ఒకప్పుడు
ఆమె కోసం నేను
నాకోసం ఆమె
ఎదురు చూసే
నిత్య లేలేత మొక్కను నేను
ఎండ తగలకపోతే ఎలా అని
ఎండలో పెట్టేది
ఎండిపోయి వాడిపోతున్నానని
నీడలోకి మార్చేది
చలేస్తుందేమో
గాలికి తట్టుకోగలనో లేదో అని
ఇంటి లోనికి తెచ్చేది
నిలదొక్కుకున్నానా
పోషకాహారాలు సరిపోతున్నాయా
పచ్చగా బలంగా పెరుగుతున్నానా లేదా
స్నేహంగా దగ్గరైనవి చీడపురుగులు కాదుకదా
ఎన్నెన్ని జాగ్రత్తలో
తల్లి తోటనుండి ఏతోటకు మారినా
అన్నన్ని పర్యవేక్షణల
ఫలితంగానే కదా
ఇప్పుడిలా
తనదికాని సంతానాన్ని సైతం
తనదిగా చూసుకునే తల్లులందరికీ
ఈ భూమిమీద జీవరాసులన్నీ
ఎంత రుణపడి ఉండాలో
– ముకుంద రామారావు