Site icon Sanchika

తాజమహలు కావ్యము – కళ

[dropcap]ఫి[/dropcap]బ్రవరి నెలలో ప్రతి ఏటా తాజ్ మహోత్సవ్‌ను నిర్వహిస్తారు. ఆగ్రాలోని యమునా నదికి దక్షిణ ఒడ్డున ఈ తెల్లని, అద్భుతమైన పాలరాతి కట్టడం ఉంది. తాజ్‌మహల్ కేవలం సౌందర్యానికి ప్రతీకగానే కాక, అమూల్యమైన ప్రేమ చిహ్నంగా మిగిలిపోయింది.

గొప్ప తెలుగు కవి దిగ్గజం పువ్వాడ శేషగిరిరావు గారు. కవిగా, అధ్యాపకునిగా, బహు గ్రంథకర్తగా ప్రసిద్ధులు. వారు రచించిన తాజమహలు వారిని ‘కవి పాదుషా’ బిరుదుతో అభిషేకించింది. వారు రాసిన తాజమహల్, దారా కావ్యాలను జంటకావ్యాలని పేర్కొంటారు. జాషువాగారి ‘ముంతాజమహల్’ తర్వాత అంతటి ప్రాచుర్యం పొందింది పువ్వాడవారి ‘తాజమహలు’. పువ్వాడ వారు తాజమహలు ఖండ కావ్యాన్ని 1958లో రాసారు.

తాజమహలు కావ్యంలో ఏడు ఖండికలు ఉన్నాయి. అవి అవిచ్ఛిన్న కథా సూత్రంతో అల్లుకున్నాయి.

తాజమహలు కావ్యం కేవలం షాజహాను చక్రవర్తి, ముంతాజుల ప్రణయ గాథ మాత్రమే కాదు. కవి మొగలు సామ్రాజ్య చారిత్రక వాస్తవానికి కావ్య శిల్పమయమైన సందేశాన్ని మేళవించారు. చక్రవర్తి షాజహాను ఎదుర్కొన్న పరిస్థితులకు ధార్మిక దృష్టికోణాన్ని జోడించారు. స్వచ్ఛమైన ప్రేమ పారలౌకికమైన కళా సార్థక్యంతో భాసించిందని తెలిపారు. భౌతికమైన జీవనస్థికి ఆంతర సత్వం కలిగిందని నిరూపించారు.

ఈ కావ్యం లోని ప్రథమ ఖండిక తాజమహలు.

ఈ కావ్యం తాజమహలు శిల్ప సౌందర్య వర్ణనతో ఆరభం అయింది. యమునా నదీ తీరాన వెలసిన తాజమహలు, “షాజహాను ప్రేమను కరగి పోసి – భద్రపరచిన రజతంపు బరణి”, మహికి డిగ్గిన ఆ చంద్రమండలం” అన్నారు కవి.

మాధుర్యాలనన్నింటినీ పిండిన ప్రేమ రస నిష్పత్తి తాజమహలు.

“పూవుం దేనియ మూట, చెరకుం బాకమ్ము లేగాపు, పెం గ్రోవుల్ గట్టిన గోస్తనీ రసము”, ఆ ప్రేమ నంతటినీ ఈ కట్టడములో తాపడం చేసాడు షాజహాను.

ముంతాజు మహనీయమైన సుకృతం చేసుకుంది. ఆ కట్టడం శిల్ప రూప కావ్య కల్పనయా? లేక కావ్య రూప శిల్ప కల్పనయా – భర్త కావ్య కర్త. పత్ని కృతి భర్త, ..తాజి భువిని స్వర్గం చేసింది, ఇంద్రలోకాన్ని కిందకు దించింది ఎంత తారుమారు చేసిందోకదా! ఆ రాజమానసం లోని స్వచ్ఛ ప్రణయం! అంటూ ఆ కట్టడ నేపథ్యానికి గల భాష్ప హృదంతర ప్రణయాన్ని తలచారు. తాజమహల్ వల్ల షాజహాన్ శాశ్వతము, ఆతని భార్య శాశ్వతము. ఆ శిల్ప కళా వైదగ్ధ్యం అమరం. షాజహాన్ మానసం హిమాలయం అని కవి తాదాదాత్మ్యం కలిగించారు.

ఎంతగా కీర్తించినా ఆ ప్రేమైక దాంపత్య మహిమకు తనివి తీరని కవి, లోకంలో భార్యా భర్తలెంతమంది లేరు? ఎంతమందికి భార్యలు ముందుగా పోలేదు? కాని ఏదీ ఏతాదృశ ప్రణయైక ముద్ర? ఏమి ఆ మిథునాత్మ సంథా మహత్త ? అన్నప్పుడు అవును ఆ మధుర కళా తపస్సు మహనీయమే అనిపించక మానదు.

తాజమహలు కావ్యం ‘జాషువా’ గారి “రాణి విడచిపోయె రాజు నొంటరి జేసి-రాజు విడిచిపోయె రాజ్యరమను – రాజ్యరమయు విడిచె రాజుల పెక్కండ్ర – తాజి విడువ లేదు రాజసంబు” అనే చివరి పద్య భావానికి, పువ్వాడ వారి – “మొగలు ప్రభుత య౦తర్హిత మగుట కేమి – చందురుని చల్వతో తాజి చలువ నిలుచు – కాలవాహిని తాజి మ్రింగగలనాడు – నిలుచు నీ తాజిప్రణయ సందేశగీతి” పొడిగింపుగా ఉందన్నారు ఆచార్య ఎస్వీ. జాతీయ సమైక్యతకు ప్రాతినిధ్యమైన పువ్వాడ వారి గోవత్సం, తాజమహల్, దారాలు కరుణ రస పోషణలో ఆయన వైదగ్ధ్యాన్ని ఎలుగెత్తి చాటాయి అని వారు పువ్వాడ వారి ఖండకావ్యాలను పరిశీలించారు. “కరగి శోకమె మూర్తిగ గట్టబోలు – భావ భాష్ప హృదంతర ప్రణయములును ” అన్న తాజి కట్టడ నేపథ్యం హృదయాలను ఆర్ద్రతా మయం కావిస్తుంది.

“సృష్టిలో కాని, విమర్శలోకాని ఏదైనా వైశిష్ట్యం లేకపోతే రచయితకు కలం పట్టవలసిన పని లేదు” అని పువ్వాడ వారి సిద్ధాంతం.

ఈ కావ్యంలో, రెండవ అంశం జ్యోత్స్న.

షాజహాను చక్రవర్తికి దారా పెద్ద కొడుకు, ఔరంగజేబు చిన్న కొడుకు. జహానారా పెద్ద కూతురు, రోషనార చిన్న కూతురు, ఆగ్రా కోటలో రోగగ్రస్థుడైన తండ్రిని కనిపెట్టుకుని ఉంది జహానారా. ఔరంగజేబు ఆగ్రా మీదకు దండెత్తి రానున్నాడు, వెన్నెలవంటి మనసున్న, ఉజ్వల జ్యోత్స్న జహనారా మనసు ఉద్వేలమయింది. ఆమె రానున్న విపత్తులను తలచి చింతించింది.

అది వేసవి కాలం. జహనారా లతా కుంజముల దరి శశి శిలామయ వేదికాసనం మీద ఓరగిలి కూచుంది. ఆమె తాజిని చూస్తూ రానున్న విపత్తులను తలచి వగచింది. కను చూపు దూరంలో తమ్ముడు ఔరంగుడు దూసుకుని రావడం చూసింది.

ఔరంగజేబు తన ఉధృత సేనావాహినితో ఆగ్రా కోటను ఆక్రమించుకునే సన్నివేశాన్ని వర్ణించారు కవి ‘‘ఆహవాగ్ని చలచ్ఛిఖాగ్ర సూచక నట/ద్భ్రమిత కేతన పటాగ్రములతోడ../ఆగ్రహోదగ్రుడౌరంగు డాక్రమించె’’ నంటూ, సుశిక్షిత, పరాక్రమోపేత సైన్యపు ఒడుపును, ఉద్ధతిని, ఝటితి దండయాత్రను వర్ణించే ‘ఆరభటి వృత్తి’ లిఖితమైన ఈ ‘ఘాటైన’ తత్సమ పదాలు ఆర్భటిని ధ్వనించాయి. యుద్ధాగ్ని కీలలా అన్నట్లు అరుణ పతాకాలు ఎగిరాయి. మదించిన ఏనుగులు ప్రళయ సమయ మేఘాల ఉరుములా అన్నట్లు ఘీంకరించాయి. గుఱ్ఱపు గుంపుల గిట్టల ధ్వని ఉధృతమయింది. ఆ అశ్వాలు తమ పద ఘట్టనలకు లేచిన దుమ్ములో కలిసిపోయి కదంతొక్కాయి. సైనికుల కత్తుల మెఱపులు దిగంతాల చీకట్లలోకి దూసుకుకుపోతున్నాయి. రక్తపుటెఱుపు కన్నులతో ఆగ్రహోదగ్రుడైన ఔరంగజేబు ముందుకు దూసుకొస్తున్నాడు. సందర్భానికి తగిన ఉత్ప్రేక్ష, స్వభావోక్తి అలంకారాలు, రౌద్ర, భయానక, వీర రసాలను ఆవిష్కరించాయి. ఆహవం అనే అగ్ని ఎరుపు. సైనిక, రథ పతాకాలు ఎరుపు. ఔరంగజేబు కనుల కోప సూచక రక్తము ఎరుపు. అన్నీ భయానక బీభత్స అరుణారుణావరాణలే. ఆగ్రహ ఉదగ్రుడు ‘ఔ-రంగు’డు (ఎరుపు రంగువాడు) అంటూ శబ్ద ధ్వని చమత్కారాన్ని చూపారు కవి. సీస పాదాల్ని నాలుగింటినీ దీర్ఘ సంస్కృత సమాసాలతో నింపి, ఎత్తుగీతిని మాత్రం ‘తళుకుపచ్చలు’, ‘వెలుగు పులుగు’, ‘జిలుగునెల తొలిగొడుగు’ మొదలైన తెలుగు పదాల సొగసు పోహళింపుతో ‘రమణీయం’ కావించడం ఒక చమత్కారం. జిలుగు నెల తొలి గొడుగు (అర్థచంద్ర బింబం) మహమ్మదీయుల మత చిహ్నం అనేది ఇక్కడ ఒక సూచనా విశేషం.

ఔరంగ జేబు ఆగ్రా కోటను ముట్టడించాడు. కోటను భేదించక యమునా నదినుండి కోటలోనికున్న నీటి గొట్టాన్ని పగుల గొట్టించాడు.

మూడవ అంశ బిందువు’

ఈ ఖండికలో జహనారా తమ్ముని వద్దకు వెళ్ళి. అనునయించి, భావావేశంతో కోపించి, ఆతనికి హితవును బోధించాలని తలచింది.

ఆగ్రా కోట దుర్గం చెక్కు చెదరకుండా ఔరంగు చేతకి చిక్కడం అతడు ఆర్భటించి వచ్చిన ప్రతాపాన కాదు, కాదంటూ, యమునాంభ కణమ్ము కర్వైన రేని, గర్భాన దాచుకొనలేక తనంత తానుగా ఆతనికి చిక్కిందని కరుణాపూరమైన రాజు దీనత్వాన్ని అన్యాపదేశంగా కోటకు ఆరోపించారు కవి.

నాల్గవ ఖండిక జీవ తంత్రి.

ఔరంగజేబు ఆగ్రాకోటను వశపరచుకున్నాడు. తండ్రిని బంధితుని కావించాడు. లలిత కళలందు నిపుణుడైన షాజహాను దివ్య వీణకు ఒక తంత్రి తెగింది. ఇలా తెగడాన్ని కవి తమకున్న సంగీత జ్ఞానముతో కలబోసి తత్త్వమోఘాను గతవాద్య తత్వ విధులు ప్రకృతి గానములో సరి పడవేమో అంటూ ప్రకృతికి వ్యంగ్యాపాదనను చేసారు. షాజహాను కళోపాసనను స్తుతించారు. ఒకనాటి నిశాంత గీతికకు కిలకిలలాడిన యమున కాకలీ కల నాద రోదనమును చేసింది. నేడు షాజహాను గీతిక విషాద గీతిక. తెగిన తన ఫిడేలు తీగకు మరొక కొత్త తీగనిమ్మని నివేదనను పంపాడు షాజహాను.

ప్రకృతి సంగీతము మూగపోయింది. పతి పాటలకు మునుపు పొంగిన ఆ ప్రియురాలు ప్రియతముడు వాయించుచున్న భగ్న గీతికి గుండె కోతకు గురి అయ్యింది. షాజహాను వృద్ధుడు, “అతని జీవన శేషమిప్పుడు అల్పం. జీవతంత్రిని నిలుపుకొనుటకు తంత్రినిమ్మని అర్థించాడు.

విశీర్ణ మైన ఆత్మకు శాంతి సున్న యీ జీవన తంత్రి మేళనము సేయగ జాలిన తంత్రి తెమ్మని వేడాడు. కాని రాజాజ్ఞ ఆ వార్థక్యపు రాజును దేహ మాత్రావశేషునిగ పూర్వ సార్వభౌమ పదవీ ముహుస్స్వప్న భగ్న హృదయునిగ మగిల్చింది.

ఎది సేయని సాంత్వనమది చేయునని వేడుకున్నా ఔరంగుని కాఠిన్యం కరగలేదు. షాజహాను సర్వం కోల్పోయాడు. షాజహాను భగ్న హృదయుడై దేహమాత్రావ శేషముగ మిగిలాడు. చెరసాలకు చిక్కిన రాజుకు జహనారా సేవలను చేసింది.

ఫోటో సౌజన్యం: ఇంటర్‍నెట్

తాజమహలు కవ్యాన్ని ఆసాంతం చదివితే అది కేవలం వస్తు ప్రధానమైన కావ్యం మాత్రమే కాదు, ప్రేమ రస పూర్ణమైనదే కాదు, స్త్రీ ఔన్నత్యాన్ని ప్రతిపాదించి, సర్వ స్త్రీజాతికి మన్ననలను కలిగించే సమైక్యతా కావ్యమని చెప్పక తప్పదు. కవి పేర్కొన్నట్లు భార్య కృతి భర్త, భర్త కృతి కర్తగా తారుమారయిన ఘట్టము సతులకు ఉత్కృష్ట గౌరవాన్ని కలిగించిన సన్నివేశంగా చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచింది. ఈ కావ్య కవి తీర్చి దిద్దిన మరొక మహత్తర పాత్ర జహనారా. తాజమహలు కావ్యంలో జహనారా పాత్ర ప్రాథాన్యము జ్యోత్స్న, బిందువు, ఏది, కళ, ప్రాయోపవేశము ఖండికలలో కథా సూత్రాన్ని గుదిగ్రుచ్చే బంగరు తీగెలా అల్లుకుంది. ఆడు బిడ్డకు ఆనాడు, నిగమ శర్మ అక్క ఆదర్శంగా నిలిచింది. తమ్మునికి బుద్ధిని కలిగించి అతని భార్యకు సంతోషాన్ని, తలి దండ్రులకు ఊరట కలిగించాలని తలచింది. ఆధునిక కావ్యం తాజమహలులో జహనారా ఆనాటి అక్క వలెనే తమ్మునికి మంచి బుద్ధిని కలిగించాలని ప్రయత్నించింది. తండ్రికి తోడుగా నిలిచి ఆతనికి ఆత్మానంద మార్గాన్ని తెలిపింది. ఆతనిని చింతలన్నింటినీ మరచి చిరంతనానాంద మయుడుగా మహా ప్రస్థానమునకు సంసిద్ధుని చేసింది. ఈ కుమారిక పాత్రను ప్రత్యేకించి పరిగణించడం భావ్యమనిపిస్తుంది.

అది వేసవి కాలం. జహనారా లతా కుంజముల దరి శశి శిలామయ వేదికాసనం మీద ఓరగిలి కూచుంది. ఆమె తాజిని “జూచును, కన్ను మోడ్చును మరలతాజిన్ విలోకించును, -ఆ గాజుం బుగ్గల వెచ్చ వెచ్చనగుచున్ కన్నెరు జారన్ ..” ఆమె యోచించింది. ఆలోచిస్తోంది. ఆనాటి తల్లి భద్రాయిత మూర్తి కనులముందు నిలిచింది. రాజ్య సంపద కోసం మునుపటి మమతలను తొలగించుకున్న కుమారులను చక్కదిద్దగ రారాదా అనుకుంది. మృగ పతిని జంప బాణము నెక్కువెట్టి – కడల బొంచిన గజ వేటకత్తె వోలె” కాలం ఎటువంటి ఆపదలను తెస్తుందోనని చింతించింది. “క్రుమ్మీ క్రుమ్మని ప్రాణ గొడ్డముతో ఘోషించుచున్న” వృద్ధుడైన తండ్రికి ఏ విపత్తులు రానున్నవో అని వగచింది. ఉద్విగ్నమైన మనసుతో ఔరంగ జేబు దౌష్ట్యానికి సోదరు లేమవుతారోనని దురపిల్లింది.

“నింగిం జీల్చు జయార్భటి ఘోషలు” చెలరేగుతుండగా “చిరు వెండి గిన్నెలో చిక్కనౌ నులివెచ్చ పాల తరక కట్టి ప్రాకినట్లు, సోదరునికి హితాన్ని తెలుపనెంచింది.

తన తండ్రి

“చూపొకట గోటి నిలుపుకోనతడు,

అడుగు మడుగు లొత్తు సేవలనందు నతడు

రవ్వ నవ్వి వరాలెన్నొరువ్వు నతడు,

వేసి వేయక బ్రతికిన వేలుపతడు..

అని వృద్ధుడు ప్రేమైక మూర్తి అయిన తండ్రికి హాని చేయవద్దని బుద్ధి చెప్పింది. తండ్రి యంతటి వాడైన దారాను పక్షిగా నులిచేసి విసిరావు!! “ముంతాజి పాల్ద్రావి ముం దాజి నుడికింప” తండ్రి రొమ్మున రంపి పెట్టినావు, అంటూ ఆతని దుశ్చర్యలను మరొక సారి జ్ఞప్తి చేసింది. తండ్రి దాహమని అలమటిస్తుంటే యమునాసరిన్మార్గము నాపావు” అంటూ రాజ్య కాంక్షకు ప్రేమ రాజ్యాన్ని బలి చేసి తడి లేని గుండెను దాల్చావు, అని తీక్ష్ణముగా మాట్లాడింది. ఓ ముసల్మాను బిడ్డ అని సంబోధించి, మతధర్మాన్ని గుర్తు చేసింది.

సోదరునికి మంచిమార్గాన్ని మరొక సారి చెప్పి చూడదలచింది. “దైవ భక్తియు, మానవాదరణ సక్తి శాశ్వతైశ్వర్య భోగ పోషకములోయి” అని ధార్మికతను కలిగింపనెంచింది.

తండ్రి చేయి చాచని వాడిపుడు చేయి చాచాడని దీన స్థితిని చూపింది. అంతపురాన్ని ఎప్పుడూ వదలి బయటకురాని తన ప్రాధీనతను చూడమంది. “పానీయంబొక్కడె చాలు సిరుల్ వలదు” తండ్రిని చంపవద్దని పితృ దీనావస్థను కట్టెదుట నిలిపింది. ఆమె ఎంతగా వివరించినా ఔరంగ జేబు తొణకలేదు. ఔరంగుడు తొణ్కేలేని దృష్టిని గీరి విడిచాడు.

ఆమె మాటలకు ఎక్కడి వారక్కడ స్థంభించి నిలిచారు.

గాలి ఆకు కదలక ఆగి పోయింది. దుర్గము అవురగునిచేత చిక్కింది ఆమె కొనగోట దుఖాశ్రువులను విదిల్చుకొనుచు సోదరుని కాఠిన్యానికి విచలిత అయింది.

ఈ కావ్యంలో కుమార్తెగా జహనారాపాత్రకు ఆద్యంతము ప్రాముఖ్యమును కలిగించారు కవి. ఆమె తలి దండ్రుల మీద అపారమైన అనురాగము, సోదర ప్రేమకలిగిన ఆడబిడ్డ. ఆమెకు పుట్టినింటి మీద గల అనుబంధం గొప్పదని నిరూపించారు కవి. బంధితుడైన తండ్రి తనకిక నిష్కృతి ఏదని దుఃఖితుడైనప్పుడు ఆతనికి సేవలు చేసి సేద దీర్చింది. అతడు నిర్మించిన కళా సౌధము కన్న బిడ్డ కంటె స్వకీయమైనదని కళా గుణ ధర్మాన్ని వివరించి సాంత్వనమును కలిగించింది.

ఆమె తండ్రికి తోడి బందిగ, తోడి ఓడ పగిది “నిద్రా విదూర శోణ దృగంబు ధారలను” అర్పించింది. తుదకు కళ పరమార్థాన్ని బోధించి తండ్రికి చిత్త శాంతిని కలిగించింది.

షాజహాను తన గాథనంతా వడపోసుకొని తనకు ఇహపరాలలో ఇక మిగిలిందేదని జీవన నైరాశ్యాన్ని పొందాడు. “ఇక జీవించి లాభమ్మేదీ? అనుకున్నాడు. ఇకనైన చావు రాదొకో ప్రాయోపవేశమ్మునన్ అని భావించాడు. తనయుల నెడబాసిన దుఖాన్ని దిగమ్రింగుకున్నాడు. కొడుకు అన్నదమ్ములకు కావించిన ఎగ్గుకు కడుపు చీల్చుకుని కట్టెగ నిలిచితినని జహనారాకు చెప్పుకున్నాడు. “కను కెంపుల నీరు గ్రుక్కి కట కట” పడ్డాడు.

తండ్రి వగపును చూసి జహనారా “పతి సేతకు కాలమే శిక్ష విధించునని ఓదార్చింది.

ధర్మ రథము అధర్మ హయ దర్పముచే అడుగైన సాగదని అనునయించింది. “బంగరు పూస మూస కరగి కర్మమకర్మ మా కంసాలి కై ఎరుంగు” నన్నది.

“సతిని ప్రేమించి లోతెరింగితివి. రాజ్య సతిని ప్రేమించి శిఖరాగ్ర తతిని గంటివి,సుతుల ప్రేమించి చవులెల్ల చూరగొంటివి, పండముగ్గిన ఆత్మానుభవాన్ని పొందావని జీవనానుభవ రహస్యాన్ని” చెప్పింది.

సకల సోపానములను దాటి ఆతని కళా పరిణతాత్మ సత్య సౌధవాసమును అర్థించు చున్నదని పలికింది. తనయ మాటలు తండ్రికి కొత్తవిగా వినిపించాయి. తన కుమార్తె తన మనసు మూలలను చొచ్చి చూచిందని తన బ్రతుకున వెల్గును వెదికిందని ఊరట చెందాడు.

షాజహానుకు ఆశను తృప్తిని మొలకెత్తించాలని జహనారాస్వయం సిద్ధ జ్ఞానిగా “సృష్టి మూలమగు చిరంతన సత్య రూపముగా తాజినిలిచింది. ఆ కళా మహిమ ముందు యోగ సాధనలు బ్రుంగును కదా!” అన్నది!

కళలనారాధించు మనుజుడు జీవులన్నిట ప్రత్యేకతను సాధించాడని మనిషి ఔన్నత్యాన్ని తెలిపింది.

మాతాలన్నింటి లో కళకున్న మన్ననలను తెలుపుతూ, “స్థిరతగొనియె సూఫీ తత్త్వ గరిమ కళనె, -ఆలపించె హైందవ తత్వ మార్ష కళనె, -ప్రతి పురావాక్కు స్థిరత బడసె కళనె, -మహదుపజ్ఞలు కళ బట్టి మహిమ గొనియె నని మతము లన్నింటిని ఏకము గావించిన కళా ప్రాభవాన్న్ని తెలిపింది. కళా మహిమను అనేక రీతుల స్తుతించింది. సత్కళ వెలుగు పలుకును పలుకు తుందని ప్రేమ నెరుగని కళ, కళల రాజున కొక కళంకమని చెప్పింది.

సృష్టికి ప్రతిసృష్టిని కావింపగలిగిన దివ్య కళా మహిమను జీవనానుభవ తత్వముతో జోడించి కవి జహనారా నోట పలికించారు. కళల సార్థక్యమును తెలిపారు. జహనారా సాంత్వన వాక్యములను విని, రాజుకు తొలిహాసము బోసిగ వచ్చింది.

మత్కళా రూప గుణ ధర్మ మహిమ మెరుక

పరచితివి విమర్శికవు దర్పణము పట్టి ,

నిన్ను గంటిని, తాజి గంటిని కుమారి

ఇరువురును నాదు ప్రతిబింబ మేను గంటి

-ననుచు కొమరిత సద్విమర్శకు జన్మ ధన్యతను పొందాడు.

షాజహాను మహాప్రస్థానము నకు సంసిద్ధుడయ్యాడు.

కుమారిత మాటలకు రాజు జన్మ చరితార్థమయ్యెనని భావించాడు. కుమారుని దోషాలను క్షమించాడు. ఆత్మ తేటపడింది. “ఈ కళేబరమ్మున కిరవమ్మహల్ సకియ పొంతనె పూడ్చుమ – అదియె ఆత్మ తృప్తి జననికి నాకు” అని పలికాడు. తనను తాజి వైపుకి త్రిప్ప మని అడిగాడు. కుమారిక సాయముతో అటు తిరిగి తాజిని చూచి, అపారమగు ప్రేమతో ధన్యవైతి,నన్ను ధన్యు జేయ రావె రమ్య రోచి! రావె నాముముతాజి! పిలువగానె మారుపలికితటవె. అని తాజి సముఖమునకు చేరదలచాడు.

“వెలుగు వెలుగు గలసి వెన్నెలందు

తాజి ముందు కొలకు తరగల నురుసుల

విహరణముల సలుపు విహసితములు”.

కొలకు తరగలలో దరహసించిన తాజమహలు దివ్యమైన ప్రేమాలయం. వ్యాకులుడైన షాజ హాను ప్రేమైక రస సిద్దిని కనుగొన్నాడు. కళద్వారా ప్రేమకు ధన్యత కలిగిందని తెలుసుకున్నాడు. కళ వలన అతీంద్రియమైన వెలుగును అందుకున్నాడు.

కవి గారు తాజమహలు ప్రేమ కావ్యాన్ని గంభీరమైన తత్సమ పదాల ఆర్భటితో ఢంకా పథముగ వినిపించారు. పాదుషా బిరుదానికి తగినట్లు గానే ప్రతి పదాన్ని కవి ఆజ్ఞకు చిత్తగించినట్లుగా ఆదేశించి కావ్య పరి పాలనమును కావించారు.

Exit mobile version