Site icon Sanchika

తల్లివి నీవే తండ్రివి నీవే!-1

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

Prologue (వటపత్ర శాయి)

[dropcap]మా[/dropcap]ర్గళి త్తిఙ్గళ్ మది నిఱైన్ద నన్నాళాల్

నీరాడ ప్పోదువీర్, పోదుమినో నేరిழைయీర్

శీర్ మల్గుమ్ ఆయ్ ప్పాడి శెల్వచ్చిరు మీర్ కాళ్

కూర్వేల్ కొழுన్దొళిలన్ నన్దగోపన్ కుమరన్

ఏరార్ న్ద కణ్ణి యశోదై యిళంశింగమ్

కార్మేనిచ్చఙ్గణ్ కదిర్మదియం బోల్ ముగత్తాన్

నారాయణనే నమక్కే పఱైతరువాన్

పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్

Maargazhi thingal madhi niraindha nannaalaal

Neeraadap podhuveer podhumino naerizhaiyeer

Seer malgum aayppaadich chelvach chirumeergaal

Koorvael kodundhozhilan nandhagopan kumaran…

Aeraarndha kanni yasodhai ilam singam

Kaar maeni sengan kadhir madhiyam pol mugathaan

Naarayananae namakkae parai tharuvaan

Paaror pugazhap padindhaelor empaavaay (1)

ముప్పై పాశురాలలోనూ కొన్ని కొన్ని సూచనలను వదులుతూ వెళుతుంది అమ్మ. మిగతా పాశురమంతా ఒక ఎత్తు. ఆ సూచన ఒక ఎత్తు. అర్థాలను, అంతరార్థాలను, గూడార్థాలను, నిగూడార్థాలను, విశేషార్థాలను దాటుకుని చూడాల్సిన సూచనలవి. పైకి చదివేస్తేనో, వ్యాఖ్యానాలను నేర్చుకుంటేనో, విశేషించి ఉపాసనలా చేసినా, ఆ విశేష సూచనలను అందుకోలేము. వాటి అసలు రహస్యాలను అందుకోలేము. ప్రత్యేకించి అలాంటి సూచన ఈ పాశురంలో కేవలం రెండే పదాల రూపంలో ఉంది. ఆ రెండు పదాలు ఏవి?

అழగియ మణవాళన్ ఆ రోజు పాఠాన్ని ముగించబోతూ, దీర్ఘ ధ్యానంలోకి వెళ్ళారు. అలా వెళ్ళారంటే ఏదో విశేషం జరుగబోతోందని శిష్యుల నమ్మకం. అటువంటి సందర్భాలలో ప్రతిసారీ ఆయన కొన్ని దివ్యానుభూతులను పొందటం, తద్వారా వారిలో మరింత ఉత్సాహం కలుగటం, ఆ పైన అది తమ పైన కృపగా వర్షించటం శిష్యులకు అనుభవమే.

నారాయణనే నమక్కే పఱైతరువాన్!

ఆయన ఇస్తాడు. మనకే. మనకే. మనకే. కానీ?

ఇది కాదు. తనకు ఆ పదాలు తెలుసు. కానీ వాటిని ఎంత ధ్యానించినా తనవల్ల కావటం లేదు. ఎక్కడ సమస్య వస్తోంది? తన శ్రద్ధాభక్తులలోనా? గురుభక్తి లోనా? తనకు ఉండవలసినంత ఆసక్తి లేకపోవటం వల్లనా? లేదా అహంకరించి గురువులను కాదని పరంపరగా వస్తున్న భాష్యాలను మించి ఆలోచింపబూనటం వల్లనా? ఎందుకు తనకు ఆ సూచనకు సంబంధించిన రహస్యం బోధపడటం లేదు ఎన్నినాళ్ళు ధ్యానించినా?

ఇక శరణాగతే తన గతి అనిపించింది. గత పదునైదు దినముల నుంచీ తనను తొలుస్తున్న ఈ ఆలోచన వేగిరం తెగితే బాగుండును. ఉన్నట్లుండి ఆలోచనలు అమ్మ తనియన్ మీదకు మళ్ళింది.

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం

పారార్థ్యం స్వం శ్రుతిశత శిర స్సిద్ధ మధ్యాపయంతీ।

స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుఙ్క్తే

గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః॥

మరొక్కమారు చదివారు ఆ శ్లోకాన్ని. పరాశర భట్టర్ ఆనతిచ్చినది.

నీళాతుంగ స్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం

పారార్థ్యం స్వం శ్రుతి శత శిర స్సిద్ధ మధ్యాపయంతీ।

స్వోచ్ఛిష్టాయాం స్రజి నిగళితం యా బలాత్కృత్య భుఙ్క్తే

గోదా తస్యై నమ ఇద మిదం భూయ ఏవాస్తు భూయః॥

చివరి పాదం తన శ్రవణేంద్రియాలలో తెలియకుండానే మారుమ్రోగుతుండగా, ఆయన మనోఫలకంపై యా బలాత్కృత్య భుఙ్క్తే అను అక్షరములు అగుపించినవి. మరికొంత సేపటికి ఆయన దీర్ఘ సమాధిలో అవ్యాజానందంలో తేలియాడుతుండగా..

అప్పటికి నాలుగు వేల ఐదు వందల సంవత్సరాలకు పూర్వం..

గాంగేయుడికి లీలగా ఒక మధురమైన గానం వినవస్తున్నది. అప్పటికి అతను తన తండ్రిని యువకునిగా కలిసి రాజ్యానికి తిరిగి వచ్చి మూడు వత్సరములు కావస్తున్నది. తొలుత ఆ గానం తన తల్లిది ఏమో అని చెవులు రిక్కించి విన్నాడు. కాదు. కోటలోనా? అనుకుని అంతటా వెదకించాడు. లేదు. తన మదిలోనే తెలియని రాగమా అని ఆలోచించాడు. వినూత్నమైన గానం. ఒక్కొక్కసారి అది ఒకరే పాడినట్లు అనిపిస్తుంది. మరికొన్ని సార్లు అది కొందరు స్త్రీలు పాడుతున్న పాటలా అనిపిస్తుంది. భాష కూడా చిత్రమే. ఒక్క పదబంధమూ పూర్తిగా అర్థం కాదు. కానీ భావం మాత్రం ఏదో స్ఫురణకు తెస్తోంది.

మొత్తం పాట ఎలా ఉన్నా, నారాయణనే నమక్కే పఱై తరువాన్.. అన్న పద సమూహం తన మదిని వీడి పోవటం లేదు. తండ్రి శంతన మహారాజు హఠాత్తుగా ఒక సందర్భంలో అడిగాడు కూడా.

పఱై తరువాన్ అంటే ఏంటి అని. మరి నమక్కే అంటే? నమః తెలుసు. నేను లేను. (తే) అంతా నీవే. ఆ నారాయణుడే. మరి ఈ పదం?

సరి సరి! తాను కూడా ఈ పదాలను పైకే పాడుతున్నాడా? లేకపోతే శంతన మహారాజుకు ఎలా వినవస్తుంది? లేదా ఈ గానం అందరికీ వినవస్తున్నదా? తెలుసుకోవాలని తన నేస్తులను అడిగాడు. ఎవ్వరూ ఆ పదాలను ఎన్నడూ వినలేదని చెప్పారు. తమకే పాటా వినరావటం లేదని, రాజ కుమారుడికే ప్రత్యేకంగా ఎవరైనా వినిపించే ప్రయత్నం చేస్తున్నారేమో అని పరాచికాలాడారు. మరికొంత చనువున్న మిత్రుడైతే గంగా తీరాన తిరుగాడుతున్నప్పుడు ఏ యక్షిణియో, గంధర్వకాంతయో శ్రీవారిని చూసి మనసు పారవేసుకునియుండ వచ్చని, అందుకే తన శక్తిని ఉపయోగించి వారికి మాత్రమే వినపడేలా ప్రేమ గీతాన్ని సందేశంలా పంపుతున్నారేమో అని కూడా అన్నాడు.

ఎటు చూసినా పక్షం రోజుల నుంచీ శాంతనవుని ఆ గానం వీడలేదు. ఒకవేళ తన మిత్రుడన్నట్లు గంగా తీరాన విహరిస్తున్నప్పుడు ఏ అచ్చరకాంత అయినా మనసుపడి పంపుతున్న సందేశం అనుకున్నా, అందులో నారాయణనే అనే పదం, నమక్కే అనే పదం ప్రత్యేకించి భక్తి భావం తప్ప శృంగార భావన కనపడుట లేదు. లేదా..? పఱై అంటే పరమును గూర్చి కావచ్చుననే ఆలోచన రాగానే శాంతనవుడు ఆ మిత్రుని ఆలోచనను కొట్టి పడవేశాడు.

మరికొంత కాలం గడిచింది. గాంగేయుడు తన ఆలోచనలలో నుంచీ ఆ గానాన్ని తొలగించలేక పోవుచున్నాడు. ఆ రాగం, ప్రేమైక భక్తి భావన, ఆ గాన మాధుర్యం, ఆ తెలియని పదాల గురించి తెలుసుకోవాలనే తపన తనని నిలువనీయకున్నాయి.

పగలు యువరాజుగా, అఖండ భరతభూమికి కానున్న రారాజుగా, కురువంశోద్ధారకునిగా తాను దినచర్యగా చేయవలసిన పనులను ముగించుకుని రాత్రి కాగానే శయన మందిరానికి చేరుకున్నాడు. ఆ రాత్రి కూడా యథావిధిగా తన ఆలోచనలన్నీ ఆ అపూర్వమైన గానం చుట్టూనే తిరుగుతున్నాయి. తెలియకుండా నిద్ర పట్టింది. బ్రాహ్మీ ముహూర్తానికి క్షణ కాలం మునుపు..

ఏత్త కలంగళ్ ఎదిర్ పొంగి మీదళిప్ప,

మాత్తాదే పాల్ శొరియుమ్ వళ్ళల్ పెరుం పశుక్కళ్,

ఆత్త ప్పడైత్తాన్ మగనే! అఱివుఱాయ్,

ఊత్త ముడైయాయ్! పెరియాయ్! ఉలగినిల్

తోత్తమాయ్ నిన్ఱ శుడరే! తుయిలెழாయ్,

మాత్తారునక్కు వలి తొలైందు ఉన్ వాశఱ్కణ్,

ఆత్తాదు వన్దు ఉన్నడి పణియుమాపోలే,

పోత్తియామ్ వన్దోమ్ పుకழ்న్దేలో రెమ్బావాయ్!

అని తనకు తెలియకుండానే తన నోటివెంట పలుకులు ధారగా రావటంతో ఆశ్చర్యపోతూ లేచాడు శాంతనవుడు.

Aetra kalangal edhir pongi meedhalippa

Maatraadhae paal soriyum vallal perum pasukkal

Aatrap padaiththaan maganae arivuraay

Ootram udaiyaay periyaay ulaginil-

Thotramaay ninra sudarae thuyil ezhaay

Maatraar unakku vali tholaindhu un vaasar kan

Aatraadhu vandhu un adi paniyumaa polae

Potriyaam vandhom pugazhndhaelor embaavaay (21)

ఏమిటిది?

సమాధానం లేదు. దీని అర్థమేమిటి?

ఏమీ తట్టలేదు.

ఏ భాష?

తెలియరాలేదు.

దాదాపు 300 సంవత్సరాల తరువాత

దక్షిణాపథం. శ్రీవిల్లిపుత్తూరు.

ఆండాళ్ భక్తి పరవశ అయి ఉన్నది. ఈరోజో, రేపో భక్త ప్రియుడైన శ్రీకృష్ణ పరమాత్మ తమకు దర్శనం ఇస్తాడు. కానీ తాను అప్పటివరకు వేచి ఉండగలదా? ఉండగలదు. గలగాలి.

అప్పటికే అమ్మ కరుణ తమపై కలిగింది.

ఇంటి బైటకు వచ్చింది గోదా. ఎప్పటిలాగనే తను అనుసరించాల్సిన మార్గాన్ని అనుసరిస్తూ నడుస్తూంటే.. సరిగ్గా పది మంది స్నేహితురాండ్రు ఆమెననుసరిస్తున్నారు. తనతో కలిపి పదునొకండ్రు. ఉచితముగా సిద్ధమై వెళుతున్న ఆ కన్యలు, దేహాలంకరణ కన్నా ఆత్మాలంకరణ అధికముగా ఒప్పుతూ ఆ గ్రామానికే కిరీటం వలె భాసిస్తున్నారని, స్వామి దర్శనానికి విచ్చేస్తున్న గరుడుడు వారిని చూసి అనుకున్నాడు.

అఖిల వేద స్వరూపుడైన ఆ వైనతేయుడి నీడ వారిపై పడి ఛత్రము పట్టినట్లిగా అనంతునికి గోచరించింది. ఇంకనూ నాలుగు వేల ఏండ్ల తరువాత కదా తాను భూమి మీదకు మరల రావలసిందని సాలోచనగా అనుకున్నాడు. ఆయన కూడా స్వామి దర్శనానికే విచ్చేశాడు.

ఆండాళ్ భక్త్యావేశాన్ని గ్రహిస్తున్న ఆదిశేషునికి ఆమె ఒక సోదరిలా గోచరించింది. ఇది రాబోయే కాలంలో ఒక మహత్తర సంఘటనకు బీజం వేసింది.

Sometime in the mid-1910s

కేరళలో ఒక చిన్న గ్రామం. ఒక నడివయస్కురాలు పొద్దున్ననగా స్నానం చేసి, ఇంట్లో దీపం వెలిగించింది. ఆమె కొడుకు, ఇంటిని నడిపించే వ్యక్తి స్నాదికాలు పూర్తి చేసుకుని వచ్చి దేవుని ముందు కూర్చున్నాడు. ఆచమనం ముగిసింది. సరిగ్గా వేయి పూలు అతని చేతికి అందేలా తల్లి రెండు పళ్ళేలలో ఉంచింది. పారిజాత పుష్పాలు ఆ రోజున. ఒక పుష్పాన్ని అందుకున్నాడు. హృదయానికి తాకించి భగవంతుని పాదాల ముందర విడిచిపెడుతూ అద్భుతమైన కంఠ స్వరంతో పలుకుతున్నాడు.

ఓమ్ విశ్వాయ నమః

రెండవ పుష్పం

ఓమ్ విష్ణవే నమః

మూడవ పుష్పం

ఓమ్ వషట్కారాయ నమః

పక్కగది గుమ్మంలో కూర్చుని ఆడుకుంటున్న అతని మేనల్లుడు హఠాత్తుగా.. మొదలయ్యిందా పూజ! అన్నట్లుగా చూస్తున్నాడు. ఆ పిల్లవాడికంత ఆథ్యాత్మికత లేదు. కానీ, తన మేనమామ కంఠస్వరం, దాని నుంచీ వెలువడే నాదం, ఆ మంత్రాల వల్ల తనలో కలిగే సంభ్రమ సంచలనం తనకు తెలియకుండానే ఆ సమయం కోసం ఎదురు చూసేలా చేశాయి. ఈ క్షణాన అతని చూపు తన మామయ్య కుడి చేతి మీదే కేంద్రీకృతమై ఉంది. క్షణంలో వందవ వంతు కాలంలో పూవును తీసుకోవటం, అంతే సమయంలో అది అతని హృదయ స్థానాన్ని తాకటం, మరియొక లిప్త కాలంలో భగవంతుని పాదాలను చేరటం!

ఆ యువకుని చేయి అతని స్వర వేగంతో పోటీ పడుతోందా? లేక.. అతని స్వరమే చేతి వేగంతో ఉన్నదా అన్నది కాదు ప్రశ్న. ఆ బాలుడికి తన మేనమామ హృదయం నుంచీనే పుష్పాలు ఉత్పన్నమై, స్వామి చరణాలను తాకుతున్నవా అన్న ఆలోచన కలిగింది.

భక్తి తన్మయత్వంలో మునిగిపోయిన తన మేనమామ స్వరంలో విన్న ఆ విష్ణు సహస్ర నామాలు ఆ పిల్లవాడికి వద్దనుకున్నా రోజంతా చెవులలో మారు మారోగినట్లనిపించేవి ట!

పెద్దయ్యాక తనే చెప్పుకున్నాడు.

ఆయన/ఆ శక్తి ఎవరు?

విశ్వం!

ఇంకా?

అంతటా వ్యాపించిన వాడు.

ఆ పైన? సకల చరాచర, గోచరాగోచర జీవాజీవ రాశులలో నిండి ఉన్నది కూడా.

మరి అవతల? వీటి అవతల?

పిల్లవాడి మదిలో ప్రశ్న.

ఈశ్వరో విక్రమో ధన్వీ

మేధావీ విక్రమః క్రమః

వినబడుతోంది.

ఈశ్వరః! తన పేరే.

ఇంతకీ ఈశ్వరః అంటే?

సర్వులనూ పాలించి పోషించువాడు. అన్నింటిపై సకలాధిపత్యము గలవాడు. మరే విధమైన సహాయము, ప్రమేయము లేకుండా, ఇచ్ఛామాత్రముగా, లీలామాత్రముగా ఏదైనా చేయగలవాడు.

అలాంటి వాడు ఎవ్వడు?

మనం చూశామా? విన్నామా? కన్నామా?

ము. ము. ము.

అంతే కాదు. ఆయన నడయాడిన నేలలో నడుస్తున్నాం. ఆ నేలలో పండిన పంటలు, వాటినుండీ వచ్చే ఫలసాయాన్ని కూడా ఆస్వాదిస్తున్నాం. ఆయన పీల్చి వదిలిన గాలిలో ఏ వెయ్యోవంతో మనం పీల్చి ఉంటాం. ఆయన స్వర తరంగాలు అనంత వాయువుల్లో మిళితమైనా, వాటి ప్రభావాన్ని కాస్తో కూస్తో మనం ఈనాటికీ, ఇంకెన్నటికైనా అనుభవిస్తూనే ఉంటాం. ఏదో క్షణాలలో మన చెవులనో, శరీరాన్నో తాకే ఉంటాయి.

ఎవరాయన? మనకు అత్యంత దగ్గరగా ఉన్న, మనం కాకపోయినా మన పై తరాలలో లక్షల, కోట్ల సంవత్సరాల క్రితం కాకుండా.. కాలంలో కూతవేటు దూరంలో కాల స్వరూపుడు నడయాడాడు. పలికాడు. ధర్మాన్ని ఆచరించాడు. ఉద్ధరించాడు. ఇప్పుడు మనం ఈ మాత్రం ఉండగలుగుతున్నాము అంటే అసలైన కారణం కూడా అయిన వాడు..

ఈశ్వరః పరమః కృష్ణః సచ్చితానంద విగ్రహః।

అనాదిరాది గోవిన్దః సర్వకారణ కారణమ్॥

శ్రీకృష్ణ భగవానుడు.

కృష్ణస్తు భగవాన్ స్వయం!

Who has become the universe and pervades all.

Lord of past, present, and future,

He has made and supports all that is.

He is being and the essence of all beings,

He is the pure and supreme Self in all.

He is all, and the beginning of all things.

He is existence, its cause and its support.

He is the origin and the power.

He is the Lord.

He is the One from which creation flows.

His heads are a multitude, yet he is the Self in all.

His eyes and feet cannot be numbered.

Many and mighty are his forms.

His soul is revealed in light; as fire he burns.

He is the rays of the moon and the light of the sun

His forms are many, but he is hidden.

He has hundreds of forms, thousands of faces,

His face is everywhere . . .

ఏతే చాంశ కలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం।

ఇంద్రారి వ్యాకులం లోకం మృదయంతి యుగేయుగే॥

భగవంతుని సమస్త స్వరూపాలు శ్రీ కృష్ణుడి రూపాంతరాలే లేదా ఆయన రూపాంతరాల రూపాంతరాలే. ఆయన మాత్రం స్వయం భగవానుడు. ధర్మ విరోధుల చేత లోకం వ్యాకులత చెందినపుడు రక్షించడానికి వీరు ప్రతి యుగంలోనూ వస్తుంటారు.

కొన్ని అవతారాలలో పదిపాళ్ళు, కొన్నింటిలో పాతిక పాళ్ళు, ఇంకోన్నింటిలో ఏభై పాళ్ళు, మరికొన్ని సార్లు లేశమాత్రంగా భగవంతుని శక్తి ఆవిర్భావం జరిగింది. కాని శ్రీ కృష్ణుని అవతారంలో నూటికి నూరు శాతం భగవంతుని శక్తి భూలోకానికి దిగి వచ్చిందని శ్రీమద్భాగవతం అంటుంది. మరి అంతటి శక్తిని భూమి ఎలా భరించింది? ధర్మం వల్ల. ఆ ధర్మం ఏ రూపంలో వచ్చింది? ఎలా వచ్చింది? కేవల ధర్మమే!

అంతేనా?

కరార విందేన పదారవిందం ముఖారవిందే వినివేశ యంతం।

వటస్య పత్రస్య పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి॥

తామరపువ్వులాంటి చేతితో, తామరపువ్వు లాంటి పాదాన్ని పట్టుకొని తామరపువ్వులాంటి నోట్లో ఉంచుకొని, మఱ్ఱియాకు మీద శయనించి ఉన్న బాలకృష్ణుని స్మరిస్తున్నాను.

తరచి చూస్తే..

ఈశ్వరుడు

కృష్ణుడు

సత్ చిత్ ఆనందుడు

సచ్చితానంద విగ్రహుడూ

అనాది

ఆది

గోవిందుడు

సర్వః

సర్వకారణుడు

సర్వకారణ కారకుడు

అన్నీ ఆయనే.

గాంగేయుడి వద్దకు వెళదాం. కాలంలో మరియొక పరి ప్రయాణం.

ఆరోజు గాంగేయుడు ఇక నిలువలేక పోయాడు. ఏలనైనా ఈ రహస్యమును తెలుసుకొన వలసిందే అనుకుంటూ నిద్రలేచిన వెంటనే కాలకృత్యాదులు తీర్చుకుని, స్నానమాచరించి, సంధ్యాది విధులు పూర్తి చేసుకుని, ధనుర్బాణాలు ధరించి, అశ్వము నొకదానిని అధిరోహించి, నగర పొలిమేరకు చేరుకున్నాడు. ఆ పైన ఆ శబ్దం దక్షిణ దిశగా వచ్చుచున్నదని గమనించి, ఆ వైపుగా వెళ్ళాడు. అప్పటికింకా చీకట్లు పూర్తిగా తొలుగలేదు.

అదే సమయానికి మూడు వందల సంవత్సరాల తరువాత ఆండాళ్ గానం మొదలు పెట్టింది. ఏత్త కలంగళ్..

నెచ్చెలులు పదిమంది. పైన గరుడుడు, పాదాల క్రింద ఆది శేషుడు అనుసరిస్తున్నారు ఈ వేడ్క జూస్తూ. చిత్రమేమీ లేదు కానీ, నీళాదేవి కూడా అదృశ్యంగా ఈ పదునొకండు స్నేహితలను చేరి అదృశ్య శక్తిగా వారి వెంట అడుగులు కదుపుతోంది.

ఈ చిచ్చరపిడుగు ఈ రోజున ఏమి చేస్తుందో అని ఆశ్చర్యంతో నీళాదేవి ఆండాళ్‌ను నఖశిఖపర్యంతం పరిశీలించి చూస్తోంది. ఈ పన్నెండు మందీ ద్వాదశాదిత్య తేజోసములుగా ప్రకాశిస్తుంటే.. అప్పటికింకా చీకట్లు తొలిగే వేళ పూర్తిగా రాని శ్రీవిల్లిపుత్తూర్ లో సూర్యోదయమైనదా అన్నంత వెలుగు ప్రసరించింది.

వటపత్రశాయి పెరుమాళ్ లేచి కూర్చుని జరిగినది గ్రహించాడు. అయినా వెంటనే నిద్ర నటించాడు. ఆండాళ్ తన గానం ద్వారా ఇంకేమి చెప్తుందా అని చూడటానికి.

మూడు వందల సంవత్సరాలకు పూర్వం శాంతనవుడు ఇదే సమయాన తన అన్వేషణలో భాగంగా చేస్తున్న ప్రయాణంలో అంతకంతకూ వేగం పెంచుతున్నాడు. క్షణాలలో భళ్ళున తెల్లవారినట్లనిపించింది. ఆశ్చర్యపోయి చుట్టూ చూశాడు. ఆ సమయానికి కనుపడాల్సిన ప్రకృతి చిహ్నాలు కనుపించలేదు.

“ఏమి మాయ?” అనుకున్నాడు. గానం వినవస్తూనే ఉంది.

మూడువందల సంవత్సరాల తరువాత ఇదే సమయానికి ఆండాళ్ గాన ప్రవాహం. ఆమె మనోయఙ్ఞ రూపంలో..

“ఊత్త ముడైయాయ్! పెరియాయ్!”

మూడు వందల సంవత్సరాల పూర్వం..

గంగా పుత్రుడు అమ్ములపొదిలో నుంచీ బాణాన్ని తీసి విల్లుకు సంధించాడు. మంత్రం వేసినట్లు దాని మీద శబ్దభేది అభిమంత్రించాడు. క్షణమాగితే ఆ బాణం సంధింపబడేదే. తనను మంత్రముగ్ధుని చేసి భవిష్యత్ నుంచీ (తనకు తెలియకుండానే) వినవస్తూ తననాకర్షింప చూస్తున్న ఆ వ్యక్తి ఎవరో తనకు తెలియజేయమని ప్రార్థిస్తూ.

కానీ, అది శబ్దభేది. వేస్తున్నది భావి భారత సామ్రాట్.. గంగా శంతనుల సంతానమైన గాంగేయుడు.

ఆ అస్త్ర లక్ష్యం ఆండాళ్!!!

(సశేషం)

Exit mobile version