[డా.టి.రాధాకృష్ణమాచార్యులు రచించిన ‘తాత్పర్యం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]క[/dropcap]ల కాదు కనులు
నిజమూ కాదు చూపు
బాట ఆగమైన సగటు గొంతున
గాలి చెలికత్తె ఊదర
థకధిమిథా చెలిమి జాతర
చిందూ దరువూ
తరగని గాథల తీరైన బాధ
బాధ చేసింది గాయాలు
గాయం బాధిస్తుంది కాలాన్ని
కలకాని కాలం కదిలే నిద్రకు దూరం
బెల్లం రుచి మోచేతి లాఘవం
అందీ అందిక ఊరించే వెలుగుచీకటి
కలువని దారుల నిద్రలేని తీరాలు
కదలని మెదలని సంఘర్షణ
దారీ తెన్నూ ఎవరికో తెలియదు
నడక లేని నిద్రకా
నిద్ర రాని చీకటికా
నమ్మిన నలుదిక్కుల గంతల గాలి
నిట్టనిలువున చీలిన ఊపిరి
గతి ఆగిన నాడి మౌనం
లయలేని రాయి గుండె నిశ్శబ్దం
నిలిచే నిశ్చల గాలి బుడగల శ్వాస
బతుకు బండి నడక నిశ్శేషం
మాట మాయం లోకాన
గాయం మరువని రాగం
దారి తిరిగే రంగుల రాట్నం
కాలమా! కళ్ళు తెరూ
కవితాక్షరాల
చలన చరణాల తాత్పర్యమై