు, మన ఆటవిడుపు.

మేము చూడం అంటే పిల్లలు ఏమీ అనరు, కానీ మనవలతో బంధం గట్టిపడదు. ఇది నా ఉద్దేశ్యం అంతే! మేము ఈ ఏరియాలో ముప్పై ఏళ్ళ నుంచి అలవాటుపడ్డాం. తెల్లారి లేస్తే అన్నీ తెలిసిన ముఖాలే. అవసరమైతే ఎవరో ఒకరు పలుకుతారు, అందుకే ఈ ఏరియా వదలద్దు అనుకున్నాము.

పిల్లలు కూడా ఇక్కడే ఉంటామన్నారు, మరీ మంచిది. ఎవరి వాటాలో వాళ్ళు, అందరితో కలుస్తూ, ఎవరి ఇష్టాయిష్టాల ప్రకారం వాళ్ళు ఉంటే, ఏ గొడవలూ లేకుండా ఉండచ్చు అని మా ఉద్దేశ్యం.

కలిసి ఉండాలి, కల్పించుకోకూడదు, ఎవరి పద్ధతిలో వాళ్ళు బ్రతకాలి అనేది మా ఆలోచన. పిల్లలకు వాళ్ళ సంసారం ఏర్పడ్డాక, మనం తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి. నీళ్ళల్లో ఉన్నా, తామరాకు నీటి బొట్టు అంటకుండా ఎలా ఉంటుందో, మనం కూడా పిల్లలతో అలా ఉండాలి, వాళ్ళ సమస్యల్లో తల దూర్చద్దు, మనని అడిగేవరకు సలహాలు చెప్పద్దు, పిల్లలు కూడా మనం అలా ఉంటేనే ఇష్టపడతారు” అంది విజయ.

కబుర్లలో టైం చూసుకోలేదు ఇద్దరు అక్కాచెల్లెళ్ళు, వాకిట్లో ఆటో ఆగితే మనవరాలు స్కూల్ నుంచి వచ్చిందని తలుపు తీసింది విజయ.

లోపలికి వస్తూనే “బామ్మా! ఇవాళ ఏమైందో తెలుసా? టీచర్ నాకు స్టార్ పెట్టారు చేతి మీద, ఆ సంజూ గాడు టీచర్‌తో తిట్లు తిన్నాడు, మాన్వికి జ్వరం” అంటూ విజయని పట్టుకుని స్కూల్ కబుర్లు చెప్తున్న శాన్విని చూస్తే ముచ్చట వేసింది గిరిజకి.

“ఏంటి శాన్వీ! మీ బామ్మ తప్ప, ఎదురుగా ఉన్న నేను కనిపించడంలేదా నీకు?” అంటున్న గిరిజతో

“హాయ్ పెద్ద బామ్మా! ముందు మా బామ్మ! తరవాతే ఎవరన్నా!” అన్న శాన్విని చూపిస్తూ “నా మనవరాలికి నీ గడుసుదనం వచ్చిందక్కా” అంటూ నవ్వేసింది విజయ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here