తల్లి – తండ్రి – గురువు – దైవం

0
2

[డా. బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ‘తల్లి – తండ్రి – గురువు – దైవం’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]మ[/dropcap]నం ఈ భూమి పైకి రాకముందే అమ్మతో అనుబంధం ఏర్పడుతుంది. మనం మొదట రుచి చూసేది అమ్మ పాలనే. ప్రాణం పోసి తన రక్తమాంసాలను కలిపి జన్మనిచ్చినందుకే అమ్మకి ‘మాతృదేవో భవ’ అని పెద్దలు దైవత్వం కలిగించారు. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. మనకు ఈ జీవితాన్ని ప్రసాదించింది అమ్మే అని తుదిశ్వాస వరకు మరువరాదు.

నాస్తి మాతృ సమా ఛాయాః నాస్తి మాతృ సమాగతిః

నాస్తి మాతృ సమంత్రాణం నాస్తి మాతృ సమప్రియా

తల్లిలా చల్లని నీడనిచ్చే మరో తరువేది ఈ లోకంలో లేదు అని శాస్త్రాలు చెపుతున్నాయి. ఈ లోకంలో చెడు సంతతి ఉంటుందేమో కాని చెడు తల్లి ఉండదని ఆర్యోక్తి. ధర్మరాజు యక్షప్రశ్నలలో భూమికంటే తల్లి గొప్పది అంటాడు.

‘సహస్రంతు పితృన్ మాతా గౌరవే ణాతి రిచ్యతే!’

అందుకే పూజార్హత మొదట తల్లికి కల్పించారు. బ్రహ్మజ్ఞాని అయినా, దేశానికి రాజు అయినా తల్లి పాదాలకు నమస్కరించవలసిందే. తల్లి పాదాల చెంత స్వర్గం ఉందని పెద్దలు చెపుతారు.

రాజపత్నీ గురోః పత్నీభాతృపత్నీ తథైవ చ

పత్నీమాతా స్వమాతా చ పంచైతా మాతరః స్మృతాః

ఈ లోకంలో ఐదుగురు తల్లులు మనకు ఉన్నట్లు పెద్దలు చెపుతారు. మహరాజు గారి ధర్మపత్ని, గురువు గారి పత్ని, అన్న భార్య వదిన, భార్య తల్లి అంటే అత్తగారు తల్లితో సమానమే! అసలు ప్రేమ అనే పదానికి నిర్వచనం అమ్మే!

అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ. అనుభూతికి ఆశ్రితకు ఆనవాలు అమ్మ.

అందుకే మనం తల్లి, తండ్రి పట్ల గౌరవభావంతో మెలగాలి. అసలు ఈ లోకంలో కల్మషం, స్వార్థం లేనిది ఏదైనా ఉందంటే అది ‘అమ్మ ప్రేమే’. ఈ లోకంలో దేనినైనా వెలకట్టగలమేమో కాని జన్మదాతల ప్రేమకు వెలకట్టే షరాబు పుట్టలేదు. తల్లిని, తల్లి భాషను ప్రేమించలేనివారు ఎదటివారిని ప్రేమించలేరు. అసలు ఈ లోకంలో సామ్యం లేనిది అమ్మ, కన్నవారి ప్రేమ.

తండ్రిని దైవంగా మన సంప్రదాయం చెపుతుంది. తండ్రి ఇచ్చిన వరం నెరవేర్చడానికి రాముడు అరణ్యలకు వెళ్ళాడు. తండ్రి ఆజ్ఞతో తల్లినే సంహరించి తిరిగి తండ్రి అనుగ్రహంతో తల్లిని బ్రతికించుకున్నాడు పరశురాముడు. తండ్రి ఆనందం కొరకు ఆజన్మ బ్రహ్మచారిగా మారాడు భీష్ముడు. తండ్రికి తన యవ్వనాన్ని ధారపోసాడు పురూరవుడు. ఎందరో మహనీయులు తమ సాహిత్యంలో తండ్రి పాత్రకు సముచిత స్ధానం కలిగించారు. తండ్రి ద్వారానే ఈ దేహం. ఇహపరాలు సాధించే హితాన్ని విద్యాబుధ్ధులు నేర్వడానికి ఆర్థిక సామాజిక ఆలంబన ఇస్తాడు కనుక ‘పితృదేవోభవ’ అన్నారు.

‘ఉపాధ్యాయాన్ దశాచార్య, ఆచార్యాణాం శతంపితః’

నూరుగురు ఉపాధ్యాయుల కంటే, ఒక ఆచార్యుడు, నూర్గురు ఆచార్యులకంటే తండ్రి అత్యధిక గౌరవము ఉన్నవాడని వేదాలు చెపుతున్నాయి.

‘భూమేర్‌ ‌గరీయసీ మాతా/స్వర్గం దుచ్చతరం పితాః’

భూమి కంటే తల్లి గొప్పదని చెపుతూనే స్వర్గం కన్నా తండ్రి గొప్పవాడని శృతి చెపుతుంది.

‘ముచ్యతే బంధనాత్పుష్పం ఫలం వృంతాత్‌ ప్రముచ్యతే

క్లిశ్యన్నపి సుత: స్నేహం పితా స్యేహం న ముంచతి

పువ్వు తొడిమ నుండి విడిపోతుంది. పండు చెట్టునుండి తెగి కింద పడిపోతుంది. కాని ఎన్నికష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు ఎదురైనా తండ్రి తన సంతతిపై నిరాదరణ చూపడు. అందుకే మన సంప్రదాయంలో తండ్రి దైవం అయ్యాడు మనకు.

జనితా చోపనీతాచ పంచైతే పితరః స్మృతాః

అన్నదాతా భయత్రాతా విద్యాదాత తథైవచ

జన్మనిచ్చిన తండ్రి కాకుండా, ఉపనయం చేసిన వ్యక్తి, విద్యా బుధ్ధులు నేర్పిన గురువు, అన్నం పెట్టిన వారు, భయాన్ని పోగొట్టిన వ్యక్తి తండ్రితో సమానమని శాస్త్రం చెపుతుంది. ముమ్మాటికి కని పెంచే దైవం తండ్రే!.

తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు పెద్దలు.

గురుఃబ్రహ్మ గురుర్ విష్ణుః గురుదేవో మహేశ్వరః యిలా గురువుకి ఉన్నతస్ధానం కలదు.

సప్త గురువులు

  1. సూచకగురువు-చదువు చెప్పేవాడు.
  2. వాచకగురువు-కులఆశ్రమ ధర్మాలను బోధించేవాడు.
  3. బోధకగురువు-మహమంత్రాలను ఉపదేశించేవాడు.
  4. నిషిధ్ధగురువు-వశీకరణ, మారణ ప్రయోగాలు నేర్పించేవాడు.
  5. విహిత గురువు-విషయభోగాలపై విరక్తి కలిగించేవాడు.
  6. కారణగురువు-జీవ బ్రహ్మైక్యాన్ని భోధించేవాడు.
  7. పరమగురువు- పరమాత్మ అప్రత్యక్షానుభవాన్ని కలిగించేవాడు.

వీరు కాకుండా, అన్నం పెట్టి వసతి కలిగించి విద్య నేర్పినవారిని గురువు అంటారు. తన వద్దకు వచ్చినవారికి విధ్య నేర్పిన వారిని ఉపాధ్యాయుడు అంటారు. తన శిష్యులకు ఉపనయం చేసి అన్న వస్త్ర వసతి ఏర్పరిచి వేదాలను, ఉపనిషత్తులను అధ్యాయనం చేయించేవారిని ఆచార్యుడు అంటారు.

ఇహ దైవం గురించి వివరించవలసినది ఏముంది? మనకు నచ్చిన రీతిలో, కోలుచుకునే విధానం మన అందరికి తెలిసిందే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here