[శ్రీ వేదాల గీతాచార్య సృజించిన ‘తల్లివి నీవే తండ్రివి నీవే!’ ఆధ్యాత్మిక రచనని సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
స్మరామి స్మరామి
మ.
కరినేలింది హుళక్కి, ద్రౌపదకి కోకల్ మెచ్చి ఇచ్చింది ద
బ్బర, కాకాసురునిన్ కటాక్షమున చేపట్టిందబద్ధంబహో।
శరణన్నన్ పగవాని తమ్మునికి రాజ్యంబిచ్చుటల్ కల్ల, ఈ
సరి, నన్నేలిన నిక్కమీ కథలు, కృష్ణా! దేవకీనందనా॥
వెన్నెలకంటి జన్నమంత్రి(1360-1420) రచించిన “దేవకీనందన శతకం” లో పద్యం.
అట్లుంటది మనతోని!
నిజమే కదా! ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా, మన అనుమానాలు తీరవు. మన ఆలోచనలు అంత త్వరగా మారవు. ప్రతిదీ మనకు జరిగితేనే నమ్ముతామని అంటాము. పౌరాణికాధారాలు సరే! చారిత్రకాధారాలు కూడా విస్మరిస్తాము. తిరస్కరిస్తాము. కంటికి కనిపించేదే సత్యమని, చెవులతో విన్నదే నిజమని భ్రమసుతాము. సైన్సును నమ్ముతాము. ఎందుకంటే అది సైన్సు కనుక. శాస్త్రాన్ని నమ్మము. ఎందుకంటే అది సైన్సు కాదని మనమనుకుంటాము కనుక.
ఎటొచ్చీ, మనం మనం మనం. చూడాలి. వినాలి. ప్రత్యక్షోదాహరణలు కావాలి. సమాజం కూడా అలాగే తయారైంది. నమ్మకం. విశ్వాసం. వీటి ఊసు మూఢత్వం కింద మారిపోయింది. అయినా, వీరు చెప్పేది కూడా ఎక్కడెక్కడ నమ్మకం గురించే. ఆ విశ్వాసం గురించే. We have to trust someone or something. ఒక వైద్యుడు, ఒక పరిశోధకుడు, ఒక ఆధునిక తత్వవేత్త. లేదా ఆఖరకు మనల్ని మనమో నమ్మాల్సిందే. నమ్ముకోవాల్సిందే. ఈ పునాది అన్నది లేకపోతే మనుగడ కష్టం.
కానీ, ఈ విశ్వాన్ని పాలించే శక్తిని నమ్మం. అలాంటి శక్తి ద్వారా మనం ప్రయోజనాలను పొందుతామంటే నమ్మము. కానీ, నమ్మకముంటే ఏదైనా సాధిస్తామంటాం. వైరుధ్యాల పుట్టలు మనుషులు. Their minds play tricks on their psyche.
ఎప్పుడో ఏనుగుని రక్షించేవంటారు! అది అబద్ధం! (పురాణాలలో గజేంద్ర మోక్షం – తామస అనే నాల్గవ మన్వన్తరం లో) ద్రౌపదీదేవి ఆర్తభక్తికి కరిగిపోయి ఆమెకి వలువలిచ్చి మాన సంరక్షణం చేశావని చెపుతూవుంటారు! అదీ నిజం కాదు! (చరిత్రలో – 5200 సంవత్సరాల క్రితం).
సీతామాతకి చేటు చేయపూనిన కాకాసురుణ్ణి కూడా కరుణించి కాపాడానని విన్నాను! అది నమ్మశక్యంగా లేదు. (Not more than 17,00,000 years ago) నీ శరణాగతిని పొందిన విభీషణుడికి, రావణ వధానంతరం, లంకారాజ్యాభిషేకం చేశావని లోకప్రసిద్ధంగా అనుకుంటారు. ఆ మాట నీటిమూటగానే అనిపిస్తోంది. (Not more than 17,00,000 years ago. ఆధారాలున్నాయి).
దేవకీతనయుడవైన ఓ కృష్ణా! ఈ కథలన్నీ నిజమేనని నేను నమ్మాలంటే, నీవు తప్పక నన్ను ఈ సారి కాపాడి తీరాలి. అప్పుడే, ఇంతకు ముందు జరిగిన గాథలన్నీ అందరమూ నమ్ముతాం.
అదీ సంగతి.
అన్నీ వేదాలలో ఉన్నాయిష! అన్నది ఎంత నిజమో, అంతా సైన్సులోనే ఉన్నాయి ష! అన్న మాట కూడా అంతే అబద్ధం. అది అబద్ధమైతే, ఇదీ అబద్ధమే. ఒకటి అబద్ధం, మరొకటి నిజం అయ్యేందుకు అవకాశం లేదు.
Contradictions never exist. If you face contradictions, check your premises. Down the line you’ll find the right answers – Ayn Rand in Atlas Shrugged.
అజ్ఞానాదథవా జ్ఞానాదుత్తమ శ్లోకనామయత్
సంకీర్తితమఘం పుంసో దహేదేధో యథానలః॥ (భాగవతం)
అజ్ఞానంతో గాని, జ్ఞానంతో గాని పవిత్రకీర్తి గల భగవానుని నామ సంకీర్తనం చేయడం వల్ల అతని పాపాలన్నీ ‘నిప్పు’ కట్టెలను కాల్చి బూడిద చేసినట్లుగా భస్మీపటలం అవుతుందని భాగవతం తెలియజేస్తున్నది. నమ్ముతామా, నమ్మమా అన్నది కూడా మనదే నిర్ణయం. కానీ, అది సాధించాలంటే దృఢచిత్తం కావాలి.
మానవుడు తన మనో వాక్కాయాలతో చేసే పాపపు కర్మలకు తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవడం అత్యంత అవసరం. లేకపోతే, నరకంలో అనేక బాధలు అనుభవించాల్సి వస్తుంది. ఒకసారి ప్రాయశ్చిత్తం చేసుకొని మళ్లీ పాపాలకు ఒడిగడితే ‘గజస్నానం’లా ప్రాయశ్చిత్తాలు వ్యర్థమవుతాయి. చేసిన పాపాలు తొలగించుకోవడానికి తపస్సు, బ్రహ్మచర్యం, ఇంద్రియ నిగ్రహం, మానసిక స్థిరత్వం, త్యాగం (దానం), సత్యం, శౌచం (బాహ్యాంతర శుచిత్వం), యమం, నియమం అనే తొమ్మిది సాధనలున్నాయి. ఈ సాధనలతో పాపాలు తొలగిపోతాయి కానీ, అంతఃకరణశుద్ధి ఏర్పడదు.
ఆ అంతఃకరణశుద్ధి ఏర్పడాలంటే ఆ పరమాత్మను మనం ఆవాహన చేసుకోవాలి. అప్పుడే విశ్వశక్తి అసలు స్వరూప స్వభావాలు మనకు తెలుస్తాయి. అందుకు మనకు సహకరించేదే అఙ్గన్యాస కరన్యాసములు. అలా ఆ శ్రీమన్నారాయణ మూర్తిని మన మనోఫలకంపై మీద ఉంచుకోవటం మన అంతః చేతనంలో ప్రతిష్ఠించుకోవటం గురించి ఇంతకు మునుపు మనం తెలుసుకునే ఉన్నాము. ఇదంతా స్వీయానుభూతి. నమ్మితే మనకే. నమ్మకపోయినా మనకే.
నమక్కే! మనకే!
ఆపైన ఆ పరమాత్మ రూపాన్ని కళ్ళింతలు చేసి చూస్తూ, మన మనోఫలకంపై మీద, నిలిపి ఆ రూపాన్ని ధ్యానం చేయాలి.
॥ధ్యానం॥
క్షీరోదన్వత్ప్రదేశే శుచిమణివిలసత్సైకతేర్మౌక్తికానాం
మాలాకౢప్తాసనస్థః స్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగః।
శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిరచితైర్ముక్తపీయూష వర్షైః
ఆనందీ నః పునీయాదరినలినగదా శఙ్ఖపాణిర్ముకుందః॥1॥
భూః పాదౌ యస్య నాభిర్వియదసురనిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే
కర్ణావాశాః శిరో ద్యౌర్ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః।
అంతఃస్థం యస్య విశ్వం సురనరఖగగోభోగిగంధర్వదైత్యైః
చిత్రం రంరమ్యతే తం త్రిభువన వపుషం విష్ణుమీశం నమామి॥2॥
ఓం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం।
లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం (పాఠాన్తరం: యోగిహృద్ధ్యానగమ్యం)
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం॥3॥
మేఘశ్యామం పీతకౌశేయవాసం
శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం।
పుణ్యోపేతం పుండరీకాయతాక్షం
విష్ణుం వందే సర్వలోకైకనాథం॥4॥
నమః సమస్తభూతానామాదిభూతాయ భూభృతే ।
అనేకరూపరూపాయ
॥విష్ణవే ప్రభవిష్ణవే॥
సశంఖచక్రం సకిరీటకుండలం
సపీతవస్త్రం సరసీరుహేక్షణం।
సహారవక్షఃస్థలకౌస్తుభశ్రియం (పాఠాన్తరం: స్థలశోభికౌస్తుభం)
నమామి విష్ణుం శిరసా చతుర్భుజం॥5॥
ఛాయాయాం పారిజాతస్య హేమసింహాసనోపరి।
ఆసీనమంబుదశ్యామమాయతాక్షమలంకృతం॥6॥
చంద్రాననం చతుర్బాహుం శ్రీవత్సాంకిత వక్షసం।
రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే॥7॥
ఏడు శ్లోకాలు. తొందరకు చివరి రెండూ అవసరం లేదంటారు. పారాయణం వేగవంతం అవుతుందని. కానీ, చివరి రెండు శ్లోకాలు కలిపితేనే ఏడు ధ్యానశ్లోకాలు అవుతాయి. ఏడు వైకుణ్ఠ ద్వారాలు. ఇక్కడింకో కీలకమైన విషయం కూడా ఉంది. దాన్నీ గ్రహించాలి.
నామ స్మరణ మహిమను, దానివల్ల కలిగే శుభ ఫలితాలను గురించి ఒక ఉదంతం భాగవత పురాణం నుంచీ, మరొకటి ఇతిహాసం నుంచీ తెలుసుకుని, పరమాత్మను ధ్యానించి, వెంటనే శ్రీవిష్ణు సహస్రనామాల వ్యాఖ్యానాలను తెలుసుకుందాం.
(సశేషం)