[dropcap]”ఈ[/dropcap] బూమ్మీంద మనిషిగా పుట్టినంక మంచి మనిషిగా బతికితే సాలుకదరా” అంటా అరిగాన్ని అడిగితిని.
“ఊరా, కాని గొప్ప మనిషిగా బతికితే ఆ మనిషి బతుకు బలేరా” అనె వాడు.
“అదెట్ల బతికేది, ఆ బదుకు గురించి రవంత చెప్పరా” తిరగా అడిగితిని.
“ఎట్లంటే ఎవరి తారాతంటకి పోకుండా, ఇంగెవర్ని కష్టపెట్టకుండా నష్టపెట్టకుండా తను తన ఇల్లు అని బతికేవాడు మంచి మనిషి. కులము గబ్బు, మతము మబ్బు అనేవి లేకుండా అందరిలా మనిషిని చూస్తా మనుషుల కోసం బతికేవాడు గొప్ప మనిషి” అని చెప్పే.
“అట్లా మనుషులు ఇబుడు వుండారంటావా… రా…”
“లేకుండా ఏమిరా, వుండారు. ఇంగమీట వుంటారు కూడా”
“జనాలందరూ ఇట్లా బతుకు బతికితే ఎంత బాగుంటుందో” అంటా ఆకాశము పక్క చూస్తిని.
“రేయ్! ఆకాశము పక్క కాదు సూడాల్సింది. నేల పక్క సూడి, ఆమీట నువ్వు ఎట్లా బతుకు బతకాలని వుండావో అది కూడా బిర్నా ముడివు (నిర్ణయం) చేస్కోరా” అని పాయ అరిగాడు.
నా ముడివు నేను తీసుకొంట్ని.
ఇంగ మీరూ ఒగ ముడివుకు రాండా… దండాలునా…
***
తారాతంటకి = తగువులకు