Site icon Sanchika

తగ్గడమే నెగ్గడం

[dropcap]గ[/dropcap]త కొద్ది రోజులుగా నా మొబైల్‍లో యూట్యూబ్‌లో అన్నీ బరువు తగ్గడానికి సంబంధించిన వీడియోలు… అంటే ఏం తినాలో, ఏ కషాయాలు తాగాలో, ఏ ఆసనాలు వేయాలో చెప్పే వీడియోలు – వైద్యులు, ప్రకృతి వైద్య నిపుణులు, యోగా టీచర్లు, ఫిజికల్ ట్రైనర్లు చెప్పే చిట్కాల వీడియోలే కనబడుతున్నాయి.

నాకీ వీడియో టిప్స్ అవసరం ఉందని గూగుల్ ‘మాత’కి లేదా యూట్యూబ్ ‘భయ్యా’కి ఎలా తెలిసిందో మొదట నాకర్థం కాలేదు. కొంచెం ఆలోచిస్తే, కొద్ది రోజుల క్రితం ‘మూడు రోజుల్లో బరువు తగ్గండి’ అన్న వీడియో ఏదో చూసినట్టు గుర్తొచ్చింది. మనం చూసిన, వెతికిన వీడియోలను బట్టి గూగుల్ ‘మాత’/యూట్యూబ్ ‘భయ్యా’ మనకి కావల్సిన సెర్చ్ ఐటమ్స్‌నన్నీ ఒకచోట చేరుస్తారని అర్థమయింది!

మనం యూట్యూబ్‌లో వరుసగా ఒకే హీరోవి రెండు మూడు సినిమాలు చూశామనుకోండి… కొద్ది రోజుల పాటు ఆ హీరో సినిమాలు మనకి మొబైల్ యూట్యూబ్‌లో కనిపిస్తూంటాయి. సెర్చ్ ఇంజన్స్ భాషలో ఇవి సజెషన్స్ అన్నమాట. అంటే మనకేం కావాలో గూగుల్ ‘మాత’ లేదా యూట్యూబ్ ‘భయ్యా’ ఊహిస్తున్నారన్నమాట. అయితే వాళ్ళు లిస్ట్ చేసిన సినిమాలు చూడాలావద్దా అనేది మన ఇష్టం!

సినిమాలనైతే వదిలేస్తాం కానీ…. మనని కొద్ది సంవత్సరాలుగా లేదా నెలలుగా వేధిస్తున్న సమస్యకి వాళ్ళు రోజులలో పరిష్కారం చూపిస్తామంటుంటే – మనసు కాస్త అటు మొగ్గుతుంది కదా! నా విషయంలోనూ అదే జరిగింది. టైమ్ దొరికినప్పుడల్లా వరుసగా ఒక్కో వీడియోను చూడసాగాను.

“బరువు తగ్గడానికి అతి సులువైన చిట్కా ఇది.. ఈ చిట్కా కూడా పాటించలేకపోతే ఇంక మీరు అసలు బరువు తగ్గలేరు. బరువు తగ్గడానికి అత్యంత సులువైన మార్గం ఇదే. ప్రయత్నించండి..” అంటుందొక వీడియో.

“గుడ్డు ఇలా తినండి. ఈజీగా బరువు తగ్గండి” అంటుంది ఇంకో వీడియో.

“వేగంగా బరువు తగ్గండి ఇలా” అని ఒకటి, “సులభంగా బరువు తగ్గండి ఇలా” అని మరోటి… రకరకాల వ్యక్తులు పోస్ట్ చేసిన వీడియోలు.

“ఇప్పుడు కేవలం అతి తక్కువ రోజుల్లోనే బరువు తగ్గండి” అని చెప్పే వీడియో ఏడు రోజుల పాటు పరగడుపున వాళ్ళు చెప్పిన ద్రావకాన్ని తాగమంటుంది.

“సులువైన టెక్నిక్‌తో అమాంతం బరువు తగ్గండి” అనే వీడియో ఓ రకం సూప్ తాగమంటుంది.

“ఈ ఉప్మా తో రోజుకి కిలో బరువు తగ్గండి”

“పచ్చిబఠానీలను తినండి.. బరువు తగ్గండి’

“వెల్లుల్లితో వారంలో 3 కిలోల బరువు తగ్గండి”

“కరక్కాయతో బరువు తగ్గండి”

“ఈ జ్యుస్ ని రొజు 3 సార్లు తాగండి,మీ బరువు తగ్గండి” (టైపింగ్ తప్పులు ఉన్నా ఆ వీడియో టైటిల్‍ని ఉన్నదున్నట్లుగా రాశాను).

“చెప్పుడు మాటలు విని మతి పోగొట్టుకోకండి బరువు తగ్గండి.”

“నాన్వెజ్ తింటూనే బరువు తగ్గండి.”

“ఈ చిన్న ట్రిక్ తో అయిదు రూపాయలతో అయిదు కిలోల బరువు తగ్గండి.”

“కాఫీ, కొబ్బరి నూనెతో బరువు తగ్గండిలా..!”

“పొట్ట తగ్గాలా? బరువు తగ్గాలా? అయితే జీలకర్రే బెస్ట్..”

“ఈ పవర్ ఫుల్ డైట్ ప్లాన్ గురించి తెలుసుకోండి.”

“బరువు తగ్గాలనుకునేవాళ్లు ఈ దోస తిని చూడండి …”

“నో డైటింగ్, నో ఎక్సర్‌సైజ్.. ఈ టిప్స్‌తో బరువు తగ్గండి!”

“10రోజులల్లో 5 KGలు ఎలాంటివారైన సరే బరువు తగ్గుతారు”

“ఆరోగ్యంగా బరువు తగ్గండి”

“ఇది త్రాగండి బరువు తగ్గండి”

“ఈ నీటిని రోజు తాగితే 21రోజుల్లో బరువు తగ్గుతారు”

“ఈ 5 అలవాట్లు వల్ల మీరు పూర్తిగా బరువు తగ్గుతారు”

“మీరు బరువు తగ్గాలా ..? ఇది తింటే చాలు…!!”

“నెలకు కనీసం ఐదు కిలోల బరువు తగ్గించే రోటీలు”

“కేజీల కేజీల బరువు తగ్గండి ఆరోగ్యవంతంగా”

“రొయ్యలు తింటే బరువు తగ్గుతారు”

“అల్లం తో ఇలాచేస్తే పొట్ట దగ్గర కొవ్వు తెలియకుండానే వారం రోజుల్లోనే కరిగిపోతుంది”

“చలికాలంలో ఇలా స్నానం చేస్తే వెంటనే బరువు తగ్గుతారు”

“రాత్రి పూట భోజనంలో ఒక్క నెల రోజులు ఇది తింటే 5 కేజిల బరువు వద్దన్నా తగ్గుతారు”

“ఈ నీటిని తాగితే రెండు వారాల్లోనే బరువు తగ్గుతారు”

“బొప్పాయితో బరువు తగ్గండి.”

“రాత్రి వేడి నీళ్లలో ఈ పొడి కలుపుకుని తాగితే మీ శరీరంలో వేస్ట్ కొవ్వు మొత్తం కరిగి బరువు తగ్గుతారు”

“నెల రోజుల్లో 20 కిలోల బరువు తగ్గండి”

“డైటింగ్ వద్దు రాత్రి భోజనం చేసాక ఈ చిన్న చిట్కాని పాటించడం వల్ల 2 వారాల్లోనే 7 కిలోల బరువు తగ్గుతారు”

“మన సినిమా స్టార్స్ బరువు తగ్గడానికి ఉదయం ఈ రెండిటిని తాగుతారు”

ఇలాంటి హెడింగ్స్‌తో రకరకాల వీడియోలు నా మొబైల్‌లో యూట్యూబ్‌లో దర్శనమిచ్చాయి.

ఒక్కోసారి రుచికరమైన ఆహారపు పరిమళాన్ని ఆఘ్రాణిస్తే – తినకుండానే తృప్తిగా అనిపిస్తుంది. అలానే ఈ వీడియోల హెడింగ్స్‌ చదివితేనే నేను ఓ మూడు కిలోలు బరువు తగ్గినట్టు అనిపించింది.

చాలా వీడియోల హెడింగ్స్‌లో మూడు రోజులు, వారం రోజులలో బరువు తగ్గండి అని అంటారు… కానీ వీడియో అంతా చూశాకా… చివర్లో చిట్కాలు చెబుతున్న నిపుణులు మూడు నెలల్లో తగ్గుతారని సెలవిస్తారు. నిపుణులు చెప్పే కాలవ్యవధే సరైనది… తమ ఛానెళ్లని ఎక్కువమంది చూడాలనే తాపత్రయంతో… వీడియో రూపకర్తలు ఇలా తక్కువ రోజులలో తగ్గిపోవచ్చని హెడింగ్స్‌లో చెప్తారు.

కొన్ని వీడియోలకి వచ్చిన కామెంట్లు ఫన్నీగా ఉన్నాయి. మరికొంతమంది విషయం లేని వీడియో చూశామని తిడుతూ తమ ఫ్రస్ట్రేషన్ చూపించారు. ఇక్కడ కూడా ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్న మాట! ‘వెంకీ ఆసన్’ గుర్తొస్తోందా?  అది ఆ సినిమాలో స్ట్రెస్ బస్టర్ అయ్యుండచ్చు కానీ మనకి ఉపయోగపడే, బరువు తగ్గించే ఆసనం కాదు. 🙂 అంతేగా… అంతేగా!

ఏదో వెబ్‌సైట్‌లో “హారర్ సినిమా చూస్తే బరువు తగ్గుతారు” మరో వీడియో శీర్షిక నన్ను బాగా ఆకర్షించింది. ఉత్సాహంగా లింక్ మీద క్లిక్ చేశాను. Oops! That page can’t be found అని వచ్చింది.

అలాగే కొన్ని న్యూస్ వెబ్‌సైట్స్‌లో వార్తలు చదువుదామని చూస్తే – కుడి వైపునో, ఎడమవైపునో, పేజ్ డౌన్‌లోనో – “3 వారాల్లో 28 కిలోలు తగ్గింది, ఫలితాలతో డాక్టర్లే నివ్వెరపోయారు” అంటూ ఓ ప్రకటన కనబడుతుంది.

కాంగోలో లభ్యమయ్యే ఆఫ్రికన్ బెర్రీ మనుషులను చురుకుగా ఉంచుతుందని అంటూ, తమ ఉత్పాదన న్యూట్రలైఫ్ గర్సినియా క్యాప్సుల్స్ వాడమని చెబుతారు. పైగా ఆ క్యాప్సుల్స్‌ని బ్యాన్ చేయమని మెడికల్ ఫ్రాటర్నిటీ కోరుతుందని అంటారు. ఆ వివరణ అంతా చదివితే చాలా టెంప్టింగ్‍గా ఉంటుంది.

***

గత కొన్ని సంవత్సరాలుగా మన సమాజాన్ని వేధిస్తున్న సమస్య ఒబేసిటి.

సాధారణంగా స్థూలకాయం రావడానికి అనువంశిక కారణాలు, ధైరాయిడ్ సమస్య, శరీరంలో హార్మోన్‌ మార్పుల వంటి ఆరోగ్య కారణాలు ఉన్నా; ఇప్పటి తరంవారికి మాత్రం జీవనశైలి, అలవాట్ల వల్లే ఎక్కువగా ఒబేసిటి వస్తోందని నిపుణులు చెబుతున్నారు.

మనం హఠాత్తుగా ఉన్నట్టుండి లావయిపోము. శరీరం క్రమంగా బరువెక్కడం, నడుం దగ్గర, పొట్ట మీద కొవ్వు చేరడం ఒకేసారి జరిగిపోదు. ఓ క్రమం ప్రకారం జరుగుతుంది. మనం దాన్ని గుర్తించినా, పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసినప్పుడు శరీరం నెమ్మదిగా మన మాట వినదు. నా విషయంలోనూ అదే జరిగింది.

సరే లావయిపోయాం… ఇంకేం చేస్తాం అనుకోలేం. ఎదుటివాళ్ళు నవ్వుకుంటే నవ్వుకున్నారు అని ఊరుకోలేం. నిలువుటద్దంలో చూసుకుంటే బాడీ షేప్ వికారంగా ఉన్నా పట్టించుకోనక్కర్లేదనుకుంటాం. కానీ.. అధిక బరువు వల్ల నడుం నొప్పి, మోకాళ్ళ నొప్పులు, పాదాల నొప్పులు వస్తుంటే; చేతిలోని వస్తువేదయినా కిందపడితే వంగి తీయలేక, కాలితో పైకి తీయాలని ప్రయత్నిస్తే; నాలుగు మెట్లెక్కితే ఆయాసం వస్తుంటే; కింద కూర్చుని అన్నం తినడానికి ఇబ్బందిగా ఉంటే – మనం బరువు తగ్గడం మీద గట్టిగా దృష్టి పెట్టాల్సిందే.

రోడ్డు మీద వివిధ సంస్థల వాళ్ళు పెద్ద పెద్ద హోర్డింగ్స్‌పై ప్రకటనలిస్తూంటారు. బిఫోర్, ఆఫ్టర్ అంటూ బరువుగా ఉన్నప్పటి ఫోటోలు – బరువు తగ్గిన తరవాతి ఫోటోలు వేస్తూంటారు. అవి చూసి ఆహా అనుకుంటాం. బస్సుల్లోనూ, ఇళ్ల గోడల మీద “సులభంగా బరువు తగ్గండి” అన్న కాప్షన్, కింద ఫోన్ నెంబరు ఉన్న పోస్టర్లు కనబడతాయి. మార్నింగ్ వాక్ చేసే పార్కుల వద్ద కొందరు “Lose weight now. Ask me how” అన్న బాడ్జిలు పెట్టుకుని నిలబడి ఉంటారు. ఇవి చూసినప్పుడు ఉత్సాహం తన్నుకొస్తుంది. అలాగే ఏడాదిన్నరలో ఏకంగా 108 కేజీల బరువు తగ్గిన అనంత్ అంబానీని అబ్బురంగా చూశాం. అతన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి అనుకుంటాం.

నేను ఒక డైట్ కోర్స్ చేశాను. ఏడాదిన్నర క్రితం మొట్టమొదటిసారి ఆ కోర్స్ చేసినప్పుడు వాళ్ళ నియమాలని తూచ తప్పకుండా పాటించాను… వారం తర్వాత నాలుగు కిలోలు తగ్గాను. కాని జీవనశైలి/వర్క్ స్టైల్స్/ఎక్కువ గంటల పాటు కూర్చుని పనిచేయడం వల్లా, తక్కువ సేపు నిద్రపోవడం వల్లా, కొన్నిసార్లు జంక్ ఫుడ్ తీసుకోడం వల్లా, శారీరక శ్రమ తగ్గిపోవడం వల్లా తగ్గిన బరువు మళ్ళీ వచ్చేసింది. బోనస్‍గా అదనపు కిలోలను చేర్చింది.

ఈమధ్య మరో పద్ధతి ప్రారంభించాను. ఐదు రోజులు వాళ్ళు చెప్పినట్టు చేశాను. ఆరో రోజు ఆకలికి తట్టుకోలేక నా తిండి నేను తినేసాను. అంతే! Back to square one!

ఆ మధ్య ఒక సినిమాలోని డైలాగ్ “ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు” బాగా పాపులర్ అయింది. ఇప్పుడు నాలాంటి వారికి… అంటే ఊబకాయం/అధిక బరువుతో బాధపడుతున్నవారికి ‘ఎక్కడ తగ్గాలో’ మాత్రమే కాకుండా ‘ఎలా తగ్గాలో’ తెలియడం చాలా ముఖ్యమైంది.

అందుకే ఏ పద్ధతి ఎంచుకున్నా – అంటే డైట్ కంట్రోల్ ద్వారా బరువు తగ్గదలిస్తే క్వాలిఫైడ్ డైటీషియన్‌ని, వ్యాయామాల ద్వారా తగ్గదలిస్తే ఫిజికల్ ట్రైనర్‍ని, ఆసనాల ద్వారా బరువు తగ్గేందుకు ప్రయత్నించదలిస్తే యోగా నిపుణులను సంప్రదించి వారు సూచించిన పద్ధతిని పాటించాలి.

సినిమాలోనూ, ప్రకటనలోనూ వచ్చే స్టంట్స్ కింద – ‘నిపుణుల పర్యవేక్షణలో రూపొందినవి… ఇంటివద్ద ప్రయత్నించవద్దు’ అని వేస్తారు. అలాగే అర్హులైన నిపుణుల సలహాలను పాటించి మన శరీరానికి నప్పే పద్ధతిని ఎంచుకుని ప్రయత్నించాలి.

మనలో చాలామంది పలు కారణాల వల్ల మనం ఎంచుకున్న పద్ధతిని నిర్ణీత కాలం పాటు కొనసాగించలేం. ఫలితంగా బరువులో మార్పు ఉండదు.

ఒక స్థాయి వరకు బరువు తగ్గడం మన చేతుల్లో ఉంటుంది, కానీ ఒక పరిమితి దాటాకా ఇంక తగ్గడం చాలా కష్టమయిపోతుంది. పెరిగినంత వేగంగా బరువు తగ్గలేము. తగ్గడానికి కూడా సమయం పడుతుంది.

ఈ కార్బోహైడ్రేట్ల కొలతలు, కెలరీల లెక్కలు మా వల్ల కాదు అంటారా, వాటిని నిపుణులకి వదిలేసి, వాళ్ళేం తినమంటారో, ఎంత తినమంటారో అంతే తినండి.

“మేం జిమ్‌కి వెళ్ళలేం…” అనే వాళ్ళ కోసమూ ఓ మార్గం ఉంది.

“When people tell me they can’t afford to join a gym, I tell them to go outside; planet Earth is a gym and we’re already members. Run, climb, sweat, and enjoy all of the natural wonder that is available to you” అని అంటారు Dr. Steve Maraboli “Unapologetically You: Reflections on Life and the Human Experience” అనే పుస్తకంలో. నిజం కదా!

ఫిట్నెస్ అనేది ఓ పెద్ద ఇండ్రస్ట్రీ అనీ; ఒబెసిటీ క్లినిక్‍లు, బాడీ షేపింగ్‍లు వగైరా వగైరాలన్నీ కుట్ర అని కొంతమంది వాదిస్తారు… పాతకాలం వాళ్ళు లావుగా ఉన్నా, అన్నీ పనులు చేసుకునేవారు జిమ్ముల చుట్టూ, ఒబేసిటీ క్లినిక్‍ల చుట్టూ తిరగలేదుగా అంటారు. కుట్రో… కాదో… మనకి అనవసరం… మనం ఆరోగ్యంగా ఉండడం మనకి అవసరం.

అందుకే గట్టిగా సంకల్పించుకుని, మనోబలంతో ప్రయత్నించాలి. ఫలితాలు లభించేవరకూ ఓపికగా ఉండాలి. ఇది మనకి మనం చేసుకోవాల్సిన ఫేవర్!

అందుకే నేను వైద్యుడి సలహా తీసుకున్నాను. ఆయన చెప్పిన పద్ధతి పాటిస్తున్నాను. రియలిస్టిక్ టార్గెట్ పెట్టుకున్నాను.

Toni Sorenson అంటారు – “Fitness is never really about what you lose; it’s about all that you gain” అని.

అందుకే తగ్గడమే నెగ్గడం!

Exit mobile version