Site icon Sanchika

తలంపు

[dropcap]శ్రీ[/dropcap]కృష్ణుడి సహాయంతో ఉగ్రసేనుడు రాజ్యం చేయటం మొదలెట్టి నాలుగేళ్ళు గడిచాయి. రాజ్యం శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లుతోంది. ప్రజలందరూ కృష్ణుడి రాజ్యంలో సంపూర్ణానందంతో ఉన్నారు. కృష్ణుడు ఏర్పరిచిన ధర్మ గంటకి ఎప్పుడో గాని పని తగలటల్లేదు.

కొన్నిరోజుల తరవాత, ఒకనాడు ధర్మ గంట మోగింది. భటులు వెంటనే వెళ్ళి ఆ గంటని కొట్టిన మనిషిని తీసుకు వెళ్ళి సాయం వ్యాహ్యాళి మందిరంలో విశ్రాంతి తీసుకుంటున్న ప్రభువు దగ్గర నిలబెట్టారు.

ఉచితాసనం ఇచ్చి కూర్చోపెట్టారు భటులు. “ఏమి జరిగింది” అన్నాడు కృష్ణ ప్రభువు పక్కనే ఉన్న ఉద్ధవుడు. అక్కడ కూర్చున్న మనిషి చామనచాయతో దృఢమైన శరీరంతో చేతిలో కర్రతో, భుజం మీద గొంగడి కప్పుకుని ఉన్నాడు.

చెప్పనా, వద్దా అనే డోలాయమాన స్థితిలో ఉన్నట్టు గ్రహించి “నీకు ప్రభువులు అభయం ఇస్తున్నారు, నిర్భయంగా చెప్పు” అన్నాడు ఉద్ధవుడు.

ఆ మనిషి మెల్లిగా లేచి “ప్రభువుకి నమస్కారం, నాపేరు దుగ్గన్న, నేను కోటలో ఉన్న చెరసాలలో మరణ శిక్షలు అమలు పరిచే కటికవాణ్ణి” అని ఆగాడు అతడు. కాసేపు మాట్లాడక పోయేసరికి ఉద్ధవుడు “నిర్భయంగా చెప్పు, నీ కష్టం ఏమిటి” అన్నాడు.

మెల్లిగా చెప్పక తప్పదు అనుకుని మొదలెట్టాడు దుగ్గన్న.

“అయ్యా,నాకు ఈ పని మా నాన్న నేర్పాడు. ఆయన తరవాత నన్ను చెరసాలలో ఈ పనికి నియమించారు. గత పదిహేను ఏళ్ళుగా ఈ పని చేస్తున్నాను. ఈ పనిలో జనాల ప్రాణాలు తీయటం చాలా కష్టంగా వుంది. చూస్తూ, చూస్తూ మనిషిని చంపటం చాలా ఘోరం అనిపిస్తోంది. రాత్రుళ్ళు నిద్దర పట్టట్లేదు, ఏంచెయ్యాలో సెలవిస్తే” అని నసిగాడు.

“ధర్మాధికారులు నేరం చెయ్యని వాళ్ళకి ఏమన్నా శిక్ష వేసారా” అన్నాడు కృష్ణుడు

“లేదు ప్రభూ”

“ధర్మాధికారులు ధర్మ శాస్త్రాలనీ, సూత్రాలనీ సరిగ్గా గ్రహించి ఆ విధంగా శిక్షలు వేస్తున్నారా”

“అవును ప్రభూ”

“మరి–“

“ఈ చంపటం అనే కార్యమే ఘోరం అనిపిస్తోంది ప్రభూ”

“మరి ఆ నేరస్థులు చేసిన ఘోరాలో?”

“ఒక ఘోరంతో ఇంకో ఘోరాన్ని ఎట్లా సమర్ధిస్తాము ప్రభూ?

“ఇది ధర్మాధికారులతో ఎప్పుడన్నా మాట్లాడావా?”

“మాట్లాడాను ప్రభూ, వారందరూ, సమాజ శ్రేయస్సు దృష్ట్యా సామాన్యుణ్ణి తప్పులు చేయకుండా అదుపులో ఉంచటానికీ, అతి దుర్మార్గులూ, మారే అవకాశం లేని వాళ్ళని శిక్షించడానికి మరణ శిక్ష తప్పనిసరి అని అన్నారు. అయినా, నా మనస్సు ఈ హింసకి ఒప్పుకోవట్లేదు.”

కృష్ణుడు ఒక్క నిమిషం ఆగి ఆలోచించి మళ్ళీ మొదలెట్టాడు.

“హింస అనేది సృష్టి అంతా నిండి ఉంది, సైన్యాల ద్వారా భూమండలం మొత్తంలో జరిగే మానవ మారణ హోమాలకి లెక్కా జమా ఉందా? మానవుడు తన స్వార్థం కోసం, తిండి కోసం ప్రపంచంలో చంపే జీవరాశులకి లెక్కే లేదు. నువ్వు దేహానికి జరిగే హింసే చూస్తున్నావు, కానీ ప్రతి క్షణమూ ప్రతి వాడూ తన స్వార్థం కోసం తన చుట్టూ ఉన్న వాళ్ళని పెట్టే మానసిక హింసకి అంతు ఉందా? రాజ్యాల కోసం, ధనాల కోసం, కోరికల కోసం, తన మాటే నెగ్గాలనే పంతాల కోసం, అందరినీ హింసించే మనిషుల ముందు నువ్వు చేసే హింస ఏ పాటిది”

“ఎంత ఆలోచించినా నా మనస్సు ఒప్పట్లేదు. ఈ హింసకి ప్రతిఫలంగా నాకూ, నా కుటుంబానికీ ఏ కష్టం వస్తుందో అని నా భయం.”

“నీ భయాన్ని పోగొట్టే ఉపాయం నా దగ్గర ఉంది” అని నవ్వాడు కృష్ణుడు.

పుచ్చపువ్వులాంటి వెన్నెల్లో, చక్కని హిమవత్ హ్రదం దగ్గిర వీస్తున్న చల్లని గాలి తగిలినట్టూ, విష్ణు పాదాల నుండి పుట్టిన గంగ వియత్తలం నుండి కిందకి వచ్చి కొండలమీద నుండి జారి కిందపడేడప్పుడు ఆ ప్రవాహం కింద కూర్చున్నట్టూ అనిపించింది దుగ్గన్నకి.

“నువ్వు చేసే పని ఫలితం వల్ల, నీకూ నీ కుటుంబానికీ ఏమాత్రమూ అపాయం తగలకుండా ఉండే ఉపాయం చెప్పనా” అన్నాడు కృష్ణుడు

“నా పని వల్ల ధనం సరిగ్గానే వస్తోంది. ఈ భయమే నన్ను వెంటాడుతోంది.”

“అయితే విను. నువ్వు చేస్తున్న పని ఎవరు చెపితే చేస్తున్నావు”

“కారాగాధికారి చెబితే”

“ఆయన ఎవరు చెబితే చేస్తున్నాడు?”

“ధర్మాధికారి చెబితే”

“మరి ఆయన”

“రాజు చెబితే చేస్తున్నాడు”

“అంటే మొత్తం బాధ్యత నాది అన్నమాట. ఇందరిలో ఎవరు సరిగా చేసినా, చేయకపోయినా బాధ్యత నాదే. దాని వల్ల వచ్చే కష్ట సుఖాలూ, పాపపుణ్యాలూ అన్నీ నావే. అర్థం అయ్యిందా? “

“అయ్యింది”

“మరి అన్నీ నావే అయినప్పుడు నీకు ఎందుకు భయం. నిజానికి ప్రతి పనీ నా కార్యమే, నువ్వు చేసే పనీ ఒక నా కార్యం అనుకో. దాన్ని నీకు ఎంత ఉత్తమంగా చేయటం వచ్చో అంత ఉత్తమంగా చెయ్యి. దాని ఫలితాలూ, దాని లాభనష్టాలూ అన్నీ నాకు వొదిలెయ్యి. నేను అన్నీ చూసుకుంటాను, నీ భయంతో సహా.”

“అంటే నేను ఏ పనైనా ఇది నీ పని అని నమ్మి చేస్తే దాని ఫలితం నాకేమీ రాదా.”

“పని నాదయితే ఫలమూ నేను ఇచ్చేదే, అది లౌకికంగా పెద్దదయినా, చిన్నదయినా, సుఖాన్నిచ్చేదయినా, కష్టాన్నిచ్చేదయినా నేను ఇచ్చింది మనస్ఫూర్తిగా తీసుకుంటే అప్పుడు మొత్తం పనీ, ఫలితమూ నావే, నీవి కావు.”

“సరే, ఇకనించి నా పనీ, ఫలితం మొత్తం మీదే, మీరు ఏది ఇస్తే అది మనస్ఫూర్తిగా స్వీకరిస్తాను.”

“అలాగే, మరి పని మీద శ్రద్ధ –“

“సంపూర్ణంగా, వేరే ఏ ఆలోచనా లేకుండా పూర్తి ఏకాగ్రతతో చేస్తాను”

“అప్పుడు అన్నీ నావే, నీతో సహా”.

“నా భయం తొలగించారు, వస్తాను ప్రభూ”

దుగ్గన దండం పెట్టి బయటికి వస్తుంటే ఉద్ధవుడు కూడా వచ్చి “భయం వస్తే నారాయణ, నారాయణ అనుకో, మంచి జరుగుతుంది” అని చెప్పి వెళ్ళాడు.

***

కొన్నేళ్ళు గడిచాయి. దుగ్గన్న తనపని అంతా కృష్ణార్పణంగా శ్రద్ధతో, భక్తితో చేస్తున్నాడు. నారాయణ నామం అయితే తన శ్వాసలో కలిసి పోయింది. భార్యా పుత్రులతో సహా అన్నిటి మీదా దృష్టి తగ్గి పనీ, నారాయణ నామమూ తన జీవితం అయిపోయాయి. నారాయణ నామం మీదా, కృష్ణ రూపం మీదా దృష్టి మిగిలి మిగతావన్నీ అసంగతాలు అయిపోయాయి.

***

దుగ్గన్న పెద్దవాడు అయ్యాడు. కళ్ళు సరిగా కనిపించటల్లేదు అని గమనించి అధికారుల దగ్గరికి వెళ్ళి చెబితే వచ్చే అమావాశ్య నించీ పనిలోకి రావద్దని చెప్పారు.

అమావాశ్య వచ్చింది, చెరసాలకి వెళ్ళి అన్నీ వప్పచెప్పి జీతం తీసుకుని బయలుదేరాడు దుగ్గన. చెరసాలనుండి బయటికి వచ్చి నడుస్తూ ఉంటే అతని పక్కన వచ్చి ఆగింది ఒక దివ్య రథం. రథం లోంచి దిగాడు ఉద్ధవుడు. దిగ్భ్రాంతుడై చూస్తూ ఉన్న దుగ్గన్న దగ్గరకు వచ్చి “కృష్ణుడు పిలుస్తున్నాడు రా” అని అన్నాడు. ఏదో మాయలో ఉన్నట్టు రథం ఎక్కాడు దుగ్గన్న. రథంలో కృష్ణుడు కూచుని ఉన్నవాడు లేచి మందహాసం చేస్తూ వచ్చి దుగ్గన్నని కౌగలించుకున్నాడు.

తనకోసం కృష్ణుడు రావటం, కావలించుకోవటం ఒక కల లాగా ఉంది దుగ్గన్నకి.

“బావున్నావా” అన్నాడు కృష్ణుడు.

తల ఊపాడు దుగ్గన్న.

“నీ శ్రద్ధా, దీక్షా నచ్చాయి. నువ్వు చేస్తున్న పనిని, దాని ఫలితాలనీ సర్వ విధాలా నాకు సమర్పించావు. శుభం” అన్నాడు కృష్ణుడు.

ఇంతలో రథం వెళ్ళి ఒక పెద్ద భవనం ముందు ఆగింది. ఉద్ధవుడు దుగ్గనని రథం దింపి ఇంట్లోకి తీసుకెళ్ళాడు. అక్కడ దుగ్గన్న భార్యా పిల్లలు కొత్త బట్టలూ, ఆభరణాలూ ధరించి ఉన్నారు.

“ఇదే నీ ఇల్లు, హాయిగా ఉండు” అన్నాడు ఉద్ధవుడు. తల ఊపాడు దుగ్గన్న. “నారాయణుణ్ణి మటుకు మరిచిపోకు” అని వెళ్ళి రధమెక్కాడు ఉద్ధవుడు.

రెండో రోజు కృష్ణుడిని చూడాలని భవనం బయట నుంచుని విన్నపం పంపించిన దుగ్గన్నని లోపలికి పిలిచారు భటులు. కృష్ణ ఉద్ధవుల ఎదుట నిలబడిన దుగ్గన్న కంట్లోంచి నీళ్ళు కారుతున్నయ్యి.

ఉద్ధవుడు దగ్గరికెళ్ళి కూర్చోబెట్టి కాసిన్ని నీళ్ళు తాగించిన తరవాత కూడా దుగ్గన్న సద్దుకోలేదు. చాలా సేపు తరవాత సద్దుకున్న దుగ్గన్న “స్వామీ, నాకున్నవన్నీ మీకు సమర్పించాను. ఎప్పుడూ మీ పేరే తలుచుకుంటూ ఉన్నాను. మీరు నాకు ఆ భవనం అనే బంగారు చెరసాల ఇచ్చారు. వార్ధక్యంలోనన్నా శాంతి లేకుండా చేశారు” అన్నాడు.

ఉద్ధవుడు దీర్ఘంగా ప్రశ్నించిన మీద “అయ్యా, మీరు సదుద్దేశంతో ఇచ్చిన ధనకనకాలు మా పిల్లల మధ్య పోట్లాటలకి దారితీసి ఇల్లు రణరంగంగా మారింది. నిజానికి నాకు ఈ సంసారమ్మీద ఏమాత్రమూ ఇష్టం లేదు” అన్న దుగ్గన్న మాటలు విన్నాడు కృష్ణుడు.

“దుగ్గన్నా, నీ మనస్సు ఎక్కడ ఉన్నదో స్పష్టంగా తెలిసింది. ఇప్పుడే నిన్ను గర్గ మహర్షి ఆశ్రమానికి పంపుతాను” అని ఆ ఏర్పాట్లు చెయ్యటానికి ఉద్ధవుడిని పురమాయించాడు.

కాసేపాగి దుగ్గన్నని రథం ఎక్కిస్తూ “నారాయణ నామాన్ని మరవకు” అన్న ఉద్ధవుడికి మొక్కి” అయ్యా, అదే నన్ను చెయ్యి పట్టుకుని పనిచేయిస్తోందనీ, మనస్సులో దూరి సత్పథం లో నన్ను తీసుకెళుతోందనీ, అర్థమైంది. దాన్ని మరవటం అంటే నన్ను నేను మరవటం అన్నమాట అని కూడా అర్థమైంది. అది ఈ దేహం గాలి పీలుస్తున్నంత కాలం జరగదు” అని రథమెక్కాడు దుగ్గన్న.

“నారాయణ, నారాయణ” అని నిశ్శ్వసించాడు ఉద్ధవుడు.

Exit mobile version