Site icon Sanchika

తల్లివి నీవే తండ్రివి నీవే!-11

[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

శ్రీ వైకుంఠ విరక్తాయ

శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీతటే।
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్॥

పాఞ్చజన్యమనే శంఖము, నన్దకము అనే ఖడ్గము, సుదర్శనమను చక్రము. వీటిని ఆయుధములుగా వాడి పరమాత్మకు, మనకు అడ్డుగా ఉన్న మాయ, అరిషడ్వర్గాలు, వాసనలు మొదలైనవాటిని మనం జయించే ప్రయత్నం చేయాలి. అందు కోసం మనం వాటిని అనగా ఆ ఆయుధములను ప్రార్థించాలి. వాటిని ధరించిన ఆ శ్రీమహావిష్ణువు ఆ యా ఆయుధాలను వాడి.. మన కర్మ బంధనాలను తొలగించి ముక్తిని ప్రసాదిస్తాడు.

సుందర చైతన్యానంద స్వామి చెప్పినట్లు చూస్తే ఇక్కడ మనం అంతర్ముఖులమై, మనలోని ఆ దివ్యాయుధపాణి యైన శ్రీమహావిష్ణువును దర్శిస్తూ, మన పాదమును మనమే సూచించుటయో, లేదా పట్టుకొనుటయో చేయాలి.

సంప్రదాయకంగా పెద్దలు (ఒక పద్ధతిలో) చెప్పిన మాట క్షేత్ర-బీజ స్థానాలను సూచించాలి.

ఈ ఆయుధాలు మొత్తం ఐదు.

  1. సుదర్శన చక్రం
  2. పాంచజన్యము అనే శంఖం
  3. కౌమోదకీ అనే గద
  4. నందకము అనే ఖడ్గం
  5. శార్ఙ్గము అనే ధనుస్సు

స్ఫురత్సహస్రారశిఖాతితీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యమ్।
సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః చక్రం సదాఽహం శరణం ప్రపద్యే॥1॥

విష్ణోర్ముఖోత్థానిలపూరితస్య యస్య ధ్వనిర్దానవదర్పహంతా।
తం పాంచజన్యం శశికోటిశుభ్రం శంఖం సదాఽహం శరణం ప్రపద్యే ॥2॥

హిరణ్మయీం మేరుసమానసారాం కౌమోదకీం దైత్యకులైకహంత్రీమ్।
వైకుంఠవామాగ్రకరాభిమృష్టాం గదాం సదాఽహం శరణం ప్రపద్యే॥3॥

రక్షోఽసురాణాం కఠినోగ్రకంఠ చ్ఛేదక్షరచ్ఛోణితదిగ్ధధారమ్।
తం నందకం నామ హరేః ప్రదీప్తం ఖడ్గం సదాఽహం శరణం ప్రపద్యే॥4॥

యజ్జ్యానినాదశ్రవణాత్ సురాణాం చేతాంసి నిర్ముక్తభయాని సద్యః।
భవంతి దైత్యాశనిబాణవర్షి శార్ఙ్గం సదాఽహం శరణం ప్రపద్యే॥5॥

ఇమం హరేః పంచమహాయుధానాం స్తవం పఠేద్యోఽనుదినం ప్రభాతే।
సమస్త దుఃఖాని భయాని సద్యః పాపాని నశ్యంతి సుఖాని సంతి॥

వనే రణే శత్రు జలాగ్నిమధ్యే యదృచ్ఛయాపత్సు మహాభయేషు।
ఇదం పఠన్ స్తోత్రమనాకులాత్మా సుఖీభవేత్ తత్కృత సర్వరక్షః॥

ఏ విధంగా తీసుకున్నా, చివరకు సంపూర్ణంగా ఆ విశ్వశక్తికి ఒక సాకార రూపాన్ని శాస్త్రవచనానుసారం ఇచ్చి, ఆ శక్తికి సంపూర్ణ శరణాగతులమై ఉన్నామని చెప్పటమే ఇక్కడ కీలకం.

శఙ్ఖము మనకు అనగా భక్తులకు ఙ్ఞానబోధ చేయుటకు సంకేతము. స్వామి మన చబుకము మీద ఆ పాఞ్చజన్యాన్ని ఉంచి (ధృవుని కథ గుర్తుందా?) మనలో ధర్మ విచక్షణను కలిగిస్తాడు. ఆ పైన మనలో (తననాశ్రయించిన భక్తులలో) ఉన్న గతజన్మ వాసనలను (కర్మ), ఈ జన్మలో చేసిన, చేస్తున్న పాపాలను నందకమనే ఖడ్గముతో ఖండించి మనకు విముక్తి కలిగిస్తాడు. ఆ విధంగా శుద్ధి చెందిన మన చక్షువులకు సుదర్శనమౌతుంది సుదర్శనం (చక్రం) ద్వారా.

ఈ శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రంలో అటు నిర్గుణ బ్రహ్మను గురించి, ఇటు సగుణ బ్రహ్మను గురించీ, సాకార బ్రహ్మను గురించి, నిరాకార బ్రహ్మను గురించీ చెప్పబడింది.

శిరస్సున నారాయణాంశ సంభూతుడైన వేదవ్యాస మహర్షి.

వాక్కు నందు పవిత్రమైన వేదాన్ని (ఛన్దో రూపంలో)

హృదయమునందు పరమాత్మ సాకార మూర్తిని ప్రతిష్ఠించుకుని

అటు పిమ్మట శార్ఙ్గ ధన్వా గదాధర ఇత్యస్త్రం అని పలికి, మన సాధనకు ఏవియును అడ్డుపడకుండా చూడమని ఆ శ్రీరామచన్ద్ర ప్రభువును తలుచుకుంటాము. ఆనాడు విశ్వామిత్రుడు తలపెట్టిన యాగమును రక్షించినట్లు శ్రీరామ చంద్రుడు మన సహస్రనామ స్తోత్ర జపముకు ఏ విధమైన ఆటంకాలు రాకుండా కాపాడతాడు.

విల్లు సరే! మరి గద ఎందుకు?

విల్లు దూరంగా ఉన్న శత్రు సంహారానికి ఉపయోగపడితే, గద సమీపంలో ఉన్న అరులను అరిగించటానికి సహాయపడుతుంది. (విషయ సుఖాలు, విషయ వాసనలు).

***

ఎంత నిర్గుణ, నిరాకార బ్రహ్మను తెలుసుకొనుటకు, ప్రాధాన్యంగా స్వీకరించుటకు ఙ్ఞానులు ప్రయత్నించినా, ఈ కలియుగంలో సాకార, సగుణ బ్రహ్మకు మాత్రమే ప్రాధాన్యం. ఎందుకంటే ఇదియే సులభోపాయము కనుక. తరుణోపాయం కనుక.

అందుకే ఆ లక్ష్మీనారాయణ తత్వాన్ని సులభంగా ప్రదర్శించి మనకు దర్శనమొసగే ఆ వేఙ్కటేశుడి మఙ్గళాశాసనమ్ లో ఈ విషయం మరింత ప్రాధాన్యంగా చెప్పారు పెద్దలు.

ఒక్కసారి కౢప్తంగా ఆ మఙ్గళాశాసనమ్ పరిశీలిద్దాము.

శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినామ్
శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్. ॥ 1 ॥

లక్ష్మీదేవి భర్తయును, కళ్యాణ గుణములకు నిధియును, శరణార్థులకు రక్షకుడును, వేంకటాచల నివాసియు నగు శ్రీనివాసునకు మంగళ మగును గాక.

ఇంతకీ ఆ వేంకటాచలము యొక్క విశేషము ఏమిటి? ఎందుకంత ప్రాధాన్యం?

వేం అంటే సర్వ పాపములు. కట అంటే దహించుట. వేం-కట అంటే సర్వ పాపములను దహించివేసే అచలమే (పర్వతం/కొండ) వేంకటాచలము. దానికి ఈశుడు కనుక ఆ శ్రీనివాసుడే శ్రీవేంకటేశుడు. వెంకటేశుడు కాదు. వేంకటేశుడు. లేదా వేఙ్కటేశుడు. వేంకట ఈశ్వరుడు కనుక వేంకటేశ్వరుడు. మన కోసమే వచ్చి మనలను కాచుటకు మనకందుబాటులో నిలచిన వాడు వేంకటేశుడు. అందుకే ఆయనకు అంత ప్రాధాన్యం.

వేంకటేశ్వరునికి లేదా ఆ శ్రీనివాసునకు హృదయమందు లక్ష్మీదేవి నివాసము ఉంటుంది. అది మనందరికీ సుదర్శనమే. తెలిసిందే.

లక్ష్మీ సవిభ్రమాలోక సభ్రూ విభ్రమ చక్షుషే
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్. ॥ 2 ॥

లక్ష్మీదేవిని విలాసముగా చూచునట్టియు, చక్కని కనుబొమలు కల్గినట్టి నేత్రములు కలవాడును, సమస్త లోకములకును కన్నువంటివాడును అగు వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

శ్రీ వేంకటాద్రి శృంగాగ్ర మంగళాభర ణాంఘ్రయే
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్. ॥ 3 ॥

శ్రీ వేంకటాచల శిఖరాగ్రమునకు చక్కని యాభరణమైన పాదములు కలవాడును, సమస్త మంగళములకు నిలయమైనవాడును అగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

సర్వావయవ సౌందర్య సంపదే సర్వచేతసాం
సదా సమ్మోహనా యాస్తు వేంకటేశాయ మంగళమ్. ॥ 4 ॥

సర్వావయవముల యొక్క సౌందర్య సంపదచే సమస్త ప్రాణులకును సమ్మోహమును కల్గించునట్టి శ్రీ వేంకటేశ్వరునికి మంగళమగు గాక.

సర్వులకూ సర్వదా సమ్మోహనమును చేకూర్చువాడు ఆయన. ఒక్కసారి చూస్తే తనివితీరదు. అలాంటి ఆకర్షణ కలిగిన స్వామిని ఆశ్రయిస్తేనే కదా మన పాపములు దహింపబడేంత వరకూ అయినా మనకు శ్రద్ధ కలుగునది?

నిత్యాయ నిరవద్యాయ సత్యానంద చిదాత్మనే
సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్. ॥ 5 ॥

నిత్యుడు, దోషములు లేనివాడు, సత్య స్వరూపుడు, చిదానందరూపుడు, సర్వాంతర్యామియు అగు శ్రీవేంకటేశ్వరునికి మంగళమగు గాక. ఈ లక్షణములున్నవాడు ఈశ్వరుడు. ఈయన ఈ లక్షణములన్నియూ కలిగి ఉన్నవాడు కనుక ఆయన వేంకటేశ్వరుడు లేదా వేంకటేశుడు అయ్యాడు.

స్వత స్సర్వ విదే సర్వశక్తయే సర్వ శేషిణే
సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్. ॥ 6 ॥

స్వభావము చేతనే సమస్తము ఎరిగినవాడు, సర్వసమర్థుడు, సర్వమునకు నియంతయైనవాడు, సులభుడు, సుస్వభావము కలవాడు నగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే
ప్రయుంజే పరతత్త్వాయ వేంకటేశాయ మంగళమ్. ॥ 7 ॥

పరబ్రహ్మస్వరూపుడు, నిండిన కోరికలు కలవాడు, పరమాత్మయు అగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

కాల తత్త్వ విశ్రాంత మాత్మనా మనుపశ్యతామ్
అతృప్త్యమృత రూపాయ వేంకటేశాయ మంగళమ్. ॥ 8 ॥

కాలతత్త్వమును గమనింపక, ఎల్లపుడును తన్ను చూచుచున్న జీవాత్మలకు తనివితీరని అమృతస్వరూపుడగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

ప్రాయః స్వ చరణౌ పుంసాం శరణ్య త్వేన పాణినా
కృపయా దృశ్యతే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్. ॥ 9 ॥

పురుషులందరికిని (అంటే జీవరాశులన్నీ) తన పాదములే శరణమని వారియెడల గల దయచే తఱచుగా తన హస్తముతో చూపుచున్న శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక. ఇంతకన్నా సౌలభ్యబ్రహ్మ ఇంకెక్కడ ఉంటాడు?

దయామృత తరంగిణ్యా స్తరంగై రివ శీతలైః
ఆపాంగై స్సించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్. ॥ 10 ॥

దయ యనెడి అమృత ప్రవాహము నందలి అలల వలె చల్లనైన తన కటాక్షములను వ్యాపింపజేసి జీవలోకమును చల్లపరచుచున్న శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

స్ర గ్భూషాంబర హేతీనాం సుష మావహ మూర్తయే
సర్వార్తి శమనాయాస్తు వేంకటేశాయ మంగళమ్. ॥ 11 ॥

తాను ధరించిన పూలమాలలవలనను, నగల వలనను, వస్త్రముల వలనను, ఆయుధముల వలనను, ప్రకాశించు సుందర విగ్రహము కలవాడును, సమస్త బాధలను పోగొట్టువాడును అగు శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామిపుష్కరిణీ తటే
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్. ॥ 12 ॥

శ్రీ వైకుంఠ నివాసమున విరక్తిని పొంది, స్వామి పుష్కరిణీ తీరమునకు వచ్చి, అచట లక్ష్మీదేవితో కూడ వినోదించుచున్న శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక.

ఎందుకు ఆయన వైకుణ్ఠ విరక్తుడైనాడు? ఆయనకు తన భక్తుల హృదయాలలో ఉండటమే ఇష్టం. వైకుణ్ఠములో ఆ భక్తులు తనలో లీనమై ఉంటారు. లేదా ఆయన స్వరూపములోనే ఆయనలో ఐక్యమై ఉంటారు. కానీ, ఈ లోకములలో వివిధరూపములలో ఉండు భక్తులు తమ తమ హృదయాలలో ఆయనను ప్రతిష్ఠంచుకుని ఉంటారు. అలాంటివారు అంటే శ్రీనివాసుడినకి ఇష్టము.

ఆ వేంకటనాథుడు మన కోసమే వైకుణ్ఠ విరక్తుడై ఈ లోకమున ఆ వేంకటాద్రి యందు స్వామి పుయ్కరిణి తీరమున (తటమున) వక్షస్స్థల లక్ష్మీదేవితో కూడి భక్తులతో వినోదిస్తూ ఉంటాడట. ఉన్నాడు కూడా.

అలాంటి వాడు కనుకనే ఒక్కసారి ధ్యానం చేసి, శ్రీవిష్ణు సహస్రనామములను ఉచ్చరిస్తూ తెలుసుకునే ముందర ఒక్కసారి చివరగా గట్టిగా పలుకుదాం.

శ్రీమత్సుదరజామాతృ మునిమానస వాసినే
సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్. ॥ 13 ॥

శ్రీమణవాళ మహర్షి యొక్క మనసునందును, సమస్త జీవరాసులయందును నివసించునట్టి శ్రీ వేంకటేశ్వరునకు మంగళమగు గాక! ఈయన సర్వవ్యాపకత్వాన్ని ఇక్కడ గట్టిగా చెప్పారు.

ఇంతటితో మనవాళ మహాముని ఆలోచనతో మొదలై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చి, విశిష్టాద్వైతంలో ప్రధాన పాత్ర వహించిన సౌలభ్య భావనను మరింత విశదీకరించిన శ్రీవేంకటేశుని మఙ్గళాశాసనమ్ లో అదే మణవాళ మహాముని తలంపుతో

మన ఈ తల్లివి నీవే తండ్రివి నీవే! పీఠిక సమాప్తం.

End of the Prologue.

The magic begins.

ప్రారంభం ఈ క్షణానే!

(సశేషం)

Exit mobile version