తడీ.. కోపం

0
3

[శ్రీ వారాల ఆనంద్ రచించిన ‘తడీ.. కోపం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]నా[/dropcap] లోపల
ఓ పక్క ‘తడి’
సకులం ముకులం వేసుక్కూర్చుండి
మరో పక్క ‘కోపం’
మండుతూ రెపరెప లాడుతోంది

ఏది ఎప్పుడొచ్చిందో
ఎక్కడి నుంచి వొచ్చిందో తెలీదు

ఒక్కోసారి తడి
కళ్ళలోంచి
టపా టపా రాలుతుంది

ఇంకోసారి
కోపం జ్వాలై
కళ్ళల్లోంచి దుముకుతుంది

ఇట్లా కాదని తడినీ కోపాన్నీ
కాగితం మీద దించేద్దామని
కూర్చున్నాను

అక్షరాలు బారులు తీరాయి
కవిత రూపుదిద్దుకుంది

తడీ కోపామూ
అక్షరాల నడుమ పదాల మాటున
సేదదీరాయి

హమ్మయ్య అనుకుంటూ
కళ్ళు మూసుకుని
ఊపిరి తీసుకుని వెనక్కి వాలాను

చిత్రంగా
నా లోన తిష్ట వేసుకున్న ‘తడి’
రగులుతున్న ‘కోపం’
అట్లాగే వున్నాయి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here