Site icon Sanchika

తాతా – మనవడు

[dropcap]రో[/dropcap]జూ పది కిలోమీటర్లు సైకిలు తొక్కుకుని, నరసాపురంలో ఉన్న కాలేజీకి వెళ్లి చదువుకుని రావడం, పంట్ మీద సైకిలు దాటిస్తూ ప్రకృతి అందాల్నీ, గోదావరినీ తనివితీరా చూస్తూ అలసటని మర్చిపోవడం నా దినచర్యలో భాగమైపోయింది. పచ్చటి చెట్లూ, తోటలూ సఖినేటిపల్లి ఊర్లోకి అడుగు పెట్టగానే ప్రాణం లేచివచ్చింది. గేటు తోసుకుని సైకిల్‌ను ఇంటి కాంపౌండులో వారగా గోడకి జారబెట్టాను. మట్టినేల మధ్యలో నడక దారికోసం వేసిన నాపరాళ్ళమీద నడుస్తుంటే, సున్నుండల వాసన తగిలి మక్కుపుటాలు  అదిరిపోయాయి. మినుగులూ, బియ్యం వేపించి, తిరగలి పట్టి, వేడివేడిగా కాచిన నెయ్యి పోస్తూ అమ్మ చుట్టే సున్నుండలంటే నాకు చాలా ఇష్టం.

“పెరట్లో బావి దగ్గరకెళ్లి, రెండు చేదలు దిమ్మరించుకుని రా! ఏదైనా తిందువుగానీ” వంటింట్లోంచే నా రాకను పసిగట్టిన అమ్మ, గొంతు పెంచి చెప్పింది.

“అలాగే!” అంటూ నారింజ చెట్టుకీ, సపోటా చెట్టుకీ కలిపి కట్టిన తీగమీద ఆరేసి ఉన్న టవలు తీసుకుని, గిలకబావి దగ్గరకెళ్ళాను.

చేద బావిలో వెయ్యగానే గిలక శబ్దానికి పక్కింట్లోనించి, నుయ్యి మీదుగా మా ఇంట్లోకి వాలివున్న రేగు చెట్టు మీదున్న పిట్టలన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయాయి.

వంటింట్లో పీటచెక్క తిరగేసి, పొత్రంతో జంతికలు నూరుతున్న అమ్మ, తాతయ్యతో కబుర్లు చెబుతోంది.

చల్లటి నీళ్లు రెండు చేదలు ఒంటిమీద పోసుకోగానే హాయిగా అనిపించింది.

“ముందు అమ్మ చేసిన సున్నుండలు తినెయ్యాలి” అనుకుంటూ తిన్నగా వంటింట్లోకి దారితీసాను.

“రారా తాతా!! నీకోసమే ఎదురు చూస్తున్నాను” చేతి కర్రని గోడకి ఆనించి, గొంతుక్కూచుని అమ్మ నూరిచ్చే జంతికల పొడి కోసం ఆశగా చూస్తూ చెప్పాడు రాంపండు తాత.

ఎనభై సంవత్సరాలకి చేరువ అవుతున్నా, తాత ఒంట్లో సత్తువ తగ్గలేదు. పళ్ళన్నీ ఊడిపోయి నోరు బొక్కిపోయినా, జిహ్వ చాపల్యం చావక, అప్పుడప్పుడు అమ్మని కమ్మటి నూపప్పు జంతికలు వేయించి ఇమ్మని అడుగుతాడు. తాత అడిగిందే తడవు… అమ్మ పిండి కలిపి, నూనె ఎసరు పెట్టేస్తుంది.

“చీకటి పడుతోంది… చొక్కా వేసుకోవచ్చు కద తాతా!” అంటూ సున్నుండలు తింటూ తాత పక్కనే పీట వేస్కుని కూచున్నాను.

జంతికల పొడిని గుప్పెటలోంచి నోట్లోకి జార్చుకుని, రాగి చెంబులో మూత పెట్టి ఉంచిన నీటిని గుటకలు మింగుతూ, లోనికి తోస్తున్నాడు తాత.

“ఇంద!” వేడి వేడి కాఫీ రెండు గ్లాసుల్లో పోసి తెచ్చి, ఇద్దరికీ చేతికి అందించింది అమ్మ.

ఉఫ్… ఉఫ్ మంటూ ఊదుకుంటూ నాలుగు గుక్కల్లో గ్లాసులో ఉన్న కాఫీని గొంతులోకి ఒంపుకున్నాడు తాత.

ఒంట్లో వేడి పుట్టిందేమో… బద్ధకంగా లేచి, ఒళ్ళు విరుచుకున్నాడు. మేకుకి తగిలించి ఉన్న చొక్కా తీసి మెల్లగా తొడుక్కున్నాడు.

నాలుగు సంవత్సరాల క్రిందట, చేను దున్నుతున్న నాన్న ఒక్కసారిగా గుండెపోటు వచ్చి, నాగలి పట్టుకుని కుప్పకూలిపోయాడు. నాన్న చనిపోయిన తర్వాత, తాతకి చెయ్యి విరిచేసినట్టు అయ్యింది. నాన్న జ్ఞాపకాలను మర్చిపోలేక, నాన్న వాడిన చొక్కాలు కాలరు తీయించేసి, చేతులు మోచేతుల వరకూ కత్తిరించుకుని, రోజూ పడుకునేటప్పుడు ఆ చొక్కాలే తొడుక్కుని పడుకోవడం తాతకి కొంత ఊరటనిస్తోంది.

“ఒరే తాతా! మనిద్దరికీ ఈ పట్టిమంచం సరిపోవట్లేదు… నువ్వు ఆ పందిరిమంచం మీద పడుకోకూడదూ” అంటున్నప్పుడు తాత కళ్ళల్లో నీళ్ళు తిరగడం నేను గమనించకపోలేదు.

నాన్న లేని ఇంట్లో ఖాళీగా ఉన్న పందిరిమంచం చూసినప్పుడల్లా తాత గుండె కలుక్కుమనేది. ఆ లోటు ఎవరూ భర్తీ చెయ్యలేనిదే… అయినా పందిరి మంచం ఖాళీగా ఉండడం తట్టుకోలేక, నన్ను అక్కడ పడుకోమంటున్నాడని నాకు అర్థమయ్యింది.

చెక్క సరంబీ నుంచి వేలాడుతున్న బూజులో చిక్కుకున్న ఈగ, బయటకు రాకుండా, దాని చుట్టూ బలంగా గూడు అల్లుతున్న సాలీడు వంక చూస్తూ, దీర్ఘంగా నిట్టూర్చాడు తాత.

“హు! మన బతుకులు కూడా సాలెగూడులో చిక్కుకున్న ఈగల్లాగానే ఉన్నాయిరా తాతా! ఈ కష్టాలు ఎప్పటికి తీరతాయో… ఎప్పటికి బయటపడతామో” తాత నోటివెంట ఆ మాటలు భారంగా వచ్చాయి. చిక్కటి దారంతో గూడు అల్లుతూ పోతున్న సాలీడుని చూసి, నా ఆలోచనలు పరిపరివిధాల పోతున్నాయి.

“మావయ్యా! మీ మనవడికి చదువు ఇంక పూర్తయినట్టే… సర్టిఫికెట్టు చేతికి రాగానే, ఏదో ఒక కొలువులో చేర్చకపోతే ఇల్లు గడవడమూ కష్టంగా ఉంది. పంటలు కూడా చేతికి సరిగా అందట్లేదు… ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమంటారు?” కరెంటు పోవడంతో లాంతరు వెలిగించి, చూరుకు తగిలించిన కొక్కేనికి వేలాడదీస్తూ, చిమ్నీ మసిబారకుండా వత్తిని లోపలికి జరిపి, దీపం చిన్నది చేస్తూ తాతని అడిగింది అమ్మ.

“ఒరే తాతా! మీ అమ్మ చెప్పింది నిజమే! ఏదన్నా ప్రయత్నం చేసేదుందా?” గాలికోసం తాటాకు విసనకర్ర అటూ-ఇటూ ఊపుతూ అడిగాడు రాంపండు తాత.

సమాధానం ఏం చెప్పాలా… అని ఆలోచిస్తూ, తాత వైపుకి తిరగబోయాను. అప్పుడే నిద్రలోకి జారుకున్నాడేమో… చేతిలో ఉన్న విసనకర్ర జారి పొట్టమీద పడి, గురకతో బలంగా తీస్తున్న ఊపిరివల్ల పొట్ట పైకీ, కిందకీ కదులుతూ… విసనకర్రని స్థిరంగా నిలబడనివ్వడంలేదు. తాతని చూస్తే, నిద్రలో కలలు కంటూ, పకపకా నవ్వుకునే పసిపిల్లాడిలా కనిపించాడు. మెల్లగా దుప్పటి తీసి, చేతులమీదుగా కప్పాను. నిద్రలోనే నా వైపుకి తిరిగి, ఒక చెయ్యి నా మీద వేసి పడుకున్న తాత చేతిని ప్రేమగా నిమిరాను.

చిన్నప్పట్నుంచీ నేను తాత పక్కలోనే పడుకునేవాణ్ణి. నానమ్మ ఎలా ఉంటుందో నాకు తెలీదు. నాకే కాదు, నాన్నకి కూడా తెలియదుట. నాన్న పుట్టినప్పుడే, పురిట్లోనే ఏదో వాతంకమ్మి నానమ్మ చనిపోయిందని తాత ఎప్పుడూ చెబుతుండేవాడు.

దాంతో, నాన్నకి తల్లీ-తండ్రీ అన్నీ తానే అయి పెంచాల్సివచ్చిందట. ఇంటి పనులూ, పొలం పనులూ చేసుకోలేక అవస్థ పడుతుంటే, తాత కష్టాన్ని చూసినవారంతా రెండోపెళ్లి చేసుకోమని చెప్పేవారట. కానీ, సవతి తల్లి వస్తే తన బిడ్డని ప్రేమగా సాకుతుందో లేదో అన్న భయంతో  మళ్లీ పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయాడట. దాంతో కొంచెం ఊహ తెలిసినప్పట్నుంచీ తాతకి అన్ని పనుల్లోనూ నాన్నే చేదోడువాదోడుగా ఉండేవారట. తన తోటి పిల్లలందరూ బడికి వెళ్లి చదువుకుంటున్నా… నాన్న మాత్రం ఇల్లూ, పొలంతోనే తన అనుబంధాన్ని పెంచుకుని, చివరకి ఆ పొలంలోనే ప్రాణం విడిచేశారు.

నాన్న ఉన్నంతవరకూ వ్యవసాయం బాగానే సాగింది. ఆ తర్వాత తాతకీ చిన్న చిన్న అనారోగ్యాలూ, కంటి చూపు కొద్దిగా మందగించడం వల్ల… సొంత వ్యవసాయం చెయ్యలేక, ఉన్న ఆరెకరాల పొలాన్నీ కౌలుకివ్వాల్సివచ్చింది. సకాలంలో వర్షాలు పడక, చేతికి పంట సరిగ్గా అందేది కాదు. నా చదువుకీ, ఇల్లు గడవడానికీ డబ్బు చాలక అడపాదడపా అప్పులు చెయ్యవలసివచ్చింది. నా చదువు పూర్తయ్యి, ఏదో ఒక ఉద్యోగంలో చేరితే మా కష్టాలు కొంతైనా తీరుతాయని అమ్మ ఆశ. ఆలోచనలతో రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు.

***

రాజమ్మత్త కూతురు మహాలక్ష్మి ఫోను చెయ్యడంతో… హడావుడిగా షర్టు తగిలించుకుని, ఊరి పొలిమేరవైపు దారితీసాను.

“నాన్నకి పక్షవాతం వచ్చాక జరుగుబాటు కష్టంగా ఉంది. నా పెళ్లి ఖర్చులకి కూడా డబ్బులుండవనే భయంతో… ఎవరో దుబాయిలో బాగా డబ్బు సంపాదించి వచ్చిన పార్టీకి పొలం బేరం పెట్టేసాడు. బేరగాళ్ళు పొలంలో కొలతలు వేస్కుంటున్నారట… నాకెందుకో భయంగా ఉంది బావా!” మహాలక్ష్మి అన్న మాటలు నా చెవుల్లోనే తిరుగుతున్నాయి. సైకిలు వేగంగా తొక్కుతూ పది నిముషాల్లో పొలిమేర దగ్గరకి చేరుకున్నాను.

రోడ్డుకి ఆనుకుని ఉన్న పొలాలు… పంట కాలువకి చేరువగానే ఉండడంతో నీటి సదుపాయానికి కొదవలేదు. ఓ పక్క ధాన్యం కుప్ప నూరుస్తుంటే, మరోపక్క బేరగాళ్ళు పొలం కొలతలు వేయిస్తున్నారు. జరగబోయేది తలచుకుంటే గుండెల్లో కలుక్కుమంది.

అప్పటికే సరిహద్దుల్లో ఉన్న మరో ఇరవై ఎకరాల వరకూ పొలాలు అమ్ముడుపోయి, లేఅవుట్లుగా మారాయి. ఎక్కువ మొత్తంలో డబ్బు ఆశ చూపి, బంగారంలాంటి పొలాలు లేఅవుట్లుగా మార్చేస్తున్నారని అర్థమయ్యింది. మెల్లమెల్లగా, ఊర్లో పచ్చదనం తగ్గిపోయి, పొలాల స్థానంలో కాంక్రీటు బిల్డింగులు వెలవడం మొదలుపెట్టాయి. ఇదంతా చూస్తుంటే గుండెల్లో ఏదో పట్టేసినట్టుగా అనిపించింది.

సర్రున దూసుకుంటూ వచ్చి,  పక్కనుంచి దుమ్ము రేపుకుంటూ పోయి, ఇరవై గజాల దూరంలో ఆగింది, తెల్లటి ‘క్రెటా’ కారు. అందులోంచి దిగిన వ్యక్తి, గోల్డు ఫ్రేమున్న నల్ల కళ్ళద్దాలు ఒకసారి సర్దుకుని, చేతిలో బ్రీఫ్ కేసుతో కిందకి దిగాడు. అతన్ని చూడగానే అర్థమయ్యింది… పెద్ద మొత్తంలో బ్లాకుమనీ ఆశచూపి, పచ్చని పొలాలను, లేఅవుట్లుగా మార్చడానికి దుబాయ్‌లో బాగా సంపాదించి వచ్చిన పార్టీ అని. కౌలు చేస్తున్న రైతులు… పొలం నుంచి వెంటనే తప్పుకోవడానికి వాళ్ళకి కూడా డబ్బు భారీగానే ఆశ చూపుతున్నారని తెలిసింది.

రాజమ్మత్తా వాళ్ళ పొలాలకి ఆనుకునే మా పొలాలు కూడా ఉన్నాయి. మా చేలోకి ట్రాక్టర్లు రావడానికి అత్తా వాళ్ళ పొలంలోంచి దారి కలుపుకున్నాం. ఇది అత్తా వాళ్ళ ఒక్కింటి సమస్యా కాదని, మా ఉమ్మడి సమస్య అనీ అర్థమయ్యింది.  ఊర్లోని రైతులంతా ఇలా పొలాలు అమ్ముకుంటూ పోతే, ఇక రాబోయే తరానికి తిండి గింజలు ఎక్కడినుంచి పుడతాయి? గజిబిజి ఆలోచనలతో నా బుర్రoతా వేడెక్కిపోయింది. ‘ఏదో ఒకటి చెయ్యాలి’ స్థిరంగా అనుకున్నాను.

***

“బావా! మితిమీరిన ఎరువుల వాడకం వల్ల భూమి సారం కోల్పోయి, దిగుబడి తగ్గిపోతోంది కదా… ఇక ఈ భూముల్ని ఏ రొయ్యల చెరువుగానో మార్చెయ్యడం తప్ప ఏమీ చెయ్యలేమా?” మహాలక్ష్మి అడిగిన ప్రశ్న నన్ను చాలా ఆలోచింపచేసింది.

మావయ్యని ఒప్పించి, భూములు అమ్మకుండా అయితే ఆపగలిగాను కానీ, పంట దిగుబడి పెంచేందుకు ఏం చెయ్యాలో పాలుపోలేదు.

అదే సమయంలో సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపై శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న వ్యవసాయ శాఖ సంచాలకులు ఒకరు మా ఊరికి వచ్చారు.

అతనిని కలిసి మా ఊరి సమస్యను చెప్పాను.

***

“ఏరా తాతా! చదువు పూర్తయిపోయింది కదా… తెల్లారిలేస్తే సైకిలు తీసుకుని ఎటో వెళ్లిపోతావు. పొద్దుకుంకే వేళకి ఇల్లు చేరి ఇంత ముద్ద తింటావు. అలా బలాదూరు తిరగకపోతే,  ఏదో ఒక వ్యాపకం చూసుకోరాదా?” తాత అడిగిన ప్రశ్నకి… “నేను బలాదూరుగా తిరుగుతున్నానని నీకెవరు చెప్పారు? ఈ పెంకి పిల్లగానీ చెప్పిందా?” అన్నాను నవ్వుతూ.

నేనడిగినదానికి సమాధానం చెప్పకుండా…  పంచె మడతలో దాచి ఉంచిన నశ్యం డబ్బాలోంచి కొద్దిగా నశ్యం తీసి బొటనవేలికీ, చూపుడు వేలికి మధ్యన ఉంచుకుని, బలంగా  ముక్కులోకి పీల్చి వదిలాడు తాత.

గట్టిగా ఒక తుమ్ము తుమ్మాక, మస్తిష్కానికి అంటిన ఘాటుకి  తల ఒకసారి విదిలించుకుని, చేతులు రెండూ తాటించి, దులుపుకున్నాడు.

పెరట్లో బావి దగ్గర, పిట్టలు కొట్టగా కిందపడిన దోర రేగుపళ్లను ఏరి కొంగులో కట్టుకుంటున్న మహాలక్ష్మి… ఆ తుమ్ము శబ్దానికి  ఒక్కసారి తలెత్తి చూసి, మళ్లీ రేగుపళ్ళు ఏరుకోవడంలో మునిగిపోయింది.

పై కండువాతో ముక్కు తుడుచుకుంటున్న తాత, ఊతకర్ర సాయంతో లేచి నుంచుని, “నీ గురించి ఒకళ్ళు చెప్పేదేమిటీ? అరిగిపోయిన ఆ సైకిలు టైర్లకి వేలాడుతున్న గడ్డిపరకల్ని అడిగితే చెబుతాయి… నువ్వు ఎక్కడెక్కడ తిరుగుతున్నావో” అంటూ… ఇంట్లోకి వెళ్లబోతుండగా, తెల్లటి క్రెటా కారు వచ్చి ఇంటిముందు ఆగింది.

వచ్చింది ఎవరా? అని నుదుటిమీద చెయ్యి పెట్టుకుని, కాస్త ముందుకి వంగి పరిశీలనగా చూస్తున్నాడు తాత.

అందులోంచి దిగిన నల్లకళ్ళద్దాల వ్యక్తిని చూసి, నా వెనకగా వచ్చి నుంచుంది మహాలక్ష్మి.

అతనివేనకనే మా ఊరి పంచాయతీ ప్రెసిడెంట్ వీర్రాజు గారు కూడా కారులోంచి దిగారు.

“రండి! రండి!! కూచోండి” అంటూ సావిట్లో ఒక పక్కగా వాల్చి ఉన్న పడక్కుర్చీని కాస్త ముందుకి జరిపి, ఆ పక్కనే మరో చెక్క కుర్చీని తెచ్చి వేసి…  చీర చెంగుతో శుభ్రంగా తుడిచింది అమ్మ.

వచ్చిన అతిథులిద్దరికీ నిమ్మకాయ కలిపిన మజ్జిగ ఇవ్వడానికి అమ్మ వెనకే వంటింట్లోకి దారితీసింది మహాలక్ష్మి.

“చెప్పండి ప్రెసిడెంటు గారూ! ఏదో పని ఉంటే తప్ప ఇంత దూరం రారని తెలుసు. కబురు చేస్తే నేనే వచ్చేవాడినిగా” అన్నాను వినయంగా చేతులు కట్టుకుని స్తంభానికి జారబడి నుంచుంటూ.

“ఈ ఊరందరూ నిన్ను చూడ్డానికి వస్తుంటే… నువ్వేoటయ్యా ఇంకా అలా నిలబడి చూస్తున్నావు?” అన్నారు ప్రెసిడెంటు గారు నవ్వుతూ.

అర్థం కాక అయోమయంగా చూసాను. వచ్చిన ఆ నల్ల కళ్ళద్దాల వ్యక్తి మాట్లాడుతూ…

“నా పేరు గౌరీ నాయుడు. దుబాయిలో పది సంవత్సరాలు ఉండి, ఈ మధ్యనే తిరిగి వచ్చాను. నన్ను చూసే ఉంటారు. పోయిన నెలలో ఈ ఊరి పొలిమేరలో ఇరవై ఎకరాల వరకూ పొలం కొన్నాను” అంటూ చెప్పడం ఆపి, మజ్జిగ రెండు గుక్కల్లో తాగి, గ్లాసు కింద పెట్టాడు.

అప్పుడు గుర్తొచ్చింది నాకు. నిజమే ఇతను రాజమ్మత్తా వాళ్ళ పొలాలు కొనడానికి బేరం కుదుర్చుకోవడానికి వచ్చినప్పుడు, నేను అక్కడే ఉన్నాను.

“నాతో ఏంటి పని?” అన్నట్టు కొంచెం నిర్లక్ష్యంగా చూసాను.

నా చూపులో భావాన్ని గ్రహించి, చిన్నగా నవ్వాడు గౌరీ నాయుడు.

“ఏవిట్రా తాతా? మన పొలాలు బేరం పెట్టేస్తున్నావా?” గాభరాగా అడిగాడు తాత.

“నువ్వుండు!” అన్నట్టు చేత్తో సౌజ్ఞ చేసాను.

గౌరీనాయుడు మళ్లీ చెప్పడం మొదలుపెట్టాడు.

“నేను పొలాలు కొన్నమాట వాస్తవమే. అందులో ఐదెకరాలు లేఅవుట్లుగా కూడా మార్చేసాను. కానీ మిగతా పదిహేను ఎకరాల్లోనూ మళ్లీ వరి సాగు చేపడదామనుకుంటున్నాను.

మిమ్మల్ని చూస్తే ముచ్చటేసింది. రోజూ ఉదయాన్నే వచ్చి వ్యవసాయ శిక్షణా తరగతులకు హాజరవడమే కాకుండా, తోటి రైతులకి నాణ్యతా ఉత్పత్తుల దిగుబడిని పెంచడానికి అవసరమైన సేంద్రీయ వ్యవసాయ పద్ధతులపట్ల అవగాహన కల్పించడానికి మీరు చేస్తున్న కృషి నిజంగా అభినందించదగ్గ విషయం. అందుకే చెప్తున్నాను.

ఇకమీదట నేను కూడా ఈ ఊరివాడినే కాబట్టి, వ్యవసాయ అభివృధ్ధికోసం నా వంతు సహకారంగా ఆర్థిక సహాయం చేద్దామని నిర్ణయించుకున్నాను. ఈ విషయం ప్రెసిడెంటుగారి సమక్షంలో చెబితే బాగుంటుందని, వారిని కూడా వెంటపెట్టుకుని వచ్చాను” అన్నాడు గౌరీనాయుడు.

“అంటే… మీరింక పచ్చటి పొలాలను లేఅవుట్లుగా మార్చనట్టేగా?” అన్నాను నమ్మశక్యం కానట్టు చూస్తూ.

“ఇక మీదట లేఅవుట్ల ప్రసక్తే ఉండదు. నేను కూడా మీ ఊరి రైతునే” అన్నాడు నవ్వుతూ గౌరీనాయుడు.

“నీలాంటి చాకు లాంటి కుర్రాళ్ళు, ఊరికి నలుగురు ఉంటే చాలయ్యా!” అంటూ లేచి వచ్చి నన్ను అభినందించారు ప్రెసిడెంటు వీర్రాజు గారు.

ఆనందంతో అమ్మ కళ్లనీళ్లు తుడుచుకుంటుంటే… “మా మంచి బావ!” అంటూ మెటికలు విరిచింది మహాలక్షి.

“ఒరే తాతా!! మీ నాన్న నీకు ‘రాంపండు’ అని నా పేరు పెట్టుకున్నందుకు, నా పేరు నిలబెట్టావురా!” అంటూ సంతోషం నిండిన కళ్ళతో చూస్తూ, నా మీసం మీద చెయ్యి వేసి గర్వంగా మెలేశాడు మా తాత.

Exit mobile version