[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
సహస్రం అనంతం అక్షయం
అకృత్యానాం చ కరణం
కృత్యానాం వర్జనం చ మే।
క్షమస్వ నిఖిలం దేవ
ప్రణతార్తిహర ప్రభో॥
(న్యాస దశకం)
ఓ వరదరాజా నీ ప్రియమైన భక్తుల సంసార బాధలను నాశనం చేయడంలో ప్రసిద్ధి చెందావు! నీ శక్తికి పరిమితులు లేవు. అనుకున్నది అమలు చేయగల సామర్థ్యం నీకు ఉంది. నేను నీ శాస్త్రాల ఆదేశాలను అతిక్రమించాను. ఆ శాస్త్రాలలో నీవు సూచించిన కర్మలను నేను విడిచిపెట్టాను. దయచేసి నా ఈ అపరాధాలన్నింటినీ క్షమించి నన్ను రక్షించండి. నీ క్షమా శక్తి ఒక్కటే నా పాపాలను నాశనం చేయగలదు.
ఇలా మనం మన రోజువారీ కార్యక్రమాలలో ఎన్నోసార్లు శాస్త్రవిహిత కర్మలను అనుసరించము. దీనికి కారణాలు అనేకం. అవి అంగీకరించదగినవి, సమర్థనీయం కానివీ రెండు రకాలూ ఉంటాయి. ఏదైనా విహిత కర్మను చేయకుండా వలన వచ్చే కర్మఫలానికి (బాధ్యతను విస్మరించటం), మనమే బాధ్యులం.
You can ignore the reality, but you cannot ignore the consequences of ignoring that reality – Ayn Rand
కానీ, ఆ కర్మ ఫలం కూడా మనకు అంటకుండా కాపాడి మోక్షమివ్వగలిగిన వాడు వరదరాజ స్వామి. చేయవలసినదల్లా శరణాగతి. కానీ, మన మనసులు అంత శరణాగతికి ప్రతి క్షణం లొంగవు. ఏదో పెద్ద కష్టం వచ్చినప్పుడు తప్ప. అందుకు, జపానికి, పారాయణానికో కూర్చునే ముందు అంతఃకరణ శుద్ధి కోసం సంకల్పం తీసుకుని/చెప్పుకుని అఙ్గన్యాస కరన్యాసాలు చేస్తాము.
అఙ్గన్యాసం ద్వారా ఆ విశ్వశక్తి అయిన పరమాత్మను మనలోకి ఆహ్వానించి మన్త్రశక్తి ద్వారా మన శరీరాంగములలోనికి ఆహ్వానిస్తాము. తద్వారా మన శరీరం కాస్త శుద్ధి అయి ఆ దేవతా శక్తి మన శరీరంలో వశించేందుకు మార్గం సుగమం అవుతుంది. దీనిని ఎంత తీక్ష్ణంగా చేయగలిగితే అంత ఫలితం (కామ్యార్థం చేసే పారాయణలు) లభించే అవకాశం ఉంటుంది.
మనం చేసే ఏ విషయంలో అయినా ఇచ్చి పుచ్చుకొనుట అన్నది చేతులతో చేస్తాము. మార్పిడి అన్నది చేతుల ద్వారా మాత్రమే జరుగుతుంది. ఈ శక్తి మార్పిడి (మనలో ప్రవేశించిన విశ్వశక్తి రాకపోకలు) చేతుల ద్వారానే జరుగుతుంది కనుక పై విధంగానే కరన్యాసాలు చేస్తాము.
తదనంతరం
ఋషి పేరు చెప్పుకునేటప్పుడు శిరస్సు మీద సూచిస్తాము. ఇక్కడ శ్రీవిష్ణు సహస్రనామములో వేదవ్యాసుడే ఆ ఋషి. ఆయన మన శిరస్సు పైభాగన ప్రతిష్ఠితుడౌతాడు. ఛందస్‌ను చెప్పుకునేటప్పుడు నాసిక లేదా ముఖము అనగా నోటిని సూచిస్తాము. వాక్ శక్తికి చిహ్నంగా. ఛందస్సు అనేకన్నా ఛందస్ (ఛన్దస్) అనటం మంచిది. ఆ ఛన్దస్ ఇక్కడ అనుష్టుప్.
శ్రీమహావిష్ణుః పరమాత్మా శ్రీమన్నారాయణో దేవతా।
ఈ స్తోత్రానికి లేదా మన్త్రానికి అధిష్ఠాన దేవత శ్రీమహావిష్ణువు. ఆయనే శ్రీమన్నారాయణుడు. జీవులయందు, జీవుల వెలుపల, అన్నిచోట్లా ఉన్నవాడు. ఆ శక్తిని మనం ధ్యానిస్తూ హృదయాన్ని సూచిస్తాము. అంటే అంతటా నిండి ఉండే పరమాత్మను మనం మన హృదయంలోకి ఆహ్వానిస్తున్నామన్న మాట!
ఈ విషయాన్ని, అంటే పరమాత్మ మనలో ఉండవలసిన స్థానం, లేదా మనం ఉంచుకొనవలసిన స్థానం హృదయం, మనం ఎరుకతో తెలుసుకోవాలి.
ఇంతకీ హృదయం భగవంతుని నివాస స్థానం ఎలా అవుతోంది?
<<<స్వామి ఏమీ తెలియనట్లు కుడిచేతి చిటికెనవేలును నాభి దగ్గర ఉంచాడు. అంగుష్ఠాన్ని పైకి జరిపాడు. తన హృదయం మీద కొలత లాగా. కంఠం దగ్గర ఎడమచేయి బొటనవేలు ఉంచి, కనిష్ఠికను కిందకు జాపి, కుడిచేతి బొటన వేలు పక్కనే నిలిపాడు. అవి సరిగ్గా రెండంగుళాలు సరిపోయేంత కలిశాయి. The overlapping of the left little finger and the right thumb is the place where the aatma (జీవాత్మ) resides in the body of us.>>>
ఆ జీవాత్మ పరమాత్మను ఆహ్వానించి తను ఆ విశ్వశక్తిలో లీనమవ్వాలనే కోరికను వ్యక్తపరుస్తుంది. ఆ శక్తి మనలో ప్రవేశిస్తుంది. ఆ శక్తితో కాసేపు ఐక్యయమవగలగాలి. అదే జపం. అదే ధ్యానం.
సర్వస్య చాహం హృది సన్నివిష్టః।
“నేను సర్వ ప్రాణుల హృదయమందున్న వాడను.
తిరుమన్త్రార్థం కూడా దాదాపు ఇక్కడ గోచరిస్తుంది.
ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేఽర్జున తిష్ఠతి।
ఈశ్వరః — పరమేశ్వరుడు
సర్వ-భూతానాం — సమస్త ప్రాణుల యందు
హృత్-దేశే — హృదయములలో
అర్జున — ఓ అర్జునా
తిష్ఠతి — నివసించును
పరమేశ్వరుడు సమస్త ప్రాణుల హృదయములలో నివాసమేర్పరచుకుని ఉంటాడు. ఓ అర్జునా, అది మనం గ్రహించాలి. ఆ గ్రహింపు మనకు కలుగటంలో ఈ హృదయన్యాసం <<<ఆ శక్తిని మనం ధ్యానిస్తూ హృదయాన్ని సూచిస్తాము.>>> ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
భౌతిక శక్తిచే తయారు చేయబడిన యంత్రమును అధిరోహించి ఉన్న జీవాత్మల గతిని, వాటి వాటి కర్మల అనుగుణముగా, ఆయన నిర్దేశిస్తూ ఉంటాడు.
నిజానికి మనం జపం చేయటంలో ప్రధానమైన అంశం ఇదే. ఆ పరమాత్మను తెలుసుకుని, ఆయనకు వీలైనంత దగ్గరగా కాసేపన్నా గడపగలగాలి.
అలా చేయి అనగానే మనం చేయలేము కనుక, ఒక నామ స్మరణ మనకు ఊతంగా ఉంటుంది. ఆ నామము మనకు ఒక ఆధారంగా పని చేస్తూ ఆ పరమాత్మను మనకు ఒక చిత్రం రూపంలో చూపుతుంది. దీనికీ, ధ్యాన శ్లోకానికి చాలా విశేష సంబంధం ఉంది.
అమృతాంశూద్భవో భానురితి బీజమ్।
దేవకీనందనః స్రష్టేతి శక్తిః।
ఈ పరమాత్మ నుంచీ మనం శక్తిని పొందుతున్నాము. ఈ విశ్వశక్తిని మనం హృదయంలోనికి ఆహ్వానించి, మన జీవాత్మను ఆ పరమాత్మకు దగ్గరగా తీసుకుని పోతున్నాము కనీసం. పూర్తిగా ఐక్యం చేయలేకపోయినా. ఆ విశ్వశక్తి అవ్యయమైనది. అంటే అంతు ఉండనిది. An infinite potential energy. An unlimited source of static electricity. Which converts itself into kinetic energy and runs this world.
Work-Energy Principle.
The net work done by the forces on an object equals the change in its kinetic energy.
అంగుష్ఠ మాత్రం ఉన్న జీవాత్మకూ, మన హృదయంలోకి ఆహ్వానింపబడి ఆ జీవాత్మ దగ్గరకు వచ్చిన పరమాత్మ కు మధ్య శక్తి వ్యత్యాసం, మనం ఎంత గట్టిగా (Force) పట్టుకుంటామో దానికి సమానంగా ఉంటుంది.
మర్కటకిశోర న్యాయం?
Work-Energy Theorem. ఇదే.
అదే అమృతాంశూద్భవమైన బీజం.
సృష్టికి, కర్త కర్మ క్రియ అయిన శక్తి, స్రష్ట. అంటే సృష్టిని చేసేది, దానిని నడిపించేది, ఆ నడవటానికి మూలమైన శక్తిని ఒసగేది కూడా స్రష్ట. ఈ శక్తి భౌతికంగా మనకు బ్రహ్మ గారు. ఆయన ఉద్భవించింది ఆ పద్మనాభుని నాభియందు. అందుకే దేవకీనన్దనః స్రష్టేతి శక్తిః అంటూ నాభి వైపు సూచించాలి.
ఉద్భవః, క్షోభణో దేవ ఇతి పరమోమంత్రః।
శంఖభృన్నందకీ చక్రీతి కీలకమ్।
***
ఇక్కడ చాలా కీలకమైన అంతరం గోచరిస్తుంది. దీనిని పరిశీలించే ముందు శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్న కొన్ని విశేషాలను తెలుసుకోవాలి.
ప్రతి దేవత ఆరాధనలోను మనకు అష్టోత్తర శతనామ స్తోత్రం, సహస్రనామ స్తోత్రం ఉంటాయి. కానీ, రెండు సహస్రనామ స్తోత్రాలు మాత్రమే నిత్య పారాయణకు బాగా ప్రాచుర్యం పొందాయి. వాటిలో ఒకటే శఙ్కరాచార్యుని వ్యాఖ్యను పొందింది. రామానుజ భాష్యాన్ని పరాశర భట్టర్ ద్వారా అందుకున్నది. అటు ద్వైత పరంగానూ విశ్లేషణను సాధించి సహస్రనామము అనగానే అందరికీ గుర్తుకు వస్తుంది.
అదే శ్రీవిష్ణు సహస్రనామము.
అతి తక్కువ పదములతో అలరారుతున్న సహస్రనామ స్తోత్రం కూడా ఇదే.
అంటే ఎవరో కొన్ని గుణములను కీర్తిస్తూ రచించినది కాదు. ఈ విశ్వశక్తిలో అపూర్వంగా అతి క్లుప్తంగా గోచరమౌతూ అనల్పమైన ఙ్ఞానాన్ని అందించే మహత్తర మన్త్రమిది.
మననాత్ త్రాయతే ఇది మన్త్రము.
ఓంకార సహితంగా అనుష్టుప్ ఛన్దస్ లో ఒదిగే అరుదైన నారాయణ మన్త్రధారి, దానికి ఈశ్వరుడు అయిన శ్రీమహావిష్ణువుకు మనకు మధ్య ఒక వారధిగా నిలిచేది.
గేయం గీతానామ సహస్రం।
ధ్యేయం శ్రీపతి రూపమజస్రమ్॥
భగవద్గీత, విష్ణు సహస్రనామం పఠించాలి. లక్ష్మీనారాయణుని రూపాన్ని ధ్యానించాలి.
గీతా – భగవద్గీత
నామ సహస్రం – శ్రీవిష్ణు సహస్రనామం
భజగోవిన్ద స్తోత్రంలో ఆదిశంకరులు ప్రామాణికం చేశారు. అనాదిశంకరులు రామనామమునే కారకమని జపిస్తూ మనకు దారి చూపుతున్నారు. రెంటి మధ్యా సంబంధం మనకు తెలసినదే కదా.
॥లక్ష్మీనారాయణుని రూపాన్ని ధ్యానించాలి॥
ఇది చాలా కీలకమైన విషయం.
లక్ష్మీదేవి నిత్యానపాయని. స్వామిని విడిచి ఉండదు. అందుకే అమ్మకు చంచల, చపల అనే పేర్లు వచ్చినా, ఎక్కడా స్థిరంగా ఉండదు అని అనిపించుకున్నా, శ్రీమన్నారాయణుడి హృదయమే ఆమె శాశ్వత స్థానం. అయినా భౌతికంగా అమ్మ మనందరి తండ్రియైన శ్రీమహావిష్ణువు పాదాల వద్ద ఉంటుంది. (ఇది ఙ్ఞాపకముంచుకోండి. అత్యవసరం).
విచిత్రం చూడండి. జీవాత్మలన్నిటి హృదయాలలో పరమాత్మ ఉంటాడు. కానీ, పరమాత్మ హృదయంలో ఉండేది అమ్మ లక్ష్మీదేవి.
మరి అప్పుడు మన గతి?
॥కరుణాం లోక మాతరం॥
అని ఆవిడను ఊరికే అనలేదుగా!
ఆ శ్రీహరి హృదయంలో ఉన్న లక్ష్మి, మనందరి గురించీ ప్రతి క్షణమూ మన గురించే హెచ్చరిస్తూ, ఆయన దృష్టి మనమీద పడేలా చేస్తుంది.
<<<ఉద్ధవుడికి శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన మాట, లేదా తెలియజెప్పిన విషయం ఒకటి పెద్దలు చెప్తున్నారు కదా.
- నా పేరు చెప్పి దానమిస్తే అంతకు పదింతలు ప్రసాదిస్తాను.
- నన్ను కీర్తిస్తే నేను వారి గురించి ఊర్ధ్వ లోకాలలో చాటింపు చేస్తాను.
- నన్ను నిరంతరం స్మరణ చేసేవారి దగ్గరే నేను అనుక్షణం ఉంటాను.>>>
అందుకే హరినామ కీర్తన చేసేవారిని అమ్మ అనుక్షణం కనిపెట్టుకుని ఉండి ఆయన దృష్టి వారిమీద పడేలా చేస్తుంది. అలా చేసి, ఆయన మనవద్దకు వస్తుంటే ఆ దొడ్డ ఇల్లాలు కూడా ఆయన వెంట మన వద్దకే వచ్చి ఉంటుంది. ఆయన నుంచీ మన దృష్టి మరలనంత కాలం ఆ తల్లి కూడా మన నుంచీ వెళ్ళదు.
అందుకే విష్ణు భక్తులకు మొదట భౌతిక సంపద అంత త్వరగా దక్కదు. కానీ, కీలకమైన ఈ విషయం తెలుసుకుని, హరినామ కీర్తనం నిరన్తరం చేస్తుంటే అమ్మే మనలను కనిపెట్టుకుని ఉండి, ఆయన చూపు మన పైన పడేలా చేసి, ఆయన వెంట వస్తుంది. అప్పుడు మనం ఎంత సంపద పొందినా మాయకు లొంగం. అందుకే హరిభక్తులు దాదాపు త్రిగుణాలకు అతీతులై ఉంటారు. ముందే పునీతులయ్యారు కదా.
ఆ శ్రీహరికి కూడా మన అమ్మ శ్రీమహాలక్ష్మిని మనస్పూర్తిగా స్మరించే వారి మీద అనుగ్రహం తేలికగా కలుగుతుంది. ఎందుకంటే అమ్మ ఆయన హృదయంలో ఉంది. ఆయన మన హృదయాలలో ఉన్నాడు. అందుకే ఇది మనకు రెండందాలా లాభం.
కనుక ఇక్కడే మనం ఒక్కసారి ఒళ్ళు మరచి శ్రీలక్ష్మీ అష్టోత్తర శత నామాన్ని చేద్దాం.
శ్రీః లక్ష్మీ కమలా దేవీ మా పద్మా కమలాలయా।
పద్మేస్థితా పద్మవర్ణా పద్మినీ మణిపఙ్కజా॥
పద్మప్రియా నిత్యపుష్టా: ఉదారా పద్మమాలినీ।
హిరణ్యవర్ణా హరిణీ: అర్ఘ్యా చన్ద్రా హిరణ్మయీ॥
ఆదిత్యవర్ణా౭శ్వపూర్వా హస్తినాద ప్రబోధినీ।
రథమధ్యా దేవజుష్టా సువర్ణరజతస్రజా॥
గన్ధద్వారా దురాధర్షా తర్పయన్తీ కరీషిణీ।
పింగలా సర్వభూతానాం ఈశ్వరీ హేమమాలినీ॥
కాంసోత్స్మితా పుష్కరిణీ జ్వలన్తీ అనపగామినీ।
సూర్యా సుపర్ణా మాతాచ విష్ణుపత్నీ హరిప్రియా॥
ఆర్ద్రాయ:కరణీ గంగా వైష్ణవి హరివల్లభా।
శ్రయణీయా చ హైరణ్యప్రాకారా నళినాలయా॥
విశ్వప్రియా మహాదేవీ మహాలక్ష్మీ వరారమా।
పద్మాలయా పద్మహస్తా పుష్టీ: గన్ధర్వసేవితా॥
ఆయాసహారిణీ దివ్యా శ్రీదేవీ చన్ద్రసోదరీ।
వరారోహా భృగుసుతా లోకమాతా౭మృతోద్భవా॥
సిన్ధుజా శార్ఙ్గిణీ సీతా ముకున్దమహిషీన్దిరా।
విరించిజననీ ధాత్రీ శాశ్వతా దేవపూజితా॥
దుగ్ధా వైరోచనీ గౌరీ మాధవి అచ్యుతవల్లభా।
నారాయణీ రాజ్యలక్ష్మీ: మోహిని సురసున్దరీ॥
సురేశ సేవ్యా చ సావిత్రీ సంపూర్ణాయుష్కరీ సతీ।
సర్వదు:ఖ హరా౭రోగ్య కారిణీ సత్కళత్రికా॥
సంపత్కరీ జయత్రీ చ సత్సన్తాన ప్రదేష్టదా।
విష్ణు వక్షస్థలావాసా వారాహీ వారణార్చితా॥
ధర్మఙ్ఞా సత్య సంకల్పా సచ్చిదానన్ద విగ్రహా।
ధర్మదా ధనదా సర్వకామదా మోక్షదాయినీ॥
సర్వశతృక్షయకరీ| సర్వాభీష్ట ఫలప్రదా॥
॥ఓమ్ శ్రీమహాలక్ష్మ్యై నమ॥
ఇది పాఞ్చరాత్కాన్తర్గతమ్.
శ్రీవిష్ణు సహస్రనామం అనే కాదు చాలా సహస్రనామ స్తోత్రాలలో పునరుక్తి ఉందని అంటూ ఉంటారు. మిగిలిన వాటి సంగతి పక్కన పెడితే..
శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం అనేది మన జీవన్మన్త్రం. ఈ కలియుగంలో. కవిత్వం కాదు. కనుక పురకుక్తి అనేది అసలు విషయమే కాదు. పైగా, ప్రతి చోటా సందర్భాన్ని బట్టీ అర్థము, అర్థసంపూర్ణమూ మారిపోతూ ఉంటాయి. విష్ణు సహస్రనామము మిగిలిన స్తోత్రాల లాగా కేవలం ఏవో నామములో, గుణముల కీర్తనో కాదు. ఎక్కడికక్కడ ఒక గొలుసుకట్టులాగా ప్రతిచోటా ఒక లంకె ఉండటం జరిగింది. దాన్ని ముందు ముందు మనమే గ్రహిస్తాము.
ఈలోగా తెలుసుకొన వలసిన విషయం మీద శ్రద్ధ వహిద్దాము.
విష్ణు సహస్రనామములో దాదాపు 125 పునరుక్తమైన నామాలు కనుపిస్తాయి. అన్నిటినీ ఏక మాత్రంగా తీసుకుంటే 875 నామాలు వస్తాయి. మరీ విచిత్రమేమిటంటే.. ఈ 875 నామములలో ఉన్న పదముల సంఖ్య సరిగ్గా వేయి. అనగా సహస్రం. 1000.
ఇక చెప్పండి. పైగా ఆ పునరుక్తమైనవని పేరుపడిన నామముల మధ్య ఎంతో లోతైన సంబంధం ఉంది. కేవలం ఆ నామములే కొన్ని సంకేతాలను అందిస్తాయి. వాటి వ్యాఖ్య కూడా విశేషతను పొంది ఉంది. అది ముందు ముందు మనకు అర్థమో, అర్థసంపూర్ణమో అవుతుంది.
శ్రీవిష్ణు సహస్రనామము సరిగ్గా 107 శ్లోకాలలో ముగుస్తుంది.
వాటికి
వనమాలీ గదీ శార్ఙ్గీ శఙ్ఖీ చక్రీచ నన్దకీ|
శ్రీమన్నారాయణో విష్ణుర్వాసదేవోభిరక్షతు॥
కలిసి ఓంకారంతో కూడి అనుష్టుప్ ఛన్దస్ లో ఉన్న తిరుమన్త్రంలా, 108 శ్లోకాలతో మన్త్ర సంపూర్ణత్వం గోచరమౌతోంది.
ఇది ఏ ఇతర సహస్ర నామములలో అంతగా గోచరించదు.
ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమిటంటే..
షణ్మతాలకు ప్రధాన దేవతలలో ఎవరిని ధ్యానిస్తే వారి సహస్రనామముగా గోచరిస్తుంది. అయినా ఇది విష్ణు సహస్రనామమే. అయినా ఇది షణ్మతాలకు పవిత్రమైనదే.
మరొక గొప్ప వైశ్విక చమత్కారం (cosmic wit) ఏమిటంటే..
జీవుని హృదయంలో పరమాత్మ. పరమాత్మ హృదయంలో అమ్మ. అమ్మ స్థానం ఆయన హృదయం. ఆవిడ నిండా ఆయనే. ఆయన మన హృదయంలో. ఆయన హృదయంలో అమ్మ. అమ్మ నిండా ఆయనే. ఆయన మన హృదయంలో. ఆయన హృదయంలో అమ్మ. అమ్మ నిండా ఆయనే..
విశ్వంలో విశ్వం. అందులో మరొక విశ్వం. అందులో మరొక విశ్వం. దానిలో మరొక విశ్వం.
విష్ణుః వ్యాపించే ఉన్నాయి.
అనన్తంగా. ఆయన పేరు కూడా అనన్తుడే.
A universe in another universe in another universe in another universe..
Infinite universes in infinite dimensions. And again as Aandal said.. inside and out. Inside and out. Infinitely.
అనన్తుడు అనే పేరుతో ఆదిశేషుడు ఈ విశ్వాన్ని, ప్రస్తుతానికి తక్కువలో భూమిని మోస్తున్నాడంటే అదే కదా.
But this is all a UniVerse. ఒకే గీతం. భగవద్గీతం! నామ సహస్రం కూడా.
పెరియాయ్! తిరుప్పావై కూడా ఆ UniVerse యే!
నేడే ధనుర్మాసం ఆరంభం.
ఆణ్డాళ్ చెప్పిన ఈ విశ్వరహస్యం ఈ రోజే మనం చెప్పుకోవటం cosmic wit కాకపోతే మరేమిటి?
(సశేషం)