Site icon Sanchika

తదనంతరం

[శ్రీ మల్లాది లక్ష్మణ శాస్త్రి రచించిన ‘తదనంతరం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]ఎ[/dropcap]టువంటి ప్రత్యేకతలు లేని వ్యక్తి సిద్ధరామయ్య. సామాన్యంగా మనుషులు ఎవరికి వారు తామెంతో ప్రత్యేకం అని మనస్ఫూర్తిగా విశ్వసించి, తమ ప్రత్యేకతను ధ్రువీకరించుకోవడానికి జీవితాన్ని పణంగా పెడతారు, జీవితపు మహోద్దేశం అదే అన్నట్టుగా. సగటు మనిషి తను ఇతరుల కంటే ఎంత విభిన్నమో తనకి తాను నిర్వచించుకొని ప్రపంచమంతా తను రూపకల్పన చేసుకున్న సదరు విభినత్వాన్ని గుర్తించాలని జీవితాంతం తహతపడతాడు. ఆ ప్రయత్నంలో ఎదురయ్యే చిరు విజయాలు సుఖమని, తరచూ తగిలే ఎదురుదెబ్బలు దుఃఖమని భ్రమపడతాడు.

సిద్ధరామయ్యకి ఆ సమస్య లేదు. ఆ సమస్యనే వేదాంతులు అహం అంటారు. ఏకత్వం చూడలేని ప్రత్యేకతనే మిథ్య అంటారు. సిద్ధరామయ్య ఏకైక ప్రత్యేకతల్లా తనలో ఏ ప్రత్యేకత లేదని గుర్తించటమే. సమర్థుడ ననిపించుకోవాలని ఎప్పుడూ మథనపడని వ్యక్తిత్వం.

అలాంటి సమర్థుడు, అసమర్థుడు కాని సిద్ధరామయ్య జీవయాత్ర అకస్మాత్తుగా ముగిసింది. ఆ ముగింపు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వేలాది జనం పరుగులు పెడుతున్న హైదరాబాదు పంజాగుట్ట కూడల్లో గుండెపోటు పర్యవసానంగా జరిగింది. ఉదయం పది గంటల సమయంలో నేలమీద పడిపోయి నెప్పితో గిలగిలలాడిపోయి స్పృహ కోల్పోయిన వ్యక్తి చుట్టూరా చోద్యం చూస్తూ వందమంది మూగారు. కానీ వారిలో పోతున్న ప్రాణాన్ని శరీరంలో ఎలా కట్టడి చేయాలో ఏ ఒక్క మనిషికీ తెలియదు. మనిషికి తెలియని మరణం సంభవించింది. హెచ్చరిక లేని మరణం.

అరవై ఏళ్లు కూడా నిండని సిద్ధరామయ్య అచేతన శరీరం అమీర్‌పేట చేరింది. ఆరవ అంతస్తులో ఉన్న ఆయన ఫ్లాట్‌లో ఆయన భార్య శకుంతలమ్మ, ముప్ఫై ఏళ్ళ కొడుకు గుణశేఖర్, పది సంవత్సరాల క్రితం భర్త పోయినప్పటినించి అల్లుడి పంచన చేరిన అరుంధతమ్మగారు అశనిపాతంలా తగిలిన వార్తని తట్టుకోలేనంతగా విలపించారు. సాయంత్రానికి ఢిల్లీ నుంచి కూతురు కళ్యాణి, అల్లుడు చాణక్య దిగారు. వచ్చిన బంధువుల్లో ఒక డాక్టరు ఆరోగ్యంగా కనిపించేవారికి కూడా మొదటి ఎటాక్ ఎటువంటి పరిస్థితుల్లో ప్రాణాంతకంగా పరిణమించవచ్చో వినేవారికి వివరించాడు.

సిద్ధరామయ్య కష్టజీవి. బీమా సంస్థలో మంచి ఏజంటుగా పేరు తెచ్చుకున్నాడు. తన చిన్ననాటి దిగువ మధ్యతరగతి జీవితంకంటె కొంచెం ఉన్నతమైన ప్రమాణాల జీవితం తన కుటుంబానికి ఇవ్వటం లక్ష్యంగా పెట్టుకుని నియమబద్ధంగా బతికాడు. రోజూ ఉదయం అరగంట నడిచి ఒక జిమ్‌లో చాతనయినంత వ్యాయామం చేసేవాడు. ఇప్పటి వరకు ఆస్పత్రి చరిత్ర, మందుల చరిత్ర లేకుండానే నడుపుకొచ్చాడు. సిగరెట్లు మానేసి చాలా రోజులయింది. నిన్నటిరోజున ఛాతిలో కొంచెం నెప్పనిపిస్తే పొట్టలో గాస్ చేరి ఉంటుందని సరిపెట్టుకున్నాడు. కొన్ని విషయాల్లో సరిపెట్టుకోవడం సరికాదు.

మరునాడు సాయంత్రానికి అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. తంతు ముగిశాక సుబ్రమణ్యం గారు, ఆయన సహాయకుడు ఆంజనేయులు “నిత్యకర్మకి సిద్ధమవండి” అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంట్లో అయిదుగురే మిగిలారు.

అందరికంటే ముందుగా కుదుటపడింది అరుంధతమ్మగారు. కూతురు వెంటనే ఉండి సాధ్యమైనంత సాంత్వన అందిస్తోంది. గుణశేఖర్ ముఖకవళికల్లో నిర్లిప్తత తప్ప ఎటువంటి భావమూ కనిపించటంలేదు. అల్లుడు చాణక్య తనతో పాటు ఢిల్లీ నువ్వూ వస్తావా అని కళ్యాణిని ఎట్లా అడగాలా అని ఎదురు చూస్తున్నాడు.

కళ్యాణి ఇంకా కోలుకోలేదు. కనుముక్కు తీరుకి అందని అందం ఆమెది. దిగులు పడుతున్నా కళ తగ్గని ముఖం. ఉన్నట్టుండి ఉబికి ఎండిపోతున్న కన్నీళ్ళు తండ్రిని కోల్పోయిన దుఃఖాన్నించి ఉపశమనం కలిగించలేక పోతున్నాయి.

***

ఆ రాత్రి కూతురు పక్కనే కూచుని అరుంధతమ్మ అనునయించే ధోరణిలో, “ఊరుకోవే శకూ! పోయినవారు తిరిగి రారు. ఒక అధ్యాయం ముగిసిపోయింది. నిన్ను ఒంటరిదాన్ని చేసి తనదారిన తను వెళ్ళిపోయాడని బాధపడకు. నీకు మేమంతా లేమూ? ఉన్న ఆస్తి ఎలా సంబాళించాలో ఆలోచించు. చూస్తూ ఉండగానే సంవత్సరీకాలు అయిపోతాయి. శేఖర్‌కి ఒక గుణవంతురాల్ని తెచ్చి ఘనంగా పెళ్ళి చేదాం.” శకుంతలమ్మకి తల్లి ధోరణి నచ్చలేదు. తను ఉన్న పరిస్థితి అయితేనేం తల్లి మీద గౌరవం అయితేనేం ఆమె మాటలకి ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయింది. అరుంధతమ్మగారు కొనసాగించింది, “ఎంత దాచాడో ఏ ఆస్తి ఎక్కడుందో నీకే చెప్పడు నీ మొగుడు, అమాయకుడు నీ కొడుక్కేం చెపుతాడు. అయినా వీలూనామా రాసి ఉంటాడంటావా?”

ఇక ఉండబట్టలేక పోయింది శకుంతలమ్మ. “అమ్మా, నేను సర్దుకునేదాకా నాతో వ్యవహారాలు మాట్లాడకు. ఎలా అవాలో అలా అవుతుంది.”

“నీ మంచి కోసమే కదే నేను చెప్పేది. చేయవలసిన పనులు మేలుకుని టైంకి చేయకపోతే మనకి రావాల్సిన ఆస్తులు పరులు గద్దల్లా తన్నుకుపోతారు. ఎన్ని చూశాం?”

***

మరునాడు ఉదయం, సిద్ధరామయ్య పోయిన మూడోరోజు, తెలతెలవారుతుండగా చాణక్య భార్యని, బావమరిదిని నెక్లెస్ రోడ్డు మీద నడవటానికి తీసుకెళ్ళాడు. “శేఖర్, మీ ఇంట్లో అందరికి నువ్వే మగదిక్కు. ఇన్నాళ్లూ మీనాన్న ఆడించినట్లు ఆడావు. ఇప్పుడు నువ్వు స్వతంత్రుడివి. చియర్ అప్ మై బాయ్!” బావ అంటోంది నిజమే కదా అనిపించింది గుణశేఖర్‌కి.

కళ్యాణికి మాత్రం కష్టం తోచింది. “చాణక్యా, నీకు సెన్సిటివిటీ లేదు సరే, సోషల్ సెన్స్ అన్నా ఉండాలిగా. కని ముప్ఫై ఏళ్ళు పెంచిన తండ్రి హఠాత్తుగా దూరమైతే సంబరం చేసుకోమంటావేమిటి?, ఆయన మమ్మల్ని ఈ స్థాయికి తీసుకు రావటానికి ఎంత కష్టపడ్డారో తెలుసా? నేను నీకు దొరకటం ఆయన చలవే అని మరిచిపోకు. మోర్నింగ్‌లో ఉన్నవాళ్ళకి కండొలెన్సెస్ చెప్పే పద్ధతి ఇది కాదు!”

“ఓకే, ఓకే. వాడికి నాకు మధ్య ఫార్మాలిటీస్ ఏమిటి కల్యాణీ? నేను నీలాగా సెంటిమెంటల్ అవలేను. నువ్వు స్ట్రెంగ్త్ అనుకున్నా సరే, వీక్నెస్ అనుకున్నా సరే”

ముగ్గురూ ఇంటి అపార్ట్‌మెంట్ మెయిన్ గేట్ సమీపిస్తుండగా వాళ్ళకో దృశ్యం కనిపించింది. రోడ్డు పక్కకి ఒక గాడిద కదలిక లేకుండా నిలబడి ఉంది. రెప్ప వేయకుండా తదేక దీక్షతో గోడని చూస్తోంది. చాణక్య గాడిదని చూడగానే చటుక్కున ఆగిపోయాడు. “జాగ్రత్తగా గమనించండి. గాడిదల్ని నేను చాలా స్టడీ చేశాను. గాడిద ఎప్పుడు ఎక్కడ కనిపించినా నేను అపురూపంగా చూస్తాను. నిముషాల తరబడి గాడిద శిలా విగ్రహంలా నిలబడగలదు. మనకి ఎటు చూస్తుందో ఏం చూస్తుందో తెలియదు. కళ్ళార్పకుండా కదలకుండా కనీసం అయిదు నిముషాలు గడిపేస్తుంది. ఈగల్ని తోలుకోటానికి తోక కదిలించవలసి వచ్చినప్పుడే అది ట్రాన్స్ లోంచి బయటకు వస్తుంది. గాడిద నిజమైన తత్వజ్ఞాని!”

అతని మాట నిజం చెయ్యడానికి అన్నట్లు ఐదు నిమిషాలు గాడిద కదల్లేదు. ఇక ఆటచాలన్నట్లుగా ముగ్గురూ బిల్డింగ్‌లో ప్రవేశింపబోయారు.

కనుచూపు పరిధిలో వీళ్ళు పడ్డ తక్షణం గార్దభం పూనకం వచ్చినట్లు ఊగింది. తపస్సులో ఉన్న ఋషిపుంగవుడు అకస్మాత్తుగా లేచి నిలబడి భాంగ్రా నృత్యం చేసినట్లు. ఈ ఉత్పాతానికి ఖంగుతిన్న చాణక్య వెంటనే తమాయించుకుని బామ్మర్దితో, “శేఖరా, నీకేదో చెప్పాలనుకుంటోంది ఈ గాడిద. గాడిదనైన నేనే ఇంత ఊగగలను, మనిషవైన నువ్వు అప్పుడప్పుడన్నా ఏదో ఒకటి వాగలేవా అంటోంది!” అని ఇకిలించాడు. “నా రోజులూ వస్తాయి బావా, చూస్తూ ఉండు”, నోరు విప్పాడు గుణశేఖర్.

వీళ్ళతోపాటు గాడిద కూడా అపార్ట్‌మెంట్ లోపలికి రాబోయింది. సెక్యూరిటీ అతను కర్రతో బయటికి నెట్టాడు. ‘నన్నెవరు మీరు ఆపడానికి?’ అన్నట్లుగా పెద్ద ఓండ్ర పెట్టింది. వీళ్ళు లిఫ్ట్ వైపు నడుస్తుంటే ఇంకా పెద్దగొంతుతో ఓండ్రించింది.

అరగంట తర్వాత కళ్యాణి సెక్యూరిటీకి ఫోన్ చేసింది.

“గాడిద ఇంకా అరుస్తోందా?”.

“లేదు మాడమ్. కానీ తోలినా మళ్ళీ వచ్చి గేటుదగ్గరే నిలబడుతోంది. సూపర్‌వైజర్ మునిసిపాలిటీ వారికి కంప్లైంట్ చేద్దామనుకుంటున్నాడు.”

అనుభవజ్ఞురాలైన అరుంధతమ్మగారు, “కర్మ జరుగుతున్న ఇంటిముందు గాడిదలరవకూడదు. పోయి నాలుగిడ్లీలు పెట్టి శాంతింపచేసి పంపించేయండి.” సలహా ఇస్తున్న గొంతుతో ఆర్డరేసింది.

చాణక్య పరాచికాల మూడ్ ఇంకా తగ్గలేదు. “శేఖర్, నాకో బ్రిలియంట్ ధర్మసందేహం వచ్చింది. సుబ్రమణ్యం గారి నడగాలి. మన పురాణాలలో ఇంచుమించు అన్ని జంతువులికి దేవాంశ ఉందన్నారు, లేదా దేవతల వాహనాలుగా నిర్ణయం చేశారు. గుర్రం, ఏనుగు, పులి, సింహం, ఎలుక, కుక్క, కోతి, నెమలి, గద్ద, తాబేలు, చేప, ఎద్దు, పంది, పాము, చిలుక, హంస, కాకి, దున్నపోతు, ఎలుగుబంటి, లేడి, ఒంటె, గుడ్లగూబ, ఆవు, గొర్రె –అన్నీ పూజనీయమన్నారు కదా! గాడిదనెందుకు వదిలేశారు? ఇంత తెలివైన ఉపయోగకరమైన జంతువు కెందుకంత అన్యాయం చేశారు? మిగతా పశుపక్షులకి పూజలు; గాడిదకి కొట్లు, తిట్లు, హేళనలు. గాడిదంత చాకిరీ చేసే ప్రాణి ఉందా పృథ్విలో? చివరికి గాడిద అన్న పదమే ఒక తిట్టయిపోయింది. చూస్తూ ఉండు ఏదో ఒకరోజు గాడిద మహిమ తెలిసివస్తుంది మనిషికి”. శేఖర్‌కి నవ్వక తప్పలేదు. “ఏమో, ఏ పురాణంలోనో గాడిద ప్రసక్తి ఉందేమో!” అని ఊరుకున్నాడు.

అమ్ముమ్మ గారు చెప్పినట్లు గానే కొన్ని తిండి పదార్థాలు కిందకి తీసుకెళ్లారు. ఊహించినట్టుగా గాడిద అక్కడే ఆ స్థానంలోనే ఉంది. వీళ్ళని చూడంగానే గుర్తించినట్టుగా తల ఊపింది. చాణక్య ఇడ్లీ పొట్లం దాని మూతి ముందు పెట్టపోతే రెండు అడుగులు వెనక్కి వేసి గుర్రుమన్నట్టుగా శబ్దం చేసింది. శేఖర్ ప్రయత్నిస్తే గుర్రు మనలేదు కానీ తినలేదు. చివరి ప్రయత్నంగా కళ్యాణి పొట్లం అందించబోయింది. ఆశ్చర్యంగా, దొడ్లో ఆవు యజమాని చేతిలోంచి ఆహారం లాక్కుని తిన్నంత చనువుగా ఇడ్లీలన్నీ ఆవురావున తిన్నది. అదే సమయానికి వీళ్ళని కలవడానికి వచ్చిన సుబ్రహ్మణ్యం గారు ఆంజనేయులు స్కూటర్ దిగారు. సహజంగానే, జరుగుతున్న వింత దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఒక ఐదు నిమిషాలు అక్కడే గడిపి ముగ్గురిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఆంజనేయులు గురువు గారితో ఏదో గుసగుసలాడాడు.

“అమ్మా కళ్యాణి, నాయనా శేఖర్! ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, వెంటనే పైకి రండి.”

హాలులో ఇద్దరు బ్రాహ్మలు ఇంటి వారికి సాధ్యమైనంత సంయమనంతో వారు గమనించిన యథార్థంలోని అంతరార్థం వివరించారు. విన్న ఐదుగురిలోనూ, ఏ ఒక్కరి ముఖంలోనూ కత్తివాటుకి నెత్తురు చుక్క లేదు. భావావేశపు ఉప్పెన తట్టుకునే శక్తి వచ్చేవరకు అందరూ మౌనంగానే ఉన్నారు. మొదటిగా ముసలమ్మ గారే గొంతు విప్పింది.

“అల్లుడుగారు గాడిద అవడమేమిటండి? శకుంతలా, ఈ వెర్రిమొర్రి బ్రాహ్మలకి వెంటనే ఉద్వాసన చెప్పు. ఆ గాడిదని అమీర్‍పేట్‍లో అడుగుపెట్టకుండా తన్ని తగలేయండి.”

ఇది సంభవమేనా అన్న ఆశ్చర్యంలో మునిగిన శేఖర్, “అంటే నాన్నగారు బతికే ఉన్నారంటారా?” అడిగాడు సుబ్రమణ్యం గారిని.

“నాన్నగారు పోయిన మాట వాస్తవమే, నాన్నగారి శరీరాన్ని దహనం చేసిన మాట వాస్తవమే, కానీ నాన్నగారి ఆత్మ ఇంకా ఉంది.”

“నాన్సెన్స్, పోనీ కిందకెళ్ళి గాడిదా గాడిదా, నువ్వు సిద్ధరామయ్య వేనా అని డైరెక్ట్ గా అడిగేద్దాం పదండి”

చాణక్య ప్రశ్నకి ఆంజనేయులు స్పందించాడు. “అవశ్యం అడగండి. మీకే తెలుస్తుంది.”

సుబ్రమణ్యంగారు ఇంతకుముందు తను చెప్పిన విషయాన్నే ఇంకొంచెం వివరంగా చెప్పడానికి ప్రయత్నించాడు.

“మృత్యు సమయంలో జీవుడు శరీరాన్ని విడవవలసి వచ్చినప్పుడు భరించలేని వేదన అనుభవిస్తాడు. శరీరమే నేననుకుని జీవితకాలం భ్రమించిన జీవాత్మ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండాలని శాయశక్తులా పెనుగులాడుతాడు. జన్మలో జరిగిన సంఘటనలన్నీ సినిమా రీలులా కనిపిస్తాయి. ఈ దృశ్యాన్నే మనవాళ్ళు యమకింకరులు పాశంవేసి లాగడమంటారు. సమీప బంధుమిత్రులతో చెప్పాల్సినవెన్నో సెకన్లలో చెప్పబోతారు. ఈ మృత్యుసంఘర్షణ తర్వాత అంచెలంచెలుగా జీవుడు శరీరంనుంచి వేరవుతాడు. గరుడ పురాణంలో ఇవన్నీ వివరంగా ఉన్నాయి. శరీరంనుంచి వేరయిన జీవుడే ప్రేతాత్మ. తనెరిగిన ప్రపంచం వదలలేక, బంధాలు తెంచుకోలేక కొన్ని రోజులపాటు అక్కడక్కడే ప్రేతాత్మ తచ్చాడుతుంది. ప్రేతాత్మని శాంతింపజేసి తృప్తిపరిచి భవబంధాలని వదిలించుకోవటానికి మనం శాస్త్రోక్తంగా చేస్తున్న ఉత్తరకర్మ దోహదపడుతుంది.”

“ఇదంతా ఓకే బ్రహ్మ గారూ, ప్రేతాత్మ గాడిదలో దూరడమేమిటి?” చాణక్య కొంచెం మెత్తబడినట్లుగా అడిగాడు.

ఈ ప్రశ్నకి ఆంజనేయులు సమాధానం చెప్పాడు. “శరీరాపేక్ష అమితంగా ఉన్న ప్రేతాత్మలకి అప్పుడే మరణించిన జీవి తటస్థపడితే భావవ్యక్తీకరణార్ధం అందుబాటులో ఉన్న కళేబరంలోకి స్వల్పకాలికంగా ప్రవేశించవచ్చని శాస్త్రాల్లో ఉంది. ఇది నూటికో కోటికో ఒకసారి జరుగుతుంది. సామాన్యంగా ప్రేతాత్మలు తమ ఉద్దేశ ప్రకటన నిమిత్తం పక్షి శరీరాన్ని ఎంచుకుంటారు. జంతుశరీరప్రవేశం, అందునా పెద్ద జంతువైన గార్దభశరీరంలో ప్రవేశం అసంభవం.”

“అసంభవం కావచ్చు. కానీ అసాధ్యం కాదు. కళ్ళెదుటగా కనిపిస్తున్నది కదా. అబ్బాయి శేఖర్, నాన్నగారు మీకేమి చెప్పదలచుకున్నారో మీ పద్ధతిలో మీరు కనుక్కోవటం తక్షణ కర్తవ్యం.” అంటూ సుబ్రమణ్యం గారు శిష్యుడుతో సహా నిష్క్రమించాడు.

“పోనీ బావా, గాడిదని, ఐ మీన్ నాన్నగారిని ఫ్లాట్ లోపలికి తెద్దామా?”

“నీకేమైనా మతిపోయిందా శేఖర్, గాడిదల్ని అపార్ట్‌మెంట్ లోపలికే రానియ్యరు. లిఫ్ట్ ఎక్కించి పైకి తెద్దామంటావా?”

“ప్లీజ్ బావా, నువ్వేదో ఉపాయం ఆలోచించు. అక్కా, అమ్మా నాన్నగారిని తలుచుకుని ఎంత రోదిస్తున్నారో నీకు తెలుసు. నాన్నగారు బ్రతికే ఉన్నారని నిశ్చయమైతే వారికీ ఊరటే కదా!”

“గాడిదని ఇంట్లో పెట్టుకంటే ఊరటేమిట్రా నీ తలకాయ? మీ నాన్న బెడ్ మీద గాడిదని పడుకోపెడతావేమిటి కొంపతీసి”

“కనీసం, హాల్లో కట్టేద్దాం, అంటే ఉంచుదాం.”

“ఆ గాడిద ముక్కులు పగిలే కంపుకొడ్తోంది, నన్నుచూస్తే తన్నబోతోంది, మాటవరసకి గాడిద మీ నాన్నే అనుకుందాం. తన్నకుండా ఉంటే స్నానం చేయించి ఇంత గడ్డి పెడదాం. ఎన్నాళ్ళుంచుకుంటావ్, నలుగురుతో ఏమని చెబుతావ్?”

“చూస్తూ చూస్తూ మనతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్న నాన్నగారి ఆత్మని, గాడిదైతే అయింది, తన్ని తగలేయలేం కదా!”

“పెంటలు నువ్వెత్తుతావా?”

“కొంచెం సౌమ్యంగా మాట్లాడు బావా, రోగమొచ్చి మంచంలో ఉన్న పెద్దవాళ్ళని చూసుకున్నట్లు చూసుకుందాం.”

“ఎన్నాళ్ళు? తన్నులు తింటూ, ఓండ్రలు పడుతూ, గాడిదకొడుకని పిలిపించుకుంటూ!”

“ముందు పద. గాడిద మనతో ఏం చెప్పాలనుకుంటోందో తెలుసుకుందాం.”

ఇద్దరూ కిందకెళ్ళారు. కళ్యాణి ఈ వ్యవహారం తనకేం పట్టనట్లు ఒక్కతే బెడ్రూంలో మౌనంగా కూర్చుంది.

హాల్లో అరుంధతమ్మగారు కూతురుతో, “ఇదేం వైపరీత్యమే! ఒక కష్టం తరువాత ఇంకో కష్టం దాపురించింది నీకు. పోయిన వాడు సరాసరి పోక ఏదో చెప్పాలనుకునే తాపత్రయం దేనికి? అందుకోసం గాడిదవటమేమిటి? ఆ గాడిదని వీళ్ళు ఇంట్లోకి తీసుకొద్దా మనుకోవటమేమిటి? నీ ఖర్మ కాకపోతే!”

“అమ్మా, ఆయన పైకి వచ్చాక నువ్వే ముఖాముఖి అడుగు”

“రామ రామ, గాడిదతో ముఖాముఖి ఏమిటే! నాతో మీ ఆయన ఎప్పుడు సుముఖంగా ఉన్నాడు కనక? ఇప్పుడేమో గాడిదయ్యాడంటున్నారు. కసంతా తీర్చుకుంటాడేమో! నన్ను నడ్డిపగిలేట్టు తంతే? నాకెందుకొచ్చింది. నేను గదిలోకెళ్ళి తలుపులు బిడాయించుకు కూర్చుంటాను.”

“అలా అంటే ఎలా అమ్మా, పెద్దదానివి నువ్వే సలహా చెప్పాలి.”

గాడిద యథాస్థానంలో ఉంది, వీళ్ళ కోసం ఎదురు చూస్తున్నట్లుగా. ఇంతకుముందు వీరు గమనించలేదు కానీ గాడిద మెడలో పలుపుతాడు ఉంది. చాణక్య పట్టుకోపోయాడు. చాణక్య శతృపక్షంవాడని గాడిద తీర్మానించుకున్నట్లుంది. చిన్న శబ్దం చేసి కయ్యానికొచ్చినట్లు చాణక్య మీదకి అడుగు వేసింది. చాణక్య తగ్గి, “శేఖరా, మీ నాన్న నీ మాటే వింటాడు. తాడు పట్టుకుని లోపలికి రా.” అని సెక్యూరిటీ అతనితో పరకర్మలో కొన్ని శాఖలవారు గోవుతోపాటుగా గార్దభం కూడా మంత్రవిధిలో తెచ్చుకుంటారనీ, ఎవరికీ ఇబ్బంది లేకుండా స్వంత పూచీకత్తు మీద కొంచెం సేపు కార్ పార్కింగ్‍లో కట్టేసుకుంటామని తెలియజెప్పాడు. ‘అజీబ్ ఆద్మీ హై’ అనుకుంటూనే సెక్యూరిటీ వాడు గాడిదని లోపలికి వదిలాడు. గుణశేఖర్‌తో దర్జాగా గాడిద అపార్ట్‌మెంట్ లోకి ప్రవేశించింది. అవాక్కయి సంభ్రమాశ్చర్యాలతో జనం గాడిదని, గాడిదని నడిపించుకువస్తున్న శాల్తీలని చూశారు గాని ఈ శాల్తీలు ఎవ్వరినీ చూడనట్లు నటిస్తూ గాడిదని లిఫ్ట్ దగ్గిరకి నడిపించుకొచ్చారు. అప్పటికి శేఖర్‌కి ధైర్యమేకాక గాడిద రూపంలో ఉన్న నాన్నగారి మీద గౌరవం కూడా పెరిగింది. లిఫ్ట్ బటన్ నొక్కాడు. చాణక్య ‘నువ్వూ గాడిదా వెళ్ళండి, నేను విడిగా వస్తాను’ అని సైగ చేశాడు. గాడిదకి ఎంత వినిపిస్తుందో ఏం వినిపిస్తుందో ఎప్పుడు కోపం వస్తుందో తెలియని పరిస్థితి కదా.

ఒకళ్ళిద్దరు భయపడి గావుకేకలేసినా పట్టించుకోకుండా శేఖర్ విజయవంతంగా చతుష్పాదజీవిని ఇంట్లోకి తెచ్చాడు.

గాడిద అందరినీ చూసింది. ఎవరూ దగ్గరకు రాలేదు, శేఖర్ తప్ప. ముసలమ్మ గారు మరీ దూరంగా నిలబడింది. కింకర్తవ్యతా మూఢురాలై శకుంతలమ్మ, భయవిహ్వలురాలై అరుంధతమ్మ, జంతుప్రేమతో కళ్యాణి, ఏ రూపమైతేనేమి నాన్నగారే కదా అన్న నిశ్చయంతో శేఖర్ గాడిదని చూస్తున్నారు.

“అమ్మా, ఏదో ఒకటి మాట్లాడు. నువ్వు మాట్లాడింది ఆయనకి, జవాబుగా ఆయన చెప్పేది నీకు అర్థం అవుతుందేమో మనకి తెలియాలిగా?”

కొంచెం తటపటాయించినా శకుంతలమ్మ ధైర్యం చేసింది. “మీకేమయినా అసంతృప్తి కలిగించే పనులేమయినా చేశామాండి?” గాడిద స్పందించలేదు. గుర్రుమనలేదు. నీకు నేనెందుకు సమాధానం చెప్పాలి అన్నట్లుగా చూసింది. రెండడుగులు మాస్టర్ బెడ్రూం వైపువేసి, ఆగి కళ్యాణివంక కన్నార్పకుండా చూసీంది. అరుంధతమ్మగారు మనవరాలితో, “నీతోనే ఏదో చెప్పాలనుకుంటున్నాడేమోనే, పోనీ నువ్వొక్కతివే రూంలోకి తీసుకెళ్ళు” అంది సాధ్యమైనంత దూరంగా నిలబడి.

ఏమనుకున్నదో అమ్మమ్మ చెప్పినట్లుగా గాడిద తాడు పట్టుకుని బెడ్రూంలోకి తీసుకెళ్ళింది కళ్యాణి.

అప్పటికే గాడిద బాపతు దుర్వాసన హాలంతా వ్యాపించింది. గాడిద వేసిన విసర్జనని శేఖర్ శుభ్రం చేశాడు బాధ్యతగా. అందరూ తండ్రీకూతుళ్ళ మధ్య ఏం సంభాషణ జరుగుతోందో తెలుసుకోవాలని ఉత్కంఠతో ఉన్నప్పటికీ కొద్దిసేపు వాళ్ళ మానాన వాళ్ళని వదిలేస్తే మంచిదని నిర్ణయించుకున్నారు.

చాణక్య కార్యాచరణ సూచిస్తున్న ధోరణిలో, “ఒక విషయం తెలిసింది. మామయ్యకి అమ్మమ్మ గారిని చూస్తే చిర్రెత్తుకొస్తోంది. నేను కూడా పడటంలేదు. అత్తయ్య పట్ల తటస్థ ధోరణి. శేఖరంటే ఇష్టం. కళ్యాణి మహా ఇష్టం. నా ఉద్దేశం కళ్యాణితో ఏదో రహస్యంగా చెప్పాలనే మళ్ళీ భూమి మీదకి వచ్చాడు. నేను ఆయనని మంచి చేసుకుని సంగతులు రాబట్టడానికి ప్రయత్నం చేస్తాను. ముందుగా గాడిదల మీద నాకున్న సదభిప్రాయాన్ని అర్థమయే విధంగా చెబుతాను.” అంటుండగా దానయ్యగారు ముఖద్వారం తలుపుతోసుకుని ఇంట్లోకి ప్రవేశించారు.

సిద్ధరామయ్య, శకుంతలమ్మ కూడా వారి తల్లిదండ్రులకి ఏకసంతానం. అందుచేత సిద్ధరామయ్య కుటుంబానికి బంధువర్గం అతి కొద్దిమంది మాత్రమే ఉన్నారు. దానయ్యగారు శకుంతలమ్మకి పెత్తండ్రి కొడుకు. నాలుగు రోజులుగా ఊళ్ళో లేడు. ఊళ్ళో దిగంగానే చెల్లెల్ని చూడడానికి వచ్చాడు. కానీ ఇక్కడ మనుషుల తీరు, వాళ్ళ ముఖాలు, ప్రవర్తన షెర్లాక్ హోమ్స్ కూడా ఛేదించలేనంత మర్డర్ మిస్టరీగా తోచాయి అతనికి. టీవీ షో అయితే మూడునాలుగు సీజన్లయితేగాని వీడనంత నిగూఢమైన ప్రస్తుత మిస్టరీని అయిదు నిముషాల్లో గుణశేఖర్, గుణశేఖర్‍కి కొర్రుపడినప్పుడు చాణక్య సానుభూతితో విడగొట్టి విశదీకరించారు. విషయం జీర్ణించుకోటానికి అరనిమిషం సరిపోయిందాయనకి. గట్టి పిండం.

“ఇప్పుడు తెలిసింది. ఎందుకా సెక్యూరిటీ వాళ్ళతో సహా అందరూ నన్ను వింత జంతువుని చూసినట్లు చూస్తున్నారనుకున్నా. అందరినోటా మన ఫ్లాట్ నెంబరు 607 మాటే ఆడుతోంది. ఇంతకీ గాడిదెక్కడ?”

“ష్. నెమ్మదిగా మాట్లాడన్నయ్యా” శకుంతలమ్మ ప్రాధేయపడింది. “బెడ్రూంలో ఆయన అమ్మాయితో సంభాషిస్తున్నారు.”

“గాడిదకి వినికిడి శక్తి మనుషులకంటే మూడు రెట్లు ఎక్కువ.” చాణక్య.

“ఎందుకొచ్చిన శషభిషలు? రూములో అమ్మాయి, గాడిద రూపంలో నా అల్లుడు, అయిదు నిమిషాలుగా ఉన్నారు. నాకు భయంగా ఉంది. నువ్వే పూనుకుని తరుణోపాయం చెప్పాలి దానయ్యా!”

“అందరూ ఏమిటి నాన్నగారిని గాడిద గాడిద అంటారు? శరీరం ఏదైనా ఆత్మ నాన్నదే కదా.”

“పోయిన వాడు అందరిలా పద్ధతిగా పోక కళేబరాలు వెతుక్కోవటమేమిటి, అమీర్‌పేటలో అప్పడే పోయిన అనేక జీవరాశుల కళేబరాలుండగా పరకాయ ప్రవేశం చేయడానికి ఈ గాడిద కళేబరాన్నెంచుకోవడమేమిటి, నా కూతుర్ని అభాసు పాలు చేయటానికి. కలికాలం కాకపోతే.”

“అన్నయ్యా, నాకేమీ పాలుపోకుండా ఉంది. మీ పిన్ని ప్రవృత్తి నాకంటే బాగా నీకే తెలుసు. మిగతా అందరూ చిన్నవారు. నువ్వే ఏదో ఉపాయం చెప్పి మమ్మల్నీ ఆపదనించి గట్టెక్కించు.”

“ఏ ఆపదే నీకు, మొగుడు పోయిన దుఃఖమా, మొగుడు బతికొచ్చాడని దుఃఖమా?”

“ఏమిట్రా నీ అశనిపాతపు మాటలు? మా ఆయన బ్రతికే ఉన్నాడు, గాడిద అయితే అయ్యాడు, నా మొగుడే కదా అని తను నమ్మి నలుగురుతో అదే మాట చెప్పాలా? మీ వాలకం చూడపోతే నా కూతుర్ని గాడిదతో జీవితాంతం కాపరం చెయ్యమనేట్లున్నారు. ఇదేం చోద్యం?”

“సమస్యంతా గాడిదతో వచ్చినట్లుంది శకుంతలా! మీ ఆయన ఆత్మ పిట్ట రూపంలోనో, పిల్లి రూపంలోనో, కుక్క రూపంలోనో ఉంటే నీకభ్యంతరం లేకపోను. గుఱ్ఱమైనా ఒప్పుకునేదానివి. మరీ గాడిదేమిటి అంటావా?”

“అసలెందుకురా దానయ్యా ఏదో రూపంలో వెనక్కొచ్చి మనల్ని పీక్కుతినడం? కాలం తీరింది. పోయాడు. ఒక ఏడుపు ఏడిచి, పిండంపెట్టి, బతికున్న వారు వారి బతుకు వారు హాయిగా బతకుతారు గదా, ఇదెక్కడి ఛీద్రం. మింగలేకా, కక్కలేకా?”

శేఖర్ ఉండబట్టలేక పోయాడు. “అమ్మమ్మా, నువ్వూ అమ్మా సంవత్సరాల తరబడి టీవీలో ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటున్నారు కదా, ‘ఆత్మ సత్యం, శరీరం మిథ్యా’ అంటే ఏమిటి?”

“ఇంతసేపుగా కళ్యాణి లోపల ఒక్కతే ఉంది, మావయ్య తంతే పడతాను, కానీ ఏం జరుగుతోందో చూడాలి” అంటూ చాణక్య బెడ్రూం తలుపు తెరిచి లోనికి వెళ్ళి తలుపేసుకున్నాడు.

డోర్ బెల్ మోగింది. శేఖర్ తలుపు తీశాడు. అయిదుగురు మనుషులు దర్శనమిచ్చారు. ఇద్దరు కమిటీ సభ్యులు, ఒక భద్రతాధికారి, ఇద్దరు ఔత్సాహికులు. సొసైటీ పరిరక్షకురాలొకావిడ ముందుగా వెల్లడించింది. “అనధికారికంగా మీరు ఒక గాడిదని సొసైటీ లిఫ్ట్ దురుపయోగించి, మీ ఇంటిలోకి తెచ్చుకున్నారనియు, కార్యనిర్వాహక సర్వసభ్య అనుమతి లేకనే ఇంటిలో ఒకరిగా సదరు గార్దభమును ఉంచి పోషించదలచుకున్నారనియు తెలియవచ్చినది. సొసైటీ నిబంధనలు అతిక్రమించినందుకు గాను తమరు ఈ రోజే కట్టవలసిన జరిమానా 2000, అక్షరాలా రెండువేల రూప్యములు. ఇంతియే కాక గార్దభమునకు భవనబహిష్కారశిక్ష విధించటమైనది” ఇది ఆవిడ స్థానిక భాషకి గ్రాంథిక రూపాంతరం.

దారితప్పిన ఆగంతుకులకి అందరికంటే ముందు దానయ్య ఉద్బోధించాడు. “అమ్మలూ, అయ్యలూ, మా ఇంట ఒక చావు సంభవించింది. అందరి ఇళ్ళల్లోనూ ఎప్పుడో అప్పుడో, అడపా తడపా సంభవించేదే. పసిపాపలు ఉద్భవించి ఇంటిసభ్యుల సంఖ్యని పెంచటం ఎంత సంభవమో, వృద్ధులు మృతిచెంది కుటుంబ సంఖ్యని తగ్గించటమూ అంతే సంభవం, అంతే ఆవశ్యకం. మా బావగారు పోయి రెండు రోజులే అయింది. చేతనయితే సహాయం చేయండి. సానుభూతి పలకండి. దయయుంచి దొమ్మీకి రాకండి.”

వాళ్ళల్లో వాళ్ళు ఏదో గొణుక్కుని నిష్క్రమించారు.

***

గాడిద మనసు మార్చుకుందేమో, చాణక్యని చూసి కూడా చిందులెయ్యలేదు. వార్డ్ రోబ్‌లో ఉన్న డిజిటల్ లాకర్ వైపుగా చూస్తోంది. చాణక్య ప్రయత్నం చేయాలికదా అనే ధోరణిలో, “అయ్యా, మా మాటలు మీకు వినిపిస్తున్నాయో లేదో తెలియదు, మీకు అర్థం అవుతున్నాయో అంతకంటే తెలియదు. ఏదో ఒక సైగ చేయండి.” అని విన్నవించుకున్నాడు. బదులుగా గాడిద ముందటి కాలు ఎత్తి నెమ్మదిగా రెండుసార్లు నేలమీదికి దించింది.

“ఇంకొంచెం బోధపడేట్టు చెప్పండి.” గాడిదలో కదలిక లేదు. “మమ్మల్ని గుర్తు పట్టారా?” రెండుమాట్లు మళ్ళీ నేలమీద కాలు కొట్టింది. “కాలు కొట్టటంలో ఏదైనా సంకేతం ఉందంటావా చాణక్యా?” ఇంకోసారి రెండు మాట్లు కాలు కదిపి తన బాధ్యత తీరిపోయిందన్నట్టుగా నేలమీద పడుకుంది.

***

దానయ్య గారు హాలులో తనకి తోచిన మంచిచెడ్డ చెపుతూనే ఉన్నారు. “మన మధ్యలోనే, మనకి కనిపిస్తూనే బావగారి ఆత్మ ఒక శరీరాన్ని ఆశ్రయించుకు ఉంది కదా, అది ఆ రూపంలో ఉన్నవరకూ మనం కర్మ చెయ్యలేము దర్భ బంధంలోకి ఆత్మని ఆవాహనం చెయ్యకూడదు. దశాహము, సపిండీకరణం కుదరవు.”

“అంటే ఈ గాడిద ఇంట్లో ఉన్నంతవరకూనా?” పెద్దావిడకి గాడిద వ్యవహారం సుతరామూ నచ్చలేదు,

“ఇంట్లో ఉన్నా, బయటెక్కడున్నా. ప్రాణాలతో ఉన్నంత వరకూ.”

“ఇదేం తద్దినం మనకి? ఇంకో రెండేళ్ళు గాడిద బతికే ఉంటే? రేపు ధర్మోదకాలకి వచ్చినవాళ్ళని వచ్చిందారినే పొమ్మందామా?”

“నేనేం చెయ్యగలను పిన్నీ! నాకు తెలిసిన విధివిధానం చెప్పాను. ఇంకో విషయం. ఈ జంతుశరీరం లోంచి ఆత్మ ఇచ్ఛాపూర్వకంగా వదిలి వెళ్ళాలి. ఎవరయినా చంపితే, మనకి బ్రహ్మ హత్యాపాతకం చుట్టుకుంటుంది.”

“ఇంకో పెంట పెట్టావూ మా నెత్తి మీదకి?”

***

“యురేకా! కళ్యాణీ, అన్ని ప్రశ్నలకీ సమాధానం ఒక్కసారిగా దొరికింది నాకు. మామయ్య నీ కోసం ఏదో లాకర్‍లో దాచాడు. నీ ఒక్కత్తెతో ఆ విషయం చెప్పటానికే ఈయన ప్రయత్నమంతా. అందుకే నీతో తప్ప మిగతా అందరితో ఆంటీ ముట్టనట్లు ఉంటున్నాడు. ఒక పథకం ప్రకారం మనందరినీ ఒక ఆట ఆడించి, ఫ్లాట్ లోకి ఎంట్రీ సంపాదించాడు. చాకచక్యంగా నిన్ను ఒంటరిగా లాకర్ దగ్గరకి తీసుకు వచ్చాడు. నీకు కోడ్ చెప్పి లాకర్ తెరవమంటున్నాడు. పాస్ కోడ్ 2222 అయిఉండాలి. ట్రై చేసి చూడు, ఆయన కోసం.”

“నాకేమీ పాలు పోకుండా ఉంది. ఈ సంగతి అమ్మకి చెపుదాం.”

“పిచ్చిదానా, ఈయన చేసిన నాటకమంతా లాకర్ నీచేతే తెరిపిద్దామని. ముందు లాకర్ తెరుచుకోనీ. తరువాత అందరికీ చెబుదాం.” అంటూనే 2222 కొట్టాడు. లాకర్ తెరుచుకోలేదు. తనకి తోచిన ఇంకో నాలుగు నంబర్లు కూడా పని చెయ్యలేదు.

“గాటిట్! ఆయన 2 మూడు సార్లే చెప్పాడు. కోడ్ 2022!”. లాకర్ తెరుచుకుంది! “యూ ఆర్ గ్రేట్ మామయ్యా!”

లాకర్‌లో ధగధగా మెరుస్తున్న డైమండ్ నెక్లెస్, ఇయర్ రింగ్స్ కనిపించాయి. పక్కనే బిల్ కూడా ఉంది. తారీకు నాలుగు రోజుల క్రితం. ఖరీదు సుమారు పాతిక లక్షలు!

మరుక్షణం విషయం అందరికీ చెప్పింది కళ్యాణి. శేఖర్ “నాన్న నాతో ఎప్పుడూ డబ్బు విషయాలు మాట్లాడలేదు కానీ, నీకు నీ పెళ్ళిలో కానీ, ఆ తరువాత కానీ ఏమీ ఇవ్వలేకపోయానని ఆయన చాలాకాలంగా మథన పడుతున్నట్లు నాకనిపించింది.” అన్నాడు.

దానయ్య గారు, “మహాను భావుడు ఎన్ని సంవత్సరాలు డబ్బు పోగుచేసుకుని ఆ నగ కొన్నాడో కూతురు కోసం.” అన్నాడు మెచ్చుకోలుగా.

శకుంతలమ్మ మాట్లాడలేదు. అరుంధతమ్మగారే అందుకుంది, “ఎవరి కోసం కొన్నాడో ఎవరికి తెలుసు? ఎవరికీ చెప్పలేదు. ఎక్కడా రాయలేదు. నగ ఫిరాయించి డబ్బు తెచ్చుకుని ఇంట్లోకి వాడండి. ఇల్లెట్లా గడవాలి?”

“ఒక్క విషయం తెలిసిందర్రా నాకు. సిద్ధరామయ్య తను పోయిన రెండో రోజు తన మనుషులనుకున్నవాళ్ళు, తన పట్ల ఎట్లా ప్రవర్తిస్తారో, తన జీవితం ఎవరికి ధారపోశాడో వారు తనకిచ్చే విలువేమిటో ప్రత్యక్షంగా చూడగలిగాడు. ఆయన జన్మ ధన్యం. చూస్తూ ఉండండి. ఆయన ఈ అవతారం ఇక చాలిస్తాడు.”

కాల్ బెల్ మోగింది. సెక్యూరిటీ అతను ఒక విజిటర్‍ని వెంటతెచ్చాడు.

“నా పేరు పెండయ్యయ్యా. పక్క కాలనీలో నా షెడ్. నాయి నాలుగు గేదెలుండాయి. ఈ గాడిద నాదే. తిక్కెక్కినప్పుడల్లా తాడుతెంచుకు లగెత్తుద్ది. నెలకోసారి నాకీ తంటా. పొద్దుగాల్నించీ దేవులాడుతంటే ఇప్పటికి దొరికింది.”

గుణశేఖర్ అడిగాడు సీరియస్‌గా “రెండు రోజుల క్రితం నీ గాడిద చచ్చిపోయిందా?”

“ఏందయ్యా మీ పరాచికాలు? పదేళ్ళాయి బతికే ఉంది.”

(సమాప్తం)

Exit mobile version